రాసింది ఎవరికి చూపించాలి? ఎవరి సలహా తీసుకోవాలి? అని ఇంకొన్ని ప్రశ్నలు కవికి. మనం సాధారణంగా విమర్శకులకు, నిర్వాహకులకు, మంచి రచయితలు, కవులని పేరున్న వాళ్ళకూ, తెలివితేటలున్న వాళ్ళకీ చూపిద్దామని అనుకుంటాము. ఆవిడ అలా ఎంతమాత్రం చెయ్యొద్దని చెప్తారు. ఈ తెలివైనవాళ్ళూ, శక్తిమంతులూ ‘ఇదింకా ఇలా మారిస్తే బావుంటుంది, అది అలా రాస్తే బావుంటుంది’ అని నొక్కే నొక్కులు, తమ దృష్టితో, నైపుణ్యంతో మార్పులూ చేర్పులూ చెయ్యబోయే ప్రయత్నాలూ అవి ఎంత వినయంగా, మర్యాదగా, అభిమానంగా, పెద్దరికంగా చెప్తున్నప్పటికీ అసలే సున్నితంగానూ, సంశయాత్మకంగానూ, వేదనాభరితంగానూ ఉన్న కవి పనినీ, కల్పననూ నిరుత్సాహ పరచే అవకాశమే ఎక్కువ అని. ఇది నేనూ ఒప్పుకుంటాను. మొదటి పాఠకుణ్ణి చాల జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని ఆవిడ చెప్పింది. ఊరికే వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ పొగిడేవాళ్ళ వలనా సహాయం లేదు; బూరెల్లో పురుగులెంచడమే ప్రవృత్తిగా ఉన్నవాళ్ళ వలనా సాయం లేదు. ఎప్పుడో చాన్నాళ్ళ కిందట నేను పాటలు రాసేవాణ్ణి. అలా రాసిందొకటి తీసుకెళ్ళి మా అన్నకి చూపించేను. వాడు అది వింటూ వింటూనే వాకిట్లో కళ్ళు తేలేసి పడిపోయినట్టు ఏక్షన్ చేసి ‘ఒరే! నేను లేను, నీ పాట ఉంది!!’ అన్నాడు, తిలక్ కవితని పేరడీ చేస్తూ. దాన్ని అక్కడితో ఆపీసేను. జోక్ మాత్రం ఇప్పటికీ నవ్వొస్తుంది. బ్రెండా యూలండ్ ఏమన్నారంటే కవి వేరే ఎవర్నీ సంప్రదించకుండా తనంటే, తన పని అంటే బేషరతుగా అభిమానం, ప్రేమ ఉండే మనుషులకు చూపించి ఊరుకోమని. అంటే భార్య, భర్త, పిల్లలు, సాహితీ స్నేహితులు కాకుండా మామూలుగా స్నేహితులు ఉంటే అలాంటివాళ్ళకూ మాత్రమే చూపించమని.
