మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’

ఇటనభ మిట భూవలయం
బిట బలిసద్మంబు నుండు నెలవులివి యనన్
బటువులగు వళుల చెలువున
బుట పుటవై యున్న చిన్ని బొజ్జ కదలన్

క్రిష్ణయ్య పరుగున వస్తుంటే నినిగలాడుతున్న (పుటపుటనైయున్న) చిన్ని బొజ్జ కదలాడుతోంది. ఆ చిఱు బొజ్జమీద మూడు మడతల ముడతలు (వళులు) ఉన్నాయి. అవి స్పుఠంగా (పటువుగా) ఉన్నాయి. మూడు అరలకు గుర్తులుగా ఉన్నాయి.

“ఇదిగో ఇక్కడ ఆకాశం (నభము), ఇక్కడ భూమి, ఇక్కడ పాతాళం (బలిసద్మం – బలిచక్రవర్తికి నిలయం)” అన్నట్టు ఉన్నాయి. మరి జగత్తులన్నీ ఆయన బొజ్జలోనే ఉన్నాయి కదా! (“ఉరికిన నోర్వక ఉదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదల” అన్నాడు పోతన.)

బొజ్జదాటి పుండరీకుని చూపులు ఇంకొంచెం పైకి వెళ్ళాయి. విశాలంగా వక్షస్సు కనిపించింది.

తులసికి పచ్చరాకుదురు తోయదవాహన రత్నవేది య
క్కలిమి మెఱుంగు బోడికిని కౌస్తుభ ఘర్మ గభస్తికిన్ నభ
స్తలము ననంగ బొల్చి నిరతంబు కృపావిభవంబునింటి బో
ర్తలుపు దలంపు సేయుచు నురంబు కరంబు పరిస్ఫురింపగన్

స్వామి వక్షస్థలం (ఉరంబు) మిక్కిలి (కరంబు) ప్రకాశిస్తోంది (పరిస్ఫురింపగన్). “కృపావిభవము” అనే ఇంటి బోర్తలుపుని (ఏక కవాటం) గుర్తు చేస్తూ ప్రకాశిస్తోంది. ఆ కవాటం వెనక్కాల దయాసంపత్తి ఉంది. పచ్చరాయి + కుదురు – పచ్చరాకుదురు. మరకతమణి వేదిక లేక పాదు. తులసీదేవికి విష్ణుమూర్తి వక్షఃస్థలం మరకతవేదిక. మరకతమణులు పొదిగిన తులసికోటలాగా ఉంది అని. నీలమేఘశ్యాముని ఉరము కనుక మరకతమణి వేదికలాగా ఉంది. మెఱుంగుబోడి అంటే విద్యుల్లతవంటి శరీరం కలిగిన స్త్రీ. కలిమి – సంపద. కలిమి మెఱుంగుబోడి – లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి ఈయన ఉరఃప్రదేశం తోయదవాహన రత్నవేది యట. తోయదం – మేఘము. దాన్ని వాహనంగా కలవాడు – ఇంద్రుడు. తోయదవాహనరత్నం – ఇంద్రనీలమణి ! విష్ణువక్షఃస్తలం లక్ష్మీదేవికి ఇంద్రనీలమణి వేదిక. లక్ష్మీదేవి విష్ణువక్షస్థల నివాసిని కదా.

శ్రీమహావిష్ణువు మెడలో కౌస్తుభహారం ఉంటుందికదా. ఘర్మ గభస్తి – వేడి కిరణాలు (గభస్తులు)కలవాడు – సూర్యుడు. కౌస్తుభం అనే సూర్యుడికి శ్రీహరి ఉరసీమ ఆకాశమట (నభస్తలం). స్వామివారి ఉరస్సీమ నీలంగా వుంటుంది కనుక ఆకాశంతో పోలిక. కౌస్తుభమణికి సూర్యుడితో పోలిక. ఎల్లవేళలా (నిరతంబు) ఇలా విరాజిల్లుతూ బోర్తలుపుని గుర్తు చేస్తూ (తలంపు సేయుచు) ఉరంబు కరంబు పరిస్ఫురింపగన్ – స్వామి విజయం చేసాడు.

అంత్యానుప్రాసతో పద్యాన్ని ముగించడం పోతనాదుల పద్ధతి. వృత్యనుప్రాసతో చివరిపాదం మ్రోగించడం రామకృష్ణుని పద్ధతి.

