కవితాకన్యక మానసంరక్షణము

కవితాకన్యక మానసంరక్షణము – ఏకపాత్రాభినయం

స్థలము: వచనకవితా సభ
వాచకుడు: కవి సార్వభౌముడు


(కవి సార్వభౌముడు సభలోని వేదిక వద్దకు యొచ్చి, కలయగ జూచి – ఆశ్చర్యానందముతో)

ఔరా! ఈ కవితా చమత్కృతి ఏమియో గాని వ్యాకరణము నెల్ల యౌపోసన వట్టి కవి సార్వభౌముడనైన నా మానసమును సైత మాకర్షించుచున్నదే!

(దస్త్రము పక్కకు జూచి)

వీరు నా భావమును, భాషను తస్కరించి యుండరు గదా!

(ఆశ్చర్యముతో)

ఏమి, ఈ కురూప వచనాతిశయములు? ఈ మతిభ్రమణకృత కవిత లెవ్వరివై యుండును?

(దస్త్రమును సమిపించి మెల్లగా)

ఏమీ ఈ ప్రల్లదములు? ఏమి ఈ భాష? ఏమి ఈ వచనము?

(నిదానించి)

ఇది యేమి? వీనిని వ్రాతలందురా?

(మరల కొంచెము బిగ్గరగా)

ఎవరక్కడ? ఎవరు వారు ఈ వ్రాతలు వ్రాసినది?

(ఊరకుండి)

ఏమిది?

(దస్త్రము బాగుగ పరీక్షించి)

నేనెంత భ్రమపడితిని? నిమేషత్వమే లేదు. ఈ కవితలు చిత్తడి నేలలు. అడుగు పెట్టిన చాలు, జలకల్కము మనసునంత తడిపివేయును.

(ఆశ్చర్యముతో)

ఏమి యీ విచిత్ర కల్పన!

(తలయూచి)

ఈ వచన కవుల అధమోత్తర కళాకౌశలము!

(ఇంకొకవైపున జూచి)

భాష యన్న యింత చులకనయా? ఎంతటి దౌర్భాగ్యము దాపురించినది!

(చూచుచు)

వివిధ ఫలభరానత శాఖాశిఖా తరువర విరాజితంబులు, రాజిత తరుస్కంధ సమాశ్రిత దివ్యసురభిళ పుష్పవల్లీమతల్లికా సంభాసురంబులు, భాసుర పుష్పగుచ్చ స్రవన్మధుర మధురసాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల ఝంకారనినాద మేదురంబులు, మేదుర మధుకర ఘనఘనాఘన శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృతకలాప కలాప రమణీయంబులు, రమణీయ కోమల కలాపకలాపాలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబులు, సంకీర్ణ నికుంజపుంజ సుందరంబులు నగు వనంబులయందు వెలసిన కల్పతరువుల వంటి పద్యములతో, వ్రాతలతో విలసిల్లిన భాషామతల్లి యీరోజు వీరి జేతియందు విలవిలలాడుచున్నది.

(తల యూచి)

ఇందలి భావ కుసుమజాలములును రోదనానందము గల్గించుచున్నవి.

(నడువ నుంకించి, చూచి)

కుకవితాకాసారమే ఇది! హాలాహలమే ఇది. భావదౌర్భాగ్యమే ఇది. వైయాకరణ దౌర్భాగ్యమే ఇది. ఉండి లేనట్లును, లేక యుండినట్లును గనంబడుచున్నది.

(బాగుగ జూచి)

హాలాహలమే కాకున్ననీ వాక్యములు, నీ పైశాచికభాషయు నెట్లుండును?