ఎవరినుండీ ఒప్పుకోలును, ప్రశంసను ఆశించకుండా ఊరుకోవడం సులభం కాదు కాని, అలవాటయితే అభ్యాసానికి ఎంతో స్వేఛ్ఛగానూ, చాల హాయిగానూ ఉంటుంది. నల్లమందు, సిగరెట్లు లాంటివి బాగా అలవాటయి పోయినవాళ్ళు అది రోజూ తగిన మోతాదులో పడితే గాని ఉండబట్టక విలవిల్లాడతారు. కాని అలాంటి అలవాట్లు కూడా ప్రయత్నం చేసి, సాధన చేసి మానుకున్న వాళ్ళనీ చూస్తాము. ప్రశంసను ఆశించటం సహజం కాదా! అది ఇబ్బందెలా అవుతుంది? అంటే అది సృజన Authenticityని వేరు పురుగులాగ ఎలా తొలుస్తుందో, ప్రదర్శన, ప్రశంస, మూల్యాంకనం, మర్యాద ప్రాతిపదికలుగా నెరపే సాహితీ నిర్వహణ సృజనకారులని, సృజన వ్యవస్థనూ, బయట మెరుగైన డొల్లను గొప్ప పూనికతో నిర్వహిస్తూనే లోపట్నుండి ఎలా పట్టి పల్లారుస్తుందో చాల వివరంగా, విడిగా, ఎందరో కళాకారుల చరిత్రలను పరామర్శిస్తూనే చెప్పాలి తప్ప ఇంకోలా వీలు లేదు. స్థూలంగా చెప్పుకోవాలంటే ప్రదర్శన మీద ధ్యాస అభ్యాసానికి, సృజన నిష్టకూ అడ్డొస్తుంది. ఒక రోజు వయొలిన్ మేష్టారు ఒకాయన ఇంట్లో కూర్చున్నాము. ఆయన ఒకబ్బాయికి పాఠం చెప్తున్నారు. ఆ అబ్బాయి చాల హృద్యంగా వాయిస్తుంటే కూర్చున్నవాళ్ళందరం ఇష్టంగా, మెచ్చికోలుగా వింటున్నాము. ఆ అబ్బాయి అది చూస్తూనే ముందుకి మరింత ఉత్సాహంతో ఇంకొక పాట వాయిస్తుంటే మేష్టారు హఠాత్తుగా కోపగించుకుని ఆ అబ్బాయి భుజమ్మీద చెయ్యి వేసి ఆపి, కమాను పట్టుకున్నారు. ఆ అబ్బాయితో సహా అందరం తెల్లబోయేము. అప్పుడూ మేష్టారు ‘నువ్వు అభ్యాసం కోసం వాయించినంత సేపూ హాయిగా ఉన్నాది. అలా కానివ్వకుండా నువ్వు ప్రదర్శన కోసం వాయించడం మొదలెట్టేవు. అది నీ అభ్యాసానికి అడ్డొస్తోంది ఇంక. You’re supposed to be practicing here. Do not perform!’ అని చీవాట్లు పెట్టేరు.
సృజనా స్రవంతి కాలం మీద క్రమంగా మూల్యాంకనం, మర్యాద పునాదులుగా పరస్పరం ప్రశంస, ప్రదర్శన, ప్రతిష్ట ప్రఛ్ఛన్నమైన లక్ష్యాలుగాను కట్టిన వ్యవస్థగా మళ్ళీ మళ్ళీ పతనమౌతుంటుంది. అది అందించ గలిగిన రచనలు చాల అభిలషణీయమైన ఆదర్శాలతో, అందమైన భాషతో, నవ్యము, గొప్ప పదునూ అయిన ఆలోచనల్తో రకరకాలుగా అలంకరింపబడి కూడా నిర్జీవంగా ఉండి నిరాశనే మిగులుస్తాయి. సారస్వతం ఒక్కటే కాదు, తెలుగులో అనే కాదు; అన్ని కళారూపాలకూ, ఇంగ్లిష్ వంటి భాషల సారస్వతంలోనూ ఈ అవస్థ ఉంది. నేను త్రిపురని అడిగడిగి కాల్చుకుతిన్న ప్రశ్నల్లోన మొదాటిదే ఏమిటంటే ‘త్రిపుర! అచ్చులో ఇన్నేసి వొస్తుంటాయి. సాహిత్యం!! సాహిత్యం!! అంటారు, నాకు అలాగ అనే అనిపించదు. ఎందుకు?’ అని. ఆయన అలాగ చూసి, చూసి “That is because it isn’t literature. It is something else.” అని నవ్వుతున్నారు. టెలిఫోన్ డైరెక్టరీ, రైల్వే టైంటేబిల్ వంటివి కూడా తెరిచి చూస్తే ఒకటి రెండు మాటలు చదివీ ఏదో ఒక కొత్త కాల్పనిక లోకంలోనికి పోవచ్చు కదా. అలాగని అచ్చులో వచ్చినదల్లా సాహిత్యం అని అనుక్కోలేమూ అన్నారు. ఎవరో కావాలని చేస్తున్నారని కాదు. సృజన నిర్వహణ చాల కష్టసాధ్యమైన పని. దీన్ని గురించి జిడ్డు క్రిష్ణమూర్తి గారు చెప్పిన కధ ఉంది. ఒకరోజు సైతాన్, అతని స్నేహితుడూ సరదాగా తోటలో షికారెళ్తున్నారు. వాళ్ళకి ఎదురుగా ఒకతను నడుస్తూ వచ్చి, హటాత్తుగా వంగి ఒక మెరుస్తున్న వస్తువును తీసి, గొప్ప సంతోషంతో జేబులో వేసుకున్నాడు. పొంగిపోయి పరిగెడుతూ వెళ్ళిపోయేడు. సైతాన్ స్నేహితుడు సైతాన్ని ‘వాడు ఎందుకలా పొంగిపోతున్నాడు?’ అనడిగేడు. సైతాన్ తాపీగా “ఆఁ, ఏంలేదు! వాడు ఎన్నాళ్ళుగానో సత్యం కోసం వెతుక్కుంటున్నాడు. అది దొరికింది, అందుకే ఆ సంబరం!” అన్నాడు. అప్పుడు స్నేహితుడు కంగారుగా “అయ్యో! మనిషికి సత్యం దొరికేస్తే నీకు చాలా ప్రమాదం కాదా?” అన్నాడు. సైతాన్ ఏమీ తొణక్కుండా “ఏం కంగారు పడకు. ఇప్పుడు వాడు వెళ్ళి ఆ సత్యం చుట్టూ ఒక వ్యవస్థని నిర్మిస్తాడు. దాని రంధిలో పడి సత్యాన్ని వాడంతట వాడే పోగొట్టుకుంటాడు. వాడి కధ మళ్ళీ మామూలే!” అన్నాడట. సృజనకూ ఇది వర్తిస్తుంది.
కొత్తగా ఎవరైనా ప్రతిభావంతులు కనిపిస్తే వాళ్ళ సృజనను సాహిత్యం అనే వ్యవస్థ ఇలాగే నెమ్మది నెమ్మదిగా దువ్వి, సన్మానం చేసి, మచ్చిక చేసుకొని, రాజీ చేయించి, సృజనాంతరంగాన్ని కబళించి చివరికి నిర్జీవంగా ‘మహాకవి’ వంటి డొల్ల పేరును, ప్రతిష్టనూ మోసుకు తిరిగే zombie ప్రేతాల్లా మరుస్తుంది. మర్యాదపూర్వకమైన ప్రదర్శన బారినుండి తోటకూర నాడే ఎలా తప్పించుకోవచ్చునో యూలండ్ వివరిస్తున్నారు. ఆసక్తి ఉన్నవాళ్ళకు ఉపకరిస్తుంది. బలమైన కళాకారుడు ఈ రంధి నుండి ఎలా తప్పించుకుంటాడో అందుకు సమున్నతమైన నిదర్శనం త్రిపుర. జిడ్డు క్రిష్ణమూర్తి గారి మాటలే జ్ఞప్తికి వస్తాయి:
“Why is there this everlasting craving to be loved? Listen carefully. You want to be loved because you do not love; but the moment you love, it is finished, you are no longer inquiring whether or not somebody loves you. As long as you demand to be loved, there is no love in you; and if you feel no love, you are ugly, brutish, so why should you be loved? Without love you are a dead thing; and when the dead thing asks for love, it is still dead. Whereas, if your heart is full of love, then you never ask to be loved, you never put out your begging bowl for someone to fill it. It is only the empty who ask to be filled, and an empty heart can never be filled by running after gurus or seeking love in a hundred other ways.”
