తెరమరుగవుతున్న తెలుగు నాటకం

ముందు మాట

సుమారు రెండేళ్ళ క్రితం, ఆఫీసు పని ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణం చేసే సమయంలో శాన్‌హోసే నగరంలో ఒక చోట కొల్లేటి చాంతాడంత లైను (queue) ఒక భవనం చుట్టూ మెలికలు తిరుగుతూ ఉంది. దాదాపు అయిదు వందల మంది పైగా ఉన్నారు. అక్కడ రోడ్టు నిర్మాణం జరుగుతుండడం వల్ల ఆ భవనం చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల ఆ లైను ఎంత పొడవుందీ తెలిసింది. జనాన్ని పరికించే హడావిడిలో అక్కడ పెట్టిన సైను బోర్డుని చూడలేదు. ఏదోలే అనుకుని వెళిపోయాను. కానీ మర్నాడూ నాకు ఆ కొల్లేటి చాంతాడు ప్రత్యక్ష మయ్యేసరికి ఏవిటా అని కుతూహలంగా శ్రద్ధతో చూసాను. అక్కడ ” హెయిర్‌ స్ప్రే” (Hairspray) అనే నాటకం ప్రదర్శింప బడుతోంది.

స్వతహాగా నాకు నాటకం అంటే ఇష్టం, అందువల్ల ఆ నాటకం గురించి ఆరా తీసాను. వారం రోజుల ప్రదర్శనకి దాదాపు అన్ని షోలకీ టిక్కట్లు అయిపోయాయి. ఎలాగో అతికష్టమ్మీద ఏభై డాలర్ల టిక్కట్టు వంద డాలర్లకి సంపాదించాను. అదే విషయం నా పక్కన కూర్చున్న ఓ అమెరికన్ తో అంటే, “నీకు, చాలా తక్కువకి టిక్కట్టు దొరికింది. నేను ఈ నాటకం చూడ్డానికని రెండు వందల మైళ్ళు ప్రయాణించి వచ్చాను. టిక్కట్టు దొరక్క ఒకతని దగ్గర రెండు వందలికి కొన్నానని చెప్పేసరికి ఆశ్చర్యానికి గురయ్యాను. ఆంధ్రాలో సినిమాలకి బ్లాకులో టిక్కట్ల సంగతి చూసాను కానీ ఇలా ఒక నాటకానికి జనాలు తహతహ లాడుతూ చూడ్డం నాకదే మొదటి అనుభవం. ఆ నాటకం నన్ను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళి పోయింది. దాదాపు రెండు గంటల పైగా సాగిన ఈనాటకాన్ని అయిదు వందలమంది సీట్లకి అతుక్కు పోయి చూసేసరికి మరోసారి ఆశ్చర్యపోయాను.

1960 వ దశకంలో మేరీలాండ్, అమెరికాలో కథ ప్రారంభం అవుతుంది. ఆ రోజుల్లో అధికంగా ఉన్న తెల్ల వాళ్ళ జాత్యాహంకారాన్నీ, జాతి వివక్షతనీ ప్రతిఘటిస్తూ, ట్రేసీ అనే తెల్ల జాతి అమ్మాయి చుట్టూ అల్లబడిన నాటకం ఇది. ఎంతో వత్తుగా, పొడవాటి జుట్టుతో, చూడ్డానికి బొద్దుగా ఉన్న ట్రేసీకి నాట్యం అంటే ప్రాణం. కానీ లావుగా ఉండడం వల్ల నాట్యం చేయడానికి ఏ డాన్స్ గ్రూపూ దగ్గరకి రానీయవు. ఒకే వూళ్ళో ఉన్నా నల్ల జాతి వాళ్ళు తెల్ల జాతి వాళ్ళ సమాజాలు వేర్వేరు. ఒక చిన్న నేరానికి శిక్షగా ట్రేసీని నల్లవాళ్ళండే చోటుకి పంపుతారు. అక్కడ నల్ల జాతీయులతో కలిసిన ట్రేసీని, వాళ్ళ సంస్కృతి, స్నేహం, ముఖ్యంగా నాట్యం ఎంతో ఆకట్టు కుంటాయి. ఆ వూళ్ళో తెల్ల వాళ్ళకోసం టీవీలో ప్రతీరోజూ ఒక డాన్స్ షో వస్తూ ఉంటుంది. నల్ల వాళ్ళకి మాత్రం అటువంటి డాన్స్ షో నెలకొకసారి మాత్రమే వేసేవారు. ట్రేసీకి ఇది చాలా అన్యాయం అనిపిస్తుంది. ఈ రెండు షోలనీ కలిపి ఒకటే షోగా చేయాలన్న సంకల్పానికి నడుం కడుతుంది ట్రేసీ. ఆ ప్రయ్తత్నంలో అనేక అవరోధాలు అధికమించి తను నల్ల వాళ్ళనీ, తెల్ల వాళ్ళనీ సంఘటితం చేసి, ఇద్దరూ కలసి ఒకే డాన్స్ షో చేసేలా విజయం సాధిస్తుంది. క్లుప్తంగా ఇదీ కథ.

నాటకం మొదలయిన అయిదు నిమిషాల్లో ప్రేక్షకులని 1960 కాలానికి లాక్కెళ్ళి పోతుంది. మళ్ళా నాటకం ముగిసే వరకూ ఈ ప్రపంచంలోకి రాలేము. ఇది చెప్తే పొందే అనుభూతి కాదు, చూసి పొందాల్సిందే!

ఈ మధ్యనే అంటే ఏడాది లోపు, దీన్ని రెండోసారి సినిమాగా తీసారు. జాన్ ట్రవోల్టా ఈ సినిమాలో ట్రేసీ తల్లిగా, ఏభై ఏళ్ళ యువతిగా, అద్ద్భుతంగా నటించాడు. ఈ నాటకాన్నీ, సినిమానీ విడివిడిగా చూస్తే, రెండూ అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉన్నాయి అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇదీ దీని ప్రత్యేకత.

దీన్ని మార్క్ ఓ డోనెల్, థామస్ మేహన్ అనే ఇద్దరు రచయితలు కలసి రాసారు. “లే మిస్రాబ్” (Les Miserables) అనే ప్రెంచ్ ప్లే తరువాత నన్ను అంతగా కదిలించిన నాటకం ఇది.

నాకు తెలుగు నాటక రంగంతో కొద్దిపాటి పరిచయం ఉంది. మన దేశంలో, ముఖ్యంగా తెలుగు నాటక రంగం ఆదరణ కరువై కొన ఊపిరితో కొట్టుకుంటున్న దశలో ఉంది. సినిమా మాద్యమానికున్న ఆదరణ నాటకానికి లేదు. అదీకాక దాదాపు పాతికేళ్ళగా ఓ మంచి నాటకం గురించి విన్నదీ, కన్నదీ లేదు. ఇక్కడ మంచి అంటే ప్రేక్షకాదరణ పొంది, మేధావుల చేత పండితుల చేత ఆహా అనిపించుకున్న నాటకాలు. అలాంటివి ఒకటీ అరా ఉన్నాయి. చాలామందికి నాటకం అంటే చిన్నచూపు. నాటక రచయితల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాటకం రాయడం అంటే అదేదో తక్కువ స్థాయి రచనా వ్యాసంగం అన్న భావన అందరిలో నాటుకు పోయింది. అసలు నాటకం అనగానే చులకన అభిప్రాయం కలగడానికి కారణాలు వెతికితే కర్ణుడి చావుకి లాగా లెక్కకి సునాయాసంగా అందుతాయి.

ప్రస్తుతం తెలుగు నాటకం పరిషత్తులకే పరిమిత మయిపోయింది. సృజనాత్మకత కరువయ్యింది. నాటక ప్రదర్శనకి పట్టు మని పదిమంది కూడా రారు. ఏం చూస్తాం, ఇంట్లో టీవీ ఉంది, సినిమాలున్నాయి, మాకింకేం సృజనా అవసరంలేదనే స్థాయిలో నాటకం ప్రేక్షకులకోసం వెంపర్లాడుతోంది.

