మూడు లాంతర్లు -11

సృజనశీలికి జీవితం యావత్తూ ఉద్వేగ ప్రధానము, రస ప్లావితమైన అనుభవం – బయటికి తనకే స్పష్టాస్పష్టమైనా, లోలోతుల్లోన ఎల్లప్పుడూ తప్పనిసరి అయిన సృజన వేళ. సృజనశీలి జీవితాన్ని నిరంతరం ఇలా సృజనాత్మకంగా అనుభవిస్తూ, ఏ కొన్ని అనువైన ఘడియల్లోనో ఏవో కొన్ని అనుభవాల్నో మాత్రం సృజనగా వెలువరించుకోవటంలో కృతకృత్యమౌతున్నాడు. అంటే అతను తప్పనిసరిగా, తదేక ధ్యాసతో తలకెత్తుకున్న పని – సృజన లోన, దాదాపు ఎల్లప్పుడూ పరాజితుడు. రోజూ వ్యసనంలా లాటరీ టిక్కట్టు కొంటున్నా ఎప్పుడో అరుదుగా లాటరీ పేలినట్టు అతని సృజన ఘడియలు చాల అరుదుగా సఫలమౌతున్నాయి, ముందుగా అతని దృష్టిలోన – అంటే in his own estimation. ఈ వివరణ నుండి సృజన ఎందుకు ఇదివరకు చెప్పుకున్నట్లు అంత కష్టమో గోచరిస్తుంది. ఇదివరకే చెప్పినట్లు, ఈ వివరం ఎందరో కళాకారులు, వాళ్ళను పరిశీలించినవాళ్ళూ చెప్పుకున్నది ఉంది. ఈ అనువైన ఘడియలు సృజనకారునికి శ్రీ శ్రీ ‘ఉండాలోయ్ భావావేశం’ అని సూచించినవంటివి, అంతర్లీనంగా ఉడికుడికి నెలలూ ఏళ్ళతరబడి నడుస్తుండే గహనమైన ఔద్వేగిక అనుభవాలు. అది బద్దలయ్యే సందర్భం సృజన వ్యక్తీకరణకు సమయం. త్రిపుర దీన్నే Epiphany అంటారు. ఇది గడియారపు కాలం కాదు, మానసిక కాలం (psychological time); ఒక గడియారపు ఘడియ – అంటే శుక్రవారం మూడుంపావుకి ఫలానా కవిగారికి కవితావేశం పూనింది అన్నట్టుగా కాకుండా, తనకే స్పష్టంగా అర్ధంకాని ఉద్వేగాలు, ఊహలు, అనుభవాలే కడుపులో ఉడికుడుకి, చివరికి ఏదో ఒక నిభాన్న భాషను ఆలంబనగా, వాహికగా మాత్రం తీసుకొని హఠాత్తుగా, అసంకల్పితంగా బయటికొచ్చేవి. దీన్ని గురించి ఈ వ్యాసంలోనే, గంజిబువ్వ వంటి కధల్ను చర్చిస్తూ ఇదివరకు కొంత చెప్పుకున్నాము. కొత్తది ఇంకొకటి: షామస్ హీనీ (Seamus Heaney) అని ఐరిష్ కవి. ఆయన సృజన కవికి ఎలా వేళా పాళా లేకుండా హఠాత్తుగా ప్రత్యక్షమై తన పని పూర్తిచేసుకుంటుందో Glimpse into A Poet’s Mind అని ఈ చిన్న వ్యాసంలో వర్ణిస్తున్నారు. “Poems can also be unpredictable and unbiddable creatures. They can arrive at all hours of the day or night, and woe unto the poet who is not ready to receive them. The first line of a poem called “Bogland”, for example, came to him as he was putting his right leg into his trousers, he recalls. But when a poem has come through, and has been tested to its limits by revision and repeated re-readings, it can seem as solid as an iron bar.” కవికి సృజన ఎంత అసంకల్పితం, యాదృచ్చికమైనా, మొట్టమొదటి వ్యక్తీకరణను తన తనివితీరా చెక్కి, చెక్కి విడిచిపెట్టిన పిమ్మట అదింక ఇనప గుండంత స్థిరం; మరింక ఏ మార్పూ అక్కర్లేదు. అక్కడికి సృజన పూర్తయ్యింది.

