1.
సాహిత్యశాఖలో నవల కొత్తది. రెండు శతాబ్దాల క్రిందటనే రూపొందినా అన్ని సాహిత్యశాఖల సద్గుణాలను ఏకముఖం చేసి బహుముఖాల వర్ధిల్లినది. ఇంకా విజృంభించే అవకాశాలు కానవస్తూ, ‘నవలాంతమ్ సాహిత్యమ్’ అనిపిస్తున్నది.
నవలకు మూలభూతమైనది కథ. నవలలో కథాకథనంతో పాత్రసృష్టి చేయవచ్చు. సాంఘిక, ఆధ్యాత్మిక జీవితము చిత్రించవచ్చు. వాఙ్మయ సంఘర్షణలు ప్రదర్శించవచ్చు. నేటి జీవితాన్ని విమర్శించి ఆదర్శజీవితం సూచించవచ్చు. ఇంకా ఎన్నో సాధించి ఆనందం కలిగించవచ్చు. స్థూలంగా నిర్వచనం చేస్తే, పూర్వకాలానికి సంబంధించినదైతే చారిత్రక నవల అవుతుంది.
చరిత్రాత్మక నవల అనేది రెండు విరుద్ధ శబ్దాల సమ్మేళనమనే భ్రాంతి కలిగిస్తుంది. జరిగినదంతా వ్రాసుకుంటూ పోతే చరిత్ర కాదు. లోకానికో, దేశానికో, సంఘానికో, వ్యక్తికో, మంచికో, చెడుకో ప్రభావం కలిగించే సంఘటనలు వ్రాస్తేనే చరిత్ర. దానితో అనుగుణమైన కల్పన జోడిస్తే చరిత్రాత్మక నవల అవుతుంది. దానికి చరిత్ర బీజముంటే చాలును.
వేదవేదాంతాలలో, పురాణాలలో, కొన్ని కథలు వినీ వినడంతోనే ఎవరికో ఎప్పుడో తప్పక జరిగిన సంఘటనే అనిపిస్తవి. అది చరిత్ర బీజము. అగస్త్యుడు వింధ్యపర్వతము దాటి దక్షిణానికి వచ్చిన కథ దక్షిణాపథమంతా ప్రభావితం చేసి బహువిధాల రూపుదాల్చింది. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలంటున్నాము. ఆ రెండు గ్రంథాలు భారత భూమినంతా ప్రభావితం చేసి నిత్యజీవితంతో పెనవేసుకొన్నవి. ఇతిహాసలక్షణ మిట్లా పెద్దలు చెబుతున్నారు:
“ధర్మార్థ కామమోక్షాణాం ఉపదేశ సమన్వితమ్
పురావృత్తం కథాయుక్తమ్ ఇతిహాసం ప్రచక్షతే (ప్రచక్ష్యతే?)”
కాబట్టి చరిత్రాత్మక నవలకు రామాయణ మహాభారతాలు మార్గదర్శకములుగా భావించవచ్చు.
చరిత్రకూ నవలకూ వైరుధ్యం లేదు. డాక్టరు గోపాలరెడ్డి ఒకచో “చరిత్రాత్మక నవల ఇతిహాసకత్వమూ కల్పనాసౌందర్యమూ సమరసమొందిన కూర్పు .. లేక సత్యసౌందర్యముల సమ్మేళనము” అన్నారు. అది ఒక మనోహర సూత్రప్రాయంగా గ్రహింపవచ్చు.
మనము ప్రత్యక్షముగా చూస్తూ వింటూ వున్న నేటి సంఘటనలను కథావస్తువులుగా గ్రహించి వ్రాయడము సులభ మనిపిస్తుంది. కాని ఆ సంఘటనల లోని ప్రధాన విషయాలు గ్రహించి రచన చేయడానికి కొంత ఆర్షదృష్టి ఉంటేనే కాని రాణించదు. అది లేకపోతే వార్తాలేఖనం లోకి దిగజారుతుంది. లేకపోతే ధనికులంతా దుర్గుణ పుంజాలుగానూ, దరిద్రులంతా సద్గుణమూర్తులుగానూ చిత్రిస్తూ పరశ్శతంగా ఈ కాలంలో వస్తున్న ప్రచార నవలలుగా రూపొందే ప్రమాద మెక్కువ ఉన్నది. కాబట్టి నేటికాలానికంటే గడచిన కాలాన్ని చిత్రిస్తేనే కొంత నిర్లిప్తతతో రచన చేసి సారస్వతసిద్ధి కలిగించేందుకు ఎక్కువ అవకాశమున్నదేమో!