ఏ పుస్తకాల షాపుకైనా వెళ్ళి నాటకాల గురించి పుస్తకాలు ఆడిగితే “సారీ” అనే జవాబు ఎదురొస్తుంది. నాటకాల ప్రచురణ మీద ప్రముఖ రచయితలెవ్వరూ శ్రద్ధ చూపిన దాఖాలాలు కనిపించవు. జన బాహుళ్యంలో కెళ్ళిన చాలా నాటకాల ప్రతులు ఇప్పటికీ లభ్యం కావంటే ఆశ్చర్యమేస్తుంది. టీవీల్లోనూ, సినిమాల్లోనూ అవకాశాలకి నాటకరంగం ఓ చిన్న స్టేజిలా తయారయ్యింది. “మంచి నాటకాలు రావడం లేదు, వస్తే జనాలు చూస్తారు” అని ప్రముఖుల ఉవాచ. “జనం వస్తేనే కదా, మంచి నాటకాలు రావడానికి కాస్త అవకాశం ఉంటుంది” అని ఆక్రోశిస్తుంది నాటకరంగం. ఇది పెట్ట, గుడ్డు సమస్యలా తయారయ్యింది.

నాణ్యత లేని ప్రదర్శనలూ, ఖాళీ కుర్చీలూ, నటనంటే ఏమిటో తెలియని నటీనటులూ, సృజనాత్మకత లోపించిన రచయితలూ – దర్శకులూ, పెరిగిన ప్రదర్శనా వ్యయం, మొరాయించే మైకులతో నిండిన ధియేటర్లూ, రోజు గడవని నటులూ, రాజకీయాలూ, ,….ఇలా అంతుబట్టని ఈ సమస్యలన్నీ తెలుగు నాటకాన్ని అంపశయ్య మీదికి చేర్చాయి. అసలీ పరిస్థితికి కారణాలు ఏమిటన్న ఆలోచన్లని రేకెత్తించాయి.

అలా చరిత్ర పుటల్లోకి నన్ను లాక్కెళ్ళింది నాటకం.
ఈ వ్యాస రచనకు ఇవే ఉత్ప్రేరకాలు.

భారతీయులకి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి, చరిత్రంటే చులకన, నిక్షిప్తం అంటే నిరాసక్తత. “అశోకుడు చెట్లు నాటించెను, బావులు తవ్వించెను” దగ్గరే మన చరిత్రల చదువు చతికిల బడింది. అందులోనూ వ్రాత ప్రతుల్లోకి ఎక్కని తెలుగు నాటక చరిత్ర సంగతి సరేసరి. అడవి రాముడు సినిమాలో డైలాగులా “చరిత్రడక్కు చెప్పింది విను” అనే ధోరణిలో ఉంది నేటి నాటక వ్యవస్థ. కానీ ఒక్కోసారి ముందు కెళ్ళాలంటే వెనక్కి చూడాలి. అప్పుడే ఆ అడుగుజాడలు మరింత ఉత్సాహన్నీ ఉత్తేజాన్నీ కలగజేస్తాయి. మనల్ని మనం విశ్లేషించుకోవడానికి అవకాశం కలిగిస్తాయి.


తెలుగు నాటకం – పుట్టు పూర్వోత్తరాలు

కావ్యేషు నాటకం రమ్యమ్, తత్ర రమ్య శకుంతలా
తత్రాపి చతుర్థోంకః, తత్ర శ్లోక చతుష్టయమ్

“కావ్యాలలో నాటకము రమ్యమైనది. ఆందులో కాళిదాసు వ్రాసిన శాకుంతలము అతి రమ్యమైనది. అందులోనూ, ఆ నాటకములో నాలుగవ అంకములోని నాలుగు శ్లోకాలు అన్నింటికన్నా మిన్న” అని లోకోక్తి.

అతి ప్రాచీనమైన ప్రదర్శక కళల్లో ప్రధాన మైంది నాటకం. నట అన్న పదం నాట్యం లోంచి పుట్టింది, నట అంటే అభినయం, నర్తనం అన్న అర్థం నాట్య శాస్త్రంలో చెప్పబడింది. నాట్య రూపకం (Dance Ballet) అతిప్రాచీనమైన ప్రదర్శక కళల్లో ప్రధానమైంది. ఈ నాట్య రూపకాల్లోంచే కాలక్రమేణా నాటకం పుట్టింది. కాబట్టి నాట్య శాస్త్రం లోంచి పుట్టింది నాటకం అని పెద్దల ఉవాచ.

సంస్కృత నాటకాలు రస ప్రధానంగా నడుస్తాయి. కానీ పాశ్చాత్య నాటకాలు (Western Theater‌) ఘర్షణ ప్రధానంగా ఉంటాయి. అందుకే సంస్కృత నాటకాలు సుఖాంతం గానూ, పాశ్చాత్య నాటకాలు దుఃఖాంతం గానూ ముగుస్తాయి.

సాంకేతిక పరంగా నాటకం నవరస ప్రధానమైంది. మానవ ఉద్వేగాలూ, సంబంధాలూ, స్నేహమూ, శృంగారమూ, ఆవేశమూ, ఆనందమూ, కోపమూ, క్రోధమూ ఇవన్నీ నాటక నిర్మాణానికి ఆయువు పట్టులు. రసవత్తరంగా వీటిని నాటకంలో ఇమిడ్చి, ప్రేక్షకులకి ఒక ప్రత్యేకానుభూతి కలిగించినప్పుడే రసావిష్కరణ జరుగుతుంది.


నాటకం పుట్టుక

రచనాపరంగా చూస్తే, సంస్కృత సాహిత్యంలో నాటక రచనకి శ్రీకారం చుట్టిన వాడు భాసుడు.

భాసుడి సృజనలోంచి మనకు తెలిసి 14 నాటకాలు పుట్టాయి. వాటిల్లో ముఖ్య మైనవి స్వప్నవాసవదత్తం, ప్రతిజ్ఞా యౌగంధరాయణం, కామభార. ఈ పధ్నాలుగు నాటకాల్లో ఏది మొదట రాసిందీ ఇదమిథ్థంగా తెలియదు. కాబట్టి మొదటి నాటకం ఏమిటన్నది ఇప్పటికీ వివాదాస్పదమే !

సంస్కృత నాటక కర్తలలో భాసుడు, కాళిదాసు, భవభూతి, శూద్రకుడు, భట్టు నారాయణుడు, విశాఖదత్తుడు, శ్రీ హర్షుడు ప్రముఖులు, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, అభిజ్ఞాన శాకుంతలం, ఈ మూడూ కాళిదాసు అపూర్వ రచనలు. శూద్రకుడి “మృచ్ఛకటికం” అప్పటి రాచరిక వ్యవస్థనీ, సమాజ స్థితినీ అద్వితీయంగా చిత్రీకరించిన సాంఘిక నాటకం.

సంస్కృత నాటకానికి సరైన ఆకృతినీ, రస రూపాన్నీ ఇచ్చింది కాళిదాసేనని ఖచ్చితంగా చెప్పచ్చు. ఆ తరువాత కవులందరూ కాళిదాసు అవలంబించిన రీతినే పాటీంచారు. ఇలా నాటకం అనబడే సృజనాత్మక ప్రదర్శక కళ సంస్కృత భాషలో ఆవిర్భవించింది.

ఇహపోతే తెలుగు నాటకం ఎప్పుడు పుట్టింది? సంస్కృత నాటకాలే తెలుగు వారు ప్రదర్శించే వారా? లేక అసలు తెలుగు నాటకం అనేది లేనే లేదా? ఇలాంటి నిర్థారితమైన ఆధారాలు లభించిన దాఖలాలు లేవు. ఇదంతా ఎందుకంటే, తెలుగు నాటకం పుట్టి ఇంకా 150 సంవత్సరాలు కూడా కాలేదు అంటే నమ్మశక్యం కాదు. నిర్థారిత ఆధారాలు లేదా లభ్యమైన నాటక ప్రతులను బట్టి పై కాలాన్ని సాహితీ చరిత్రకారులు నిర్ణయించారు.

తెలుగు నాటకం పుట్టు పూర్వోత్తరాలు ఇదమిత్థంగా తెలియవు. తెలుగు కావ్యాలు లభ్యమయినట్లుగా తెలుగు నాటక ప్రతులు ఎక్కడా దొరకలేదు. కాకపోతే తెలుగు నాటకం 150 సంవత్సరాల క్రితం నాటిది కాదు, ఇంతకు పూర్వమే ఉండేది అనేందుకు ఆధారాలు ఉన్నాయి.

