రావణుడి తలలు

‘రావణాసురుడి పది తలలకూ, ఒకేరకం మొహం వుంటుందా? లేక ఒక్కో తలకూ ఒక్కో రకం మొహం వుంటుందా?’

ఎప్పటినుంచో నన్ను వేధిస్తున్న ప్రశ్న! ఆరో తరగతిలో వున్నప్పుడు రామాయణం పాఠం చెబుతున్న సత్యవతి టీచర్‌ని ఇదే ప్రశ్న అడిగాను. తనకు తెలియదన్నది. టీచరుకు తెలీని విషయాలు కూడా వుంటాయంటే నమ్మే వయసు కాదది. అందుకే అదే ప్రశ్న అడిగి అడిగి ఆ పీరియడంతా గోడ కుర్చీ వేశాను. స్కూలు వదిలిపెట్టేక, ఇంటికి వెళ్ళే దారిలో కూడా రావణాసురుడి తలల గురించీ, మొహాల గురించీ ఆలోచించాను.

ఇదే ప్రశ్నను ఇంట్లో అన్నయ్య నడిగితే, కొంచెం సేపు ఆలోచిస్తున్నట్లు మొహంపెట్టి ‘అసలు రావణుడికి పది తలలు లేవన్నాడు’. నేనింకేదో అడగబోతున్నానని గ్రహించి -ఇంకా మాట్లాడితే అసలు రావణుడే లేడు పొమ్మన్నాడు. నాన్న నడగాలంటే భయం. అమ్మకిలాంటి విషయాలు తెలియవని నమ్మకం.

ఆ రోజుల్లో సుజాత నెన్నిసార్లు అడిగేదాన్నో ఇదే ప్రశ్న!


సుజాత వాళ్ళుండేది మా ఇంటి ప్రక్కనున్న ఇంట్లోనే. ఇద్దరం చిన్నప్పటినుంచీ ఒకే స్కూలు, ఒకే క్లాసు, ఒకే బెంచీ.

నాకంటే చురుకైన పిల్లని దానికి పేరు. క్లాసులో కూడా అన్ని సబ్జెక్టుల్లో నాకంటే మంచి మార్కులు వచ్చేవి. ఇద్దరం పక్క పక్క ఇళ్ళలో ఉంటూ, ఒకే స్కూలులో, ఒకే బెంచీలో కూర్చుని ఒకే పాఠాలు చదివినా – తనకు నాకంటే ఎక్కువ మార్కులు రావడం నాకసూయ కలిగించేది. హైస్కూలు చదువైపోయాక, ఇంటర్మీడియెట్ కూడా కలిసే చదివాం. డిగ్రీలో మాత్రం మేము విడిపోక తప్పలేదు.

సుజాత వాళ్ళ మామయ్య వాళ్ళింట్లో వుండి చదువుకునేందుకు హైదరాబాదు వెళ్ళింది. నేనేమో మా ప్రక్క ఊళ్ళో డిగ్రీ కాలేజిలో చేరాను. వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు మా ఊళ్ళోనే ఉండేవాళ్ళు. ప్రతిసారీ శలవులకు మా ఊరు వచ్చేది.

ఒక దసరా శలవుల్లో అనుకుంటాను సుజాత చాలా ఉత్సాహంగా కనిపించింది. మనం బాగా ఎరిగున్న వారు ఎప్పుడు ఉత్సాహంగా ఉన్నారో, ఎప్పుడు డల్ గా ఉన్నారో కనుక్కోవడం ఏమంత కష్టం కాదు.తన కొత్త ఉత్సాహానికి కారణం నేనడక్కుండా, తనే చెప్పుకొచ్చింది. తనిప్పుడు చదివే కాలేజీలో, తనే అందరికన్నా అందంగా వుంటుందట. తన వెనుక అబ్బాయిలు చాలా మంది పడుతున్నారట. కొంతమంది కుర్ర లెక్చరర్లతో బాటు, ఒకరిద్దరు సీనియర్ లెక్చరర్లచూపుల్లో కూడా ప్రేమ సంకేతాలు కనిపిస్తున్నాయట. అప్పటికే డజనుకు పైగా ప్రేమ లేఖలు కూడా అందాయట. ఇలా స్టూడెంట్సూ, లెక్చరర్లు తన వెనుక పడ్డం చిరాగ్గా ఉన్నా, మిగతా అమ్మాయిలు తన వంక అసూయగా చూడ్డం తనక్కొంత ఆనందాన్నిస్తూందని, మొత్తానికీ ఈ వ్యవహారం చాలా థ్రిల్లింగ్ గా ఉందనీ చెప్పింది.

