ఛందస్సే యయె నీదు కోవెల

పరిచయము

తెలుగులో లక్షణగ్రంథాలను ఎందరో లాక్షణికులు రచించారు. రేచన, అనంతుడు, అప్పకవి, వేంకటరమణకవి ఆ కాలపు వారైతే ఇరవైయవ శతాబ్దములో వేదము వేంకటరాయశాస్త్రి, టేకుమళ్ళ రాజగోపాలరావు, కొక్కొండ వేంకటరత్నం పంతులు, గిడుగు సీతాపతి, గిడుగు రామమూర్తి, రావూరు దొరసామి శర్మ, కోవెల సంపత్కుమారాచార్యులు, కె. హరిసర్వోత్తమరావు, మోడేకుర్తి సత్యనారాయణ, సంగభట్ల నరసయ్య, రవ్వ శ్రీహరి, గాదె ధర్మేశ్వరరావు ముఖ్యులు. గడచిన శతాబ్దపు చివరి భాగములో సంపత్కుమారాచార్యులు నిజముగా అందరికీ ఈ రంగములో మార్గదర్శకులుగా నిలిచారు.


కోవెల సంపత్కుమారాచార్య
(26 జూన్ 1933 – 6 ఆగస్ట్ 2010)

కోవెల సంపత్కుమారాచార్యులు 1933లో వరంగల్లులో జన్మించారు. తండ్రిగారైన రంగాచార్యులవద్ద సంస్కృతాన్ని అభ్యసించారు. బందరులోని ప్రాచ్య కళాశాలలో భాషాప్రవీణు డయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయములో తెలుగులో, హిందీలో ఎం.ఏ. డిగ్రీలు సంపాదించారు. కాకతీయ విశ్వవిద్యాలయపు మొదటి డాక్టరేటు వీరే. బడిపంతులుగా జీవితాన్ని ప్రారంభించి ప్రాధ్యాపకుడుగా విరమించారు. మూడు భాషలలో ప్రావీణ్యత, ప్రాచీన నవకవితలను నిష్పక్షపాతముగా తరచి చూసి అందులోని సుధలను పంచివ్వగల ధీశక్తి వీరి ప్రత్యేకత. వీరు తెలుగు ఛందస్సుకు చేసిన సేవను నాకు తోచినంతవరకు పాఠకులకు తెల్పడమే ఈ వ్యాసపు ప్రధానోద్దేశము.

సంపత్కుమారుల ఛందస్సేవ

ఛందశ్శాస్త్రమును సంపత్కుమార ఎన్నో కోణాలనుండి అధ్యయనము చేశారు.

  1. ఉన్న విషయాలను జాగ్రత్తగా సేకరించి, వాటిని వడబోసి అందులోని సారాన్ని అందరికీ అర్థమయ్యేటట్లుగా తెలుగు ఛందోవికాసము, ఛందఃపదకోశము అనే గ్రంథాలను రాశారు.
  2. మరుగు పడిపోయిన లక్షణగ్రంథాలను, ప్రచురించబడని గ్రంథాలను పరిష్కరించి వాటికి సుదీర్ఘమైన పీఠికలు వ్రాసి వెలుగులోకి తెచ్చారు. అటువంటి గ్రంథాలే – కూచిమంచి తిమ్మన వ్రాసిన (సర్వ)లక్షణసారసంగ్రహము, కూచిమంచి వేంకటరాయని సుకవిమనోరంజనము. వీటిని ప్రత్యేకముగా ఛందోభూమికలు అనే పుస్తకములో కూడ చేర్చారు.
  3. తార్కికముగా ఛందశ్శాస్త్రాన్ని పరిశోధించి అందులోని కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తీసికొని వచ్చారు. తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు అనే పుస్తకము ఈ కోవకి చెందినదే.
  4. కొన్ని విషయాలు ఒక్కొక్కప్పుడు వాదవివాదాలకు దారి తీస్తాయి. ఆ సమయములో ఆవేశము లేకుండా అందులోని మంచి చెడులను శాస్త్రీయముగా చర్చించుట ఒక ముఖ్యమైన విషయము. దీని ఫలితమే చేకూరి రామారావు గారితో రాసిన పుస్తకము వచన పద్యము – లక్షణ చర్చ.
  5. సంపత్కుమారులు పండితుడు, పరిశోధకుడు మాత్రమే కాదు, ఉత్తమ కవి కూడ. వారికి తట్టిన కొన్ని కొత్త ఊహలను తమ పద్యాలలో అమలుపరచారు. శ్రీకృష్ణకర్ణామృతము లోని పద్యాలను పరిశీలించి వాటి పేరులను అమృతఛందస్సు అనే ఒక పట్టికగా తయారు చేశారు.

