2. వచన పద్యం: లక్షణ నిరూపణం

ఇక, నేను ప్రతిపాదించిన భావగణాలను గూర్చి వివరిస్తాను.

వచన పద్య పాద విభజనకు అక్షర, మాత్రాదుల సంఖ్య కాక భావాన్నీ, భావాంశాలనూ ఆధారంగా తీసుకున్న విషయం ముందే వివరింపబడింది. కాగా, వచన పద్య పాదం యొక్క అంతర్విభజనక్కూడా అదే భావ, భావాంశాలు మౌలికంగా స్వీకరించబడ్డయి. సాంప్రదాయిక ఛందస్సుల్లో ‘గణం’ అన్న పదం విస్తృతంగా పాదం యొక్క అంతర్విభజన విషయంలో ఉపయుక్తమయితున్న కారణంగా, ఇక్కడ కూడా ఆ గణం అన్న పదాన్ని – అక్కడి అర్థంలో కాక – ఔపచారికంగా స్వీకరించి ‘భావగణం’ అన్నాను. ఈ ‘భావగణం’ స్వరూపాన్ని సులభంగా స్పష్టీకరించటానికి పుర్వపు నా వ్యాసాల్లో –

ప్రతిమాటకీ శక్తి ఉంది పదును ఉంది
ప్రతిమాటకీ అర్థం ఉంది ఔచిత్యం ఉంది

అన్న తిలక్ రచనలోని పాదాల్ని ఉదహరించటం జరిగింది. వాటినే మళ్ళీ ఉదహరించి రామారావుగారు – ఇక్కడ కి-విభక్తి బంధం ఒక గణం, తరువాత వచ్చిన నామం, క్రియ కలిసి ఒక గణం, ‘శక్తి, పదును, అర్థం, ఔచిత్యం’ అనేవి ఒక రకపు (నామ) గణాలు గానూ, ‘ఉంది’ అనేది ఒక (క్రియా) గణంగానూ ఎందుకు విభజించకూడదు? శక్తి ఉంది అనేది ఒక భావమా, రెండు భావాలా? ‘ప్రతిమాటకీ శక్తి ‘ అనేది ఒక గణం ఎందుకు కాకూడదు? భావాలను వేరు చేసే నిర్దిష్ట సూత్రాలేమిటి? వీటికి objective criteria ఏమైనా ఉన్నయ్యా? కేవలం arbitrary గా చేసే విభజనేనా? ఈ ప్రశ్నల్లో వేటికీ సమాధానాలు దొరకవు అన్నారు.

దొరుకుతవేమో, చూద్దాం.