(తల పంకించి)

సంస్పర్శమాత్ర నూత్న చైతన్య ప్రసాదిత శీతల విమల మధువారి పూర సంపూర్ణంబు, మందపవనచాలనోద్ధూత కల్లోల తరంగ మాలికా పరస్పర సంఘట్టన జాయమాన మృదుల ధ్వాన విస్తారాతి శ్రావ్యంబు, కమలకోకనదాది నానావిధ జలకుసుమ రాగారుణిత శోణితంబు, ఆలోలబాలశైవాలజాల లాలిత జంగమోద్యాన శంకావహంబు ననదగిన గ్రీవాలంకృత బిససూత్ర పాళికాసందీపిత హంస హంసీగణ విభూషితంబులతో, వర్ణనకందని యనుభూతులతో కాలము గడిపిన వాగ్దేవి నిండు మనస్సు నేడు యీ వచనపైశాచికుల కరములందున్న కలముల భూతప్రేతోజ్వలితమైన పోటుదెబ్బకు కొడిగట్టిన దీపము వలె రెపరెపలాడుచున్నది.

(తల యూచుచు)

కాల స్వభావము! నిన్న మొన్నటిదనుక నిలువనీడ లేకుండిన ఈ వచన కవులు, క్షురకుడు మార్జాలపు తల గొఱిగినటుల లపనముకొచ్చిన కూతలు గూయుచు, చేతికొచ్చిన వ్రాతలు వ్రాయుచు దుర్నిరీక్ష్యులై విజృంభించుటయా? ఇదియంతయు గనులారగాంచుచు సుకవితా వంశ సంజాతుడగు కవిసార్వభౌముడు సహించి యుండుటయా?

(యోజించి తల పంకించి)

యోచించినకొలది మనంబున బట్టరాని క్రోధము వెల్లివిరిసి దుర్భరంబగుచున్నది. ఇంక నిచ్చట నిలువజాల…

(పరిహాసధ్వని వినంబడుచున్నది)

(ధ్వని వచ్చువైపు జూచి తలయూచుచు)

వచన కవుల పరిహాసము

(సక్రోధముగ దలయూచి)

వచనకవితాభర్తృకలారా! కానిండు. ఇచ్చటికిది పరిహాసమాత్రమే. కాలాంతరమున ప్రళయ భైరవ విస్ఫారిత భ్రుకుటీ ప్రభూత తీవ్ర వైశ్వానరజ్వాల…

(తల పంకించుచు తీక్ష్ణదృష్టితో మరియొక వైపుగా నిష్క్రమించుచున్నాడు)


స్థలము: కవితాపురి, ఆంతరంగిక భవనము.

(అంతట క్రోధము గల దీర్ఘ నిశ్శ్వాసముతో కొంతసేపిటునటుం దిరిగి కూర్చుండి)

దురాత్ములు, యుక్తాయుక్తపరిజ్ఞాన విహీనులు, భాషానీతి బాహ్యులు, పరవంచనాసక్తులు నగు ఆ వచన కవితా హతకులు పిలవకుండినను నేనేల ఆ కవిసభాధ్వరంబున కరుగవలె? పోయితినిబో – నాకేల యా పాడు కవితా సభా సందర్శనేచ్ఛ యంకురించవలె? అంకురించెనుబో, నేనేల అందందు దిరుగాడి అవాచ్యములగు కవితాపఠనమునకు లోను గావలె? లోనైతిబో, పిశాచసదృశులగు ఆ వచనకవితా బంధకులు వాగ్దేవిని యేల పరిహసించవలె?

(తల యూచి)

కృతి పాడఁదగినది. కథ యూఁకొట్టఁదగినది. నాటక మాడఁదగినది. ఉపన్యాసము వినఁదగినది. కవిత ఉత్సాహోల్లాసములు గలిగించునది. మఱి వీడు వ్రాయు కవితల స్వరూపము? నోరార్చుకొనిపోయినప్పు డక్కలకఱ్ఱ, ముక్కులార్చుకొనిపోయినప్పుడు పొడుము వేసికొనినట్లు రూపము సంతరించికొని యున్నవి. ఈ దౌష్ట్యమునకు శిక్ష నతిత్వరితముగా నిర్ణయింపవలెనని మనసు ఉద్రేకపడుచున్నది.

