అడుగుతున్నది మిమ్మల్నే! చెప్పండి సార్‌

అంతస్తుకు రెండు అపార్ట్‌మెంట్స్‌ చొప్పున మూడంతుస్తుల్లో ఆరు కాపురాలున్న  అయిదారు వందల భవనాల కాలనీ మాది. తీర్చిదిద్దినట్టుండే వీధులు, పంచరంగుల కేకులతో కట్టిన మిఠాయి  నిర్మాణాల లాంటి ముచ్చటైన భవంతులు, ఆగంతుకులెవరైనా వస్తే వచ్చిందెవరో  తెలుసుకోవడానికి వీలుగా తలుపులో అమర్చి ఉంచిన ‘అద్దపు కన్నూ’, వచ్చిన వాళ్ళెవరైనా ఏదైనా  వస్తువులు తీసుకొచ్చి వుంటే చేయి మాత్రం బయటికి చాపి వాటిని తీసుకోవడానికి వీలుగా  ఏర్పాటుచేసిన గొలుసు అమరిక.

పచ్చని చెట్లతో పూలమొక్కలతో పచ్చిక బయళ్ళతో ప్రశాంత  మనోహరమైన వాతావరణం. కాలనీ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ. మెయిన్‌ రోడ్డు పైనుంచి లోపలకు రావడానికి ఏర్పాటు చేసిన ఏకైక  ప్రధాన ద్వారం. అక్కడ అహర్నిశలూ కాపలా వుండే ఘూర్ఖాలు. ఇదంతా చూస్తే పూర్వకాలంలో ప్రాగ్జోతిషం, పాటలీపుత్రం,  కన్యాకుబ్జం లాంటి మహా నగరాల కెట్టి రక్షణ ఉండేదో అంతటి భద్రత మాకాలనీకీ ఉందని  నిస్సందేహంగా చెప్పొచ్చు.

కాలనీ వాళ్ళం కదా! పడమట దిక్కున రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న ఊరితో మాకట్టే  సంబంధాలు ఉండవు. కిరాణాకొట్లు, ఫ్యాన్సీ షాపులు, ఫాస్ట్‌ఫుడ్‌ సదుపాయాలు, పోస్టాఫీసు,  లైబ్రరీ మొదలైన వన్నీ కాలనీలోనే ఉన్నాయి.

ఉద్యోగుల్ని తూర్పుగా పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న  కార్యాలయాలకు తీసుకెళ్ళడానికి డిపార్టుమెంటు వారి ప్రత్యేక బస్సు సర్వీసులున్నాయి. ఉదయం ఎనిమిది కొట్టగానే మెట్లపైనుంచి ప్రారంభమయ్యే బూట్ల  టకటకలు రోడ్లపైకి వచ్చి అక్కడనుంచి ముందుకు సాగి ప్రధాన ద్వారం దగ్గర ఆగిపోతాయి.

“ఏమండీ సుందర్రావు గారూ! నిన్న సాయంకాలం లైబ్రరీ దగ్గర  కనిపించలేదే?”

“అయ్యా శ్రీనివాసన్‌ సార్‌! రండి రండి. ఆనందవికటన్‌ కావాలంటిరే, మాకోసరం తెస్తిని. తీసుకెళ్ళి సదువుకోండబ్బా!”

“అబ్బా నంజుండబ్బా! చిత్రదుర్గా నుంచి ఎప్పుడొస్తివి?”

“క్యాహైజీ అగర్వాల్‌?”

“ఈ రోజు పేపర్‌ చూశావా? అయినా చూసి ఏం లాభంలే. న్యూస్‌ పేపర్లలో  ఈ కుంభకోణాల్ని గూర్చిన వార్తలు చదువుతుంటే కడుపు తరుక్కుపోతుందయ్యా.”