క్రీ.శ. 1242 వ సంవత్సరంలో నేటి కర్నూలు జిల్లా దూదికోండ గ్రామవాసి అయిన యథావాక్కుల అన్నమయ్య (తాళ్ళపాక అన్నమాచార్యులు కాదు – పొరపడే అవకాశం ఉంది) అనే ఆయన రచించిన కొన్ని పద్యాల ద్వారా తెలుగు నాటకం ఉండేది అన్న విషయం ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో లభించింది. యథావాక్కుల అన్నమయ్యకి నాటకాలంటే మోజు ఉందనీ, ఆ రోజుల్లో కౌముదీ ఉత్సవాలలో ఆడేవారని ఆయన రాసిన పద్యాలలో ఉంది.

అమరంగా స్ఫుటభక్తి నాటకము భాషాంగక్రియాంగాభిర
మ్యముగా జూపిన్ మెచ్చి మీరలు పురే యన్నంతకున్ యోనిగే
హములన్ రూపులు వన్నుకొంచును నటుండై వచ్చి సంసారరం
గములోనం బహురూపమాడు వెలయంగా జీవి సర్వేశ్వరా!

ప్రారంభించి చకోరపోతము మహి యజ్యోత్స్నయం దుత్సవ
శ్రీరంజిల్లుచు వేడ్క నుండుగతి నా చిత్తంబు నీ దివ్యశృం
గారాధ్యానమునం దహర్నిశము జొక్కంజేయనే దేవ శ్రీ
గౌరీ లోచన నర్తకీనటన రంగస్థాన సర్వేశ్వరా ! ”

అంటూ ఆ కాలంలో నాటక ప్రక్రియ గురించి చెప్పకనే చెప్పాడు.

ఇలా ఆ కాలంలో ఉంది, అప్పట్లో నాటాకాలూ వేసేవారు అని చెప్పుకోవడం వరకే తెలుగు నాటక చరిత్ర పరిమితమయ్యి, ఈ మధ్య కాలంలో లభించిన ప్రతులే తెలుగు నాటక చరిత్రకి ఆయుర్దాయాన్ని నిర్థారించాయి.

మంజరీ మధుకరీయం తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటిక.

దీన్ని కోరాడ రామచంద్ర శాస్త్రి 1860 వ సంవత్సరంలో రాసారు. కానీ 1908 వరకూ ఇది అచ్చు కాలేదు. ఈ నాటకం సంస్కృతంలో భవభూతి రాసిన “మాలతీ మాధవం” అనే నాటకాని కి దగ్గరగా ఉంటుంది. దాదాపు ఇదే రామచంద్ర శాస్త్రి గారి తెలుగు నాటికకి స్ఫూర్తి అని చెప్పవచ్చు. ఈ నాటికలో నాలుగు అంకాలు ఉంటాయి. ఇది దాదాపుగా చిన్న నాటికని పోలి ఉంటుంది. ఇక్కడ నాటకం అని వాడకుండా నాటిక అని ప్రస్తావించడం జరిగింది. నాటికకీ, నాటకానికీ చిన్న వ్యత్యాసం ఉంది. తక్కువ అంకాలు కలిగి, తక్కువ కాల పరిధిలో ముగిసే దాన్ని నాటిక (ప్లేలెట్) అనీ, ఎక్కువ అంకాలతో ఎక్కువ సేపు సాగే దాన్ని నాటకం (ప్లే) అని విభజించడం జరిగింది. (నాటకం, నాటిక అన్న పదాలు ఒక దానికొకటి పర్యాయపదాలుగా ఈ వ్యాసంలో కనిపిస్తాయి. రెంటికీ నిర్మాణ పరంగా మూల సూత్రాలు ఒకటే కాబట్టి ఒక దాని బదులు ఇంకొకటి వాడడం జరిగింది. గమనించ మనవి). దీన్ని బట్టి చూస్తే, తెలుగులో మొట్ట మొదటి రచనగా నాటిక నే ప్రస్తావించవచ్చు.

ఆ తరువాత మెల్లమెల్లగా చాలా నాటకాలు సంస్కృతం నుండి తెలుగులోకి అనువదింప బడ్డాయి. కొక్కొండ పంతులు అనే ఆయన “నరకాసుర విజయం” అనే సంస్కృత నాటకాన్ని తెలుగులోకి అనువదించాడు. ఈ నాటకం 1872 లో ప్రచురించ బడింది. ఈ అనువాద రచనలో అనేక ఇబ్బందులు వచ్చాయి. శ్లోకాలకి బదులుగా పద్యాలు వాడారు. కానీ ఆ పద్యాలలో మరలా అన్నీ సంస్కృత పదాలే. అక్కడక్కడ గ్రాంధిక తెలుగు వచనం వాడారు. ఈ నాటికలో మొట్టమొదటి సారిగా సీస పద్యాలను ఉపయోగించారు. దీన్ని బట్టి చూస్తే ఇదే మొట్టమొదటి తెలుగు పద్య నాటకం అని చెప్పచ్చు.

సరిగ్గా ఆ కాలంలోనే వావిలాల వాసుదేవ శాస్త్రి అనే పట్టభద్రుడు, షేక్స్‌పియర్ రాసిన జూలియస్ సీజర్ ని “సీజర్ చరితము” అనే నాటకాన్ని 1874 లో అనువదించాడు. ఇదే ఇంగ్లీషు నాటికకి మొట్టమొదటి తెలుగు అనువాదం. ఈ నాటికలో తేటగీతి పద్యాలుపయోగించారు. వావిలాల వారు “నందక రాజ్యం” అనే సాంఘిక నాటకాన్ని కూడా రాసారు. ఇందులోనూ తేటగీతి పద్యాలు వాడారు. నందక అనే జమిందారు రాజ్యంలో ప్రజలకష్టాలు, ఆ కాలంలో ఉన్న సమస్యలూ, రాజకీయాలూ అన్నీ ఈ నాటికలో చిత్రీకరించబడ్డాయి. ఈ విధంగా వావిలాల వారే మొట్ట మొదటి సాంఘిక పద్య నాటక కర్త గా చరిత్రలో మిగిలిపోయారు.

మహాకవి కాళిదాసు రచించిన “అభిజ్జ్ఞాన శాకుంతలం” సంస్కృత నాటకాన్ని వ్యవహారిక తెలుగులోకి అంటే అచ్చ తెలుగులోకి అనువదించిన ఘనత పరవస్తు వెంకట రంగాచార్యుల వారికి దక్కుతుంది.

కానీ ఈ నలుగురు ప్రముఖులూ, వావిలాల, కొక్కొండ, కోరాడ, పరవస్తులు రాసిన, పైన ఉదహరించిన నాటకాలు ప్రదర్శించ బడ్డాయో, లేదో తెలియదు. కాకపోతే ఇవన్నీ ప్రచురితం అయ్యాయి. ఈ పద్య నాటకాలని పద్య రూపకం అని వ్యవహారించేవారు. ఈ పద్య రూపకాలకి ప్రదర్శన యోగాన్ని కలిగించి, ప్రజలలో ఆసక్తి కలిగించిన వాళ్ళల్లో ముఖ్యులు, కందుకూరి వీరేశలింగం, నాదెళ్ళ పురుషోత్తమ కవి, కొండుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి, మరియు వడ్డాది సుబ్బారాయడు. వీరిలో కందుకూరి, సాంఘిక, తెలుగు భాషా చైతన్యానికి నాయకత్వం వహించి, తెలుగు నాటకానికి సరికొత్త రూపాన్ని ఇచ్చిన వాళ్ళల్లో ఆద్యులు. “వ్యవహార ధర్మబోధిని” అనే సాంఘిక వ్యంగ్య నాటకాన్ని రచించి, ప్రదర్శించారు కందుకూరి వారు. అప్పట్లో న్యాయవాదులపై విసుర్లు, వారు చేసే తప్పుల తడకలూ, ఇవన్నీ ఈ నాటకంలో హాస్యంగా రాసి, ప్రదర్శించారు వీరేశలింగం గారు. ఇదే తెలుగులో ప్రప్రధమ హాస్య నాటికగా పరిగణించ వచ్చు. ఆ తరువాత ప్రజలు నాటకాలపై ఉత్సాహాన్ని చూపించడంతో, అనేక నాటకాలు వచ్చాయి.

