కొంతమంది జీవితాలు యంత్రాల్లా భలే ఉంటాయి. ఏ సమస్యా, బాదరబందీలూ ఉండవు.
ఉదయాన్నే లేవడం, తాపీగా పళ్ళుతోఁవడం, ఉయ్యాల బల్లెక్కి వేడి వేడి కాఫీ చప్పరించడం, కాస్త పొద్దెక్కాక వీధరుగు మీద పడక్కుర్చీలో ఈనాడు పేపరు ఎక్కాల పుస్తకంలా చదవడం, పన్నెండుకల్లా కాస్త లాగించి మధ్యాన్నం ఓ రెండు గంటలు కునుకేయడం, కాస్త సాయంత్రమయ్యేసరికి పెళ్ళికొడుకులా ముస్తాబయ్యి అలా నల్లొంతెన వరకూ వాహ్యాళి వెళ్ళడం, బార్ అసోషియేషన్ పేకాటలో నాలుగొందలు తగలేయడం, వీలయితే మందుకొట్టి ఇంటికొచ్చి పడుకోడం లాంటి జీవితాన్ని పాతికేళ్ళు పైగా గడిపే వాళ్ళకి చీకూ, చింతా ఉంటాయంటే మెడకాయ మీద తలకాయున్న వాడెవడూ నమ్మడు. పట్టించుకునేవాడికి అన్నీ సమస్యలే! పట్టించుకోనివాడికి, వాడే ఇతరులకి పెద్ద సమస్య. సరిగ్గా విశ్వనాథం ఈ కోవకి చెందుతాడు.
విశ్వనాథాన్ని చూసి నాలాంటి వాళ్ళు సోమరనుకుంటే, అతని భార్య సూరమ్మ మాత్రం ఎంతో క్రమశిక్షణ కలిగిన మనిషని పదిమంది ముందూ వెనకేసుకొస్తుంది. ఎందుకంటే సూరమ్మకి ఇంటి పెత్తనం ఇష్టం. విశ్వనాథానికి పట్టించుకోక పోవడమిష్టం. పొట్టకోస్తే అక్షరమ్ముక్క లేక ఏ వుద్యోగమూ, సద్యోగమూ వెలగబెట్టకపోయినా, వారసత్వంగా వచ్చిన లంకంత కొంపా, ఓ పాతికెకరాల మాగాణీ విశ్వనాథం జీవితానికి ఢోకా లేకుండా చేసాయి. విశ్వనాథంది మాంచి పర్సనాలిటీ. చూడ్డానికి ఎస్వీ రంగారావులా భారీ విగ్రహం. పెళ్ళికాక మునుపు ఆ భారీతనమే చూసి సూరమ్మ అమ్మో అనుకుంది. తీరా పెళ్ళాయ్యాక కానీ విశ్వనాథం తీరు మింగుడు పడలేదు. సంసారమూ, సమస్యలతో పాటు నలుగురాడపిల్లల్ని సూరమ్మ నెత్తిన పెట్టి, సంసార సాగరంలోకి పీకల్లోతు నెట్టేసి, తనమానాన తను హాయిగా ఒడ్డున కూర్చొని చక్కగా బ్రతికేస్తున్నాడు.
ఉదయాన్నే కాలేజీకి వెళదామని సైకిలు బయటకి తీస్తూండగా, అయ్యగారు పిలుస్తున్నారంటూ తెగ సిగ్గు పడిపోతూ సత్తెవతి వచ్చి చెప్పింది.
విశ్వనాథం ఇంట్లో అద్దెకుండే అయిదు కాపురాల్లో నాదీ ఒకటి. సూరమ్మ వాటాతో కలుపుకొని మా ఆరు కుటుంబాలకీ సత్తెవతి గుత్తకి బేరమాడుకున్న ఏకైక పనిమనిషి. మొగుడు మిలటరీలో ఉన్నాడని అందరూ అంటారు కానీ ఎవడూ ఆ మానవాకారాన్ని చూసెరగడు. ఒక్కతే తొమ్మిదో తరగతి చదివే కొడుకుతో నారాయణ పేట సందు చివార్న గుడిసెల్లో ఉంటుంది. సత్తెవతి చామనచాయగా ఉన్నా మొహం మాత్రం భలే కళగా ఉంటుంది. ముఖ్యంగా ఆమె నుదుట రూపాయి కాసంత బొట్టు కొట్టచ్చినట్లుండి, పేరుకి పనిమనిషి కానీ చూడ్డానికీ ఎంతో శుభ్రంగా ఉంటుంది.
