Tree, My Guru కు CP బ్రౌన్ పండిత పురస్కారం

తెలుగునాట ప్రతి రెండవవాడు కవే. వారికే నీరాజనాలు, సభా మర్యాదలు, నానా భుజకీర్తులు. పండితుల గొడవ ఎవరికీ పట్టినట్టు లేదు. అరుదైన పులిజాతి నశించిపోయే ప్రమాదంలో పడింది.’ఇవన్నీ కుక్కలే’- అని తర్వాత వాపోయి ప్రయోజనం లేదు. పండితజాతి అంతరించి, నిర్దుష్టంగా ఒక్కవాక్యం రాయలేని దశకు చేరుకోక ముందే మనం మేలుకొనక తప్పదు. ధర్మారావు గారు చమత్కరించినట్టు వచనం రాయలేని వాడే వచన కవి; ఎందరో పేరు పొందిన కవుల వచనం చూశాక ఇంకో అభిప్రాయం ఏర్పడటానికి వీలు లేదాయ. కావున, మన తక్షణ కర్తవ్యం కండగల వచనం రాయడమే కాకుండా వచనానికి అవసరమైన ఆకరాలు సమకూర్చే వారిని గుర్తించి గౌరవించడం, తద్ద్వారా, ‘నిలుపరా నీజాతి నిండు గౌరవం’ అన్న కవివాక్యాన్ని ఆచరణలో పెట్టినవారవుతున్నాము. పుట్టపర్తి వారు -నా కవిత్వం నీ తలకెక్కకపోతే దాని సిగదరిగిరి, నేను పండితుణ్ణి కాదు అంటే ఆత్మ క్షోభిస్తుంది అనేవారు. గిడుగు గురజాడల శిఖరాయమైన పాండిత్యం ముందు శిరసొగ్గుతాము. అక్కిరాజు, రాళ్ళపల్లి వారి అనల్ప విద్యావైభవాన్ని తలచుకొని వినమ్రులమవుతాము. మరి పండితులకు ఏ పాటి గుర్తింపు లభిస్తోంది – కృతజ్ఞతాహీనమైన మన ఆంధ్రజాతిలో? అందుకే,శతాబ్దకాలంగా చరిత్ర,పురాతత్వ పరిశోధనల్లో అఘోరిస్తున్నాము.మన పొరుగు తమిళులు తారాజువ్వ వేగంతో నానా గుహల్లో లిపుల గూర్చి దేశవిదేశాల పత్రికల్లో సమగ్ర పరిశోధనా వ్యాసాలు వెలయిస్తుంటే.

చీకటిని తిడుతూ కూర్చోక ,ఈ ఏడాది నుండి అనువాదం, పరిశోధనా, నిఘంటు నిర్మాణాల్లో కృషి చేసిన పండితులకు ఉడతాభక్తిగా ఒక పురస్కారం ప్రకటించాలన్న సంకల్పం. ఇందులో భాగంగా, కేశవరావు గారి అనువాద గ్రంథం Tree,My Guru కు CP బ్రౌన్ పండిత పురస్కారం. కవితో దీర్ఘ సాహచర్యం నెరిపి, మూలంలో సున్నితమైన తెలుగును ఆంగ్ల వర్ణమాలగా మార్చి వేశారు అనువాద ఐంద్రజాలికులైన కేశవవరావు గారు. ఇస్మాయిల్ గారు అనువాదకుల ప్రసక్తి వచ్చినప్పుడు తరచు వీరినే ఎంపిక చేస్తూవుండటం ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారందరికీ తెలిసిన విషయమే. కావున C.P.బ్రౌన్ పండిత పురస్కారాన్ని సర్వజిత్ నామ సంవత్సరానికి గాను, ఆయన కార్య రంగమైన కడపలో, ఆయన పుట్టినరోజు-నవంబర్ పదినాడు జరిగే సభలో బహూకరించాము. బ్రౌన్ స్ఫూర్తి బ్రౌన్ జీవితం తెలుగు పునరుజ్జీవానికి తోడ్పడిన తీరును తనదైన శైలిలో వివరించిన పండితుడు Schmitthenner. బ్రౌన్ సమాధి అనామకంగా లండన్ శ్మశాన వాటికలో ఎలా పడివున్నదో తెలుసుకొని కన్నీరు కార్చని వాడు పదహారణాల ఆంధ్రుడే కాదు. అక్కడే ఆగిపోకుండా, బ్రౌన్ స్ఫూర్తిని తెలుగునాట సజీవంగా నిలిపిన పండితోత్తముడు జానుమద్ది హనుమచ్ఛాస్త్రి గారిని పదేపదే తలచుకొంటూ, తెలుగు సారస్వతానికి అనువాదం పరిశోధన నిఘంటునిర్మాణంలో ఎనలేని సేవలు చేసిన బ్రౌన్ కృషి స్మృతిపటలంలో చెదరనీకుండా ప్రతి ఏడాది ఒక పండితునికి పదివేలా నూటాపదహార్లతో సత్కరించాలన్న నిండు సంకల్పం ఈ నాటికి తీరనున్నది. D. కేశవరావు గారు అనువాదం చేసిన ఇస్మాయిల్ కవిత్వం Tree,My Guru అన్న గ్రంథానికి ఈ ఏడాది బ్రౌను అవార్డును ప్రకటిస్తున్నాము.


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...