ఇంటి ముందర ఆగిన రిక్షాని చూసి రామూ సంభ్రమంగా అరిచాడు, “అమ్మా, మనింటి ముందు రిక్షా ఆగిందే!” అని.
వాళ్ళమ్మ గుంభనంగా నవ్వింది.
అర్థం కానట్టు చూశాడు రామూ.
“నాన్న మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చినపుడు హోటల్లో గ లాపెట్టి దగ్గర కూర్చోడానికి నిన్ను పంపించమన్నారు” అని చెప్పింది వాళ్ళమ్మ నవ్వుతూ.
ఆశ్చర్యంతో, ఆనందంతో రామూ కళ్ళు విప్పారాయి. వాడి తండ్రి ఆ వూళ్ళో ఒక చిన్నహోటలు నడుపుతున్నాడు. పొద్దున్నే నాలుగున్నరకి వెళ్ళిపోతాడు హోటలుకి. మళ్ళీ మధ్యాహ్నం ఒంటిగంటకి ఇంటికొస్తాడు భోజనం చేసి, కాస్సేపు పడుకోవడానికి. మళ్ళీ నాలిగింటికల్లా వెళ్ళిపోయి, రాత్రి పది దాటేక గానీ ఇల్లు చేరేవాడు కాదు.
తండ్రి పొద్దున్న లేచే టైంకి పదమూడేళ్ళ రామూ ఇంకా నిద్రలో వుంటాడు. మధ్యాహ్నం టైంలో స్కూల్లో వుంటాడు. రాత్రి తండ్రి ఇంటికొచ్చేసరికి నిద్రలో వుంటాడు. అందువల్ల రామూ ఆదివారాలూ, శలవు రోజులూ తప్ప తండ్రిని రోజూ చూడగలిగేవాడు కాదు. ఆ హోటలు వ్యాపారం అంతా తండ్రొక్కడే ఒంటి చేతి మీద చూసుకుంటాడు. ఇంట్లో ముగ్గురాడ పిల్లలూ, ఆఖరుగా రామూ.
అన్నేళ్ళూ రామూ తండ్రి తన స్నేహితుడిని నమ్మకంతో గల్లాపెట్టి దగ్గర కూర్చోపెట్టాడు ఇంటికి మధ్యాహ్నం భోజనానికీ, నిద్రకీ వచ్చినపుడు. కానీ గల్లాపెట్టిలోంచీ డబ్బు తీసేసుకుంటున్నాడు ఆ స్నేహితుడు, అనే అనుమానంతో గొడవ పడి విడిపోయాడు. ఇంక వున్న ఒకే ఒక్క కొడుకుపై ఆధారపడ్డానికి నిశ్చయించుకున్నాడు రామూ తండ్రి.
ఆ నెలంతా రామూకి ఒంటిపూట బళ్ళు. అంటే బడి పొద్దున్నే యేడింటికి మొదలై పన్నెండున్నర కల్లా అయిపోతుంది. ప్రతీ యేడాదీ వేసంకాలంలో బళ్ళకి ఒంటిపూట రోజులే. పిల్లలు ఎంతో సంతోషంగా వుంటారు ఒంటిపూట బళ్ళు అంటే, పొద్దున్నే లేవడం కాస్త కష్టం అయినప్పటికీ. ఆ వేసంకాలం శ్రీరామనవమి పందిళ్ళలో రికార్డింగు డాన్సులూ, లైట్ మ్యూజిక్ ప్రోగ్రాములూ, సినిమా ప్రదర్శనలూ చూసి, రాత్రి ఆలస్యంగా పడుకోవడం, పొద్దున్నే లేచి బడికెళ్ళి, మధ్యాహ్నం ఒక చక్కటి నిద్ర పోయి, సాయంకాలం ఆడుకుని, ఆ తర్వాత కాస్సేపు చదువుకుని, రాత్రి ప్రోగ్రాముకి తయారవ్వడం పిల్లలకి చాలా సంతోషంగా వుంటుంది.
