కోనసీమ కథలు: విలేకరి

“సూర్యం గారిల్లిదేనాండీ?” అంటూ ఎవరిదో గొంతు వినిపించి మధ్య గదిలో టైపు చేసుకుంటున్నవాణ్ణి ఒక్కసారి ఆగాను. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి త్వరగా ఈ వార్తని టెలిగ్రాం పంపించాలి. మూడింటిలోగా విజయవాడ అందితే రేపు పేపర్లో వచ్చేస్తుంది. నా పత్రికాఫీసు మా ఇంటికి దగ్గర్లోనే వుంది. అక్కడయితే వచ్చీ పోయేవాళ్ళ గోలతో పని కాదు. అందుకని ఇంటికొచ్చి మరీ టైపు చేసుకుంటున్నాను.

“సూర్యం గారూ! మీ కోసం ఎవరో వచ్చారు..” మా ఇంటి యజమాని గట్టిగా అరిస్తే లేచి వీధి గుమ్మం వైపు నడిచాను. అక్కడ ఒక కుర్రాడు కనిపించాడు. చామనచాయ రంగులో ఉన్న ఆ వ్యక్తి నన్ను చూడగానే నమస్కరించాడు. నేను ప్రతినమస్కారం చేసాను. వచ్చినతన్ని ఎప్పుడూ చూసినట్లు లేదు.

“నమస్కారమండీ. నేను మిమ్మల్ని కలవాలని మద్రాసు నుండొచ్చాను.”

“అలాగా!” అంటూ లోపలకి రమ్మనమన్నట్లు సంజ్ఞ చేసాను. కుర్చీలో కూర్చోమని చెప్పి నేను నా టైపు మిషన్ ముందు కూర్చున్నాను.

“ఎవరు మీరు? మిమ్మల్నెప్పుడూ..” అంటూండగానే అతనే చెప్పుకొచ్చాడు.

“నా పేరు రాఘవ. మాది మద్రాసు. మీరు ఆ మధ్య ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన ఒక ఆర్టికల్ చదివి మిమ్మల్ని కలవాలని ఇంత దూరం వచ్చాను.”

“నా ఆర్టికల్ చదివి వచ్చారా? ఏదది?” అతను మద్రాసు నుండి వచ్చాడంటే ఆశ్చర్యం వేసింది.

“అవునండీ. నెల్లాళ్ళ క్రితం మీరు రాసిన ‘డౌరీ ఫర్ కుకింగ్?’ అన్న ఆర్టికల్ చదివి చాలా ఆశ్చర్యం వేసింది. నేను వెంటనే పేపరుకి ఒక ఉత్తరం కూడా రాసాను. చూళ్ళేదా మీరు?” లేదన్నట్లు తలూపాను.

ఓ నెల ముందు నేను ‘డౌరీ ఫర్ కుకింగ్?’ అన్న పేరుతో ఇక్కడే కోనసీమలో జరిగిన ఒక సంఘటన్ని పేర్లు మార్చి ఆర్టికల్ రాసాను. అదేమిటంటే నందంపూడి వెంకట్రామయ్య కూతురి పెళ్ళిచూపులు. ముందు పెద్దవాళ్ళొచ్చి పిల్లని చూసారు. పెళ్ళికొడుకు విశాఖపట్నంలో ఉద్యోగం. పెళ్ళికొడుకుతో రెండోసారి వచ్చినప్పుడు పిల్ల నచ్చిందీ తాంబూలాలు అప్పుడే తీసుకుందామని ప్రస్తావించారు. అంతే కట్నాల దగ్గర పేచీ వచ్చింది. వెంకట్రామయ్యకీ సంబంధం తెచ్చింది నేనే! పెళ్ళికొడుకు తండ్రి మాకు దూరపు చుట్టం. ఆ మధ్య వైజాగెళ్ళినప్పుడు వాళ్ళబ్బాయి పెళ్ళికొడుకని తెలిసింది. వెంకట్రామయ్యా నేనూ చిన్నప్పటినుండీ స్నేహితులం. ఇద్దరం అమలాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లోనే వెలగ పెట్టాం. వాడు ఎయిత్ ఫోరంలోనే చతికిలబడితే చదువచ్చి రాలేదని వాళ్ళ నాన్న వ్యవసాయం చేసుకోమన్నాడు. నేను స్కూలు ఫైనలు వరకూ అక్కడే చదివాను. తరువాత మద్రాసులో కొంతకాలం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆఫీసులో పనిచేసాను. మా నాన్న పోరు పడలేక ఆ వుద్యోగం వదిలేసి ఇక్కడ అమలాపురంలో విలేకరిగా సెటిల్ అయ్యాను.

