‘వచన పద్యం’ అన్న ప్రక్రియ ప్రయోగంలోకి వచ్చి దాదాపు నలభై ఏళ్ళయింది. ఇటీవల మరీ విరివిగా విస్తృతంగా ప్రయోగింపబడుతున్నది. అయితే వచన పద్యాన్ని ప్రయోగించటమే తప్ప, ఒక ఛందోరూపంగా దాని లక్షణాన్ని నిరూపించే ప్రయత్నం మాత్రం జరగలేదు. అందుకని, దాని లక్షణాన్ని నిరూపిస్తూ నేను కొన్ని వ్యాసాలు రాయటం జరిగింది. ఆయా నా వ్యాసాలను పురస్కరించుకొని చేకూరి రామారావుగారు ‘వచన పద్యం: ఆభాస లక్షణ నిరాకరణం‘ అన్న వ్యాసంలో నేను చెప్పిన లక్షణాలను నిరాకరించినారు. కాగా, వారు చేసిన ఈ ‘నిరాకరణం’ పురస్కరించుకొని, మళ్ళీ వచన పద్యాన్ని గూర్చిన కొన్ని అంశాలను స్పష్టం చేయవలసిన అవసరం ఏర్పడింది.
వచన పద్యాన్ని గురించి నేను మాత్రమే కాక, ఇంకా కొంతమంది చెప్పిన చాలా అంశాలను ప్రస్తావించి రామారావుగారు తమ వ్యాసంలో నిరాకరించినారు. అయితే, వాటిని గూర్చి నా ఈ వ్యాసంలో ఏమీ చెప్పబోవటం లేదు. నా ‘అభిప్రాయాల్నే, ప్రధానంగా -సవిమర్శకంగా ప్రస్తావించదలచు కున్నా’రు వారు కాబట్టి, వాటిని మాత్రమే ఇక్కడ ప్రస్తావించి వివరిస్తాను.
నా అభిప్రాయాల్నే ప్రధానంగా ‘సవిమర్శకంగా’ ప్రస్తావించదలచుకున్న రామారావు గారు, ఈ ప్రక్రియకు వ్యవహారంలో మరికొన్ని పేర్లు ఉన్నాగూడా, వాటిని కాదని, నాకు నచ్చిన పేరే – అంటే వచన పద్యం అన్న పేరే – గ్రహించినారు. ఆ పేరే నాకు నచ్చటానికి కారణం, ఆ ప్రక్రియకు మిగిలిన పేర్లన్నిటి కన్నా, ఈ ‘వచన పద్యం’ అన్న పేరు బాగా నప్పటం మాత్రమే. ఈ పేరును గూర్చి ఇదివరకటి నా వ్యాసాల్లో – ప్రధానంగా ‘వచన పద్యం: దాని పేరు’ అన్న వ్యాసంలో – చర్చించి నిర్ధారించినాను. ఈ పేరు విషయంలో అసమ్మతినేమీ రామారావుగారు ప్రకటించలేదు. పైగా, నాకు నచ్చిన కారణంగా వారూ ఆ పేరే స్వీకరించి పెట్టినారు. అసలు ఈ ప్రక్రియ పేరును గూర్చి రామారావుగారంతగా పట్టించుకోలేదు. అందుకని ఆ విషయాన్ని ఇక్కడ ఎక్కువగా వివరించటం లేదు.
రామారావుగారు తన వ్యాసాంతంలో ‘వచన పద్యం పద్యం కాదనీ, గద్యమేననీ, సిద్ధాంతం. గద్యానికి ఏ నియమాలూ లేవు. వచన పద్యానికీ అంతే. నియమరాహిత్యమే వచన పద్య లక్షణం’ అని సిద్ధాంతీకరించటం జరిగింది. వచన పద్యం గద్యమే తప్ప పద్యం కాదని సిద్ధాంతం చేస్తూ ‘నియమరాహిత్యమే వచన పద్య లక్షణం’ అనటం కొంత అయోమయాన్ని కలిగిస్తుంది. వచన పద్యం పద్యం కాకనే పోతే అందులో – ‘వచన పద్యం’లో – పద్యం అన్న పదం ఉండటానికే వీల్లేదు. మరొకటి, ‘అనియతత్వం ఒక లక్షణం ఎట్లా అవుతుంది?’ అని తమ వ్యాసంలో ఒక చోట ప్రస్తావించిన రామారావుగారు ‘నియమరాహిత్యమే వచన పద్య లక్షణం’ అనటం ఎట్లా కుదిరిందో అర్థం కావటం లేదు. ‘అనియతత్వం’ లక్షణం కానప్పుడు ‘నియమ రాహిత్యం’ మాత్రం లక్షణమెట్లా అయితుంది?
వచన పద్యాన్ని నేను ‘పద్యం’ అనటానికి నేను ప్రతిపాదించిన ప్రధానాంశం దాని పాదబద్ధత. దీన్ని అనుసరించి చేసిన భావగణ ప్రతిపాదన. రామారావుగారు తమ వ్యాసంలో మొదట భావగణ నిరాకరణ చేసి, ఆ తరువాత పాదబద్ధతా నిరాకరణం చేసినారు. అయితే, ఈ రెండవ నిరాకరణాన్ని గూర్చి మొదట, మొదటి నిరాకరణాన్ని గూర్చి తరువాత విచారిస్తాను. కారణం, ఛందస్సులో మొదట పాదం, ఆ తరువాత గణం.
పాదబద్ధతను నిరాకరిస్తూ రామారావుగారు కొన్ని ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించినారు. ‘పాదం అక్షర సముదాయం కాదు. గణ సముదాయం. అంటే పాదానికి అంతర్నిర్మాణం ఉన్నదన్న మాట’ అన్నారు. కాని, విచారిస్తే, పాదం అక్షర సముదాయమే తప్ప గణ సముదాయం కాదు. కొన్ని పద్యాల్లో అక్షరాల సంఖ్య పాదప్రమాణం కాగా, మరి కొన్నింటిలో ఆ అక్షరసంఖ్య మాత్రా సంఖ్యాదృష్టి చేత హెచ్చుతగ్గులయితున్నది. నిజానికి, ఛందస్సులో గణపద్ధతి మొదట పింగళుడు ప్రవేశపెట్టింది. ఆయన పద్ధతి ప్రకారం మూడక్షరాల గుంపు ఒక ‘గణం’. [నగణం (లగ), హగణం (గల) అని రెండక్షరాల గుంపులను గణం అనటం ఔపచారికంగా మాత్రమే.] పద్య లక్షణం చెప్పటంలో సౌలభ్యం కోసంగాను తన ధోరణిలో పింగళుడు ఉద్దేశించింది మాత్రమే, ఈ ‘గణ’ పద్ధతి. శాస్త్రకర్తలు ఈ విధంగా లక్షణకథనంలో సౌలభ్యం కోసం కొన్ని పద్ధతుల్ని ఏర్పాటు చేసుకుని సంకేతించటం పరిపాటే. పింగళునికి పూర్వులైన భరతాదుల్లో ఈ ‘గణ’ పద్ధతి లేదు. ఇన్నిన్నేసి అక్షరాలు గల పాదాల్లో ఫలానా ఫలానా సంఖ్య గల అక్షరాలు లఘువులనీ, లేదా గురువులనీ చెప్పటం వారి పద్ధతి. పరిశేషన్యాయంగా మిగిలినవి గురువులో, లేక లఘువులో అయితాయని అనుకోవాలి.