ఇలా పలకరింపుల సంబరాలతోనే ఉద్యోగులు బస్సెక్కేస్తారు. సరే, ఉద్యోగప్రయాణం గురించి మనకెందుకు? వదలిపెడదాం. పిల్లలు స్కూళ్ళకు వెళ్ళిపోయాక, మగవాళ్ళు ఆఫీసుల కోసం  బయలుదేరాక కాలనీ లోని సుగుణమణి, జలజలోచన, చారుమతి ఇళ్ళకు తాళాలు వేసుకొని  పార్కులోకొచ్చి చెట్లనీడలో కూర్చుంటారు. శిరోమణి, దేవసేన, రాజేశ్వరి, విజయ, ప్రసూనలు సాధారణంగా  రీడింగు రూములోనే కలుసుకుంటుంటారు.

అరవైయేళ్ళ భగీరథమ్మ వినాయకుడి గుడి మండువాలో  ఆంధ్రవాల్మీకం చదివి పది పదిహేను మంది శ్రోతలకు (వీరిలో వయసు మళ్ళిన వాళ్ళతో బాటుగా వయసు  మళ్ళని జిజ్ఞాసువులు గూడా వుంటారు) అర్థవివరణ చేస్తూ వుంటుంది. వాళ్ళంతా ఎవరిళ్ళకు వాళ్ళు చేరేది మధ్యాహ్నం పన్నెండుకే పన్నెండున్నరకు బడినుంచి పిల్లలొస్తున్నారు గదా! వాళ్ళకన్నాలు పెట్టి మళ్ళీ బడికి పంపించేశాక విశ్రాంతి. టీవీ చూడ్డమైనా, పుస్తకం చదవడమైనా అర్థంతరంగా  ఆగిపోవడమే మామూలు.

నిద్రకునుకు తీసుకునేటప్పటికి గంట నాలుగు దాటి వుంటుంది. ‘అమ్మో! పిల్లలొస్తారు, ఆయనొస్తారు ఆవురావురుమంటూ. ఏదైనా టిఫిను  చేసేయాలి.’ ఇక చూసుకోవలసిందే తమాషా. కాలనీ అనే యంత్రం అమాంతంగా స్టార్టయిపోతుంది. కొళాయిల్లోంచి నీళ్ళు దూకుతాయి, మిక్సీలు గొంతు విప్పుతాయి, గ్యాస్‌ స్టవ్‌లు క్రమబద్ధీకరించిన మంటల్ని విరజిమ్ముతాయి.

అలాంటి ఒక సాయంకాలపు వేళ చెట్ల నీడలు చూస్తూ, గాలి హాయిగా వీస్తూ, పక్షులు చెట్టు పైన్నుంచి  చెట్టుపైకి ఎగురుతూ, పిల్లలు ఆటస్థలాల్లో ఆడుకుంటూ అందాలతో ఆనందాలతో ప్రకృతి  పరవశించి పోతున్న వేళ చామన చాయతో, పొందికైన క్రాఫింగుతో, నశ్యం రంగు ప్యాంటుతో, తెలుపు  పైన ఊదారంగు చారల చొక్కాతో, ఖాళీ క్యారియరు వాటర్‌ బాటిల్‌ ఉన్న ప్లాస్టిక్‌ బుట్ట  చేతబట్టుకుని ఒక ముప్పై అయిదేళ్ళ ఉద్యోగి బస్సు దిగాడు.

బస్సు దిగేటప్పటికతడు గుంపులో గోవిందయ్య. పాపం వార్తల్లో  కెక్కాలన్న ఊహగానీ, ప్రయత్నం గానీ లేనివాడు. ఆనాటి సంఘటన కతడి ప్రమేయం ససేమిరా లేదు. అయితే అది జరిగిన  తర్వాత అతడి జీవితం అంతకు మునుపటి జీవితంతో పోల్చుకోవటానికి వీల్లేనంతగా  మారిపోయింది. అతడు తనకు, ఊహకు, ప్రయత్నానికి అతీతంగా వార్తల్లోకెక్కిపోయాడు. వక్కపలుకు నోట్లో వేసుకొని కొరికినంతసేపట్లో అతడి ఊరూ, పేరూ,  స్వభావం, హాబీలు, భార్యాబిడ్డల గుణగణాలు మొదలైనవన్నీ కాలనీలో ఒకరికొకరు  చెప్పుకోవలసిన, చెప్పగా చెవి ఒగ్గి వినవలసిన ముఖ్యవిషయాలుగా మారిపోయాయి.