చారిత్రక నవలాకారులను ఎదుర్కొనే ప్రమాదమొకటి ఉన్నది. ఇప్పటి తమ ఆదర్శాలూ, భావాలూ పూర్వకాలాలవారికి అన్వయించి చరిత్రను తారుమారు చేయడము. ముఖ్యంగా నేటి రాజకీయవాదులు చేస్తున్న దోషమిది. ఇట్టి రచనల వల్లనే నేటి సంఘంలో లేనిపోని ద్వేషాలు, కక్షలు ప్రబలుతున్నవి. సార్వకాలికమైన ధర్మసూత్రాలు బుద్ధిలో దృఢంగా ఉంచుకుంటేనే రచనలు ఉత్తమస్థాయి నందుకొంటవి.
పాశ్చాత్యులు శవాలను, శల్యాలను భద్రపరచినట్లే, జరిగిన సంఘటనలు వ్రాతపూర్వకంగా పదిలపరుస్తారు. అందువల్ల అక్కడ చరిత్ర శల్యాలకు ఎక్కువ ప్రాధాన్యముంటుంది. మన అదృష్టం వల్ల మన గతచరిత్ర వివరాలు అంత ఎక్కువగా లేనందువల్ల చారిత్రక నవలాకారులకు స్వతంత్ర కల్పనలు చేసేందుకు అవకాశా లెక్కువ ఉన్నవి. మన కావ్యాదులవల్ల ఆయా కాలాల సాంఘిక మతాచారాదులు తెలియవస్తున్నవి. వాటిని మాత్రము ఉల్లంఘించకుండా జాగ్రత్తపడితే చాలును. చరిత్రాత్మక నవల విశృంఖలంగా ఊహావీధులలో స్వైరవిహారము చేయవచ్చును.
2.
ఆంధ్రభాషలో నవలతో పాటుగానే చరిత్రాత్మక నవల కూడా క్రీ. శ. 19వ శతాబ్దము చివరి దశాబ్దంలో అవతరించింది. అప్పుడు టాడ్ సేకరించి ప్రచురించిన రాజస్థాన్ కథావళి దేశాన్ని ఆకర్షించింది. దాన్ని ఆంధ్రీకరించిన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహము, హేమలత అనే మొదటి చరిత్రాత్మక నవల వ్రాశారు. అది రాజపుత్ర స్థానానికి సంబంధించినదే. ఆ తర్వాత శివాజీ మొదలైన మహారాష్ట్ర వీరుల గాథలు ప్రచారంలోకి వచ్చినవి. హోల్కారు రాజ్యానికి సంబంధించిన అహల్యాబాయి అనే నవల కూడా చిలకమర్తివారే రచించారు. తర్వాత విజ్ఞాన చంద్రికా గ్రంథమండలివారు హిందూ మహాయుగము, మహమ్మదీయ మహాయుగము, చంద్రగుప్తుడు, శివాజీ చరిత్ర ప్రచురించినారు. శ్రీ చిలుకూరి వీరభద్రరావు ఎంతో పరిశ్రమచేసి ఆంధ్రుల చరిత్ర ప్రకటించారు. ఐనా మండలివారి ప్రథమ బహూకృతులందిన శ్రీ భోగరాజు నారాయణమూర్తి ‘విమలాదేవి’, శ్రీ వేలాల సుబ్బారావు ‘రాణీ సంయుక్త’ కూడా రాజస్థాన కథలకు సంబంధించినవే.
ఆంధ్రచరిత్రకు సంబంధించిన మొదటి నవలలు 1914లో వచ్చినవి. శ్రీ దుగ్గిరాల రాఘవచంద్రయ్య ‘విజయనగర సామ్రాజ్యము’, శ్రీ కేతవరపు వేంకటశాస్త్రి ‘రాయచూరు యుద్ధము’ – ఇవి కూడా మండలివారి బహూకృతులందినవే. ఐనా బహుకాలము వరకు ఆంధ్ర నవలాకారులకు రాజపుత్ర మహారాష్ట్ర వీరగాథలే అభిమానపాత్రమైనవి. ఆ రచయితలు ఆ దేశకాలాలతో గాఢపరిచితి లేనివారు గనుక అవి నామమాత్రానికే చారిత్రక నవలలు. శ్రీ వేంకట పార్వతీశ్వర కవుల వసుమతీ వసంతములో మౌర్య చంద్రగుప్తుడు ప్రధానపాత్రగా వచ్చుట ఒకటే కొంత మార్పు. అశోకచక్రవర్తి జీవితాన్ని చిత్రిస్తూ శ్రీ కేతవరపు వేంకటశాస్త్రి రచించిన ఇచ్ఛినీకుమారి అనే నవల చిన్నదైనా మొదట వచ్చిన చరిత్రాత్మక నవలలలో ఉత్తమమైనది.