మరొకటి. పింగళుని గణ పద్ధతికి భిన్నంగా రత్నమంజూషకర్తా, జనాశ్రయుడూ తమకనుకూలమనుకున్న పద్ధతిలో గణనిర్మాణం చేసుకున్నారు. పింగళుడు ఎనిమిది గణాలను చెప్పగా, రత్నమంజూషకర్త పన్నెండు, జనాశ్రయుడు పద్ధెనిమిది గణాలను చెప్పటం జరిగింది. పైగా వారి గణనిర్మాణంలో మూడక్షరాల సంఖ్య పరిమితం కాదు. రెండు నుంచి ఆరు దాకా అక్షరాలు ఆ గణాల్లో ఉండవచ్చు (సంపత్కుమార, 1962). పింగళుడి గణాలు ఎనిమిది కావటం, ప్రతి గణంలోనూ మూడేసి అక్షరాలు మాత్రమే నియతంగా ఉండటానికి కారణం, ఆయన మూడక్షరాల ఛందాన్ని ప్రస్తారం చేసి దానివల్ల ఏర్పడ్డ ఎనిమిది రకాల పద్యపాదాలనూ ‘గణాలు’ గా స్వీకరించటమే. మూడవ ఛందాన్ని (మధ్యాచ్ఛందం) ప్రస్తారించటం వల్ల ఎనిమిది రకాల పాదాలు మాత్రమే ఏర్పడుతయి. రత్నమంజూషకర్త, జనాశ్రయుడు ఈ ప్రస్తార పద్ధతిని కాక తమ స్వసంకేతికమయిన అనుకూలాన్ని అనుసరించి మాత్రమే గణనిర్మాణం చేయటం వల్ల వాటిలో సమత్వం కొరవడింది. ఆ కారణంగా క్లిష్టత్వం అధికమయి వారి గణనిర్మాణానికి ప్రాధాన్యం, ప్రాచుర్యం కలుగలేదు. పింగళుడి పద్ధతికే ప్రాచుర్యం లభించింది.
ఏదెట్లాగయినా, గణాలనేవి లక్షణకర్తలు లక్షణకథనంలో సౌలభ్యానికి ఏర్పరుచుకున్నవే తప్ప పద్యపాదానికి నిసర్గం కావు. ఒకవేళ పాదనిర్మాణంలో గణాలే ప్రధానమయితే, అయిదు గణాల ఛందం, ఆరు గణాల ఛందం… ఇత్యాదిగా గణసంఖ్యలో చెప్పవలసి ఉండేది. కాని, ఆ విధంగా ఏ లాక్షణికుడూ చెప్పలేదు. ఒక అక్షరం నుంచి ఇరవయారక్షరాలదాకా ఒక పాదంలో అక్షరాలుండవచ్చు. ఎన్ని అక్షరాలుంటే ఆ పాదం అన్నవ ఛందానికి చెందుతుంది. పాదానికి పదక్షరాలుంటే అది పదవ ఛందానికి చెందిందన్నమాట. (అంతకన్నా ఎక్కువ అక్షరాలుంటే, అవి వేరే వృత్తాలు.) అన్ని ఛందాల్లోని పద్యపాదాలూ గణాలతో నిశ్శేషంగా విభక్తం కావు. అందుకనే విభక్తం కాని కొన్నిచోట్ల, గణ పద్ధతిలో విభజిస్తూపోగా పాదాంతాన మిగిలే ఒకటి రెండక్షరాల ఉనికినిగూర్చి ప్రత్యేకంగా (ఉదా: మ-స-జ-స-త-త-గ) చెప్పడం జరిగింది.
మరొకటి. పద్యపాదాల్లోని గురులఘుక్రమం ‘ప్రస్తారం’ ద్వారా నిర్ధారిత మయితుంది. కాగా, పద్యపాద స్వరూపాన్ని అక్షరసంఖ్య, దాన్ని బట్టి జరిగే ‘ప్రస్తార’ పద్ధతీ నిరూపిస్తున్నయి తప్ప, గణాలు కాదు. మాత్రా సంఖ్య ప్రాధాన్యం గల పద్యాల్లోనూ ఇంతే, ఆ పద్యపాదాల్లోనూ గణపద్ధతిని ఉపయోగించటం లక్షణకథన సౌలభ్యం కోసమూ; ఎన్ని మాత్రల వద్ద పదం, పదాంశం విరిగితే పద్యం నడక బాగుంటుందో చెప్పటనికి ఉద్దేశించీ, మాత్రమే. ఈ నడక కోసమే చతుర్మాత్రా గణమయిన జగణాన్ని, చతుర్మాత్రా గణాల్ని ఉపయోగించవలసిన సందర్భాల్లో కొన్నిచోట్ల లక్షణ కర్తలు నిరాకరించటం జరిగింది. (అయినా, కవులు స్వేచ్ఛగా ఈ నిరాకరణాన్ని పాటించకపోవటం చాలా చోట్ల గమనించవచ్చు.) మరికొన్ని చోట్ల మాత్రా గణాల్ని వదిలి కేవలం మాత్రా సంఖ్యతో పాదలక్షణం చెప్పటం గూడా ఛందోగ్రంథాల్లో కనిపించే విషయమే. ఇవన్నీ గమనిస్తే పాదం గణ సముదాయం కాదనీ, అక్షర సముదాయమేననీ స్పష్టమయితుంది. కాగా గణాల దృష్ట్యా పాదానికి అంతర్నిర్మాణమంటూ ఏదీ ఉండదు. నిజానికి పద్యపాదాల్లో గణ పరిమితికి లొంగకుండా పదాలూ, పదాంశాలూ మించిపోవటమే అత్యధికంగా మనం చూస్తూ ఉంటాం. ఆయా అంశాలను బట్టి పాదం అక్షర సముదాయమేననీ అంగీకరించక తప్పదు.
ఇంతవరకూ తెలుగులో వచ్చిన పద్య పాదాలన్నిటినీ రాతతోగాని, అచ్చుతోగానీ పనిలేకుండా కనుక్కునే వీలుంది. ఏ పద్యాన్నయినా పాదవిభజన చేయకుండా పూర్వీకులు తాళపత్ర గ్రంథాల్లో ఒకే వరుసలో రాసేవాళ్ళు. అయినా, ఛందస్సు తెలిసిన వారికి వాటిని మళ్ళీ పాదబద్ధంగా రాయటం కష్టం కాదు. పాదవిభజన లేకుండా అచ్చువేసిన (లేక రాసిన) వచన పద్యానికి ఈ వచన పద్య లక్షణకర్తలు కవ్యుద్దిష్టమైన పాదవిభజన చేయగలరా? కవ్యుద్దిష్టం కాకపోతే పోనీ, ఏ ఇద్దరు లక్షణకర్తలయినా ఒకే రకపు పాదవిభజన చేయగలరా? – అని రామారావుగారి ప్రశ్న.
ఒక విధంగా చూస్తే ఇది నిజమేననిపిస్తుంది. ఒకసారి కుందుర్తి కూడా నన్ను దాదాపుగా ఇట్లాగే ప్రశ్నించినారు. వచన పద్య లక్షణ సమాకలనంలో ఇట్లాంటి ప్రశ్నల్ని గూర్చి నాతో నేనే కాకుండా, మరి కొంతమంది మిత్రుల్తోనూ చర్చించి ఒక సమాధానానికి వచ్చినాను. అదే ముందు వివరిస్తాను.