నేను చదివే కథలు, చూసే సినిమాలు గుర్తొచ్చాయి. సుజాతనప్పుడు పరిశీలనగా చూసేను. తనలో చాలా మార్పులొచ్చాయి. అందమూ, ఆకర్షణ పుష్కలంగా వున్నట్లనిపించింది. మరోసారి సుజాతంటే కుళ్ళు పుట్టింది. మా క్లాసులో అబ్బాయిలు కూడా నావైపు చూస్తున్నట్లు అనిపించేది నాకు. సుజాతంత అందంగా, ఆకర్షణీయంగా లేకపోయినా నేనేమంత అనాకారిని కాదు. ఎందుకో తెలియదు కానీ, అబ్బాయిలు నా వైపు ప్రేమగానో, ఆరాధన తోనో చూస్తున్నారనే ఊహ కల్గేదికాదు నాకు. అందుకే డిగ్రీలో చేరిన మూణ్ణెళ్ళ తర్వాత నుంచి, అల్లాంటి ఆలోచనలకు దూరంగా ఉండడం అలవాటైపోయింది.

క్లాస్మేట్స్ ఎవరైనా అబ్బాయిల గురించి మాట్లాడితే, ఉదాశీనంగా నవ్వి ఊరుకునేదాన్ని. మళ్ళీ ఈ వేళ సుజాత చెప్పింది విన్నాక – నేను చాలా దురదృష్టవంతురాలిననిపించింది. అమ్మ మేమున్న గదిలోకి రావడంతో టాపిక్ మార్చాను.


సుజాతతో మాట్లాడిన మర్నాటి నుండి నా అలంకరణపై శ్రద్ద పెరిగింది. మామూలుకంటే ఎక్కువ సేపే అద్దం ముందు గడుపుతున్నాను. క్లాసులో అబ్బాయిలు నా వైపు చూస్తున్నారో లేదో తెలుసుకోడానికి, నేనే వాళ్ళను చూడ్డం మొదలెట్టాను. అందరినీ ఆకర్షించేందుకు గల మార్గాల కోసం అన్వేషించడం ఆరంభించాను. నాలో వస్తూన్న మార్పులను ముందుగా గమనించింది మా అన్నయ్యే! గమనించి నా దగ్గర ఈ విషయం గురించి ప్రస్తావించింది అంటే బాగుంటుందేమో!!

“ఏం, చిట్టీ! ఈ మధ్య నీలో మార్పు కనిపిస్తోంది?” అనడిగాడో రోజు.

“ఏం మార్పు?” అడిగాన్నేను, తనడుగుతోంది ఏ విషయమో ఖచ్చితంగా తెలియక.

“నీకు తెలియదా?” అని ఆగి మళ్ళీ నవ్వుతూ “ఈ మధ్య కొంచెం కొత్తగా కనిపిస్తుంటే…”అన్నాడు.

“కొత్తగా అంటే?”

“అదే ఈ మధ్య పౌడర్ డబ్బాలు… అవీ త్వరగా అయిపోతుంటేను” అన్నాడు నవ్వుతూ.

ఎంత నవ్వుతున్నా, వాడి మొహంలో కొంచెం ఇబ్బంది కనిపించింది నాకు. నేనేమీ మాట్లాడకుండా వాడి కళ్ళలోకి సూటిగా చూసేను. మళ్ళీ వాడేదో మాట్లాడబోతూండగా, అమ్మ అక్కడకొచ్చింది. ఏమిటన్నట్లు మా వైపు చూసింది. అప్పటికే నా కళ్ళలో సన్నటి నీటి పొర. ఎందుకొచ్చిందో కూడా తెలీదు.

“నావలన ఇంటి ఖర్చులు పెరుగుతున్నాయంటున్నాడు వీడు” అన్నాను అమ్మ వైపు తిరిగి “అది కాదమ్మా…” అని అన్నయ్య అమ్మకు వివరణ ఇస్తుండగా, నేను నా గదిలోకి వెళ్ళిపోయాను. నేనక్కడే వుంటే అన్నయ్య హర్ట్ కాకుండా చూడొచ్చు! కానీ…

గదిలోకి వెళ్ళాక చాలా బాధేసింది. వాడు నాకంటే పెద్దవాడు. చిన్నప్పట్నుంచీ నన్నెంతో ఆప్యాయంగా చూశాడు. ఈ రోజు కూడా పలకరించి, సరదాగా ఏదో అనబోతే – వాడినన్యాయంగా గాయపరిచాను. మంచమ్మీద పడుకుని, దుప్పటి కప్పుకుని చాలా సేపు ఏడ్చాను.

