అర్థంకాని కవిత్వం

[తానా జ్ఞాపిక తెలుగుపలుకులో స్థలాభావం వలన ఈ వ్యాసం కుదించబడింది. ఆ సంక్షిప్త రూపం గ్రంథాలయంలో ఉన్నది. ఇది రచయిత ప్రథమంగా వ్రాసిన వ్యాసపు పూర్తి పాఠం – సం.]


 The writer invites us to understand his language, not to translate it into the language of our equivalencies. 

– Nicolás Gómez Dávila

గోమెజ్ దవీలా వాక్యోక్తులలో(aphorisms) నన్ను బాగా ఆకట్టుకున్న ఒక వాక్యోక్తి యిది. రచనల్లో కవిత్వానికీ, అందులోను ఆధునిక కవిత్వానికి ఎంతగానో వర్తించే వాక్యమిదని నేననుకుంటాను.

ఇటీవలి కాలంలో వస్తున్న కవిత్వం చాలా వరకూ అర్థం కానిదనీ, కొండొకచో అర్థం లేనిదనీ పాఠకులు విమర్శించడం తరచుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంటర్నెట్టులో ప్రచురితమయ్యే కవిత్వం విషయంలో దీన్ని నేను స్పష్టంగా గమనించాను. ఎందుకిలా జరుగుతోంది? ఇది వస్తున్న కవిత్వంలో లోపమా? లేదా చదివే పాఠకుల లోపమా? అని కాస్త నాలో ఆలోచన మొదలయ్యింది. దీని గురించి ఆలోచన మొదలుపెట్టగానే నాకు మొట్టమొదట ఠక్కున గుర్తుకు వచ్చినది విశ్వనాథవారి యీ పద్యం:

తొలినాళుల పద్యార్థము
తెలియనిచో పాఠకునిది తెలియమి, యీ నా
ళుల వ్రాసిన కవి దోషము
కలి ముదిరిన కొలది చిత్రగతులన్ నడచెన్!

పాత రోజుల్లో ఒక పద్యానికి అర్థం తెలియకపోతే అది పాఠకుని తెలియనితనం. అదే యీ కాలంలో, వ్రాసిన కవిదే తప్పు. ఏమిటో కలికాలం! – అని సుమారు ఒక ఏభయ్యేళ్ళ కిందట వాపోయారాయన! ఇది ముఖ్యంగా ఆ రోజుల్లో పద్యకవిత్వంపై వచ్చిన తీవ్ర నిరసనని దృష్టిలో పెట్టుకొని వ్రాసిన పద్యం. పద్యానికి అర్థం తెలియాలంటే దానికి పాఠకుడు కొంత పరిశ్రమ చెయ్యాలి. ఆ పద్యాన్ని ఎలా పదవిభాగం చేసుకోవాలో తెలిసుండాలి. అలా విభాగం చేసుకున్న పదాలకి ఆ సందర్భానికి తగిన అర్థాలు తెలిసుండాలి. ఇవన్నీ కలుపుకొని చదువుకుంటే పద్యం కొంత వరకూ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందులో మళ్ళీ ఏ శ్లేషో, మరో అలంకారమో, ధ్వనో ఉంటే దాన్ని గుర్తించే నేర్పుండాలి. అలా ఉండి చదివే పాఠకునికే పద్యార్థం పూర్తిగా బోధపడేది. అంటే కావ్యాలలో పద్యాలని అర్థం చేసుకోడానికి పాఠకులకి కూడా ఒక స్థాయి, కొంత అనుభవం అవసరం అన్నమాట.

మరి యిదే అంశం యీ నాటి కవిత్వానికి కూడా వర్తిస్తుందా? – అని ఆలోచిస్తూ ఉంటే, “There is then creative reading as well as creative writing” అన్న ఎమర్సన్ (Ralph W. Emerson) మాట గుర్తుకువచ్చింది. ఈ మధ్యన ప్రముఖ కవి అఫ్సర్ తన బ్లాగులో ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు: కవిత్వం రాయడం కన్నా, కవిత్వం చదవడం గొప్ప కళ అనిపిస్తోంది ఈ మధ్య. అటు ఎమర్సన్ పలుకు, ఇటు అఫ్సర్‌గారి చెణుకు, నా ఆలోచనలని మరింత బలపరిచాయి. కవిత్వం వ్రాయడం లాగానే, చదివి ఆకళించుకొని ఆస్వాదించడం కూడా అంతో ఇంతో సృజనతో కూడుకున్న పనే. దానికి కూడా కొంత పరిశ్రమ, అనుభవము నిస్సందేహంగా అవసరమే. ఇలా అంటే కొంతమంది ‘అభ్యుదయవాదులు’ ఉలిక్కిపడే అవకాశం ఉంది! వారి దృష్టిలో, సామాన్య జనానికి అర్థం కావడమనేది ఆధునిక కవిత్వపు కనీస లక్షణం. అలా కాకుండా ఏదో ఒక వర్గానికి చెందిన పాఠకులకి మాత్రమే కవిత్వం పరిమితమవ్వడం ఫ్యూడల్ ధోరణి అంటారు వాళ్ళు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కవిత్వం ఒకే వర్గానికి చెందిన పాఠకులకి పరిమితమవ్వాలి అని నేను అనలేదు. కవిత్వాన్ని అర్థం చేసుకోడానికి కొంత పరిశ్రమ అనుభవము అవసరమవుతాయని మాత్రమే నేనంటున్నాను. ఈ రెండిటికి తేడా ఏమిటన్నది అర్థం చేసుకోవాలంటే సాహిత్యచరిత్రని కొద్దిగా తిరగెయ్యాలి.

ప్రాచీనకాలం నుండి అభ్యుదయకవిత్వం ఆవిర్భవించే వరకూ కవిత్వానికున్న పాఠకవర్గం చాలావరకూ పరిమితమైనదే. పురాణాలైతేనేమి, కావ్యాలైతేనేమి, ప్రబంధాలైతేనేమి, చివరికి భావకవిత్వమైతేనేమి, వీటికి పాఠకులు చాలావరకూ పండితులూ కవులే. పురాణాలూ కావ్యాలు, పండితులు చెప్పడం ద్వారా సామాన్య జనంలోకి వచ్చి ఉండవచ్చు. వాటికి సామాన్యజనులు ‘శ్రోతలే’ కాని ‘పాఠకులు’ కారు. వాటిని చదివి అర్థం చేసుకొనే బాధ్యత పండితులదే. భావకవిత్వం కూడా వస్తువులో పెనుమార్పునీ రచనా శైలిలో కాస్త మార్పుని తీసుకువచ్చిందే తప్ప పాఠకవర్గంలో పెద్దగా మార్పు లేదు. ప్రాచీన కావ్య ప్రబంధాలని అర్థం చేసుకోడానికి అలంకారికుల ద్వారా ఒక framework ఏర్పాటయ్యింది. అది తెలిసిన పండితులకి వాటిని అర్థం చేసుకోడం పెద్ద కష్టం కాలేదు. కొత్తగా వచ్చిన భావకవిత్వం యీ frameworkకి ఒదగకపోవడం వలన దీన్ని అర్థం చేసుకోడం కష్టమయ్యింది. ఆ కారణంగా ఆ నాటి పండితుల నుండి గట్టి వ్యతిరేకతే ఎదురుకోవలసి వచ్చింది. అయితే క్రమేపీ ఆనాటి పాఠకవర్గానికి అది అలవాటు కావడం వల్లనైతేనేమి, కొందరు కవులు పండితులూ ఆ కవిత్వ తత్త్వాన్ని వివరించడం వల్లనైతేనేమి అది క్రమేపీ అధికశాతం పాఠకుల ఆమోదాన్ని పొందింది.

