కోనసీమ కథలు: వామనుడు

“చ! ఏంట్రా ఈ ముక్కలు పంచడం? కాస్త చేతులు కడుక్కొచ్చి పంచేడు.” విసుక్కుంటూ అన్నాడు భద్రం.

“మళ్ళీ మిడిల్ డ్రాపా? సూరిబాబుగాడి రికార్డు బ్రేక్ చేసేద్దావనే?” వెటకారంగా అన్నాన్నేను.

“చ నోర్ముయ్! చెత్త ముక్కలు పంచడం కాకుండా వ్యంగ్యాలొకటి నీ బ్రతుక్కి.” కోపంగా అన్నాడు.

విధి తప్పకుండా ప్రతీ శుక్రవారం నేను ఈ చతుర్ముఖ పారాయణం చేయడం మానను. ఇన్‌కంటాక్సు ఆఫీసునానుకున్న సత్యంగారి షెడ్డే మా క్రతువుకి పెద్ద అడ్డా. మాలో కొంతమంది శుక్రవారమే వస్తాం. మిగతా వాళ్ళకి వారమూ, వర్జ్యమూ లేదు. స్నానానికీ, భోజనాలకే ఇల్లు గుర్తొస్తూ ఉంటుంది.

“సరే గానీ, ఆ సూరిబాబుగాడెక్కడ? ఇవాళ వేంకటేశ్వరాలో ప్రేమనగర్ సినిమాగ్గానీ వెళ్ళాడా?”

సూరిబాబు మా క్రతువు పెద్ద. పుట్టి బుద్ధెరిగాక వాడు ఇంట్లో కంటే ఇక్కడే పెరిగాడు. నా వయసు వాడే. చిన్నప్పటినుండీ కలిసి పెరిగాం;కలిసి చదువుకున్నాం. ఇద్దరమూ చదువులో అంతంత మాత్రమే! చచ్చీ చెడీ నేనెలాగో ఎస్.కె.బి.ఆర్ కాలేజీలో బి.ఏ పూర్తి చేసి బి.ఈడి. అయ్యిందనిపించాను. మా నాన్న కిందా మీదా పడి నాకు పేరూరు స్కూల్లో వుద్యోగం వేయించాడు. సూరిబాబుకావసరం లేదు. తాత ముత్తాలందిచ్చిన ఏభై ఎకారాల పొలముంది.

“సూరిబాబుగాడి ప్రేమనగర్ మండపేటలో ఉంది. యెంకటేశ్వరా ధియేటర్లో కాదు.”

భద్రానికి కోనసీమ యెటకారం పాలెక్కువ! సూరిబాబుకి పేకాటన్నా, మండపేట పాటన్నా పడి చస్తాడు. పెళ్ళయి నలుగురు పిల్లలున్నా పెళ్ళికానట్టే ప్రవర్తిస్తాడు.

ఇంకా ఒక రౌండు పూర్తి కాలేదు షో అంటూ విస్సుగాడు ముక్కలు దించాడు. వీణ్ణి తగలెయ్యా ఇవాళ ఏ నక్కని తొక్కెచ్చాడో షోల మీద షోలు కొట్టేస్తున్నాడ నుకుంటూండగా షెడ్డు డోరు మీద నాలుగు సార్లు ఎవరో కొట్టినట్లు చప్పుడయ్యింది. నాలుగు సార్లు కొడితే మావాడనీ, మూడు సార్లు కొడితే మాకు టీలూ, సిగరెట్లూ అందిచ్చే బడుద్ధాయనీ, అయిదు సార్లు ఆగకుండా కొడితే మావలు దగ్గర్లో ఉన్నారనీ కొండ గుర్తులు. మెల్లగా రేకు డోరు పైకెత్తాం. వచ్చింది సూరిబాబు గాడు. తెల్లటి గ్లాస్గో లాల్చీ, పైజామా వేసుకొని నల్లగా నిగనిగలాడుతూ ప్రత్యక్షమయ్యాడు.

“ఏరా ప్రేమనగర్నుండి సరాసరి ఇలాగే వొచ్చేసావా?” భద్రం ‘ప్రేమనగర్ని’ ఒత్తి పలుకుతూ తనదైన శైలిలో అన్నాడు. సూరిబాబుకి అర్ధం కానట్లు మాకేసి చూసాడు.

‘పేటెళ్ళొస్తున్నావాని మనవాడి కవి హృదయం! నిన్నట్నుండీ అయిపూ, జాడా లేకపోయేసరికి మనవాడు దసరాబుల్లోడు రీళ్ళు తిప్పేస్తున్నాడంతే!” చెప్పాను. సూరిబాబుకి బుర్రలో వెలిగిందప్పుడు.