లలిత నిజ వామ కరతల
కలిత కనత్కంబు కాంతి కల కల నవ్వన్
గలువల చెలి గిలిగింతల
నలువగు ఱాలన్ బిసాళి నలువ గుఱాలన్

మనోహరమైన తన ఎడమ (వామ) అరచేతిలో (కరతలమున) ధరింపబడి ప్రకాశిస్తున్న (కనత్) పాంచజన్య శంఖ కాంతి (కంబువు – శంఖము) చంద్రకాంతపు మణులనీ, బ్రహ్మదేవుడి హంసలనీ పరిహసిస్తూ ఉండగా (కల కల నవ్వన్) స్వామి విచ్చేసాడు. కలువలచెలి (చంద్రుడు) పెట్టే గిలిగింతలతో అందగించే (నలువు – అందం, నలువు + అగు = నలువగు – ఒప్పిదమగు) రాలన్ (రత్నాలని) – అంటే చంద్రకాంతమణులను పరిహసించే తెల్లదనం ఆ శంఖానిది. నలువ అంటే నాలుగు ముఖాలు కలవాడు – బ్రహ్మ. ఆయన వాహనాలు (గుఱ్రాలు) – హంసలు. (“గుఱ్ఱం” అనే పదాన్ని ఇప్పటికీ “వాహనం” అనే అర్థం సూచించడం కోసం వాడుతూ ఉంటాం. సైకిలో స్కూటరో మరమ్మతుకొస్తే నా “గుఱ్ఱం మూలబడింది” అంటాం. రామకృష్ణుడు బ్రహ్మదేముడి హంసల్ని పట్టుకొని ఏకంగా గుఱ్ఱాలన్నాడు!) పిసాళి అంటే ప్రకాశించు. ఇక ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది నిగనిగ లాడుతున్న దొండపండు లాంటి అధరం. శృంగార భావం మేళవించి చెబుతున్నాడు.

బింకపు వ్రేతల వాతెఱ
మంకెన పూదేనె తేట మానక పైపై
నింకగ నింకగ బల్మఱు
బంకించుట బోలె మోవి బచ్చెన హెచ్చన్

వ్రేత – గోపిక, వాతెఱ – వాయికి తెఱ – నోరు. మోవి – పెదవి, బంకించుట – పులుముట, రుద్దుట, పట్టించుట ; బచ్చెన – కాంతి, నిగారింపు.
బింకమైన వయసులో ఉన్న గోపికలు వాళ్ళ అధరాలు మంకెనపువ్వులు. ఎర్రగా, మృదువుగా మకరందం చిప్పిలుతూ వుంటాయి. అందుకని అధరాలతో పోలిక. వాతెర (నోరు) అనే మంకెనపువ్వులో ఉండే తేనె తేటను (అధరామృతాన్ని) విడిచిపెట్టకుండా తన పెదవికి పైపైకి ఇంకినకొద్దీ ఇంకొంచెం ఇంకేట్టుగా (ఇంకగన్ – ఇంకగన్) చాలాసార్లు (పల్మఱు) పట్టించడంవల్ల స్వామివారి మోవి రంగు మరింత హెచ్చిందిట. అటువంటి అధరాలతో ఆ గోపికాలోలుడు ప్రత్యక్షమయ్యాడని అన్వయం.

ఇక స్వామివారి కన్నుల వర్ణన చూడండి.

తరళమసార సార నిభ తారకముల్ సితపద్మ పత్ర బం
ధురములు, రాధికాహృదయ తోయజకోరక బోధన క్రియా
తరుణ తరార్క రుగ్విలసిత స్ఫుట రక్తిమ సక్త కోణ భా
స్వరము, లసూక్ష్మ పక్ష్మములు, వాలిక కన్నులు చెన్ను మీఱగన్

స్వామివి వాలిక కన్నులు – సోగకన్నులు, అవి చాలా అందంగా (చెన్నుమీఱగన్) ఉన్నాయి. తీర్చిదిద్దినట్టు ఒత్తుగా పెరిగిన రెప్పవెండ్రుకలతో బాగున్నాయి. సూక్ష్మము అంటే సన్నని. అసూక్ష్మము అంటే దానికి వ్యతిరేకము – ఒత్తయిన అని. పక్ష్మములు – రెప్పవెండ్రుకలు.

