శిలాంతరాళలోలిత రేవతీదేవి

అది 1982వ సంవత్సరం ఎండాకాలం. నేను మద్రాసులో ఇంజనీరింగు చదువుతున్న రోజులు. వేసవి శిక్షణ కోసమని ఢిల్లీ వెళ్ళి జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం హాస్టల్లో మా బంధువు గదిలో తలదాచుకున్నా. ఇంకెవరూ తెలిసిన వాళ్ళు లేరు. నాకు హిందీ రాదు. ఒకరోజు భోజనాల దగ్గర ఎవరో తెలుగు పుస్తకం చదువుతుంటే ప్రాణం లేచి వచ్చింది. ఎప్పుడూ పేరు వినని కవయిత్రి రేవతీదేవి రాసిన కవితా సంపుటి ‘శిలాలోలిత‘ .

అప్పట్లో తెలుగు కథలూ, నవలలూ, కాస్త కవిత్వమూ మక్కువతో చదివే వాణ్ణి. అడిగి పుస్తకం తీసుకొని కవితలన్నీ చదివితే, అదేదో కొత్త అనుభూతి కలిగింది. ఆ తరువాత నేను అమెరికాలో స్థిరపడి, కొంత అందుబాటులో లేక, మరికొంత తీరుబాటు చేసుకోక, తెలుగు సాహిత్యానికి దూరమయ్యాను. పది కాదు, ఇరవై ఏళ్ళు గడిచాయి. “ఈలోపల ఆస్తి సంపాయించడం, పిల్లల్ని కనడం, ధరలు హెచ్చడం కాక”, జీవితంలో ఇంకా అమితంగా ప్రభావం చేసిందేవన్నా ఉందా అంటే ఉంది. అది నిత్య జీవితం నుండి తెలుగు నిష్క్రమించడం వలన కలిగే భయంకరమయిన వెలితి. ఆ లోటును కొంతవరకైనా తీర్చుకోడానికి, గత సంవత్సరం నుండి తిరిగి చదవడం మొదలెడితే, అక్కడక్కడ రేవతీదేవి పేరు వినపడుతోంది.

సాహిత్యం నా వృత్తీ గాదు, ప్రవృత్తీగాదు. ఇది సాహితీవిమర్శ కాదు. అందుకు కావలసిన శక్తి, సామర్థ్యాలు నాకు లేవు. కాని ఆవిడకి రావలసిన గుర్తింపు రాలేదని, చాలా మందికి ఇప్పటికీ ఆమె కవిత్వం గురించి తెలియదని, తెలుసుకోవాలసిన అవసరం ఉందని, సాహిత్యాభిరుచిగల ఓ సగటు పాఠకుడిగా స్పందించి చేసే పరిచయం మాత్రమే.

ఈ వ్యాసానికి ప్రేరణా, మూలం, రచ్చబండలో రేవతీదేవి గురించి నేను చేసిన రాద్ధాంతం. సభ్యులకీ నాకూ మధ్య సంభాషణలలో పరస్పర నిందారోపణలు జరిగినా, అవి దీంట్లో కాస్త జొరబడితే అది నా భావ వ్యక్తీకరణ సౌలభ్యానికే గాని, వాళ్ళని ఇక్కడ విమర్శించాలని మాత్రం కాదు. అలా అనిపిస్తే క్షమించగలరు. నిజానికి నా భావాలకి ఈ రూపం కలిగించడంలో దోహదపడినందుకు వాళ్ళకు నేను రుణపడి ఉన్నాను..

1935 లో ముద్దుకృష్ణ ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర లో కెల్లా ముఖ్యమైన కవితా సంకలనం “వైతాళికులు” ని వెలువడించారు. దాంట్లో ప్రతిభావంతులయిన కవులు పాతికమందికి పైగా ఉంటే, వారిలో ఉన్నది ముచ్చటగా ముగ్గురు కవయిత్రులు. నాలాంటి సామాన్య పాఠకుడే కాదు, చాలా మంది సాహితీవేత్తలు కూడా ఆ ముగ్గురి పేర్లూ చెప్పలేరు.