ఆ తర్వాత వచ్చిన అభ్యుదయ కవిత్వం, కవితా వస్తువులోనే కాక పాఠకవర్గంలో కూడా పెనుమార్పుని తీసుకువచ్చింది. ఈ పెనుమార్పులకి కారణం ఆనాటి సామాజిక పరిస్థితులలో చోటుచేసుకున్న మార్పులే. పండితులకీ, కవులకీ పూర్వకాలం నుండీ లభిస్తున్న రాజుల, జమిందారుల ఆదరణ, పోషణ క్రమేపీ తగ్గి పూర్తిగా పోయింది. పారిశ్రామికీకరణ వలన నశించిపోయిన కులవృత్తులు, పెరిగిన శ్రామికవర్గము, అక్షరాస్యులైన నిరుద్యోగవర్గము – వీళ్ళందరి సరసన పండితులు, కవులు చేరిపోయారు. దానితో ఆకాశమార్గంలో సాగే కవిత్వం భూమార్గం పట్టింది. సామాన్యుల కష్టనష్టాలు కవులకి అనుభవంలోకి వచ్చాయి. వారి కవిత్వానికి అవి వస్తువులయ్యాయి. ఇప్పుడా కవిత్వం రాజులని మెప్పించడానికి కాదు, జమిందారులు ఆస్వాదించడానికి కాదు. తమ తోటి బడుగు జీవుల, మధ్యతరగతి మనుషుల ఆవేదనతో ఆక్రోశంతో గొంతు కలపడానికి. అంచేత వాళ్ళే యీ కవిత్వానికి పాఠకవర్గమయ్యారు. మరి వీళ్ళకి కవిత్వం అర్థమయ్యేందుకు కావలసిన స్థాయి సహజంగానే ఉండదు కదా. వాళ్ళకి అర్థమయ్యేలా కవిత్వం చెప్పాలంటే నిఘంటువులు శ్మశానాలవుతాయి. ఛందస్సులు సర్పపరిష్వంగాలవుతాయి. అందుకే వాటిని ఛేదించుకుని అభ్యుదయకవిత్వం అవతరించింది. వస్తువుతో బాటు రూపంలోనూ మార్పు రావలసివచ్చింది. ఆ కవిత్వాన్ని అర్థంచేసుకోడానికి, కవితో సహానుభూతి చెందడానికీ, ఆనాటి పరిస్థితులు దోహదపడ్డాయి.

ఇది రెండు ముఖ్యమైన పరిణామాలకి దారితీసింది. ఒకటి, ఒక సామాజిక సిద్ధాంతాన్నో ఉద్యమాన్నో ఆలంబనగా చేసుకొన్న కవిత్వ సృష్టి. అభ్యుదయకవిత్వంతో ఆరంభమైన యీ పోకడ, విప్లవకవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళితవాద కవిత్వం, ప్రాంతీయవాద కవిత్వం – ఇలా సాగుతూ పోయింది. రెండో ముఖ్య పరిణామం, పాఠకులు సామాన్య ప్రజలవ్వడంతో పాటుగా కవులు కూడా ఆ సామాన్యులే అవ్వడం. అంటే, ప్రత్యేకమైన వ్యుత్పత్తి అభ్యాసాలు లేకుండానే కవిత్వం వ్రాయవచ్చునన్న భావన స్థిరపడింది. ఇలాంటి కవిత్వాన్ని ఆకళించుకోవాలంటే ఆయా సాంఘిక పరిస్థితుల సిద్ధాంతాల కనీస అవగాహన తప్పనిసరి అవుతుంది. అది లేనప్పుడు సహజంగానే ఆ కవిత్వం మనసుకి పట్టదు.

ఈ కవితోద్యమాలకి సమాంతరంగాను, ఆ తరువాతా, తెలుగు కవిత్వంలో మరికొన్ని ధోరణులు చోటుచేసుకున్నాయి. ఒకటి – ఆధునికజీవితంలో పెరిగిపోయిన సంక్లిష్టత. ఈ సంక్లిష్టత కవిత్వంలో ప్రతిఫలించాలనే ఒక దృక్పథం మొదలయ్యింది. ఈ దృక్పథం కలిగిన కవులు సామాన్యప్రజలు కారు. విద్యావంతులూ, దేశీయ విదేశీయ సాహిత్యంతో పరిచయమున్న వారూను. వీరు కవిత్వంలో సంక్లిష్టతను, అస్పష్టతను ప్రవేశపెట్టారు. సహజంగానే ఇది ఎక్కువ మంది పాఠకులకి అర్థంకాదు, ఆస్వాదయోగ్యం కాదు. అధివాస్తవికత, విధ్వంసవాదము, ఆధునికానంతరత మొదలైన ధోరణులు యీ కోవకి చెందుతాయి. ఆయా ధోరణులతో పరిచయము, వాటిలో అభిరుచి ఉన్న పాఠకులకి మాత్రమే ఆయా ధోరణులలో వచ్చిన కవిత్వం ఆస్వాద యోగ్యమవుతుంది. ఆధునిక జీవితంలోని సంక్లిష్టత మరొక పరిణామానికి కూడా దారితీసింది. కవులలో పెరిగిన తాత్త్విక చింతన. ఇక్కడ కూడా యీ కవులు విద్యావంతులూ, సాహిత్యపరిజ్ఞానం కలిగినవాళ్ళును. కవిత్వసృజనని ఒక యోగంగా భావించి, తమ అంతరంగ శోధనే కవిత్వంగా మలిచినవాళ్ళు వీరు. వీరు తమకోసమే కవిత్వం వ్రాసుకొనే వాళ్ళు. అందుచేత వీరి కవిత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా, దాని వెనకనున్న తత్త్వంతో పరిచయమూ అందులో అభినివేశమూ తప్పనిసరి అవుతుంది.

ఈ రెండు పరిణామాలు కాకుండా, ఇంకొక ముఖ్యపరిణామాన్ని కూడా గమనించవచ్చు. అదేమిటంటే, కవిత్వం సామాజికపరిస్థితులకి అద్దంపట్టాలని అంగీకరిస్తూనే, దాని అభివ్యక్తిలో మాత్రం ప్రత్యేకత తప్పనిసరిగా ఉండాలని భావించే కవులు తయారుకావడం. కేవల ఉద్యమస్ఫూర్తితో వ్రాసే కవుల కవిత్వం జానపద కవిత్వమనుకుంటే, యిలాంటి కవులది మార్గకవిత్వ ధోరణి అనుకోవచ్చు. అంటే, యీ కవులు కూడా సాహిత్యపరిజ్ఞానం బాగా ఉన్నవాళ్ళే అన్నమాట. సామాన్యప్రజలకి వీరి కవిత్వం అర్థమవుతుందని చెప్పడానికి వీలులేదు. వ్యంగ్యమో, ప్రతీకలో, పదచిత్రాలో వీరి కవిత్వానికి పనిముట్లు. అందువల్ల వీరి కవిత్వం అర్థం కావాలంటే, ఆయా సాంఘిక పరిస్థితులతో పాటు, ఇలాంటి కవిత్వ నిర్మాణ పద్ధతులతో కూడా పాఠకులకి పరిచయముండాలి.

అతి స్థూలంగా చెప్పుకుంటే, ఆధునిక కాలంలో కవిత్వం యిన్ని పరిణామాలను పొందింది. ఇంకా పొందుతూనే ఉంది. పైన చెప్పినవి చాలా స్థూలమైన విభాగాలే. వీటికి అపవాదాలుగా వచ్చిన కవిత్వం ఉంది. అనేక ధోరణుల మిశ్రమంగా కనిపించే కవిత్వమూ ఉంది. కవిత్వాన్ని అర్థం చేసుకొనే దిశలో నాకు తోచిన కొన్ని ధోరణులని మాత్రమే నేనిక్కడ ప్రస్తావించాను. ఆధునిక కవిత్వాన్ని అర్థం చేసుకోవాలనుకొనే వాళ్ళకి వీటితో కొంతైనా పరిచయం అవసరం. “సరేనండి, ఆధునిక కవిత్వంలో యిన్ని రకాల ధోరణులున్నాయి బాగానే ఉంది. ఇంతకీ వీటిని అర్థం చేసుకోడం ఎలా? కావ్యాలలో పద్యాలకి ప్రతిపదార్థ తాత్పర్యాలని ఇచ్చేవాళ్ళుంటారు. వాటిని చదివితే అది బోధపడుతుంది. మరి ఆధునిక కవిత్వానికి అలాంటిదేదయినా ఎందుకు ఇవ్వకూడదు?” అని నిజాయితీగానే అడిగే పాఠకులుంటారు. దీనికేమిటి సమాధానం? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే, ప్రాచీన ఆధునిక కవిత్వాలలో ఉన్న ఒక ముఖ్యమైన తేడాని గమనించడం చాలా అవసరం.