ఆయన మాటల్లోన loveకి బదులు praise అని రాస్తే అది సృజన అభ్యాసం విషయంలో సహాయంగా ఉంటుంది. ఎవరిమీద వాళ్ళకు ఉండే అభిమానం, అంటే స్వాభిమానమే స్థైర్యానికి పునాది. అది గీర, ధిషణ ఇలాంటివాటికి భిన్నమైనది. అది సాధించుకున్న సృజనశీలి తనలో తాను ‘నెంబర్ వన్ పుడింగి’. అప్పుడు ఇంక ‘నేను రాసింది చదవవా, అభిప్రాయం చెప్పవా, మెచ్చుకోవా, అచ్చు వెయ్యవా?’ అని కులం, లింగం, మతం, ప్రాంతాల వారీగా వరుస బిచ్చానికి ఏ సాహిత్య గురోజీ యెదుటా దేబిరించనక్కర్లేదు. దీన్ని గురించి యూలండ్ వివరించి చెప్తారు.
ఆవిడ ఇంకొకటి చాల పరిచితమైన సంశయాన్ని చర్చిస్తారు. అదేమంటే, ‘ఎందుకు రాస్తున్నాను, నలుగురికీ చూపించుకుని, ప్రచురించుకుని బడాయి పోదామనా?’ అనేది. ఈ ప్రశ్నకు చిక్కుకున్నవాళ్ళు రాయడమే మానుకుని, బిగదీసుకుని కూర్చునే అవస్థ ఉంది. ఇది సృజనకు ప్రాణప్రదమైన అభ్యాసానికి అడ్డం వస్తుంది. ఈ ప్రశ్నతో ఆవిడ ఎలా కొట్టుమిట్టాడిందో, చివరికి ఎలా బయటపడిందో వివరించి చెప్తుంది. ఇంకొకటి, ఈ వ్యాసంలోనే చర్చిస్తూ వచ్చిన ప్రశ్న. సృజనల్లో జూటా అంటే ఏమిటని. Authenticity గురించిన ఈ విషయాన్ని ఆవిడ విస్తారంగా చర్చిస్తారు. సృజన ఔద్వేగిక వ్యవస్థలోన స్వఛ్ఛత అని, కపటం లేని కాల్పనిక ధార అనీ అంటూ వస్తున్నదాన్ని సాధించుకోడాన్ని గురించి ఆవిడ Microscopic Truthfulness అనే పేరిట కొంతవరకు వివరిస్తారు: “But we must try to find our True Conscience, our True Self, the very Center, for this is the only first-rate choice-making center. Here lies all originality, talent, honor, truthfulness, courage and cheerfulness. Here lies the ability to choose the good and the grand, the true and the beautiful.” అని. అంటే సృజనశీలి సారస్వత మూర్తిమత్వానికీ, నిర్ణాయక వ్యవస్థకూ అవినాభావమైన సంబంధం ఉంది. బాల్యంలో స్పష్టాస్పష్టంగా ‘రాయాలి’ అని మాత్రం స్పృహ ఉన్నవాళ్ళు పెరిగి పెద్దయ్యి కవిత్వం, కధ, డిటెక్టివ్ నవలలు, చారిత్రక నవల ఇలా వందలాది సృజన రూపాల్లో ఏ ఒకటి రెండింటికో ఎలా బద్ధులౌతున్నారు? ఎలాగంటే వాళ్ళు తమ నిజ తత్వాన్ని ప్రయత్నించి, కనుగొంటున్నారు. ఏ తరహా Mind ఆ తరహా సారస్వతాన్ని మాత్రం సృజించగలుగుతుంది. అలాగే కావాలని త్రిపుర సూచన. ఉదాహరణకు రమణజీవిగారిది అతివేలము, అధివాస్తవికమైన కల్పనా వైచిత్రి – అంటే phantasmagoria. ఎమ్మెస్‌నాయుడుగారి కవిత్వానికి ప్రధానమైనవి వాక్య నిర్మాణాన్ని, దృశ్య నిర్మాణాన్నీ కావాలని, పనిగట్టుకొని అపరిచితమైన తోవల్లో నడిపించే ఉక్తి వైచిత్రి, నిర్మాణ వైచిత్రి: కమింగ్స్ (e. e. Cummings) కవిత్వంలో వంటి idiosyncrasy of syntax, డిలన్ థామస్ (Dylan Thomas) కవితలలో వంటి idiosyncrasy of image pattern. అవి వాళ్ళ సృజనాంతరంగాలకు, నైసర్గికమైన దృష్టికీ ఒప్పినవి.