కవికీ పాఠకునికీ కూడా కాల్పనిక సృజన ప్రక్రియలో సంక్లిష్టత ప్రకృతి వర్ణనల్లో తక్కువగాను, ప్రవర్తనను చిత్రీకరించేటప్పుడు మధ్యస్తంగాను, అంతరంగాన్ని చిత్రీకరించవలసి వస్తే అత్యంత జటిలంగానూ ఉంటుంది. ప్రకృతి పూర్తిగా మూర్తమైనది, కళ్ళెదుటనే ఉన్న భౌతిక దృశ్యం కాబట్టి. ప్రవర్తన ఎదుటనే ఉంది కాని అది భౌతిక దృశ్యం కాదు, ఔద్వేగిక దృశ్యం. ఎదుటి మనుషులు, జంతువుల ప్రవర్తనను మనం పరిశీలించి, అనుభవించే తీరు కొంత మాత్రం భౌతికమైనది, చాల ఎక్కువగా ఔద్వేగిక ప్రధానమైనది. ఉదాహరణకు ఈ వాక్యం:

పిలుస్తూవుంటే ఉలుకూ పలుకూ లేదు, మూతి ముటముట్లాడించుకుంటూ వెళిపోయిందే… తిప్పులాడి!

ఈ కాసిని వాక్యాలు చిత్రించే ప్రవర్తనలో ప్రగాఢమైన ఔద్వేగికానుభూతులు అనేకం పొంచి ఉన్నాయి, భౌతిక దృశ్యం మాత్రం పేలవంగా ఉంది; అది మూతి ముటముట, తిప్పులాడి అనే రెండు మాటల్లో మాత్రమే ద్యోతకమౌతుంది. చివరికి అవి కూడా వాస్తవంగా మూతినీ, పృష్ఠాన్నీ చిత్రించటం లేదు. అవి పొగరు, వగలు వంటి ప్రవర్తనను సూచించే ఉద్వేగాలకు కేవలం సంకేతప్రాయాలుగా ఉన్నాయి. అంతరంగం పూర్తిగా అమూర్తమైనది, దాని చిత్రణ అత్యంత సంక్లిష్టమైనది. అందుకు అస్పష్టత, నైరూప్యత, సూచ్యత, అరాచకం, పేర్పు (Juxtaposition) వంటి పద్ధతులు, విభిన్నమైన తోవలున్నాయి.

సాధారణమైన అనుభవాలకు ఇంకొన్ని ఉదాహరణలు: దీపావళి మర్నాడు, వాన వెలిసిన సాయంత్రం, పెద్ద పరీక్షల చివరి రోజు, ఉద్యోగానికి ఇంటర్వ్యూ, పెళ్ళి సందడి, డెంటిస్ట్ అపాయింట్‌మెంట్ – ఇలాంటివి దాదాపు మొత్తం సమాజం అంతటికీ అనుభవమయ్యేవి. ఇంకొన్ని అనుభవాలు కులం, అంతస్థు, ఉద్యోగం, లింగం, వయసు, మతం, ప్రాంతం వంటి పరిమితులకు ప్రత్యేకమైనవి; ఉదాహరణకు సిగరెట్ బ్రేక్, నందికేశుడి నోము, కొండ గుడి పండుగ, ఫైరింగ్ ప్రాక్టీస్, పరీక్షా పత్రాలు లీక్ అవ్వడం, Prom night ఇలాగ. ఫలప్రదమైన కవిత కవయిత్రివి, ఆవిడ పాఠకులవీ ఔద్వేగిక సంచయాల్లో సామాన్యంగా, సుమారు ఒకేలా ఉండే జ్ఞాపకాలకూ, సంకేతాలకూ, అనుభవాలకూ, ఆకాంక్షలకూ వారధిని నిర్మించడంలో సఫలమైనట్లయితే, పాఠకులు ఆ కవిత ప్రదర్శను తమ మనోరంగం మీద మళ్ళీ తమంత తాముగా నిర్మించుకొన్నప్పుడు ఆ దృశ్యాభాస అర్ధవంతంగా ఉండి, రక్తి కడుతుంది. దీనికి అవసరమైన పనిముట్లను – వ్యవస్థలని అంటున్న వాటిని – లాఘవంగా, శ్రద్ధగా వాడుకోవటంలో కవి శక్తి తెల్లమౌతుంది; అది కవిత నిర్మితిలో, కావ్య శరీరపు నిర్మాణంలో వ్యక్తమౌతుంది. ఇది వరకు చెప్పిన ఔద్వేగిక వ్యవస్థ, మిగిలిన అలంకారిక వ్యవస్థలు – ఉపమ, లయ, తూగు, ఊహ, పద చిత్రం వంటివి కలసి ఈ వారధిని నిర్మించడంలో విశేషమైన పాత్రలను పోషిస్తున్నాయి. సృజనను నిర్మించడంలో కవికీ, పాఠకునికీ అందుబాటులోనున్న మౌలికమైన సామాన్లు, అంటే కావ్యాంగాలు ఐదు: మాట (Word); రూపకం (Metaphor); పద చిత్రం (Image); ఊహ (Thought); ఉద్వేగం (Emotion). కావ్య శరీరాన్ని నిర్మించి కావ్యపు ఆత్మ అయిన ఔద్వేగిక ఆవరణను పరికల్పించి సృజనకు ప్రాణ ప్రతిష్ట చెయ్యడంలోన ఈ ఐదు అంగాల పాత్రలనూ, వాటికి పరస్పరం ఉండే సంబంధాలనూ Cognitive Science సహాయంతో వివరించవచ్చును. ఈ సృజన సిద్ధాంతాన్ని ముందుగా, పూర్తిగా వివరిస్తే తప్ప ఆదివారం మధ్యాహ్నాలు వంటి కవిత ప్రదర్శనలోని బాగోగుల్ని గురించి పూర్తిగా, సంతృప్తికరంగా విశ్లేషించే వీలు లేదు.