ప్రాచీన కవిత్వం చాలావరకు కథాశ్రయం. అంటే కథని, అందులోని పాత్రలని ఆలంబనగా చేసుకున్న కవిత్వమది. కవి భావాలు నేరుగా మనకి ఎక్కడా కనిపించవు. పాఠకునికి పాత్రలతోనే సంబంధం కాని నేరుగా కవితో సంబంధముండదు. ఉదాహరణకి మనుచరిత్రలో అటజనికాంచె భూమిసురుడు… అన్న పద్యంలో కవి హిమాలయాలని వర్ణిస్తున్నాడు. అయితే ఆ హిమాలయాలని చూస్తున్నది కవి కాదు, ప్రవరుడన్న పాత్ర. ఎప్పుడూ నగరాన్నే విడిచిపెట్టి వెళ్ళని ప్రవరుడు మొదటిసారి హిమాలయాలని దర్శించినప్పుడు, అతని కన్నులకి ఆ వాతావరణం ఎలా కనిపించిందో అది మనకి చూపెడుతున్నాడు కవి. అప్పటిదాకా కావ్యాన్ని చదువుకొంటూ వస్తున్న పాఠకునికి ప్రవర పాత్ర చక్కగానే పరిచితమై ఉంటుంది. అంచేత ఆ పాత్ర దృష్టితో చేసిన ఆ వర్ణనతో పాఠకుడి మనసు లగ్నమవ్వడం పెద్ద కష్టమైన పని కాదు. పాత్రలలో లీనమై, ఆయా పాత్రల అనుభవాల ద్వారానే పాఠకులు కవిత్వానుభూతిని పొందుతారన్న మాట. ఇక ఆధునికకవిత్వానికి వస్తే, అది నూటికి తొంభై వంతులు ఆత్మాశ్రయం. ఇక్కడ ఆత్మాశ్రయమంటే నా ఉద్దేశ్యం తన గుఱించి చెప్పుకున్న కవిత్వమని కాదు. తన దృష్టితో చెప్పిన కవిత్వమని. భావకవిత్వం నాటినుండీ కూడా కవిత్వంలో కనిపించేది నేరుగా కవి హృదయస్పందనే. “నాకుగాదులు లేవు నాకుషస్సులు లేవు” అన్నప్పుడా మాటలు కృష్ణశాస్త్రి అంతరంగంలో మసలుతున్న భావాలకి అక్షరరూపాలు. “పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి” అన్న మాటలు శ్రీశ్రీలోని ఆవేశానికి ప్రతిధ్వనులు. “నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే ఆడపిల్లలు” అన్నది తిలక్ మనసులోని అనుభూతిని ఆవిష్కరించే పదచిత్రం. ఇక్కడ కవికి పాత్రల ఆలంబన లేదు. నేరుగా పాఠకునితో కవి మాట్లాడుతున్నాడు. లేదా తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. ప్రాచీనాధునిక కవిత్వాల మధ్యనున్న అతి ముఖ్యమైన తేడా యిది.

కవిత్వాన్ని అర్థం చేసుకోవడంలో యీ వ్యత్యాసం చాలా ప్రధానమైన పాత్ర నిర్వహిస్తుంది. ఎలా అంటే, కథాకావ్యాలని అర్థం చేసుకోవాలంటే, కథని అర్థం చేసుకొని అందులోని పాత్రల స్వరూప స్వభావాలు ఆకళించుకొన్నట్లయితే సరిపోతుంది. పైగా వీటిలో చాలావరకూ ఒక రకమయిన ‘సాధారణీకరణ’ జరుగుతుంది. అంటే మనుషులందరికీ సామాన్యంగా ఉండే అనుభూతులు, కలిగే అనుభవాలు, ఎదురయ్యే సమస్యలు ఇందులో చిత్రితమవుతాయి. వీటినే నవరసాలుగా, వివిధ స్థాయీభావాలుగా అలంకారికులు వింగడించారు. అందువల్ల పాఠకులకి వాటిని తమదిగా చేసుకోడానికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఆత్మాశ్రయమైన కవిత్వ విషయంలో యీ వెసులుబాటు లేదు. ఇందులో ఉండేది పూర్తిగా కవి వ్యక్తిగతం. వస్తువు సామాజికమైనదే అయినా, కవిత్వంలో ప్రతిఫలించేది కవి తాలూకు వ్యక్తిగత ప్రతిస్పందనే. అంచేత దాన్ని అర్థం చేసుకోవాలంటే కవిని అర్థం చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. ఉదాహరణకి “మనవాళ్ళందరూ వట్టి వెధవాయలోయ్” అని నాటకంలో గిరీశమన్నప్పుడు ఆ మాటలని మనం ఎలా అర్థం చేసుకుంటాం? గిరీశం పాత్రస్వభావాన్ని బట్టి, అవి అతను కొట్టే డప్పాలలో భాగంగానే తీసుకుంటాం. లేదు నిజంగా గురజాడకి మనమంటే అలాంటి చులకన భావమే ఉంది అనే వాళ్ళూ ఉన్నారు కాని అది ఆధునికంగా వచ్చిన విమర్శ ధోరణి తప్పిస్తే, న్యాయంగా అలా అనుకోడానికి వీల్లేదు, అనుకోవలసిన అవసరమూ లేదు. అదే ఒక ఆధునిక కవి తన కవితలో ఆ మాట అన్నాడనుకోండి. అప్పుడు అతనే ఉద్దేశ్యంలో అన్నాడు? వ్యంగ్యానికి అన్నాడా? సూటిగానే అన్నాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. కేవలం ఒక కవిత పరిధిలో ఆ మాటల contextని అర్థం చేసుకోవడం, గిరీశం మాటలని అర్థం చేసుకోవడం కంటే కష్టమే అవుతుంది. ఆ కవితని కొంత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతుంది. కవి గురించిన అవగాహన కూడా కొంత అవసరమవుతుంది. పైగా, యీ ఆత్మాశ్రయకవిత్వంలో వ్యక్తపరిచే అనుభూతులు, అనుభవాలు వైయక్తికమైనవి, ఆ కవికి మాత్రమే సొంతమైనవి. వీటిలో ఎలాంటి సాధారణీకరణా జరగదు. అంచేత మనుషుల అంతరంగాలలో ఎంతటి వైవిధ్యముంటుందో, యీ కవితల్లో కూడా అంతటి వైవిధ్యముంటుంది. కాబట్టి యిల్లాంటి కవితలని అర్థం చేసుకోడానికి ఏవో కొన్ని సామాన్య సూత్రాలని తయారుచెయ్యడం అసంభవం. ప్రతి కవితాస్వాదనా ఒక సాహసయాత్రే అవుతుంది పాఠకునికి. అందులో ఒక గమ్యం చేరగలరన్న హామీ కూడా ఎవరూ ఇవ్వలేరు. ప్రయాణమే ముఖ్యం కాని గమ్యం కాదు. దానిలో ఉత్సాహమున్న వాళ్ళే అందుకు సిద్ధపడాలి. అయితే యీ ప్రయాణం సరిగా సాగడానికి కొన్ని చిట్కాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి.

మొట్టమొదటగా, ప్రయాణాన్ని ఎప్పుడు ఆపెయ్యాలో తెలియడం. మన కంటబడిన ప్రతి కవితా మనకి అర్థమైపోవాలని, మనసుకి హత్తుకోవాలని అనుకోడం అత్యాశ. కవిత్వాన్ని చదవడం గురించి బోర్హెస్ (Jorge Luis Borges) ఒక చక్కని పోలిక చెపుతాడు:

“The taste of the apple (states Berkeley) lies in the contact of the fruit with the palate, not in the fruit itself; in a similar way (I would say) poetry lies in the meeting of the poem and reader, not in the lines of symbols printed on the pages of a book.”

ఏపిల్ రుచి ఏపిల్ లో ఉండదు, తినేవాడి నాలుకపైనే ఉంటుంది. అదే ఏపిల్ ఒకో మనిషికి ఒకో రకమైన రుచినిస్తుంది. అలాగే కవిత్వమన్నది కవితా పంక్తులలో ఉండదు. పాఠకుని ప్రతిస్పందనలో ఉంటుంది. ఒకే కవిత ఒకో పాఠకునికి ఒకో రకమైన అనుభూతిని మిగులుస్తుంది. కొంత మందికి మావిడిపండు రుచి కాదు కదా వాసన కూడ పడదు. మరి కొందరు దాన్ని ఎంతో ప్రీతిగా తింటారు. అలాగే ఒక కవిత అర్థమవ్వాలంటే, పాఠకునికి ముందు ఆ కవిత మీద ఒక రకమైన అభిరుచి ఏర్పడాలి. అర్థమే అవ్వకుండా అభిరుచి ఏర్పడే అవకాశం ఉందా? అంటే, కచ్చితంగా ఉంది. కవిత చదవగానే, స్పష్టాస్పష్టమైన చిత్రాలేవో మనసులో కదలాడి, ఆ కవితని మరింత లోతుగా చదవాలనే ఉత్సుకత కలగవచ్చు. లేదా ఆ కవి పూర్వకవితలు మీకు నచ్చి, యీ కవిత వెంటనే అర్థమవ్వకపోయినా దాన్ని మరల చదివి అర్థం చేసుకోవాలన్న ఉత్సాహం ఉండవచ్చు. అసలు ఎలాంటి కవిత్వాన్నయినా అర్థం చేసుకొని ఆస్వాదించాలనే కోరిక మీకు బలంగా ఉండవచ్చు. ఇలా, కవిత అర్థం కాకపోయినా దానిమీద అభిరుచి ఏర్పడడానికి అనేక కారణాలున్నాయి. అయితే, ఇవేవీ మీకు వర్తించక మీకా కవితని మళ్ళా చదవాలన్న కోరిక కలగకపోతే, వెంటనే దాన్ని పక్కకు నెట్టెయ్యాలి. మీ ప్రయాణాన్ని ఆపెయ్యాలి.