నవలా సాహిత్య సృష్టిలో, 1960, 1970 దశాబ్దాల నాటికి కొందరు రచయిత్రులే అగ్రస్థానం వహించినా, కవిత్వ ప్రక్రియలో మాత్రం పరిస్థితి పెద్దగా మారలేదు. కాని 1980 దశాబ్దం చివరా, 1990 దశాబ్దపు మొదటా చాలా మంది స్త్రీలు కవితా రంగంలో ప్రవేశించి కొద్దికాలంలోనే చెప్పుకోదగ్గ స్థాయిని చేరుకున్నారు. ఇప్పుడెవరైనా సమకాలీన కవితా సంకలనం వేస్తే, కవయిత్రుల భాగం సగం కాకపోయినా చెప్పుకోదగినదిగా ఉంటుందనుకుంటాను. దీనికి 1982 అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా గుర్తింఛడం కొంత చైతన్యాన్ని తెప్పించి ఉండవచ్చు.

రేవతిదేవి తన కవితలన్నీ రాసింది 1979లో, అవి ప్రచురించబడ్డది 1981లో. అంటే రేవతీదేవి రాసిన అయిదారేళ్ళకి గాని కవయిత్రుల ప్రభంజనం మొదలుకాలేదు.ఆవిడ కవితలలోని అంతర్మథనం, సమాజపు విలువల పట్ల సందేహం, నిరసన, చూస్తే ఆవిడ మిగిలినా వాళ్ళకంటె కాస్త ముందుందని తెలుస్తుంది.

సాహిత్య ప్రయోజనం గురించి మన సాహితీకారులు అనేకవిధాలుగా వ్యాఖ్యానించారు. వాటన్నిటిలోకి నాకు నచ్చింది కొడవటిగంటి కుటుంబరావు సుభాషితం: “జీవితాన్ని విమర్శించడం, అలంకరించడం, సాహిత్యం చెయ్యగల ఉత్తమకార్యాలు. ఇదే సాహిత్యం యొక్క ఉత్కృష్ట ప్రయోజనం.”

సువిశాలమైన సాహిత్యం వల్ల కలిగే కార్యం నాలుగు మాటల్లో చెప్పడం ఎవరి తరమూ కాకపోయినా కొడవటిగంటి మాటలు మార్గదర్శికమైనవి. ఎంత విశాలంగా, లోతుగా, విమర్శించి, అలంకరించి, ఎన్ని జీవితాలని ప్రభావితంచేస్తే అంత గొప్ప సాహితీకారులవుతారు.

దూరం

ఎంతెంత దూరం కోసెడుకోసెడు దూరం
అంటూ ఆడుకున్న చిన్ననాడు
దూరమంటే ఏమిటో తెలీనే తెలీదు

అలిసే దాకా నడిచినా
అలసట తెలిసేదిగానీ
దూరం తెలిసేది కాదు

పక్కవాళ్ళకీ మనకీ మధ్య
గొప్పలు తప్ప మరేమీ చెప్పుకోలేని దూరం

మనసుకీ మనసుకీ మధ్య
అనాత్మీయపు కంచుగోడల దూరం
తల్లిదండ్రులకీ పిల్లలకీ మధ్య
వయో, తారతమ్యాల తారుపొరల దూరం

మనిషికీ మనిషికీ మధ్య
వైరుధ్యాల చీలికగీతల దూరం

ద్వంద్వ ప్రమాణాల పితృస్వామికంలో
పెళ్ళికాని తల్లికి బిడ్డకీ మధ్య
మూగవేదనల కారుచీకట్ల దూరం

కొన్నేళ్ళుగా కాపురం చేస్తున్న భర్తకీ భార్యకీ మధ్య
మనసెరగని గానుగెడ్ల దూరం

దూరం లేనిది
శరీరానికి శరీరానికి మధ్య మాత్రమే
పావలా ఇచ్చినా చాలు
సూత్రం తాడు కట్టినా చాలు

ఎంతో దూరాన వున్న తనకీ నాకూ మధ్య
కనీసం గాలి చొరబడటానిక్కూడా
ఖాళీ లేని ఈ దూరం అద్వైతదూరం

దీంట్లో “నా” అని ఉన్నంత మాత్రాన ఇది రేవతీదేవి సొంత బాధగా తీసుకోకూడదు. ఇది మన సమాజంలో అడుగంటిపోతున్న ప్రేమానురాగాల కి స్పందన. ప్రజలూ, సమాజమూ, ప్రపంచమూ అనగానే వీడెవడో కమ్యూనిస్టు లాగున్నాడే అని కలవరపడ నవసరం లేదు.

“నా రచనలలో లోకం ప్రతిఫలించి / నా తపస్సు ఫలించి / నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ / నా జాతి జనులు పాడుకొనే మంత్రంగా మ్రోగించాలని” తతహలాడాడు ఒక మహాకవి. కొందరి దృష్టిలో గత శతాబ్దానికల్లా ఉత్తమమైన కవితలో.