ఆ పెళ్ళి చూపుల్లో కట్నాల దగ్గర నేనే మధ్యవర్తిగా ఉన్నాను. ముప్పైవేలు కట్నం, లాంచనాలూ ఇవ్వడానికి వెంకట్రామయ్య సిద్ధపడ్డాడు. పెళ్ళికొడుకు మాత్రం ఏభైవేలకి తగ్గనని మొరాయించాడు. ఏభైవేలంటే చాలా ఎక్కువ.

వెంకట్రామయ్యకి దమయంతి పెద్ద కూతురు. మగపిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. దమయంతి మొహం మాత్రం చాలా కళగా ఉంటుంది. స్కూలు ఫైనల్ దాకా చదివింది. కానీ పొట్టీ, కొంచెం లావూ! ఫొటోలో మొహం చూసి ఎవరైనా ఇట్టే పడిపోతారు. తీరా మనిషిని చూస్తే గతుక్కుమంటారు. దమయంతికి గతంలో చాలా సంబంధాలు కుదిరినట్లే కుదిరి చెడిపోయాయి. వెంకట్రామయ్యకి కూతురి పెళ్ళి బెంగ.

పెళ్ళి మాటల్లో ‘ఏభయికి తగ్గేది లే’దని ఆ పెళ్ళి కొడుకు గట్టిగా అనడం లోపల్నుంచి దమయంతి వింది. విసురుగా పదిమంది మధ్యకూ వచ్చి – “సరే నువ్వు కోరినట్లుగానే మా నాన్న కట్నం ఇస్తాడు. కానీ ఒక షరతు. పెళ్ళయ్యాక నువ్వు నాకు వంట చేయాలి. దానికి నువ్వు రెడీ అయితే నిన్ను పెళ్ళి చేసుకుంటాను. లేకపోతే ఇక్కణ్ణుండి వెళ్ళచ్చు.” అంటూ అనేసరికి అక్కడున్న పెద్దలందరమూ నోరెళ్ళ బెట్టాం. దమయంతి మాటలకి షాక్ తిన్నాడా పెళ్ళికొడుకు. మొత్తానికి ఆ సంబంధమూ చెడింది.

“నాన్నా! పెళ్ళి కాకపోతే ఇలాగే ఉండిపోతాను. అంతేకానీ ఈ వేలంపాటకి బలి కాను. నువ్వసలు నాకు సంబంధాలే చూడద్దు” అని తండ్రికి తెగేసి చెప్పింది. దమయంతి తెగువకి నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ పదిమందిలోకీ రావడానిక్కూడా సిగ్గు పడే దమయంతి అందరి మధ్యా అలా అనేసరికి ఆశ్చర్యంతో పాటు, ఆమె ధైర్యాన్ని మనసులోనే మెచ్చుకున్నాను.

ఈ సంఘటనే పేర్లు మార్చి రాసి పేపరుకి పంపాను. వాళ్ళకి నచ్చి మద్రాసు ఎడిషన్లో కూడా వేసారు. ఈ వ్యాసానికి వచ్చిన స్పందన చూసి మద్రాసు ఎడిటర్ నన్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉత్తరం రాసాడు. అతను కూడా అది చదివి నన్ను అభినందించడానికొచ్చాడని అనుకున్నాను.

“మీ గురించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వాకబు చేసి మరీ వచ్చాను. మీరు జరిగిన సంఘటన ఆధారంగా రాసారని గ్రహించాను. మీరు ప్రస్తావించిన ఆ అమ్మాయిని కలుద్దామని వచ్చాను సార్! ఆ అమ్మాయి ధైర్యమూ, సంస్కారమూ చూసి ముచ్చటపడ్డాను. ఆ అమ్మాయిలా ప్రతీవారూ ఉంటే ఈ వరకట్నం అన్నదే పోతుంది.” అంటూ అతను వచ్చిన విషయం చెప్పాడు.

ఆ వచ్చినతను దమయంతిని కలవడానికొచ్చాడని గ్రహించాను. అతనికి జవాబేం చెప్పాలో తెలీలేదు.

నేను రాసిన ఆర్టికల్ గురించి తెలిసి వెంకట్రామయ్య నాతో మాట్లాడ్డం మానేసాడు. వాడి కుటుంబాన్ని బజారు కీడ్చానని, వాళ్ళ అమ్మాయి గురించి తెలిస్తే ఎవడూ పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రాడనీ నన్ను చెడామడా తిట్టేడు. ఇహ నా మొహం చూపించద్దని స్నేహాన్ని తెంపేసాడు. నేనూ ఒక మధ్య తరగతి తండ్రినే! నాకూ ఇద్దరు ఆడపిల్లలున్నారు. కట్నం ఇవ్వందే పెళ్ళి కాదన్న సంగతి నాకూ తెలుసు. వెంకట్రామయ్యకి నచ్చ చెప్పినా వినే స్థితిలో లేడని తెలిసి నేనూ రెట్టించలేదు. వారం క్రితం కొడుక్కి ఉపనయనం చేస్తే నన్ను పిలవలేదు. వాళ్ళ ఆడవాళ్ళు కూడా మాకు తెలుసున్న వాళ్ళందరినీ పిలిచారు కానీ మా ఆవిడ పూర్ణకి బొట్టు పెట్టి పిలవలేదు. పూర్ణ బాధ పడింది. నేనివేమీ పట్టించుకోలేదు.