నేను నా పై ఉదాహృత వచన పద్య పాదాలను విభజించింది క్రియా, నామ గణాలన్న ధోరణిలో కాదు. భావస్ఫూర్తి ననుసరించి. ఈ విభజనలో ఒకప్పుడు పద సముదాయం ఉండవచ్చు. పదబంధం ఉండవచ్చు. ఒకే పదం కూడా ఉండవచ్చు. ‘కి-విభక్తి బంధం ఒక గణం’ అన్నరీతిలో విభజిస్తే కి-విభక్తి బంధం ఉన్న ప్రతిచోటా అది ఒక గణం కావలసి వస్తుంది. కాని, అట్లా కాదు. కాబట్టి, ఆ నామ, క్రియా, విభక్తి పద్ధతి కుదురదు. ‘ప్రతిమాటకీ’ ఒక గణం కావటం అక్కడి రెండు పదాలను కలిపి అవ్యవహితంగా ఉచ్చరించినప్పుడు కలిగే భావస్ఫూర్తిని బట్టి. ‘శక్తి’ మొదలైనవి నామాలే అయినా ‘ఉంది’ అనేది క్రియే అయినా, ఆ రెంటి కూర్పు మొత్తాన్ని గణం అనటం, ఆ కూర్పు వల్ల అక్కడ భావస్ఫూర్తి ఉంది కాబట్టే. ఈ స్ఫూర్తిని కవి ఉద్దేశించి ఉండకపోతే ‘ప్రతిమాటకీ శక్తి పదునూ అర్థం ఔచిత్యం ఉన్నాయి’ అని ఉండేవాడు. అట్లా అనకుండా అన్ని ‘ఉంది’లను ప్రయోగించినాడు. ‘ప్రతిమాటకీ’ అన్నదాన్ని రెండుసార్లు (ఉభయపాదాలకూ మొదట్లోనే) ఉపయోగించినాడు. ఎక్కడ ‘ఉంది’ అక్కడి వెనుకటి పదంతోటి కలసి ఉండవల్సిందే తప్ప, విడిపోయే వీలు లేదు. కాబట్టి ‘శక్తి ఉంది’ ఇత్యాదులు ప్రత్యేకంగా భావగణాలని చెప్పటం జరిగింది. ‘శక్తి ఉంది’ ఒక భావమా? రెండు భావాలా? అంటే, నా మటుకు నేను ఒకటే అనుకుంటున్నాను. ‘ప్రతిమాటకీ శక్తి’ ఒక గణం ఎందుక్కాకూడదని ప్రశ్న. ఎందుక్కాకూడదంటే, ‘శక్తి’ తరువాత ‘ఉంది’ అనేది ఉంది కాబట్టి. ఈ ‘శక్తి’ ఆ ‘ఉంది’ తో కలిసి ఉండేదే తప్ప ‘ప్రతిమాటకీ’ తోటి ఉండేది కాదు. ఇకపోతే భావగణాలను వేరు చేసే నిర్దిష్ట సూత్రం భావమే మరి.

ప్రశ్నలకు సమాధానాలు దొరుకవంటూ – “అందుకే, సంపత్కుమార (1967) ‘ఇక్కడి అర్థాన్ని బట్టి గణ విభజన ఆభాస రూపంగా చేయవచ్చు’ నన్నారు. వారి భావగణాలు ఆభాసాలే తప్ప నిర్దిష్టమైనవి కావని వారే అంగీకరిస్తున్నారు. ఈ ఆభాసగణాలు వచన పద్యాన్ని నిర్వచించలేవు కాబట్టి వాటిని నిరాకరించవలసి వస్తున్నది” అన్నారు రామారావుగారు.

ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయవలసి ఉన్నది. సాంప్రదాయిక ఛందస్సుల్లో ‘గణం’ ఒక నిశ్చితార్థంలో ప్రహతమయి ఉంది. మరి, వచన పద్యం విషయంలో ‘గణం’ ఆ నిశ్చితార్థంలో కాక ఔపచారికంగా , కేవలం ఛందోమర్యాదాస్ఫూర్తి కొరకు వాడబడింది. అందువల్ల ఇక్కడి ‘గణం’ ఆభాసమే అయితుంది. కాగా, ఆభాస రూపంగా గణ విభజన చేయవచ్చునన్నాను. ఒక భావం, లేదా భావాంశాన్ని (ఇంకా చిన్న విభాగాన్ని, అవసరమయితేనే) గణం అనటం కుదురదు. సాంప్రదాయిక ఛందస్సుల పాద విభజనలో గణ పద్ధతి ఉంది కాబట్టి, ఆ స్ఫూర్తి కోసం వచన పద్య పాదాంతర్విభజన లోనూ – ఆ విభజనకు ‘భావం’ ఆధారం కాబట్టి – భావగణం అనడం జరిగింది. మరొకటి. భిన్న భిన్న వచన పద్య పాదాల్లో అక్కడ భావాన్ని (భావాంశాన్నీ) స్ఫురింపజేసే పదాల స్థితిని బట్టి భావగణ విభాజకరీతి ఉంటుంది. భావగణ స్వరూపంలో భేదం ఉండవచ్చు గాని, భావగణం మాత్రం ఉంటుంది.