నాన్న అన్నయ్యపై కేకలేస్తున్నాడు, నా విషయమ్మీదే. వాడేదో సర్ది చెప్పబోతున్నాడు. గభాల్న నా గదిలోనుంచి బయటకొచ్చి, అన్నయ్య తప్పేమీ లేదని, నేనే వాడి పట్ల తప్పుగా ప్రవర్తించానని చెప్పాలనిపించింది. గదిలోకి ఎవరో వచ్చిన అలికిడి.

నా ముఖం మీద దుప్పటి తీసి, “ఐ యాం సారీ చిట్టీ. రియల్లీ సారీ! లే లేచి త్వరగా తయారవ్వు. నిన్నీ రోజు సినిమాకు తీసుకెళతా” అన్నాడన్నయ్య. నేను వాడిని హర్ట్ చేస్తే, వాడెందుకు నాకు సారీ చెబుతున్నాడో, నాకర్ధం కాలేదు. కన్నీళ్ళు ఉబికాయి. వాడి మొహం లోకి చూసే ధైర్యం లేక, కళ్ళు మూసుకునే దుప్పటిని మొహమ్మీదకు లాక్కుని, గోడ వైపు తిరిగాను.

ఆ సంఘటన జరిగినప్పటినుంచీ ఇంట్లో వాళ్ళు నాతో జాగ్రత్తగా మసలుకొంటున్నారు. ఒకరకంగా నా మీద ఓ కన్నేసి వుంచారని చెబితే బాగుంటుందేమో! అన్నయ్య నాతో మంచిగా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా – నేనే దూరంగా జరిగేదాన్ని. ఒక్క అన్నయ్యతోనేంటి, అందరికీ దూరంగా జరిగేదాన్ని.


డిగ్రీ ఫైనలియర్ పరీక్షలైపోయాయి.

ప్రక్క ఇంట్లో సుజాత వచ్చిన సందడి వినిపిస్తోంది. తననెప్పుడు కలిసినా క్రొత్త వ్యక్తిని కలిసిన భావన కలుగుతుంది నాకు. బహుశా తనెప్పుడొచ్చినా క్రొత్త విషయాలు మోసుకు రావడం వల్ల, పాత విషయాలు మాట్లాడక పోవడం వల్లనేమో! అది నాతో అన్ని విషయాలూ దాపరికం లేకుండా చెప్పినా – నేనెందుకో నా గురించి తనకేమీ చెప్పేదాన్ని కాదు.

“హాయ్ కిరణ్… ఎలా వున్నావ్? శారద వుందా?” అంటూ, అన్నయ్యను పలకరించి, వాడి సమాధానం వినకుండానే, నా గదిలోకి దూసుకొచ్చింది సుజాత. తనింత ఉత్సాహంగా వస్తోందంటే, చాలా విశేషాలే వుండుంటాయ్.

చదువుతున్న వీక్లీని ప్రక్కన పెట్టి “ఎంత సేపౌతోందే వచ్చి?”అడిగాను నేను.

“ఓ పావుగంటౌతోంది. ఎలా రాసేవ్ పరీక్షలు?”అడిగింది.

“బాగానే రాశా. నువ్వెలా రాసేవ్?”

“ఏదో అలా అలా. ఇంకేమిటి విశేషాలు?”అడిగింది నన్ను. సుజాత అలా ఇంకేమిటి విశేషాలు అని అడిగిందంటే తను చాలా విశేషాలు చెప్పబోతుందన్నమాట.

“ఏమున్నాయ్. అంతా మామూలే. నీ సంగతులేమిటి?” పాత సమాధానమే నాది.

“నా సంగతులా!? అబ్బో చాలానే వున్నాయ్. అదిగో నాకు తెల్సు – నువ్వేం అడగ బోతున్నావో. రాకేష్ గురించే కదూ?” అంది. నేను నవ్వి ఊరుకున్నాను.

“నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటే, వాళ్ళ పెద్ద వాళ్ళను మాట్లాడడానికి మా ఇంటికి పంపమన్నాను. అందరికీ ఇష్టమైతే, ఇద్దరి చదువులూ అయిపోయి ఉద్యోగాల్లో స్థిరపడ్డాక పెళ్ళి చేసుకుందామని చెప్పాను”

చాలా ఆశ్చర్యమేసింది నాకు.