జరిగినదంతా అతనికి చెప్పాను. అతను దమయంతిని కలుస్తాననీ, వాళ్ళ పెద్దలకి అంగీకారమయితే పెళ్ళి కూడా చేసుకుంటాననీ చెప్పాడు.

నేను దమయంతి పేరూ, వెంకట్రామయ్య పేరూ అతనితో చెప్పలేదు. పైకి నా స్నేహితుడనే చెప్పాను. అతను వాళ్ళ అడ్రసివ్వమని నన్ను బలవంతం చేసాడు. అసలే వెంకట్రామయ్యకి నేనంటే పీకల వరకూ ఉంది. ఇలా నేనే పంపించానని తెలిస్తే అగ్గిమీద గుగ్గిలమవుతాడు.

“తప్పయ్యా! నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు. అసలే మాకూ, వాళ్ళకీ చెడింది. ఇలా నిన్ను పంపానని తెలిస్తే…”

అతను బ్రతిమాలాడు. అతని మాట తీరు చూస్తే మంచి వాడిలాగే అనిపించింది. చివరకి వెంకట్రామయ్య ఎడ్రసిచ్చాను. నా పేరు ఎక్కడా ఎత్తొద్దనీ చెప్పాను. అతను వెంటనే వెళ్ళి కలవడానికి లేచాడు.

అతను వెళుతూండగా – “మీ ఇంటి పేరు?” వెనక్కి పిలిచి అడిగాను. చెప్పాడు. ఆ వచ్చినతని కులమూ, వెంకట్రామయ్య కులమూ ఒకటి కాదని అర్థమయ్యింది. వెంకట్రామయ్య ఈ పెళ్ళికొప్పుకోడన్న నిర్ధారణకొచ్చేసాను నేను.

ఆ తరువాత నన్ను తిరిగి కలుస్తానన్న రాఘవ రాలేదు. ఆర్నెల్ల తరువాత దమయంతికి పెళ్ళి కుదిరిందని తెలిసింది. ఈ సారీ వెంకట్రామయ్య నన్ను పిలవలేదు. అసలు పెళ్ళి కుదిరిందన్న సంగతి కూడా చాలా గుట్టుగా వుంచాడు. బహుశా నేను రాసిన వార్త గురించి తెలిసి ఎవరైనా ఈ పెళ్ళి చెడగొడతారనుకున్నాడో ఏమో? మొత్తానికి దమయంతికి పెళ్ళి కుదిరిందని సంతోషించాను.

దమయంతీ మా పెద్దమ్మాయి ఈడుదే! నేనూ మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాను. మంచి సంబంధం దొరకడం కష్టంగానే అనిపించింది. మా అమ్మాయి రాధ బియ్యెస్సీ చదివింది. ఇహ పై చదువులకి పంపలేక ఆంధ్రా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ సీటొచ్చినా స్తోమత లేక చదువాపించేసాను. సంక్రాతికి జగ్గన్నతోట తీర్థంలో దమయంతి కనిపించింది.

“మావయ్యగారూ బావున్నారా?” అంటూ పలకరించింది. కుశల ప్రశ్నలయ్యాక తనే చెప్పింది.

“మావయ్యగారూ, వచ్చే మాఘ మాసంలో నా పెళ్ళి. మీరందరూ తప్పకుండా రావాలి.” అని పెళ్ళికి పిలిచింది. అలాగేనని పైకి అన్నాను కానీ విషయం మా ఇద్దరికీ తెలుసు.

“బావుంది. చాలా సంతోషం! కట్నమూ, లాంఛనాలూ అవీ ఎంతేవిటీ?” అని పూర్ణ ఆసక్తిగా అడిగింది. ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళకి చాలా ఆసక్తి.

“కట్నవాఁ? అది తీసుకోని వాణ్ణే చేసుకుంటానని మా నాన్నకి తెగేసి చెప్పేసాను. నాకీ కట్నాలూ అవీ అంటేనే అసయ్యం. కట్నం వద్దన్న వాణ్ణే పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. అంతే! మావయ్యగారికి నేను చేసింది నచ్చుతుంది. కదండీ?” అంటూ నా వైపు తిరిగి అంది.

దమయంతి అదృష్టవంతురాలు. అనుకున్నది సాధించింది. అదే చెప్పాను.