అప్పుడే ధార్వాడు నాటక సమాజం వాళ్ళు హిందీ నాటకం ప్రదర్శన కోసం రాజమండ్రి నగరానికి వస్తే, అది చూసి ఉత్తేజితులై, వీరేశలింగం, శ్రీ హర్షుడు సంస్కృతంలో రాసిన రత్నావళిని అదే పేరుతోనూ, షేక్స్‌పియర్ “కామిడీ ఆఫ్ ఎర్ర్రర్స్” ని “చమత్కార రత్నావళి” పేరుతోనూ అనువదించి, ఓ నాటక సమాజాన్ని స్థాపించి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ రకంగా వీరేశలింగం గారే మొదటి తెలుగు నాటక సమాజ ఆవిష్కర్తలుగా నిలిచారు. ఆ తరువాత వచ్చిన గురజాడ వారి కన్యాశుల్కం నాటకం ఎంత ప్రాచుర్యం పొందిందో తెలుగు వారందరికీ తెలుసు.

ఇదీ స్థూలంగా తెలుగు నాటక చరిత్ర!

ఇంకా వివరంగా తెలుసు కోవాలంటే, పలువురి ప్రశంసలు పొందిన మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారి ప్రముఖ రచన, “ఆంధ్ర నాటక రంగ చరిత్ర” చదవాలి. ఇందులో అనేక రంగ స్థల కళాకారుల వైనాలూ, నాటక సమాజాల వివరాలూ, ప్రసిద్ధి చెందిన నాటకాల పై వ్యాఖ్యానాలూ అన్నీ సవివరంగా ఉన్నాయి. తెలుగు నాటక చరిత్ర పై ఆసక్తి ఉంటే ఈ పుస్తకం చదివితీరాల్సిన జాబితాలో ప్రథమంగా ఉంటుంది.


పరిణామ దశ

అలా సంస్కృతం నుండి దిగుమతి కాబడ్డ నాటకం కాలానుగుణంగా అనేక మార్పులకీ, చేర్పులకీ గురయ్యింది.

రామాయణ, భారత, భాగవతాది మహా కావ్యాలలో చిన్న చిన్న కథలూ, పర్వాలూ తెలుగు నాటకంలోకి మెల్లగా చొచ్చుకొచ్చాయి. మొదట్లో పురాణాల ప్రభావం తెలుగు నాటకాలపై చాలా ఎక్కువగా ఉండేది. వచ్చిన వన్నీ పద్య నాటకాలు కావడం, పద్యానికున్న ప్రజాదరణ ఇవన్నీ కవుల్ని పద్య నాటకాలు రాసేట్లా చేసాయి. అలాంటి వాటిల్లో తిరుపతి వేంకటకవులు రాసిన పాండవోద్యోగం లోని పద్యాలు ఇప్పటికీ తెలుగు వారి నోళ్ళల్లో నానుతూనే ఉన్నాయి.

మన ఎరుకలో ఉన్న వాగ్గేయ కారులూ, ప్రముఖ కవులూ, రచయితలూ చాలామంది నాటకాన్ని స్పృశించకుండా తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించ లేదు. త్యాగరాజు నౌకా చరిత్రం, ప్రహ్లాద చరితము అనే నృత్య నాటికలు రాసాడు. అలాగే విశ్వనాథ సత్యనారాయణ, పానుగంటి, చిలకమర్తి. మొక్కపాటి, జంధ్యాల పాపయ్య శాస్త్రి, సముద్రాల, ఆత్రేయ, ఆరుద్ర, రావి శాస్త్రి, ఎన్ ఆర్ నంది, నరసరాజు, భమిడిపాటి, గొల్లపూడి, జంధ్యాల, యండమూరి, ఇలా పేరెన్నికగన్న రచయితలందరూ నాటకాలు రాసిన వారే!

మహాకవి విశ్వనాథ సత్యనారాయణ మూడు నాటకాలు రాసారు. ఇదే విషయం ఆయన్ని ఒకసారి ఎవరో అడిగితే “కావ్యాలూ, గ్రంథాలూ రాస్తే కవి అవుతాడు, నాటకం రాస్తేనే పరిపూర్ణ కవి అవుతాడు. కాళిదాసంతటి వాడే ఒక నాటకం పది కావ్యాలతో సమం అని అన్నాడు. అందుకే నేను నాటకం రాసాను” అంటూ సెలచిచ్చారు. విశ్వనాథ వారే ఇంకా ఇలా అన్నారు – “అన్ని రచనా ప్రక్రియల్లోకీ నాటకం రాయడం చాలా కష్టం. ఒకరకంగా చెప్పాలంటే రచయితల సృజనాత్మకతకి పెద్ద సవాలు ఈ నాటకం రాయడమనేది. రసానుభూతికి పరాకాష్ట నాటకం.” నిజమే కదా, నాటకం రక్తి కట్టినప్పుడే ప్రేక్షకులకి కవి కనిపిస్తాడు. కథనీ, కథనాన్నీ, నటుల్నీ, సంగీతాన్నీ, దర్శకుణ్ణీ వీళ్ళందర్నీ దాటుకొని ఓ కవి లేదా రచయిత ప్రేక్షకులను స్పృశించేది వారిలో సరైన రసానుభూతి కలిగించి నప్పుడే! లేదంటే కవి కనుమరుగై పోతాడు. చెడిన ఆ నాటకం చరిత్ర చెత్త బుట్టల వైపు వెళిపోతుంది.

మారుతున్న సమకాలీన సమాజాని కనుగుణంగా నాటకమూ మారింది. అనేక సాంఘిక, విప్లవాత్మక, హాస్య నాటకాలూ, నాటికలూ పుట్టుకొచ్చాయి. నాటక ప్రదర్శన తీరు మారింది. ఒకప్పుడు గుళ్ళలోనూ, వీధి చావళ్ళలోనూ ప్రదర్శింప బడే నాటకం కాల క్రమేణా ఎత్తయిన వేదికెక్కింది. తనకంటూ ఓ రంగస్థలాన్ని అమర్చుకుంది. ఊరూరూ తిరిగింది. ప్రజలకి దగ్గరగా వెళ్ళింది. వాళ్ళ అనుభూతుల్ని తాకింది. స్పందనతో చేతులు కలిపి, పదిమందికీ వినోదాన్ని పంచే కళగా మారింది. మనిషి సాంకేతిక విజ్ఞానంతో పాటు నాటకమూ ఎదిగింది. రంగులూ, హంగులూ అలవాటు చేసుకొంది. కానీ సాంకేతిక విజ్ఞానంతో పాటు తనూ ఎదుగుతోంది అన్న తరుణంలో చిత్రంగా ఓ విచిత్రమైన చిత్రరాజపు వెల్లువలో కదల్లేని స్థితిలో కూరుకు పోయింది నాటకం.

స్వాతంత్ర్యం రాకముందు అనేక మంది రంగస్థల నటులు తమ తమ జీవితాల్ని నాటకానికే అంకితం చేసి, తెలుగు నాటక వైభవాన్ని నలుదిశలా చాటారు. అటువంటి వారిలో కృత్తివంటి నాగేశ్వరరావు ఒకరు. నాటకం పై మక్కువతో నాటక సమాజాన్ని నడిపి తెలుగు నాటకాన్ని రంగూన్ వరకూ తీసికెళ్ళి, అనేక ప్రదర్శనలు ఇచ్చి, తెలుగు నాటకోన్నతికి కృషి చేసిన వారిలో అగ్రగణ్యులు నాగేశ్వరరావు.

ఆస్తులూ, పాస్తులూ అన్నీ నాటకాల వెలుగు కోసం హారతి పట్టిన అనేకమంది రంగస్థల నటులున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి కథ. మిక్కిలినేని గారి గ్రంథం చదివితే ప్రతీ పుటకీ కళ్ళు చెమర్చక పోతే ఒట్టు. ఇంతమంది ఇలా నాటక రంగానికి తమ జీవితాల్ని ధారపోసారని తెలిస్తే ఒళ్ళు జలదరిస్తుంది. మరి వాళ్ళ శ్రమ అంతా ఏమయ్యింది? నాటక రంగం ఎందుకు ఎదగలేక పోయింది? ఏ పరిణామ క్రమంలో నాటక రంగం గాడి తప్పింది? ఇవన్నీ భేతాళ ప్రశ్నల్లా ఎందరినో ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. కానీ జవాబులు మాత్రం ఎవరి వద్దా లేవు.


