“ఏడుకొండల వాడా! వెంకట రమణా! గోవిందా! గోవింద!”
పెద్దగా కేకలు పెడుతూ రోడ్డు మీద ఎవరో మేళ తాళాలతో ఊరేగింపుగా వెడుతున్నారు, జోలి ఎత్తుకుంటున్నారు కాబోలు! అటువంటి పార్టీ వస్తే, ఇంతో అంతో డబ్బును వాళ్ళ జోలిలో వెయ్యకుండా ఉండరు సాధారణంగా భక్తులెవరూ. ఎంతటి భాగ్యవంతులైనా సరే ఆపద గడిస్తే చాలనే, ఆపదమొక్కుల వాడి పేరుతో జోలెత్తుకోడానికి ఏమాత్రం మొహమాటపడరు. స్వామి మీద జనానికున్న భయ భక్తులు అటువంటివి మరి!
“గోవిందా! గోవింద!”. జోలెత్తుతున్న భక్తులందరూ కలిసి మళ్ళీ ముక్త కంఠంతో పెద్దగా అరిచారు. ఆ కేకలు గోడలు దాటి వచ్చి వంటగదిలో పని చేసుకుంటున్న జానకి చెవిలో దూరాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడి “అపచారం, అపచారం” అంటూ చెంపలమీద టపటపా కొట్టుకుంది, హఠాత్తుగా ఎప్పుడో పెట్టుకున్న మొక్కు గుర్తుకు రావడంతో.
జానకి ఆ మొక్కు పెట్టుకుని ఐదేళ్ళకు పైనే అయ్యింది! అప్పుడు అబ్బిగాడు చంటాడు. అకస్మాత్తుగా వాడికి జబ్బుచేసి ప్రాణమ్మీదికి వచ్చినప్పుడు, “స్వామీ! ఆపద మొక్కుల వాడా! బ్రతికి బట్ట కడితే, వీడి పుట్టువెంట్రుకలు నీ సన్నిధిలో తీయిస్తాను” అంటూ జానకి ఆ మొక్కు పెట్టుకుంది. ఇద్దరు ఆడపిల్లల తరువాత అపురూపంగా పుట్టిన అబ్బిగాడు మాట దక్కించాడు. జబ్బు నయమయ్యింది. జానకి మొక్కు ఫలించింది. ఆ తరువాత, ఆ జబ్బు కుదిర్చిన స్పెషలిస్టుకి గడ్డు రోగాల్ని కుదర్చడంలో దిట్ట అనే మంచిపేరు కూడా వచ్చింది. అది వేరే కథలెండి! ఆ తరువాత ఆ మొక్కు మాటే మర్చిపోయింది జానకి. వాడిప్పుడు కాన్వెంట్ స్కూల్లో ఫస్టు స్టాండర్డులో ఉన్నాడు. ఐదో ఏడు రాగానే వాడికి పుట్టువెంట్రుకలన్న హంగామా ఏమీ లేకుండానే, బజారు వీధిలో ఉన్న గాంధీ సెలూన్లో, వాడిని కాన్వెంట్‌లో చేర్పించీ హడావిడిలో, వాళ్ళ నాన్న తీసుకెళ్ళి అత్యవసర క్షురకర్మ జరిపించేశాడు. అప్పుడు కూడా మొక్కున్న సంగతి భార్యా భర్త లిద్దరిలో ఎవరికీ గుర్తు రాలేదు.
“హమ్మయ్య, ఇప్పుడైనా గుర్తొచ్చింది నయమే” అనుకుంది జానకి. స్వామికి ఆపద మొక్కులూ కొత్తవి కావు, సంపద మరుపులూ కొత్తవి కావు! అప్పు చేసిన వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు చేసిన అప్పును చచ్చినట్లు తీర్చక తప్పదు అన్నది ఆయనకు బాగా తెలుసు. అప్పిచ్చిన వాడికి, అప్పు చేసినవాడు ఆ అప్పును తీర్చడంలో ఎంత ఆలస్యం చేస్తే అంత లాభం! ఎక్కువ వడ్డీ వస్తుంది. ఆయన అప్పు తీర్చుకునే తాపత్రయంలో ఆయనున్నాడు మరి, నిజమైన భక్తులు, కుహనా భక్తులు అన్న వివక్ష మర్చిపోయి అడిగిన వారి కందరికీ అడిగినవీ అడగనివీ వరాలను గుప్పిస్తూ, ఆలస్యం చేస్తే వడ్డీ మీద వడ్డీని గుంజుతూ.