రుచి-అభిరుచి పోలికనే మరికొంత కొనసాగిద్దాం. పాలో కాఫీనో తాగే ముందు తియ్యని మిఠాయి తింటే, ఆ పాలు చప్పగా ఉండడం చాలామందికి అనుభవమయ్యే ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, ఒక బలమైన రుచి నాలుకకి పట్టేసింది. ఆ రుచి ఇతర రుచులని మరుగు పరిచేస్తోంది. ఇది కవిత్వానికి కూడా వర్తిస్తుంది. మీకు ఒక రకమైన కవిత్వమ్మీద విపరీతమైన అభిమానం ఉందనుకోండి, అప్పుడు ఇతర కవిత్వాలు అంతగా రుచించక పోవచ్చు. అలాగే కవిత్వమంటే ఇదీ అని ఒక నిర్దిష్టమైన అభిప్రాయం బలంగా నాటుకుంటే, ఆ చట్రానికి లోబడని కవిత్వం రుచించదు. అంచేత ఒక కవిత అర్థం కానప్పుడో నచ్చనప్పుడో, ఇలాంటి బలమైన అభిరుచి దానికి కారణమేమో పాఠకుడు ఆలోచించుకోవాలి. అలాంటి అభిరుచి ఉండడంలో తప్పులేదు. కాని అలాంటప్పుడు అన్ని రకాల కవితలు తనకి రుచించకపోవచ్చునన్న స్పృహ పాఠకునికి ఉండాలి. తన అభిరుచిని పక్కకుపెట్టి, కవితని చదవగలగడం చేతనయితే చెయ్యవచ్చు. అది చేతనవ్వని పక్షంలో ఆ కవితని పక్కనపెట్టెయ్యడమే ఉత్తమం.

ఇలాగే మరొక విధంగా కూడా జరగవచ్చు. ఉసిరికాయ తినగానే తాగిన మామూలు నీళ్ళు కూడా తియ్యగా ఉంటాయి కదా. అలాగే కొన్నిసార్లు ఒక కవితని ఆస్వాదించాలంటే, ఆ కవితా వస్తువుకి సంబంధించిన నేపథ్యంతో పరిచయము, అనుభవము పాఠకునికి అవసరమవుతుంది. ఇది ముఖ్యంగా ఉద్యమకవితలకి వర్తిస్తుంది. ఉదాహరణకి ఓల్గా రాసిన యీ కవితని తీసుకుంటే:

గృహలక్ష్మి

రుబ్బుడు పొత్రంలా
తల తిరుగుతూనే ఉన్నా
ఆలోచనల పప్పు మెదగదు
ఇంగువ వాసనలో మునిగి తేలే ముక్కు
ఊపిరి పీల్చుకోవడం మర్చిపోతుంది
చేతుల చీపురు కట్టలు ఎడతెరపి లేకుండా
శూన్యంలో దేవుతూనే ఉంటాయి
కలల అలల తుంపరులు
హృదయపు పెనంపై
చుయ్యిమంటూనే ఉంటాయి
రోకటి బండ కింద
పచ్చడి, పచ్చడవుతూనే వుంటాయి
నడుం బండకేసి బాదినా
కాటుక కంటినీట జాడించినా
మనసుల మురికి వదలనే వదలదు
ఆసులో కండెలా నిత్యం కదుల్తూనే
చలనం ఎరుగని కాళ్ళు
పిల్లర్లలా ఉన్న చోటనే పాతుకుపోతాయి
అలుగ్గుడ్డల పీతిబట్టల పరిమళంలో పునీతమవుతున్నా
జీవితం ఎందుకో ఎప్పుడూ
కాటు వాసన వేస్తుంటుంది

ఈ కవితలో అస్పష్టత ఏమాత్రము లేదు. అయినా యిది బహుశా మగవాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఈ కాలం ఆడవాళ్ళకి కూడా చాలామందికి అర్థం కాకపోవచ్చు, అది వేరే విషయం. కవితలోని కాటువాసన మనసుకి తగిలినప్పుడే యీ కవిత అర్థమైనట్టు. అది జరగాలంటే అలాంటి జీవితానుభవం కావాలి. కవితా రూపం కాని అందులోని శిల్పం కాని పాఠకునికి ఆ అనుభూతిని అందించడానికి ప్రత్యేకంగా సాయపడవు. ఇలాంటి కవితల నాణ్యత గురించి చర్చించే ఉద్దేశ్యం నాకు లేదు. ఇంతకుముందు చెప్పినట్టు, ఇవి ఒక రకంగా చూస్తే జానపద కవిత్వం వంటివి. ఇవి వ్రాసే కవులకి కవితారూపం మీద, రచనాశిల్పం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండదు. చదివే పాఠకులకి కూడ ఉండదు. వీటికి మార్గకవిత్వపు సూత్రాలను అన్వయించి విమర్శించాలనుకోడం సమంజసం కాదు.

ఉద్యమ కవితలని పక్కన పెడితే, సామాజికస్పృహ ఉన్నా లేకున్నా, అభివ్యక్తిలో సంక్లిష్టత ఉన్న కవితలని అర్థం చేసుకోడానికి పాఠకులనుండి కొంత సాధన అవసరమవుతుంది. ధ్వని, అధిక్షేపము, ప్రతీక, పదచిత్రం మొదలైన కవితా సామగ్రితో, శిల్పదృష్టితో రచించే కవితలని అర్థం చేసుకోడానికి, ఆ రచనా సామగ్రితో కొంత పరిచయం అవసరమవుతుంది. ఇందులో మళ్ళీ స్పష్టమైన పదచిత్రాలతో మూర్తమైన దృశ్యాలని వర్ణించే కవితలలో అస్పష్టత ఉండడు. ఆయా దృశ్యాలని మనసులో భావించుకొనే నేర్పుంటే చాలు, ఆ కవితలు చక్కగా అర్థమై మనసుకి హత్తుకుంటాయి. శేషేంద్ర పదచిత్రాలు రెండు దీనికి మంచి ఉదాహరణలు:

పైన చంద్రుడు
మబ్బుతునక వేలు పట్టుకుని
నడిపించుకుని పోతున్నాడు
కింద నా జీవిక నిశ్శబ్దంగా కురిసే వెన్నెట్లో
నిశ్చలంగా తడిసే అడవిలా నుల్చోనుంది

మబ్బుతునక వేలు పట్టుకుని సాగిపోయే జాబిలి, అది కురిపించే వెన్నెలా – ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే, అలాంటి ప్రకృతి రమణీయకతకి దూరమైన మన జీవితాలు ఎలా అడవికాచిన వెన్నెలై పోతున్నాయో మనకి స్పష్టంగా అనుభవానికి వస్తుంది. అలాగే,

భూమిలో ఉన్న
చిన్నారి గింజ
మెడ బయటపెట్టి
మొదట వచ్చిన రెండాకుల్ని
చేతులుగా జోడించింది
కృతజ్ఞతతో

తనకి జీవమిచ్చిన రైతుకి అప్పుడే మొలకెత్తిన గింజ తెలిపే కృతజ్ఞత ఎంత మనోహరమైన దృశ్యమో ఊహించకోగల పాఠకునికే తెలుస్తుంది. ఇలాంటి కవితల్లో అస్పష్టత ఉండదు. సంక్లిష్టత చాలా తక్కువ. పాఠకుడు చెయ్యవలసినదల్లా, కవితలోని పదాల రేఖలతో, వర్ణాలతో, ఆ దృశ్యాన్ని తన మనస్సులో చిత్రించుకోవడమే.