అయితే, ఈ రామారావుగారి ప్రశ్నలో రెండంశాలున్నయి. ఒకటి: పూర్వులు పాద విభజన లేకుండా రాసినా, ఛందస్సు తెలిసినవారు పాద విభజన చేసుకోడానికి వీలుండేది. రెండు: కవ్యుద్దిష్టంగానైనా, కాకపోయినా, వచన పద్యాన్ని పై విధంగా రాస్తే లక్షణకర్తలు గాని, ఏ ఇద్దరు లక్షణకర్తలు గాని, పాద విభజన చేయగలరా? ఒకే విధంగా చేయగలరా? వీటిని వరుసగా పరిశీలిద్దాం. పూర్వపు పద్యాల్లో పాదవిభజనకు ఉండిన వీలుకి కారణం అక్షర సంఖ్యతోనో, మాత్రా సంఖ్యతోనో, గణపద్ధతి ద్వారానో పరిచితమయిన ధోరణిలో ఆ పాదాలు నియమితం కావటం. అయితే, ఈ క్రింది పద్యపాదం, ఉదాహరణకి చూడండి –
మధురమధురమైన మామిడిపండ్లను
పంచియిచ్చు జనుడె మంచివాడు
ఇది ఫలాన పద్యం అని చెప్పకుండా, ఇది ఏ పద్యపాదం అని అడిగితే రెండురకాలుగా చెప్పటానికి వీలున్నది. ఇది ఆటవెలది రెండు పాదాలూ కావచ్చు. సీసపద్యంలో ఒక పాదమూ కావచ్చు. మొదటి పంక్తిని 3సూర్య, 2 ఇంద్ర గణాలుగా విభజిస్తే, ఆటవెలది. అట్లా కాకుండా రెండు పంక్తుల్నీ కలిపి ఆరింద్రగణాలు, రెండు సూర్యగణాలుగా విభజిస్తే సీసపాదమూ అవుతుంది. రెండువిధాలా విభజించేందుకు అనువుగా పై పంక్తులున్నయి. ఇదే పద్ధతిలో మరికొన్ని పంక్తులు వరుసగా ఉండేట్టయితే, ఇది ఫలానా పద్యం అని కవి చెప్పకుండా, కవి ఏ పద్యంగా ఉద్దేశించినాడో చెప్పటం కుదరదు. పాదాన్ని పట్టియ్యటంలో ఒకానొక సాధనమయిన (తెలుగులో మాత్రమే) ప్రాసనియతి ఈ రెండు పాద్యాలకూ లేదు. యతి రెండింటా అమరేట్టుగానే ఉంటుంది. అయితే, ఇట్లాంటి స్థితి చాలా అరుదు. అయినా, ఒక ఉదాహరణంగానే ఇక్కడ ప్రదర్శింపబడింది. మరొక అంశం ఏమిటంటే, తాళపత్ర గ్రంథాల్లో ఒకే వరుసలో పద్యాలు రాస్తూ పోయినా, చాలా వరకు పాదాంతంలో ఒక నిలువుగీత (|), పద్యాంతంలో రెండు నిలువుగీతలు (||) గీసి పాద, పద్యాంతాలను సూచించటం జరుగుతుంది.
ఇదిట్లా ఉండగా, అక్షర లేక గణపద్ధతి నియతంగా ఉన్నప్పుడు, అనుభూయమానమయితున్నప్పుడు, పాద విభజన లేకుండా రాసినా పాద విభజన చేయవచ్చు. అక్కడ కవ్యుద్దిష్టంగా పాద విభజన చేయడమన్న ప్రశ్నే లేదు. ఉదాహరణకు ఉత్పలమాల పద్యం ఉన్నదంటే ఒక కవి ఒక విధంగా మరో కవి మరో విధంగా తమ ఉద్దేశ్యాల ననుసరించి విభజించటం జరుగనే జరుగదు. వారి ఇష్టనిష్టాల ప్రసక్తి లేనే లేదు. ఆ పద్యపు చట్రం నియతం. పాదాక్షర మాత్రా సంఖ్య నియతం. (కొన్నిచోట్ల మాత్రా సంఖ్యలో వచ్చే తేడాలు గణపద్ధతి ద్వారా పరిష్కృతమయితయి.) ఆ నియతి ననుసరించి పదాలను కూర్చుకోవటమే కవి పని. అందువల్ల అక్షర, మాత్రాదుల నియతి ఉన్నచోట పాద విభజనకు కవి ప్రయత్నించవలసిన అవసరం లేదు. ఇక పోతే, ఈ విధమయిన నియమం లేనిచోట కవి తనంతట తానే పాదాలను విభజించక తప్పదు. అందువల్ల, అక్షర మాత్రాదుల నియతి లేని వచన పద్యం విషయంలో ‘పాద విభజన… లేకుండా రాసిన’ ఇత్యాది ప్రశ్నే ఉత్పన్నం కాదు. వచన పద్యాన్ని కూడా పాద విభజన చేస్తూ రాయవలసిందే. తాళపత్ర గ్రంథాల్లో, మొదటినాళ్ళలో అచ్చయిన కొన్ని గ్రంథాల్లోనూ పాదవిభజన లేకుండా ఒకే వరుసలో పద్యాలుండటం చూస్తాం గాని, ఈనాటి గ్రంథాల్లో చూడటం లేదు. పాద విభజన విషయంలో పాఠకుడు చీకాకు పడగూడదనే కదా, ఈనాడు పాద విభజన పూర్వకంగా అచ్చువేయటం! కాబట్టి, ఈనాటి వచన పద్యాన్ని పాద విభజన లేకుండా రాయటం కానీ, అచ్చు వేయటం కానీ కుదరదు. పలుచోట్ల పత్రికల్లోనూ, గ్రంథాల్లోనూ, వ్యాసాల్లోనూ వచన పద్యాల్ని ఉదహరిస్తున్న సందర్భాల్లో నిండు పంక్తులుగా రాస్తూ, పాదాంతాల్ని సూచించే విధంగా నిలువు గీతలు (కొన్ని చోట్ల ఏటవాలు గీతలు) గీయటం జరుగుతూనే ఉన్నది. పాద విభజన, విభజన సూచన కూడా లేకుండా రాస్తే, ఆ రాసిన వ్యక్తి దాన్ని వచన పద్యంగా ఉద్దేశిస్తున్నాడా లేదా అన్నది సందేహించాల్సిన విషయమే.
ఇక, ఏ లక్షణకర్త అయినా కవ్యుద్దిష్టంగా పాద విభజన చేస్తాడా? ఏ ఇద్దరు లక్షణకర్తలయినా ఒకే విధంగా పాదవిభజన చేయగలరా? అని విచారిస్తే, ‘కవ్యుద్దిష్టంగా పాద విభజన ‘ అంటే పాద విభజనకు కవి ఉద్దేశించింది ప్రధానమనీ, ఆయన ఉద్దేశించిన రీతి మీద పాద విభజన ఆధారపడి ఉంటుందనీ అనిపిస్తున్నది. అట్లాగే అయితే, కవ్యుద్దిష్టంగా మరొకరు పాద విభజన చేయనవసరం లేదు. కవే చేస్తాడు. పేచీ లేదు. కాకపోతే, తన ఉద్దేశ్యం ప్రకారం పాద విభజన చేసి వచన పద్యం రాసుకొని, పాద విభజన లేకుండా నిండు పంక్తులుగా మళ్ళీ రాసి లక్షణకర్త ముందుంచి పరీక్ష పెడితే, అప్పుడు ఆలోచించవలసి వస్తుంది. పాద విభజనకు లక్షణకర్త ఏదైనా పాద విభాజక సూత్రాన్ని ఏర్పరచుకుంటే, దాన్ని బట్టి ఆ పంక్తులను పాదాలుగా విభజిస్తాడు. అప్పుడు – ఏర్పడిన పాద విభాజక సూత్రంగా ఉంటుంది కాబట్టి – కవ్యుద్దిష్టతకు ప్రాధాన్యం లేదు. కాగా, విభాజక సూత్ర ప్రామాణ్యానికి ప్రాధాన్యం, విభాజక సూత్రం అంగీకృతమయితే, పాద విభజన దాన్ని అంగీకరించే జరగవలసి ఉంటుంది. మ-స-జ-స-త-త-గ అన్న క్రమాన్ని ఒప్పుకున్నాక, దాన్నిబట్టే శార్దూల విక్రీడిత పద్య పాద విభజన జరిగినట్టు. కవ్యుద్దిష్టత కక్కడ ప్రాధాన్యం లేనట్టు. ఇక పోతే, ఏ ఇద్దరు లక్షణ కర్తలయినా ఒకే విధంగా పాద విభజన చేయటానికి వీలున్నదా? అంటే లేదనే వీలు లేదు. ఆ ఇద్దరు లాక్షణికులు పాద విభజన సూత్రాన్ని సమంగా ఉపయోగిస్తే, ఒకే విధంగా పాద విభజన జరిగే వీలుంది. ఒకప్పుడు సూత్రోపయోగంలో తేడా రావచ్చు. ఆ రావటం ఎట్లాంటిదంటే, వెనుక “మధుర మధురమైన…” అన్న చోట ఒక లక్షణకర్త ఆటవెలదిగా విభజిస్తే, మరొకరు సీసపాదంగా విభజించటంలో వచ్చినటువంటిది. సాంప్రదాయిక ఛందస్సుల్లోనూ సమాన ప్రమాణాల్ని అనుసరించటం వల్లనే ఆ పాద విభజనలో సమానత్వం కనిపిస్తుంది. లేని చోట లేదు. అందుకని, ఎక్కడయినా సరే, ప్రమాణ సమానత్వం అవసరం.
