నగరం జడలో దీపాల మాలల్ని అలంకరించుకుంది…
ఏ హరిణనయన చేతి అమృతభాండం నుండి తొణికిన వెన్నెలో
సముద్రం మీద చెల్లాచెదురైన ముత్యాలసరంలా పరచుకుంది
అలిసిన కన్నుల్లో స్వాప్నిక చంద్రికలని నింపుకుని..
నిద్రని మేలి ముసుగులా తన ముఖం మీదికి కప్పుకుంది
నిద్రిత నగరం, 2009
శ్రీ శ్రీ ప్రింటర్స్, విజయవాడ – 2
సగం మూసుకున్న కనురెప్పలను బరువుగా వాల్చుతున్న నిద్రిత నగరం కదా! ఏదో ఒకటో రెండో స్తబ్దుగా ఊహలు గుసగుసలాడితే అలవోకగా వినేసి మాగన్నుగా కాలం గడిపేద్దామనుకునేరు. ఈ నగరం వైదేహి ప్రపంచం. ఒక్కసారి వైదేహి కవితా నగరం లోకి ప్రవేశించాక మనకు నిద్ర పెద్దగా దొరకదు సరిగదా మన భావుకత్వం కూడా జాగృతమౌతుంది. ఆ కొంచెం నిద్ర కూడా మామూలుగా రాదు, రాత్రి నల్లకలువై కళ్ళముందు పరదాలు దించితే తప్ప. నగరమంతా ఆవరించిన అగరొత్తుల పరిమళంలో పరచుకున్న ఊహోపమలు ఊపిరి తీసుకోనివ్వక ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వర్ణ చిత్ర ప్రదర్శనశాలలో ఉన్నామో, పుస్తక పఠనంలో ఉన్నామో తెలియనంతగా వైదేహి కవిత్వం మత్తులో కూరుకుపోతాము. మనకు అతిసాధారణంగా కనిపించే రోజు వారి సన్నివేశాలు, ఈ కవిత్వం చదివేక క్రొత్తగా కనిపిస్తాయి. అందంగానూ కనిపిస్తాయి. ‘కానుక’ కవితలోని ఈక్రింది వాక్యాలు చూడండి –
ఆకు పచ్చని కర్టెన్‌లా మా వరండా గ్రిల్‌కి
దట్టంగా అల్లుకున్న సన్నజాజి తీవెల్లోంచి
బంగారు జరీపూల టేబుల్ క్లాత్‌లా
మా టీపాయి మీద పరుచుకున్న లేత ఎండని…
మీ వరండా గ్రిల్, సన్నజాజి తీగతోనో మనీ ప్లాంట్ లతతోనో అల్లుకున్న మీ వరండా గ్రిల్ … వరండాలో టీపాయ్ ఈ కవిత చదివేక ఎలా కనిపిస్తున్నాయ్?!
అలాగే ‘ఏటి ఒడ్డున’ అనే ఖండకావ్యంలో –
రాత్రి వానలో రాలిన స్వప్నాలను నెమరువేస్తూ
ధ్యానముద్రలో మునిగిన యోగుల్లా
పూర్తిగా తడి ఆరని జటాజూటాలతో
చెట్లు ఒంటికాలిపై నిశ్చలంగా నిలబడతాయి
మా వూర్లో ఏరులేదు గానీ, ఒక చెరువు ఉండేది(ఇప్పుడున్నదో లేదో తెలియదు). ఈ కవిత చదివాక, ఆ చెరువు గట్టున ఉన్న చెట్లు రాత్రి వానలో తడిసి, మరునాటి ఉదయం వాన వెలిసాక… తడిసిన జటాజూటాలతో తపస్సు చేసుకునే ఋషుల్లానే కనిపిస్తాయి.
మచ్చుకి పై ఉదాహరణలిచ్చానుగానీ, ఇలాంటి చిత్రాలు ఈ పుస్తకంలో కోకొల్లలు. కవి ఊహలను, ఆ ఊహలకు ఊపిరి పోసేందుకు ఎంచుకున్న వర్ణాలను, చిత్రించడానికి ఎన్నుకున్న కుంచెలను చూసేక ఇది ఈ కవయిత్రి మొదటి కవితా సంకలనం అంటే ఆశ్చర్యమేసింది. చక్కని పద చిత్రాలతో పాటు, ప్రవాసులు మాత్రమే వ్రాయగల అనుభూతి కవితలు కూడా ఈ సంకలనంలో ఉన్నై.