తన మధ్యాహ్నం నిద్రకి కష్టం వస్తుందని తెలిసినా, శ్రీరామనవమి పందిళ్ళు వుండేవి పదిరోజులే కాబట్టి, రామూ సంతోషంగానే హోటల్లో గల్లాపెట్టి ముందర కూర్చోడానికి ఇష్టపడ్డాడు. గల్లాపెట్టి దగ్గర కూర్చోడం చాలా గొప్ప పదవి అనీ, దాన్ని సగౌరవంగా నిలుపుకోవాలనీ వాడి అభిప్రాయం. రిక్షాలో కూర్చున్న రామూని చూసి, “ఏరా, ఎక్కడికి వెళుతున్నావూ?” అనడిగారు వాడి ఇంటి దగ్గరి స్నేహితులు.
“మా నాన్న ఇంటికి భోజనానికి వచ్చినపుడు గల్లాపెట్టి దగ్గర కూర్చోడానికి నన్ను హోటల్‌కి రమ్మన్నాడు. కస్టమర్లు తిన్న టిఫిన్‌కి డబ్బు తీసుకుని, మిగిలిన చిల్లర కరెక్టుగా లెక్క చూసి ఇవ్వాలి. రోజూ రిక్షాలో వెళ్ళి రావాలి” అని గొప్పగా చెప్పాడు మొహం అంతా వెలిగిపోతుండగా. వాడికి పట్టిన రాజభోగానికి వాడి స్నేహితులకి ఈర్య్ష కలిగింది. ఆ రిక్షాలో వాడి వైభవాన్ని చూడలేక, “సరేరా! మేమాడుకుంటాం. నువ్వెళ్ళిరా!” అనేసి వెళ్ళిపోయారు.
రామూ మనసు చివుక్కుమంది. అయినా సరే, మధ్యాహ్నం నిద్రా, ఆటలూ త్యాగం చేయడానికే ఇష్టపడ్డాడు. రిక్షాలో ప్రయాణం చేస్తున్నంతసేపూ, హోటల్లో గల్లాపెట్టి దగ్గర తప్పుల్లేకుండా ఎలా పని చేయాలో వూహించుకుంటూ వున్నాడు.
హోటల్లో పనిచేసేవాళ్ళంతా రామూని, “చిన్న పొప్రయిటర్” అని పిలిచారు. ఆ పిలుపుకి పొంగిపోయాడు రామూ.
కూడికలూ, తీసివేతలూ వాడికి సమస్య కాకపోయినా, మొదట్లో నోటితో చెయ్యడానికి వాడికి కొంచెం టైం పట్టింది. కొన్ని రోజుల్లోనే అలవాటయిపోయింది వాడికి. సంతోషంగా ఆ మూడు గంటలూ హోటల్లో పని చేయడం వాడికి ఒక రకమైన దర్జానిచ్చింది. అక్కలూ, తల్లీ, వీడు రోజూ పని చేస్తున్నాడని కాస్త గౌరవంగా చూశారు. డబ్బుతో లావాదేవీలు చేస్తాడని స్నేహితుల్లో కూడా కాస్త ఎక్కువ గౌరవం దొరికింది. తండ్రి తను లేనప్పుడు, పాలు పోసేవారికెంత ఇవ్వాలో, వూక బస్తాలు వేసేవారికెంత ఇవ్వాలో, ఎవరెవరికెంత ఇవ్వాలో చెప్పి వెళ్ళేవాడు. తండ్రి చెప్పినట్టే చేస్తూ,మంచిపేరు తెచ్చుకున్నాడు రామూ. ముఖ్యంగా రిక్షాలో రానూ, పోనూ ప్రయాణం ఎంతో మురిపెంగా వుంది వాడికి.
జీవితం ఇలాగే సుఖంగా సాగిపోతూ వుండగా వచ్చింది వాడికో కష్టం ఒక రావణాసురుడి రూపంలో.