ఇంతకూ, వచన పద్యపాద విభజనకు సూత్రమేమిటి?
కీ. శే. బాలగంగాధర తిలక్ రాసిన ఒక భాగాన్ని ఉదహరించి పాదవిభజనకు ఆధారాలేవీ లేనట్లుగానే రామారావు రాసినారు. ఇదివరకటి నా వ్యాసాల్లో పాద విభజనకు ఒక సూత్రాన్ని ప్రతిపాదించటం జరిగింది. అది భావాన్ని పురస్కరించుకొని చేసింది. మొదట్లో ఈ ప్రతిపాదన స్థూలంగా చేయటం జరిగింది. కాని, అప్పటికి ఈ ప్రతిపాదనకు ఆధార ప్రమాణం లభించలేదు. తరువాత పరిశీలిస్తే ఋక్కుల్లో పాద విభజనకు సంబంధించిన సూత్రం ఒకటి కనిపించింది.
‘తేషాంఋక్ యత్రార్థవశేన పాదవ్యవస్థా’ (2.1.35) అని జైమినీయ మీమాంసా సూత్రం. ఋక్కుల్లో పాదవ్యవస్థ అర్థాన్ని బట్టి ఉంటుందని ఆ సూత్రం స్పష్టపరుస్తున్నది. దాన్ని అనుసరించి, అక్కడి అర్థాన్ని బట్టి కాగా, వచన పద్య విషయంలో భావాన్ని బట్టి పాద వ్యవస్థ అన్నాను. అర్థం, భావం అన్న మాటలే తేడా. కాబట్టి భావాన్ని అనుసరించి వచన పద్యంలో పాద విభజన జరగటానికి అభ్యంతరం ఏమీ ఉండనక్కర లేదు.
భావాన్ని బట్టి వచన పద్య పాద విభజన చేయటమంటే, అది రెండు రకాలుగా ఉంటుంది. ఒకప్పుడు భావాంశాలను బట్టి పూర్తి కావచ్చు. అంటే భావాన్నీ, భావాంశాన్నీ బట్టి వచనపద్యంలో పాద విభజన జరుగుతుంది. ఉదాహరణకు ‘అనలతోరణం’ అన్న శీర్షిక లోని ఒక వచన పద్యం –
ప్రాణాలు బిగబట్టుకొని
సాగేరు ప్రయాణీకులు
నాయకుడు తిరిగి వస్తాడనీ
తుఫాను శమిస్తుందనీ
నదిపొంగు తగ్గేననీ
ఆశతో అహరహమూ!
దేనికైనా ఉద్ధృతి ఎంతసేపు?
దానికి వ్యతిరిక్తం తప్పదా పైనా.
– మాదిరాజు రంగారావు, యుగసంకేతం.
ఇందులో మొదటి ఆరు పాదాలూ భావాంశాలను బట్టి విభక్తమయినయి, చివరి రెండు పాదాలూ భావాన్ని బట్టి. అందులో ప్రయాణీకులు సాగటం ప్రధాన భావం. ఆ సాగటం ప్రాణాలు బిగపట్టుకొని. అంతేకాదు, ఆశతో అహరహమూ సాగుతున్నది. అందువల్ల, 1, 6 పాదాలు భావాంశాలతో ఏర్పడ్డయి. కాగా, ఆరవ పాదంలోని ‘ఆశ’ కు సంబంధించినయి 3, 4, 6 పాదాలు. చివరి రెండూ స్పష్టమే.
ఈ విధంగా వచన పద్యాన్ని పరిశీలించుకుంటూ పోతే పాద విభజనను నిర్థారించటం కష్టమేమీ కాదు. రామారావు గారుదహరించిన కె. వి. రమణారెడ్డిగారి ‘బాధాగాధము’ అన్న ఈ కింది వచన పద్యంలో –
పాపికొండలకావల నిజాం గజాంకుశం కాలేదూ నీవు?
కోనసీమలో, లంకసీమలో పాపాల దీపాల నార్పలేదూ
నీవు? విచ్చుకత్తుల బోను రెక్కలు త్రుంచలేదూ
రాత్రిని కప్పుకొని, ధాత్రిని మప్పుకొని చరించలేదూ నీవు?
ఈ పదాలు భావాంశాలను బట్టి గాక భావాలను బట్టి విడదీయబడినయి. అయితే, ఇక్కడ ఒక అంశం. మూడోపాదం మొదట్లో ఉన్న నీవు? (ప్రశ్న చిహ్నంతో సహా) తొలగనైనా తొలగాలె. లేదా, రెండో పాదం చివర్నయినా చేరాలె. అట్లా జరక్కుండా పైన ఉన్నట్టే కవ్యుద్దిష్టమయిన పాద విభజన అంటే, మూడో పాదం మొదట ‘నీవు?’ ఉండటంలోని సామంజస్యం వివరించబడవలసి ఉంటుంది. వచన పద్య పాద విభాజక సూత్రం దృష్ట్యా నిజానికి ఆ నీవు? (సుప్రశ్న చిహ్నంగా) రెండో పాదం చివర ఉండవల్సి ఉంటుంది. ‘వచన పద్యములను కూడ అతిక్రమించి, ఆవేశస్ఫోరకంగా, అంతర్లయాన్వితంగా సాగిన ఈ కావ్యం కావ్యోపన్యాస మనదగినది’ అని రమణారెడ్డి అంటే, నాకభ్యంతరం లేదు (వచన పద్యములను కూడా అతిక్రమించటమంటే, పైన చూపబడ్డ అతిక్రమమేనా?)అయితే, ఇక్కడ కావ్యం గాని, ఉపన్యాసం గాని, కావ్యోపన్యాసం గానీ ప్రస్తుతం కాదు. (ఇవేవీ పద్య స్వభావాన్ని బోధించవు.) అది వచన పద్యం కాబట్టి దాని స్వరూపం ప్రధానం. నాలుగు పాదాలలో ఈ రచన కనిపిస్తున్నప్పుడు అచ్చులో కూడా పాదబద్ధత పాటించలేదని రామారావు గారంటున్నరు. మరిదెట్లా? ఈ అచ్చులో కనిపించే పాద స్వరూపం – కొంచెం లోపం ఉండవచ్చు గాక – చేసిందెవరు? ఇక వచన పద్యాన్ని రాస్తూ, ఆ రాసిందాన్ని వచన పద్యం అనదలచుకోలేదు అని ఎవరయినా అంటే, అనదలచుకోవటం వారి స్వంత విషయం. ఆ ప్రవృత్తిని గూర్చి ఎవరినీ ఎవరూ ఏమీ అనలేం. అనదలచుకోనంత మాత్రాన, అది అయ్యేదయితే, కాకుండా పోదు.