ఇక కనుగుడ్లు (తారకలు) కాంతిమంతంగా (తరళము) ఉన్నాయి. శ్రేష్టమైన (సార) ఇంద్రనీల మణులతో (మసారము) సాటివచ్చేటట్టు (నిభ) ఉన్నాయి. తరళమైన మసార సారంతో నిభమైన తారకలు కలవి ఆ కన్నులు. తెల్ల తామర రేకుల్లాగా (సిత పద్మ పత్రాల లాగా) రమ్యమైనవి (బంధురములు) ఆ కన్నులు. తోయము – నీరు. తోయజము – నీటినుంచి పుట్టినది – పద్మం. కోరకము – మొగ్గ. తోయజకోరకము – తామరమొగ్గ. రాధాదేవి అనే తోయజకోరకం – దాన్ని మేల్కొల్పడం (బోధన + క్రియా) వికసింపజెయ్యడం అనే పనికి శ్రీకృష్ణుని చూపులు సూర్యకాంతుల్లా పనిచేస్తాయిట. అంటే స్వామివారి చూపులు సోకగానే రాధిక హృదయం పద్మంలా వికసిస్తుంది. అర్కుడు – సూర్యుడు. తరుణ తర + అర్కుడు – అప్పుడే ఉదయించిన బాల సూర్యుడు. ఆ కాంతులు ఎర్రగా (రుక్) ఉంటాయి. తరుణ తరార్కుని రుక్ + విలాసంతో ప్రస్ఫుటమైన రక్తిమతో (ఎర్రదనంతో) కూడిన కోణాలు ఉన్నయి ఆ కన్నులకి. నేత్రకోణాలలో (కన్నుకొసలు) ఉదయసూర్యుని రక్తిమ ఉంది. అటువంటి రక్తిమతో సక్తమైన కోణాలతో భాస్వరములవుతున్నాయి (ప్రకాశిస్తున్నాయి) ఆ సోగకన్నులు. అవి అందాలొలుకుతుండగా (చెన్ను మీరగా) శ్రీకృష్ణపరమాత్ముడు వేంచేశాడు.

ఇంక ఇప్పుడు సర్వాంగీణంగా సమగ్రంగా స్వామిమూర్తిని మన మనోనేత్రం ముందు నిలుపుతున్నాడు.

దిగ్వాసుండురు పింఛలాంఛిత శిఖోదీర్ణుండు, వర్షాపయో
ముగ్వర్ణుండు, నవాంబుజాహిత లతాముక్తాంగదుండున్, సుధా
రుగ్విస్మేరముఖుం, డనంగ శతజిద్రూపాధికుం, డగ్రభూ
వాగ్వర్గోధ్భవభూమి, శ్రీవిభుడు, శ్రీవత్సాంక వక్షుండునై

దిక్ + వాసుడు – దిక్కులే వాసములుగా కలవాడు. అంటే దిగంబరుడు. మొలకి తీగలుచుట్టుకున్నాడే తప్ప పీతాంబరం కట్టుకోలేదు. ఉరుపింఛలాంఛిత శిఖోదీర్ణుండు: పెద్దపింఛంతో చిహ్నమైన (లాంఛిత) శిఖతో ప్రకాశిస్తున్నవాడు.వర్షా పయోముక్ + వర్ణుడు: వర్షాకాలం నాటి మేఘ వర్ణుడు (నీలమేఘశ్యాముడు). నవాంబుజాహిత లతా ముక్తాంగదుండు:స్వామి ఒకరకం ఆకులతో భుజకీర్తులు (అంగదములు) కట్టుకున్నాడు. ఆముక్తము అంటే అలంకరించుకొనిన. అంబుజ + అహితుడు: పద్మాలకు శత్రువు – చంద్రుడు. నవమినాటి చంద్రలతలు – అర్దచంద్రాకారంగా ఉండే లతలు. సుధా రుగ్విస్మేరముఖుడు: సుధా రుక్ అంటే అమృతకిరణుడు – చందమామ. అతన్ని పరిహసించే ముఖంకలవాడు – లేదా చందమామ వంటి విస్మేరంతో (చిరునవ్వుతో) విరాజిల్లే ముఖం కలవాడు అని కూడా చెప్పవచ్చు. నవ్వురాజిల్లెడు మోము వాడు – అన్నాడు ఫోతన. అనంగ శతజిత్ + రూప + అధికుడు. వందమంది మన్మధుల్ని రూపంలో జయించగలిగిన వాడు. అగ్రభూ+ వాగ్వర్గ + ఉధ్భవ భూమి. అగ్రభూ – అన్నిటికన్న మొదట పుట్టినది. అలాజన్మించిన వాక్-వర్గానికి – వేదాలకి – మాటలసమూహానికి ఇతడు ఉధ్భవుడు – జన్మస్థానం. శ్రీవిభుడు – లక్ష్మీపతి. శ్రీవత్సాంక వక్షుండునై – శ్రీవత్సం అనే పుట్టుమచ్చ వక్షస్థలం మీద కలవాడు. అటువంటి శ్రీమహావిష్ణువు పుండరీకునికి దర్శనం అనుగ్రహించాడు.