రామూ వాళ్ళ హోటల్‌కి రెండు కొట్ల అవతల ఒక పాల డిపో వుంది. అక్కడ కొంత మంది పనివారు వున్నారు. వారిలో ఒకడు రామూ వాళ్ళ హోటల్‌కి వచ్చేవాడు టీ తాగడానికి. వాడు రామూకి నచ్చలేదు. వచ్చినప్పుడల్లా ఏదో ఒక మాట అని రామూని వెటకారం చేస్తూ వుండేవాడు. వాడికి రావణాసురుడు అని పేరెట్టుకున్నాడు రామూ మనసులో. పనివారికి వాడా పేరు చెబితే వాళ్ళు నవ్వారు.
ఆ రోజు రావణాసురుడు హోటల్‌కి వచ్చి టీ తాగాడు. గల్లాపెట్టి మీద పది రూపాయల నోటు పెట్టాడు.
“పది పైసల టీకి పదిరూపాయల నోటిస్తే చిల్లర ఎక్కడ నించీ తెచ్చేదీ, రోజూ నీకు?” విసుక్కున్నాడు రామూ.
“అదంతా తెలవదు. వొటేలు నడుపుతున్నపుడు సిల్లరెట్టుకోవాల నీ కాడ. యాపారంలో కట్టమర్లతో చానా మరేదగా వుండాల సినపంతులూ!” అన్నాడు రావణాసురుడు అధార్టీగా.
ఒళ్ళు మండిపోయింది రామూకి. ముఖం చిట్లించుకుంటూ లెక్కపెట్టి తొమ్మిది రూపాయినోట్లూ, తొంభై పైసల చిల్లరా ఇచ్చాడు.
రావణాసురుడికి ఎదో పెద్ద నోట్లూ, కాస్త చిల్లరా మాత్రమే లెక్కపెట్టుకోవడం తెలుసు. వాడికి చదువూ రాదు, అంతగా లెక్కలూ రావు. ఎగతాళిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. వాడి నవ్వు చూసి ఏమీ చెయ్యలేక పళ్ళు నూరుకున్నాడు రామూ.
అప్పటినించీ దిన దిన గండంగా తయారయ్యాడు రావణాసురుడు. గల్లాపెట్టి దగ్గ ర డ్యూటీ తీసుకోగానే, ఒక క్లీనర్ కుర్రాడిని దగ్గరలో వున్న కొట్టుకి పంపించి పది రూపాయల చిల్లర
తెప్పించుకునేవాడు రామూ. వాడికి తెలుసు, ఆ రావణాసురుడు కావాలని తండ్రి లేని టైంలోనే వస్తాడని. తన సమస్య తండ్రికి చెప్పుకోడానికి సిగ్గు పడ్డాడు వాడు. రామూని ఇలా కాల్చుకు తినడం రావణాసురుడికి సంబరంగానే వుంది. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం!
ఆ రోజు చిల్లర తెప్పించుకోవడానికి రామూకి అస్సలు కుదరలేదు. దగ్గరలో వుండే ఇంకో హోటల్ ఆ రోజు మూసేయడం వల్ల, ఆ జనం అంతా వాడి హోటల్ మీద పడ్డారు. దాంతో పని వత్తిడి పెరిగింది. ఆ హడావిడి కాస్త తగ్గి, “హమ్మయ్య” అని అనుకునేసరికి రావణాసురుడు హాజరయ్యాడు చేతులూపుకుంటూ.
వాడిని చూడగానే గుండెలు బితుక్కుమన్నాయి రాంఊకి. ఎప్పటిలాగానే చిద్విలాసంగా, పది పైసల టీకి పదిరూపాయల నోటిచ్చాడు రావణాసురుడు.
“చిల్లర లేదు” నెమ్మదిగా అన్నాడు రామూ.
“యేటి సినపంతులూ?” వేళాకోళం మొహం మీద కనబడుతుండగా, అర్థం కానట్టు అన్నాడు రావణాసురుడు.
“నువ్వు రోజూ పది పైసల టీకి పదిరూపాయలిస్తున్నావు. ఈ రోజు చిల్లర నిజంగా లేదు. నువ్వే పది పైసల చిల్లరియ్యి” ఇంచు మించు ప్రాధేయ పడుతున్నట్టుగా అన్నాడు రామూ.
“నా కాడ సిల్లర నేదు!” ఖచ్చితంగా చెప్పేశాడు రావణాసురుడు, తనకేమీ పట్టనట్టు.