మేధావులు స్వాత్రంత్ర్య సమరముతో సతమత మవుతున్నందు వల్లనేమి, రచయితల దృష్టి ప్రధానంగా కవిత్వరంగం మీద ప్రసరించినందు వల్లనేమి, వచన రచయితలు ప్రసిద్ధ నవలల ఆంధ్రీకరణాలతో తృప్తిపడుచున్నందు వల్లనేమి, బహుకాలము వరకు ఆంధ్రులచరిత్ర నవలాకారులను తగినంతగా ఆకర్షించలేదు.
3.
ఆంధ్ర చారిత్రక నవలకు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ‘ఏకవీర’తో 1932 ప్రాంతాలలో కొత్తమలుపు ఇచ్చారు. అది తమిళదేశానికి సంబంధించినదైనా, మధుర నేలిన ఆంధ్ర నాయకరాజుల చరిత్రకు సంబంధించిన దైనందున ఆంధ్రుల చరిత్రకు గూడా సంబంధించినది. అందులో ప్రధాన పాత్రలు ఆంధ్రదేశం నుంచి వలసపోయిన కుటుంబాలవారు. ముద్దుకృష్ణప్ప నాయకుని మరణమూ, ఆ తర్వాతి తిరుమల నాయకుడు పట్టాభిషిక్తుడు కావడము జరిగిన కాలపు కథ. ఈ నవలలో ప్రధాన కథ ఇద్దరు మిత్రుల సాంసారిక జీవనానికి సంబంధించినదైనా సందర్భవశాత్తుగా అప్పటి సాంఘిక పరిస్థితులు, పోర్చుగీసువారి దుండగాలు-దోపిడులు, రాబర్టు నోబిలి తత్త్వబోధకస్వామి అనే సన్యాసి వేషంతో చేసిన దొంగమతబోధ, దేవాలయాలలోని శిల్పనైపుణ్యాదులు చక్కగా ప్రదర్శింపబడ్డవి. తమిళ కవయిత్రి అవ్వయారు వ్రాసిన ‘అతిచ్చూడి’ లోని ఆరంజేవిరుంబు (ధర్మము చేయుము) ఆరవదు శివం (కోపపడకుము) ఇత్యాది బాలబోధలు ప్రౌఢబోధలై ప్రధాన పాత్రలను ధర్మపథాన నడిపించడము రమ్యముగా చిత్రింపబడ్డది. ఆంధ్రులు తమ నివాసము ఎక్కడ ఏర్పరచుకొన్నా అక్కడ ఉత్తమ సంస్కృతిని స్వాయత్తము చేసుకొనే తీరు మనోహరంగా సూచించారు నవలాకర్త. ఏకవీరలో కల్పనకూ చరిత్రకూ మంచి కుదిరిక ఏర్పడ్దది.
ఆ తర్వాత శ్రీ విశ్వనాథ బద్దన్న సేనాని, ఇత్యాది చారిత్రక నవలలు వ్రాశారు. కాని అవి ఏకవీర స్థాయిని అందుకోలేదు. వారీమధ్య శరపరంపరగా ప్రచురిస్తున్న పురాణ వైర గ్రంథమాల లోని నవలలు ప్రత్యేకముగా ప్రస్తావిస్తాము.