అతడిపేరు షణ్ముగసుందరం. స్వస్థలం చిదంబరం దగ్గర తిరుమంగళం.  తండ్రి ప్రైమరీ పాఠశాల టీచరు. మేనమామ మద్రాసులో ఉండడం వల్ల అతడు  పైచదువులు కొనసాగించ గలిగాడు. గిండీ ఇంజనీరింగు కాలేజీలో పట్టా పుచ్చుకున్నాడు. భార్య  పేరు శివగామి. ఒక కూతురు, పేరు దేవయాని. వయస్సు తొమ్మిదేళ్ళు. కొడుకు ఏడేళ్ళవాడు, పేరు  పార్థు. అన్యోన్య దాంపత్యం, కుదురైన బిడ్డలు. అతడి ఉద్యోగ జీవితం ప్రారంభం కావడం ఇక్కడే. కన్‌స్ట్రక్షన్‌ డిపార్టుమెంట్‌లో సెక్షన్‌ హెడ్‌. సాయంకాలం అతడిల్లు చేరుకునేటప్పటికి పిల్లలు ప్లేగ్రౌండుకు వెళ్ళి  వుంటారు. ముఖం మాత్రం కడుక్కొని ఈవలికొచ్చేసరికి భార్య వేడిగా కాఫీ కప్పు  చేతికిస్తుంది. కాఫీ సేవనంతో పిచ్చాపాటీ మొదలవుతుంది.

పత్రికలు చదువుకోవడం, టీవీ చూడ్డం, పిల్లలకు హోమ్‌వర్కులో  సాయపడ్డం, తిరుమంగళం నుంచో మద్రాసునుంచో జాబులొస్తే ఒకొక్క వాక్యాన్ని చదివి అభిప్రాయాలు  ప్రకటించడం ఈ మాత్రమే వాళ్ళ వ్యవహార జగత్తు. సరే, షణ్ముగసుందరం ఆరోజు సాయంకాలం బస్సు దిగాడన్నది  ప్రస్తుతాంశం. ఉత్తరంగా వెళ్ళే రోడ్డుపైన కమ్యూనిటీ హాలుదాకా వెళ్ళి అక్కడ పడమరకు  తిరిగితే సన్నటిరోడ్డుకు ఎడమవైపు వున్న కట్టడంలోని రెండో అంతస్తులోని ఒక వాటాలో అతడి  కాపురం. ఇంటి నెంబరు సి123.

షణ్ముగసుందరం మెట్లెక్కాడు. ఎన్నడూ లేనిది మూసిన తలుపు బిగించిన తాళంతో వ్రేలాడుతూ ఉంది. “ఏమిట్రా ఇది. ఈ వేళప్పుడు ఈమె ఇంట్లో లేకుండా ఎక్కడికి పోయింది?”  అనుకున్నాడు షణ్ముగసుందరం. ఎదురింట్లో వాళ్ళనడుగుదా మనుకుంటూనే కాళ్ళ క్రిందనున్న తివాచీ  పైకి తీశాడు. తాళం చెవి కన్పించలేదు. మామూలుగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆమె తాళం  చెవి తివాచీ క్రింద పెట్టి వెళ్ళడం మామూలే!

“ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్ళివుంటుందబ్బా?” అనుకుంటూ తన జేబులోని  డూప్లికేటు తాళం చెవితో తలుపు తెరిచాడు. కథలో ఇక్కడిదాకా గీత గీస్తే ఇంతకు మునుపటిదంతా వెలుగనీ  ఆపైన పరుచుకున్నదంతా చీకటనీ గుర్తించాలి.

లోపలి కెళ్ళిన షణ్ముగసుందరం రెండే రెండు నిముషాల్లో గావుకేకలు  పెడుతూ బయటకు పారిపోయి వచ్చేశాడు.