“స్వామీ! నన్ను మన్నించు. మొక్కు విషయం మర్చిపోయి ఇప్పటికే ఒక తప్పు చేశా, మళ్ళీ వడ్డీ కాసులు మర్చిపోయి మరో తప్పు చెయ్యను. దయ ఉంచు తండ్రీ” అంటూ మరోమారు చెంపలేసుకుంది జానకి. సీతాపతి ఇంటికి రాగానే తేల్చి చెప్పేసింది తిరపతి కెళ్ళాల్సిందే అని. ఆ రాత్రే యుద్ధ ప్రాతిపదిక మీద నిర్ణయాలు జరిగిపోయాయి. పిల్లలకు దసరా సెలవులు రాగానే తిరుపతి ప్రయాణానికి ముహూర్తం పెట్టేశారు. ఇంక ఆట్టే వ్యవధి లేదు. రేపటినుండే సన్నాహాలు ప్రారంభించేసెయ్యలి అనుకున్నారు ఆ దంపతులిద్దరూ కూడబలుక్కుని.
ప్రయాణం ఇక రెండురోజుల్లో ఉందనగా, దారిలో తినడానికి చిరుతిళ్ళు చేసే సన్నాహంలో పడింది జానకి. అంతలో దొడ్లోంచి ‘అమ్మగోరూ’ అన్న కేక వినిపించడంతో తలెత్తి గుమ్మం వైపు చూసింది. తనవైపే చూస్తూ నిలబడివున్న రత్తాలు కనిపించింది.
“ఏమిటి రత్తాలూ, ఏం కావాలి” అని అడిగింది జానకి.
“ఏం నేదండి అమ్మగోరూ! దినామూ మా మావతొ ఏగలేకపోతుండానమ్మా” అంటూ ఒక కాగితపు పొట్లం అందించింది రత్తాలు.
“ఇది సోమోరి డబ్బు. ఆడికి తాగుడుకి డబ్బు సాలనప్పుడల్లా ఈ డబ్బు లాక్కోవాలని సూత్తాడు. ఇది జోలడుక్కున్న డబ్బు, సోమోరి సొమ్ము ఏరెవోటికి వోడుకోడం అపశారం కదమ్మా. ఈ డబ్బు మీరట్టుకెల్లి ఉండీలో ఏస్తిరా సచ్చి మీ కడుపున పుడతా! దయుంచండమ్మా”
“సర్లే. దానికేముంది, అలాగే. అసలు మొక్కు ఎందుకుపెట్టుకున్నావే”, కుతూహలంగా అడిగింది జానకి.
“సెప్పుకోడానికి సిగ్గైతాదమ్మా, ఏం సెప్పుకోను! వరాసకీ నాకు ఆడపిల్లలే పుడ్తండారని ‘ఈ పాలీ మల్లీ ఆడకూతుర్నే కన్నేవా నిన్ను ఒగ్గెయ్యడం క్కాయం’ అంటూ నిక్కచ్చిగా చెప్పేసిండు నా పెనిమిటి. సామికి మొక్కుకుంటే పుట్టినోడే మా ఏడుకొండలసామి! ఆసామి పేరే ఎట్టినా ఆడికి. ఆ తరువోత మొక్కు తీర్సాలని ఓపాలి జోలెత్తిన గని రైలు కర్సులకు కూడా రాలే. మరో పాలి జొలెత్తితే సరిపోద్దని దాన్ని దాసిన. కాని మా మావ నన్ను బతకనిచ్చీలాలేడు” అంటూ దణ్ణం పెట్టింది రత్తాలు.