నాటక సూత్రాలు – నిర్దేశకాలు

అన్ని రచనా ప్రక్రియల్లోకీ నాటక రచన చాలా క్లిష్ట మైంది. కథ అయినా, కావ్య మయినా, వాటికి విస్తృతి ఎక్కువ. నాటకం అలా కాదు. దానికి పరిమితులు ఎక్కువ. రచన చేయడం ఒక ఎత్తయితే, దాన్ని ప్రదర్శనా యోగ్యంగా మలచడం ఇంకో ఎత్తు. నటులందరూ తమ తమ పాత్రలకి ప్రాణ ప్రతిష్ట చేస్తేనే ఆ నాటకం బతికి బట్ట కడుతుంది. లేదంటే రచయిత పడిన శ్రమంతా వృధాగా మారుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మిగతా రచనా వ్యాసంగాలు ఒక్క రచయిత పనితనం, సృజన మీదే అధార పడి నాణ్యత వుండీ, పలువురికీ నచ్చితే అవి సులభంగా బ్రతికినట్లే ! కానీ ఒక నాటకం అలా కాదు. అది బ్రతకడానికి అనేక మంది ఊపిరి పోయాలి. అందుకే కావ్యాలు ఏక సృజన, నాటకం సమిష్ఠి సృజన!

ఏ కవి అయినా, రచయితయినా నాటకం రాయాలంటే కొన్ని నాటక సూత్రాలు తెలుసుకోవాలి. అసలు నాటకానికి మూలస్థంభాలు ఏమిటో తెలియాలి. సంస్కృత నాటక కర్తలూ, ఆ తరువాత తరం వారూ, కొన్ని ప్రాథమిక సూత్రాలు ఇచ్చారు. అవి

1. కథా వస్తువు – ఇతివృత్తం – కథనం
2. నటీనటులు – ఆంగికం, వాచ్యం, నటనా శిక్షణ
3. రంగస్థల ఆహార్యం ( దుస్తులు, నాటకంలో వాడే వస్తువులు, సంగీతం మొదలైనవి )
4. సంధాత లేదా నిర్దేశకుడు ( పై 1, 2, 3 విభాగాలపై పట్టు వున్న వాడు )

ఈ నాలుగు స్థంభాలకీ సరైన పునాది పడితేనే నాటకం ప్రజల హృదయాల్లో నిలుస్తుంది. ఇందులో ఏది అపసవ్యమయినా ఆ నాటకం నిలువునా కూలిపోతుంది. ఈ నాలుగు విభాగాల గురించీ విడి విడిగా ఓ గ్రంధం రాయచ్చు. కానీ సంక్షిప్తంగా ఒక్కో అంశాన్నీ తెలసుకునేందుకు ప్రయత్నిద్దాం.

1. కథా వస్తువు – ఇతి వృత్తం

ప్రతీ నాటకానికీ వస్తువు, ఇతివృత్తం నిర్ణయింప బడ్డాక అప్పుడు మొదలవుతుంది రచయిత సృజనాత్మక మథనం. కావ్యమంటే దృశ్య మనీ, శ్రవ్య మనీ అన్నారు. ఇందులో ఇతివృత్తం, గుణాలూ, రీతులూ, అలంకారం, రస ప్రకరణ, పాత్రల స్వభావం ఇవన్నీ కావ్యానికి కావల్సిన సామగ్రి. నాటకానికీ దాదాపు ఇదే సామగ్రి అవసరం. కానీ కావ్యంలో వచనం లేదా పద్యాల ద్వారా ఒక్కో గుణాన్నీ వర్ణిస్తూ ముందుకు సాగిపోవచ్చు. అవసరమైన చోట సవివరణలతో దృశ్యాన్ని కళ్ళ ముందు మెదిలేలా చెయ్యచ్చు. పాత్రల మనోగతాన్ని వ్యక్తీకరించవచ్చు. కానీ నాటకంలో ఇవేం కుదరవు. కళ్ళ ముందు కదిలే పాత్రల ద్వారా కథని నడిపిస్తూ, ప్రేక్షకుణ్ణి లీనమయ్యేట్లా చెయ్యాలి.

కానీ కథకీ, కావ్యానికీ లేని ఒక ప్రత్యేక గుణం నాటకానికి వరంలా సిద్ధించింది. అదే శబ్ద ప్రకటిత వాచ్యం.

కథకీ, కావ్యానికీ లేని శబ్ద ప్రకరణం నాటకానికుంది. అంటే సంభాషణలతో శబ్దార్థాన్ని సహజంగా చెప్పడంతో అది అతి సులభంగా మనసు కంటేలా చెయ్యొచ్చు. ఏదైనా దృశ్య ప్రతిబింబాన్ని మదిలో స్పష్టంగా చూపాలంటే నాటకంలో అది సులభంగా చూపించొచ్చు. ఉదాహరణకి సీతాస్వయంవర ఘట్టం తీసుకుంటే నాటకంలో అతి తక్కువ సంభాషణలతో, సరిఅయిన ఆహార్యంతో ( మేకప్, సెట్టింగ్స్ ) లతో, కేవలం నటనతో రాముడు ఎవరూ ఎత్తలేని బరువైన శివధనస్సుని అవలీలగా ఎత్తి, విరిచినట్లు చూపించ వచ్చు. ఇదే కావ్యాల్లో నయినా, కథల్లో నయినా ప్రతీ చిన్న విషయాన్నీ వివరంగా వర్ణిస్తే కానీ ఆ దృశ్యం పాఠకులకి అందదు. అందువల్లే నాటకం పండిత పామరులను కూడా రంజింప చేస్తుంది. “కావ్యేషు నాటకం రమ్యం” అన్న నానుడిని ధృవ పరిచింది ఈ ప్రత్యేక ప్రదర్శనా గుణమే! అలాగే “ఎలా వున్నారు?” అన్న సంభాషణని, వివిధ రకాల ధ్వనులతో (వ్యంగ్యం, హాస్యం, ఎత్తిపొడుపు, దెప్పిపొడుపు, విసురు, సాధారణం, ఆప్యాయం, స్నేహం, వగైరాలు) సహజత్వానికి దగ్గరగా నాటకంలో చూపించొచ్చు. కానీ ఈ ధ్వని కథలో చూపించలేం. ఈ ధ్వని ఊహకందేలా రాయడం కష్టమే! కానీ విరుపులూ, వ్యంగ్యాలూ, ఎత్తిపొడుపులూ, దెప్పి పొడుపులూ, హాస్యాలూ, కోపాలూ, తాపాలూ నాటకంలో చూపించినంత సులభంగా కథల్లో రాయడం కష్టమే!

కథా వస్తువు, ఇతివృత్తం రెండూ వేర్వేరు అయినప్పటికీ నాటకం వరకూ వచ్చేసరికి రెండూ ఇంచుమించు ఒకటే! కాబట్టి రెంటినీ కలిపి ఇతివృత్తమని అనచ్చు. ఈ ఇతివృత్తాలని ప్రఖ్యాత మనీ, ఉత్పాదకమనీ, మిశ్రమమనీ మూడు రకాలుగా విభజించారు. ఇతివృత్తాన్ని భారత, భాగవత, రామాయణాలూ, పురాణాల్లోంచి ఎన్నుకుంటే అది ప్రఖ్యాతమని అన్నారు. అలా కాకుండా రచయిత మేధాసృజన నుండి పుట్టందయితే, దాన్ని ఉత్పాదకమనీ అన్నారు. ప్రఖ్యాతమూ, ఉత్పాదకమూ కలిపి వండితే మిశ్రమమన్నారు. సంస్కృత నాటకాలు చాలా వరకూ ప్రఖ్యాతాలు. శూద్రకుడి మృచ్ఛకటికం ఉత్పాదకంలోకి వస్తుంది.

కథ, పాత్రలూ పరిచయమున్న వయితే తన ప్రతిభ చేర్చి మంచి సంభాషణలతో, సన్నివేశ నిర్మాణంతో నాటకం రాయడం రచయితకి కాస్త సులభమైన పని. ఇలాంటి నాటకాలు ప్రజలకి సులభంగా ఎక్కుతాయి. తిరుపతి వేంకట కవుల పాండవోద్యోగ నాటకం ఈ కోవకు చెందుతుంది. అలా కాకుండా కథ, ఇతివృత్తమూ కొత్త దయితే రచయితకి పని ఎక్కువే! ముందుగా వస్తువు నిర్ణయించుకోవాలి, తరువాత సన్నివేశ విభజన చేసుకోవాలి. పాత్రల నిడివి చూసుకోవాలి. సంభాషణలు చూసుకోవాలి. సన్నివేశానికీ, సన్నివేశానికీ, మధ్య పాత్రల సమన్వయం చూసుకోవాలి. రసావిష్కరణ చూసుకోవాలి. చివరగా ఇవన్నీ నిర్దేశించిన కాలవ్యవధిలో ఇరికించాలి. ఒకరకంగా చెప్పాలంటే ఒక కొత్త నాటకాన్ని ఉత్పాదకం చెయ్యాలంటే రచయిత చాలా కసరత్తు చేయాల్సి వుంటుంది. ఇలాంటి నాటకం బ్రతికి బట్ట కట్టాలంటే నటీనటులు అద్భుతమైన నటనని ప్రదర్శించాలి. ఈ మధ్య వచ్చిన సాంఘిక నాటకాలు ఈ కోవకు చెందుతాయి. ఈ ఉత్పాదక ప్రక్రియకి ఉదాహరణగా ఎన్ ఆర్ నంది రాసిన “మరో మహంజదారో” మొదటిగా చెప్పుకోవచ్చు.