డిగ్రీ ఫైనలియర్ మొదలైన దగ్గర్నుంచీ, సుజాత ఎప్పుడూ రాకేష్ గురించే చెప్పేది నాకు. అతడి తెలివితేటల గురించి, వాళ్ళ కున్న ఆస్తిపాస్తుల గురించి, వాళ్ళ ఊర్లో వాళ్ళ ఫేమిలీకి గల పేరుప్రతిష్టల గురించి… చాలా గొప్పగా చెప్పేది. రాకేష్‌కు తనంటే చాలా చాలా ఇష్టమని చెప్పేది. నువ్వూ అంతగా రాకేష్‌ను ప్రేమిస్తున్నావా అని అడగాలనిపించింది. సమాధానంగా, తను కూడా అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నానని చెబితే నేను వినలేననిపించింది. ఇలా చదువుకునేప్పుడు ప్రేమించుకోడాలు – కేవలం కథలకు, సినిమాలకు పరిమితం. హీరోలు, హీరోయిన్లూ మాత్రమే అలా చేయగలరు – చేయాలి. మా ఇంటి ప్రక్కనే, చిన్నప్పటినుంచీ నాతో కలిసి పెరిగిన అమ్మాయి ‘హీరోయిన్’ అంటే నా మనసొప్పుకోవడంలేదు.

అందుకేనేమో నేనెప్పుడూ సుజాతనా ప్రశ్న అడగలేదు!

“పెద్దవాళ్ళకు ఇష్టం లేకపోతే?” అడిగాన్నేను. ఎందుకు… ఎందుకు నేనన్నీ నెగెటివ్‌గా ఆలోచిస్తాను?

“ఇష్టం లేకపోతే మేరేజి కాన్సిల్,” అంది చాలా కాజువల్గా. నాకు చాలా ఆశ్చర్యమేసింది.

“మరి ఇన్నాళ్ళూ మీ మధ్య ప్రేమా – అదీ…” అడిగాన్నేను.

“తన విషయం నాకు తెలియదు గానీ – నాకెప్పుడూ తనను ప్రేమిస్తున్నాననిపించలేదు. తను నాకో మంచి ఫ్రెండ్ అంతే! ఇంకో విషయం చెప్పనా? చాలా చోట్ల ప్రేమ గురించి విన్నా, చదివినా కూడా – నాకిప్పటివరకు ప్రేమంటే ఇదీ అని తెలియలేదు. ఇంక నేను తనను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలను? రాకేషుక్కూడా అంతేననుకుంటాను – గాఢమైన స్నేహాన్ని ప్రేమనుకుంటున్నాడేమో!? చూద్దాం ఏమి జరుగుతుందో?” అంది సుజాత. ఈ విషయాలు చెప్పేప్పుడు తనలో ఎలాంటి ఎగ్జయిట్మెంటూ కనిపించలేదు. చాలా మామూలుగా చెప్పింది.

సుజాత, రాకేషుల పెళ్ళికి పెద్దవాళ్ళంగీకరించారని తెలిసి, సుజాతంటే నాకు విపరీతమైన ఈర్ష్యకల్గింది. సుజాత తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోవడంలో నాకేమంత ఆశ్చర్యం కలుగలేదు. ఎందుకంటే చిన్నప్పటినుంచి నాకు తెలిసి ఏ ఆడపిల్లకూ వుండనంత స్వేచ్చ సుజాతకుండేది. మా ఇంట్లో అయితే, చిన్నప్పటి నుంచీ – నాకు కొన్ని పరిమితులూ, నా పైన కొన్ని ఆంక్షలూ ఉండేవి. సుజాతకైతే అలాంటివేమీ లేవు.

ఏదోలా వాళ్ళ మధ్య గానీ, వాళ్ళ పెద్ద వాళ్ళ మధ్య గానీ గొడవలొచ్చి, పెళ్ళి ఆగిపోతే బావుణ్ణనిపించింది.


ఉస్మానియా యూనివర్సిటీలో పిజీలో జాయినయ్యాను నేను. సుజాత, రాకేష్ కూడా అక్కడే జాయినయ్యారు. నేనూ హైదరాబాదు వస్తున్నానని తెలిసి సుజాత చాలా ఆనందపడింది. ఇద్దరం హాస్టల్లో ఒకే రూములో వుందామంది. మళ్ళీ చిన్నప్పటి రోజులొచ్చాయని సంబరపడింది. సుజాతకు కలిగినంత ఆనందం నాక్కలగలేదనిపించింది. సుజాతకు ఫ్రెండ్స్ ఎక్కువ. అందరితో కలివిడిగా ఉండేది. నేను హైదరాబాదు వెళ్ళగానే, నన్ను తన ఫ్రెండ్సందరికీ పరిచయం చేసింది. యూనివర్సిటీలో సుజాతతో కలిసి ఒకే క్లాసులో పక్క పక్క కూర్చుని పాఠాలు వినడం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. సుజాత కోరుకున్నట్లే హాస్టల్లో ఇద్దరం ఒకే రూములో జాయినయ్యాం.