కొన్ని కవితలు కొంతవరకూ చదివేదాకా అవి ఏ అంశాన్ని గురించి చెపుతున్నాయో అర్థం కావు. కాని కొన్ని పంక్తుల తరువాత అందులోని విషయం స్పష్టమై, ముందు చదివిన వాక్యాలని మళ్ళీ చదివించి, మనసులో ప్రస్ఫుటమైన ముద్ర వేస్తాయి. కాబట్టి కవితని ఆసాంతం ఆసక్తితో చదవడం పాఠకుని బాధ్యత. ఒక ఉదాహరణ మెహజబీన్ గారి ‘సరిహద్దు రేఖలు’ కవిత:

“అక్కడ
జీవితం గాయపరిచిన పక్షులన్నీ
పేదరికం మూటగట్టుకుని వాల్తాయి
బాధలు గాధలు సమానత్వం పాటిస్తాయి
పెదాలు మూగవోతే కన్నీళ్ళు మాట్లాడతాయి”

ఇక్కడ వరకూ కవిత దేని గురించన్నది స్పష్టం కాదు.

“బతుకు కోసం పాడే ఏకగ్రీవ జావళీలో
జార్చిన కొంగులు, పర్చిన పైటలు
నేపథ్య సంగీతమై భాసిల్లుతాయి
యవ్వనీకరించిన బాల్యం
వికసిస్తూ చేసే చప్పుళ్ళకు మొగ్గలు
విహ్వలంగా రాల్తాయి”

అన్న పంక్తులు కవిత విషయాన్ని ధ్వనించి మళ్ళా మొదటి పంక్తులని మనచేత చదివిస్తాయి. అలా స్పష్టత ఏర్పడ్డ తరువాత, మిగతా కవిత బలమైన పదచిత్రాలతోను చక్కని ధ్వనితోనూ మన మనసులని కుదిపేస్తుంది.

“కలలు తగలబడుతున్న దృశ్యం
దారుణంగా గుండెను తాకుతుంది

అమ్ముకునే ప్రవాహ సుఖాల మధ్య
ఇంకిపోయే ఒంటరి కన్నీటి చుక్కలు
సమాజానికి సవాల్ విసురుతాయి

అక్కడ తరాల విలాసాల చరిత్ర
మిగిల్చిన సాంఘిక అవశేషాలు
మనల్ని తలెత్తుకోనీకుండా చేస్తాయి
‘మెహందీ’ శిథిల శకలాలు
సరిహద్దు రేఖల్ని గీస్తాయి”

ఈ కవితని అర్థం చేసుకోవడానికి మనకి కవితా వస్తువుతో నేరుగా పరిచయం అవసరం లేదు. కవితా నిర్మాణంలో ఉన్న శక్తి వలన అది మనలని బలంగా హత్తుకుంటుంది. కలలు తగలబడే ఒక అమూర్తమైన దృశ్యాన్నీ, ఇంకిపోయే ఒంటరి కన్నీటి చుక్కలనీ ఊహించుకొనే శక్తి పాఠకులకి ఉండాలి. ఆ ఊహ, ఆ అనుభూతి ప్రతి పాఠకునికీ ప్రత్యేకమే.

మరికొన్ని కవితలుంటాయి. అవి చివరికంటూ చదివినా పూర్తిగా అర్థం కావు. బొత్తిగా అర్థం కాకుండానూ ఉండవు. స్పష్టాస్పష్టమైన భావాలేవో మనసులో కదులుతాయి. కవిత చదవగానే, చిన్నదో పెద్దదో ఒక విద్యుత్ ఘాతం లాంటిది తగులుతుంది. ఆ కవితని మరల మరల చదువుకుంటాం. చదివే కొద్దీ రకరకాల ఆలోచనలు రేగుతాయి. ఇలాంటి కవితలని చదివిన ప్రతిసారీ అదొక కొత్త ప్రయాణమే అవుతుంది! అలాంటి కవితలకి ఒక ఉదాహరణ రేవతీదేవి అనే కవయిత్రి వ్రాసిన ‘ఈ రాత్రి’ కవిత.

“ఈ రాత్రి గడిస్తే
నిద్ర మాత్రలక్కూడా లొంగని
ఈ రాత్రి గడిస్తే
మనిషితో రాజీపడలేక పోయినందుకు
నా వీపుకింద అంపశయ్యలా పరుచుకున్న
ఈ రాత్రి గడిస్తే
దైవంతో రాజీపడలేక పోయినందుకు
నా నరాలలో ఈత ముళ్ళ నెత్తురై ప్రవహిస్తున్న
ఈ రాత్రి గడిస్తే
నిజాయితీ మొహాన
వెలుతురు దుప్పటి కప్పి మరోపగలు
యెప్పుడో మరో రాత్రి మరోపగలు
వెలుతురు దొరక్క
నిజాయితీ నగ్నంగా స్నిగ్ధంగా ఉండిపొతే
ఆ రాత్రి గడవకుండా నిలిచిపోతే
నేనే గతించి గడిచిపోతాను నిజాయితీగా”

ఈ కవిత చదివిన వెంటనే వెన్నులో చిన్నపాటి జలదరింపైనా కలగకపోతే, దాన్ని పక్కన గిరాటెయ్యడమే ఉత్తమం. మళ్ళీ చదివి ప్రయోజనం ఉండకపోవచ్చు. మొదటిసారి చదివినప్పుడు యీ కవిత అర్థం కాదు, కచ్చితంగా. ఆ మాటకొస్తే, ఎన్నిమార్లు చదివినా పూర్తిగా అర్థమవుతుందని చెప్పలేము. ఇది ఏభైశాతం కవి వ్రాసినది, మరొక ఏభైశాతం పాఠకుడు పూరించుకోవలసినది. అయితే, అలా పూరించుకొనేటప్పుడు, యీ వ్యాసం మొదట పేర్కొన్న గోమెజ్ దవీలా మాటని గుర్తు పెట్టుకోవాలి. కవి భాషని మనం అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి తప్ప పూర్తిగా మన భాషలోకి దాన్ని తర్జుమా చేసేసుకో కూడదు. కవి భాష ఏమిటో మనకి తెలిసేదెలా? కొంత కవితలోనే మనకి దొరుకుతుంది. ఆ కవి యితర కవితలలో మరికొంత దొరుకుతుంది. ఈ కవిత గురించి చాలా కాలం క్రితం ఈమాట పత్రికలో కొడవళ్ళ హనుమంతరావుగారు ఒక వ్యాసంలో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రచ్చబండ అనే గ్రూపులో దీని గురించి చాలానే చర్చ జరిగింది. అందులో యీ కవితకి నాకు తోచిన అర్థాన్ని నేను కూడా చెప్పాను. అయితే నేను చెప్పిన అర్థంతో సహా ఎవ్వరి అర్థమూ నాకు పూర్తిగా సంతృప్తినివ్వలేదు. కొన్ని యేళ్ళ తర్వాత యీ మధ్య మళ్ళీ యీ కవితని చదివాను. ఈ సారి గోమెజ్ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని చదివాను. ఇంతకుముందు చెప్పుకున్న అర్థాలన్నీ పాఠకులు తమ భాషలోకి తర్జుమా చేసుకున్నవని అనిపించింది. ఇప్పుడు నాకు తోచిన అర్థం కూడా కవి ఉద్దేశించినదే అని చెప్పలేను. కాని కవితని మరింత దగ్గరగా చూడగలిగానని నా నమ్మకం.

