“అబ్బా! ఇక్కడెవరూ లేరు. అయినా ఇక్కడికెవరొస్తార్లే!”
“చాల్లే! ఏకాంతం ఏకాంతం అని చెప్పి ఇంతపైకి ఎక్కించావ్!”
“ఎక్కించానే అనుకో, దొరికిందిగా ఏకాంతం?” – నవ్వు.
“ఏమో బాబూ! భయమేస్తోంది నాకసలు.”
“భయమెందుకు? ఇక్కడెవరూ చూడర్లే!”
మొదటి వాక్యం వినేసరికే ఉలిక్కిపడ్డాడు వాసు. ‘అబ్బ, ఇక్కడికెవరొస్తార్లే!’ అనుకుని తానొచ్చి అక్కడ కూర్చున్న విషయం గుర్తొచ్చింది. అయినా, ఊరుకున్నాడు. కానీ, ఈ సంభాషణ వినంగానే అక్కడ తానో, వారో ఎవరో ఒకరే ఉంటే శ్రేయస్కరమని అర్థమైంది.
‘బట్ ఐ డోన్ట్ వాంట్ టు లీవ్ బికాజ్ ఐ డోన్ట్ వాంట్ టు లివ్’ మనసులోనే స్థిరంగా అనుకున్నాడు. ‘ఇప్పుడెలా పంపేయాలి వీళ్ళని?’
ఇంతలో అతని ఫోనులోంచి పాట – ‘తూహీ బతా జిందగీ… జో భీ హువా.. క్యో హువా..’ – జేబులోంచి ఫోన్ తీసాడు. అలారం. ‘ఈపనికి కూడా అలారం పెట్టుకునేది నేనొక్కడినేనేమో!’ నవ్వుకున్నాడు. అలారం ఆపేస్తూ ఉండగా వెనుక పొదల వద్ద చప్పుడు. తిరిగి చూస్తే, ఇందాకటి గొంతుకల శరీరాలు, వెనుదిరిగి పోతూ. గట్టిగా నవ్వాలనిపించింది వాసుకి.
మళ్ళీ తానొక్కడే! మెల్లగా తల ఎత్తి ఆకాశాన్ని చూశాడు. కొంచెం ముందుకు వంగి లోయ లోతును కళ్ళతో కొలిచాడు. ’బాగానే లోతుంది. ఉన్న పళంగా, కూర్చున్న పళంగా ఏదన్నా పెద్ద గాలి వచ్చి నన్ను తోసేస్తే బాగుండు’ అనుకున్నాడు.
‘అబ్బబ్బ! దూకేయాలి’ అనుకుని కళ్ళు మూసుకున్నాడు.
ఇల్లు, కాలేజీ, స్టూడెంట్లూ, స్నేహితులూ, ప్రపంచమూ – కళ్ళముందు కదలాడితే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఇంకా తాత్సారం చేస్తే, వెనక్కెళ్ళిపోతానేమో అని భయమేసింది అతనికి. రెండడుగులు ముందుకేస్తే చాలు. స్లోప్ ఉంది కనుక మరో రెండడుగులు ఎలాగో అవే పడతాయి. అంతే, పనైపోతుంది.
ఇంతలో వెనుక ఎవరో ఏడుస్తున్న చప్పుడు. మనిషి వస్తున్న అలికిడి. ‘మళ్ళా ఎవరొచ్చారో!’
రెండు క్షణాల్లోనే అక్కడికో యువకుడొచ్చాడు. పాపం, మనిషిని చూస్తేనే పీకల్లోతు కష్టాల్లో ఉన్నట్లు అనిపిస్తోంది. వయసు ముప్పైలోపే. పైగా ఏడుపొకటి!
‘సిగ్గుండాలి ఈ వయసొచ్చాక ఏడవడానికి’ విసుక్కున్నాడు వాసు. అతనికి ఏడ్చేవాళ్ళంటే గిట్టదు.