విశ్వనాథానికీ, సత్తెవతికీ మధ్య ఏదో ఉందనీ మా కూచిమంచి అగ్రహారంలో అందరూ చెవులు కొరుక్కుంటారు. సూరమ్మ నోరుకి భయపడి ఆమె ముందు ధైర్యంగా అనే సాహసం చెయ్యరు.
విశ్వనాథానికి తన పర్సనాలిటీతో ఆడవాళ్ళని ఆకట్టుకోవాలన్న తపన అతని చేష్టల్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రతీరోజూ ఉదయం చిన్న తుండుగుడ్డ వంటికి చుట్టుకొని నాతి పళ్ళెం దగ్గరే ఓ గంట సేపు స్నానం చేస్తాడు. ఆరు కాపురాల వాళ్ళకీ అదొక్కటే నుయ్యి. ఏ ఒక్క రోజయినా ఏవరైనా తనని చూసి మోహించక పోతారా అన్న భ్రమ విశ్వనాథానిది. ఆదివారమయితే చెప్పనవసరం లేదు. నూతిపళ్ళెంలో ముక్కాలి పీటేసుకొని వంటికి శేరు తైలం పట్టించి నలుగు పట్టి మరీ తలంటు భాగోతం నడుపుతాడు. పనిలో పనిగా సత్తెవతి చేత కుంకుడుకాయ పులుసు పెట్టించుకొని, వీపు రుద్దించుకుంటాడు. మధ్య మధ్యలో సినిమా జోకులు చెబుతూ ఓ మూడుగంటల తలంటు భాగోతం చూడ ముచ్చటగా నడిపిస్తాడు. ఇదంతా చూసి అందరూ రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. నిజం దేవుడికెరుక.
సాధారణంగా విశ్వనాథం ఏ ప్రాణినీ పలకరించడు. ఎప్పుడైనా అద్దె బకాయిలకి సూరమ్మే వచ్చి అడుగుతుంది. అలాంటిది నన్ను రమ్మనమని కబురు పంపాడంటే ఆశ్చర్యం వేసింది.
సందులోంచి వీధి వైపొస్తూండగా చూసి, అరుగు మీద పడక్కుర్చీలో కూర్చున్నవాడు కాస్తా నా దగ్గరకొచ్చాడు. ‘కాలేజీకా’ అంటూ పలకరించి, సూటిగా పాయింటు కొచ్చేసాడు.
“మా పెద్దది సీతాలుకి మీకు తెలుసున్న వాళ్ళ సంబంధమొకటుందని మీ ఆవిడ సూర్యంతో అందట కదా? ఆది కనుక్కుందామనీ సత్తెవతి చేత కబురంపాను,” బలవంతంగా నవ్వుతూ అన్నాడు. సూర్యం అని సూరమ్మని సంబోధిస్తే పుసుక్కున నవ్వొచ్చింది. ఊరంతా వాళ్ళావిడని సూరమ్మా అని సంబోధిస్తే ఈయనొక్కడూ ముద్దుగా సూర్యం అంటూ పలకరిస్తాడు. వచ్చే నవ్వుని బలవంతాన ఆపుకున్నాను.
“అవును. నాగరాజనీ వైజాగులో వుంటారు. వాళ్ళబ్బాయి నర్శీపట్నంలో టీచరుగా చేస్తున్నాడట. ఒక్కడే కొడుకు. మంచి సంబంధం. కుదిరితే బానే వుంటుంది.”
ఆ సంబంధం వివరాలు మరికొన్ని ఇచ్చి, కాలేజీకి ఆలస్యమవుతోందని చెప్పాను.
“ఇంతకీ వాళ్ళు మా వాళ్ళేనా? ఆరువేలా? కాదా?” నేను బయల్దేరుతూండగా అడిగాడు.
“ఆరువేలో, అరవై వేలో నాకు తెలీదండీ. మీ వాళ్ళేనని మాత్రం తెలుసు. నియోగులట. సంగీతం మాష్టారుకి దూరబ్బంధువులట. సాయత్రం తీరుబడిగా మాట్లాడతాను. వెళ్ళాలి,” అంటూ కాలేజీకి బయల్దేరాను.
“అలాగా, ఇవాళ సంగీతం క్లాసుకొచ్చినప్పుడు సుబ్బారావుని అడుగుతాన్లెండి,” అంటూ నాకు చెయ్యూపాడు.