కవిత చదివిన వెంటనే స్థూలంగా అర్థమయ్యే విషయం – ఒక వ్యక్తి పడుతున్న తీవ్రమైన వేదన యీ కవితలో ఉంది. మనిషితోనూ దైవంతోనూ రాజీ పడలేక పోవడం వలన ఏర్పడిన పరిస్థితి యిది. అయితే యీ రాజీ పడలేక పోవడం దేనివలన అన్నది స్ఫష్టంగా లేదు. దీని గురించి, ఇంతకు ముందు చెప్పిన చర్చలలో రకరకాల ఊహలు చేశాము. అవన్నీ పాఠకుల ఊహలే తప్పిస్తే కవయిత్రి చెప్పినది కాదు. పాఠకుల ఊహ అన్నది, సాధారణంగా, కవితలో వ్యక్తమయిన దానిని మనసులో రూపుకట్టడానికి మాత్రమే ఉపయోగించాలి తప్పిస్తే, అందులో లేని దాని కోసం కాదు. కవి భాషని అర్థం చేసుకోడానికీ, సొంత భాషలోకి అనువదించుకోడానికీ ఉన్న తేడా యిదే. ఈ కవితని మరింత లోతుగా తెలుసుకోవాలంటే మరికొంత నిశితంగా పరిశీలించాలి. కవయిత్రి వర్ణిస్తున్న యీ వేదనంతా జరుగుతున్న సమయం ‘రాత్రి’. దీనికి కవయిత్రి చాలా ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. ఎందుకంటే ‘వీపుకింద అంపశయ్యలా పరుచుకున్నదీ’, ‘నరాలలో ఈతముళ్ళ నెత్తురై ప్రవహిస్తున్నది’ ఈ రాత్రే. కవిత శీర్షిక కూడా ‘ఈ రాత్రి’. ‘రాత్రి’కి ఎందుకంత ప్రత్యేకత? ఇంతటి వేదన అనుభవించేది నిజంగా రాత్రి సమయమే అయి ఉండాలి, లేదా, వేదన అనుభవిస్తున్న సమయాన్నంతటినీ ఏదో కారణం వలన రాత్రిగా పోలుస్తూ ఉండి ఉండాలి. ఇందులో ఏదై ఉండవచ్చు? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మళ్ళీ కవితని చదవాలి, చివరికంటూ. ‘నిజాయితీ మొహాన వెలుతురు దుప్పటి కప్పి మరోపగలు’ – ఈ రాత్రి గడిస్తే వచ్చేది ఇది! వెలుతురు సాధారణంగా జ్ఞానానికి ప్రతీక. దాన్ని యీ కవయిత్రి యిక్కడ వ్యత్యస్తం చేసేశారు. ఈ వెలుతురు, నిజాయితీని కప్పేసే దుప్పటి! అలాంటి వెలుతురునిచ్చే మరో పగలు, రాత్రి గడిస్తే వచ్చేది. అంటే ప్రతి పగలు అలాంటిదే అన్నమాట. పగలు నిజాయితీని కప్పేస్తోంది. అంటే మోసానికి తెర తీస్తోంది. రాత్రి నిజాయితీని బట్ట బయలు చేస్తోంది. ఆ నిజాయితీయే మనిషితోనూ, దేవునితోనూ కూడా రాజీపడకుండా చేస్తోంది. ఆ రాజీపడలేనితనమే జీవితాన్ని దుర్భరం చేస్తోంది. అలా మరో పగలు, మరో రాత్రి. ఆఖరికి ఎప్పుడైనా నిజాయితీని కప్పడానికి వెలుతురు దుప్పటి దొరక్కపోతే, నిజాయితీ నగ్నంగా, స్నిగ్ధంగా ఉండిపోతుంది. అప్పుడా రాత్రి గడవకుండా నిలిచిపోతుంది. అప్పుడేమవుతుంది? రాజీపడలేక సతమతమవుతున్న ఆ వ్యక్తి నిజాయితీగా గతించిపోతుంది (పోతాడు). ఈ కవయిత్రి కవితలన్నీ శిలాలోలిత అనే పేర సంకలనంగా వచ్చాయి. అందులోని కవితలని చదివితే, ఈ కవయిత్రికి నిజాయితీ పట్ల ఉన్న అమితమైన నిబద్ధత, అది లేని లోకంపైన కోపం అసహనం, మనకి స్పష్టంగా గోచరిస్తాయి. ఈ కవితలోనూ ఉన్నది అదే. మనం ప్రపంచంతో సాహచర్యం చేసేది పగటిపూటనే కదా. ఈ కవితలోని ‘నేను’ (బహుశా కవయిత్రే) బాహ్యప్రపంచంలో (పగటిపూట) నిజాయితీగా బ్రతకలేకపోతోంది. కాని తన అంతరంగానికి (రాత్రిపూట) తానేమిటో తెలుసు. బాహ్య అంతర్ ప్రపంచాలకి ప్రతీక పగలు రాత్రి. రాజీ పడుతున్నది బాహ్యప్రపంచంలోని మనుషులకీ, విధికే. అయినా అది తెలుస్తున్నది నిజాయితీ నగ్నంగా దర్శనమిచ్చే అంతరంగానికి. అందుకే అంతరంగం అతలాకుతలమవుతోంది. ఆ యుద్ధంలో అంతరంగం గెలిస్తే ఏమవుతుంది? నిజాయితీ నగ్నంగా స్నిగ్ధంగా ఉండిపోతుంది. బాహ్యప్రపంచానికి ‘నేను’ దూరమైపోతుంది. గతించి, గడిచిపోతుంది.

ఒక చిన్న కవిత మీద ప్రతి పాఠకుడూ ఇంతటి పరిశీలన చెయ్యాలా అంటే, అక్కరలేకపోవచ్చు. ముందు చెప్పినట్టుగా, యీ కవిత చదివిన వెంటనే వెన్నులో చిన్నపాటి జలదరింపైనా కలిగినవాళ్ళకే ఇంత ప్రయాస పడవలసిన అగత్యం ఏర్పడుతుంది. లేకపోతే అవసరం లేదు.

కవిత్వ వస్తువు సంక్లిష్టమయ్యే కొద్దీ దాని అభివ్యక్తిలో కూడా సంక్లిష్టత ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి కవిత్వాన్ని అర్థం చేసుకోడానికి మరింత పరిశ్రమ సాధన అవసరమవుతాయి. నాకే జన్మభూమీ లేదు! అన్న యీ కవిత దీనికొక ఉదాహరణగా తీసుకోవచ్చు:

శూన్యం తల కింద
నేనేదో వొక అవయవాన్ని.

నేనెక్కణ్ణించి పుట్టానో
ఎలా పెరిగానో
’47 దగ్గిరే ఎలా విరిగానో

మీరెవరూ చెప్పలేదుగా –

దేవుడి అంగాంగాన్ని పంచుకొని కోసుకోనీ
లేదంటే దోచుకోనీ వెళ్ళిన మీరంతా
నాకేమీ మిగల్చలేదుగా –

నేను శరీరం లేని నీడని
ఏ గోడ మీంచో రహస్యంగా
పారేయబడిన ఆత్మని –

దేశ దేశాలూ పట్టుకు తిరుగుతున్నాను
అన్ని దేశాలూ నావే అనుకుంటున్నాను
ఊరూరూ ఇల్లిల్లూ నాది నాదనే అనుకుంటున్నాను
ఏ తుమ్మెదా నా చిరునామా చెప్పదు.

ఇక్కడెక్కడో నా కాళ్ళ కింద నేలని
కుంకుమ చేతులు కోసుకెళ్ళిపోయాయి.

అక్కడెక్కడో కూలిన గోపురాల దుమ్మంతా
రెపరెపలాడ్తున్న నా దేహమ్మీద సమాధి కడుతోంది.

రెప్పల వస్త్రాలు కళ్ళకి కప్పి
నా వొంటి మీది చల్లని మాంసాన్ని
ఎవరెవరో అపహరిస్తున్నారు.
నా వొళ్ళు వొక అల్ కబీర్!

నాకు నేనే గుర్తు తెలియని శవాన్నయి
బొంబాయీ నెత్తుటి రోడ్ల మీద కుప్పకూలిపోతున్నాను.

నేనెవ్వరికీ అంతు దొరకని కూడలిని
నా మీంచి ఎవరెటు వెళ్తారో తెలీదు.

నిజంగా నేను శూన్యలోక వాసిని
ఎక్కడయినా ఎప్పుడయినా ప్రవాసిని.

నాలో సగాన్ని చీకట్లో ముంచి
ఇంకో సగం అంతా వెలుగే వెలుగు అనుకుంటున్న భ్రమని.

నా లోపలి వలయాల్లో నేనే దూకి
కాలం ఆత్మని క్షణ క్షణం హత్య చేస్తున్న వాణ్ని.

అర్ధ రాజ్యాలూ అంగ రాజ్యాలూ కోరను
నా నాడుల్ని నాకు కోసిమ్మనడానికి
ఏ భాషా లేని వాణ్ని.

శవమయి దాక్కోడానికి వున్నా లేకపోయినా
తల దాచుకోవడానికి చారెడు నేల చాలంటాను.

ఉన్న చోటే పవిత్రమనుకుంటున్న వాణ్ని
ఎక్కడెక్కడో అంటీ ముట్టని బట్టలా విసిరేయొద్దంటాను.

నలభై ఏడుతో కాదు
నాతో నన్నే భాగించ మంటాను.
నా నవ్వులూ నా ఏడ్పులూ
నా అవమానాలూ, నా అనుమానాలూ
నా మాన భంగాలూ హత్యలూ
అన్నీ మీవి కూడా అంటాను.

నా తల్లి వుమ్మ నీరుని వుమ్మి చెయ్యొద్దంటాను.