“అసలు విషయమేమిటంటే భావాలని గణాలుగా విభజించటం సాధ్యం కాదనీ, వీరు విభజించింది వ్యాకరణ రూపైకత ఉన్న పద సమూహాలు కాబట్టి, వీటిని న్యాయంగా వ్యాకరణ గణాలు అని అనాల్సి ఉంటుందనీ తేలుతున్నది. వ్యాకరణ గణాలు వాక్య శబ్ద నిర్మాణానికి సంబంధించినవి. వాటి ఆవృత్తి ఒకే శబ్దంతో అయితే పునరుక్తి, భిన్నశబ్దాలయితే అనుప్రాస అవుతుంది. సంపత్కుమార భావగణాలంటున్న వ్యాకరణ గణాలు పద్య బాహ్య స్వరూపానికి అవసరమైన గణాలు కావనీ, వాక్య నిర్మాణానికి అవసరమైన కూర్పు అనీ తేలుతున్నది. పద్య నిర్మాణం వేరు, వాక్య నిర్మాణం వేరు. వేటి సూత్రాలు వాటికే ఉన్నై.” – అన్నారు రామారావుగారు.

సాంప్రదాయిక ఛందస్సుల్లో భావంతో గానీ, అర్థంతో గానీ నిమిత్తం లేకుండా గణ విభజన అక్షర మాత్రా సంఖ్యలను బట్టి జరుగుతుంది. కాబట్టి వాక్య నిర్మాణరీతికి సంబంధించిన అంశాల ప్రసక్తి అక్కడ ఉండదు. మరి వచన పద్యంలో భావాన్ని ప్రధానాధారంగా స్వీకరిస్తున్నాం కాబట్టి, భావస్ఫూర్తిని కలిగించే పదాల కూర్పు, వాక్య నిర్మాణ రీతి – వీటి కిందులో ప్రవేశం ఉండక తప్పదు. అంత మాత్రాన ఇక్కడ భావగణ విభజనకు కేవలం వ్యాకరణ రూపైకతే ప్రధానమని చెప్పటానికి వీలు లేదు. ఆ వ్యాకరణ రూపైకత ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మనం గ్రహించిన ఉదాహరణంలోనే ‘ప్రతిమాటకీ’ అనే దానికీ ‘శక్తి ఉంది’ అనే దానికీ ఉన్న వ్యాకరణ రూపైకత ఏమిటి? ‘వ్యాకరణ రూపైకత’ ఉన్న పద సమూహాలు అంటే ప్రతి పద సమూహంలోని పదాలన్నీ లేదా చివరి పదం, వ్యాకరణ రూపిత పద్ధతిలో సమ ప్రత్యయాంతం కావటమో, లేక నామ క్రియాదులు సమంగా ఉండటమో అయి ఉంటుందనుకుంటున్నాను. ‘శక్తి ఉంది, ‘పదును ఉంది’ అన్న పదసమూహాలు సమక్రియాంతాలు కావటం వల్ల ఈ సమూహాల మధ్య వ్యాకరణ రూపైకత ఉన్నదనటానికి ఆస్కారం ఉన్నది కాని, ‘ప్రతిమాటకీ’ అన్నదానితో వీటికున్న వ్యాకరణ రూపైకత ఏమిటో తెలియదు. నిజానికి నేను చెప్పిన భావగణ విభజనకు రామారావుగారు చెప్పిన వ్యాకరణ రూపైకత ఆధారసూత్రం కానేకాదు. అందువల్ల భావ గణాలూ, వారు ఉన్నాయంటున్న వ్యాకరణ గణాలూ ఒకటి కావటానికి వీలులేదు.