విశ్వనాథం పెద్ద కూతురు సీతాలు. పదోతరగతి ఆడ గజనీ మహమ్మదులా దండెత్తింది. చదువెలాగూ అబ్బలేదని సంగీతం నేర్పిస్తున్నారు. ఆ సంగీతం నేర్పే సుబ్బారావు నాకు స్నేహితుడు. సుబ్బారావు మా అమలాపురంలో పేరున్న సంగీతం మాష్టారు. పెళ్ళికాని అమ్మాయిలకి సంగీతం నేర్పుతూ ఉంటాడు. చిన్న వయిలెను పుచ్చుకొని ఇంటికొచ్చి మరీ పాఠాలు చెబుతాడు. దాంతో అమ్మాయిల్ని బయటకి పంపక్కర్లేదన్న నెపంతో ఊరందరికీ ఈ సుబ్బారావే ఏకైక సంగీత విద్వాన్. మంచి గొంతుంది. చక్కగా వయిలెను వాయిస్తాడు. ఈ సంగీతమే అతనికి జీవనాధారం. చాలా ఓపిగ్గా సంగీతం నేర్పుతాడు. ఆడపిల్ల పెళ్ళికి సంగీతం ఒక క్వాలిఫికేషనవ్వడం సుబ్బారావు పాలిట వరమయ్యింది.
పాపం సీతాలుకి గత అయిదేళ్ళుగా పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. ఒక్కటీ కుదిరి చావడం లేదు. పైగా వీళ్ళకి శాఖల పట్టింపొకటి. బ్రామ్మలనే కాదు, వాళ్ళు నియోగులయ్యుండాలి. అందునా ఆరువేల నియోగులవ్వాలి. ఇలా చచ్చేటన్ని పట్టింపులున్నాయి. ఒకటీ అరా సంబంధాలు కుదిరినట్లే కుదిరి చెడిపోయాయి. సూరమ్మ గారికిదే పెద్ద దిగులు. ఇంతవరకూ చూసిన సంబంధాలన్నీ సూరమ్మే చొరవ వల్లే వచ్చాయి. విశ్వనాథానికివేమీ పట్టినట్లు కనిపించదు. పొలం వ్యవహారాలెలాగూ చూసి చావడు, కనీసం పిల్ల పెళ్ళయినా చేస్తాడాని తెలుసున్నవాళ్ళందరూ అనుకుంటారు. ఎవరేం అనుకుంటేనేం? నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటాడు.
ఏదో ఇంటికి ఏకైక పెద్ద మగాడని మాట వరసకి అడిగాడు కానీ మధ్యాన్నం ఇంటికొచ్చేసరికి సూరమ్మ రంగంలోకి దిగింది. మా ఆవిడని ఏకధాటిగా పీడించి పీడించీ వివరాలన్నీ లాగింది. నిజానికి తనకే వివరాలూ తెలీదు. ఇంటికి రాగానే మా ఆవిడ సూరమ్మగారి మీద కోపాన్ని నాపై మళ్ళించి విరుచుకు పడింది. నేను మాట్లాడుతానులే అని సర్ది చెప్పాను. భోజనమయ్యాక ఓ చిన్నగా కునుకు తీస్తున్నవాణ్ణి కాస్తా సీతాలు గాత్రానికి ఉలిక్కి పడి లేచాను.
మధ్యాన్నం మూడయ్యే సరికి మా అద్దెకొంపల లోగిల్లో కర్ఫ్యూ. ఎవరూ ధైర్యం చేసి నాలుగున్నర వరకూ బయటకు రారు. వచ్చారా సీతాల పాటకి బలయ్యారే! పాపం సీతాలు గాత్రంలో అన్నమయ్యా, త్యాగరాజూ వగైరాలు పిండిమరలో నలిగినట్లు నలిగిపోతారు. “మరుగేలరా? ఓ రాఘవా!” త్యాగరాజ కృతిని “మరకేలరా?” అని మొదలెట్టేసరికి నవ్వాపుకోలేక చచ్చాను. మా సుబ్బారావు గాడికి సహనం పాలెక్కువ. మరక కాదమ్మా, మరుగేలరా అని పాడాలిని ఒకటికి వందసార్లు చెప్పాడు. సీతాలు ఎవరి మాట వినదన్న సంగతి తెలిసి అలాగే వదిలేసాడు. సీతాలు పాటని విని చుట్టుపక్కల పిల్లలూ, అమ్మలక్కలూ తెగ నవ్వుకుంటారు. మా పెద్దాడయితే – “సీతాలు సంగీతం – మా పాలిట దౌర్భాగ్యం – సీతమ్మ గొంతిప్పితే – చెవినిండా నొప్పి ఖాయం” అంటూ సీతాలు సింగారం పాటకి పేరడీ కూడా కట్టాడు.