“మా నాన్నకీ, మీకూ… అదెందుకులెండి. మీరు తీర్థానికొస్తారని తెలుసు. అందుకే మీకోసం ఈ శుభలేఖ పట్టుకొచ్చాను. నాకోసమయినా మీరు పెళ్ళికి రండి,” అంటూ శుభలేఖ చేతిలో పెట్టింది.

మేం ఎవరూ ఏం మాట్లాడ లేదు. శుభలేఖ తీసి ఎవరా పెళ్ళికొడుకని చూసాను. పెళ్ళి కొడుకూ వాళ్ళది మధ్య ప్రదేశ్ అని చెప్పింది. తెలుగువాళ్ళేనని, అతని పేరు ప్రసాదు అనీ, బి.హె.ఈ.ఎల్లో పని చేస్తున్నాడని చెప్పింది. రాఘవ గురించి అడుగుదామా అనుకొని ఆగిపోయాను. అతని ప్రసక్తి ఇప్పుడనవసరం.

పెళ్ళికొడుకు పేరు “సత్య సూర్య సుబ్రహ్మణ్య నాగ శ్రీరామచంద్ర వరప్రసాద్” అంటూ పైకి చదువుతూ – “ఏమే దమయంతీ! మీ కాబోయే వాణ్ణి పూర్తి పేరుతో పిలిస్తావా? కొల్లేటి చాంతాడంత ఉంది. మొత్తం చదివితే ఆయాసం వచ్చేటట్లే ఉంది.” మా పెద్దమ్మాయి రాధ వేళాకోళం చేసింది. నిజానికి మా పెద్దాడి పేరు కూడా అక్షరం పొల్లు పోకుండా ఇలాగే ఉంటుంది. ఇదే విషయం పూర్ణ చెప్పి రాధని తప్పని కసురుకుంది.

దమయంతి మా అమ్మాయి రాధతో కబుర్లలో పడిపోయింది.

నేను దమయంతిని చూడ్డం అదే ఆఖరిసారి. ఫిబ్రవరిలో దమయంతి పెళ్ళయ్యింది. మేమెవరమూ వెళ్ళలేదు.


మా అమ్మాయి రాధకి పెళ్ళి సంబంధాలు చూడ్డం మొదలు పెట్టాను. రెండు మూడు సంబంధాలు వచ్చాయి కానీ కుదర్లేదు. పిల్ల నచ్చలేదని ఒకరూ, మాకు ఆస్తులూ గట్రా లేవని ఇంకొకరూ, మాకిష్టమయితే రెండో అమ్మాయిని చేసుకుంటామని ఇంకొకరూ ఇలా చాలా ప్రహసనాలు జరిగాయి. నేనూ విసిగి వేసారి పోయాను. ఈలోగా ఎవరో దూరపు బంధువుల ద్వారా తిరపతి నుండి ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి మద్రాసులో బ్యాంకులో పనిచేస్తున్నాడు. వాళ్ళు పిల్ల నచ్చిందనీ, కానీ కట్నం వద్దనీ అన్నారు. నాకూ వారి ఆదర్శం నచ్చి, ఈ పెళ్ళి ఖాయం చేద్దామనుకుంటూండగా వాళ్ళు చివర్లో చిన్న మెలిక పెట్టారు. అది – మా అమ్మాయి డిగ్రీ చదివింది కాబట్టి, పెళ్ళయ్యాక ఖచ్చితంగా ఉద్యోగం చెయ్యాలని.

ఇంతలో మా ఆవిడ తరపు బంధువొకరు వైజాగు బీ.హెచ్.పీ.వి సంబంధం ఒకటి తీసుకొచ్చాడు. వస్తూ వస్తూనే చెప్పా పెట్టకుండా అమలాపురం బస్సు స్టాండునుండి పెళ్ళికొడుకుని తీసుకొచ్చానని కబురంపాడు. గత్యంతరం లేక సరే నన్నాను. పెళ్ళికొడుకు ఇంజనీరు. అప్పటికప్పుడు హడావిడిగా పెళ్ళి చూపులు ఏర్పాటు చెయ్యాల్సి వచ్చింది. వెళుతూ వెళుతూ ఆ పెళ్ళికొడుక్కి పిల్ల నచ్చిందనీ, మర్నాడే తాంబూలాలు పుచ్చుకుందామనీ అన్నారు. నేను కాస్త తటపటాయించాను. అమ్మాయినడిగి చెబుతాననీ అన్నాను. వచ్చిన మా బంధువు ఒత్తిడి చెయ్యడం మొదలు పెట్టాడు. ఈ పెళ్ళి చూపుల్లో ఒక తమాషా ఉంటుంది. అన్నీ అతిశయోక్తులే ఉంటాయి. ఎవరెవరెంత మంచివారో, గుణవంతులో ఉలవలూ, పలవలూ చేసి చెప్పుకుంటారు. ఇంటికొచ్చి పూర్ణనడిగితే మద్రాసు సంబంధం పిల్లాడు బావున్నాడనీ, పైగా కానీ కట్నం లేకుండా చేసుకుంటున్నాడనీ, వైజాగు పిల్లాడు ఓ మోస్తరుగా ఉన్నాడనీ ఆవిడ వైపు లాజిక్కు లాక్కొచ్చింది. ఈ వైజాగు వాళ్ళు కట్నం మాత్రం పదిహేను వేలడిగారు. కాస్త ఎక్కువే అనిపించింది. మా అమ్మాయినడిగితే కాస్త ఆలోచించుకొని చెబుతానంది. ఇందులో మా అమ్మాయి నిర్ణయం ఏమీ ఉండదు. నికార్సుగా చెప్పాలంటే మా ఆవిడ మాటనీ నేను తోసిరాజంటానన్న విషయం వాళ్ళకి తెలుసు. నేనూ సందిగ్ధంలో పడిపోయాను. మర్నాడు చెబుతానని అంటే వాళ్ళు రాత్రికి అమలాపురంలోనే ఉండి మర్నాడు వెళతామన్నారు. స్నేహితులింట్లో విడిది ఏర్పాటు చేసాను.