బాగోగుల్లో బాగును ఔచిత్యమనీ, ఓగును భంగమనీ వ్యవహరిస్తారు. ఔద్వేగిక స్థితి, సందర్భం (Context), నడక ఇలా ఒక్కో వ్యవస్థనూ సూత్రంగా మొత్తం సృజనను పరామర్శిస్తూ పోయి ఎక్కడెక్కడ ఆ వ్యవస్థ ఔచిత్యానికి విశేషమైన రాణింపు వచ్చిందో, ఎక్కడెక్కడ భంగమయ్యి పంటికింద రాయిలాగ కటుక్కుమంటుందో గుర్తిస్తూపోవచ్చు. సృజనానుభవాన్ని గురించి ఇక్కడ ప్రతిపాదిస్తున్న దృశ్యాభాసలో పాఠకుడు, విమర్శకుడూ కూడా ‘కవులే’నని జ్ఞాపకం ఉంచుకుంటే, ఔచిత్య భంగాలని అంటున్నవాటికి కారకుడు, బాధ్యుడు ఎల్లప్పుడూ కవి ఒక్కడే కాకపోవచ్చునని, పాఠకుడికీ బాధ్యత ఉందని ఒప్పుకోవచ్చును. సృజన ఔద్వేగిక వ్యవస్థ ఎప్పుడు, ఏ ఏ కారణాలవలన బలహీనమౌతుందో, రాజీ పడుతుందో రక రకాల ఉదాహరణలతో అదే ఒక పరిశోధనగా చెయ్యవలసిన పని. తమకు నైసర్గికమైనది, అసలైనది, సాంద్రతరమైనదీ సృజనానుభవం లేకుండానే ఇదివరకు చెప్పుకున్న రకరకాల కారణాలు, ప్రయోజనాల కోసం వస్తువును స్వీకరించి రచనను వెలువరిస్తే ఆ సృజన శరీరం సొగసైన భాష, పదునైన, గడుసైన ఆలోచనలతో ఎంత గొప్పగా అలంకరింపబడినప్పటికీ, సృజనకు ప్రాణప్రదమైన ఔద్వేగిక వ్యవస్థ చెడిందని పట్టిచూస్తే తెలిసిపోతుంది. నేను ఇదివరకు చెప్పిన షావుకారుగారి లాగ రచనను అలా అలా పట్టిచూసి ముందుగా వెదుక్కొనేది ఈ ఔద్వేగిక వ్యవస్థ లోని స్వఛ్ఛతను, కాంతిని, పటుత్వాన్నీ. ఔద్వేగికంగా, authenticగా లేని రచన రకరకాల ఆభరణాలతో చాల సొగసుగా అలంకరించిన గొప్ప సౌందర్యవతి శవం లాగ భయం, ఏహ్యత వంటి విరుద్ధ భావనలనే కలిగిస్తాయి. అనువాదాలతో కూడా ఈ ఇబ్బంది ఉంది. Poetry is what is lost in translation అన్నారు కదా. అనువాదంలో పోయేది ఏమిటి? సృజనకు ప్రాణప్రదమైన ఔద్వేగిక ఆవరణ. శక్తివంతమైన మూలాల్ని సైతం అనువదించేటప్పుడు అనువాదకులు ఊహల్నీ, భాషనూ, సన్నివేశాల్లోని భౌతిక చిత్రాలనూ ఆట్టే కష్టం లేకుండా అందిపుచ్చుకోగలరు, కాని ఔద్వేగిక ఆవరణను అంత సులభంగా ఎంతమాత్రమూ అందిపుచ్చుకోలేరు. ఔద్వేగిక వ్యవస్థను నిలబెట్టుకుంటూ లేదూ ఇంకా ఉద్దీపనం చేస్తూ నిర్వహించగలిగేది అనుసృజన.