తిలక్ రాసిన ‘రాత్రివేళ’ అనే ఖండికలో ఒక భాగం – రామారావుగా రుదాహరించిన రీతిలో ఈ విధంగా ఉంది.
నిర్జనస్థలం, ఎవ్వరూ లేరు, చుట్టూ పరచుకున్న మైదానపు
నగ్నదేహాన్ని స్పృశించబోయే నిచుల శాఖాగ్రపు వ్యగ్రపు
తొందర నిశ్శబ్దం మెల్లగా అడుగులు వేస్తూ నడుస్తోంది. ఆకాశం
మీద ఒక చుక్క మరో నక్షత్రంతో మాట్లాడే మాట మనసుకి
వినిపిస్తోంది.
ఇది అయిదు పంక్తులుగా కనిపిస్తున్నది. ‘పాదబద్ధతకి లొంగనివి కూడా ఆధునిక కవిత్వంలో కొన్ని ఉన్నై’ అంటూ, పై భాగాన్ని ఉదాహరించి రామారావుగారు – ‘ఇందులో పాద విభజనకు ఆధారాలేమిటో నాకర్థం కావటం లేదు. ముఖ్యంగా మూడో పాదం ఆకాశంతో అంతం కావటానికి హేతువు ఎవరయినా చెప్తే సంతోషిస్తా’ నన్నారు. పాదబద్ధతకు లొంగనివి కూడా ఆధునిక కవిత్వంలో ఉన్నయ్యంటే, ఆ లొంగకపోవటం ఎట్లాంటిది? పాదబద్ధతకు లొంగకపోవటమన్నమాట, వచన పద్యమయి పాదబద్ధతకు లొంగకపోతే అది దోషమే. ఆధునిక కవిత్వం లోని ఆ ‘కొన్ని’ వచన పద్యాలయితేనే మనం ఇక్కడ ఆలోచించవలసి ఉంటుంది. ఆ కొన్ని, వచన పద్యం దృష్ట్యా ఛందోదోష జుష్టాలనే అనవలసి ఉంటుంది. ఉదాహృతమయిన తిలక్ రచనా భాగాన్ని రామారావుగారు ‘వచన పద్యం’గా భావించినారనీ, అందుకనే ప్రస్తుత సందర్భంలో ఉదాహరించినారనీ అనుకుంటాను. అట్లా భావించినారు కాబట్టే ‘ఇందులో పాదవిభజనకు ఆధారాలేమిటో నా కర్థం కావటం లే’దన్నారు. మూడో పాదం ‘ఆకాశం’తో అంతం కావడానికి హేతువుని ప్రశ్నిస్తున్నారంటే, పై భాగంలో పాద విభజన జరిగిందనీ, కానీ మూడో పాదం చివర ఆకాశం అనే పదం ఉండటం సహేతుకం కాదనీ వారు భావిస్తున్నట్టు స్పష్టమయితుంది. రామారావుగారు ఒక్క ‘ఆకాశం’ విషయమే ప్రస్తావించినారు గానీ, పై భాగం, అది ఉదాహృత రూపంలోనే ఉన్న స్థితిలో, మూడో పాదం మొదట ‘తొందర’ ఉండటం, నాల్గో పాదం చివర ‘మనసుకి’ ఉండటమూ, ఇంకా మరికొన్ని కొట్టొచ్చినట్టు కనిపించే దోషాలు. వీటన్నిటిని బట్టి చూస్తే, ఉన్న స్థితిలో ఉదాహృతమయిన భాగం పాద విభజన దృష్ట్యా లోపయుతమైన వచన పద్యమని చెప్పవలసి వస్తున్నది. ఈ దోషాలు రచయిత వల్లే జరిగినయో, అచ్చు వేయటంలో పొరపాటున జరిగినయో చెప్పలేము. వచనపద్యపాద విభాజకసూత్రాన్ని అనువర్తింపజేసి పాద విభజన చేస్తే పై ఉదాహృత భాగం ఈ క్రింది విధంగా ఉండాలె.
నిర్జన స్థలం
ఎవ్వరూ లేరు
చుట్టూ పరచుకున్న మైదానపు నగ్న దేహాన్ని
స్పృశించబోయే నిచుల శాఖాగ్రపు వ్యగ్రపు తొందర
నిశ్శబ్దం మెల్లగా అడుగులు వేస్తూ నడుస్తోంది.
ఆకాశం మీద ఒక చుక్క మరో నక్షత్రంతో మాట్లాడే మాట
మనసుకి వినిపిస్తోంది.
ఇట్లా కాకుండా మరొకరు ఇంకో విధంగా విభజించటం జరిగితే, దానికి కారణం భావాంశాల్ని బట్టి ఇంకా కొంచెం ఎక్కువ పాదాలుగా విభజించుకోవాలనుకోవటం కావచ్చు. ఉదాహృతమయిన స్థితిలో కొన్ని చోట్ల ‘కామా’ లున్నాయి. అక్కడికి పాదాల్ని విరగాలని కవి ఉద్దేశించినట్లు కనిపిస్తుంది. కొన్ని చోట్ల అవి లోపించినయి. అందువల్ల ఆ పాద విభజన అస్తవ్యస్తంగా జరిగింది. అయితే ఈ అస్తవ్యస్తత కవి రాసినప్పుడే వచ్చిందా, అచ్చు వేయటంలో వచ్చిందా – చెప్పటం కష్టం. ఇదిట్లా ఉండగా, ఇద్దరు లక్షణకర్తలు ఒక వచన పద్య పాదాల్ని విభజించటంలో భావాన్నీ, లేదా భావాంశాల్నీ, కొన్ని చోట్ల ఉభయాల్నీ ఆధారించుకోవటం వల్లనే తేడా రావచ్చు గాని, పాదాలుగా విభజించటం ఉభయత్రా సమానమే.
సాంప్రదాయిక ఛందస్సుల్లో అక్షరాలు, మాత్రల నియతి కన్నా ఆధిక్యం, లేదా లోపం వల్లా, యతి స్థానాల దాటివేతల వల్లా, ఇంకా రకరకాలుగా ఏర్పడ్డ దోషాలను ఛందోదోషాలుగా చెప్పటం ప్రసిద్ధమే. అట్లాగే వచన పద్య విషయంలో కూడా పాద విభజన సరిగ్గా జరక్కపోతే పాద భంగమన్న ఛందో దోషంగా పరిగణించవలసి ఉంటుంది.
వచన పద్యానికి లక్షణ సమాకలనం చేస్తూ హనుమకొండ (వరంగల్) లో మిత్రమండలి వార్షికోత్సవాల సందర్భాన (1965) ‘వచన పద్యం’ గూర్చి ఒక వ్యాసం చదివినాను. అందులోనే ఈ పాదవిభాజకసూత్రాన్ని మొదటిసారిగా ప్రతిపాదించటం జరిగింది. ఆ సమావేశాలకు వచ్చివున్న తిలక్ నా ప్రతిపాదనను హర్షించి, పాద విభజన విషయంలో వచన పద్య ప్రయోక్తలు నిర్దిష్టమయిన దృక్పథంతో రచన సాగించాలన్న నాతో ఏకీభవించినారు. ఆ సమావేశాలకు వచ్చి ఉండిన కుందుర్తి కూడా నా ప్రతిపాదనలను పలుచోట్ల బలపరుస్తూ ఉండినారు.