ఆ మనిషి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఎక్కిళ్ళ మధ్య ఏదో గొణుక్కుంటూ, వాసు కూర్చున్న చోటుకి వచ్చాడు. అయితే, తన ధోరణిలో తనుండి, తాను నిలబడ్డ చోట ఉన్న చెట్టుకు ఆవలివైపు ఓ మనిషి కూర్చుని తనని గమనిస్తున్నాడన్న విషయం అతను గమనించలేదు. అతను వచ్చి కిందకు తొంగి చూసి ‘అమ్మో!’ అనుకున్నాడు పైకే. భయం వల్ల కాబోలు అతనికి నెమ్మదిగా చెమట్లు పట్టడం వాసు గమనించాడు. అటూ ఇటూ చూడ్డం, ఆపై చేతులు జోడించి ఆకాశం వైపు చూడ్డం, ఏడుస్తూ ముక్కు ఎగబీల్చడం – ఇదంతా చూస్తూంటే వాసుకి చిరాకెక్కువైంది.
‘ఏం బాబూ, భయమేస్తోందా?’ అంటూ లేచి అతన్ని సమీపించాడు. దెబ్బకి కలిగిన ఉలికిపాటుకి అతను కొండ అంచుపై పట్టు తప్పి కిందపడబోయి భయంతో అరవడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు వినలేక వాసు అతని చేయి పట్టుకున్నాడు. దానితో అతను కోలుకుని, మళ్ళీ నిలబడి – “థాంక్సండీ, ప్రాణం నిలబెట్టారు” అన్నాడు. వాసు పెద్దగా నవ్వాడు. అప్పటిగ్గానీ అర్థం కాలేదతనికి తానన్న మాట ఎంత అసంబద్ధంగా ఉందో. అతను కూడా ఇబ్బందిగా నవ్వాడు.
“పోనీ, ఇద్దరం ఇక్కడ మల్లయుద్ధం లాంటిది మొదలుపెడదాం. అప్పుడు తేలిగ్గా అవతలివైపుకి పడతాం” – లోయలోకి చూస్తూ అన్నాడు వాసు.
“ఏమిటి? ఏమిటన్నారు? అసలు మీరు – మీరెవరు?” వాసు వాలకం చూసి అనుమానంగా అడిగాడా అబ్బాయి.
“ఎవర్నైతే ఏంటి? నీలాగే – ఆపని మీదే వచ్చాను.”
“అదేమిటి… మిమ్మల్ని చూస్తే అలా లేరే!”
“ఎలా?”
“మీరు చూస్తే హాయిగా నవ్వుతున్నారు!”
“నవ్వకూడదా?”
“ఏడుపు రాదా?”
“ఎందుకూ?”
“ఎవరండీ మీరు? వింత మనుషుల్లా ఉన్నారు! నాకు బ్రతుకులో సుఖం లేదు. అన్నీ కష్టాలే. ఇవన్నీ దాటి ముందుకు పోలేనేమో అనిపిస్తోంది. మనుష్యులంటే అసహ్యం, బ్రతుకంటే విరక్తీ కలుతున్నాయ్! చావొక్కటే పరిష్కారమేమో ఇక..” అతనింకా చెప్పేవాడే కానీ వాసు ఆపాడు.
“చూస్తే చిన్నవాడిలా ఉన్నావ్? పరీక్ష పాసవలేదా? ప్రేమ వైఫల్యమా?” – అడగ్గానే అతనికి జీవితం గుర్తొచ్చినట్లుంది. కళ్ళలోంచి నీరు కారడం మొదలైంది.
“సరే, చెప్పకులే. ఏడుపాపు. నాకు ఏడ్చేవాళ్ళంటే అసహ్యం” విసుగ్గా అన్నాడు వాసు. ఆ మాటలకి అతనికి కోపమొచ్చిందిలా ఉంది.
“అయినా మీకెందుకు నా ఏడుపు? మీరెందుకిక్కడికొచ్చినట్టు? అసలు చూస్తే బానే ఉన్నారు, మీకసలు ఆత్మహత్య చేసుకునేన్ని సమస్యలు ఉన్నాయంటారా? మిమ్మల్ని చూస్తే అలా లేరు. అంత అవసరం ఏమొచ్చింది?”
వాసు సన్నగా నవ్వి, నిట్టూర్పు విడిచాడు.
“బ్రతకాలన్న కోర్కె లేనప్పుడు చావు తప్ప మార్గమేముంటుంది?”