మధ్యరాత్రి ఫోను శబ్దం
గుండెల్లో మంచుకత్తిలా దిగబడుతుంది
… నీ గురించి ఏం చెప్తారో నన్న భయం
తడారిన నా గొంతులో గరళమై అడ్డుపడుతుంది
ఈ ఫోను శబ్దం వినడమనే అనుభవం మనందరిదీ ఐనా, మన అనుభవాన్ని అక్షరంగా మార్చింది వైదేహి ఒక్కతే. పరాయి దేశంలో ఉంటూ, స్వదేశంలో అస్వస్తతతో బాధపడుతున్న తల్లిని గురించిన ఒక బిడ్డ పడే వేదనతో బాటు, నమ్మకానికి విశ్వాసానికి నడుమ ఊగిసలాడే మనఃస్థితికి మాత్రమే ఇది ఒక అక్షర రూపం కాదు. వైదేహి వృత్తిరీత్యా వైద్యురాలు. అయినా, తన వేలికొనల అలవోకగా నిలిచిన వైద్యవిజ్ఞానంతో అక్కడి డాక్టర్ల టీముతో సాధికారికంగా చర్చించినా, ఆ చర్చలు కూడా ఇవ్వలేని మనశ్శాంతిని మా వూరి గుళ్ళో వెతుక్కుంటాను అని చెప్పేస్తుంది. ఇక్కడి ప్రశ్న హేతువు గురించి కాదు, మనం మన జ్ఞాపకాల్లోంచీ అనుభవాల్లోంచీ మాత్రమే వెతుక్కోగలిగే ఒక ఓదార్పు గురించి అని ఇలా చెప్పడంతో తన కవిత్వంలో తానే దొరుకుతుంది.
నిద్రిత నగరం, 2009
50 రూ. నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్
అందుకనే వైదేహికి అమెరికాలో ఉన్నా ధనుర్మాసం రాగానే జ్ఞాపకాల చలిమంటలు రాజుకుంటాయి – ఊరి గుడిలో ధ్వజస్తంభమూ, మావి చిగురు పట్టు అంచు లంగా, రథం ముగ్గులూ, బంతిపూల రెక్కలూ, చలికాగుతున్న పగడాల చెక్కిళ్ళూ, పకపక నవ్వులూ జ్ఞాపకమొస్తాయి. వాన కూడా ఈ ప్రవాసిని జ్ఞాపకాలతోనే ఓదారుస్తుంది – వచ్చే ముదురు నీలపు మేఘం గంభీరమైన నాన్నగా, మొదటి చినుకులు కురిసే తెలిమబ్బులు అన్నా చెల్లీగా అవుతాయి.
నన్నొక్కసారి నా బాల్యంలోకి తీసుకెళ్ళిన కవిత ‘స్వప్నపేటిక’. ‘గుల్మొహర్’ చదివితే – నా కక్కడ చెట్లే కాదు కనిపించింది. మౌనంగా నిల్చున్న మనుషులూ కనిపించారు. తుపాకులు ధరించిన కామ్రేడ్లూ కనిపించారు!
అలాగని చెప్పి ఇక్కడి జీవితాన్ని వైదేహి పట్టించుకోకుండా ఏమీ లేదు. ముప్ఫయ్యారు గంటల డ్యూటీలో ఎమర్జెన్సీ ఉరుకుల పరుగుల్లో అలసిపోయి వున్నా కూడా, ముత్యాల ధూళిలా శీతాకాలమంతా కురిసిన మంచు కింద నిద్రిస్తున్న వసంతం కొత్తగా వచ్చి తలుపు తట్టిందన్న సంగతి తెలుసు. అంత హడావిడిలో కూడా ఒక డాఫోడిల్ పలకరింపు గుర్తుంచుకుంటుంది. ఒక మంచు కురిసిన ఉదయాన్ని ఆహ్వానిస్తుంది. ఇవన్నీ చేస్తూ కూడా, మానవ సంబంధాల గురించి ఆలోచిస్తూనే వుంటుంది. ముందే చెప్పాను గదా, వైదేహి ప్రపంచం గురించి.
నులివెచ్చని సూర్యకిరణాలు తాకిన
పొగమంచులా కరిగిపోవాల్సిన కాలం
నీవు లేనప్పుడల్లా … కఠిన శీతాకాలపు
కర్కశ హిమంలా ఘనీభవిస్తుంది…
ఎంతకీ కరగని కాలాన్ని ప్రవహింపచేయాలని ఎన్ని ఆలోచనల దీపాలు వెలిగిస్తాను! అని ఒంటరితనంతో వేసారుతుంది. తన చుట్టూ గడ్డకట్టుకుంటున్న నిశ్శబ్దం చూసి తనలో తనే నవ్వుకుంటుంది. గోరింట పువ్వులా విచ్చుకున్న ఓ ఫిబ్రవరి సాయంకాలం మన ఇద్దర్నీ కలబోసి నా కళ్ళల్లో నీ కలల పుప్పొడిని సమకూర్చిందనీ, సరిహద్దులు చెరిపేసుకుని మన ఇద్దరి ప్రపంచాలు ఏకమైనాయని సహచరుడితో చెప్తుంది. అంతే కాదు, నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య కడుతున్న వంతెనను కూడా చూడమంటుంది.