“To create delight, you have to know the world. / There is no poetry without the world.” అని తీర్మానించారు మరో మహాకవి. కొందరి దృష్టిలో గత శతాబ్దపు ఒకే ఒక మహాకావ్య ప్రారంభంలో.

ప్రపంచ దృక్పధాల్లో శ్రీశ్రీ-విశ్వనాథ తూర్పు-పడమర అయినా కవిత్వానికీ ప్రపంచానికీ గల సంబంధాన్ని గురించి వారిద్దరికీ సారూప్యం ఉంది.

కవయిత్రి సొంత బాధ మాత్రమే అయితే మన హృదయాలని తాకదు. ఒకవేళ తాకినా అనుభూతి వేరుగా ఉంటుంది. ఉదాహరణకి, మన సంఘం దేవుడి వరం వల్ల మారిపోయి, రేవతీదేవి “దూరం”లో ప్రస్తావించిన చిన్నా- పెద్దా, ఇరుగు-పొరుగు, ఆడ-మగ మొదలైన వ్యత్యాసాలు మాయమయాయనుకోండి. అప్పుడా గీతం కవయిత్రి సొంత బాధగా మాత్రమే మిగిలిపోతుంది. మనం స్పందించే తీరులో తేడా వుంటుంది:

మతిచెడ్డ రచనలని కొట్టి పారేయవచ్చు; పోనీలే, మనకా బాధలు లేవు అని మన అదృష్టానికి భగవంతుడికో దండం పెట్టొచ్చు; లేదా, అయ్యో, ఎన్ని కష్టాలు పడి పోయింది, అని ఆవిడ దురదృష్టానికి మన హృదయం కరిగిపోవచ్చు. కాని ఇవేవీ ఉత్తమ కవిత్వమిచ్చే అనుభవ లక్షణాలు కావని నా విశ్వాసం.

కవయిత్రి సొంత బాధ అయినా కాకపోయినా, అది పాఠకుడి జీవితానికి దగ్గరగా ఉంటే కలిగే అనుభూతి వేరుగా ఉంటుంది. “దూరం” లో ప్రస్తావించిన తారతమ్యాలు చాల వరకు నా జీవితంలో, నా చుట్టూ ఉన్నాయి. ఈ కవిత నా జీవితాన్ని కళాత్మకంగా విమర్శిస్తుంది, సంస్కరిస్తుంది; అందువలన దాంట్లో తాదాత్మ్యం చెందుతాను. కాని నా ఒక్కడిమీద మాత్రమే ఆప్రభావముంటే గొప్ప కవిత్వం కాదు; రచ్చబండ మీద, ఈమాట లోనూ ప్రస్తావించ నవసరం లేదు. నాలాంటి కొన్ని లక్షల మంది పాఠకులని స్పందిస్తే అది సార్థకమవుతుంది. ఉత్తమ కవితగా నిలుస్తుంది.

అలా ప్రభావం చెయ్యాలంటే, కవి ప్రజాబాహుళ్యానికి సంబంధించి రాయాలి. ఒక వేళ చాలా వ్యక్తిగతమైన స్వీయ బాధ వెలువరించినా, పాఠకులు దాన్ని తమ జీవితాలకి అన్వయించుకునే విధంగా సృజిస్తేనే గొప్ప కవిత అవుతుంది. మచ్చుకి, మనం గొప్ప దుఃఖంలో మునిగి మాటలు రానపుడు “మూగవోయిన నాగళమ్ముననుగూడ / నిదురవోయిన సెలయేటి రొదలు కలవు” అనుకుంటాం. కృష్ణశాస్త్రి తన స్వరపేటికనో కూతురునో కోల్పోయి ఆబాధలో రాస్తే రాసి ఉండవచ్చు కాని మనం ఇప్పుడు స్పందిస్తున్నది అందుకు కాదు.

రేవతీదేవి కవిత్వం తలుచుకుంటే నాకు వెంటనే గుర్తొచ్చేది మరో మరుగునపడ్డ అరుదైన మంచి మాణిక్యం, “జీవిత నాటకరంగపు / గడచిన బహు దృశ్యాల్లో / రంగుల తళుకుల బెళుకుల / కపట పటాటోపంలో / మరుగుపడిన” మరో వెలుగు, బైరాగి అనబడే ఆలూరి బైరాగి చౌదరి. వీళ్ళిద్దరి కవిత్వానికి స్థాయీ భేదమున్నా తాత్విక సారూప్యం ఉంది. “దూరం” కవిత చదివితే నాకీ బైరాగి గీతం గుర్తొచ్చింది:

“నాకుతెలుసు, నాకు తెలుసు
ప్రళయవేదనా పంకిల ప్రపంచపథం మధ్య
ప్రేమలు పొసగవనీ
ఈ బండరాళ్ళపైన ఏ మొక్కలూ ఎదగవనీ
మనమంతా చీకటిలో ఆకటితో పోరాడే
అస్వతంత్ర సైనికులమనీ,
పెనుతుపాను చేతుల్లో చిక్కుకొన్న
త్రోవలేని నావికులమనీ
జీవిత ప్రభంజనం
కలయిక సహించదనీ
ఉన్న గడువు కొద్ది అనీ
నాకు తెలుసు! నాకు తెలుసు!”
— చీకటి నీడలు, బైరాగి

ఆధునిక సాహిత్యంలో ఉన్న అర్థంకాని మాటల గురించి ఈమాట లోనూ, రచ్చబండ లోనూ ఈ మధ్యనే చర్చించాం. రేవతీదేవి కవితల్లో కొట్టొచ్చినట్లు కనబడేదేమిటంటే — లేని కఠిన పదాలు, ఉన్న మామూలు మాటల పొందికలు. అన్నీ అర్థమయే మాటలే అయినా, కవితలో భావం ఒక పట్టాన పూర్తిగా అర్థం కాకపోవచ్చు. అలాంటి వాటికి నిఘంటువు నిరుపయోగం. కాని చదువరి తన జీవితానుభవం వల్ల కొంత సొంత భావన జోడించుకుంటే అర్థంఅవుతుంది. ఈ విధంగా ఆలోచింపచేసే గుణం ఉత్తమ కవితలకుండే లక్షణమని నా అభిప్రాయం. అపుడా కవిత్వపు లోతుని గ్రహించిన గాఢమైన అనుభూతి కలుగుతుంది. ఉదాహరణకి:

ఈ రాత్రి

ఈ రాత్రి గడిస్తే
నిద్ర మాత్రలక్కూడా లొంగని
ఈ రాత్రి గడిస్తే
మనిషితో రాజీపడలేక పోయినందుకు
నా వీపుకింద అంపశయ్యలా పరుచుకున్న
ఈ రాత్రి గడిస్తే
దైవంతో రాజీపడలేక పోయినందుకు
నా నరాలలో ఈత ముళ్ళ నెత్తురై ప్రవహిస్తున్న
ఈ రాత్రి గడిస్తే
నిజాయితీ మొహాన
వెలుతురు దుప్పటి కప్పి మరోపగలు
యెప్పుడో మరో రాత్రి మరోపగలు
వెలుతురు దొరక్క
నిజాయితీ నగ్నంగా స్నిగ్ధంగా ఉండిపొతే
ఆ రాత్రి గడవకుండా నిలిచిపోతే
నేనే గతించి గడిచిపోతాను నిజాయితీగా”

నా దృష్టిలో ఈ చిన్న కవిత రేవతీదేవి ప్రతిభకి గొప్ప మచ్చుతునక. దీంట్లో అర్థంకాని పదాలు లేవు. కాని భావాల లోతు వెంటనే స్పృహకి రాదు. మనిషితో రాజీ పడలేకపోవడం అంటే, ప్రపంచంతో రాజీ పడకపోవడం అని అర్థం చెప్పుకోవచ్చు. ఓ వ్యక్తికి గల భావాలు, ఆదర్శాలు, సంఘంలో అమలులో వున్న నీతి న్యాయాలతో ఘర్షణ పడితే కలిగే వేదన ఇది. “తనకీ ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్ బహిర్ యుద్ధారావా”నికి ఇదొక తార్కాణం. నిద్ర పట్టని రాత్రిని అంపశయ్య తో పోల్చి ఆ వేదన ఎంత బాధాకరమైనదో ఈ కవిత తెలుపుతుంది.

అంతకన్న మించిన హింస ఏముంటుంది? దేవుడితో రాజీ పడకపోవడమట! అది నరాలలో గుచ్చుకునే ఈతముళ్ళలాగా ఉందట. కాలిలో ఈత ముల్లు గుచ్చుకుంటే తల్లో, దేవుడో తలపుకొస్తారు. మరి నెత్తురే ఈత ముళ్ళయి ప్రవహిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది అంపశయ్య మీద పడుకోడంకంటే ఎంతో భయంకర మైనది, శరీరంలో అంతర్లీనమైనదీ.