“ఏరా! వినడానికే మాకింత శిక్షలా ఉందే? నువ్వెలా తట్టుకోగలుగుతున్నావురా?” అని సుబ్బరావుని ప్రశ్నిస్తే పగలబడి నవ్వేసేవాడు.
“విశ్వనాథం తల్లి చాలా బాగా పాడేదట. మా అమ్మకి ఆవిడే సంగీతం నేర్పిందట,” అని ఎప్పుడూ చెప్పే మాటే చెప్పాడు. అచ్చం మా అమ్మ పోలికేనని విశ్వనాథమూ తెగ మురిసిపోడం మా అందరికీ తెలుసు. విశ్వనాథం తల్లే కనక బ్రతుకుంటే సీతాలు గొంతు నులిమి చంపేసేదని మా అందరి నమ్మకమూనూ.
లేచి మొహం కడుక్కుని నాలుగవుతూండగా సుబ్బారావుని కలవడానికి వీధి వైపు వచ్చాను.
నా అదృష్టం బావుండీ సుబ్బారావే కొత్త కృతి చెబుతున్నాడులా వుంది, పాడి వినిపిస్తున్నాడు. నేను లోపలికి వెళ్ళకుండా వీధరుగు దగ్గరే చతికిల బడ్డాను. సీతాలు పాడే విధానం చూసి అక్కడే కూర్చుని వింటున్న సత్తెవతి కొడుకు తెగ నవ్వుతున్నాడు.
సూరమ్మ అది చూసి -“నీకిక్కడ పనేంటిరా? దొడ్లోకెళ్ళి మొక్కలకి నీళ్ళెట్టు. నువ్వేం పట్టించుకోకమ్మా! అలగా జనానికి సంగీతం ఏం తెలుస్తుంది చెప్పు? వెధవని ఈ సారి ఇక్కడకి రానీ చెప్తాను,” అంటూ కూతురికి చెప్పడం స్పష్టంగా వినిపించింది నాకు. సత్తెవతి కొడుకు స్కూలయ్యాక ఆ మండువాలోగిల్లోనే ఓ మూల కూర్చొని హోం వర్కు చేసుకుంటాడు. మధ్యలో సూరమ్మ పురమాయించిన చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు.
పాఠం ముగించే నన్ను చూసి బయటకు వస్తూండగా సూరమ్మ తగులుకుంది. రేపే వైజాగు వాళ్ళకి ఉత్తరం రాస్తాననీ, పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తాననీ మాటిచ్చి అక్కడనుండి తప్పించుకున్నాను. సుబ్బారావునీ ఒకటికి పదిసార్లు ఆ కుటుంబం వివరాలడిగింది సూరమ్మ.
సుబ్బారావు దగ్గర వైజాగు వాళ్ళ అడ్రసు తీసుకొని నా స్నేహితుడికి సూరమ్మ సంబంధం గురించి ఆ రాత్రే ఉత్తరం రాసాను.
ఓ రెండు వారాల తరువాత వైజాగు సంబంధం వాళ్ళు పెళ్ళి చూపులకొస్తామని కబురంపారు. పెళ్ళిచూపులనగానే రెచ్చిపోయి మరీ సంగీతం ప్రాక్టీసు చెయ్యడం మొదలు పెట్టింది సీతాలు. నాకు తెలిసి నా వైజాగు మిత్రుడింట్లో సినిమా పాటలు కూడా వినరు. అలాంటిది శాస్త్రీయ సంగీతం అంటే ఏమంటారోనని భయపడి చచ్చాను. వాళ్ళకెలా నచ్చచెప్పాలని నానా హైరానా పడ్డాను. ఇహ రేపే పెళ్ళివారొస్తారనగా దేవుడు నా నెత్తి మీద పాలు పోశాడు. సీతాలుకి జలుబు చేసి గొంతు పోయింది. అదే ఆమె పాలిట వరమయ్యింది. పెళ్ళి కొడుకు నచ్చిందన్నాడు. అంతే! క్షణాల్లో తాంబూలాలూ, పెళ్ళి ముహూర్తాలూ పెట్టేసుకున్నారు. కట్నాల మాటలూ అవీ సూరమ్మే మాట్లాడింది కానీ, విశ్వనాథం నోరిప్పితే ఒట్టు. మొత్తానికెలాగయితేనే సీతాలు మా ఆరు వాటల వాళ్ళనీ దయతో కరుణించి అత్తారింటికి వెళ్ళడానికి సమాయత్తపడింది. సంగీతాన్ని ఎంతగానో మిస్సవుతాననీ తన ముందు భోరున ఏడ్చిందని సుబ్బారావు చెప్పాడు. ఇన్నాళ్ళూ సీతాలు సంగీతం విని మేమూ అదే చేసే వాళ్ళం.