రాత్రంతా ఆలోచన్లతో నిద్ర పట్టలేదు. తెల్లారి లేచి వంటింట్లో కాఫీ తాగుతూ పూర్ణతో పెళ్ళి విషయం చర్చిస్తూండగా రాధ వచ్చింది.

“నాన్నా! రాత్రంతా ఆలోచించాను. నాకు వైజాగు సంబంధమే నచ్చింది,” అంటూ మెల్లగా బాంబు పేల్చింది. నిజానికి నేను మద్రాసు సంబంధం మనసులో ఖాయం చేసేసుకున్నాను. ఒక్కసారి ఏమనాలో తెలీలేదు.

“అదేవిటే! మద్రాసు వాళ్ళు కానీ ఖర్చులేకుండా చేసుకుంటానంటే వైజాగు సంబంధం నచ్చిందంటావు? ఈ వైజాగు పిల్లాడు మోస్తరుగా ఉన్నాడు. పైపెచ్చు పదిహేను వేలడుగుతున్నారు. మీ నాన్న పదివేలు మించి ఇచ్చుకోలేరు. నీ తరువాత చెల్లెలొకత్తుంది. మద్రాసు పిల్లాడు బంగారంలా ఉన్నాడు,” అంటూ పూర్ణ గదవాయించింది.

పూర్ణ మా అమ్మాయిని ఒప్పించాలని ప్రయత్నిస్తోంది. నేనూ సమర్ధించాను. చివరకి రాధ మా వాదనలతో విసిగిపోయి, “నా ఇష్టం అడిగారు కాబట్టి చెప్పాను. అయినా పెళ్ళి చేసుకునేది నేను. మీరు కాదు. మద్రాసు అబ్బాయికి కట్నం అక్కర్లేదు. కాదనను. కానీ ఉద్యోగం చెయ్యాలన్న కండీషనే నాకు నచ్చలేదు. నాన్నా! అతనికి నాతో సంసారమే కాదు; సంపాదన కూడా కావాలి. పెళ్ళికి ముందే ఇన్ని షరతులుంటే పెళ్ళయ్యాక ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో? మద్రాసు సంబంధం చేసుకోను,” అంటూ మొండిగా అనేసి వెళిపోయింది.

చాలాసేపు మౌనంగా ఉండి లేచి వెళ్ళబోతూండగా “ఏం చెయ్యబోతున్నారని?” పూర్ణ అడిగింది. రాధ మనసుకి వ్యతిరేకంగా పెళ్ళి చెయ్యదల్చుకోలేదు. కట్నం ఇవ్వడం నాకిష్టం లేకపోయినా కూతురి ఇష్టాన్ని కాదనలేను. ఇష్టంలేని పెళ్ళీ, నమ్మకం లేని వైద్యమూ పట్టివ్వవు.

ఎందుకో అప్రయత్నంగా దమయంతి గుర్తుకొచ్చింది. డిగ్రీ చదివిన మా అమ్మాయికీ, అంత చదువుకోని దమయంతికీ ఆలోచన్లలో ఎంతో వ్యత్యాసం ఉంది. కాసేపు పూర్ణతో చర్చించి, నా నిర్ణయం చెప్పాను.