ప్రపంచంతో రాజీ పడకపోవడం; దేవుడితో రాజీ పడకపోవడం. ఒకటి బాహ్య మైనది, మరొకటి అంతర్లీనమైనది. అంపశయ్య బయటి ప్రపంచంలో మనిషి చేసినది; నెత్తురు దేవుడిచ్చినది, మనలోపలి భాగం. ఈ వ్యత్యాసం చూపటంలో గొప్ప విశిష్టత ఉంది.

కాని అసలు దేవుడితో రాజీ పడటమంటే ఏమిటో నాకు మొదట అర్థం కాలేదు. ఏ నిఘంటువూ ఉపయోగ పడలేదు. మనం ఆస్తికులమైనా, నాస్తికులమైనా, సూక్ష్మ దృష్టితో చూస్తే, న్యాయాన్యాయాలు, ఆస్తిపాస్తులు, ఆచార వ్యవహారాలు, ప్రాకులాటలు, రాగ ద్వేషాలు, అన్నీ మనం కల్పించుకున్నవేగాని, దేవుడు సృష్టించినవి గాదే. మరి మధ్యలో దేవుడెందుకొచ్చాడు? దేనికోసం దేవుడితో రాజీ పడాలి?

ఇంకాస్త ఆలోచిస్తే, దేవుడు మనిషినుంచి కోరేదొక్కటే. అదీ స్త్రీ మాత్రమే ఇవ్వగలుగుతుంది. మాతృత్వం వద్దనుకుంటే కలిగే వేదనని అతి భయంకరంగా ఈ కవిత వర్ణించింది.

కాని ఈ రెండు వేదనలకీ పరస్పర సంబంధముంది. సమాజ పరిస్థితి స్రీ కి అనుకూలంగా ఉంటే, దేవునితో రాజీ పడాల్సిన పని లేదు. పితృసమాజ వ్యవస్థ మీద చేసే గాఢమైన విమర్శ ఇది.

సరి కొత్త భావాలకి సరిపడే పద బంధాలని కవి సృష్టించుకోవాలి. నా ఊహ సరయినదైతే, దేవునితో రాజీ పడకపోవడమనే భావన ఆధునిక స్త్రీ కి మాత్రమే కలుగుతుంది. అందుకు రేవతీదేవి సృష్టించిన పద విన్యాసం చెప్పుకోదగ్గది.

ఈ గీతం ఇంకా అయిపోలేదు. నాకు మొదట్లో ఇది ఒక సంశయ గీతంగా, నూతిలో గొంతుకగా అనిపించిందిగాని, చివరకి అందుకు విరుద్ధమయినదని అర్థమయింది. ప్రపంచ సాహిత్యంలోకెల్లా ప్రఖ్యాతి గాంచిన సంశయ గీతం Hamlet ఆత్మావలోకనం చూడండి;

To be, or not to be: that is the question
..
No more; and by a sleep to say we end
The heartache and the thousand natural shocks
..
But that the dread of something after death,
The undiscover’d country from whose bourn
No traveller returns, puzzles the will
And makes us rather bear those ills we have
Than fly to others that we know not of?

Hamlet కష్ట భూయిష్టమయిన లోకంలోని బాధలన్నీ వర్ణింఛి, వాటిని ఎదిరించి పోరాడటమా, లేక గతించి పోవడమా? అని సందిగ్ధంలో పడతాడు. కాని అవతలి గట్టున ఏముందో చూసి వచ్చిన వాళ్ళెవరూ లేరు; అందుకని ఈ లోకంతో సమాధాన పడాలి. ఇలాంటి సంశయాత్మక అలోచనలతో క్రియాశీలత్వాన్ని కోల్పోయి మనుషులు పలాయన వాదులవుతారంటాడు.

కాని రేవతీదేవి కవితలోని స్త్రీకి అలాంటి సంశయం లేదు. ఆమె మన వాళ్ళు సాధారణంగా చిత్రించే అబల కాదు. మానసిక స్థైర్యాన్ని కోల్పోయిన నూతిలో గొంతుక కాదు. ఎవరి సహాయం కోసమో దీనంగా పిలిస్తూ వేదనతో విలపించే బేలత్వం లేదీ మనిషిలో. దేవుడూ, ప్రపంచం ఏకమయి తనని అనేకానేక చిత్ర హింసలకి గురి చేసినా సరే, తన విలువలనీ విడువదు. మహా అయితే తన ప్రాణాన్నే వదులుకుంటుంది! నిజాయితీగా గతించి పోతుంది!