పైన తెలిపిన అన్ని విషయాలకు సంగ్రహముగా నా వివరణలను ఈ వ్యాసములో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ ఛందో గ్రంథములలోని అధ్యాయాలను, వివరించిన విషయాలను అనుబంధంలో చూడవచ్చును.

తెలుగు ఛందోవికాసము

1960లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు తెలుగు ఛందస్సుపైన పెట్టిన పోటీలో గిడుగు సీతాపతిగారి గ్రంథానికి బహుమతి లభించింది. వారి పుస్తకముతోబాటు ఇంకొక రెండు పుస్తకాలను ముద్రించాలని అకాడెమి తలచి, శ్రీ రావూరి దొరసామి శర్మ, శ్రీ కోవెల సంపత్కుమారాచార్యుల పుస్తకాలు దీనికి అర్హములని భావించింది. దాని ఫలితమే ‘తెలుగు ఛందోవికాసము’. ఇది 1962లో ప్రచురించబడినది. దీనికి శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు ప్రస్తావన రాశారు. ఇది 330 పుటల పుస్తకము. ఇందులో 13 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పుస్తకములోని విశేషమేమంటే శాసనకాలమునుండి నేటివరకు, ఛందస్స్వరూపాలను, వాటి ఉత్పత్తి వికాసాలను కూలంకషముగా ఆచార్యులు చర్చించారు. ఈ పుస్తకములోని కొన్ని ముఖ్య విషయాలను ఇక్కడ పరామర్శిస్తాను.

  1. పింగళ ఛందస్సులోని త్రిక గణాలతోబాటు రత్నమంజూష, జ(జా)నాశ్రయి రచయితలు ప్రతిపాదించిన నవీన గణస్వరూపాలను కూడ వివరించారు. ఇది గణస్వరూపాలకు ఒక ప్రత్యేకత నిచ్చింది.
  2. శాసన పద్యాలలో తెలుగు రీతిలో (యతిప్రాసలతో) వ్రాయబడిన సంస్కృత కందము, చంపకమాలలకు ఉదాహరణలను చూపారు. అంతే కాక ఆ కాలములోనే మాత్రాఛందస్సులైన రగడలవంటి పద్యాల వాడుకను గురించి ప్రస్తావించారు.
  3. ఆదికవియైన నన్నయ ఛందస్సుపైన ఒక నిడివియైన అధ్యాయాన్ని కేటాయించారు. ఇందులో వారు ఉపయోగించిన పద్యాల ఛందస్సు, వాటి సంఖ్య, ఖ్యాత వృత్తాలు, విశేష వృత్తాలు, సీసములాటి పద్యాలలోని వైవిధ్యము, వాటిలోని యతుల అమరిక, మధ్యాక్కరలలో యతి ప్రయోగము, పద్యాలలోని ప్రాసల తీరు – వీటిని గురించి సంగ్రహముగా, సోదాహరణముగా రచించారు.
  4. యతి ప్రాసల అధ్యాయములో వడి అని పిలువబడే అక్షరసామ్య యతి పుట్టు పూర్వోత్తరాలను విశదీకరించారు. ఈ యతుల సంఖ్య కవిజనాశ్రయము, ఛందోదర్పణము, అప్పకవీయము లాటి తెలుగు ఛందోగ్రంథాలలో ఎలా మార్పులు చెందాయో అనే విషయాన్ని విస్తారముగా వివరించారు. ప్రాసభేదాలను కూడ విడమరచి చెప్పారు. చతుర్విధకవిత్వము, శతకము, ఉదాహరణ, జానపద ఛందస్సులను కూడా మరువలేదు.
  5. ఇందులో మూడు అనుబంధాలు ఉన్నాయి – అవి వృత్తసూచిక, బంధనామసూచిక, షట్ప్రత్యయములు. ఇందులోని వృత్తసూచిక నా ఉద్దేశములో ఒక ప్రత్యేకత.
  6. ఆధునిక ఛందస్సుపైన ఒక సుదీర్ఘమైన అధ్యాయమే ఉన్నది. గురజాడవారి ముత్యాలసరాలు, శ్రీశ్రీ ఉపయోగించిన ఛందస్సు, కిన్నెరసాని పాటలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. మాత్రాఛందస్సులైన రగడలు, అర్ధ రగడలు, వాటి భేదాలను పదేపదే నవయుగములో కవులు ఎలా ఉపయోగించారో అన్నది ఇందులోని ముఖ్యాంశము.
    ఇందులో నన్ను ఎక్కువగా ఆకర్షించినది ద్విపదను గురించి వీరు వ్రాసిన అధ్యాయము. ఈ విషయాన్ని తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు అనే పుస్తకములో కూడ వివరించారు. అక్కడ ఈ వివరాలను తెలుపుతాను.