“నోర్మూయండెహే! మీకెప్పుడూ ఆ గోలే! నెలొచ్చింది కదా, కొబ్బరితోట దింపు కెళ్ళాన్రా!” విసుగ్గా అన్నాడు సూరిబాబు. నెల తిరిగేసరికి ఠంచనుగా కొబ్బరి దింపు తీయించడానికి మాత్రం సూరిబాబు వెళ్ళక మానడు. అదే వాడి జేబు నింపుతుంది. మా క్రతువుకి ఆజ్యం పోయిస్తుంది.

“చెప్పవేం! ఈ తెల్ల లాల్చీ వాలకం చూసి అలానుకున్నానంతే!”

“ఏం చెయ్యమంటావ్? మా బాబు చేతిలో పైసా విదల్చడు. ప్రతీదానికీ అయ్యని అడుక్కోవాలి. అరగంట సేపు బోనులో నిలబడి జవాబులివ్వాలి. నా ఖర్చులకి ఇదొక్కటే మార్గం మిగిలింది మరి.”

సూరిబాబు బాబు పేరు, అదే తండ్రి పేరు పేరప్ప. ఎదుటివారికి చెప్పేటప్పుడు నాన్నలని చెప్పడం ఈ కోనసీమలో అలవాటు లేదు. నల్లగా, పొట్టిగా, పీలగా ఉన్న పేరప్పగారి నోరు ఆయనకంటే పెద్దది. ఎవరైనా ఎదురు పడితే తిట్ల దండకంతోనే పలకరిస్తాడు. బుద్ధున్న ఏ కాకీ ఆయనింటి మీద వాలదు. ఏ పిల్లీ బిచ్చం ఆశించదు. ప్రతీ పైసా లెక్కెట్టుకుంటాడు. ప్రతీ ఆదివారం ఉదయాన్నే వచ్చే ముష్టివాళ్ళు ప్రతీ ఇంటి ముందూ అడుక్కుంటారు తప్ప పేరప్ప గారి గేటు తట్టరు. పొరపాటు నెవరయినా తట్టారా, చచ్చేరే! “వెధవల్లారా! పొద్దున్నే పనీ పాట లేదు. ఏదైనా పనిజేసుకొని ఏడవచ్చు కదా? మళ్ళీ కనిపించారంటే చంపేస్తాను.” అంటూ ఆ ముష్టివాళ్ళని బెదిరిస్తాడు. ముష్టాళ్ళకే కాదు, ఎదురుపడి మాట్లాడాలంటే అందరికీ భయమే!

నాకూ ఆయనంటే చచ్చేటంత భయం. హైస్కూల్లో చదివే రోజుల్లో వినాయక చవితి పందిరి చందాలకోసం ఓ సారి వెళ్ళి అడిగాను. చందా ఇచ్చినా ఇవ్వకపోయినా పావలా పెట్టి లాటరీ టిక్కట్టయినా కొనమని అమాయకంగా అడిగాను. చేతిలో ఉన్న లాటరీ టిక్కట్టు పుస్తకం చూడ్డానికన్నట్లు లాక్కొని ముక్కలు ముక్కలు చేసి – “ఏరా! మీ నాన్న నానా యాతనా పడి ఉన్న నాలుగెకరాలూ వ్యవసాయం చేసుకొని ఇల్లు లాక్కొస్తుంటే, బుద్ధిగా చదువుకోకా, వినాయక చవితీ, పందిళ్ళూ అంటూ ఈ వేషాలేమిటి?” అంటూ చెవి మెదిలిపెట్టాడు. ఆ నొప్పి తాలుకు మహత్యం ఎంతంటే ఇప్పటివరకూ ఆయన ఎదుటపడిన పాపాన పోలేదు నేను. అసలు సూరిబాబింటి వైపే వెళ్ళలేదు. నాకే కాదు యావత్తు భూపయ్య అగ్రహారమూ పేరప్పగారంటే హడలి చస్తారు. ఇహ ఆయన కుటుంబం గురించి చెప్పనవసరమే లేదు. అందరికీ చచ్చేటంత భయం. ఎవరూ నోరెత్తరు, సూరిబాబుతో సహా!