విభజించి పాలించే నా శత్రువులారా,

నన్నెవరూ రెండుగా చీల్చలేరు.
నా కనుపాపల్ని ఎవరూ పేల్చలేరు.

ఈ కవిత సాధారణ పాఠకుడికి అర్థమవ్వడం కష్టమే. ఇది వ్రాసిన కవి ఒక భారతీయ ముస్లిం అన్న సంగతి ముందు పాఠకుడికి తెలియాలి. ఈ కవి వ్రాసిన కవిత్వం కొంత చదివి ఉండాలి. అప్పుడే యీ కవితలోని వస్తువు కాస్తంత బోధపడుతుంది. ఒక భారతీయ ముస్లిం అస్తిత్వ వేదన ఇందులోని వస్తువు. ఆ అస్తిత్వం – అనేక దృక్పథాల, అనేక సంఘర్షణల కలగాపులగపు సంక్లిష్ట స్వరూపం. ఆ సంక్లిష్టత కవితలోనూ ఉంది. దానికి తోడు అభివ్యక్తిలో ప్రత్యేకత కోసం వాడిన ప్రతీకలు, ధ్వని, సంక్లిష్టతని మరింత ఎక్కువ చేస్తున్నాయి. అయితే, కవితాభివ్యక్తిని శక్తివంతం చేస్తున్నవి కూడా అవే. సరిగా అర్థం చేసుకుంటే, ఒక భారతీయ ముస్లిం తన అస్తిత్వంలో అనుభవిస్తున్న ఒక శూన్యత, అనేక వైరుధ్యాలు యీ కవితలో స్పష్టంగా సాక్షాత్కరిస్తాయి. భారతీయ వర్ణవ్యవస్థలో ఇమడనితనమూ, అనుభవిస్తున్న పరాయితనము, దేశంతో పూర్తిగా ముడిపడని అస్తిత్వమూ, మొఘల్ కాలపు మతదౌష్ట్యాలు ఇంకా తనపై ప్రభావం చూపడమూ, మైనారిటీ రాజకీయాలు – ఇలా ఎన్నెన్నో ధ్వనిస్తాయి. ఇందులోని ఆత్మీయత, అభివ్యక్తిలోని నేర్పరితనము, యీ కవితని ఇతర అస్తిత్వవాద ఉద్యమ కవితలనుండి వేరు చేస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకోవాలంటే కవి నేపథ్యం తెలియాలి. కవిత్వ వస్తువుపై కొంత అవగాహన, సానుభూతి ఉండాలి. ప్రతీకలని, ధ్వనిని సరిగా అర్థం చేసుకొనే అనుభవమూ ఉండాలి. ఈ కవిత వ్రాసిన కవి అఫ్సర్.

ఇక అన్నిటిలోకీ అసలు కొరుకుడు పడని కవిత్వం అధివాస్తవికత నిండిన కవిత్వం. దీనికి తెలుగులో ఆద్యుడని చెప్పదగ్గవారు శ్రీరంగం నారాయణబాబు. అతను అధివాస్తవికుల మతాన్ని గురించి చెప్పిన మాటలివి:

“యథార్థ జగత్తూ స్వాప్నిక జగత్తూ తారుమారయ్యాయి. యథార్థాన్ని గుర్తించము. కలలు మాకు యథార్థాలు. ఈ జగత్తుతో మాకు పనిలేదు. మాది స్వప్నజగత్తు. సంపన్నులూ, భాషాసంపన్నులూ మాకు విరోధులు. కావ్యలక్షణాలే అవలక్షణాలు. అందరం కవులమే. వ్యక్తాలని వదిలిపెడతాము. వ్యక్తావ్యక్తంలో ఈత కొడతాము. ఏదో విధమైన శక్తి మమ్మల్ని పూనుతుంది. ఎదేదో రాయిస్తుంది. అర్థమనర్థం. అదేది రాయిస్తే అదే కవిత్వం. ఇది అధివాస్తవికుల మతం. సాహిత్య వృక్షం మీద, చిటారికొమ్మన కూర్చొని ఊగిసలాడడం. ఇది సాహిత్యానికి గొప్ప ప్రయోజనం, అనర్థం కూడా సమకూరుస్తుంది. కేవలం ప్రయోజనాన్నే వినియోగించుకొని, అనర్థాన్ని విసర్జించడం కొమ్ములు తిరిగిన కవి చెయ్యగలపని. అధివాస్తవికులు తీసుకువచ్చిన మార్పు రాజకీయమైందా? మనో ప్రవృత్తికి చెందినదా? Goerge Hugnet, “son ton destructeur” అన్న మాట నిజం!”

ఈ మాటలు చదివితే, అధివాస్తవిక కవిత్వం మరొకరు అర్థం చేసుకోడానికి ఉద్దేశించినది కాదని అర్థమవుతుంది. పైన చెప్పిన విషయాలే ఒక కవితా రూపంగా కూడా చెప్పారు నారాయణబాబు, నీ వెవరే! అనే కవితలో:

పాడే రేడియో!
నా చేతిని గడియారం
కనిపించని
కాలం గుఱ్ఱం
డెక్కల చప్పుడు
“టిక్కు! టిక్కు!”

దరిద్రంతో
తాపత్రయాలతో
వెంటాడిన
వెఱ్ఱికుక్క
దినానికి
తిలోదకాలు!

హాయిగా
అర్థరాత్రి
ఆడామగా
తడిమినా తెలియని
తాండ్రపాపారాయుడు
తమస్సు!

బుద్ధి హృదయం
ధ్యానబద్ధులై
నిమీలిత నేత్రాలతో
నిద్రిస్తే
వ్యక్తావ్యక్త లోకంలోంచి
వెలుగుబాటలు
చూపించే
నీవెనరే!

నిజానికి యీ కవిత బొత్తిగా అర్థం లేనిది కాదు. మరికొన్ని కవితలతో పోలిస్తే కొంతలో కొంత అర్థమయ్యేది కూడాను. అయినా ఇది అర్థవివరణ అపేక్షించే కవిత కాదు. పైన ఉదహరించిన కవితల్లా దీనికి ఎవరో ఒక వ్యాఖ్యానము, ఒక అన్వయమూ చెప్పకూడదు. ఎవరికి వాళ్ళు చదువుకోవలసినదే. ఈ కవిత్వం పాఠకునిపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చాలావరకూ పాఠకునిపైనే అధారపడి ఉంటుంది. కవి చెప్పినది పది శాతమైతే, పాఠకుడు పూరించుకోవలసినది తొంభై శాతం! అధివాస్తవికత అందరికీ అరిగే దినుసు కాదు. మనకు అరగని దాన్ని ఆరగించకపోవడమే శ్రేయస్కరం.

వ్యాఖ్యానాన్ని అపేక్షించని కవిత్వం, అధివాస్తవిక కవిత్వానికి పూర్తిగా వ్యతిరిక్తమని చెప్పదగినది, మరొకటి ఉంది. ఈ కవిత్వాన్ని అనుభూతికవిత్వం అన్న పేరుతో కొంతమంది పిలుస్తారు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారితో మొదలయిన యీ తరహా కవిత్వం ఇస్మాయిల్ గారితో ఎక్కువ ప్రచారం పొందింది. ఇస్మాయిల్ గారి యీ మాటలు అనుభూతికవిత్వ తత్త్వాన్ని పట్టిస్తాయి:

“ఈ అనుభూతి కవితలో ఆలోచనకీ, తర్కానికీ, విశ్లేషణకీ స్థానం లేదు. మన పంచేంద్రియాల్ని తాకే పద చిత్రాలద్వారా మన అనుభూతిని మేలుకొలుపుతాడు కవి. తను ఉద్దేశించిన సంవేదనల్ని (feelings) మనలో రేపే పదచిత్రాల్ని (images) ఎన్నుకుంటాడన్నమాట. అనుభూతికి అవరోధమయే ఆలోచనా సామాగ్రిని దరికి జేరనివ్వడు. అనుభూతి ద్వారా మనిషికి స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. ఆ అనుభూతి స్వరూపం ఆనందం. ఇంతకన్నా పరమార్థం వేరే ఉందనుకోను.”


ఈ తత్త్వం తెలిసిన పాఠకునికే ఈ కవిత్వం అర్థమవుతుంది. ఒక రకంగా చూస్తే ఇలాంటి కవిత్వ సృజనలో కవి పాత్ర నూరుశాతం, పాఠకుని పాత్ర కూడా నూరుశాతమే! ఉదాహరణకి మూలా సుబ్రహ్మణ్యంగారి ‘మంచు’ కవిత చూడండి:

చలికాలపు సాయంత్రం
ఎవ్వరూ లేని బాట మీద
ఏకాకి నడక.