మా పెద్దమ్మాయి పెళ్ళికి నేనూ వెంకట్రామయ్యింటికెళ్ళి పిలవలేదు. వాడు చేసినట్లుగానే పోస్టులో శుభలేఖ వేసాను. దమయంతి అడ్రసు కనుక్కొని కార్డ్ పోస్టు చెయ్యమని మా అమ్మాయికి చెప్పాను. చూస్తూండగా మూడేళ్ళు గడిచిపోయాయి. ఈ మధ్యలో దమయంతి విషయాలే తెలీలేదు. మా రెండో అమ్మాయికీ పెళ్ళయ్యింది. రైతు సంఘం పనిమీద ఇందిరా గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్ళాల్సొచ్చింది. దాదాపు మూడు నాలుగు వారాలు అక్కడే ఉండిపోయాను. తిరిగొచ్చాక వెంకట్రామయ్య పోయాడని తెలిసింది. వెళ్ళి వెంకట్రమయ్య భార్యని పలకరించి వచ్చాం నేనూ, మా ఆవిడా. అప్పుడే తెలిసింది దమయంతి తండ్రి పోయినప్పుడు చూడ్డానికి రాలేదని. దమయంతి అత్తవారికీ, వెంకట్రామయ్యకీ ఏవో స్పర్ధలొచ్చాయని చెప్పారు. బహుశా అందువల్లేనేమో దమయంతిని పంపలేదనుకున్నాను. ఎత్తెత్తి కాలు ఎంగిలాకులో వేసినట్లుగా అయ్యింది దమయంతి స్థితనిపించింది నాకు. పెళ్ళికి ముందు జగ్గన్నతోట తీర్థంలో చూడ్డమే మరలా దమయంతిని చూళ్ళేదు.

మరో పదేళ్ళు గడిచాయి. మా పెద్దాడికి రైల్వేలో ఉద్యోగం వచ్చింది. తెలుసున్న మినిస్టరు చేతులూ, కాళ్ళూ పట్టుకొని మొత్తానికి ఢిల్లీలో ఉద్యోగం వేయించాను. వాడికీ పెళ్ళయ్యింది. పిల్లలు పుట్టారు. ఓ సారి మనవల్ని చూడ్డానికని నేనూ మా ఆవిడా ఢిల్లీ వెళ్ళాం. ఓ సారి కరోల్బాగులో షాపింగుకని వెళితే “నమస్కారం సూర్యం గారూ! బావున్నారా?” అంటూ ఒకతను పలకరించాడు. అతనెవరో పోల్చుకోలేకపోయాను. చివరకి అతనే చెప్పాడు.

“నేనండీ! రాఘవని. పదిహేనేళ్ళ క్రితం మీరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్టికల్ రాస్తే, మిమ్మల్ని కలవడానికి వచ్చాను…” అంటూ చెప్పబోయాడు. వెంటనే గుర్తొచ్చింది నాకు. గుర్తుపట్టలేకపోయానని ఏమీ అనుకోవద్దనీ చెప్పాను. తనూ పటేల్ నగర్లో ఉంటున్నాననీ, వాళ్ళింటికి రమ్మనమనీ బ్రతిమాలాడు. ఉన్న పళంగా రమ్మనమంటే ఎలాగాని అంటే తన కార్లో తీసుకెళతాననీ చెప్పాడు.

కాదనలేకపోయాను. అప్పట్లో నా ఆర్టికల్ చదివి దమయంతిని పెళ్ళి చేసుకుంటానని మద్రాసునుండి వచ్చాడనీ పూర్ణకి గుర్తు చేసాను. రాఘవ కారు వాళ్ళావిడ తీసుకెళ్ళిందనీ, కాసేపట్లో వస్తుందనీ చెప్పాడు. కొంతసేపటికి కారొచ్చింది. డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాను. ఆమె దమయంతి. కలా, నిజమా అన్నట్లు కళ్ళు నులుపుకు మరీ చూసాను. మమ్మల్ని చూసి తనూ ఆశ్చర్యపోయింది. మాకు సర్ప్రయిజివ్వడానికే దమయంతి గురించి చెప్పలేదని రాఘవ చెప్పాడు.

“ఏం కోయిన్సిడెన్స్ మాస్టారూ! పదేళ్ళక్రితం ఏదో ఆఫీసు పనిమీద ఢిల్లీ వచ్చాను. దమయంతినీ కలిసిన ఈ కరోల్బాగులోనే మిమ్మల్నీ కలవడం చాలా చిత్రంగా ఉంది.” అంటూ రాఘవ తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు.

కుశల ప్రశ్నల తరువాత కారెక్కి వాళ్ళింటికెళ్ళాం. ఎప్పుడూ ఎంతో బిడియంగా ఉండే దమయంతి అప్పట్లో పెళ్ళివార్ని నిలదీయడమే నాకు పెద్ద ఆశ్చర్యమయితే, ఇవాళ కారు నడుపుతూ చక చకా ఇంగ్లీషు మాట్లాడ్డం చూసి ఆశ్చర్యపోయాను. కొంతసేపటికి వాళ్ళింటికి వెళ్ళాం. ఇల్లూ అనడం కంటే భవంతి అంటే బావుంటుందేమో! దమయంతికి ఒక కూతురు. ఇంటినిండా పనివాళ్ళూ, హడావిడీ చూస్తే రాఘవా వాళ్ళూ బాగా ఉన్నవాళ్ళేనని అర్థమవుతోంది. దమయంతిలో వచ్చిన మార్పు చూసి చాలా ఆశ్చర్యపోయింది పూర్ణ. చిన్నపటి కబుర్లు చెప్పుకున్నాం. మధ్యలో మా పిల్లల ప్రస్తావనొచ్చింది. రాధ గురించడిగింది.