పదహారు పాదాలలో ఒక్క అర్థం కాని పదం వాడకుండా కవయిత్రి గొప్ప పదబంధాలతో ఇంత వేదనాభరిత సంఘర్షణని, వజ్ర సంకల్పాన్ని గుప్పించి గుండెల్ని పిండేసింది. ఇది నిస్సందేహంగా గొప్ప కవిత్వం. అసలు కవిత్వమే కాదు, మతి భ్రమించిన మనిషి వ్యక్తావ్యక్తాలాపన, వట్టి ప్రేలాపన అనేవాళ్ళని దీనిని మరోసారి పరిశీలించమని నా ప్రార్థన.

నిర్విరామం

నడిరాతిరి
చప్పుడు లేదు, వెలుతురు లేదు, గాలిలేదు
చీకటిలో నిద్రలో నడిరేతిరి
నడిరేతిరి నిద్రలో నిద్రరాత్రి మధ్యలో
ఎక్కడో, ఎవరిదో
తల్లికడుపు చీల్చుకొచ్చిన శిశువుకేక
జీవసారం ఒట్టిపోయిన మనిషి చివరిచూపు
పులివాతబడ్డ ప్రాణి అంతిమ ఆర్తనాదం
పైకెత్తిన హంతకుడి చేతిలోని కత్తిమెరుపు
తొలి ప్రేమికుల అధర ముద్ర
గస్తీ తిరిగే గూర్కా చేతికర్ర చప్పుడు
భయాందోళన గుండె టక్ టక్
మరో బేరం కోసం దీప స్తంభం నీడలో కళ్ళ వెదుకులాట
స్వయంగా ఉరిపోసుకుంటున్న ముఖం
లోని దైన్యత మేధావి బుర్రలో
పరిష్కారం లేని గందర గోళం

ఈ దృశ్యాలన్నీ నిర్విరామమయినవి. కాని ఎక్కువ దృశ్యాలు జీవితపు ఆటుపోట్లను తలపుకు తెప్పించేవి. శ్రీశ్రీ “కవితా! ఓ కవితా!” అని స్మరించినపుడల్లా కనిపించే దృశ్యాలు, వినిపించే భాష్యాలూ ఇలాగే ఉన్నాయి.

ఇంత బాధాకరమైన, నిరాశాజనకమైన దృశ్యాలే ఎందుకు ఎక్కువ కనిపిస్తున్నాయి? ఇది ప్రపంచంలో ఏమాత్రపు వాస్తవికత? అనే విమర్శ ఉంది. వాస్తవికత అనేది అనేక రకాలుగా ఉంది, చూసే వాళ్ళని బట్టి, కవి దృక్పధాన్నిబట్టి, తను చెప్పదలుచుకున్నదానిని బట్టి. శ్రీశ్రీ “అనంతం” లో తన కవిత్వాన్ని ప్రభావితం చేసిన అనేకానేక రచనల్లో అత్యంత ముఖ్యమైనది అంటూ, ఎవరి గురించి రాయనో, ఎవరి గురించి రాస్తానో అని వివరించి చెప్పే John Masefield రాసిన “A Consecration” గీతాన్ని ప్రస్తావించాడు:

NOT of the princes and prelates with periwigged charioteers
Riding triumphantly laurelled to lap the fat of the years,—
Rather the scorned—the rejected—the men hemmed in
with the spears
..
Of the maimed, of the halt and the blind in the rain and the cold—
Of these shall my songs be fashioned, my tales be told.

కవయిత్రి నిర్విరామం అనే శిర్షిక పెట్టి, నాకు మరలా బైరాగి మరో గీతం గుర్తుకు తెప్పిస్తోంది:

“శతసహస్రశబ్దాల స్రఖరశరపరంపరముందు
నిశ్చలమై నిలచిన నిశ్శబ్దంలో
నానారావ తరంగతురంగాల ఉరవడి క్రింద
నిలవనీరుల నికరపు నిశ్శబ్దంలో
ఆడే చేతులక్రింద, వాగే జిహ్వలక్రింద

సొమ్మసిలిన హృదయమందు
ఆటముందు పాటముందు
ప్రణయం ముందు ప్రళయం ముందు

ప్రగల్భ నిరీక్షణతో నిండిన, పండిన ఈ నిశ్శబ్దంలో
వేచియున్నవాడే ప్రతి ఒక్కడు
మార్పు కొరకు, తీర్పుకొరకు

ఓర్పుగలిగి
చరమ ఘంటారావం కొరకు
తప్పిపోయిన భావం కొరకు.”