ఇంతలో ఆంధ్రుల చరిత్రకు సంబందించిన ప్రామాణిక గ్రంథాలు ఎన్నో రాసాగినవి. శ్రీయుతులు చిలుకూరి వీరభద్రరావు, భావరాజు కృష్ణారావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, కురుగంటి సీతారామయ్య, డాక్టరు నేలటూరి వేంకట రమణయ్య, డాక్టరు మారేమండ రామారావు ఎన్నో ప్రత్యేకగ్రంథాలు ప్రచురించారు. ఐతిహాసిక మండలివారు రాజరాజ నరేంద్ర సంచిక, కళింగ సంచిక, రెడ్డి సంచిక, కాకతీయ సంచిక, శాతవాహన సంచిక మొదలైన అమూల్య గ్రంథాలు ప్రచురించి ఆంధ్రుల చరిత్రతో పాటు మూలాధారాలు కూడా పాఠకుల అందుబాటులోకి తెచ్చారు. కాని వాటినన్నిటినీ కొద్దిమంది నవలాకారులు మాత్రమే ఉపయోగించుకున్నారు. వారిలో గణింపదగినవారు ఆంధ్ర విశ్వవిద్యాలయం బహుమతు లందిన ముగ్గురూ, తక్కినవారిలో శ్రీయుతులు అడవి బాపిరాజు, నోరి నరసింహశాస్త్రి. ఈ ఐదుగురి నవలలతో ఆంధ్ర చరిత్రాత్మక నవల సంపూర్ణ పుష్టితో అవతరించినది.
4.
ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు ఇంటర్మీడియేటు క్లాసుకు ఉపవాచకాలుగా నిర్ణయించే నిమిత్తము ఆంధ్ర చరిత్రకు సంబంధించిన ఉత్తమ నవలకు ఒక్కొక్కదానికి వెయ్యి రూపాయలు బహుమతి ప్రకటించారు. 1951 నాటికి ఆంధ్రదేశములో నవలాకారులలో ఏ కొద్దిమందికో తప్ప అంత ప్రతిఫలము నవలారచన వల్ల ముట్టడము లేదు. ఇందువల్ల అంతకు ముందు నవలలు వ్రాయనివారు చరిత్ర శ్రద్ధగా పఠించి చారిత్రక నవలలు వ్రాయడానికి పూనుకొని మంచి నవలలు వ్రాశారు.
అట్టివారిలో అగ్రగణ్యురాలు శ్రీమతి మల్లాది వసుంధర. ఆమె మొదటి నవల తంజావూరు పతనము. ఆ బహుమతు లందిన నవల లన్నిటిలో సర్వవిధాల అగ్రగణ్యమైనది. ఆమె కాలేజీ విద్యార్థినిగా ఉన్నప్పుడే అటువంటి నవల వ్రాయడము ఆశ్చర్యకరమైనది. ఏకవీరలో వలెనే దీనిలోని కథాంశము కూడా తమిళదేశములో జరిగినదైనా, తంజావూరు పాలించిన ఆంధ్ర నాయకరాజులలో చివరివాడగు విజయరాఘవరాయల పాలనము చిత్రించినందువల్ల ఒకవిధంగా ఆంధ్రుల చరిత్రకు సంబంధించినదే. ఇందులో ఆ యాస్థానములో కవిత్వము, సంగీతము, నృత్యము, శిల్పము పరాకాష్ట నందుట చక్కగా పోషింపబడ్డది. కాని రాజు భోగలాలసత, వేశ్య రంగాజమ్మ యందు వ్యామోహము, ముఖస్తుతి యందు ప్రీతి, ఆస్థానకవులు స్తుతించుచున్నట్లు తాను నిజముగా భగవంతుడనే అనుకొనుట, శ్రీకృష్ణదేవరాయల యంతవాడనని గర్వించుట, తన అష్టమహిషులతో దక్షిణ నాయకత్వము సమర్థింపలేకుండుట, వెంకన్న కుట్ర కననగుట ఏవిధముగా రాజ్యపతనమునకు దారితీసినవో అద్భుతముగా చిత్రింపబడినవి. పరమభక్తుడైన పెద్దిదాసు పాత్ర, అమాయకుడైన ఎల్లు సోమయాజుల రాయబారములు, యువరాజును బంధించినందున కోపోద్దీపితయైన పట్టమహిషి రాజగోపాలాంబిక విజృంభణము, విజయరాఘవనాయకునకు ఉంపుడుకత్తెగా ఉన్న రంగాజమ్మ తనకు సోదరియని చివరకు తెలిసినందున కలిగిన నిర్వేదము, పాఠకుల హృదయములలో చిరకాలము నిలిచిపోవును. ఈ నవల వసుంధర సర్వతోముఖ ప్రజ్ఞకు ప్రతీక.