(ఉత్కట క్రోధముతో)

కడవలంత బానలంత ద్రోణములంత చుట్టు గుడిసెలంత యెఱ్ఱగఁ గ్రాగిన ఱాలు, సలసల తెల్లగ మరిఁగిన గంధక ధారలతో ధారాపాతముగా శతకోటి శతకోటి అభిషేకములు గావింపవలెనన్న కోరిక తీవ్రమగుచున్నది. చెదలున్న పుట్టలోఁ దాటియాకు మంట పెట్టినయెడల నేమగునో యదియే యంతకంటె భయంకరముగ బీభత్సముగ మిమ్ములను దగులవెట్టవలెనని హృదయము గుతకుతలాడుచున్నది.

(తల పంకించి)

వాంతులతో భేదులతో మూత్రబంధములతో, నెక్కుపట్టిన నరములతోఁ గంటిగుంటలతో, నొడలి చలువతో, నాసన్నమరణలాంఛనమగు నాభీలశిరోవేదనతో, భరింపరాని బాధలు పెడుచున్న ఈ సుద్దముక్కల నూడ్చి పెట్టుటకుఁ దోఁకచుక్క యంత చీఁపురు చేతఁ బట్టుకొని, ముఱికి కాలువల ప్రక్కలను గోడిరెట్టగుట్టల నడుమను పారవేయవలెనన్న ఆశ నటరాజనర్తన వలెఁ దాండవించుచున్నది. బుద్ధికందని విషయములు, శక్తికి మించిన సన్నివేశములుఁ బట్టుకొని సుద్దముక్కలు పేర్చి అవియే అత్యద్భుతములని ఢక్క కొట్టుకొనుచు, ఓ చెలరేఁగి అఖిలైకకార్యమిదియే యని కవితావీథులవెంట నోండ్రపెట్టుచు పరగడలు ద్రొక్కుచున్న వీని నాలుకఁ గోయింపవలదా? వీని కలము విఱుగఁగొట్టవలదా?

(అటునిటు కలయజూచుచు)

దురాత్ములారా! భావ హతకులారా. దుర్మదాంధత్వము కలముల కెగదట్టెనా? అప్పుడే యుక్తాయుక్త వివేచనా జ్ఞానము నిశించెనా? అగును. అల్పపు భాష సిరి కన్నులు గాననిచ్చెనా? ఎట్టెటులో యొక కవితావాక్యము వ్రాసితినని కన్నును మిన్నును గానకున్నారే! ఇంతమాత్రమున నింత మిట్టిపాటా!

(తల యూచుచు)

భవద్ధృదయ సంవృత గర్వ పర్వతోన్మూలన చణ వజ్రాయుధ భవచ్చిత్తాటవీ సంచరద్దురూహ మత్తమాతంగ వక్షఃకవాటవిపాటనపాటనోదగ్ర సింహకిశోర కరాంచల నఖాంచలంబుల మారణహోమమున హృదయకుండమున క్రోధాగ్ని ప్రజ్వరిల్లి నలుదెసల నాక్రమించుచు మంత్రపాఠకుల దుర్వారదర్వీకర నిర్వాంత విషవహ్నికీలలకైన దాళియుండనగును గాని, ఈ కవితలకున్న యర్థము యథార్ధముగా పాఠకునకర్థమగుట దుర్ఘటము.

(అటునిటు కలయజూచుచు)

కాలకంఠ ఫాలనేత్రాభీల కీలికీలా కలాపంబునకైన నోర్చియుండనగును గాని, ఈ యవారణ దారుణ భాషాప్రయోగములు జూచి ప్రళయసమయ సముద్దండ దండధర చండాతి చండ దండ పాతంబునకైన సిద్ధమగుదును గాని, భీషణాతిభీషణం బగు ఈ వచనమును, దాని యర్థమును పాఠకు డర్థము చేసికొనుట యసంభవము.