ఈ సమావేశాల్లో తిలక్, కుందుర్తుల విషయం చెప్పటమెందుకంటే, నేను వచన పద్య పాద విభజన విషయికంగా ప్రతిపాదించిన అంశం వచన పద్య ప్రయోక్త లందరిలోనూ స్పష్టంగానో, అస్పష్టంగానో ఉన్నదని చెప్పటానికి ఒక ఉదాహరణ మాత్రమే. కాని, తొందరపాటు వల్లనో, అశ్రద్ధధానత కరణంగానో, అచ్చు కారణంగానో, అతః పూర్వం నిర్దిష్ట సూత్రం లేకపోవటం చేతనో… ఏదైనా కావచ్చు. మరేదయినా కావచ్చు. లోపాలు జరుగుతూనే ఉన్నయి. వాటిని లోపాలుగానే భావించి సరిచేసుకుంటూ – అవసరమయితేనే – పోవలసిందే తప్ప, పాద విభజనే లేదనటం మాత్రం కుదరదు.
వచన పద్యపు చారిత్రక పరిమాణాన్ని గూర్చి రామారావుగారు ప్రస్తావించనన్నారు. కాబట్టీ, నేను కూడా ప్రస్తావించ నక్కరలేదు (దీని చర్చ సంపత్కుమార,1967 లో ఉంది). కాని, ఒక్క అంశం మాత్రం ఇక్కడ అవసరంగా చెప్పవలసి వస్తున్నది. అదేమిటంటే – వచన పద్య ప్రయోక్త లందరూ వచన పద్యాన్ని ఒక ఛందోరూపంగానే భావిస్తున్నారు తప్ప, కేవలం వచనంగానో, లేక గద్యంగానో భావించటం లేదు. అట్లా భావించివుంటే పాదాలుగా విభజించి – ఆ విభజన రీతిలో కొన్ని లోపాలు కొన్నిచోట్ల ఉండి ఉన్నా ఉండవచ్చు గాక – రాయటమనేదే జరిగి ఉండదు. పేరాలుగానే రాయటం జరిగి ఉండేది. ఇది ఇట్లా ఉండగా, వచన పద్యం ఛందః పరిణామ మార్గంగా సాహిత్యరంగం మీదికి అవతరించింది తప్ప, వచన లేదా గద్య పరిణామక్రమంలో రాలేదు. (ఇక్కడ, వచన గద్య పదాలు రెండింటినీ పేర్కొనటం స్పష్టత కోసం. ఆ రెండింటికి మధ్య ఉన్న అత్యల్పమయిన తేడాను, ఆ రెండు పదాల వ్యవహార రీతిని పాటించటం కోసం.) ఇది ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం. దీన్ని గమనిస్తే, వచన పద్యం యొక్క పాద విభజనకూ, అది ‘పద్యం’ కావటానికీ ఒక చారిత్రిక పరిణామ రూప కారణం స్పష్టమయితుంది.
మరి, పాదబద్ధత పద్యానికి, గద్యానికీ ప్రధానమయిన భేదమనీ, పాదసంఖ్యానియమం అంత ప్రధానం కాదనీ, విషమపాదాలు కూడా అంగీకార్యాలేననీ సంపత్కుమారతోబాటు నేను కూడా అంగీకరిస్తా’ నన్నారు రామారావుగారు. వచన పద్యానికున్న పాదబద్ధతనూ, పాదవిభాజకసూత్రాన్నీ పైన నిరూపించటం జరిగింది కాబట్టి, వచన పద్యాన్ని పద్యంగా స్వీకరించక తప్పదనేది స్పష్టం. ఇక పాద సంఖ్య, విషమ పాదాల విషయంలో రామారావుగారు నాతో ఏకీభవిస్తూనే ఉన్నారు కాబట్టి, ఆ అంశాలను గూర్చి పేచీయే లేదు.
ఇక, నేను ప్రతిపాదించిన భావగణాలను గూర్చి వివరిస్తాను.
వచన పద్య పాద విభజనకు అక్షర, మాత్రాదుల సంఖ్య కాక భావాన్నీ, భావాంశాలనూ ఆధారంగా తీసుకున్న విషయం ముందే వివరింపబడింది. కాగా, వచన పద్య పాదం యొక్క అంతర్విభజనక్కూడా అదే భావ, భావాంశాలు మౌలికంగా స్వీకరించబడ్డయి. సాంప్రదాయిక ఛందస్సుల్లో ‘గణం’ అన్న పదం విస్తృతంగా పాదం యొక్క అంతర్విభజన విషయంలో ఉపయుక్తమయితున్న కారణంగా, ఇక్కడ కూడా ఆ గణం అన్న పదాన్ని – అక్కడి అర్థంలో కాక – ఔపచారికంగా స్వీకరించి ‘భావగణం’ అన్నాను. ఈ ‘భావగణం’ స్వరూపాన్ని సులభంగా స్పష్టీకరించటానికి పుర్వపు నా వ్యాసాల్లో –
ప్రతిమాటకీ శక్తి ఉంది పదును ఉంది
ప్రతిమాటకీ అర్థం ఉంది ఔచిత్యం ఉంది
అన్న తిలక్ రచనలోని పాదాల్ని ఉదహరించటం జరిగింది. వాటినే మళ్ళీ ఉదహరించి రామారావుగారు – ఇక్కడ కి-విభక్తి బంధం ఒక గణం, తరువాత వచ్చిన నామం, క్రియ కలిసి ఒక గణం, ‘శక్తి, పదును, అర్థం, ఔచిత్యం’ అనేవి ఒక రకపు (నామ) గణాలు గానూ, ‘ఉంది’ అనేది ఒక (క్రియా) గణంగానూ ఎందుకు విభజించకూడదు? శక్తి ఉంది అనేది ఒక భావమా, రెండు భావాలా? ‘ప్రతిమాటకీ శక్తి ‘ అనేది ఒక గణం ఎందుకు కాకూడదు? భావాలను వేరు చేసే నిర్దిష్ట సూత్రాలేమిటి? వీటికి objective criteria ఏమైనా ఉన్నయ్యా? కేవలం arbitrary గా చేసే విభజనేనా? ఈ ప్రశ్నల్లో వేటికీ సమాధానాలు దొరకవు అన్నారు.
దొరుకుతవేమో, చూద్దాం.