ఇహ మూడోది మిశ్రమ పద్ధతి. కాస్త పౌరాణికంలో తెలుసున్న పాత్రలు తీసుకొని, ఆ పాత్రలూ, కథ చెడకుండా ఒక కొత్త కథని సృష్టించి పదిమందీ మెచ్చుకునేలా చేయడం. ఇది అనుకున్నంత సులభం కాదు. ఈ కోవలోకి మాయాబజార్ నాటకం వస్తుంది. ఇందులో కథంతా కల్పితమే ! కాని ఆ కల్పన వాస్తవం అనిపించేలా చేయడం కత్తి మీద సాములాంటిదే ! ఎందుకంటే ఇక్కడ రచయితకి స్వేచ్ఛ ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ ఓ నిర్బంధిత చట్రం అడుగడుగునా అడ్డు పడుతూనే ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, నాటకం అంటే ఏముంది, నాలుగు డైలాగులు రాసేస్తే నాటకం అయిపోతుంది. కానీ రాయడం వేరు, గుర్తుండేలా రాయడం వేరు. అదేదో సినిమాలో తనికెళ్ళ భరణి గారన్నట్లు, “అది అంత వీజీ కాదు”. నాటక నిర్మాణానికి, ముఖ్యంగా రచనకి, అనేక పరిమితులుంటాయి. సరైన కథ, ఇతివృత్తాన్ని ఎన్నుకోవడం, దాన్ని ఓ తీరుగా మలచడం మొదటి పరిమితి.

ఇహ రెండోది – పాత్రలు, వాటి చిత్రీకరణ, సంభాషణలు, సన్నివేశావిష్కరణ ఇవన్నీ ఇంకో పరిమితి. ఏఏ పాత్రలు ఉండాలి? వాటి నిడివి ఎంత ఉండాలి? ఎన్ని సంభాషణలు ఉండాలి? ఏయే సన్నివేశాలు ప్రవేశ పెట్టాలి? ఇవన్నీ ఇంకో తలనెప్పి. పాత్రల ప్రవేశంతోపాటు స్థల కాల నిర్ణయాన్ని కూడా ప్రేక్షకులకి స్పష్టంగా తెలిసేలా చేయాలి. ఒక్కోసారి ఓ చిన్న విషయం చెప్పాలన్నా, లేదా పాత్రల స్వభావాన్ని చూపాలన్నా కొన్ని అనవసర పాత్రలు సృష్టించాల్సి వస్తుంది. లేదా వేరే పాత్ర ద్వారా మొదటి పాత్ర స్వభావాన్ని చెప్పించాలి. లేదా అదే పాత్ర ప్రవేశం చేసేటప్పుడే ఆ స్వభావాన్ని స్పష్టంగా చూపాలి. ఉదాహరణకి, ఓ నాటకంలో ఓ పిసినారి స్వభావం ఉన్న పాత్ర ఉందునుకోండి. ఆ పాత్రని స్వభావాన్ని పలురకాలుగా చూపించొచ్చు. పిల్లికి కూడా బిచ్చం వేయడు అని చూపించాలంటే – ఎవరైనా చందా కోసం వచ్చినట్లుగా ఓ రెండు చిన్న పాత్రలని ప్రవేశపెట్టి, వాళ్ళ దగ్గరే అతితెలివిగా డబ్బుకాజేసినట్లుగా చూపించొచ్చు. లేదా అదే నాటకంలో “వాడా! ఒట్ఠి పిసినారి చచ్చినాడు. శవానికి దండ వేయండి అంటే పోయినాడు మనం వేసిన దండ ఎలాగా చూడ్డు, చచ్చినాడు ఎలాగూ చచ్చాడు, మళ్ళా ఈ దండ ఖర్చొకటి. దండ ఖర్చు కాదు, దండగ ఖర్చు – అని బాధ పడిపోతాడు” అంటూ వేరే పాత్ర ద్వారా చెప్పించొచ్చు. ఇహ మూడోది, ఆ పిసినారి పాత్ర ప్రవేశంలోనే దేముడుకి దణ్ణం పెడుతూ అగరువత్తులు వెలిగిస్తాడు. దేముడి చుట్టూ నాలుగు సార్లు తిప్పి, ఆ అగరువత్తు ఆర్పేస్తాడు. ఎందుకంటే మరలా అదే అగరువత్తు రేపూ వాడచ్చు అని. ఇలా రకరకాలుగా ప్రతీ పాత్రని ప్రవేశ పెట్టచ్చు.

ఒక్కోసారి కొన్ని మూలకథ చెడకుండా కల్పిత పాత్రలు ప్రవేశ పెట్టాల్సి వస్తుంది. ఇవి నాటకంలో చాకచక్యంగా సృష్టించాలి. ఒక్కోసారి ఈ కల్పిత పాత్రలే సజీవ పాత్రలుగా అనిపిస్తాయి. కొన్ని పౌరాణిక, సాంఘిక నాటకాలలో ప్రవేశ పెట్టిన కొన్ని ప్రాచుర్యం పొందిన పాత్రలు కల్పితమేనంటే నమ్మశక్యం కాదు. దానికో చిన్న ఉదాహరణ. “ప్రాచీన సాహిత్యంలో నాటకాలు రాసిన ఉదంతాలు లేవు కానీ నాటక సాంప్రదాయాన్ని కావ్యాలలో ప్రవేశ పెట్టిన 13వ శతాబ్దపు గౌరన అనే కవిని తెలుగుజాతి గర్వించ దగ్గ నాటక రచయితగా చెప్పుకోవచ్చని” ఆరుద్ర సమగ్రాంధ చరిత్రలో ఉంది. అతి ప్రాచుర్యం పొందిన “సత్య హరిశ్చంద్ర” నాటకంలో నక్షత్రకుడి పాత్రనీ, అలాగే సారంగధర నాటకంలో సారంగధరుని చెలికాడు “సుబుద్ది” నీ సృష్టించింది గౌరనే ! ఈ కల్పిత పాత్రలే ఇప్పటికీ ఈ నాటకాలలో సజీవంగా నిలిచిపోయాయి. ఒక్కోసారి, చిన్న విషయం చెప్పడానికి కొన్ని సన్నివేశాల్ని సృష్టించాల్సి వస్తుంది. సరికొత్త పాత్రలని ప్రవేశ పెట్టాల్సివస్తుంది. ఇది రచయితకి ఇంకో పరిమితి.

మాటలు, సంభాషణల పరిమితి ఎలాగూ ఉంటుంది. నటుల నటనా చాతుర్యం వల్ల ఒక్కోసారి కొన్ని సంభాషణలు కుదించాల్సి వస్తుంది! పాత్ర నిడివిని బట్టీ, స్వభావాన్ని బట్టీ, పాత్రోచితంగా సంభాషణలు రాయడం కత్తిమీద సాము లాంటిది. కొంతమంది నటులకి చిన్న చిన్న సంభాషణలు పనికిరావు. మేం ఇంత పెద్ద నటులం, ప్రతీ ప్రదర్శనలో చించేసాం, చెరిగేసాం, అవార్డులు కొట్టేసామంటూ పేజీల పేజీల డైలాగులతో ఊదరకోట్టేస్తారు. ఇంకొంతమంది నటులకి డైలాగులు ఎక్కువయితే చెమటలు రెట్టింపవుతాయి. ఒకవేళ రచయిత తక్కువ, ఎక్కువలతో తన స్వంత ప్రతి రాసినా, నాటకం మొదలయ్యేసరికి మార్పులూ, చేర్పుల అవసరాలు వద్దన్నా వచ్చి పడతాయి.. ఒక్కోసారి భటుడు పాత్ర ధారి కూడా రచయితకి డైలాగులెలా రాయలో ఓ ఉచిత సలహా పారేస్తాడు. ఇహ దర్శకుడి చేతివాటం ఎలాగూ తప్పదు. ఇలా వీళ్ళందర్నీ దాటుకుంటూ రచయిత నాటకం రాయాల్సి వస్తుంది. ఇది అన్నిటికన్నా దుర్భరమైన పరిమితి. ఇది దాటితే నాటకం మూడొంతులు బ్రతికినట్లే!