నడుముకి చిన్న అంగోస్త్రం, దానిపైన ఎర్రటి మొలతాడూ, తళ తళ లాడుతూ దానికి వేల్లాడే ఇనప్పెట్టి తాళాల గుత్తీ – ఇదీ ఇంట్లో ఆయన వస్త్రధారణ. నిమిషానికోసారి తాళాలు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. కొడుకుల మీద అనుమానం జాస్తి. పేరప్పగారికి నలుగురు కొడుకులూ, ముగ్గురు కూతుళ్ళూ. ఆడపిల్లలందరికీ చుట్టుపక్కల సంబంధాలే తెచ్చాడు. పండగలొచ్చినా, పబ్బాలొచ్చినా అల్లుళ్ళు పేరప్పగారి ధాటికి ఒక్క పూట మించి విస్తరేయరు. అల్లుళ్ళతో పాటే కూతుళ్ళూనూ! కొడుకులందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. సూరిబాబు ఆఖరివాడు. మూడో వాడు సత్తిబాబు నాటకాలంటూ తిరుగుతూ ఉంటాడు. రెండో వాడు కాస్త మందమతి. వాడి వెర్రి చూసి ఎవరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. పెద్దబ్బాయొక్కడే కాస్త నయం. చదువబ్బకపోయినా పొలం వ్యవహారాలన్నీ పేరప్ప చెప్పినట్లే చేస్తాడు. ఇంటి ఖర్చులన్నీ పేరప్పగారి చేతిమీదుగానే నడుస్తాయి. ఆఖరికి పండగలొచ్చినా కోడళ్ళకీ, మనవలకీ బట్టలుకూడా ఆయనే స్వయంగా కొని తెచ్చిస్తాడు తప్ప, ఎవరి ఇష్టా ఇష్టాలూ పట్టించుకోడు. సూరిబాబు కాస్త లౌక్యమున్నవాడు. అడిగితే బాబు డబ్బులివ్వడనీ, అబద్ధాలతో నొక్కేస్తాడు. నెలకి దింపు తనే తీయిస్తానని ముందుకెళ్ళి, రెండు వేల కాయలు పడితే వెయ్యి కాయలే పడ్డాయని లెక్కిస్తాడు. తన లెక్క బయటకి పొక్కకుండా దింపు వాడికీ, రైతుకీ అందులో కొంత విదిలిస్తాడు. మందయినా, మండపేటయినా ఆ మిగిలిన డబ్బుతోనే.

“దింపు పేరు చెప్పి మీ బాబుకి బానే టోకరా వేస్తావ్! ” ముక్కలు పంచుతూ అన్నాన్నేను.

“ఏం చెయ్యమంటావు చెప్పు. మా ఆవిడకి మల్లెపూలు కొనాలన్నా మా నాన్నముందు మోకరిల్లాలి. అందుకే ఈ చావంతా.”

“మీ ఆవిడికా? మండపేట మహలక్ష్మికా?” భద్రంగాడి వెటకారం విని గుర్రుగా చూసాడు సూరిబాబు.

ఇలా సాగుతుంది మా పారాయణ ప్రహసనం. నేను మాత్రం శనాది వారాలొక్కటే వస్తాను. మిగతా రోజులు వస్తే మా ఆవిడ చంపుతుంది. పైగా పేరూరు వరకూ పదిమైళ్ళు సైకిలు తొక్కుకుంటూ వెళ్ళెచ్చోసరికి ఓపికుండదు. శనివారం నేనెప్పుడూ స్కూలుకెళ్ళిన పాపాన పోలేదు. ఒంటి పూట బడికి నేను పూర్తిగా సెలవు తీసుకుంటాను.

“మీ బాబు భలే వాడురా! మీ అందర్నీ బానే కంట్రోల్ చేస్తాడు.” విస్సు ముక్కేస్తూ అన్నాడు.

“కంట్రోలా పాడా! ఇంట్లో ఎవ్వరికీ ఆయనంటే భయం తప్ప ప్రేమా, వల్లకాడూ లేదు. మా అమ్మక్కూడా ఆయనంటే విసుగే! అసలెవరితోనయినా సవ్యంగా ప్రేమతో మాట్లాడి చస్తేనా? అంతెందుకు మొన్న మా రెండో వాడు బంతి పోగొట్టుకుంటే ఓ నాలిగిచ్చుకున్నాడట. వాడారాత్రి వాళ్ళమ్మని తాతెప్పుడు చస్తాడని అడిగాడని మా ఆవిడ చెప్పింది. వాడే కాదు. మా ఇంట్లో అందరూ మూకుమ్మడిగా కోరుకునేదొక్కటే – ఆయన చావు.” ఎంతో మామూలుగా సూరిబాబన్న మాటలకి పేకాటలో మునిగిన అందరమూ తలెత్తి వాడికేసి చూసాం.