16

రకరకాల పనులతో, వ్యాపకాలతో వారాంతం వరకు ఒక యుద్ధంలా సాగిన కవి, పాఠకుల జీవితానికి ఒక ఆటవిడుపులా దొరికే శలవు ముగిసిపోయే వేళ ఆదివారం మధ్యాహ్నాలు కవిత ఔద్వేగిక వ్యవస్థకు భూమిక. కవిత చిత్రించడానికి ప్రయత్నిస్తున్న ఔద్వేగిక చిత్రాన్ని బట్టి ఆ విరామం ఒక విశ్రాంతి కంటే కూడ ‘ఏదోలా’ ఉండే నొప్పి వంటి, యుద్ధం వంటి బతుక్కి ఒక ఊరట. కాని ఆదివారం మధ్యాహ్నం ఆ విరామానికి చరమాంకం. అది ముగిస్తే మొదలయ్యేది సోమవారపు యుద్ధం, హడావిడి, నొప్పి. వారం అంతా ఎదురు చూసిన ఆట విడుపు, ఊరట అంతట్లోకే అయిపోతోందే, మళ్ళీ సోమవారం మొదలవుతుందే అన్న పరిచితమైన బెంగను, ‘అదోలా’ అనిపించే నిరాశను కవితాత్మకంగా ఒడిసిపట్టుకొని, చిత్రించడమే ఈ కవిత ఉద్దేశం, పనీ. నవ్యమైన వస్తువు, ఆధునికులైన పాఠకులందరికీ పరిచితం, స్వానుభవపూర్వకమైన ఇతివృత్తం ఈ కవితకు అపురూపమైన అవకాశాలు. కవిత ఉద్దేశించిన ఔద్వేగిక ఆవరణను గడుసుదనంతో కలుషితం చేసే ఊహలు, ప్రయత్నం కనిపించవు. అందుకే నేను కవితను ‘గుద్దుకున్నట్టు’ లేకుండా సాంతం చదవగలిగేను. కాని రక రకాల ఔచిత్య భంగాలు, అపస్వరాల్లా అనిపించేవి కవిత ఔద్వేగిక ఆవరణను ఉద్దీపనం చేయలేని ప్రస్తావనలు అడుగడుగునా అడ్డుపడుతూ ‘అయ్యో! బంగారం లాంటి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది …’ అని నిరాశపరుస్తాయి. ఎందుకో వివరించాలంటే నేను సృజన అనుభవపు సిద్ధాంతం అన్నదాన్ని మొత్తం ముందుగా వివరించి తీరాలి. అందుకే, ఇక్కడ చేసేది ఈ కవితపై పూర్తి విమర్శ కాదు.

కవిత స్వరూపాన్ని, బాగోగులనూ మొత్తంగా విశ్లేషించే ముందు, కేవలం ఔద్వేగిక వ్యవస్థను మాత్రం పరామర్శిస్తూ ఒక ఐదారు కవితలను పరిశీలిద్దాము. ఔచిత్య భంగం అంటే ఏమిటో కొన్ని ఉదాహరణలు కూడా ఈ కవితలనుండి దొరుకుతాయి. ఆదివారం మధ్యాహ్నాలు వంటి కోవకు చెందిన కవితలు ప్రాకృతికమైన కాలాన్ని లేకుంటే సందర్భాల్నీ, ప్రవర్తనంపై, అంతరంగంపై ఆ సందర్భాల ప్రభావాన్నీ అందిపుచ్చుకొని, కవితాత్మకంగా చెక్కే ప్రయత్నం చేస్తాయి. ఈ తరహా సృజనలు ఔద్వేగిక ఆవరణను ఎలా నిర్మిస్తున్నాయనేది ఇక్కడి పరిశీలన. వాస్తవానికి ఇప్పటి కవిత్వం కంటే మన ప్రాచీన సాహిత్యంలో ఇలాంటి నిర్మాణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణలుగా ఆముక్తమాల్యద నుండి వర్షర్తు వర్ణన, చేమకూర వెంకట కవి విజయ విలాసం నుండి సాయంకాల వర్ణన. ఆధునిక కవిత్వం నుండి శ్రీ శ్రీ కవిత ఒక రాత్రిలో బహుళ పంచమి జ్యోత్స్న వర్ణన, తిలక్ కవితలు సంధ్య, వేసవి అని రెండు; ఇంకా బ్రాడ్స్కీ కవిత The Song.