ఏమిట్రా ఈ గగ్గోలు అన్నట్టుగా చుట్టుప్రక్కల కొన్ని ఇళ్ళలోని కిటికీలు  తెరుచుకున్నాయి. కొందరు ధైర్యవంతులు గబగబా మెట్లెక్కి అపార్టుమెంటులోకి  జొరబడ్డారు. క్రిందనే నిల్చుండి పోయిన వాళ్ళు, ఏమైంది ఏమైందని పైకి వెళ్ళిన వాళ్ళని  ప్రశ్నిస్తున్నారు. అంతా అయోమయం గందరగోళం!

వాస్తవం స్పష్టంగా అవగతం కావడానికి పదిపదిహేను నిముషాల  కాలం పట్టింది. శివగామి వంటింట్లో అలమరాల నడుమ సన్నటి జాగాలో పొడవునా  పడివుంది. అమ్మాయి బెడ్‌రూమ్‌లో మంచానికడ్డంగా పడివుంది. ముందువైపు హాల్లో  కుర్రవాడు కుర్చీలోనే తల వాల్చేసి వున్నాడు. ముగ్గురి గొంతుకల చుట్టూ ఊపిరి తిరగకుండా  ప్లాస్టిక్‌ తాడు లాంటి దానితో బిగించినట్టు కుశాగ్రబుద్ధులైన పరిశీలకులు పోల్చుకున్నారు. కాలనీ అన్నివైపుల నుంచీ కమ్యూనిటీ హాలు దిశగా జనసంచలనం  ప్రారంభమైంది.

“ఏమండీ, ‘షణ్ముగసుందరం’ అంటున్నారు ఎలా వుంటాడతను? పొట్టిగా  బొద్దుగా బట్టతలతో..”

“అబ్బే అయివుండదండీ! బస్సులో కొందరు ‘సుందరం, సుందరం’ అని  పిలుస్తుండగా చూశాను. అతను సన్నగానే ఉంటాడు. లేదంటే క్రమబద్ధంగా పెంచిన గుబురు గడ్డంతో ఎలుగుబంటిలా కనిపించినట్టు జ్ఞాపకం.”

“పరవాలేదులెండి. మనిషి సజీవుడై వున్నాడు కదా! రేపో మాపో  కనిపించక పోతాడా?”

“ఏం సజీవుడో! తగిలిన దెబ్బకింక కోలుకుంటాడా అనేదే అనుమానం.  అయినా మానవ మాత్రుడికి రాదగిన కష్టమా?”

మరొకవైపు కాలనీ మహిళల ఆసక్తి ఇంకొక విధంగా కొనసాగుతోంది. “ఎవరో శివగామి అంటమ్మా! నాకైతే చూచిన జ్ఞాపకం లేదు.  అరవావిడగదా! మిగిలిన వాళ్ళతో అంతగా కలిసేది కాదేమో…”

“చొరవ రెండు పక్కల నుంచీ వుండాలి గదమ్మా రాజేశ్వరీ! మనమే  ఆమెను ఆంతరంగికంగా దగ్గరకి చేరనివ్వలేదేమో…?”

“ఇంతకూ మనిషెవరో తెలియకపోయినా ఊహాగానాలెందుకు? నాకు తెలిసి  ప్రతి శుక్రవారం ఉదయం తలంటిపోసుకొని వదులు జారుముడిలో పువ్వులు తురుముకొని విభూది  పట్టెలపైన ఇంతేసి కుంకుమ బొట్టు పెట్టుకొని ఓ అరవావిడ వినాయకుడి గుడికొస్తుండేది.  ఇదంతా మద్రాసు ఆడవాళ్ళ సాంప్రదాయం. ఆ శివగామి కూడా మద్రాసే అంటున్నారు గదా…” ఇలా ఈ పరామర్శలన్నీ ‘బీటింగ్‌ అరౌండ్‌ ది బుష్‌’గా పరిణమించాయే  గానీ అసలు మనుషులెవరో చాలామందికి స్ఫురించలేదు.

ఇంతకూ ఆ షణ్ముగసుందరమనే దైవోపహతుడితోను, శివగామి అనే  అల్పాయుషును అడిగివచ్చిన ఆవిడతోనూ ముఖపరిచయం కలిగిన వాళ్ళెందరు? పలకరించిన వాళ్ళెందరు?  సన్నిహితంగా మిత్రత్వం కలిగిన వాళ్ళెందరు?