“తప్పురా! ఎంతయినా తండ్రి. మిమ్మలందర్నీ పోషిస్తున్నాడు కదా?” భద్రం గాడు కసురుకున్నాడు. మేమందరమూ వాడికి వత్తాసు పలికాం.

“మీరూ ఇలాంటి పరిస్థితుల్లో వుంటే ఇంతకంటే ఘోరంగా ఉంటారు.మీకు తెలీదంతే!” అంటూ మిడిల్ డ్రాప్ సంకేతంగా ముక్కలు పడేసాడు. ఇహ రెట్టించడం ఎందుకని మేమెవరమూ ఇహ పొడిగించలేదు. ఆటలో మునిగిపోయాం.

సూరిబాబు మాటలు విని బాధ కలిగింది. ఈ మాటలు వింటే పేరప్పగారి రియాక్షనెలా వుంటుందాన్న ఆలోచనొచ్చింది. మనుషులు విచిత్రంగా ఉంటారు. ఒక్క మనిషికి ఎదురు చెప్పలేక యావత్తు కుటుంబమూ అంతగా ద్వేషిస్తున్నారంటే ఆశ్చర్యం కలిగింది. మనిషయినా, జంతువయినా కట్టడి భరించలేదు; దానికి బంధాలూ, అనుబంధాలూ మినహాయింపు కాదు.

అందరమూ ఆటలో మునిగుండగా కారు షెడ్డు తలుపు ఎవరో గట్టిగా కొట్టారు. మా కొండ గుర్తులకి అతీతంగా కొడుతూంటే మెల్లగా షెడ్డు డోరు పైకెత్తి చూసాను. ఆయాస పడుతూ మా పెద్దాడు కనిపించాడు.

“నాన్నా! బామ్మ పడిపోయింది. అమ్మ నిన్ను అర్జంటుగా రమ్మనమని చెప్పింది.” మావాడు కంగారుగా అన్నాడు. చేతిలో ఉన్న ముక్కలక్కడే పడేసి ఇంటి ముఖం పెట్టాను.

మా అమ్మకి చిన్న హార్టెటాకొచ్చింది. వారం రోజులు ఆసుపత్రిలో ఉంచాల్సొచ్చింది. మా చుట్టుపక్కల ఊళ్ళకి డాక్టర్రాఘవేంద్రదే పెద్దాసుపత్రి.

“మీరు వీలయితే కాకినాడ తీసుకెళ్ళాల్సుంటుంది. ఆపరేషన్చెయ్యల్సిన అవసరంవుంది. నేనూ చెయ్యగలను కానీ నా దగ్గర సరైన ఎక్విప్మెంటు లేదు.” అమ్మ కాస్త మంచిగా కోలుకున్నాక ఆవిణ్ణి డిశ్చార్జి చేస్తూ ఆయన చెప్పిన మాట. ఖర్చెంతవుతుందని అడిగాను. ముప్పైవేలు పైనవుతుందని చెప్పాడు డాక్టర్. అంత సొమ్ము నా దగ్గర్లేదు. పొలం అమ్మకానికి పెట్టాను.


ఓ వారం తరువాత ఎవరూ ఊహించని ఓ సంఘటన జరిగింది. పేరప్పగారికి సీరియస్ అయ్యి ఆసుపత్రిలో చేర్చారని పేరూరు స్కూల్లో ఉండగా కబురొచ్చింది. మధ్యాన్నం రెండు గంటలు ముందుగా పర్మిషన్ తీసుకొని బయల్దేరాను. రాఘవేంద్ర గారి ఆసుపత్రిలో చేర్చారని చెప్పారు. అక్కడ కెళ్ళేసరికి సూరిబాబు పెద్దన్నయ్య కనిపించాడు. పేరప్పగారికి మైల్డుగా హార్టెటాకొచ్చిందనీ చెప్పాడు. అక్కడ ఆయనా, పేరప్పగారి భార్యా తప్ప వారి కుటుంబ సభ్యులెవరూ కనిపించలేదు. ఆ రూములో పేరప్పగారు బెడ్డు మీదున్నాడు. ముఖానికి ఆక్సిజన్ పంపే మాస్కు పెట్టారు. పక్కనే ఉన్న పెద్దావిణ్ణి పలకరించాను. ఎంతైనా పెళ్ళాం కదా? కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

సూరిబాబేడని కనుక్కుంటే ఇంట్లోనే ఉన్నాడని చెప్పాడు. అక్కడనుండి సరాసరి పేరప్పగారింటికెళ్ళాను. వెళ్ళేసరికి ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. చిత్రం ఏమిటంటే ఎవరి ముఖాల్లోనూ కూసంత విచారం లేదు. అందరూ జోకులేసుకుంటూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. నన్ను చూసి ఆశ్చర్యపోతూ సూరిబాబు బయటకొచ్చాడు. వాళ్ళింటికి చాలా అరుదుగా వెళతాను. అందుకనే కాబోసు కళ్ళల్లో అంత ఆశ్చర్యం చూపించాడు.