ఇదిట్లా ఉండగా, సాంప్రదాయిక పద్య ఛందస్సులోనూ ఈనాడు మనం పద్యాల్ని చదువుకోనేటప్పుడు ఛందోగణాల్ని బట్టి విభజించి చదువుకోము. పాద విభజన కూడా కచ్చితంగా పాటించం.

ఉదాహరణకి –

సిరికిం జెప్పడు, శంఖచక్రయుగముల్ చేదోయి సంధింపడే, పరి…

అన్న పద్య పాదాన్ని ఆ మత్తేభవిక్రీడిత పద్యానికి నిర్ణీతంగా ఉన్న స-భ-ర-న-మ-య-లగ అన్న గణాలుగా విభజించి ఎవ్వరూ చదువరు. భావస్ఫూర్తి ననుసరించి సిరికిం జెప్పడు | శంఖచక్ర యుగముం | జేదోయి సంధింపడు | ఏ పరివారంబును జీరడు | …ఇత్యాదిగా చదువుకుంటారు. అట్లాగే –

నెలలు నిండిన సతిబాయ నెరి దపింతు
నా, నిలుపులేని రాజ్యాంగ తంత్రము దలంతు
నా, పగలు గొన్న చుట్టాల ననుసరింతు
నా, యొకనిబట్టి దైవ మిట్లాడనేల

– గడియారం వేంకటశేషశాస్త్రి గారి శివభారతము నుండి.

అనే పద్యాన్ని ‘…తపింతునా, …తలంతునా, …అనుసరింతునా’ అని చదువుతారే తప్ప ‘…తపింతు | నాని, లుపు, తలంతు | నాప, గలు, అనుసరింతు | నాయొ, కని…’ అని చదువరు. ఇక్కడ పద్యంలోని ఛందోగణాలేమిటి? అవి ఎక్కడ విరుగుతాయి? అనేది చదువరికి ముఖ్యం కాదు. ఎక్కడ ఎట్లా విరిచి చదువుకుంటే భావస్ఫూర్తి కలుగుతుందనేది ముఖ్యం. వచన పద్య పాదం విషయంలోనూ చదువరికి సంబంధించిన ఈ ముఖ్యాంశాన్నే ప్రధానంగా స్వీకరించి అటు కవీ, ఇటు లక్షణ కర్తా సాగవలసి ఉంది. భావగణ విభజన విషయంలో ఈ అంశమే ప్రధానమయినది. ‘సిరికిం జెప్పడు, …చేదోయి సంధింపడు మొదలయిన చోట్ల వ్యాకరణ రూపైకత ఉన్న పద సమూహాలున్నాయని, వాటిని వ్యాకరణ గణాలనటానికి వీలుంటుందా? ఆ పద్యాల నిర్మాణంలో ఛందోగణాలు ప్రధానం కాబట్టి అట్లా అనడానికి వీలులేదు. అట్లాగే వచన పద్యంలో భావప్రాధాన్యం కాబట్టి ఇక్కడా అనటానికి వీలుండగూడదు. అయితే, వచన పద్య నిర్మాణంలో భావస్ఫూర్తి విషయికంగా వాక్యనిర్మాణరీతికీ ప్రవేశం ఉంది కాబట్టి, వ్యాకరణ రూపైకత అక్కడక్కడా భావగణ విభజనలో కనిపించటం సహజమే. అంతమాత్రాన వ్యాకరణ రూపైకత వల్లనే సర్వత్రా భావగణ విభజన జరుగుతుందనటానికి వీలు లేదు.

