ఈమాట ప్రచురణలో చిన్న మార్పు

పాఠకులకు నమస్కారం.

ఈమాట సంచికకూ సంచికకూ మధ్య రెండు నెలల నిడివి ఉంది. ఈ మాత్రం నిడివి ఈమాట ప్రమాణాల దృష్ట్యా అన్నివిధాలుగానూ అవసరమనే ఇప్పటిదాకా మేము గమనిస్తున్నది. కానీ, ఇంత నిడివి ధారావాహికలుగా ప్రచురించబడే రచనలకు నప్పదు. అందువల్లనే సీరియల్ నవలలూ కథలూ ఈమాటలో ప్రచురించడానికి మేము ఇష్టపడనిది. ఇదే ఇబ్బంది ధారావాహికంగా వచ్చే సాహిత్య వ్యాసాల విషయంలొ కూడా వర్తిస్తుంది. ఈ సందర్భంలో ఈ మధ్య ఒకరిద్దరు రచయితలు, తమ రచనలు మరింత తరుచుగా ప్రచురించే వీలుంటే బాగుండునని మాతో తమ కోరిక వెలిబుచ్చారు. మాకూ సబబే అనిపించింది. ఈమాట నిర్వహణకు వెచ్చిస్తున్న శ్రమ, సమయాలను బేరీజు వేసుకొని, ఈమాట ప్రచురణ నియమాలలో ఒక చిన్న మార్పు, ఈ సంచిక నుండీ చేస్తున్నాం.

అదేమిటంటే: ధారావాహికలుగా ప్రచురించబడే సాహిత్య వ్యాసాల కొత్త భాగాలను సంచికల మధ్య వ్యవధిలో నెలకొకసారి గానీ, 15రోజుల కొకసారి గానీ ప్రచురించబోతున్నాము. ఈ మధ్యంతర రచనలు అప్పటికి ఆన్‌లైన్‌లో ఉన్న కొత్త సంచికకు జతచేయబడతాయి. ఇందువల్ల రచయిత ఎంత వేగంగా రాయగలిగితే అంత వేగంగానూ ఆ రచనని పాఠకులకి చేర్చడం సాధ్యమౌతుంది. ఇది రచయితలకూ, పాఠకులకూ కూడా నచ్చుతుందనే మేమనుకుంటున్నాం. అయితే ఈ మధ్యంతర ప్రచురణ కేవలం అప్పటికే ప్రారంభమయి, ధారావాహికలుగా వస్తున్న సాహిత్య వ్యాసాలకి మాత్రమే ప్రస్తుతం వర్తిస్తుంది. కథలూ, కవితలూ తదితర రచనలు ఇలా మధ్యంతరంగా ప్రచురించబడవు. ఈమాట సమీక్షా విధానాలలో మాత్రం ఏ మార్పూ ఉండదు.

సంపాదకులు.