“నాకు బ్రతకాలనే ఉంది కానీ, ఇలా కాదు. సుఖంగా, సంతోషంగా.”
“అయితే, మరి వెళ్ళు. వెళ్ళి బ్రతికి, సుఖమయం చేస్కో జీవితాన్ని.”
“అది చేస్కోలేకే కద!”
“నీమీద ఆధారపడ్డ వాళ్ళు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఉన్నారా?”
“ఉన్నారు.”
“మరి వాళ్ళ గతేమిటో ఆలోచించావా?”
“నేనున్నాకూడా వాళ్ళ గతి అంతేగద్సార్! ఇంకా చెప్పాలంటే, నేను పోతేనే వాళ్ళకి నయమేమో. ఆర్థికంగా అన్నా కాస్త వెసలుబాటు ఉంటుంది.”
“కానీ, నువ్వుండవుగా. వాళ్ళు నిన్ను కోల్పోయి ఎంత బాధపడతారో ఆలోచించావా?” – కొంచెం తీవ్రంగానే అన్నాడు వాసు.
“కొన్నాళ్ళే. ఆ తరువాత ఎవరి జీవితాలు వాళ్ళవి. నిజం చెబుతున్నాన్సార్! ఎవరైనా, ఎప్పుడైనా, మర్చిపోదగ్గ మనుషులమే అని నా నమ్మకం” – అతను కూడా అంతే తీవ్రంగా అన్నాడు.
“సరే, అలాగే అనుకుందాం. ఆ కొన్నాళ్ళైనా ఎందుకు కష్టపెట్టాలి వాళ్ళని? ఒకళ్ళని అంత క్షోభకి గురిచేసే హక్కు మనకెవరిచ్చారు? మనపై ఉన్న ఆశలన్నింటినీ కొల్లగొట్టే స్వేచ్ఛ మనకెవరిచ్చారు?’
“ఇంతలా ప్రతిదాన్నీ విశ్లేషించుకుపోతే ఏపనీ చేయలేమేమో! ఏపని చేసినా ఎవరికో ఒకరి బాధ కలగకపోదు. ఎవరికీ కలగకపోతే, మనకే కలగొచ్చు. మనగురించి కూడా మనం ఆలోచించుకోవాలి” అన్నాడతను స్థిరంగా.
వాసు ఒక్క క్షణం జ్ఞానోదయం అయినట్లు చూసాడతడ్ని. ఏమీ మాట్లాడలేదు. ‘ఎవరికీ బాధకలగని పని చేసాక, మనకే బాధ కలగొచ్చు’ – అన్న ఆలోచన అతని మెదడులోకి దూరి మనసుని తాకాక, మనసు వేధించడం మొదలుపెట్టింది.
“ఏం సార్ అలా చూస్తున్నారు?” – ఆలోచనల్లో మునిగిన వాసుని చూస్తూ అన్నాడు మళ్ళీ అతనే. దానితో వాసు తేరుకున్నాడు.
“చిన్నవాడివైనా నా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళూ, చచ్చే ధైర్యం లేక నేను ఇన్నాళ్ళూ ఎవర్నీ బాధపెట్టని విధంగా మరణించాలని ఆలోచిస్తూ బ్రతికాను. ఇక నేను పోయినా ఎవరూ పట్టించుకోరు అన్న నిర్ణయానికి రావడానికి పదేళ్ళు పట్టింది. ఇన్నాళ్ళలోనూ క్రమంగా జనజీవనంలోంచి నిష్క్రమిస్తూ, వారి జ్ఞాపకాల్లో మాత్రమే భాగమౌతూ వచ్చాక, ఇప్పటికి చద్దాం అని నిర్ణయించుకున్నాను. నాకెవరూ లేరు. అంతా పోయారు. నేను చస్తే ఎవరూ ఏడవరన్న ధృడనమ్మకంతో సంతోషంగా చావబోతున్నా. ఇందాక అడిగావే -ఎందుకు నవ్వుతున్నా అని – ఇన్నాళ్ళకి చస్తున్నా అన్న ఆనందంలో! ఎన్నిసార్లు చావాలని ప్రయత్నించానో నీకేం తెలుసు? ప్రతిసారి చివరి నిముషంలో ఎందుకో తెలీని భయం!”