మర్యాద కోసం, సంఘం మెప్పు కోసం తన నైజానికి, స్వాభావికమైన చేతనకూ భిన్నంగా పోతే సృజన భంగపడుతుంది. బలమైన కళాకారుడు అనివార్యంగా ఇందుకు భిన్నంగా ఉంటాడు. ఇదివరకు చెప్పిన గార్డ్‌నర్ (John Gardner) మాటల్లోన “Creative individual has the capacity to free himself from the web of social pressures in which the rest of us are caught. He is capable of questioning the assumptions that the rest of us accept.” సమాజం సకృత్తుగా అంగీకరించి, గౌరవించేదాన్ని తనకు తప్పనిసరి అయితే ఆయన “థూ! నాశినం …” అని ప్రశ్నించగలుగుతున్నాడు. కాని ఈ True Self అనేది ఎవరికీ ఒకటే స్థిరం అయిపోయి ఉండదు. మనుషులందరిలాగే సృజనకారుని వ్యక్తిత్వానికీ, అనుభవానికీ అనేక పార్శ్వాలుంటాయి. ఈ అన్ని selfలలోనా ఏది తన True Self? అనే ప్రశ్ననూ యూలండ్ చాల సహాయకరంగా చర్చిస్తారు. Pep talkలాంటి ఉషారు మాటల శైలిని సహించి చదువుకోగలిగితే ఆవిడ చెప్పిన విషయాలు సహాయంగా ఉంటాయి. కాని ఆవిడ చర్చించని విషయం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. సృజన మౌలికంగా ‘సత్యం’ (Truth) కాదు. అది ముమ్మాటికీ కల్పన, కాబట్టి సృజన యావత్తూ అంతిమంగా ‘జూటా.’ ఈ ప్రశ్నను ఆవిడ చర్చించరు. ఈ ఒక్క ప్రశ్నను తలకెత్తుకుంటేనే తవ్వడానికి జీవితాలే సరిపోనంతా పని ఉంది.
సృజన ప్రబలమైన స్వభావంగా ఉన్నవాళ్ళకు వాళ్ళ స్వభావమే ఒక సమస్య; జబ్బు లాంటిది. శ్రీపాద, నామిని, సాలింజర్, బ్యుకోస్కీ – ఇలాంటివాళ్ళు ఆత్మచరిత్రాత్మకంగా రాసినవి చదివితే అవగతమౌతుంది. తప్పనిసరిగా రాయాలన్న కాంక్షను మనస్తత్వంలో హైపర్‌గ్రాఫియా (Hypergraphia) అని ఒక రుగ్మతగా నిర్ధారించేరు. మా అమ్మది ఇలాంటి స్వభావం. తను మాకు ఊహ తెలిసినప్పటినుండీ ఎంత పనిలో ఉన్నా, రాయాల్సి వచ్చినప్పుడు తొందరగా ముగించుకొని తడి చేతులు తుడుచుకొని వచ్చి, ఎక్కడ తెల్ల కాయితం దొరికితే దాని మీద రాసీసి, మళ్ళీ పన్లోకి పోయేది. పద్యాలూ, పాటలూ, కధలు, వ్యాసాలూ ఇలా ఆపకుండా ఏదో ఒకటీ రాస్తూనే ఉంటుంది. రాసినవన్నీ, వేలకొద్దీ పేజీలు ఒక పెట్టెలో పడేస్తుంది. ఇప్పటికీ అంతే. ‘ఎందుకమ్మా ఇంతలాగ రాస్తావు?’ అంటే వాటివలన ఏ ప్రయోజనం లేదనీ, కాని తను ఆపుదామనుకున్నా ఆపలేని పని కాబట్టి అలా తప్పనిసరిగా రాసుకుంటాననీ చెప్తుంది. స్వాంతఃస్సుఖాయ తులసీ రఘునాధ గాధా… అని పాడుతుంది. ఆలిస్ ఫ్లాహర్టీ (Alice Flaherty) అని హార్వర్డ్ మెడికల్ సెంటర్ నుండి ఒక న్యూరాలజీ ప్రొఫెసర్ ఉన్నారు. ఆవిడకి కవల పిల్లలు పుట్టి, పోయిన దుఃఖంలో ఉండుండి ఈ హైపర్‌గ్రాఫియా అనే రుగ్మత పట్టుకుంది, ఆపాలనుకున్నా ఆపలేకుండా రాసే ప్రవృత్తి. ఆవిడ రాసిన పుస్తకం The Midnight Disease: The Drive to Write, Writer’s Block, and the Creative Brain లోన సృజనకారులకు రాయాలని ఉండే ఆకాంక్షనూ, Writers Block వంటి ఇబ్బందులనూ చర్చిస్తారు. ఈ పుస్తకాన్ని కూడా సృజనాత్మక రచయితలు చాలామంది సహాయంగా ఉందని చెప్పుకున్నారు. శ్రీపాద, నామిని వంటివాళ్ళు – తప్పనిసరిగా రాసుకొనే తీరాలి, అది తప్ప ఇంకే పనీ చెయ్యలేము అని చెప్పుకున్న వాళ్ళ మనస్తత్వాన్ని ఆవిడ మనో విజ్ఞానశాస్త్ర పరంగానూ, కాఫ్కా, డొస్టొయెవ్‌స్కి, నబకోవ్ వంటి రచయితల స్వభావాలను విశ్లేషిస్తూ ఉదాహరణలతోనూ వివరిస్తారు. రాయటం అనేది వేరే ఎవరికోసమో, సమాజం కోసమో కాదు, సాహిత్యం భవిష్యత్తు కోసం కాదు, అది ఒక నొప్పికి ఊరటలాగ అని Dostoyevsky (Notes from Underground):
“There are perhaps thousands of reasons. Again, what is my object precisely in writing? If it is not for the benefit of the public why should I not simply recall these incidents in my own mind without putting them on paper?
Quite so; but yet it is more imposing on paper. There is something more impressive in it; I shall be better able to criticise myself and improve my style. Besides, I shall perhaps obtain actual relief from writing. Today, for instance, I am particularly oppressed by one memory of a distant past. It came back vividly to my mind a few days ago, and has remained haunting me like an annoying tune that one cannot get rid of. And yet I must get rid of it somehow. I have hundreds of such reminiscences; but at times some one stands out from the hundred and oppresses me. For some reason I believe that if I write it down I should get rid of it. Why not try?”
అలాగే యోగి మనస్తత్వానికీ, కవి మనస్తత్వానికీ సామాన్యంగా ఉన్న సృజన ప్రాతిపదికలను ఆవిడ మనో విజ్ఞానశాస్త్ర పరంగా వివరించే ప్రయత్నం చేస్తారు.
యోగిది ఆత్మనిష్ట, సృజనశీలిది రసనిష్ట, శాస్త్రజ్ఞునిది సత్యనిష్ట, నాయకునిది కార్యనిష్ట, లౌక్యుని ధ్యాస ఏక కాలంలోనే లౌకిక విజయం మీద, అది తీరీ తీరకుండా ఉండే లోక వ్యవహారపు బోర్‌డమ్ నుండీ, నొప్పి నుండీ ఊరట మీదాను…
(To be continued by the reader.)