కొన్ని కొన్ని సన్నివేశాలు స్టేజి మీద చూపడం కష్టం. ఉదాహరణకి తుఫాను వచ్చే సన్నివేశం ఉన్నా, ఇల్లు అంటుకున్న సన్నివేశం ఉన్నా, రైలు ప్రయాణంలో సన్నివేశ మున్నా స్టేజి మీద చూపించడం కష్టం. కాబట్టి రచయిత ముందుగానే ఇలాంటి సన్నివేశాలని తెలివిగా తప్పించి, అక్కడ అటువంటి వాతావరణాన్ని చూపించేలా సన్నివేశం రాయాలి. చాలా సార్లు సంభాషణల ద్వారా ఇలాంటి అవరోధాలు రచయిత సులభంగానే దాటేస్తాడు.

ఇహ ఆఖరి పరిమితి, సమయం. నాటక సమయం నిడివిని బట్టి నాటకాన్ని రాయాల్సి వస్తుంది. ఎక్కువయితే కుదింపులూ, తక్కువయితే సాగదీపులూ రచయితకి ఎలాగూ తప్పవు. చాలా చిత్రమైన విషయం ఏమిటంటే, అరగంట సమయంలో రామాయణాన్ని వేసేయమంటారు. అందులో మళ్ళా రాముడి బాల్యం చూపించాలి, సీతా కళ్యాణం పాటలుండాలి, కైక, మంధరా ఉండాలి, బంగారు లేడిని స్టేజి మీద పరిగెత్తించాలి, రావణుడికి భారీ డైలాగులు రాయాలి, చివరగా యుద్ధం చూపించాలి. ఇవన్నీ వెరశి ఓ అరగంట లేదా మరీ గట్టిగా మీదపడి కొరికేస్తే నలభై అయిదు నిమిషాల్లో అత్యద్భుతంగా, ఆహా, ఓహో అనేట్లా ( న భూతో న భవిష్యతి అన్నమాట) నాటకం ఉండాలి. లేకపోతే రచయిత వెంట్రుక కన్న హీనంగా పరిగణించ బడతాడు.. మూడు ముక్కల్లో చెప్పాలంటే నాటకం వేయమనే వాడికి వేసేవాడూ, రాసేవాడూ లోకువ. కేటాయించిన సమయంలో నాటకాన్ని రమణీయంగా మలచడం అతి కష్టమైన పరిమితి.

ఇలా ఇన్ని పరిమితులు దాటుకుంటూ, ఇచ్చిన పరిధిలో, కేటాయించిన సమయంలో, పాత్రల పరిధిలో రచయిత తన శక్తినంతా ధారపోసి ఓ నాటకానికి అంకురార్పణ చేస్తాడు. దీన్నే మనం స్క్రిప్టు అని అంటూంటాం. మన పూర్వీకులు పాటించిన ఈ ప్రాధమిక పద్ధతులే దాదాపుగా పాశ్వాత్య రచయితలూ పాటించారు. కాలానుగుణంగా అనేక మార్పులు చెంది, పాశ్చాత్య నాటక రంగం ముందుకెళ్ళింది, కానీ మన తెలుగు నాటక రంగం ఎక్కడ వేసిని గొంగళి అక్కడే అన్న చందంగా కూలబడింది. (కారణాలు ఈ వ్యాసం చివరన “నేటి తెలుగు నాటక రంగ పరిస్థితి” అనే అంశం గురించి సవివరంగా ప్రస్తావిస్తాను).

కాబట్టి ఒక నాటకం పుట్టాలంటే రచయి(త్రు)త లెవరైనా సరే ఇంత ప్రసవవేదనా పడాల్సిందే. వ్రాత ప్రతి సిద్ధంకాగానే నాటకం అయిపోలేదు, ఒక మూల స్థంభాన్ని నిలబట్టిన లెక్క. ఇంకా ఓ మూడు మిగిలాయి.

2. నటీనటులు – ఆంగికం, వాచ్యం, నటనా శిక్షణ

ఏ నాటకమైనా రక్తి కట్టాలంటే అందులో నటుల పాత్ర చాలా ఉంటుంది. రాయడం ఒక ఎత్తు, రాసిందానిని పాత్రల పరంగా నటులు అందులో పరకాయ ప్రవేశం చేసి కళ్ళ ముందే ఆ సంఘటన జరుగుతోంది అన్న భావన కలగచేసినప్పుడే ఆ నాటకం బ్రతికి బట్ట కడుతుంది.

నటనకి మూడు గుణాలు ముఖ్యంగా చెప్పచ్చు. ఒకటి అభినయం, రెండు వాచ్యం, మూడు రూపం. రూపం ఉంటే నటన ఉండదు. నటన ఉంటే వాచ్యం సరిగా ఉండదు. ఈ రెండూ ఉంటే రూపం పెద్ద లోపం గా ఉంటుంది. ఈ మూడు ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఈ మూడు ఉన్న నటుడుగా నందమూరి తారక రామారావుని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

పాత్రకి తగ్గ నటులున్నప్పుడే నాటకం జనప్రియం అవుతుంది. మన పౌరాణిక నాటకాలే తీసుకుందాం, రాముడయినా, కృష్ణుడయినా, రావణాసురుడైనా పాత్రకి తగ్గ రూపం ఉన్నప్పుడే బావుంటుంది. కానీ నటనాభిలాష ఉన్న ప్రతీ నటుడూ/నటీ మణీ రూపవతులుగా ఉండాలని లేదు. కొంతమందికి మంచి గాత్రం, వాచ్యం ఉంటుంది. అలాంటప్పుడు రూపం దాదాపు ఆ పాత్రకి దగ్గరగా ఉన్నా పరవాలేదు. పూర్వం పద్య నాటకాలే తీసుకుందాం, పేరు పొందిన అనేక మంది నటులకు కేవలం గాత్రం (పద్యం శ్రావ్యంగా పాడడం) అన్న అంశం వల్లే వారి వారి రూపాలు ఎలా ఉన్నా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాబట్టి నాటకానికి నటుల రూపం కొంత వరకే పనికి వస్తుంది. నటన, వాచ్యం లేదా గాత్రం బాగుంటే రూపాన్ని మినహాయింపుగా తీసుకోవచ్చు. కానీ వాచ్యం అంటే సంభాషణా మాధుర్యం లేకపోతే చాలా కష్టం. దానికి మంచి గొంతు ఉంటే మరింత తోడ్పడుతుంది, కానీ ఏ సంభాషణ ఎలా చెప్పాలి అన్నది వారి వారి నటనాశక్తి మీదే ఆధారపడి ఉంటుంది.

సందర్భానుసారంగా, పాత్రానుగుణంగా సంభాషణలు ఏ స్థాయిలో చెప్పాలో దర్శకుడు చెప్పినా, నటులకీ ఓ రకమైన సహజమైన అవగాహన ఉండాలి. కొంతమందికి శిక్షణ వల్ల ఇది అబ్బుతుంది. కొంతమందికి అది సహజంగా ఉంటుంది. అలాంటి నటులు/నటీమణుల నటన చూసినా, సంభాషణలు విన్నా ఎంతో సహజంగా అనిపిస్తాయి. శిక్షణ ( దీన్నే రిహార్సల్ అంటూంటాం ) అనే కొలిమిలో నటన ఎంత కాలితే అంత మంచిది. అప్పుడే అది బంగారంలా రాణిస్తుంది. కొన్ని పాత్రలు చేయడానికి నటులకి ఎంతో శ్రద్ధ, క్రమశిక్షణ అవసరం. అవి ఉంటేనే పాత్రలు నిలుస్తాయి, ఆ పాత్రలే ఆ నటులకి పేరు తెస్తాయి. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు లాంటి పాత్రలు చెప్పినా, దేవదాసు, గిరీశం పేర్లు చెప్పినా మనకి కొంతమంది నటులు అప్రయత్నంగా మదిలో మెదులుతారంటే, ఆ నటులు ఎంతగా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రల్ని పండించారో అర్ధమవుతుంది.