తను సాయంత్రాలు రాకేష్‌తో కలిసి బయటకు వెళ్ళినప్పుడు, ఆదివారాలు వాళ్ళిద్దరూ కల్సి సిన్మాలకు వెళుతున్నప్పుడు – నన్ను కూడా వాళ్ళతో రమ్మనేవాళ్ళు. మొదట్లో రెండు మూడు సార్లు వెళ్ళాను. సుజాతతో రాకేష్ ఎంత సరదాగా మాట్లాడతాడో, నాతో కూడా అంత సరదాగా మాట్లాడేవాడు. అలా వాళ్ళతో కల్సి నేనెక్కువ సమయం గడిపిన రోజు నా మనసు బాధగా మూల్గేది.

సుజాతంటే పెరుగుతున్న ఈర్ష్య ద్వేషంగా మారసాగింది. అప్పుడప్పుడూ ద్వేషం కోపం రూపంలో బయటపడేది. సుజాతను గాయపరచడానికి మాటలను ఆయుధాలుగా ఉపయోగించేదాన్ని. నేనలా బిహేవ్ చేసినా సుజాత మాత్రం, నాతో చిన్నప్పుడు తనెలా ఉండేదో ఇప్పుడూ అలాగే వున్నట్లుండేది నాకు.

ఒకాదివారం తప్పనిసరిగా మా నాన్నగారి చిన్ననాటి స్నేహితుని ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. నాకూడా సుజాత తోడుగా వస్తానంది. నేనే వద్దన్నాను. నాతో సుజాత అక్కడికి వస్తే నన్నెవరూ పట్టించుకోరేమోనని. ఒకరకంగా ఆదివారం వాళ్ళింటికి వెళ్ళడం నాకూ ఇష్టంలేదు. సుజాత, రాకేష్ నేను లేకుండా బయటకు వెళతారని బెంగ! నేను వాళ్ళింటికి వెళ్ళాననేగానీ – మనసంతా సుజాత వాళ్ళ గురించే ఆలోచిస్తోంది.

నేనక్కడినుంచి వచ్చేసరికి బాగా రాత్రయింది. సుజాత పడుకుని వుంది. నిద్రపోతోందనుకుంటా. ఆ సాయంత్రం వాళ్ళెక్కడెక్కడకు వెళ్ళుంటారో, ఏమేమి చేసుంటారో ఊహించుకుని, దహించుకుపోయాను. ఈర్ష్యతో రగిలి పోయాను.ఆ రాత్రంతా కలలే. సుజాత నన్ను రూములోంచీ బయటకు గెంటేసినట్లు, నన్ను బాత్రూములో పెట్టి బయట తాళం వేసినట్లు, నేపడుకున్న మంచాన్ని హాస్టల్ బిల్డింగ్ మీంచి క్రిందకు తోసేసినట్లు…

ఉదయం లేవగానే సుజాతనడిగాను ‘ఏ సినిమా చూసేరని?’ సిన్మాకు వెళ్ళలేదని చెప్పింది. నిన్నసలు రాకేష్ రూము వైపు రాలేదట! తనకేదో అర్జంటు పని తగిలి వాళ్ళ ఊరు వెళ్ళాడట. మరో రెండు మూడు వారాలు పడుతుందట సిటీకి రావడానికి. అప్పుడు నాక్కల్గిన ఆనందం అంతా ఇంతా కాదు.

సుజాత అడిగింది ‘నీ సాయంత్రం ఎలా గడిచిందని’. అద్భుతంగా గడిచిందని చెప్పాను. నేవెళ్ళిన వాళ్ళింట్లో ఓ అందమైన అబ్బాయి ఉన్నాడని, తనో పెద్ద ఉద్యోగంలో వున్నాడని, రేపోమాపో విదేశాలకు వెళ్ళొచ్చని చెప్పాను. అతనితో నాకా సాయంత్రం పరిచయమైందనీ, చాలా సేపు ఇద్దరం పిచ్చాపాటి మాట్లాడుకున్నామనీ, బహుశా అతనితోనే నాకు సంబంధం నిశ్చయం కావచ్చని కూడా. చిన్నప్పటినుంచీ సుజాత ఎదుట నాకెక్కువ ఆనందం కలిగింది ఈ రోజే! ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్ కల్గింది. సుజాత ఒక్కసారిగా ఆనందంతో నన్ను వాటేసుకున్నంత పని చేసింది.