ఛందశ్శాస్త్రంలో గణాలు పరిమితాలు. నిజమే. అయితే, ‘భావగణాల సంఖ్య ఎంత? భావాలు ఎన్ని ఉంటయ్యో భావగణాల సంఖ్య అంతన్నమాట! భావాలు ఎన్ని ఉంటయ్యో ఎవరు అంచనా వెయ్యగలరు? అనంతమైన భావగణాలున్నప్పుడు వాటికి వ్యవస్థ ఏమిటి?’ అంటారు రామారావుగారు. అక్షర, మాత్రా సంఖ్యానియమం ఉన్నచోట ఛందశ్శాస్త్రంలో గణాలు పరిమితాలు కాకతప్పదు. సంఖ్యానియమం – అదీ మూడింటికి నియతం చేసుకోవటం వల్ల – అవి పరిగణనీయాలే. కానీ, వచన పద్య పాదాలకు సంబంధించినంతవరకు అక్షర మాత్రాదుల సంఖ్య నియతం కాదు. అందువల్ల ఆ సూత్రం ఇక్కడ అనువర్తించదు. నిజానికి భావగణం ఒక్కటే. సాంప్రదాయిక ఛందో రీతిలో ‘దూరము, దుంపలు, దుఃఖము, దుర్గతి’ అన్నవి, ఆదిలో ఉండవలసిన గురువర్ణస్వరూపములో నాల్గురకాల మార్పులున్నా గూడా ఆ మూడక్షరాల గుంపులు నాల్గింటినీ ‘భగణం’ అనే అంటారు తప్ప, నాల్గు రకాలకు నాల్గు పేర్లు లేవు. అంటే, గణంలోని వర్ణాల స్వరూపంలో మార్పు ఉన్నా గూడా దానిని ఒకే గణంగా పరిగణించవచ్చు నన్నమాట. అదే విధంగా భావాన్ని ఆధారం చేసుకుని పదాల స్వరూపంలో, వాటి కలయికల్లో ఎన్ని తేడాలున్నాగూడా అది భావగణమే. అది ఏకైకం. మరి ఇంతగా భావగణాల్ని గూర్చి చెప్పటమెందుకంటే, వచన పద్య పాద విభజనను క్రమబద్ధం చేయటానికే.

ప్రతిమాటకీ శక్తి
ఉంది పదును ఉంది

అని విభజించకుండా ఉండటానికే. ‘శక్తి ఉంది’, ‘ఆకాశం మీద’ వంటి భావగణాలు ఉభయపాదాల్లోకి అభివ్యాప్తం కాగూడదనటానికే. భావాన్నీ, భావాంశాల్నీ బట్టి పాదవిభజన చేసేప్పుడు, భావగణం ఒక పదంగా గానీ, పదబంధంగా గానీ, పదసమూహంగా గానీ ఉండేట్టయితే, దాన్ని రెండు పాదాల్లోకి వ్యాపింప చేయకూడదు. సాంప్రదాయిక ఛందస్సుల్లో తెలుగువారు ఒకే పదాన్ని ఒక పాదం నుంచి తరువాతి పాదంలోకి సాగింపచేయటం ప్రసిద్ధమే – రాజకులైకభూషణుడు, …అన్యరాజతేజోజయశాలి, అన్నట్లు. పదమే కూడదన్నప్పుడు, భావగణం ఉభయపాదాల్లోకి వ్యాపించటం అసలే కూడదు.

ఈ విధంగా, వచన పద్యానికి పాద బద్ధత ఉన్నదని, పాద విభాజకసూత్రమున్నదని, పాదం అంతర్విభజనకు భావగణ పద్ధతి కుదురుతుందనీ రామారావు గారి వ్యాసాన్ని పురస్కరించుకొని సాగిన ఈ వివరణలో స్పష్టం చేయటమైనది. కాగా, వచన పద్యం పద్యమేననీ, గద్యం కాదనీ నిశ్చయం.

నియమ రాహిత్యం వచన పద్య లక్షణం కాదు.

నియమ సాహిత్యం దానికున్నది.


వచన పద్యం: లక్షణ చర్చ – ఉపయుక్త గ్రంథ, వ్యాస సూచి.

(ఈ వ్యాస పరంపరలో మూడవ వ్యాసం చేకూరి రామారావు రాసిన వచన పద్యం: ఛందో విభాగం కాదు.)