నేను నా పై ఉదాహృత వచన పద్య పాదాలను విభజించింది క్రియా, నామ గణాలన్న ధోరణిలో కాదు. భావస్ఫూర్తి ననుసరించి. ఈ విభజనలో ఒకప్పుడు పద సముదాయం ఉండవచ్చు. పదబంధం ఉండవచ్చు. ఒకే పదం కూడా ఉండవచ్చు. ‘కి-విభక్తి బంధం ఒక గణం’ అన్నరీతిలో విభజిస్తే కి-విభక్తి బంధం ఉన్న ప్రతిచోటా అది ఒక గణం కావలసి వస్తుంది. కాని, అట్లా కాదు. కాబట్టి, ఆ నామ, క్రియా, విభక్తి పద్ధతి కుదురదు. ‘ప్రతిమాటకీ’ ఒక గణం కావటం అక్కడి రెండు పదాలను కలిపి అవ్యవహితంగా ఉచ్చరించినప్పుడు కలిగే భావస్ఫూర్తిని బట్టి. ‘శక్తి’ మొదలైనవి నామాలే అయినా ‘ఉంది’ అనేది క్రియే అయినా, ఆ రెంటి కూర్పు మొత్తాన్ని గణం అనటం, ఆ కూర్పు వల్ల అక్కడ భావస్ఫూర్తి ఉంది కాబట్టే. ఈ స్ఫూర్తిని కవి ఉద్దేశించి ఉండకపోతే ‘ప్రతిమాటకీ శక్తి పదునూ అర్థం ఔచిత్యం ఉన్నాయి’ అని ఉండేవాడు. అట్లా అనకుండా అన్ని ‘ఉంది’లను ప్రయోగించినాడు. ‘ప్రతిమాటకీ’ అన్నదాన్ని రెండుసార్లు (ఉభయపాదాలకూ మొదట్లోనే) ఉపయోగించినాడు. ఎక్కడ ‘ఉంది’ అక్కడి వెనుకటి పదంతోటి కలసి ఉండవల్సిందే తప్ప, విడిపోయే వీలు లేదు. కాబట్టి ‘శక్తి ఉంది’ ఇత్యాదులు ప్రత్యేకంగా భావగణాలని చెప్పటం జరిగింది. ‘శక్తి ఉంది’ ఒక భావమా? రెండు భావాలా? అంటే, నా మటుకు నేను ఒకటే అనుకుంటున్నాను. ‘ప్రతిమాటకీ శక్తి’ ఒక గణం ఎందుక్కాకూడదని ప్రశ్న. ఎందుక్కాకూడదంటే, ‘శక్తి’ తరువాత ‘ఉంది’ అనేది ఉంది కాబట్టి. ఈ ‘శక్తి’ ఆ ‘ఉంది’ తో కలిసి ఉండేదే తప్ప ‘ప్రతిమాటకీ’ తోటి ఉండేది కాదు. ఇకపోతే భావగణాలను వేరు చేసే నిర్దిష్ట సూత్రం భావమే మరి.
ప్రశ్నలకు సమాధానాలు దొరుకవంటూ – “అందుకే, సంపత్కుమార (1967) ‘ఇక్కడి అర్థాన్ని బట్టి గణ విభజన ఆభాస రూపంగా చేయవచ్చు’ నన్నారు. వారి భావగణాలు ఆభాసాలే తప్ప నిర్దిష్టమైనవి కావని వారే అంగీకరిస్తున్నారు. ఈ ఆభాసగణాలు వచన పద్యాన్ని నిర్వచించలేవు కాబట్టి వాటిని నిరాకరించవలసి వస్తున్నది” అన్నారు రామారావుగారు.
ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయవలసి ఉన్నది. సాంప్రదాయిక ఛందస్సుల్లో ‘గణం’ ఒక నిశ్చితార్థంలో ప్రహతమయి ఉంది. మరి, వచన పద్యం విషయంలో ‘గణం’ ఆ నిశ్చితార్థంలో కాక ఔపచారికంగా , కేవలం ఛందోమర్యాదాస్ఫూర్తి కొరకు వాడబడింది. అందువల్ల ఇక్కడి ‘గణం’ ఆభాసమే అయితుంది. కాగా, ఆభాస రూపంగా గణ విభజన చేయవచ్చునన్నాను. ఒక భావం, లేదా భావాంశాన్ని (ఇంకా చిన్న విభాగాన్ని, అవసరమయితేనే) గణం అనటం కుదురదు. సాంప్రదాయిక ఛందస్సుల పాద విభజనలో గణ పద్ధతి ఉంది కాబట్టి, ఆ స్ఫూర్తి కోసం వచన పద్య పాదాంతర్విభజన లోనూ – ఆ విభజనకు ‘భావం’ ఆధారం కాబట్టి – భావగణం అనడం జరిగింది. మరొకటి. భిన్న భిన్న వచన పద్య పాదాల్లో అక్కడ భావాన్ని (భావాంశాన్నీ) స్ఫురింపజేసే పదాల స్థితిని బట్టి భావగణ విభాజకరీతి ఉంటుంది. భావగణ స్వరూపంలో భేదం ఉండవచ్చు గాని, భావగణం మాత్రం ఉంటుంది.
“అసలు విషయమేమిటంటే భావాలని గణాలుగా విభజించటం సాధ్యం కాదనీ, వీరు విభజించింది వ్యాకరణ రూపైకత ఉన్న పద సమూహాలు కాబట్టి, వీటిని న్యాయంగా వ్యాకరణ గణాలు అని అనాల్సి ఉంటుందనీ తేలుతున్నది. వ్యాకరణ గణాలు వాక్య శబ్ద నిర్మాణానికి సంబంధించినవి. వాటి ఆవృత్తి ఒకే శబ్దంతో అయితే పునరుక్తి, భిన్నశబ్దాలయితే అనుప్రాస అవుతుంది. సంపత్కుమార భావగణాలంటున్న వ్యాకరణ గణాలు పద్య బాహ్య స్వరూపానికి అవసరమైన గణాలు కావనీ, వాక్య నిర్మాణానికి అవసరమైన కూర్పు అనీ తేలుతున్నది. పద్య నిర్మాణం వేరు, వాక్య నిర్మాణం వేరు. వేటి సూత్రాలు వాటికే ఉన్నై.” – అన్నారు రామారావుగారు.
సాంప్రదాయిక ఛందస్సుల్లో భావంతో గానీ, అర్థంతో గానీ నిమిత్తం లేకుండా గణ విభజన అక్షర మాత్రా సంఖ్యలను బట్టి జరుగుతుంది. కాబట్టి వాక్య నిర్మాణరీతికి సంబంధించిన అంశాల ప్రసక్తి అక్కడ ఉండదు. మరి వచన పద్యంలో భావాన్ని ప్రధానాధారంగా స్వీకరిస్తున్నాం కాబట్టి, భావస్ఫూర్తిని కలిగించే పదాల కూర్పు, వాక్య నిర్మాణ రీతి – వీటి కిందులో ప్రవేశం ఉండక తప్పదు. అంత మాత్రాన ఇక్కడ భావగణ విభజనకు కేవలం వ్యాకరణ రూపైకతే ప్రధానమని చెప్పటానికి వీలు లేదు. ఆ వ్యాకరణ రూపైకత ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మనం గ్రహించిన ఉదాహరణంలోనే ‘ప్రతిమాటకీ’ అనే దానికీ ‘శక్తి ఉంది’ అనే దానికీ ఉన్న వ్యాకరణ రూపైకత ఏమిటి? ‘వ్యాకరణ రూపైకత’ ఉన్న పద సమూహాలు అంటే ప్రతి పద సమూహంలోని పదాలన్నీ లేదా చివరి పదం, వ్యాకరణ రూపిత పద్ధతిలో సమ ప్రత్యయాంతం కావటమో, లేక నామ క్రియాదులు సమంగా ఉండటమో అయి ఉంటుందనుకుంటున్నాను. ‘శక్తి ఉంది, ‘పదును ఉంది’ అన్న పదసమూహాలు సమక్రియాంతాలు కావటం వల్ల ఈ సమూహాల మధ్య వ్యాకరణ రూపైకత ఉన్నదనటానికి ఆస్కారం ఉన్నది కాని, ‘ప్రతిమాటకీ’ అన్నదానితో వీటికున్న వ్యాకరణ రూపైకత ఏమిటో తెలియదు. నిజానికి నేను చెప్పిన భావగణ విభజనకు రామారావుగారు చెప్పిన వ్యాకరణ రూపైకత ఆధారసూత్రం కానేకాదు. అందువల్ల భావ గణాలూ, వారు ఉన్నాయంటున్న వ్యాకరణ గణాలూ ఒకటి కావటానికి వీలులేదు.