“మరేం చెయ్యాల”న్నట్టు చూశాడు రామూ.
“మాపటికి సిల్లర దొరికితే ఇత్తాను లేవయ్యా నీ పది పైసలు” అన్నాడు రావణాసురుడు.
దగ్గరలో వున్న సర్వరు అడిగాడు రామూని.
“యేటి ఇసయం సిన పొప్పయిట్రూ?” అని.
“ఇతని దగ్గర పది పైసల చిల్లర లేదంట. సాయంకాలం ఇస్తానంటున్నాడు” చెప్పాడు రామూ.
“అట్టానా! బాగా గేపకవెట్టుకోవాల నువు!” అన్చెప్పి తన పనిలో మునిగిపోయాడు సర్వరు.
“సరే! సాయంకాలాని కల్లా నువ్వు తప్పకుండా పది పైసలిచ్చెయ్యాలి. కస్టమర్లకి అరువు ఇవ్వద్దని మా నాన్న మరీ మరీ చెప్పాడు. మా నాన్న వచ్చేలోపల వచ్చి, ఇచ్చెయ్యి టీ డబ్బులు” గతిలేక ఒప్పుకుంటూ అన్నాడు రామూ.
కొంటెగా నవ్వుతూ వెళ్ళిపోయాడు రావణాసురుడు. వాడి జేబులో పది పైసలు ఖచ్చితంగా వుండి వుంటాయని రామూకు తెలుసు. ఆ విషయం ఎలా బయట పెట్టించాలో తెలియని పరిస్థితి వాడిది. రావణాసురుడి నవ్వు చూస్తే ఒళ్ళంతా కారం రాసుకున్నట్టనిపించింది వాడికి.
ఆ సాయంకాలం రామూ వాళ్ళ నాన్న ఇంటి నించీ వచ్చేశాడు గానీ, రావణాసురుడు మాత్రం రాలేదు పది పైసలివ్వడానికి. ఆ విషయం తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు వాడు. అసలే ఎవరికీ అరువు పెట్టద్దు అని చెప్పి వున్నాడు తండ్రి. ఏమీ చేయలేక నిస్సహాయంగా, హోటల్ వెనక గుమ్మం లోంచీ బయటకి వెళుతూ వుంటే, అక్కడ బీడీ కాల్చుకుంటున్న సర్వరు అడిగాడు.
“యేం సిన పొప్పయిట్రూ! ఆ రావనాసుడు టీ డబ్బులిచ్చినాడా?”
గొంతులో వెలక్కాయ పడింది రామూకు.
“ఇచ్చాడన్నట్టుగా” బుర్ర వూపాడు.
ఇంటికెళ్ళే దారంతా దిగులుగానే వున్నాడు సర్వరుకి అబద్ధం చెప్పినందుకు. అతనికి నిజం చెబితే తన తండ్రికి చెప్పేస్తాడని రామూ భయం.
ఆ రోజు రాత్రి రామూ కల్లోకి వచ్చాడు రావణాసురుడు. ఆ కల్లో రామూ పక్కన బస్తాల కొద్దీ రూపాయల నోట్లూ, చిల్లర నాణాలూ వున్నాయి. రావణాసురుడు ఎప్పుడొచ్చినా, నవ్వుతూ చిల్లర ఇచ్చేస్తున్నాడు బస్తాల్లోంచీ. అలా చూస్తూ వుండగానే బస్తాలు ఖాళీ అయిపోయాయి. దూరం నించీ నవ్వుకుంటూ వస్తున్నాడు రావణాసురుడు. భయంతో మెలుకువ వచ్చేసింది రామూకి.
మర్నాడు యధావిధిగా డ్యూటీకెళ్ళాడు రాంఊ. అయితే క్లీనరుతో చిల్లర తెప్పించుకోవడం మాత్రం మరిచిపోలేదు.
మామూలుగా రావణాసురుడొచ్చి మళ్ళీ పదిరూపాయల నోటిచ్చాడు పది పైసల టీ తాగి.