“మీ నాన్నగారికి హార్టెటాకొచ్చిందని రావుడు చెప్పాడ్రా? ఇప్పుడే ఆసుపత్రికెళ్ళొస్తున్నాను” అని చెప్పాను. క్రితం రాత్రి భోజనాలయ్యాక తండ్రి పడిపోయాడనీ, వేంటనే డాక్టర్ రాఘవేంద్రకి కబురు పెడితే, వచ్చి చూసి ఆసుపత్రిలో చేర్చమన్నాడనీ చెప్పాడు.

“హార్టెటాకనే చెప్పాడు డాక్టర్! సీరియస్ అని బంధువులందరికీ కబురంపించాను. మహా అయితే రెండ్రోజులు.” అని ఎంతో క్యాజువల్గా అంటూ తదుపరి కార్యక్రమాల గురించి చెప్పాడు. ఎందుకో అది మాత్రం తట్టుకోలేకపోయాను. మనిషింకా బ్రతికే ఉన్నాడు. రేపటి కార్యక్రమానికి అందరూ ఏర్పాట్లు చేసేసుకుంటున్నారన్న మాట. కుటుంబ పెద్దపై ద్వేషానికి పరాకాష్ట అక్కడే కనిపించింది నాకు. ఆసుపత్రి దగ్గరుండాల్సిన కొడుకులూ, కోడళ్ళూ హాయిగా ఇంట్లో ఆనందిస్తున్నారు. రేపు తెరుచుకోబోయే ఇనప్పెట్టి వేడుకకి అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకో అక్కడ ఉండాలనిపించక వచ్చేసాను.

ఇంటికొచ్చే సరికి మా బావమరిదీ పెళ్ళాం పిల్లలొచ్చున్నారు. వేంవరంలో పెళ్ళి కొచ్చి ఇలా చూడ్డానికొచ్చారని మా ఆవిడ చెప్పింది. పేరప్పగారి కబురు చెప్పాను.


అనుకున్నట్టే ఓ రెండ్రోజుల తరువాత పేరప్ప గారు పోయారు. సూరిబాబుతో స్నేహం వల్ల శవాన్ని ఇంటికి తీసుకొచ్చే వరకూ కూడా ఉన్నాను. ఆ మొత్తం కుటుంబంలో ఆడాళ్ళు ఏడవాలి కాబట్టి ఏడ్చారన్నట్లనిపించింది. పేరప్ప గారి భార్యని వేరే గదిలోకి తీసుకెళ్ళారు. శవం ఇంటికి రాగానే కొడుకులందరూ చేసిన మొట్ట మొదటి పని పేరప్పగారి మొలతాడుకున్న తాళాల గుత్తి తెంపడం. కొడుకులపై నమ్మకమో లేక ఆస్తిపై మమకారమో తెలీదు ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా పేరప్ప తాళాలగుత్తి వదల్లేదు. పేరప్పగారి పిసినారితనమో ఏమిటో తెలీదు. వీళ్ళెంత ఆశిస్తున్నారో ఆయనంత గట్టిగా పట్టుకున్నాడు ఆ తాళాల్ని.

ఇనప్పెట్టి తెరిచి కొడుకులందరూ హతాశులయ్యారు. అందులో కొన్ని బ్యాంకు పాసు బుక్కులు తప్ప చిల్లి గవ్వ లేదు. కొడుకులందరూ నోట్ల కట్టలుంటాయేమో ననుకున్నారు. తీరా చూస్తే అందులో ఏవీ లేవు. తండ్రి పోయాడన్న బాధ కంటే అందులో ఏమీ లేదన్న కోపంతో విలవిల్లాడి పోయారందరూ. పైకి వెళ్ళగక్కలేకపోయినా లోపల పేరప్పగారి దండకం చదువుతున్నారని గమనించాను. దహన కార్యక్రమాలయ్యాక ఇంటికొచ్చేసాను. పేరప్ప గారు పోయారని తెలియగానే వూరందరికీ ఒకటే చర్చ. అది ఆయన మొలతాడుకి వేలాడే తాళాల గుత్తి గురించి. మొత్తానికది కొడుకుల చేతికొచ్చిందని అందరూ నవ్వుకున్నారు; ముఖ్యంగా ముష్టివాళ్ళు.