“భయమా? దేని గురించి?”
“ఏమో… చచ్చే పద్ధతుల గురించిన అవగాహన లేకపోవడం వల్ల అనుకుంటాను.”
“పద్ధతులదేవుందీ? ఎన్ని కథలూ,సినిమాలూ, వార్తలలో చూపించట్లేదు?”
“చూపిస్తారు కానీ, చేద్దామని పూనుకున్నాక కలిగే భయాల గురించి, వాటిని ఎలా అధిగమించాలి? అన్న దాని గురించి ఎవరూ చర్చించరు. పోనీ, చేసేస్కున్న వాళ్ళనే అడిగేద్దాం అంటే ఆ అవకాశం లేదాయే!”
“అసలింతకీ మీరెందుకు చావాలనుకున్నారు? ఎందుకు ఇంకా అనుకుంటున్నారు?”
“నాకు బ్రతుకుపై మోజు తీరిపోయింది కనుక.”
“అది కాదండీ, అసలేమైంది? ఎందుకు ఆత్మహత్యదాకా వచ్చారు? అంటే కారణమొకటి ఉండాలి కదా.”
“నా కారణం నీకు కారణంగా అనిపించకపోతే అది కారణం కాకుండా పోతుందా?”
“బ్రతుకు మీద మోజెందుకు తిరిపోయింది?”
“ఇపుడా కథంతా దేనికి? నువ్వు కారణం అడిగావ్. నేను చెప్పా. అంతే. భారతం దేనికి?”
“అసలు మీకు అంత తీవ్రమైన సమస్యేమొచ్చిందా అని ఆలోచిస్తున్నాను.”
“కారణాల న్యాయం మామూలు విషయాల్లోలా నడవదబ్బాయ్. నా తీవ్రత, నీ తీవ్రత ఒకటి కాకపోవచ్చుగా… అయినా, నా కారణం కారణంగా నేనెవ్వరికీ సంజాయిషీలు ఇచ్చుకోనక్కరలేదు.” అన్నాడు వాసు.
“సరే, దూకండి” అన్నాడతను కోపంగా.
“మరి నువ్వో?”
“నా సంగతెందుకండీ మీకు?”
“చెప్పాను కదా, చూస్తూ చూస్తూ ఒకళ్ళు బ్రతుకంటే ఇష్టం ఉన్నా చావాలనుకుంటే ఎలా ఊరుకునేది?”
“మీరు చేసేదేమిటో?” అతను వ్యంగ్యంగా అన్నాడు.
“నాకు బ్రతుకుపై వ్యామోహం లేదుగా.”
“అదే, ఎందుకు? అంటున్నా.”
“అది నీకెందుకు? అంటున్నా.”
“మరి నా కారణాలు మీకెందుకు?”
“చూడబ్బాయ్! బ్రతకాలన్న ఆశ ఉన్నవారు, ఇతర ప్రాణాల బాధ్యతలు మోస్తున్నవారూ, ఈ ఇద్దర్లో ఎవరు ఆత్మహత్యకి ప్రయత్నించినా నాకు నచ్చదు” ధృఢంగా అన్నాడు వాసు.
“ఛ, మీతో మహా విసుగ్గా ఉంది. ఎందుకిలా నస పెడుతున్నారు నా చావేదో నన్ను చావనివ్వక! సరే, ఓపని చేద్దాం. మీరు దూకేయండి, ఆపై నేనేమైనా మీకనవసరం కదా. నేను దూకేస్తా అప్పుడు.”
-వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉండగా, ఎవరిదో అడుగుల చప్పుడు వినబడ్డది మళ్ళీ.
“మనలాగే, ఎవరూ రాని ప్రదేశం అనుకుని ఎవరో వస్తున్నట్లున్నారు.” గొణిగాడు వాసు. తీరా చూస్తే, వాచ్మెన్.
“ఏయ్! ఏం చేస్తున్నారిక్కడ?” వీళ్ళని చూడగానే లాఠీ ఝళిపిస్తూ, మాటలతో ఝాడించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉన్నాడతను. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు.