ఛందఃపదకోశము

తెలుగు అకాడెమీ వారు తెలుగు సాహిత్యకోశము, వ్యాకరణకోశము లాటి కొన్ని శాస్త్ర నిఘంటువులను ప్రచురించారు. ఆ కోవకు చెందినదే ఛందఃపదకోశము కూడ. దీని సంగ్రాహకుడు సంపత్కుమార, పరిష్కర్త శ్రీ దువ్వూరి వేంకటరమణ శాస్త్రిగారు. 349 పుటల ఈ గ్రంథము 1977లో ప్రచురించబడినది. ఇందులో ఐదు అధ్యాయాలు ఉన్నాయి. గురులఘువులు, మాత్రలు, గణములు, ఉపగణములు, గద్య, పద్య, వచనముల లక్షణాలను గురించిన విషయాలు – పరిభాషలు అనే మొదటి అధ్యాయములో ఉన్నాయి. యతి, వడి, యతి భేదాలు, ప్రాస భేదాలు ఇవన్నీ యతిప్రాసములు అనే రెండవ అధ్యాయములో వివరించబడినాయి. 136 పుటల సుదీర్ఘమైన మూడవ అధ్యాయము వృత్తాలపైన వ్రాయబడినది. ఒకటినుండి 26 అక్షరాలవరకు ఉండే ఛందముల పేరులు, అందులోని ముఖ్యమైన వృత్తాలు, 26 అక్షరాలకు ఎక్కువగా ఉండే ఉద్ధురమాలా వృత్తాలు, అర్ధసమ వృత్తాలు (మొదటి రెండు పాదాలవలె చివరి రెండు పాదాలు), విషమ వృత్తాలు (పద్యములోని నాలుగు పాదాలకు వేరు వేరు లక్షణాలు), దండకములు మున్నగునవి ఈ అధ్యాయపు ముఖ్యాంశాలు. అన్ని వృత్తాలకు ఉదాహరణములు చూపబడ్డాయి. రామాయణ కల్పవృక్షము నుండి ఎన్నో పద్యాలను విశేష వృత్తాలకు ఉదాహరణాలుగా ఎత్తి చూపించారు. జాత్యుపజాతుల ప్రకరణములో సంస్కృతములోని జాతులయిన ఆర్యాగీతి భేదాలు, మాత్రా వృత్తాలకు నాంది పలికిన వైతాళీయములు, తెలుగులోని ఉత్సాహ, అక్కరలు, రగడలు, తరువోజ, ద్విపద మున్నగునవి, సీసము, గీతులవంటి ఉపజాతులకు లక్షణాలు వివరించారు. చివరి అధ్యాయములో ఛందోగ్రంథాలు, లాక్షణికులు, చిత్రకవిత వంటి విషయాలను తెలిపినారు. ఈ పుస్తకపు మరొక ప్రత్యేకత గ్రంథాంతములోని విపులమైన అకారాది పట్టిక. ఛందస్సులో ఆసక్తి ఉండే ప్రతి విద్యార్థి, పరిశోధకుడు పక్కన పెట్టుకొని చదువవలసిన అత్త్యుత్తమ గ్రంథము ఇది అని చెప్పడములో ఏ మాత్రము అతిశయోక్తి లేదు.

లక్షణసారసంగ్రహము

కూచిమంచి తిమ్మన లక్షణసారసంగ్రహమును, కూచిమంచి వేంకటరాయని సుకవిమనోరంజనమును పరిష్కరించే సమయములో ఆచార్యులవారు మంచి పరిశోధనా గ్రంథాలయాలు గాని, విషయములో ఆసక్తి ఉండే మిత్రులు గాని లేని జగిత్యాలలోని ప్రభుత్వేతర కళాశాలలో పని చేస్తుండేవారు. మంచి పండితునికి, పరిశోధకునికి మనసుంటే ఏదైనా అసాధ్యము కాదని ఈ పుస్తకాల పర్యవేక్షణ, పరిష్కరణ మనకు నిరూపిస్తాయి.

ఈ లక్షణ గ్రంథాల రచయిత లిద్దరూ కూచిమంచి వంశము వారు. తిమ్మన కాలము క్రీ.శ. 1684-1757. ఈ తిమ్మకవిసార్వభౌముని తమ్ముని మనుమని మనుమడే వేంకటరాయడు. లక్షణసారసంగ్రహము క్రీ.శ. 1740లో, సుకవిమనోరంజనము 1872లో ఆ కవులు రాశారు. లక్షణసారసంగ్రహములో మూడు ఆశ్వాసములు ఉన్నాయి. మొదటి ఆశ్వాసములోని భాగములు చతుర్విదాంధ్ర ప్రకరణము, సంజ్ఙా ప్రకరణము, విభక్తి ప్రకరణము, రెండవ ఆశ్వాసములోని భాగములు సమాస, క్రియావిశేష, ప్రాస, యతి, శబ్ద ప్రకరణములు, మూడవ ఆశ్వాసములో రేఫ, శకటరేఫ ప్రకరణములు.


తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు
కోవెల సంపత్కుమారాచార్య
అభినవ ప్రచురణలు 1993.

ఇతనికి ముందున్న పండితలాక్షణికులు తెలుగు భాషను ఐదు విధాలుగా (తత్సమ, తద్భవ, అచ్చ తెనుగు, దేశ్య, గ్రామ్య) విభజించారు. కాని ఇందులో అచ్చ తెనుగు, దేశి నిక్కచ్చిగా విభజించబడక పోవడమువల్ల తిమ్మన వీటిని పర్యాయపదాలుగా తీసికొని తెలుగు భాష నాలుగు విధములు అన్నాడు. తిమ్మన తనకు ముందు వెలువడిన లక్షణగ్రంథాలను కూలంకషముగా పరిశీలించి కొన్నిటిని అంగీకరించి, మరికొన్నిటిని నిరాకరించి, మరికొన్నిటిపై దీర్ఘ వ్యాఖ్యానాలను రాసాడు. ఉదాహరణగా కేతనాదులు మల్లె, లంజె, గద్దె, ఒల్లె లాటి ఎకారాంత పదాలకు బదులు మల్లియ, లంజియ, గద్దియ, ఒల్లియ లాటి పదాలను వాడాలని చెప్పినా, తిమ్మన వాటిని అంగీకరించాడు. అప్పకవీయమును తప్పు పట్టిన చోటులు కూడ ఈ గ్రంథములో ఉన్నాయి. నన్నయగారి ప్రసిద్ధమైన లయగ్రాహిలో (కమ్మని లతాంతములకుమ్మొనసి …) లతాతములకున్మొనసి సంధిని లతాంతములకుంమొనసిగా ఎలా మారగలదో అనే విషయానికి సూత్రాన్ని కల్పించాడు తిమ్మకవి. ఈ పద్యములోని ప్రాసయతిని సంపత్కుమార విపులముగా ఈ పీఠికలో చర్చించి, అదే విధముగా ద్విత్వ మ-కారమునకు (మ్మ) సంధి పూర్వకముగా వచ్చే బిందుపూర్వ బ-కారమునకు ఉండే ప్రాసను గురించి కూడా ఉదాహరణలతో విశదీకరించారు. ఈ పుస్తకములోని యతిప్రాసల ప్రకరణాలపైన కూడా కొన్ని విశేషాలను తెలిపారు (ఉదా. ర-లకు ప్రాస, స్నాన పదాన్ని స్త్నానముగా శ్రీనాథుడు వాడడము). రేఫ-శకటరేఫ సాంకర్యాన్ని, అరసున్న, నెరసున్నల ప్రయోగాలు, వాటికి ఉదాహరణలు కూడ ఉన్నాయి. ఈ పీఠిక అంతములో ఆచార్యులు రాసిన ఈ వాక్యాలు సర్వామోదమయినవి.

“భాష విశాలమైనది, నిత్య ప్రవాహిని. పలు విషయములలో లాక్షణికుల దృష్టి భిన్నభిన్నమయి ఆయా కాలముల ననుసరించి ఆయా లక్షణకర్తల అభిప్రాయములను సమన్వయము చేసుకొనవలసియుండును. వేరువేరు కాలములలో వేరువేరు ప్రాంతములందలి లాక్షణికుల గ్రంథములు – కనీస మీనాటికి లభ్యమగుచున్నంతవరకైన పరిష్కృతములై వెలువడినచో – తెలుగుభాషాచ్ఛందో లేఖన సంప్రదాయములు, మరి వాటి బహుముఖీనత, విశాల ప్రయోగ వైలక్షణ్యము, క్రమపరిణతి మొదలగు పలు విషయములు స్పష్టమగుటకు వీలు కలుగును.”