సూరమ్మ గారింట్లో సంగీతం మానేయడం సుబ్బారావుకీ బాధ కలిగింది. ఆరేళ్ళుగా చెబుతున్నానురా, అలవాటయిపోయిందని నా దగ్గర కాస్త బాధ పడ్డాడు. నిజం చెప్పద్దూ, నాకయితే వాణ్ణి చూసి జాలేసింది. తినగ తినగ వేము వరస తయారయ్యాడని అనుకున్నాను.
సీతాలుకి పెళ్ళయి కాపురానికి వెళిపోయింది. మా ఆరువాటాల వాళ్ళకీ కర్ఫ్యూ సడలింపు వచ్చినంత ఆనందం వేసింది.
అది క్షణ భంగురమని తెలవడానికట్టే కాలం పట్టలేదు. శ్రావణమాసమనీ, నోములనీ, బెంగనీ, పండగలనీ మొదటి ఆర్నెల్లూ పుట్టింట్లోనే ఉండిపోయింది. సీతాలు మొగుడుకీ ఇల్లరికం కాకపోయినా రమారమి అదే తీరులో ఇక్కడ తిష్ట వేసేవాడు. మామా అల్లుళ్ళకి బాగానే కుదిరింది. ఆదివారం నలుగు కార్యక్రమంలో అల్లుడూ వచ్చి చేరాడు. ఇదంతా సూరమ్మ చూసి చూడనట్లు వ్యవహరించేది. మరీ చికాకు వస్తే సత్తెవతి మీద గయ్యిమని లేచేది.
సీతాలు పుట్టింటి పంచనే వుండడంతో సుబ్బారావుకి మరలా సంగీతం క్లాసులు మొదలయ్యాయి. సుబ్బారావూ సంతోషించాడు, నాలుగు డబ్బులొస్తాయని ఆనంద పడ్డాడనుకున్నాను.
ఓ సారి సీతాలు బంగారు వంకీలు పోయాయని మా లోగిల్లో పెద్ద కలకలం రేగింది. చివరికి అది కాస్తా సత్తెవతి మీద పడింది. ఇదే అదననుకొని సూరమ్మ సత్తెవతింట్లో సోదా చేయించి సత్తెవతే దొంగిలించిందనీ నేరం మోపి పనిలో నుండి మానిపించేసింది. పన్నెండేళ్ళుగా మా ఆరువాటాల వాళ్ళకీ సత్తెవతొక్కతే పనిమనిషి. ఎప్పుడూ చెంచా కూడా పోవడం ఎరగరెవరూ. అలాంటిది బంగారం దొంగిలించిందంటే నమ్మ బుద్ధి కాలేదు. సత్తెవతి తనకే పాపం తెలీదని లబో దిబో మంది. సత్తెవతింట్లోనే దొరికాయని చెబుతూ సూరమ్మ సత్తెవతిని నానా మాటలూ అంది. అసలు విషయం వేరేనని అందరికీ తెలుసు. మేమవరమూ కూడా సత్తెవతిని పనికి పెట్టుకోకూడదనీ, కాదని చేస్తే ఇల్లు ఖాళీ చెయ్యమని మా అందరికీ తెగేసి చెప్పడంతో మేమెవరమూ నోరెత్త లేదు. వేరే పనిమనిషిని చూసుకున్నారందరూ!
నెల తిరక్కుండా ఓ రోజున మధ్యాన్నం భోజనం చేసి కునుకు తీద్దామని మేడమీద కెళ్ళిన విశ్వనాథం ఇహ కిందకి దిగలేదు. నిద్రలోనే గుండాగి పోయాడని డాక్టర్లు చెప్పారు. ఏనాడు పల్లెత్తు ముక్కనలేదనీ, ఎంతో క్రమశిక్షణతో జీవితాన్ని గడిపాడనీ సూరమ్మ భోరుమంటూ ఏడ్చింది.