నిర్విరామం గొప్ప కవిత అననుగాని, ఈ మాత్రం స్పందన కలిగించి ఆలోచింపచేసిన కవిత నిరర్థకం కాదు.

సాహిత్యం అంతా వెలుగుల రవ్వల జడిగా ఉండాలనుకునే వాళ్ళకి ఈ కవిత్వం నిరాశా నిస్తేజాలని కలిగించ వచ్చు. కాని Sartre నవలలని గురించి అన్నది కవిత్వానికి కూడా వర్తిస్తుంది:

“There is no ‘gloomy literature’, since, however dark may be the colors in which one paints the world, one paints it only so that free men may feel their freedom as they face it. Thus, there are only good and bad novels. The bad novel aims to please by flattering, whereas the good one is an exigence and an act of faith.” — From “What is Literature?” by Sartre.

అయినా రేవతీదేవికి జీవితంలో అలంకరించడానికి ఏమీ కనిపించలేదా అంటే, చాలానే ఉంది. ఉదాహరణకి, ఇదిగో ఈ కవిత (పునర్) జీవితం మొదలయీ కాకమునుపే జీవితాన్ని అలంకరిస్తున్నది:

A Birth
with the fragrance of twenty-five bodies burning with desire
with the beauty of five snow-clad mountain ranges
with the moving music of infinite pairs of stellar bodies
with the love of a thousand brilliant dark eyes
with the cool rays of a billion moons
with two valleys red with passion
with a hundred joys of the soft, green grass
with a trillion stars of sparkling looks
with the thirst of forty youthful suns
with a single heart, for a single heart

now I’m born.

ఈ కవితలో గొప్పతనం మూలంలోనా లేక అనువాదంలోనా? రేవతీదేవిదా లేక నారాయణరావుదా? From “Hibiscus on the Lake: Twentieth-Century Telugu Poetry from India”, Edited and Translated by Velcheru Narayana Rao.

ఇది తెలుగు, ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం. “కొని” చదవాల్సిన పుస్తకం!

నేను రేవతీదేవికి సరయిన గుర్తింపు రాలేదన్నాను గాని, ఆలస్యంగానయినా ఆవిడ కవితలని మెచ్చుకుంటున్నారు. వెల్చేరు గారు తన పుస్తకంలో, అందరికన్నా, విశ్వనాథ గారి కన్నా, శ్రీశ్రీ, ఇస్మాయిల్ గార్లతో పోటీగా రేవతీదేవి కవితలనే ఎక్కువ వేసి, ఆకాశానికి ఎత్తేసారు. చాలా సంతోషం. రేవతీదేవిని కనుగొని లోకానికి తెలియజేసిన వాళ్ళలో వెల్చేరు గారు ముఖ్యులు. వారి మాటల్లో:

“Revati’s poems are in a class by themselves; nothing like them had ever been written before in Telugu. Revati was not a poet by conscious effort — someone who presents herself as a poet to the literary world. Her language is direct, disarmingly straightforward, unpremeditated; it is self-expression in its purest sense. Her words and sentences, fresh with a nascent energy, appear on the page utterly unaware of their presence in the world of poetry. In fact, they were not poetic before Revati used them. Her passion, her sensuality, her burning desire to speak, and her discovery of the world through language, reveal a vulnerable person and an invincible poet, giving us flashes of insight into her very female world. She wrote only a small volume of poetry, but every poem in the volume is precious.”

రేవతీదేవి కవిత్వంతో ప్రభావితమై, డాక్టర్ పి. లక్ష్మి గారు, “శిలాలోలిత” కలంపేరుతో రచనలు చేస్తున్నారు. తను ఈమధ్యనే ప్రచురించిన “ఎంతెంత దూరం”, “అనురాగదగ్ధ సమాధి శిలాలోలిత రేవతీదేవి” కి, “హిమజ్వాలగా రగిలిన చండీదాస్” కీ అంకితం చేసారు.

మరి ఈ కవయిత్రి జీవితం గురించి తెలుసుకోవాలని కుతూహలం కలగడం సహజం. రేవతీదేవి తన కవితలన్నిటినీ 1979లో రాసింది, నేనా? కవిత్వమా? అని తనకి తనే ఆశ్చర్యపడేలా. తిరుపతిలో, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీలో Sartre మీద PhD చేస్తూ, 1981లో చదువు ముగించకుండానే ముప్పయి ఏళ్ళకే తనువు చాలించింది. తరువాత కొన్ని నెలలకి “శిలాలోలిత” వెలువడింది.