సుకవిమనోరంజనము

సుకవిమనోరంజనము ఒక ప్రత్యేకమైన లక్షణ గ్రంథమని – “లక్షణ గ్రంథ రచనారీతిలో ప్రాచీన పద్ధతికి భరతవాక్యముగా, ఆధునిక పద్ధతికి నాందీ వచనముగా గత శతాబ్దపు (19వ శతాబ్దపు) తృతీయ పాదాంతమున తెలుగు లక్షణగ్రంథ రంగమున కవతరించిన దిది” – సంపత్కుమార పేర్కొన్నారు. వీరు పరిష్కరించి అకాడెమీవారు ముద్రించేవరకు ఇది వ్రాతప్రతిగా మాత్రమే ఉండినది. ఐనా కూడా దీనిని చాలమంది చదివి ఉదహరించారు. ప్రాచీన ధోరణిలో లక్షణములను చెప్పి, ఆధునిక రీతిలో విమర్శించడము ఇందులోని ప్రత్యేకత. (అందుకే కూచిమంచి వేంకటరాయడికి లాక్షణిక చక్రవర్తి అనే బిరుదు ఉన్నది. ఈ కవి తల్లి వంకాయలపాటి వేంకటనారాయణుని పుత్రిక సుబ్బమ్మ, తండ్రి తిమ్మన. ఇతని గురువులు దేవులపల్లి సీతారామశాస్త్రి, బుచ్చయ్యశాస్త్రి సహోదరులు. ఈ బుచ్చయ్య శాస్త్రికి కుమారుడైన సుబ్బరాయ శాస్త్రి తమ్ముడు వేంకటశాస్త్రి కుమారులే మనకు సుపరిచితులైన దేవులపల్లి కృష్ణ శాస్త్రి.) సుకవిమనోరంజనములో వందలాది తెలుగు, సంస్కృత కావ్యాలనుండి లక్షణ లక్ష్యాలు ఉదహరించబడినవి. ఇందులో ఐదు ఆశ్వాసములు ఉన్నాయి. వీటిలో యతి ప్రాస భేదాలు, గుండు ర బండి ఱ నియమాలు, వ్యాకరణ దోషాలు మున్నగు విషయాలు చర్చించబాడ్డాయి. పోలిక యతికి (ప్రథమా విభక్తి ము-కారముతో అంతమయ్యె పదానికి పు, ఫు, బు, భు లకు యతి) చక్కటి యతికి (విభక్తీతర ము-కారమునకు పు, ఫు, బు, భు లకు యతి) గల భేదాన్ని పీఠికలో చక్కగా సంపత్కుమార వివరించారు. వేంకటరాయడు పూర్వ లాక్షణికులను సహృదయతో విమర్శించిన పద్ధతి చాల ఉదాత్తమైనదని ఆయన భావించారు.

తెలుగు ఛందస్సుపై వెలుగులు

ఆచార్యులవారు తమ కొన్ని పరిశోధనల సారాంశమును తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు అనే పుస్తకములో ప్రచురించారు. అందులోని కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ సంగ్రహముగా తెలుపుతాను:

  1. పదము, పాట, గేయము, పద్యము అనే మాటలకు ఉండే అర్థాన్ని విపులీకరించారు. ఊత పదాలతో (వెన్నెలా, తుమ్మెదా వంటివి) ఉండేవి పదాలు, జాగాలతో ఉండేవి పాటలు, ఊత పదాలు, జాగాలు లేక పాడుకోడానికి అనువుగా ఉండేవి గేయాలు, గణబద్ధమైనవి పద్యాలు అని వీటిలోని తేడాలను వివరించారు. ఒకప్పుడు ఛందస్సుకు సంగీతానికి అవినాభావ సంబంధము ఉన్నా తరువాత ఛందస్సు దానిని కోల్పోయి స్వతంత్రముగా నిలబడిందని అన్నారు. వైదిక కాలములో ఛందస్సు అక్షర సంఖ్యపైన ఆధారపడి ఉండగా, తరువాత లౌకిక ఛందస్సులో అది వర్ణాలపైన, హ్రస్వ దీర్ఘాలపైన, గురులఘువులపైన, వాటితో నిర్మించబడిన గణాలపైన ఆధారపడినది. దేశి ఛందస్సులన్నీ మాత్రా ఛందస్సులే. ఇది రగడలలో స్పష్టముగా కనబడుతుంది. ఇక్కడ నన్ను ఆకర్షించిన ఒక విషయము ఏమంటే, తొలి నాళ్ళలో ద్విపదలాటి దేశి ఛందస్సులో మిశ్రగణాలు – అంటే నాలుగు మాత్రల గణాలు, ఐదు మాత్రల గణాలు లేవని, అవి పూర్తిగా (చివరి త్రిమాత్రను తప్పిస్తే) చతుర్మాత్రలతోనో లేకపోతే పంచమాత్రలతోనో మాత్రమే ఉండేదని అనడం. ఇప్పుడు ఉండే కలగాపులగము తరువాత వచ్చిన మార్పు అని అన్నారు. సూర్యేంద్రచంద్రగణాల వ్యవస్థ ఒక విధముగా అప్పుడు ఉండే దేశి ఛందస్సును ఒక చట్రములో పెట్టడమే అన్నారు.
  2. ఇప్పుడు మనము చదివే లక్షణ గ్రంథాలలో అక్కరలు, ద్విపదలు, షట్పదులు, సీసము, తరువోజ, గీతులు సూర్యేంద్ర గణ యుక్తములని చదువుతాము. కాని ఆచార్యులవారు కవిజనాశ్రయ, కావ్యాలంకారచూడామణి కర్తలు అక్కర, ద్విపద, షట్పదులను వేరుగాను, సీస, తరువోజ, గీతులను వేరుగాను భావించారని చెప్పారు. అక్కరాదుల గణములకు మాత్రమే సూర్యేంద్రచంద్ర నామములు. అక్కరాదులలోని గణములలో కొన్నిటిని తొలగించి నల నామ గణములను సీసములకు, గీతులకు వాడారన్నారు. అనంతుని కాలములో వీటికి కూడా సూర్యేంద్రగణములని పేరు పెట్టారని అన్నారు.
  3. నాగవర్మ ఛందోంబుధిలో సీసపద్యమునకు లక్షణము చెప్పేటప్పుడు పురుహూత గణము అంటే ఇంద్రగణమని వ్రాసినాడు, కాని కన్నడములో ఇంద్రగణాలు లేవు, అవి విష్ణు గణాలు. కాబట్టి ఈ పద్యము బహుశా అందులో ప్రక్షిప్తమైనదేమో అని ఆచార్యులు సంశయాన్ని వెలిబుచ్చారు. కన్నడ తెలుగు ఛందస్సులకు మధ్య ఉండే సామ్యాన్ని, వ్యత్యాసాన్ని కొన్ని ఉదాహరణలతో చర్చించారు. కన్నడములో సీసము పంచమాత్రాబద్ధము, తెలుగులో మిశ్రము; కాని సర్వలఘువు సీసము మాత్రము పంచమాత్రాబద్ధము (న-ల-ల ఇంద్ర గణము కాదు)! తెలుగులో ఛందఃపరిశీలన, ఛందోబోధనలపైన కూడా రెండు అధ్యాయాలున్నాయి ఈ చిన్న పుస్తకములో.

వచనపద్యం

ఇరవైయవ శతాబ్దములో తెలుగులో ఆవిర్భవించిన ఒక నూతన కవితాస్వరూపము వచనకవిత. దీనికి ఎన్నో పేరులను పెట్టారు. మొదట పఠాబి, తరువాత సంపత్కుమార ఇలాటి కవితలను వచన పద్యములు అన్నారు. ఇక పద్య మన్నప్పుడు, వాటికి గణాలు ఉండాలిగా? చంపకమాలలాటి వృత్తాలను మ-భ-జ-స-న-య-ర-త లాటి గణాలతో, గురులఘువులతో, యతి ప్రాసలతో నిర్మించవచ్చు. కందము, రగడలాటి పద్యాలను మాత్రాగణాలతో, సీసాదులను సూర్యేంద్ర గణాలతో మనము విశదీకరించవచ్చు. కాని ఈ వచనపద్యములో ఉండే గణాలు ఎలాటివి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఈ సందర్భములో ఆచార్యులవారు వచనపద్యములో ఉండే గణాలు భావగణాలు లేక భావాంశ గణాలు అని ప్రతిపాదించారు. చేకూరి రామారావు గారు ఈ భావగణ వ్యవస్థను నిరాకరించి వచన పద్యం పద్యము కాదు, గద్యమే అని తమ అభిప్రాయాన్ని తెలిపారు. చేరా, సంపత్కుమారల మధ్య ఈ విషయంలో జరిగిన వాదోపవాదాలు చదవడానికి ఎంతో బాగుంటాయి. వచన పద్యం పద్యమా, గద్యమా అన్నది కాదు ఇక్కడ ముఖ్య విషయము. వారి ఆలోచనాహర్మ్యాలను సైద్ధాంతిక రీత్యా ఎలా దృఢముగా నిర్మించారో అన్నది మనలను ఆకర్షిస్తుంది.