“మావయ్య గారూ! ఆరోజు మీరు నా మీద పెద్ద ఆర్టికల్ రాసారు కదా? మీరు మీ పిల్లలకి కట్నం ఇవ్వకుండానే పెళ్ళి చేసారా?” అనడిగింది. లేదన్నట్లు తలాడించాను. అంతే ఒక్కసారి ఉవ్వెత్తున కోపంతో లేచిపోయింది.

“చూసారా! ఆరోజు నేనేదో అనేసరికే మీరు ఉత్తేజితులయ్యి పేపర్లో రాసేసారు. మరి మీ పిల్లల వరకూ వచ్చేసరికి ఆదర్శాలు కనిపించలేదా?” అంటూ నన్ను గట్టిగానే కడిగేసింది. నేనేమీ మాట్లాడలేదు. స్వతహాగా నేను కోపిష్టివాణ్ణి. అలాంటిది మౌనంగా తలదించుకోడం పూర్ణకి ఆశ్చర్యం కలిగించింది. మధ్యలో రాఘవే అడ్డుకొని వేరే విషయాల్లోకి మాట మార్చాడు.

కొంతసేపయ్యాక వెళ్ళొస్తామని శలవు తీసుకున్నాం. మళ్ళీ వాళ్ళింటికి భోజనానికి రమ్మనమని దమయంతీ, రాఘవా అడిగారు. కానీ మా ప్రయాణం ఎల్లుండేనని చెప్పేసరికి వాళ్ళే మా ఇంటికి వస్తామని చెప్పారు. కారు డ్రైవరుని పంపించి మమ్మల్ని మా ఇంటి వద్ద దింపారు.

“ఉత్తప్పుడు ఎవరైనా అంటే అరికాలి మీద లేస్తారు. దమయంతి అలా మిమ్మల్ని అన్ని మాటలంటే నోరెత్తలేదే?” దార్లో ఉండగా ప్రశ్నించింది పూర్ణ.

“ఆఁ! చిన్న పిల్ల. ఏదో కుర్రతనం.” అని మాత్రం అనగలిగాను.

“దమయంతికి వాళ్ళ నాన్న చూసిన సంబంధం ఇది కాదండీ. ఇదేవిటీ? ఆ రాఘవా, దమయంతీ…” ఏం చెప్పేది? నాకూ వివరాలు తెలీవు. అప్పట్లో అత్తారింట్లో దమయంతికి ఆంక్షలెక్కువని విన్నానని పూర్ణే తిరిగంది.

ఎందుకో తెలీదు ఆ మర్నాడు దమయంతీ కానీ, రాఘవ కానీ రాలేదు. కనీసం ఫోను కూడా లేదు. జనతా ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణానికి రైలెక్కాం. హఠాత్తుగా అక్కడ రాఘవ మా బోగీ దగ్గర మాకోసం వెతుకుతూ కనిపించాడు.

“సారీ అండీ, నిన్న అర్జంటు పనొకటి వచ్చింది. దమయంతీ వద్దామనుకుంది కానీ రాలేకపోయింది. కనీసం మిమ్మల్ని కలుద్దావని తీరిక చేసుకొచ్చాను.” అంటూ యాపిల్ పళ్ళ బుట్ట అందించాడు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తామనీ చెప్పాను.

“సారీ అండీ. మొన్న దమయంతి మిమ్మల్ని అలా అనడం బాధకలిగింది. మీరు వెళ్ళాక నాలుగు చివాట్లు పెట్టాను. ఆమె తరపున నేను క్షమాపణ కోరుతున్నాను,” అంటూ చేతులు పట్టుకొన్నాడు.

“అయ్యో! పరవాలేదయ్యా! మాకున్న చనువుకొద్దీ అడిగిందంతే! అయినా, ఆదర్శం వేరూ, జీవితం వేరూ! ఆదర్శాలకంటే ముందు నేనొక మధ్యతరగతి తండ్రిని. నా ఆదర్శాల కోసం పెళ్ళికాని కూతుర్ని ఎంతకాలం ఇంట్లో ఉంచుకోగలం? కన్నందుకు వాళ్ళకీ జీవితం ఇవ్వాలి కదా? నేను చేసిదంతే!” నవ్వుతూ అన్నాను.