రాలిన ఆకుల కింద
ఎవరివో గొంతులు

ఎక్కడో దూరంగా
నిశ్శబ్దపు లోతుల్లోకి
పక్షి పాట

లోయంతా సూర్యుడు
బంగారు కిరణాలు పరుస్తున్నా
కాసేపటికి ఆవరించే చీకటి మీదకే
పదే పదే మనసుపోతోంది

కర్రపుల్లల కొసన నర్తించే
ఎర్రని చలిమంటలోకి
ప్రవేశించాలనిపిస్తోంది.

కురిసే మంచు
నా గొంతులో
ఘనీభవిస్తోంది.

ఈ క్షణం నా పాటకి
మాటల్లేవు!

కొన్ని దృశ్యాలని కవి ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు. ఒక సన్నివేశంలో తనకి కలిగిన ఒకానొక అనుభూతికి అక్షరరూపమిచ్చే ప్రయత్నం చేశాడు. ఇందులో అస్పష్టతకి తావులేదు. ఆలోచనకీ విశ్లేషణకీ కూడ తావులేదు. చదివిన పాఠకులకి ఎవరి అనుభూతి వారిదే, పూర్తిగా. అయితే, యీ కవితలో కవి గొంతు కొంత ఉంది. అంటే, కేవలం దృశ్యాన్ని పదచిత్రాలతో వర్ణించి ఊరుకోకుండా, తను పొందిన అనుభూతిని కూడా పదాలలో పెట్టే ప్రయత్నం కవి చేశాడు. అనుభూతికవిత్వంలో పదచిత్రాలు మాత్రమే ఉండాలన్న నియమం లేదు. కవి పొందిన అనుభూతిని వ్యక్తం చెయ్యడానికి పదచిత్రాలు ఒక సాధనం మాత్రమే. అయితే కొన్నిసార్లు కవి పూర్తిగా మౌని అయిపోయి, కేవలం అతను చూసిన దృశ్యాలు మాత్రమే ఉండటం కూడా జరుగుతుంది. అలాటి కవితల్లో పాఠకునికి పూర్తి ఏకాంతం దొరుకుతుంది. ఉదాహరణకి సుబ్రహ్మణ్యంగారిదే మరో కవిత:

ఎగురుతూ ఎగురుతూ
చటుక్కున కొలను బుగ్గని
ముద్దు పెట్టుకుంది తూనీగ

తెరలు తెరలుగా….
సిగ్గు.

ఇలాంటి కవిత్వానికి హైకూ పరాకాష్ఠ. ఉదాహరణకి:

గుడిగంట మీద
సీతాకోక చిలుక
నిదురిస్తూ

అన్న హైకూ అర్థమేమిటి? కవి ఏం చెపుదామనుకుంటున్నాడు? అనే మీమాంస అసమంజసము, నిష్ప్రయోజనమూను. కవి ఒకానొక దృశ్యంలో లీనమై, మమేకమై ఆ దృశ్యాన్ని అతి క్లుప్తంగా, స్వచ్ఛంగా, నిశ్శబ్దంగా, పదాలలో వ్యక్తపరచాలని ప్రత్నించినపుడు హైకూ పుడుతుంది. అలా మమేకమైనప్పుడు కవి పొందిన అనుభూతి ఏమిటో కవి కూడా చెప్పలేడు, చెప్పే ప్రయత్నమూ చెయ్యడు. ఆ పదాల వెనక కనిపించే దృశ్యాన్ని పాఠకుడు కూడా దగ్గరగా చూడగలిగినప్పుడు, అందులో అంతో ఇంతో లీనమవ్వగలిగినప్పుడు, ఆ పాఠకునిలో ఆ హైకూ పునర్జన్మ పొందుతుంది. చదవగానే అలాంటి మమైక్యం కలగకపోవచ్చు. దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించినా అది కలగదు. దాన్ని మరల మరల చదువుకొని, మనసులో ఆ దృశ్యాన్ని రూపుకట్టుకొనే ప్రయత్నం చెయ్యగా చెయ్యగా ఎప్పటికైనా కలగవచ్చు. అదొక యోగం!

ఇలా, ఒకో రకమైన కవిత్వాన్ని అర్థం చేసుకోడానికి ఒకో రకమైన సాధన అవసరమవుతుంది. కొంతమంది విమర్శకులకి కవిత్వాన్ని యిలా రకరకాలుగా విభజించడం నచ్చదు. కాని అలాంటి విభాగం వలన కూడా ప్రయోజనాలున్నాయి. కవిత్వంలో ఒకో విభాగాన్ని కొన్ని ప్రత్యేక లక్షణాలతో గుర్తుపట్ట గలిగినప్పుడు, అలాంటి కవిత్వాన్ని అర్థం చేసుకోడానికి అవసరమైన ప్రత్యేక సాధనాలని గుర్తించే అవకాశం ఉంటుంది. కవిత ఒక బీజమైతే, అది పండే క్షేత్రం పాఠకుని మనసు. కవిత్వపఠనం ఒక కృషి, వ్యవసాయం. ఒక్కొక్క రకమైన విత్తనాలు ఒక్కొక్క రకమైన నేలలోనే మొలకెత్తుతాయి. ఒకో పంటని సాగు చెయ్యడానికి ఒకో రకమైన వ్యవసాయ విధానం అవసరమవుతుంది. కవిత్వపఠనమూ అంతే!

ఈ వ్యాసం కేవలం పాఠకుని దృష్టికోణం నుండి వ్రాసినది. అందుకే యిందులో పాఠకుడు కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి చెయ్యవలసిన కృషిని మాత్రమే ప్రస్తావించాను. అంత మాత్రం చేత కవికి ఎలాంటి బాధ్యత లేదని అనుకోడం పొరపాటు. మేమెలాంటి కవిత్వం వ్రాసినా దాన్ని పాఠకులు అర్థం చేసుకోవాలి, లేకపోతే అది పూర్తిగా వారి లోపమే అని కవులు అనుకుంటే అది వాళ్ళ నిరంకుశత్వం అవుతుంది. కవిత్వం చదవడంలో పాఠకునికి ఎంత బాధ్యత ఉందో, వ్రాయడంలోనూ కవికి అంతే బాధ్యత ఉంది. తను ఎన్నుకున్న వస్తువుకి తగిన రూపాన్ని, శైలిని ఎన్నుకొనే నేర్పు కవికి తప్పనిసరిగా ఉండాలి. తాము ఎందుకు, ఎలాంటి కవిత్వం వ్రాయదలుచుకున్నారు అన్న విషయం మీద స్పష్టత ఉండాలి. ఉదాహరణకి, యీ మధ్య ఇంటర్నెట్ ప్రభంజనంతో చాలామంది కొత్త కవులు పుట్టుకు వచ్చారు. తాము వ్రాసిన కవితలని ఏదో పత్రికకి పంపించి అందులో పడుతుందా లేదా అని వేచి చూడనక్కర లేకుండా, తమ స్వంత సైట్లలోనో, బ్లాగులలోనో ప్రచురిస్తున్నారు. ఇంటర్నెట్లో సాహిత్యాన్ని ఆ మధ్య నిడదవోలు మాలతిగారు జానపద సాహిత్యంతో పోల్చారు. ఆ పోలిక ఒక రకంగా సమంజసమైనదే. ఇందులో చాలావరకూ కవితలు అప్రయత్నసిద్ధాలుగా (spontaneous) అనిపిస్తాయి. శైలీ, శిల్పాల మీద దృష్టి తక్కువగా కనిపిస్తుంది. ఇవి జానపద కవిత్వ లక్షణాలే. పత్రికలు సాధారణంగా శైలీ శిల్పాలకోసం చూస్తాయి. విమర్శకులు కూడా అంతే. మరి తమ కవితలు పత్రికలలో ప్రచురించడం లేదనో, విమర్శకులు మెచ్చి మేకతోలు కప్పడం లేదనో విచారించడం అవివేకమే అవుతుంది. తాము వ్రాసేది అటువంటి వారి మెప్పుకోసం కాదన్న స్పష్టత వారికి ఉండాలి.

కవికీ పాఠకునికీ కూడా అన్నిటికన్నా ముఖ్యంగా, తప్పనిసరిగా ఉండాల్సింది నిజాయితీ.

గోమెజ్ దవీలాదే మరొక వాక్యోక్తితో యీ వ్యాసం ముగించడం సమంజసం.

 The modernist thirst for originality makes the mediocre artist believe that the secret of originality consists simply in being different.