ఈ విషయం తెలుసుకొని మనం రేవతీదేవి రచనల గురించీ, జీవితం మీదా వ్యాఖ్యానించే ముందు, సంజీవదేవ్ మాటలు గుర్తుంచుకోవాలి (నేను గూడ అపుడపుడు మరచిపోతుంటాను): “రచనను రచనా నైపుణ్యం పెట్టి కొలిచి విలువ కట్టవలసిందేకాని రచయిత జీవితం పెట్టికాదు. రచయిత స్వభావాన్ని కొలవాల్సొస్తే రచయిత జీవితాన్ని పెట్టి కొలవాలి. రచనను పెట్టికాదు. జీవితాన్నుంచి రచన దూరంగా ఉండలేక పోయినా జీవితానికంటే రచన ఎంతో ఎత్తుకు లేవగలదు. అనంత దిగంతాల్లో విహరించగలదు.”

మనకు ఆమె జీవితం గురించి తెలిసింది చాల కొద్దిపాటి మాత్రమే. దానిని బట్టి, రేవతిదేవి చాలా విశిష్టమైన వ్యక్తి అనీ, సున్నిత మనస్తత్వమూ, విలువలకి రాజీపడని వజ్ర సంకల్పమూ కల మనో ధైర్యశాలి అనిపిస్తుంది. ఎందుకంటే:

శోకతప్తజ్ఞతలు

నన్నీ నవలలోకి దించిన తనకు క్రుతజ్ఞతలు తన ముఖానే చెప్పాలంటే చచ్చే నవ్వొస్తుంది. నవ్వి — చావటం దేనికని. యీ అచ్చు కాగితం చాటునుంచి మొయ్యలేక చచ్చేటన్ని క్రుతజ్ఞతలు చెప్పాలనుకుంటే —

పవిత్రతను కాగితాలమీద శ్లాఘించి తన జీవితాలలో సహించని; యీ అల్పత్వాల నీచత్వాల గుంటనక్కల తోడేళ్ళ మేడిపండు సమాజాన్ని విద్యుదయస్కాంతంలా ప్రతిఘటించగల సత్తా వుండి కూడా,

తను కోరుకున్నది పొందినతనం బదులు, బతికినన్నాళ్ళూ యీముళ్ళ పంది సమాజాన్ని ప్రతిఘటించటంతోటే సరిపోతే, తిరగబడటం ధ్యేయంగా భావిస్తే తప్ప, అర్థరహిత మనుకున్నందువల్లా –.

తను అనుభవించాల్సొచ్చే రకరకాల మానసిక హింసను చూడలేని తన వూపిరిలో వూపిరైన, అనురాగ మానసం; కనలి విక్రుతమై పోతుందనిపించినందువల్లా –,

వొకానొక వాత్సల్య బలహీనత వల్లా –.

“ఆవలి గట్టున నిరీక్షిస్తుంటాను. మీ జీవితాన్ని `త్యాగించి` బతికి; యీ సమాజాన్ని కరుణించి దీవించి రమ్మ”ని అనురాగంతో శాసించిన ప్రియబాంధవికి, వక జీవిత కాలపు తెరమరుగు నుంచి శోకతప్తజ్ఞతలు.”

అంటూ అనుక్షణికపు రచయిత శిలావల్మీకపు సమాధిలో ఏకాంతుడయి పోయాడు.

కొత్త గొంతుకతో శిలా హృదయాల్ని కదిలించే గీతాల్ని సృజించినందుకూ, తెలుగు నవలా సాహిత్యంలో ఒక మణిరత్నానికి కారకురాలయినందుకూ “శిలాలోలిత” రేవతీదేవికి కృతజ్ఞతాశ్రుతర్పణతో, కొడవళ్ళ హనుమంతరావు

కొడవళ్ళ హనుమంతరావు

రచయిత కొడవళ్ళ హనుమంతరావు గురించి: పుట్టిందీ పదో తరగతిదాకా చదివిందీ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో. ఇప్పుడు ఉండేది Washington రాష్ట్రంలో Seattle నగరానికి దగ్గర్లో. ఇంజనీరుగా పని చేసేది సాఫ్ట్ వేర్ రంగంలో. దాదాపు పాతికేళ్ళుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగంలో లీనమై సాహిత్యదృష్టి కొరవడిన లోపాన్ని సరిదిద్దుకోడానికి, గత మూడేళ్ళుగా కొందరు తెలుగువాళ్ళతో పరిచయం, కాస్త తెలుగు చదవడం, ఎప్పుడన్నా ఓవ్యాసం రాయడం - అదీ ప్రస్తుత వ్యాపకం.  ...