ఏదయితేనేం పేరప్పగారు బ్రతికున్నంత కాలమూ ఆస్తి సంపాదించాడేమో కానీ ఎవరి ప్రేమా సంపాదించలేదు; కనీసం కన్నవాళ్ళ కన్నీళ్ళు కూడా దక్కించుకోలేకపోయాడు. రెండ్రోజులు పోయాక మా ఆవిణ్ణీ వెళ్ళి పలకరించి రమ్మన్మని చెప్పాను. మా బావమరిది కుటుంబం రావడంతో ఆ మర్నాడు స్కూలుకి సెలవు చీటీ పంపించాను. పిల్లలందరూ సినిమా కెళదామంటే మొత్తం అందరం కలిసి ప్రేమ నగర్ సినిమాకెళ్ళాం. ఇంటర్వెల్లులో మా ముందు వరసలో పేరప్పగారి కుటుంబాన్ని చూసి ఆశ్చర్యపోయింది మా ఆవిడ. నాకు విషయం తెలుసు కాబట్టి అంతగా ఆశ్చర్యపోలేదు. ఇది చాలా చిన్న విషయమనిపించింది. ఎందుకంటే తండ్రి పోయిన రోజు రాత్రి చతుర్ముఖ పారాయణంలో సూరిబాబూ పాల్గొన్నాడు కనుక.

ఒక మనిషి మరణం అయిన వారికెవరికీ ఏమీ కాలేదన్న ప్రశ్న కంటే పెద్ద ఆశ్చర్యం ఏముంటుంది?


నాకు పేరూరు నుండి అల్లవరం బదిలీ చేసారు. వెళ్ళడం నాకిష్టం లేదు. గతంలో రెండు మూడు సార్లు డెప్యుటేషన్ మీద వెళ్ళాను. ఆ స్కూలుకి సరైన సౌకర్యాలు లేక శిధిలావస్థలో ఉందని ఎవరో చెప్పగా విన్నాను. రెండేళ్ళ క్రితమొచ్చిన తుఫానుకి గోడలన్నీ కూలిపోయాయని మా తోటి టీచర్లు అనుకోడం తెలుసు. పేరూరు వదలకుండా ఉండడానికి చాలా పట్టుబట్టాను. మా వూరి ఎమ్మెల్యే చేత చెప్పిద్దామనీ ప్రయత్నించాను. కుదర్లేదు. వెళ్ళి తీరాలన్నారు. ముందు వెళ్ళి జాయినయ్యి ఏదో సాకు చూపించి మరలా వేరే వూరికి ట్రాన్స్‌ఫర్ అడగచ్చు కదాని మా హెడ్మాస్టరు సలహా పడేసాడు. ముందలాగే అంటారు. తీరా వెళ్ళాక మరలా బదిలీ చేయించుకోవాలంటే నానా యాతనా పడాలి. అందుకని నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నాను. అంతగా కావల్సివస్తే ఆర్నెల్లు ఆరోగ్యం బావోలేదని శలవు పెట్టేసి మిగిలిన రెండెకరాలూ వ్యవసాయం చేసుకుంటాననీ చెప్పాను. ఈలోగా మా అమ్మకి ఆపరేషన్ అయ్యాక వెళతాననీ అప్పటివరకూ రెణ్ణెల్లు శలవడిగాను. మొత్తానికది గ్రాంటయ్యింది. కాకినాడ వెళ్ళే ముందు డాక్టర్ రాఘవేంద్రని కలుద్దామని వెళ్ళాను. ఖర్చుకి వెనుకాడకుండా అమ్మకి తొందర్లో ఆపరేషన్ చెయ్యడమే మంచిదని చెప్పాడు.

“పుట్టిన అందరమూ పోయే వాళ్ళమే! కానీ పోయే ముందు జీవితం అతి తక్కువ కష్టంగా ఉండాలి. ముఖ్యంగా పోయేవాళ్ళకి. పాపం పేరప్ప గారి పరిస్థితే చూడు. చచ్చేటంత ఆస్తున్నా ఫలితం లేకపోయింది. ఆయన్నీ కాకినాడ తీసుకెళితే కోలుకునేవాడేమో? కళ్ళముందే పోయాడు. ఏం చేస్తాం?”

డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయాను. “మరి మీరు వాళ్ళకి చెప్పలేదా?”