విశ్వనాథం పోయినప్పుడు అందరూ వచ్చారు కానీ, సత్తెవతి రాలేదు. వస్తుందని నేనూ, సుబ్బారావూ అనుకున్నాం. అవమానం అభిమానం కంటే కర్కశమైంది. దానికి బంధుత్వాలూ, స్నేహాలూ అన్న దయా దాక్షిణ్యాలుండవు.
విశ్వనాథం పోయి పదో రోజు రాకముందే సత్తెవతి మొగుడు మిలటరీ యాక్సిడెంటులో పోయాడని మా ఆవిడ వార్త మోసుకొచ్చింది. వుండి పట్టించుకోని వాడు వుంటేనే, పోతేనే? నాకు తెలిసీ ఈ కూచిమంచి అగ్రహారంలో ఎవరూ సత్తెవతి మొగుణ్ణి చూళ్ళేదు. అసలు సత్తెవతి కొడుకయినా చూసాడాని అందరి అనుమానమూ!
సత్తెవతి మొగుణ్ణి చూడకపోయినా పోయాడని తెలిసి బాధ కలిగింది. ముఖ్యంగా సత్తెవతి నుదుట రూపాయి కాసంత బొట్టు గుర్తొచ్చి మరింత బాధ కలిగింది.
ఓ ఆర్నెల్ల తరువాత ఇంకో కొత్త విషయం తెలిసింది. సత్తెవతి కొడుకు పదో తరగతి ఫస్టు క్లాసులో పాసయ్యాడనీ, వాడికి కాకినాడ పోలిటెక్నిక్ కాలేజీలో సీటొచ్చి సత్తెవతి కాకినాడ మకాం మారుస్తోందనీ సుబ్బారావు చెప్పాడు. ఈ మధ్యకాలంలో మాకెవరికీ సత్తెవతెప్పుడూ తారసపడలేదు. సత్తెవతి కొడుకుని సూరమ్మింట్లో చూడ్డమే! నేనంటే వాడికెందుకో భయం. ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు.
ఓ సారి వేరే పనిమీద అంబాజీపేట వెళ్ళాల్సొచ్చింది. నా తోటి లెక్చరరు స్కూటరు అరువు తీసుకొని వెళ్ళాను. వెళుతూ వెళుతూ తోడుగా సుబ్బారావునీ తీసుకెళ్ళాను. పని ముగించుకొని తిరిగొస్తూండగా బస్టాండు దగ్గరకొచ్చే సరికి కమలేశ్వర టాకీసు దారిన వెళదామని సుబ్బారావన్నాడు. ఆ రోడ్డు గతుకుల రోడ్డు. నా కంత ఇష్టం లేదు. నన్ను బలవంతం చెయ్యడంతో సరేనన్నాను. కమలేశ్వరా టాకీసు వెనకాలనుండి నారాయణపేట మీదుగా కూచిమంచి అగ్రహారానికి వేరే దారుంది. తీరా నారాయణ పేటొచ్చాక, వేరే దారిన పోనివ్వమన్నాడు. నాకా దారే తెలీదు. అక్కడన్నీ గుడిసెలూ, పాకలూ ఉన్నాయి. అటుగా నేనెప్పుడూ వెళ్ళలేదు కూడా.
ఒక పాక ముందు స్కూటరాపమన్నాడు. స్కూటరు అలికిడికి ఒకామె బయటకొచ్చింది. ఆమె సత్తెవతని గుర్తుపట్టడానికి ఆట్టేసేపు పట్టలేదు. నుదుట బొట్టు లేకుండా ఆమెను చూళ్ళేక పోయాను. మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయింది. లోపలికెళ్ళి చిన్న బల్లొకటి తీసుకొచ్చింది. ఇద్దరం కూర్చున్నాం. ఈలోగా కొడుకొస్తే వాణ్ణి లోపలకి పిలిచి ఎక్కడికో పంపించింది.
“మీ ఆయన పోయాడని విన్నాం. బాధ కలిగింది. అంతా ఆ దేవుడి ఘటన. పోన్లే, మీ వాడికి మంచి చదువస్తోంది. బాగా చదివించు. బాగా పైకొస్తాడు.” అంటూ సుబ్బారావన్నాడు. నేనేం మాట్లాడాలో తెలీక మౌనంగానే ఉండిపోయాను. మా వాళ్ళందర్నీ పేరుపేరునా అడిగింది సత్తెవతి.