“దమయంతికి ఆవేశం ఎక్కువండీ. తేడా వస్తే తండ్రయినా ఊరుకోదు. పైకి పొక్కకుండా చాటుగా కట్నం ఇచ్చి తండ్రి తనని మోసం చేసాడని, పోయినా కూడా చూడ్డానికి వెళ్ళలేదు. మీరన్నట్లు ఎంతకాలం కూతురికి పెళ్ళి చేయకుండా ఉంటాడాయన? ఇవేవీ అర్థం చేసుకోదు. ఆ మనిషంతే! ఎంతో మంచిదే, కానీ…” అతని మాటల్లో నిస్సహాయత ధ్వనించింది.

“తండ్రి పోయినప్పుడు రాలేదని నేనూ విన్నాను. తప్పయ్యా! పిల్లల కోసం పెద్దాళ్ళు చేసినవి అన్నీ నచ్చకపోవచ్చు. పాపం తల్లేం చేసిందట? నేను చెప్పినట్లుగా చెప్పు. నందంపూడి వెళ్ళి వాళ్ళ వాళ్ళని కలవమని చెప్పు. పాపం ఆ తల్లి కళ్ళు వాచేలా ఏడుస్తోంది. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వే దగ్గరుండి తెసుకెళ్ళు.” అని నా మాటగా చెప్పాను.

అతను తప్పకుండా తీసుకెళతాననీ ప్రమాణం చేసాడు.

“బాబూ! నేనోటి అడుగుతాను. ఏవీ అనుకోవు కదా? దమయంతి పెళ్ళి శుభలేఖలో ఉన్న పేరు ప్రసాదో ఏదో ఉన్నట్లు గుర్తు. అప్పట్లో మా అబ్బాయి పేరు అతని పేరూ ఒకటేనని అనుకున్నాం కూడా…” అని పూర్ణ అడుగుతూండగా మధ్యలో నేనే తుంచేసాను.

“అవన్నీ ఇప్పుడు అవసరమా? దమయంతి సుఖంగా కాపురం చేసుకుంటోంది. అది ముఖ్యం. రాఘవ లాంటి వ్యక్తి దొరకడం ఆమె అదృష్టం. మీ ఆడవాళ్ళకి అస్సలు ఎప్పుడేం మాట్లాడాలో తెలిసి చావదు.” కసురుకున్నాను.

“పరవాలేదు మాస్టారూ! మీరు వేసిన విత్తనమే మా ఈ సంతోషాలకి కారణం! ఆరోజు నేను మిమ్మల్ని కలవడం, నందంపూడి వెళ్ళడం ఇవన్నీ మా జీవితాల్నే మార్చేసాయి. మిమ్మల్ని నేనెప్పుడూ మర్చిపోను..” అతని కళ్ళల్లో నీటి తెరలు స్పష్టంగా కనిపించాయి. ఏం మాట్లాడాలో తెలియక అతనికేసి చూసాను.

“ఆనాడు మిమ్మల్ని కలిసాక నందంపూడి వెళ్ళాను. అప్పుడే దమయంతిని చూసాను. వెంకట్రామయ్యగారు కులాంతర వివాహం చెయ్యలేనని చెప్పడంతో వెనక్కి వెళ్ళిపోయాను. అది జరిగిన మూడేళ్ళ తరువాత అనుకోకుండా ఒకసారి ఇక్కడే దమయంతిని చూసాను. ఆమె నన్ను గుర్తుపట్టకపోయినా నేను గుర్తు పట్టాను. అప్పుడే మాటల్లో తెలిసింది. మొగుడు ఒక శాడిస్టనీ, కూతురు కోసం ఇన్నాళ్ళూ సహనం చూపించిందనీ, అతనితో తెగతెంపులు చేసుకొని వచ్చేసిందనీ. తిరిగి ఇంటికెళ్ళడం ఇష్టం లేక ఎవరో పొరుగువారి సహాయంతో గుట్టుగా ఢిల్లీ కొచ్చింది, తన కాళ్ళమీద తను నిలబడ్డానికి. అప్పటికి నాకూ పెళ్ళి కాలేదు. దమయంతికి అభ్యంతరం లేకపోతే నేను పెళ్ళి చేసుకుంటాననీ చెప్పాను. ఇంటితో సంబంధాలు లేకపోడంతో ఈ సంగతులు అక్కడ తెలీలేదు.” మెల్లగా అతనే మళ్ళీ చెప్పాడు.

ఇంతలో రైలు పెద్దగా కూత కూసింది. రైలు ఫ్లాటుఫారం వదులుతున్నంత సేపూ మాకేసే చూస్తూ నమస్కరించాడతను.

“ఎందుకూ పనికి రాని ఈ విలేకరి ఉద్యోగం ఏవిట్రా? సుబ్బరంగా వ్యవసాయం చేసుకోక…” మా నాన్న మాటలు గుర్తుకొచ్చాయి.