“మిమ్మల్నే అడిగేది. ఈ గొడవేమిటి? ఏం పని మీకిక్కడ?”
వీళ్ళేమీ మాట్లాడకపోయేసరికి, మళ్ళీ అతనే “సూసైడ్ కేసల్లే ఉందే! పైగా ఇద్దరు! చల్, పదండి కిందకి, కానిస్టేబుల్ ఉన్నాడు కింద.” ఆ వాచ్మెన్ అలా అనడంతో ఉన్నట్లుండి భయంతో ఆ యువకుడు – “అవును, ఎవరు ముందు దూకాలా అని…” అంటూండగా వాసు అందుకున్నాడు.
“నేను సినిమా డైరెక్టర్నండీ. ఇతను నిర్మాత గారి బామ్మరిది. క్లైమాక్సులో హీరో-హీరోయిన్ ఆత్మహత్య చేసుకునే సీన్ ఉంది. అది ఇక్కడ తీయాలనుకుంటున్నా. ఈయన లొకేషన్ చూపించమంటేనూ, తీసుకొచ్చాను.”
“హీరో, హీరోయిన్ చస్తే సినిమా ఏం ఆడుద్దయ్యా?” నవ్వుతూ చక్రపాణి తరహాలో అడిగాడు వాచ్మెన్.
“మరోచరిత్ర ఆడలా?” – ఎదురు ప్రశ్నించాడు వాసు.
“ఏదో ఒకటిగానీ, త్వరగా వచ్చేయండి బాబూ. బైట గేట్ వేసే వేళౌతోంది. ఈమధ్య ఆత్మహత్య కేసులెక్కువై, రోజూ ఇలా ’లొకేషన్ల’కి వచ్చి చూస్కుని పోతున్నాం.” కదిలాడు వాచ్మెన్. చేసేదేం లేక ముందుకు కదిలారిద్దరూ.
“బుద్ధిలేకపోతే సరి! వాడొచ్చేలోగా దూకేయడమో, తోసేయడమో, తోసి దూకడమో చేసి ఉండొచ్చుగా! ముచ్చుమొహం నువ్వూనూ! పైగా వాడికి చెప్పడం కూడానూ – ఎవరు దూకాలా అని చర్చిస్తున్నామని! ఇపుడు చూడు, అనవసరంగా ఛాన్సు మిస్సైంది. మళ్ళీ ఇంత ప్రేరణ, ధైర్యం ఎప్పుడ్రావాలి? అందాక బ్రతికి చావాలి!” అన్నాడు వాసు విసుగ్గా.
“చాల్లెండి గోల! మీమాటలు విని చచ్చుంటే ఎంత పనయ్యేది? దూకేస్తే మళ్ళీ బ్రతకడం ఎంత కష్టం? ఇంటికెళ్ళాలిక. పొద్దున్ననగా బైటికొచ్చా. ఖంగారు పడుతూంటారు ఇంట్లో వాళ్ళు. ఏదో ఆవేశంలో ఆత్మహత్య చేస్కోవాలనుకుని వచ్చేశా . మీరొచ్చి ఇలా చర్చ మొదలుపెట్టి నా ప్రాణం నిలబెట్టారు సార్. థాంక్స్!” అన్నాడతను కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ.
వాచ్మెన్ వెనక్కెళ్ళినవాడల్లా మళ్ళీ పైకి వస్తూండటం చూసి, గొడవాపి దిగడం మొదలుపెట్టారిద్దరూ. ఇంతలో, వాచ్మెన్ సెల్ఫోన్ మోగింది. మాట్లాడాక దాన్ని తిరిగి జేబులో పెట్టుకుంటూ – “ఎదవ సంత. ఈ పెళ్ళాం, పిల్లలూ గోల లేకుంటే ఎంత సుఖంగా ఉండేదో కదా! మాట్లాడితే అది కావాలి, ఇది కావాలి. ఒక్కళ్ళే ఉంటే సుఖం బాబూ మనిష్టమొచ్చింది చేయొచ్చు!” అన్నాడు.
“ఇష్టం వచ్చింది చేయాలన్నా కూడా ధైర్యం ఉండాలిగా” అని ముందుకు కదిలాడు వాసు.