“అంటే నిన్న నువ్వు వెళ్ళింది పెళ్ళి చూపులకన్నమాట. నాకెందుకే ముందు చెప్పలేదు” స్వచ్చంగా నవ్వుతూ అడిగింది.

సుజాత నాలాగా ఫీల్కాకపోవడం నన్నెంతో డిస్సపాయింట్ చేసింది.

నేను వెళ్ళిన ఇంట్లో రేపోమాపో విదేశాలకు వెళ్ళబోయే ఓ అబ్బాయి వుండడం వరకూ వాస్తవమే.కానీ నేనతనితో పిచ్చాపాటి మాట్లాడడం గురించి, సంబంధం గురించీ నేను చెప్పినదంతా కల్పన. అవునూ… నేనెందుకతన్ని పెళ్ళి చేసుకోకూడదూ?! అతనికేం తక్కువ? హు!… అతనికేమీ తక్కువ కాదు. నాకే అన్నీ తక్కువ! నన్ను చేసుకునే ఖర్మ ఏంటి తనకు? తను కోరుకుంటే చాలా అందమైన అమ్మాయి, సుజాతలాంటి చాలా మంచి అమ్మాయి దొరుకుతుంది. అయినా ప్రయత్నిస్తే తప్పేముంది?

కానీ ఎలా?


పరిసరాల్లో సుజాత వుంతే, నేను బాగా చలాకీగా కనిపించడానికి ప్రయత్నించసాగాను. ప్రతి విషయానికి బిగ్గరగా నవ్వుతున్నాను. మాములు కంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాను. మిగిలిన మా ఫ్రెండ్స్, నన్నో క్రొత్త మనిషిని చూస్తున్నట్లు చూసినా, సుజాత మాత్రం ఎప్పట్లాగే… ఎప్పటిలాంటి చిరునవ్వుతోనే నన్ను చూస్తోంది.

“ఆదివారం నీలో ఎంత మార్పు తెచ్చింది?” అంది సుజాత.

“ఏ ఆదివారం?”అన్నాన్నేను ఆశ్చర్యంతో.

“అదేనే పోయినాదివారం…”

“ఓ అదా!” అన్నాన్నేను బిగ్గరగా నవ్వుతూ.

“ఇంతకీ అతని పేరేమిటి?” అడిగింది సుజాత.

ఏం పేరబ్బా? గుర్తు తెచ్చుకోడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాను. ఏం పేరైవుంటుంది? ఏదో ఓ అందమైన పేరు చెప్పేస్తే! అమ్మో వద్దు. తర్వాత ఏదో విధంగా సుజాతకు అతని అసలు పేరు తెలిస్తే బాగోదు. ఆలోచిస్తూ… క్రింది పెదవిని కొరుకుతూ…నేల చూపులు చూస్తున్న నన్ను చూసి,

“పేరడిగితేనే డ్రీమ్స్ లోకెళ్ళిపోతున్నావా?” అంది సుజాత కొంటెగా నవ్వుతూ. “పోన్లేవే. పేరు చెప్పకపోతే చెప్పక పోయావ్ కనీసం పెళ్ళికి ముందు పరిచయమైనా చేస్తావా?”

“నీకు పరిచయం చేయకుండా పెళ్ళి చేసుకుంటాననుకున్నావా?”ఎదురు ప్రశ్న వేశాను. ఈ ప్రశ్న నా నాలుక చివర నుండి ఊడి పడింది.


ప్రతి ఆదివారం బాగా పొద్దెక్కాక అంటే పదీ పదకొండు గంటలకు లేచే నేను, ఆ రోజు మాత్రం ఉదయం ఆరున్నరకే నిద్ర లేచాను. ప్రక్క బెడ్ మీద సుజాత ఇంకా ప్రశాంతంగా నిద్ర పోతోంది. దాని మొహంపై నవ్వు. బహుశా రాకేష్ గురించి కలగంటుందేమో!

నిద్ర పోయేప్పుడు నేనెలా వుంటానో? నా మొహమ్మీద నవ్వు వుంటుందా? ప్రశాంతత వుంటుందా?

మళ్ళీ సుజాత వైపు చూసాను. చాలా ముచ్చటేసింది నాకు. చప్పుడు చేయకుండా మెల్లగా కుర్చీని, దాని మంచం దగ్గరగా లాక్కుని దాని మొహం కేసి చూస్తూ కూర్చున్నాను. ఆశ్చర్యంగా నాలో ఎలాంటి అసూయ, ఈర్ష్య, ద్వేషం లాంటి భావాలు కల్గలేదు. వాటి స్థానే ఆప్యాయత, స్నేహం, ప్రేమ కలిగాయి.