ఈలోగా సత్తెవతి కొడుకు రెండు గోల్డుస్పాట్ డ్రింకులు పట్టుకొచ్చాడు.
“మీలాంటి పెద్దలు మా బోటోండ్ల ఇళ్ళకు రావడం గొప్ప విషయమయ్యా! రేపే కాకినాడ వెళిపోతున్నాం. సామానంతా మూటకట్టేసాం. టీ ఇద్దామన్నా ఇంట్లో..” అంటూ బాధగా అంది.
“చ! చ! నువ్వు కాకినాడ వెళుతున్నావని తెలిసే చూడ్డానకని వచ్చాం. మీ వాణ్ణి మాత్రం చదివించు. ముఖ్యంగా సంగీతం కూడా నేర్పించు. మీ వాడు హైస్కూలు పోటీల్లో చాలా బాగా పాడాడు. చూసి చాలా ముచ్చటేసింది,” అనంటూ, పక్కనే ఉన్న సత్తెవతి కొడుకుని చూస్తూ – ” సంగీతం నేర్చుకో, ఇంకా బాగా పాడగలుగుతావు. నీకు మంచి గాత్రముంది,” అంటూ అభినందించాడు సుబ్బారావు.
సత్తెవతి కొడుకు అలాగేనని తలూపాడు. నేనూ బాగా చదువుకోమనే చెప్పాను. సత్తెవతిని ఒకసారి మా ఇంటికి రమ్మనమని చెప్పాను. సరేనంది కానీ, మా ఇంటి వైపు రాదని నాకూ తెలుసు.
“మరి నీకు కాకినాడలో రోజూ గడవడానికి…?” సుబ్బారావు ప్రశ్న పూర్తి కాకుండానే – “నా పెనివిటి పిల్లాడి చదువుకని కొంత సొమ్ము బేంకులో దాచి ఇచ్చాడయ్యా! ఆ వడ్డీతో బతికేస్తాం. బెంగ లేదు. నేనూ అక్కడే ఏదైనా పని చూసుకుంటాను,” అని సత్తెవతి జవాబిచ్చింది.
పరవాలేదు, సత్తెవతి మొగుడు దూరాన్నున్నా వీళ్ళకి కాస్తయినా ఆసరా చూపించాడనుకున్నాను.
అంతవరకూ ఎక్కువ మాట్లాడకపోయినా, చివర్లో సత్తెవతికి ఒకటి చెప్పాలనిపించింది.
“నాకెందుకో సూరమ్మ నీ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించిందనిపించింది. నువ్వుండగా మొత్తం ఆరువాటాల్లో చిల్లి గవ్వ కూడా పోలేదు. అలాంటిది.. నువ్వు…” ఇహ మాట ముందుకెళ్ళలేదు నాకు.
సత్తెవతి నా మాటలకి తలెత్తి నాకేసి చూసి వేంటనే తలదించేసుకుంది. నాకెందుకో నోరు జారానా అనిపించింది.
“పరవాలేదయ్యా! అందులో సూరమ్మ తప్పూ లేదు. ఏ ఆడదానికయినా తన జీవితం పాడయినా పరవాలేదు. కానీ కళ్ళెదురుగుండా కూతురు కాపురం కూలిపోవడం సహించదు. ఆవిడ అల్లుడు నా మీద మోజు పడితే లెంపకాయొకటిచ్చాను. నేనే అతన్ని రెచ్చగొట్టానని సీతాలుకెక్కించాడు. సూరమ్మ అతన్నేవీ అనలేదు. ఇహ లోకువగా మిగిలింది నేనే కదా బాబయ్యా!” మెల్లగా తలదించుకునే అంది. నేనేమీ పొడిగించలేదు.
“నువ్వెలాంటిదానివో మాకందరికీ తెలుసు. నువ్వయినా నిజం చెప్పాల్సింది. విశ్వనాథం ఏమీ జోక్యం చేసుకోకపోవడం మాత్రం మా అందరికీ ఆశ్చర్యం కలిగించింది,” సుబ్బారావన్నాడు.
చిన్నగా నిట్టూరుస్తూ, “ఆ మడిసికి ఎప్పుడేం పట్టిందనయ్యా? ఆ యింట్లో ఎప్పుడు నోరెత్తేరని బాబయ్యా? కొంతమందంతే!” అంది.