చాలామందికి నాటకం అనగానే, ఏముంది గట్టిగా నాలుగు డైలాగులు చెప్పేస్తే చాలు అనుకుంటారు. కాస్త గొంతు విప్పి సరైన ఉచ్చారణతో తగిన విరామం ఇస్తూ (పాజ్ లు) సంభాషణలు చెప్పడం ఒకరకంగా కష్టమైన నటన అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ డైలాగులు చెప్పేవాడి యాక్షన్ కి అనుగుణంగా ప్రతిస్పందిస్తూ నటించడం మరింత కష్టం. ఎందుకంటే డైలాగులు చెప్పేటప్పుడు ఆ నటుడి దృష్టంతా వాటిమీదే కేంద్రీకరించి బడి ఉంటుంది కాబట్టి నటనా పరంగా కాస్త అభినయాన్ని జోడిస్తే పరవాలేదు. కానీ డైలాగులు లేకుండా ఎదుటి నటుల సంభాషణల కనుగుణంగా రియాక్షన్ చూపించడం అనుకున్నంత సులభం కాదు. డైలాగులు లేకుండా అభినయం చేసినప్పుడే సరైన నటన బయటకి వస్తుంది. మంచి రియాక్షన్ చూపించి నప్పుడే నటీనటుల సత్తా బయటపడుతుంది. కొన్ని నాటకాల్లో చూస్తూ ఉంటాం, డైలాగు చెప్పే వాడి ధోరణి వాడిది, మిగతావాళ్ళ ధోరణి వాళ్ళది. అలాంటి నాటకాలు చూడడానికి ఎంతో అపహాస్యంగా ఉంటాయి.

కాబట్టి మంచి నటన ప్రదర్శించాలంటే నటులు చాలా శ్రమించాలి. పాత్రని అర్థం చేసుకొని, సరైన అభినయం చూపించడం నటులకి ఒక రకంగా పెద్ద ఛాలెంజే ! అలా చేసినప్పుడే ఆ దృశ్యం పండుతుంది. ఇంకా ప్రతీ నటుడూ సంభాషణలు భట్టీయం (మెమరైజ్) చేసి తీరాలి. కొంతమందికి రిహార్సల్స్ లో బాగానే ఉంటారు. తీరా స్టీజి ఎక్కేక చెప్పాల్సిన డైలాగులు మింగేస్తారు. దాంతో తోటి నటులకి ఎప్పుడు డైలాగు చెప్పాలో తెలియకుండా పోతుంది. దాంతో వాళ్ళు ఏదైనా మర్చి పోతే ఉన్న నాటకం కాస్తా చెడుతుంది. అందుకే నాటకాలకి ఎంత ఎక్కువగా రిహార్సల్స్ వేస్తే అంత మంచిది. చాలామందికి స్టేజి ఎక్కడంలో ఉన్న తహతహ, తీరా రిహార్సల్స్ వచ్చేసరికి ఉండదు. ఏదోలే అని లాగించేస్తారు. ఇలాంటి స్టేజి నటుల్ని అతి సులభంగా చెప్పయచ్చు. ఇవేకాకుండా నటులకి రంగ స్థల వేదిక (స్టేజి) మీద కొన్ని సూత్రాలు తెలియాలి. ఏ నటుడూ వారి వారి వెనుక భాగాల్ని ప్రేక్షకుల వైపుగా చూపిస్తూ వెళ్ళకూడదు. ప్రవేశ, నిష్క్రమణాలు ఖచ్చితంగా తెలియాలి. అంతే కాదు, ఎక్కడ నిలబడాలి (దీన్నీ స్పాట్ ఫిక్సింగ్ లేదా పొజిషన్ అంటారు) అన్నది కూడా తెలియాలి. నటన గురించి రాయాలంటే పెద్ద గ్రంథం రాయచ్చు.

నటీనటులందరూ తమ తమ పాత్రలనర్థం చేసుకొని, సన్నివేశానికి తగ్గ రసాన్ని ప్రదర్శించినపుడే ఆ నాటకం రక్తి కడుతుంది. నటులశక్తికి నిజమైన పరీక్ష, నవరసాల్లోకీ దుఃఖం, హాస్యం చూపించడమే! దుఃఖం చూపించడం చాలా మంది నటులకి సులభంగా వస్తుందేమో కానీ, హాస్యాన్ని పలికించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. హాస్యానికి కావల్సింది టైమింగ్ ! అది కాస్తా లేటయితే నాటకం నవ్వులపాలే! అందుకే చాలా తక్కువ మంది హాస్య నటుల్ని చూస్తాం. ఒక్కోసారి సంభాషణలు హాస్యంగా ఉన్నా, సరైన నటులు లేకపోతే నాటకం ఏడ్చినట్టు ఉంటుంది. ఇంకా నటించేవారికి తోటి నటీనటుల నటనతో సరైన అవగాహన కూడా ఉండి తీరాలి. దాన్నే బాడీ కెమిస్ట్రీ అంటూంటాం. ఒక్కోసారి కొంతమంది నటీ నటులు కలసి నటిస్తే చూడ ముచ్చటగా ఉంటుంది. నటించేవారికి నటన ఎంత సులభమయినా తప్పని సరిగా రిహార్సలు ప్రాక్టీసు ఉండి తీరాలి. ఎందుకంటే ఏ ఒక్కరు సరిగ్గా చేయకపోయినా ఆ నాటకం పాడైపోతుంది. సర్దుకోవడానికి రంగస్థలం మీద అవకాశం ఉండదు. అందుకే నాటకానికి కంటిన్యియుటీ చాలా ముఖ్యం. సినిమా అయితే నటులు ఎన్ని సార్లయినా అక్కడికక్కడ సాధన చేసి మంచిగా నటించవచ్చు. కానీ నాటకంలో మాత్రం అది కుదరని పని. ఇదే నాటకానికీ సినిమాకీ నటనా పరంగా ఉన్న మరో పెద్ద తేడా!

నటులకి నటన అనేది నిరంతరం అభ్యసనంగా ఉన్నప్పుడే మంచి నటులుగా చరిత్రలో నిలబడిపోతారు. ఇప్పటికీ స్థానం నరసింహారావు, షణ్ముఖ ఆంజనేయరాజు, గోవిందరాజు సుబ్బారావు, సి. యస్. రావు, చిత్తూరు నాగయ్య, బళ్ళారి రాఘవ, నాగభూషణం. ధూళిపాళ, మిక్కిలినేని, రేలంగి అంటూ గుర్తుంచుకుంటున్నామంటే ఆ తరంలో వారి నటన ఎంత జనరంజకంగా ఉండేదో ఊహించుకోవచ్చు. పాత్రల బట్టీ, వారి వారి నటనా చాతుర్యం బట్టీ నటులకి పేరు వస్తుంది. కొన్నిసార్లు ఏదైనా పాత్ర చెప్పగానే మదిలో తళుక్కుమని కొంత మంది నటులు మెదులుతారు. ఒక్కోసారి ఆ పాత్రలే నటుల ఇంటిపేరుగా మారిపోతాయి కూడా. “రక్త కన్నీరు” నాగభూషణం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

నటన అనేది వంటకం లాంటిది. ఏ రోజు వంటకం ఆ రోజే రుచిగా ఉంటుంది. నిన్న బాగా నటించినంత మాత్రాన ఈ రోజు అంత బాగానూ నటించాలని లేదు. అందుకే నటన నిరంతరాభ్యాసన ! శ్రద్ధ, క్రమశిక్షణ దానికి మొదటి మెట్లు !

( సశేషం )

రంగస్థల ఆహార్యం ( దుస్తులు, నాటకంలో వాడే వస్తువులు, సంగీతం మొదలైనవి ), సంధాత లేదా నిర్దేశకుడు, నేటి తెలుగు నాటక రంగ పరిస్థితి, నాటకాన్ని బ్రతికించుకుందాం అన్న అంశాలు వచ్చే సంచికలో…


వ్యాస సూచికలు:

[1] సమగ్రాంధ్ర సాహిత్యం – ఆరుద్ర
[2] ఆంధ్ర నాటక రంగ చరిత్ర – మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి
[3] భారత నాటక చరిత్ర – సాహిత్య అకాడమీ
[4] Indian Literature – Sahitya Acadamy
[5] Indian Modern Drama – Sahitya Acadamy
[6] ధర్మవరం రామకృష్ణా చార్యులు – పోనంగి శ్రీ రామ అప్పారావు
[7] అలనాటి నాటకాలు – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