ఏ చిన్న కలహమైతే మన మధ్య కోటగోడలా నిల్చి
మన మాటలు మనకే వినపడకుండా చేసిందో…నేను చెప్పాలనుకున్నవన్నీ నీకూ
నీవు చెప్పలేనివన్నీ నాకు
గుసగుసగా వినిపించేసి
నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం
మూగవోయిన వాయిద్యమై మెరుస్తుంది.
చెప్పుకుంటూ పోతే చెప్పుకున్నంత విశాలం ఈ కవితా నగరం.
వాక్యానికి ఒకే ఒక్క అర్థముంటే వచనం. వాక్యంలో పలు అర్థాలు స్పురిస్తే కవిత్వమనవొచ్చా! మరి వచన కవిత్వం మాటేమిటి? దాన్నెలా నిర్వచించాలి?! అలాగే ఒకే అర్థం చూపించే కవిత్వాన్ని కవిత్వమనవచ్చా? అన్నది నా సందేహం ఎప్పట్నుంచో! చాలా వరకు సూటిగా ఉండడం వైదేహి కవిత్వానికి బలం, బలహీనత కూడా! తిలక్ అంటే వైదేహికి ఇష్టం. భావాల వ్యక్తీకరణకు తగిన పదాల్ని జాగ్రత్తగా ఏరుకోడంలో తిలక్ ప్రభావం కనిపిస్తుంది. ఐతే, అనుకరణ ఎక్కడా కనిపించదు. ఇది పూర్తిగా వైదేహి సొంత గొంతుక. కానీ, తిలక్ అంత చిక్కనైన కవిత్వం చెప్పగలగడానికి వైదేహి మరికొంత బాగా ప్రయత్నించాలి.
చకితుల్ని చేసే పోలికలు కోకొల్లలుగా కవిత్వంలో ఉన్నా, ఇప్పుడు కవిత్వం వినిపిస్తున్న గొంతుల్లో గుర్తుంచుకోతగ్గ గళంలా అనిపిస్తున్నా, వైదేహి కలం మరింత పదును తేలాలి. ఎక్కువ భాగం కవితలు మంచి స్థాయిలో ఉన్నాయి, ఇది మెచ్చుకోదగ్గ విషయం. కానీ, పరిమళించే జ్ఞాపకాలు, కలల అలలు, జలతారు, గవాక్షాలు, ముత్యాలధూళి లాంటి పదాలు, పదబంధాలు ఈ కవితల్లో మళ్ళీ మళ్ళీ కనిపిస్తాయి. అందువల్ల విడిగా చదివితే లేని పునరుక్తి సమస్య ఈ సంకలనంలో కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. కవయిత్రికి మంచి పదసంపద ఉంది కాబట్టి తన కవిత్వాన్ని మరో మెట్టుపైకి చేర్చడానికి, ఒక విశిష్టమైన ఉనికిని ఇవ్వడానికి ఇబ్బంది ఉండదని భావిస్తున్నా. అంతేకాకుండా, వ్యక్తీకరణ బలంగా ఉన్నా వ్యక్తీకరించబడిన భావం పేలవమై అక్కడక్కడా కవిత్వాన్ని బలహీనం చేస్తుంది. పదచిత్రాల అల్లిక, ఉపమలతో పాటుగా వైదేహి తన కవిత్వంలో భావ సాంద్రత (లోతు) పట్ల కూడా శ్రద్ధ పెంచుకుంటే బాగుంటుందని నా అభిలాష.
కవిత్వానికి ప్రధానంగా ఉండాల్సిన గుణం పాఠకుడిని స్పందింపచెయ్యడం. చెప్పదలచుకున్న భావాన్నో, పంచుకోదలచుకున్న అనుభూతినో, అనుభవాన్నో… అక్షర రూపంలో పెట్టడమే కదా ఏ కవి లక్ష్యమైనా?! సూటిగా, క్లుప్తంగా, వినసొంపుగా చెబితే ఏమి చెప్పినా విన బుద్ది వేస్తుంది. కానీ అలా చెప్పాలంటే భాష మీద పట్టు ఉండాలి. చెప్పదలచుకున్న అంశం మీద స్పష్టత ఉండాలి (విషయమ్మీద అని కాదు నా ఉద్దేశ్యం). ఎంత ఆవేశమున్నా, ఆలోచనతో ఒక క్రమ పద్దతిలో చెప్పే నేర్పు ఉండాలి. అప్పుడే రచన పాఠకుడికి చేరువవుతుంది. నిద్రితనగరం పాఠకుడికి చేరువయ్యే కవిత్వ రచన అనడానికి ఏ సందేహం లేదు.