(తల పంకించి)

ఆ శారదాదేవినిఁ బరికింపుఁడు. అనేక సహస్రచంద్రమండల సన్నిభమైన యాస్యమండలము వీణాదండము వంక రవంత యొఱిఁగి యున్నది. అందుచేఁ గిరీటమునుండి వ్రేలాడుచున్న ముత్తెముల గుత్తి మేరువునొద్దనున్న వీణబిరడపై వ్రేలాడుచున్నది. బాగుగాఁ బరిశీలింపుఁడు. ఎడమమోఁకాలిపై మడఁచిన కుడిమోఁకాలి వంపు ప్రక్కను రవంత వెనుకగ దేవతాచందననిర్మితమైన వీణకుండ ప్రకాశించుచున్నదే. దివ్యసర్వసుధాసేచనమున వీణాదండము తీఁగచెట్టు చిగిర్చిన ట్లామె యెడమ చేయి వ్రేళ్ళు తంత్రులపై నెట్లు కదలుచున్నవో! ఆహా! అదిగో కుడివైపున రాజరాజనరేంద్రుఁడు, నెడమవైపునఁ గృష్ణదేవరాయలు వింజామరములు చేతఁ బుచ్చుకొని యెట్లు వీచోపు లిడుచున్నారో! అదిగో! ఆ పీఠము మొదటఁ బీతాంబరపు నడకట్టుతో నిలువఁబడి దేవికి వీవనలు విసరుచున్న ఆనాటి మహాకవులుఁ గనపడుటలేదా! ఎంతటి సుందరమైన దృశ్యము. మీకును నా దేవికి వీవనలు విసరవలె ననిపించుటలేదా?

(తలయూచి యోచించి)

భాషయందు, భావముయందు గౌరవము లేక ఇంతటి దారుణమొనర్చుచున్న మిమ్ములను, భూతప్రేత పిశాచముల సాంగత్యంలో ఓలలాడవలసిన మిమ్ములను యింక యీ కవితాప్రస్థపురంబున నిలువనిచ్చిన నేను కవిసార్వభౌముండనేనా? కట్టుపుట్టముల సైత మూడలాగించి మిమ్ముల నట్టడవుల గుట్టలపాలు గావించి చెట్టులం బట్టింపకున్న నే కవిసార్వభౌముడనే కాను!

(తల యూచుచు క్రోధముతో)

మీ దుర్మదంబు నడంపకున్న నేనా వాగ్దేవి బిడ్దనేనా? నిండు సభామధ్యంబున సకలపాఠక సమక్షంబున మీ మాన మారడివో జేయకుండిన నింకను కవిరాజునని పిలిపించుకుందునే? ఇప్పుడేపోయి యా దురాత్ముల జించి చెండాడెద. ఆ పురంబు భస్మీపటలము గావించెద. ఆ పాపిష్టి వచనకవుల నెంచరాని మహాపదల ముంచెద. ఆ తల్లి వాగ్దేవి మనోవికల్పములకు గారణమైన ఈ వచనకవితా సభ విధ్వంసమొనర్చెద.

(ఉత్కట క్రోధముతో)

ఇదిగో, తల్లీ! నేనే కనుక నీ కొమరుడ నగుదునేని, నా యందు నీ దయాదాక్షిణ్యములు గలవేని ఈ దినము నేనొనర్చు ఈ సంగ్రామమున విజయమో వీరమరణమో ప్రసాదింపుము. ఇంతకాలము నీ పంచన నాకు చల్లని నీడను ప్రసాదించితివి. నీ ఋణము తీర్చుకొను సమయమాసన్నమయ్యెను. అవకాశము వచ్చినందులకు ధన్యోస్మి మాతా, ధన్యోస్మి.

(భాషాభావ కరవాలము చేతబట్టి కవిసార్వభౌముడు వీరతిలకము దిద్దుకొని నిష్క్రమించును)


[మక్కపాటి వేంకటరత్నం పంతులు గారి ద్రౌపదీమాన సంరక్షణము కావ్యభాగానికి అనుకరణ. – రచయిత.]