సుజాత నిద్రలో కొంచెం కదిలింది. మెల్లిగా లేచి, చప్పుడు చేయకుండా కుర్చీని వెనక్కి జరిపేసి బాత్ రూములోకి వెళ్ళాను.

హడావిడిగా రెడీ అవుతూ వాచ్ వైపు చూశాను. తొమ్మిది కావస్తోంది. సుజాత ఇంకా నిద్రపోతోంది, అంతకు ముందులాగే ప్రశాంతంగా.

ఎలాగోలా తనను లేపాలనిపించింది. తన నిద్రను, ప్రశాంతతను డిస్ట్రబ్ చేయాలనిపించింది. నేనింత ప్రొద్దున్నే రెడీ కావడం – కేవలం సుజాత చూడాలనే. నాకూ ఓ బోయ్ ఫ్రెండ్ ఉన్నాడని, నేనతనితో కలిసి సరదాగా అటు ఇటు షికార్లు చేసి, సిన్మాకు వెళ్ళి, వస్తూ వస్తూ డిన్నర్ చేసి రూముకొస్తానని సుజాత అనుకోవాలని. అనుకొని ఈర్ష్య పడాలని. కేవలం నేనందుకోసమే రెడీ అవుతుంటే – తనలా నిద్రపోవడం నాకస్సలు నచ్చలేదు. బాగా కోపమొచ్చింది.

సుజాత మంచం ప్రక్కన స్టూలు మీదున్న మంచినీళ్ళ గ్లాసును పెద్ద శబ్దమయ్యేలా క్రింద పడేసాను. ఉలిక్కిపడి లేచింది సుజాత.

“సారీ. పొరపాటున గ్లాసు క్రిందపడింది. ప్చ్… వెరీ వెరీ సారీ…,” అంటూ గాజు ముక్కలేరడానికి క్రిందకి వంగాను.

తను మాత్రం చిరునవ్వుతో, “పొరపాటున కాకపోతే కావాలని ఎవరైనా పగలగొడతారా?జాగ్రత్త- చేతులో గాజు పెంకులు గుచ్చుకుంటాయి.” అంటూ పక్క మీద నుంచి దిగింది.

“ఏమిటే తొమ్మిదింటికే రెడీ అయ్యావ్… నీ బోయ్ ఫ్రెండ్తో షికార్లకా?” అడిగింది. సిగ్గు పడుతున్నట్లు నవ్వాను.

“మరి నీ సాజన్ని నాకెప్పుడు చూపిస్తావే?” అడిగింది సుజాత.

“త్వరగా రెడీ అయితే ఈ రోజే పరిచయం చేస్తాను” అన్నాన్నేను. లోపల మాత్రం ‘రెడీకాకు ప్లీజ్… నాతో రాకు’ అనుకుంటూ.

“మీ మధ్యలో నేనెందుకులేవే. రాకేష్ కూడా వచ్చాక అందరం కల్సి ఓ రోజు డిన్నర్ కెళదాం” అంటూ బాత్ రూంలోకి వెళ్ళింది.

“హమ్మయ్య,” అనుకుంటూ బయటకొచ్చాను. ఎక్కడికి వెళ్ళాలి. సాయంత్రం దాకా ఎలా టైం పాస్ చేయాలి? ఎలానో ఓలా రోజంతా గడిపి సాయంత్రం ఏడవుతూండగా రూము కొచ్చాను.

నేను రావడం చూసి, “హమ్మయ్య వచ్చావా?! ఎవరో వేణుగోపాలరావుగారట నీ గురించి ఫోను చేసారు” అంది సుజాత.

“వేణుగోపాలరావుగారా! ఎంత సేపయింది?”అడిగాన్నేను కంగారుగా.

“పావు గంటయి వుంటుంది.” వాచీ వైపు చూసుకుంది.

“ఏం చెప్పావ్?”

“బయటకు వెళ్ళింది, వస్తూండవచ్చని చెప్పా” అంది సుజాత. నా కంగారు చూసి ఆశ్చర్యపడుతూ.

“థాంక్ గాడ్!” గాఢంగా నిట్టూర్చి, బెడ్ మీద కూర్చున్నాను.

“ఎందుకే అంత ఆదుర్దా పడ్డావ్? ఇంతకీ ఆయనెవరు?” అడిగింది సుజాత.

“మా నాన్న గారి ఫ్రెండ్. పోయినాదివారం నేను వెళ్ళింది వాళ్ళింటికే” చెప్పాను నేను.

“ఓహ్. అదా సంగతి! కాబోయే మామగారన్నమాట!”అంది నవ్వుతూ.