లెక్క పెట్టి తొమ్మిది రూపాయల ఎనభై పైసలిచ్చాడు రామూ.
“అదేటీ, ఇరవై పైసలట్టుకున్నావు ఓ టీకి ?” ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు రావణాసురుడు.
“నిన్న టీకి డబ్బులివ్వలేదుగా! అదీ, ఇవాల్టిదీ కలిపి ఇరవై పైసలవుతుందిగా!” వివరించాడు రామూ వాడి నటనకి ఒళ్ళు మండుతున్నా.
“యేటి పంతులూ? ఎన్నితూర్లు ఇమ్మంతావు? నా పది పైసలు తే ఇలా!” అన్నాడు గట్టిగా. చాలా కోపం వచ్చింది రాంఊకి.
“నువ్వు నిన్న ఇవ్వలేదు. నీకు పది పైసలివ్వక్కర్లేదూ, ఇవ్వనూ” మొండిగా అన్నాడు రామూ.
“మరేదగా ఇత్తావా, లాక్కోవంతావా?” అంటూ గల్లాపెట్టి సొరుగు లాగాడు రావణాసురుడు.
ఆ గొడవ వింటున్న మిగిలిన కస్టమర్లు లేచి, రావణాసురుడిని తిట్టారు గల్లాపెట్టి సొరుగు ముట్టుకున్నందుకు. విషయం తేల్చుకోవాలి గానీ, గల్లాపెట్టి సొరుగు ముట్టుకోకూడదూ, కావాలంటే వాళ్ళ నాన్న వచ్చాక చెప్పుకో సంగతి అని వాడిని హెచ్చరించారు.
ఆ గొడవకి సర్వరు వచ్చాడు అక్కడకి.
“యేటయిందీ?” అనడిగాడు.
రామూ బెరుగ్గానే చెప్పాడు జరిగిన సంగతి.
“అదేటీ, నిన్నాయన డబ్బులిచ్చేసినాడని సెప్పినావూ?” అన్నాడు సర్వరు.
తను చెప్పిన అబద్ధం ఇలా తేలులాగా తనను కుట్టినందుకు చాలా బాధేసింది రామూకి.
“లేదు, ఇవ్వలేదు. నేనూరికే అన్నాను నీతో అలా ఇచ్చేశాడని” అన్నాడు రామూ సంజాయిషీగా.
రావణాసురుడికి సంగతర్థం అయిపోయింది. ఎందుకో భయపడి డబ్బులు ఇచ్చేశాడని రామూ సర్వరుకి అబద్ధం చెప్పినట్టు తెలిసిపోయింది రావణాసురుడికి. అంతే! ఇక విజృంభించేశాడు.
“అద్గదీ! పది పైసలకోసం అబద్దం సెప్పకయ్యా! సదువుకుంతన్నావు నేరుసుకో!” అంటూ వాతలు పెట్టాడు.
అవమానంతో చేసేదేమీ లేక, సొరుగులోంచి పది పైసలు తీసి ఇచ్చేశాడు రామూ.
గర్వంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రావణాసురుడు. అర్థం కానట్టు చూసి తన పనిలో పడిపోయాడు సర్వరు. అవమానంతో రామూ హృదయం దహించుకుపోయింది.
ఆ రాత్రి ఓ వారపత్రిక చదువుతూ వుంటే వచ్చింది వాడికో అయిడియా. దాంతో వాడి మొహం మీద చిరునవ్వు మొలిచింది. వాడికా రాత్రి కల్లోకి రావణాసురుడు రాలేదు. లవకుశ సినిమాకి వెళ్ళినట్టు కలొచ్చింది.
మర్నాడు స్కూలయ్యాక, భోజనం చేసి, ఆనందంగా వెళ్ళాడు హోటల్ డ్యూటీకి. “సిల్లర తెమ్మంతారేటీ?” క్లీనరు అడిగాడు.
“అక్కర్లేదు. నీ పని చూసుకో!” నవ్వుతూ చెప్పేశాడు.