ఇదిట్లా ఉండగా, సాంప్రదాయిక పద్య ఛందస్సులోనూ ఈనాడు మనం పద్యాల్ని చదువుకోనేటప్పుడు ఛందోగణాల్ని బట్టి విభజించి చదువుకోము. పాద విభజన కూడా కచ్చితంగా పాటించం.
ఉదాహరణకి –
సిరికిం జెప్పడు, శంఖచక్రయుగముల్ చేదోయి సంధింపడే, పరి…
అన్న పద్య పాదాన్ని ఆ మత్తేభవిక్రీడిత పద్యానికి నిర్ణీతంగా ఉన్న స-భ-ర-న-మ-య-లగ అన్న గణాలుగా విభజించి ఎవ్వరూ చదువరు. భావస్ఫూర్తి ననుసరించి సిరికిం జెప్పడు | శంఖచక్ర యుగముం | జేదోయి సంధింపడు | ఏ పరివారంబును జీరడు | …ఇత్యాదిగా చదువుకుంటారు. అట్లాగే –
నెలలు నిండిన సతిబాయ నెరి దపింతు
నా, నిలుపులేని రాజ్యాంగ తంత్రము దలంతు
నా, పగలు గొన్న చుట్టాల ననుసరింతు
నా, యొకనిబట్టి దైవ మిట్లాడనేల
– గడియారం వేంకటశేషశాస్త్రి గారి శివభారతము నుండి.
అనే పద్యాన్ని ‘…తపింతునా, …తలంతునా, …అనుసరింతునా’ అని చదువుతారే తప్ప ‘…తపింతు | నాని, లుపు, తలంతు | నాప, గలు, అనుసరింతు | నాయొ, కని…’ అని చదువరు. ఇక్కడ పద్యంలోని ఛందోగణాలేమిటి? అవి ఎక్కడ విరుగుతాయి? అనేది చదువరికి ముఖ్యం కాదు. ఎక్కడ ఎట్లా విరిచి చదువుకుంటే భావస్ఫూర్తి కలుగుతుందనేది ముఖ్యం. వచన పద్య పాదం విషయంలోనూ చదువరికి సంబంధించిన ఈ ముఖ్యాంశాన్నే ప్రధానంగా స్వీకరించి అటు కవీ, ఇటు లక్షణ కర్తా సాగవలసి ఉంది. భావగణ విభజన విషయంలో ఈ అంశమే ప్రధానమయినది. ‘సిరికిం జెప్పడు, …చేదోయి సంధింపడు మొదలయిన చోట్ల వ్యాకరణ రూపైకత ఉన్న పద సమూహాలున్నాయని, వాటిని వ్యాకరణ గణాలనటానికి వీలుంటుందా? ఆ పద్యాల నిర్మాణంలో ఛందోగణాలు ప్రధానం కాబట్టి అట్లా అనడానికి వీలులేదు. అట్లాగే వచన పద్యంలో భావప్రాధాన్యం కాబట్టి ఇక్కడా అనటానికి వీలుండగూడదు. అయితే, వచన పద్య నిర్మాణంలో భావస్ఫూర్తి విషయికంగా వాక్యనిర్మాణరీతికీ ప్రవేశం ఉంది కాబట్టి, వ్యాకరణ రూపైకత అక్కడక్కడా భావగణ విభజనలో కనిపించటం సహజమే. అంతమాత్రాన వ్యాకరణ రూపైకత వల్లనే సర్వత్రా భావగణ విభజన జరుగుతుందనటానికి వీలు లేదు.
ఛందశ్శాస్త్రంలో గణాలు పరిమితాలు. నిజమే. అయితే, ‘భావగణాల సంఖ్య ఎంత? భావాలు ఎన్ని ఉంటయ్యో భావగణాల సంఖ్య అంతన్నమాట! భావాలు ఎన్ని ఉంటయ్యో ఎవరు అంచనా వెయ్యగలరు? అనంతమైన భావగణాలున్నప్పుడు వాటికి వ్యవస్థ ఏమిటి?’ అంటారు రామారావుగారు. అక్షర, మాత్రా సంఖ్యానియమం ఉన్నచోట ఛందశ్శాస్త్రంలో గణాలు పరిమితాలు కాకతప్పదు. సంఖ్యానియమం – అదీ మూడింటికి నియతం చేసుకోవటం వల్ల – అవి పరిగణనీయాలే. కానీ, వచన పద్య పాదాలకు సంబంధించినంతవరకు అక్షర మాత్రాదుల సంఖ్య నియతం కాదు. అందువల్ల ఆ సూత్రం ఇక్కడ అనువర్తించదు. నిజానికి భావగణం ఒక్కటే. సాంప్రదాయిక ఛందో రీతిలో ‘దూరము, దుంపలు, దుఃఖము, దుర్గతి’ అన్నవి, ఆదిలో ఉండవలసిన గురువర్ణస్వరూపములో నాల్గురకాల మార్పులున్నా గూడా ఆ మూడక్షరాల గుంపులు నాల్గింటినీ ‘భగణం’ అనే అంటారు తప్ప, నాల్గు రకాలకు నాల్గు పేర్లు లేవు. అంటే, గణంలోని వర్ణాల స్వరూపంలో మార్పు ఉన్నా గూడా దానిని ఒకే గణంగా పరిగణించవచ్చు నన్నమాట. అదే విధంగా భావాన్ని ఆధారం చేసుకుని పదాల స్వరూపంలో, వాటి కలయికల్లో ఎన్ని తేడాలున్నాగూడా అది భావగణమే. అది ఏకైకం. మరి ఇంతగా భావగణాల్ని గూర్చి చెప్పటమెందుకంటే, వచన పద్య పాద విభజనను క్రమబద్ధం చేయటానికే.
ప్రతిమాటకీ శక్తి
ఉంది పదును ఉంది
అని విభజించకుండా ఉండటానికే. ‘శక్తి ఉంది’, ‘ఆకాశం మీద’ వంటి భావగణాలు ఉభయపాదాల్లోకి అభివ్యాప్తం కాగూడదనటానికే. భావాన్నీ, భావాంశాల్నీ బట్టి పాదవిభజన చేసేప్పుడు, భావగణం ఒక పదంగా గానీ, పదబంధంగా గానీ, పదసమూహంగా గానీ ఉండేట్టయితే, దాన్ని రెండు పాదాల్లోకి వ్యాపింప చేయకూడదు. సాంప్రదాయిక ఛందస్సుల్లో తెలుగువారు ఒకే పదాన్ని ఒక పాదం నుంచి తరువాతి పాదంలోకి సాగింపచేయటం ప్రసిద్ధమే – రాజకులైకభూషణుడు, …అన్యరాజతేజోజయశాలి, అన్నట్లు. పదమే కూడదన్నప్పుడు, భావగణం ఉభయపాదాల్లోకి వ్యాపించటం అసలే కూడదు.
ఈ విధంగా, వచన పద్యానికి పాద బద్ధత ఉన్నదని, పాద విభాజకసూత్రమున్నదని, పాదం అంతర్విభజనకు భావగణ పద్ధతి కుదురుతుందనీ రామారావు గారి వ్యాసాన్ని పురస్కరించుకొని సాగిన ఈ వివరణలో స్పష్టం చేయటమైనది. కాగా, వచన పద్యం పద్యమేననీ, గద్యం కాదనీ నిశ్చయం.
నియమ రాహిత్యం వచన పద్య లక్షణం కాదు.
నియమ సాహిత్యం దానికున్నది.
వచన పద్యం: లక్షణ చర్చ – ఉపయుక్త గ్రంథ, వ్యాస సూచి.
(ఈ వ్యాస పరంపరలో మూడవ వ్యాసం చేకూరి రామారావు రాసిన వచన పద్యం: ఛందో విభాగం కాదు.)