“వాళ్ళంతా నీమీద నేరం మోపినప్పుడు, నువ్వూ అసలు జరిగింది అందరికీ చెప్పాల్సింది,” సుబ్బారావు రెట్టించాడు.
“చాన్నాళ్ళ క్రితం నేను పనికొచినప్పుడు సీతాలు ఎనిమిదేళ్ళ పిల్ల. చిన్నప్పుడు నీళ్ళోసి, జడవేసిన చేత్తో ఆమెను బజారుకీడ్చడానికి మనసెలా వస్తుందయ్యా? వాళ్ళకి పరువు ముఖ్యం. ఎవరి సంస్కారం వారిదయ్యా!” అనేసరికి ఏమనాలో తెలీలేదు.
ఆమె జవాబు విని నేనూ, సుబ్బారావూ ఒకరి మొహాలొకరు చూసుకున్నాం. కొంతసేపయ్యాక వెళ్ళొస్తామని చెప్పి బయల్దేరాం.
“ఇన్నాళ్ళూ సీతాలు ఘోరంగా పాడుతున్నా సంగీతం ఎలా చెప్పగలిగాననీ మీరందరూ అడిగివారు. నేను వెళ్ళింది సీతాలు కోసం కాదు. సత్తెవతి కోడుకు కోసం. వినికిడితో సంగీతం పట్టేసేవాడు. ఓ సారి హైస్కూలు పాటల పోటీలకి నన్ను జడ్జిగా రమ్మన్నారు. అప్పుడు వీడు పాడిన త్యాగరాజ కృతి విని దిమ్మ తిరిగింది నాకు. నేను సీతాలుకి చెప్పింది విని ఎక్కడా తాళం తప్పకుండా, ఒక్క అపస్వరం లేకుండా పాడడం చూసి ఆశ్చర్యపోయాను. విడిగా వాడికి పాఠాలు చెబుతానంటే సూరమ్మ ఊరుకోదు. పైగా సత్తెవతి మీద గయ్యిమంటుంది. సీతాలుకి పాఠం నెపంతో వాడికీ చెబుదామని క్రమం తప్పకుండా వెళ్ళేవాణ్ణి. నే పాడింది వినే పట్టేసేవాడు. సీతాలు పెళ్ళయి వెళుతోందంటే, మీ అందరికంటే నేనే ఎక్కువ ఇదయ్యాను, ముఖ్యంగా ఆ పిల్లాడికి సంగీతం పోతుంది కదాని. అందుకే సంగీతం మానద్దని చెప్పడానికే ఇలా వచ్చాను,” అంటూ మనసులో మాట చెప్పాడు. ఈ సారి విస్తుబోవడం నావంతయ్యింది.
కొంచెం దూరమొచ్చాక మరలా స్కూటరు వెనక్కి తిప్పమన్నాడు సుబ్బారావు. తన చేతి సంచీ లోంచి త్యాగరాజ కృతులు పుస్తకం బయటకు తీసాడు. ఆ పిల్లాడికివ్వడం మర్చిపోయానంటూ మరలా సత్తెవతింట్లోకి వెళ్ళాడు.
నేను బయటే నుంచుండిపోయాను. అయిదు నిమిషాల తరువాత బయటకొచ్చాడు. ఎందుకో వాడి మొహంలో ఏదో కలత కనిపించింది.
“ఏవయ్యిందిరా?” ప్రశ్నించాను.
“ఆ పుస్తకం ఇచ్చి వెనక్కి వస్తూండగా అక్కడొక ఫొటో చూసి కంగారు పడ్డానురా! అది సత్తెవతి పెళ్ళి ఫొటో! అందులో.. అందులో..” అంటూ ఆగిపోయాడు.
“ఏంటో, సరిగా చెప్పి తగలడు.. ఈ కంగారేవిటి?” అంటూ విసుక్కున్నాను.
“అందులో సత్తెవతి పక్కనున్నది, విశ్వనాథం!” నమ్మలేనట్లుగా చెప్పాడు.
“అంటే, ఈ పిల్లాడు…” నాకూ మాట రాలేదు.
అవునన్నట్లు తలూపాడు. విశ్వనాథం తల్లి బాగా పాడేదనీ, ఆమె పోలికలు సీతాలుకొచ్చాయనీ అనుకోవడం గుర్తొచ్చింది. సత్తెవతి మొహమ్మీద రూపాయి కాసంత బొట్టు గుర్తుకొచ్చింది. మౌనంగా ఇద్దరమూ ఇంటి ముఖం పట్టాం.