రావణాసురుడు ఎప్పుడొస్తాడా అని రామూ తెగ ఎదురుచూడసాగాడు. తన దగ్గరున్న అయిడియా బ్రహ్మాస్త్రంలా తోచింది వాడికి. గురి చూసి రావణాసురుడి నాభి దగ్గర కొట్టడానికి రెడీగా వున్నాడు వాడు.
రోజూలాగా పది రూపాయల నోటు గల్లాపెట్టి మీద పడేశాడు రావణాసురుడు చిద్విలాసంగా. “బిల్లు పది పైసలు” అని ఓ పొలికేక పెట్టాడు సర్వరు ఎప్పటిలాగానే. రామూ మొహంలో చిరాకు గానీ, విసుగు గానీ, కోపం గానీ లేకపోవడం చూసి రావణాసురుడికి కాస్త ఆశ్చర్యం వేసింది. రామూ గల్లాపెట్టి కింద వున్న పెద్ద సొరుగులోంచి చిన్న మూట తీసి, విప్పి, రావణాసురుడి ముందర పెట్టాడు, “ఇదిగో నీ మిగిలిన చిల్లర” అంటూ.
ఆ మూటలో వున్నవన్నీ రెండు పైసల కాసులూ, మూడు పైసల అర్థణా కాసులూ! చాలా వున్నాయి. వాటివేపు ఆశ్చర్యంగా చూశాడు రావణాసురుడు.
“యేటియీ?” అనడిగాడు.
“ఇదే నా దగ్గరున్న చిల్లర! వుంటే పది పైసలు నువ్వియ్యి. లేకపోతే ఈ తొమ్మిది రూపాయల తొంభై పైసల చిల్లరా తీసుకెళ్ళు. అరువు ఇవ్వొద్దని మా నాన్న చెప్పేడు” చాలా అధార్టీగా అన్నాడు రామూ.
“యేటీ? ఇయ్యి అన్ని రూపాయలుంటాయా?” అనుమానంగా అడిగాడు.
“అవును. జాగ్రత్తగా లెక్క పెట్టాను. కావాలంటే లెక్క పెట్టుకో నువ్వు!” అని మేకపోతు గాంభీర్యంతో అన్నాడు రామూ.
సర్వరు నవ్వు మొహంతో చూస్తున్నాడు.
రావణాసురుడికేం చెయ్యాలో పాలు పోలేదు. ఆ చిల్లర మూట తీసుకుని, ఆ కాసులు లెక్క పెట్టుకోవడానికి ధైర్యం చాలలేదు రావణాసురుడికి.
నోరెత్తకుండా తన పదిరూపాయల నోటు వెనక్కి తీసుకుని, అక్కడ పది పైసలు పడేసి వెళ్ళిపోయాడు వెర్రి మొహంతో.
విజయగర్వంతో మూట లోపల పెట్టుకున్నాడు రామూ.
“తొమ్మిది రూపాయల తొంబై పైసల కాసులు యేడనించట్టుకొచ్చావు, సిన పొప్పయిట్రూ?” అని ఆశ్చర్యంగా అడిగాడు సర్వరు.
“అబ్బే! ఇవి అన్ని రూపాయలుండవు. నాలుగు గుప్పెళ్ళ కాసులు. మా నాన్న ఎప్పటి నించో పెద్ద సొరుగులో పడేసి వుంచాడు. రావణాసురుడు లెక్కపెట్టుకుని ఆ నాలుగు గుప్పెళ్ళ కాసులూ తీసుకోడని నా ధైర్యం” నవ్వుతూ చెప్పాడు రామూ.
“గట్టోడివే నువు” అని నవ్వుతూ పనిలో పడ్డాడు సర్వరు.
అప్పటినించీ రావణాసురుడు హోటల్లోకి అడుగు పెట్టగానే, ఆ కాసుల మూట తీసి గల్లాపెట్టి మీద పెట్టేవాడు రామూ. అది చూసి జడుసుకుని, రావణాసురుడు నోరెత్తకుండా పది పైసల బిల్లు కట్టి వెళుతూ వుండేవాడు.
రామూ హోటల్ కేషియర్ జీవితంలో వసంత రుతువు మళ్ళీ ప్రవేశించింది.