రత్తాలే కాదు, ఇంకా చాలామంది ఇరుగుపొరుగు వాళ్ళు, ఎరుగున్నవాళ్ళు ఎంతమందో వచ్చి, తమపేరు చెప్పి స్వామికి సమర్పించమంటూ ఏవేవో ముడుపులు తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టారు. స్వామి కార్యాన్ని తమ కార్యంగా భావించి, సీతాపతి వాటిని జాగ్రత్తగా కాగితంలో పొట్లం కట్టి, ఎప్పటికప్పుడు ఆ ఇచ్చినవారి పేరు దానిమీద రాసి ఒక పెట్టెలో పెట్టేవాడు. ప్రయాణం రేపటికి వచ్చేసింది. ఈ రోజు తొందరగా పడుకుంటే రేపు తొందరగా లేచి ప్రయణ సన్నాహాలు చేసుకోవచ్చని, ఎనిమిది గంటలకే పడుకునే యత్నంలో పడ్డారు వాళ్ళు. అంతలో వీధి గుమ్మం తలుపు తట్టారు ఎవరో. పడుకోబోతున్నదల్లా లేచి వెళ్ళి తలుపు తెరిచింది జానకి. శాంత వచ్చింది లోపలికి.
శాంత, సీతాపతి పెద్దమ్మకి చిన్న కూతురు. వాళ్ళూ ఆ ఊళ్ళోనే కొంచెం దూరంలో ఉంటారు. శాంత భర్త కాలేజి ప్రొఫెసర్. ఒక మైలు దూరంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు. చీకటి వేళ శాంత ఇలా వచ్చిందేమిటా అని ఆశ్చర్యపోయారు సీతాపతి, జానకి కూడా.
“వదినా! రాజుకి ఒళ్ళు తెలియని జ్వరం. మూసిన కన్ను తెరవకుండా మంచానపడి ఉన్నాడు. ఇందాకా అన్నయ్య ఫోనుచేసి మీరు తిరుపతి వెడుతున్నాట్లు చెప్పగానే, ఎవరో నా చెంపమీద ఛెళ్ళున కొట్టి, గుర్తుచేసినట్లుగా జ్ఞాపకం వచ్చిందంటే నమ్ము! రాజుకి కాన్వెంటులో సీటు వస్తే తిరుపతి వచ్చి, హుండీలో ఐదు వందలు వేస్తానని మొక్కుకున్నా. సీటు వచ్చింది. ఇప్పటి వరకు ఆ మొక్కు తీర్చనేలేదు, ఏంచెప్పమంటావు వదినా! ఇలాంటివి అసలు పట్టనే పట్టవు ఆయనకు. వట్టి చార్వాక మతమనుకో! ఇన్నాళ్ళిల్లాగా జాప్యం చేస్తే స్వామికి కోపం వచ్చిందన్నా ఆశ్చర్యం లేదు. రాజుకి అంత జ్వరం వచ్చిందా, ఐనా ఆయనకేం చీమ కుట్టినట్లు కూడా లేదు. నాదగ్గర ఐదొందలుంటే తెచ్చా. వీటిని హుండీలో మా రాజు గాడి పేరు చెప్పి వేసి, స్వామిని మా అపరాధం మన్నించమని మా తరఫున కోరండి వదినా, మీకు పుణ్యముంటుంది” అంది శాంత గుక్కతిప్పుకోకుండా. చాలా ఆదుర్దా పడుతోంది ఆమె అపరాధ భావంతో.
“స్వామి వడ్డికాసులవాడు కదా వదినా. మొక్కు తీరిస్తే సరిపోదు, పైన ఇంకా కొంచెం డబ్బు అదనంగా వెయ్యాలి. లేకపోతే చెల్లు రాసుకోడుట స్వామి, తెలుసా?”
“అలాగా వదినా! ఐనా ప్రస్తుతం నా దగ్గర ఇంకేమీ లేదు. ఆయనని అడిగినా లాభంలేదు. దేవుడికోసం అంటే ఆయన అసలు ఇవ్వరు. అదో వితండం” అంటూ నిట్టూర్చి, సీతాపతి వైపు తిరిగి, “అన్నయ్యా! నువ్వే ఒక వంద సద్దుబాటు చెయ్యి. తరవాత నీకు ఇచ్చేస్తాను” అంటూ తన దగ్గరున్న ఐదువందలూ జానకి చేతిలో పెట్టి, తన మొక్కు తీర్చేభారం వాళ్ళ మీద ఉంచి, సెలవు తీసుకుని వెళ్ళిపోయింది శాంత.