“చెప్పాను. ఏం లాభం? కొడుకులందరూ ఇహాయన బ్రతకడన్న నిర్ణయానికొచ్చేసారు. కాకినాడ తీసుకెళ్ళినా ప్రయోజనం ఉండదని డబ్బుకి వెనుకాడారు.”

“పేరప్ప గారి మరణంపై వాళ్ళు నిర్ణయానికి రాలేదు. నిర్ణయించేసారు. ప్రయోజనం బ్రతకడానిక్కాదు. వాళ్ళకేమీ ఉండదని.” పైకి అందామనుకున్న మాటలు నాలోనే నొక్కేసాను. నాకు సూరిబాబు కుటుంబం గురించి బాగా తెలుసు. పేరప్పగారి తాళాల గుత్తిని పిల్లలందరూ పంచుకున్నారు. ఇల్లు మాత్రం భార్య పేరే రాసాడు పేరప్పగారు. ఆవిడ తదనంతరమే కొడుకులకి చెందేటట్లా రాసాడు. ఏదయితేనే ఆ ఇంట స్వేచ్ఛా వాయువులు ఉధృతంగా వీచాయి. ఆ ధాటికి ఆస్తి రెపరెపలాడ్డం మొదలెట్టింది. డాక్టర్ దగ్గర శలవు తీసుకొని ఇంటికొచ్చాను.

అమ్మకి కాకినాడ పెద్దాసుపత్రిలో హార్టుకి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. త్వరగానే కోలుకుంది. ఒక వారం రోజులుక్కడుంచి ఇహ అమలాపురం వెళ్ళచ్చనీ చెప్పారు. అమ్మ పూర్తిగా కోలుకున్నాక ఆపరేషన్ చేసిన డాక్టరుకి కృతజ్ఞతలు చెబుదామని పళ్ళు కొని తీసుకెళ్ళాను. ఆయన మా డాక్టరికి లెటర్ రాసిస్తానని చెబుతూ ఊరూ, పేరూ అడిగాడు. చెప్పాను. ఉత్తరం పూర్తిచేసి చేతికిస్తూ –

“మీది అమలాపురమా? మీ వూళ్ళో పేరప్పగారని ఉన్నారు. మీకు తెలుసా?” అడిగారు. బాగా తెలుసననీ, ఆయన ఈ మధ్య పోయారన్న సంగతీ చెప్పాను.

“అయ్యో పాపం! పోయాడా పెద్దాయన! అలాంటివాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువమందుంటారయ్యా? మహానుభావుడు!” అన్నాడు. నాకు మతిపోయింది. పేరప్ప గారిని పొగిడే మొట్ట మొదటి మనిషిని మొదటిసారి ఈ భూ ప్రపంచమ్మీద చూస్తున్నాను.

“మహాను భావుడేంటండీ? మా వూళ్ళో అందరూ ఆయన్ని పిసినారి పేరప్ప అంటారు.” ఉండబట్టలేక అనేసాను.

“లేదయ్యా! నీకు తెలీదు. ఈ ఆసుపత్రి కట్టడానికి భూరి విరాళమిచ్చిన అజ్ఞాత దాత. కనీసం ఎక్కడా పేరు కూడా వేయద్దనీ చెప్పాడు.”

నమ్మబుద్ధి కాలేదు. అదే పైకి చెప్పాను. ఆ ఆసుపత్రి కట్టడానికి లక్ష రూపాయిలిచ్చాడని చెప్పాడు. చనిపోయిన రోజున ఆ కుటుంబం ఆయనపై చూపించిన గౌరవం గుర్తొచ్చింది. కొంత సేపయ్యాక డాక్టర్ వద్ద శలవు తీసుకొని భారంగా అక్కడనుండి కదిలాను. డాక్టర్ చెప్పిన విషయం మా ఆవిడకీ, అమ్మకీ చెబితే వాళ్ళూ నమ్మలేదు. పనులన్నీ ముగించుకొని, కోటిపల్లి మీదుగా అమలాపురం వెళదామని అనుకున్నాను. రావులపాలెం మీదుగా అయితే అమ్మ అంతసేపు ప్రయాణం చెయ్యలేదు. కోటిపల్లి గోదావరి దగ్గర పడవ ఎక్కి ఆవతల వైపునున్న ముక్తేశ్వరం రేవు దగ్గర నుండి అమలాపురం బస్సెక్కి వెళ్ళచ్చు. కోటిపల్లి చేరగానే పడవ సిద్ధంగా ఉంది. టిక్కట్టు తీసుకొని పడవెక్కాము. పడవలో ఏభై ఏళ్ళ పెద్దాయన నాకేసి పదే పదే చూస్తున్నాడు. ఆయనకేసి చూసి మొహమాటంగా నవ్వాను.