మొదటిసారి నేనాడుతున్న అబద్దాలు నన్నెలా ఇరుకున పెట్టొచ్చో అర్ధమైంది. ఇలాగే ఇంకొంత కాలం నటిస్తూ పోతే, తర్వాత జీవితమంతా సుజాతకు నేనో ఫూల్ లాగ కనిపించవచ్చు. ఎలా ఈ నాటకానికి తెర దించడం?

“కాబోయే మామగారో లేక కాని మామ గారో…” అన్నాన్నేను దిగాలుగా.

“ఏమిటే ఇంతలోనే ఇలా అయిపోయావ్?”

“పెళ్ళి జరక్క పోవచ్చనిపిస్తోంది” అన్నాన్నేను ముక్తసరిగా. తర్వాత కథను ఎలా మలుపు తిప్పాలాని ఆలోచిస్తూ.

“ఎందుకే?” కంగారుగా అడిగింది.

“ఏముంది… అతడేమో మంచి పొజిషన్లో వున్నాడు. వాళ్ళ పెద్దవాళ్ళు మరేదో సంబంధం చూస్తున్నారట.”

“నీకేం తక్కువ? అందం, చదువు, సంస్కారం… మంచి కుటుంబం. ఇంతకంటే ఏం కావాలి?! అయినా అతనిష్టపడితే, వాళ్ళ పెద్ద వాళ్ళకేముంటాయి అభ్యంతరాలు?” సాలోచనగా అంది. మౌనంగా కిటికీ వైపు చీకట్లోకి చూస్తూ కూర్చున్నా.

“మీ ఇంట్లో వాళ్ళతో విషయం చెప్పావా?”అడిగింది. లేదన్నట్లు తలూపాను.

“పోనీ మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడనా?”

అప్పుడే నాకు మరో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. సుజాతను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే – నే చెబుతున్న అబద్దం నిజం కావచ్చు. అతనితో పెళ్ళి జరగొచ్చు. తనే సాయం చేస్తానని ముందుకు వస్తోంది కాబట్టి – ఏమైనా తేడాలొస్తే – తప్పు తన మీదకు తోసెయ్యొచ్చు! నాకు పెద్దగా జరిగే నష్టమేమీ లేదు కాబట్టి – అమాయకంగా మొహం పెట్టి సుజాత వైపు చూశాను.

“ఏమని…ఏమని మాట్లాడతావ్?”

“ఏదో నేను మాట్లాడతాగా. మీ పెళ్ళి జరిపించే బాధ్యత నాది.”

“నీకెందుకంత శ్రమ… ఎలా రాసి పెట్టివుంటే అలా జరుగుతుంది.”

“స్నేహితురాలికోసం ఆ మాత్రం చేయలేనా? నువ్వేం వర్రీ కాకు. నేనీ రాత్రికే ఊరెళ్ళి, మీ ఇంట్లోవాళ్ళతో అన్ని విషయాలూ మాట్లాడతాను.”

“సుజీ… మా ఇద్దరి పరిచయం గురించి చెప్పకేం? మా ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలుసుగా! వాళ్ళ కిలాంటివి నచ్చవు.” అన్నాన్నేను.

“అబ్బా అదంతా నాకొదిలెయ్,” అంటూ వాచీ వైపు చూసింది.


తర్వాత విషయాలన్నీ చకచక జరిగిపోయాయి. గోపాలరావు గారబ్బాయి, శ్రీకాంత్‌తో నా పెళ్ళి వైభవంగా జరిగింది. హనీమూన్ సెండాఫ్ ఇవ్వడం కోసం ఎయిర్‌పోర్ట్‌కి అందరితో బాటు సుజాత, రాకేష్ కూడా వచ్చారు.

సుజాత కళ్ళలో సన్నటి నీటితెర.

“నేను చిన్నప్పుడు అందరినీ ఓ ప్రశ్న అడిగేదాన్ని గుర్తుందా?” అడిగాన్నేను.

“రావణాసురుడి ప్రశ్నేనా?”అడిగింది సుజాత స్వచ్చమైన నవ్వుతో.

“చిట్టీ నేను చెప్పాను కదే. అసలు రావణుడే లేడని,” అన్నాడు అన్నయ్య, మా వారికి సైగ చేస్తూ.

“రావణుడి సంగతి తెలీదు గానీ, కొందరు మనుషులకు ఒక్క తలకే ఎన్నో మొహాలు… ఒక్కో ముఖం ఒక్కో రకంగా” చెప్పాను నేను – ఎయిర్‌పోర్ట్ లాంజ్ గ్లాస్ డోర్ మీద నన్ను నేను చూసుకుంటూ.