పద్యరచన

సంపత్కుమారాచార్యులు పండితుడు, పరిశోధకుడు మాత్రమే కాదు, కవి కూడ. నా ఉద్దేశములో ఈ కవి హృదయమే వారిని చివరివరకు యువ భావాలతో, నూతనపథాన్వేషకుడుగా ఉంచింది. వారి కవితకు కొన్ని ఉదాహరణలు –

1. సాంప్రదాయిక ఛందస్సులో అందమైన భావాలను ప్రదర్శించడములో వారిది అందె వేసిన చేయి. యశోద అనే ఖండికలోని మొదటి పద్యము మాతృహృదయాన్ని ఎంత చక్కగా చిత్రిస్తుందో చదివి ఆనందించండి –

ఈ చలిగాలిలో బయట కేగకురా పసితండ్రి! ఇంత ఈ
కాచిన ఆవుపాలను చకాచక త్రాగి మనింటిలోనె నీ
తోచిన ఆటలాడు మరి దుందుడుకుందనమిన్ని నాళ్ళుగా
సైచితిగాని, చూడుమిక సైచను సుంతయు నింక మీదటన్

2. వీరు వ్రాసిన కాలస్పృహ ఒక విధముగా ఋతుసంహారములాటిది. తేటగీతులను ఇలా కూడ వ్రాయవచ్చును అని క్రింది పద్యాలను చదివిన తరువాతనే నాకు అర్థమయింది. ఇది కచ్చితముగా ఒక నవీన పద్యశిల్పమే –

ఓసి తీవియ ముద్దరాల! సవురుల
నొలుకదేమిటి, క్రొత్తపూవులను విరిసి;
ఆ వసంతుడు విచ్చేయునట్టి వార్త
నీవరకు నప్పుడే వచ్చెనే!
– ఇదేమి
ఏమి? మోదుగు తానింత ఈడుపోయి
గూడ సింగారములు చేసికొనుచుండె
ఎండిపోయిన గుండెలో నింతవేడి
రక్తములు చిమ్మునేమొ ఈ ప్రభువు మధువు

ఇందులో మొదటి పద్యములో చివర ఇదేమి పదము తనంతట తానే ఒక పంక్తిని ఆక్రమించుకొని రెండవ పద్యముతో పాలు పంచుకొంటుంది!

అదే ఖండికలో మరో రెండు పద్యాలు –

శిశిర దౌర్జన్యరాజ్య విశిర్ణా పూర్వ
వైభవమ్ములు గల్గు పూవనితలార!
ఇంక మీరే స్వరాజ్యము నేలికొనుడు
ఇచ్చవచ్చిన రీతి పాలించుకొనుడు
– ఇంత మధుర
మైన మధుమాస యామినియందు ప్రేయ
సీ దరస్మితాధర సుధా సాధితమ్ము
శుష్కపూర్వమ్ము నాత్మ విశుద్ధజీవి
తమ్ము పూవులబాటలో వరలు నేడు

పై పద్యాలలో రెండవ పద్యము సంధిగత ‘మైన’ తో ప్రారంభమవుతుంది. రెండు పద్యాలమధ్య ఇంత మధుర అనే అన్వయ పదాలు ఉన్నాయి.

3. మాత్రాఛందస్సులో వీరు ఆరితేరిన దిట్ట అని తొలి యౌవనములో రచించిన అపర్ణ నిరూపిస్తుంది. అపర్ణ ఖండకావ్యమునుండి ఒక రెండు పద్యాలు –

కించిదుష్ణ గోక్షీరము
లించించుక నెట్లొ త్రావి
లేచుచున్న ఆ వ్యక్తిని
చూచుచున్న ఆచార్యుడు
కూరుచొనగ నియమించెను
తీరుబాటు కలిగించెను
(పాదానికి రెండు ఆరు మాత్రలు)

ఆమె ఆర్తవ సుమము పోలిక
ఆమె వర్షా వనిత పోలిక
ఆమె శంపాహేల పోలిక
ఆమె ప్రాకృతి కాంశ పోలిక
ఆ కుటీరము చేరె నావిడ
(మూడు, నాలుగు మాత్రలతో మిశ్రగతి)

4. ఆచార్యులవారు కందపద్యాలను మలచడములో నేర్పరి అని చేరాశతమానం చదివితే స్ఫురిస్తుంది-

ఎందాక పద్యముండునొ
అందాకను శతక ముండు నంటివి కాదా
ఎందాక కవిత ఉండునొ
అందాకను పద్యముండునందును చేరా!

(వచన కవిత కవిత ఐతే అది పద్యమే అనే సున్నితమైన వ్యంగ్యము ఉన్నది ఇందులో)

రారా, కారా, బూరా,
సీరా, బేరా, తిరా, వసీరా, నారా,
కోరా, తారా, కేరా –
ఈ రాంతులతోటి వేగుటెట్లా చేరా!

(ఇందులోని రాంతులు ఎవరో గుర్తుపట్టగలరా మీరు?)