“మిమ్మలెనెక్కడో చూసునట్టుందండీ..?” అని మాటకలిపాడు. నా గురించి చెప్పాను.

“అలా చెప్పండాయ్! మా చెల్లెల్ని పేరూరే ఇచ్చాం. నేను అల్లవరానికి మునసబుగా చేసాను. మీరుండేది పేరూర్లోనేనా?” నేనుండే చోటు చెప్పాను.

“అమలాపురవా? భూపయ్యగ్రహారమా? చెప్పరే మరి! మీకు పేరప్పగారు తెల్సా?” అంటూ ప్రతీ వాక్యాన్నీ సాగతీస్తూ అడిగాడు. పేరప్పగారి పేరు అల్లవరం వరకూ పాకిందాని ఆశ్చర్యపోయాను. ఈ మధ్యే పోయారని చెప్పాను.

“అయ్యో పాపం! చాలా మంచోడా మనిషి. తుఫానుకి మా స్కూలు కూలిపోతే అది కట్టించడానికి ఆయనే డబ్బిచ్చాడు. ఆయన పేరు పెడతానన్నా వద్దన్నాడు. అసలు పేరు కూడా పైకి రానివ్వద్దని చెప్పాడు. దేవుడెప్పుడూ అంతేనండీ, మంచోళ్ళని ఇట్టే లాక్కెళ్ళి పోతాడు.”

మరోసారి మాటలేదు నాకు. ఇదంతా వింటూ మా ఆవిడా, అమ్మా ఆశ్చర్యపోయారు కూడా. ఈ కాకినాడ ప్రయాణంలో అన్నీ ఊహించనివే ఎదురవుతున్నాయి.

చిన్నప్పట్నుండీ చూసి చూసి పేరప్పగారంటే నాకొక రకమైన వ్యతిరేకాభిప్రాయం ఏర్పడిపోయింది. నాకే కాదు ఆయన చుట్టూ ఉన్నందరికీ అంతే! ఈ విషయం అమలాపురంలో చెప్పినా ఎవరూ నమ్మరు. ముఖ్యంగా వాళ్ళింట్లో వాళ్ళు. ఆలోచనలో పడిపోయాను. చుట్టూ ఉండే మనుషుల్లో కాంప్లెక్సిటీ ఇప్పటికీ అర్థంకాదు నాకు. ప్రవర్తనలో కనిపించే రూపం వేరు; లోపలి దేహం వేరూనూ.

పేరప్పగారు చిన్నప్పుడు వినాయక చవితి చందా అడగపోతే చెవి మెలేసిన సంఘటన గుర్తొచ్చింది. అప్రయత్నంగా చెవి మీదకి చెయ్యెళ్ళింది. పెద్దయ్యాక ఓసారి సూరిబాబు కోసం వెతుక్కుంటూ సరాసరి మా పారాయణ స్థలానికే వచ్చిన సంఘటన గుర్తొచ్చింది. అక్కడ సూరిబాబు లేడు కానీ, వాడికి పడాల్సిన అక్షతలు నాకు పడ్డాయి. “ఏరా వెధవా! మా వాడెలాగూ తగలడ్డాడు. నీకేం పొయ్యకాలం వచ్చిందిరా? మీ నాన్న సంపాదించిందంతా ఇలా తగలేస్తున్నావా?” అంటూ చదివిన తిట్ల దండకం గుర్తొచ్చింది. పొట్టిగా పీలగా వామనుడిలా ఉండే పేరప్పగారు గుర్తుకొచ్చారు. వంటికి చిన్న అంగోస్త్రమూ, మొలతాడుకి తళతళ లాడే తాళాల గుత్తీ గుర్తొచ్చాయి. కొంత సేపయ్యాక ఆయనతో అన్నాను.

“నేను రెండు వారాల్లో అల్లవరం స్కూలుకి టీచర్‌గా ట్రాన్స్‌ఫర్ మీదొస్తున్నాను.”

నా మాట విని నాకేసి విస్తుబోయి చూసింది మా ఆవిడ. అవునన్నట్లు తలూపాను. నా నిర్ణయం ఆమెకు తెలీదు. ఆమెకే కాదు నాకూ ఇప్పటివరకూ తెలీదు, వామనుడి గుడికి పూజారిగా వెళుతున్నానని. మెల్లగా మా పడవ ఒడ్డుకు చేరుకుంది.


(పంతొమ్మిదివందల డెబ్భై కాలంలో కోనసీమలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా – ఈ కోనసీమ కథలు.)