చిన్నన్న ద్విపద కెరుగును
పెద్దన్న ఎరుంగు పద్యవిద్యకు చేరా
తిక్కన్న రస మెరుంగును
చెల్లిన ఇచ్చోటి ప్రాస శ్రీశ్రీ ఎరుగున్

(ఇది శ్రీశ్రీ పైన పేరడీ)

5. వీరు వచన కవితలను కూడ చక్కగా వ్రాయగలరు. వీరు గోదా వచస్సుధ అని ఆండాళ్ తిరుప్పావై తెలుగులోకి అనువదించారు. అందులోనుండి ఒక వచనపద్యాన్ని ‘భావగణ’యుక్తముగా ఇక్కడ మీకు సమర్పిస్తున్నాను –

‘ఓ యమ్మ చిన్నారి చిలుకా! ఇంకా నిద్రపోతూనే ఉన్నావా?’
‘ఎందుకమ్మా! అంత చిరచిరలాడుతూ పిలుస్తారు! వస్తూనే ఉన్నాను గదా!’
‘నీ మాటకారితనం తెలుసులేవే’
‘అవునులెండమ్మా! మీ మాటెందుకు కాదనటం! నేను మాటకారినేలెండి!’
‘నీవింకేదో పనిలో ఉన్నట్టున్నావూ’
‘అది సరేగాని, అందరూ వచ్చినట్టేనా?’
‘అనుమానమెందుకు? వచ్చి లెక్కపెట్టి చూసుకో. కువలయాపీడమన్న ఏన్గును చంపినవాడు, శత్రుసంహారకుడయినవాని,
ఆశ్చర్యగుణాల, చేష్టల వాని గురించి
నోరారా పాటలు పాడుకొందాము.
ఇకనయినా మాటలు చాలించి తొందరగా రా!’

ముగింపు

తాను వ్రాసిన ముత్యాలసరాల ముచ్చట్లను ఆప్యాయముగా కోవెల సంపత్కుమారులకు అంకితము చేస్తూ చేకూరి రామారావుగారు ఇలా అంటారు –

“అతడు ఛందోమార్గ పథికుడు
అతుల ప్రతిభాసంపదధికుడు
ప్రౌఢకవితారచనశీలుడు
పరమ సౌహృదుడు”

వీరిని గురించి వీరి పరమ మిత్రులు చెప్పినదానికన్న నేనేమి చెప్పగలను?

ఛందోనందనమందుఁ బూచితివిగా సద్గంధపుష్పమ్ముగా
ఛందాకాశమునందుఁ దోచితివిగా సత్కాంతినక్షత్రమై
ఛందోవారిధియందు దాగితివిగా సద్రత్నసందోహమై
ఛందస్సే యయె నీదు కోవెలగ నో సంపత్కుమారా సుధీ


గ్రంథసూచి

  1. తెలుగు ఛందోవికాసము – కోవెల సంపత్కుమారాచార్య – కులపతి సమితి, వరంగల్, 1962.
  2. లక్షణసారసంగ్రహము – పరిష్కరణము, పీఠిక – కోవెల సంపత్కుమారాచార్య, రచయిత – కూచిమంచి తిమ్మన – తెలుగు అకాడమీ, హైదరాబాదు, 1971.
  3. సుకవిమనోరంజనము – పరిష్కరణము, పీఠిక – కోవెల సంపత్కుమారాచార్య, రచయిత – కూచిమంచి వేంకటరాయడు – ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1976.
  4. ఛందఃపదకోశము – సంగ్రాహకుడు – కోవెల సంపత్కుమారాచార్య, పరిష్కర్త – దువ్వూరి వేంకటరమణశాస్త్రి – తెలుగు అకాడమీ, హైదరాబాదు, 1977.
  5. వచన పద్యం – లక్షణ చర్చ – చేకూరి రామారావు, కోవెల సంపత్కుమారాచార్య – నాగార్జున ప్రింటర్స్, హైదరాబాదు, 1978.
  6. సాహితీ సంపద – సం. కోవెల సుప్రసన్నాచార్య, షష్టిపూర్తి అభినందన సమితి, వరంగల్లు, 1993.
  7. తెలుగు ఛందస్సుపై కొన్ని వెలుగులు – కోవెల సంపత్కుమారాచార్య, అభినవ ప్రచురణలు, వరంగల్లు, 1993.
  8. ఛందోభూమికలు – కోవెల సంపత్కుమారాచార్య – అభినవ ప్రచురణలు, హైదరాబాదు, 2003.
  9. చింతయంతి – కోవెల సంపత్కుమారాచార్య, అభినవ ప్రచురణలు, హైదరాబాదు, 2003.
  10. అపర్ణ – కోవెల సంపత్కుమారాచార్య, అభినవ ప్రచురణలు, హైదరాబాదు, 2004.
  11. చేరాకు ఒక శతమానం – కోవెల సంపత్కుమారాచార్య, అభినవ ప్రచురణలు, హైదరాబాదు, 2003.
జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...