ఎవరీ సీతా, శూర్పణఖలు?

రామాయణం వంటి మత గ్రంధాలలోంచి పాత్రలను తీసుకుని కొత్త సంఘటనలు సృష్టించి కథలు రాయడమనే ప్రక్రియ తెలుగు సాహిత్యంలో చాలా కాలం నించీ వుంది. ఇటువంటి పద్ధతిలో కథలు రాసేటప్పుడు కొన్ని సూత్రాలను పాటించవలసి వుంటుంది. ఎన్ని కొత్త సంఘటనలను సృష్టించినా పాత్రలు తమ స్థాయికి మించిన చైతన్యంతో మాట్టాడకూడదన్నది అతి ముఖ్యమైన సూత్రం. అంటే సీత పాత్ర రాముడిని విమర్శిస్తూ, పురుషాధిక్యత గురించి అగ్నిపరీక్ష దగ్గర లెక్చరివ్వకూడదు. సీత పాత్ర అలా చేస్తే, ఆ పాత్ర తన స్థాయి పరిధులను దాటేసినట్టవుతుంది. అలాగే ఇంకో ముఖ్య సూత్రం రామాయణంలోని అసలు కథని మార్చెయ్యకూడదు. అంటే సీత అగ్ని పరీక్షని వ్యతిరేకించి, రాముడికి విడాకులు ఇచ్చేసినట్టుగా రాయకూడదు. అలాగే పాత్ర చిత్రణలో కూడా లేని గుణగణాలు జొప్పించకూడదు. అంటే సీతని అసూయాపరురాలిగానూ, కపటిగానూ చిత్రించకూడదు. ఇటువంటి సూత్రాలు పాటించకుండా రాస్తే, ఆ కథలు ఏవో ఆధునిక కథలు అవుతాయి గానీ, రామాయణానికి సంబంధించినవిగా వుండవు.

ఇటువంటి సూత్రాలను వుల్లంఘిస్తూ రాసిన కథ ఓల్గా “సమాగమం”.

“సమాగమం” కథని క్లుప్తంగా చెప్పుకోవాలి ముందర. వాల్మీకాశ్రమంలో పిల్లల కోసం ఎదురు చూస్తూ సీత భయపడుతూ వుంటుంది. సీత మనసు ప్రమాదాన్ని శంకించదు గానీ, పిల్లల ఆలస్యానికి కారణమేమిటీ అని భయపడుతూ, అయోధ్యానగరం గురించి ఆందోళన చెందుతూ వుంటుంది. అప్పటికే రామాయణాన్ని పూర్తిగా నేర్చుకున్న లవకుశులు బొత్తిగా అమాయకంగా, “ముక్కూ, చెవులూ కోసినట్టున్న ఒక కురూపిని” చూశామనీ, ఆవిడ ఒక అందమైన తోట పెంచుతోందనీ చెబుతారు. మర్నాడు సీత పిల్లలతో వెళ్ళి శూర్పణఖని కలుస్తుంది. కురూపి అయిపోయిన శూర్పణఖ బాహ్య సౌందర్యాన్ని ఇష్టపడటం మానేసి, ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధించడం మొదలుపెడుతుంది. ఒక దృఢకాయుడిని పురుష సాహచర్యానికి పెట్టుకుంటుంది. సీత మీద బోలెడు జాలి చూపించి ఫెమినిస్టులా మాట్టాడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా పెద్ద విషయాలు మాట్టాడేసుకుంటారు. చివరికి పిల్లలు అయోధ్యా నగరానికి వెళ్ళిపోయేక, సీత వచ్చి శూర్పణఖతోనే వుంటానని ఒప్పుకుని, పిల్లలకు ఆ తోటకి దారి మర్చిపోవద్దని చెబుతుంది. (ఆ తోటకి దారి మర్చిపోకుండా వుండాల్సింది సీతే గానీ, రాజ్యానికి వెళ్ళబోతున్న లవకుశులు కాదు కదా!) ఈ కథని ఆధారంగా చేసుకుని, మనం రెండు విషయాలు చర్చించాలి: 1. పాత్రల చిత్రణ 2. ఈ కథలోవున్న ఫెమినిజం

 

పాత్రచిత్రణ

 

ఈ కథ లవకుశులను బొత్తిగా అమాయకులుగానూ, సీతని కపటి గానూ, శూర్పణఖని ఫెమినిస్టుగానూ చిత్రించింది. శూర్పణఖ విషయాలన్నీ “ఫెమినిజం” కింద చెప్పుకుందాము.

అందరికీ తెలిసున్న రామాయణం ప్రకారం, లవకుశులు రామాయణాన్ని గానం చేస్తూ అయోధ్యా నగరం వెళతారు. వారికి రామాయణ పాత్రల వివరాలన్నీ తెలుసు. కానీ కుశుడు చాలా అమాయకుడిలా, “ఆమె మనిషంతా బాగానే ఉందమ్మా. కానీ ముక్కూ, చెవులు లేవు. ఎవరో కోసినట్టు అక్కడంతా పెద్ద లొట్ట” అని “ముఖం చిట్లించుకుంటాడు.” ఆ పిల్లలకి శూర్పణఖ అనే పేరు బొత్తిగా గుర్తు రాదు. ఎంతో మంది ముక్కూ, చెవులు కోసేసినవాళ్ళని తరచుగా చూస్తున్నట్టూ, వారిలో ఈవిడొకరన్నట్టూ మాట్టాడతారు. పోనీ చిన్నపిల్లలా అనుకుంటే, అయోధ్యా నగరానికి వెళ్ళి గానం చేసి వచ్చిన వారూ, అరణ్యంలో ధైర్యంగా తిరుగుతూ అడవి జంతువులను మచ్చిక చేసుకునే వారూ! వాల్మీకి దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకున్నవారూ!

లవకుశులు కనీసం, “ఆవిడెవరో శూర్పణఖని గుర్తుకు తెస్తోంది” అనన్నా అనరు. పైపెచ్చు, సీత కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నపుడు కూడా వారికి ఏమీ అర్థం గాక, “ఏంటమ్మా ఇది. ఎవరి అనాకారితనం గురించో విన్నంత మాత్రాన ఇంత బాధ పడతావెందుకమ్మా” అని “ఆశ్చర్య”పోతారు.

వీరి అమాయకత్వం ఇక్కడితో ఆగదు. “రేపు నన్ను ఆ ఉద్యానవనానికి తీసుకెళ్తారా?” అని తల్లి అడిగినపుడు కూడా వారికి అదేమీ విచిత్రంగా అనిపించదు. లవకుశులని సీతా, శూర్పణఖల సమాగమంలోకి తీసుకువెళ్ళడం రచయిత్రికి ఇష్టం లేదు. వారిని దూరం చేయడానికి గల ఏకైక మార్గం వారిని అమాయకులుగా చిత్రించి, వాళ్ళని ఓ పక్కన అట్టే పెట్టి వుంచడం. అందుకోసం ఇటువంటి తర్కానికి అతకని పాత్ర చిత్రణ.

ఇంక సీత సంగతికి వద్దాం. ఈ కథ, సీతని ఒక పెద్ద కపటిగా చిత్రీకరించింది. దానికి ఒకటి కాదు, చాలా వుదాహరణలున్నాయి. శూర్పణఖ, సీతని చూసి, “సీతా — అంటే శ్రీరామచంద్రుని …” అని అంటుంది. దానికి బదులుగా సీత, “శూర్పణఖను మధ్యలోనే ఆపేసి, ‘నేను సీతను. జనకుని కుమార్తెను. జానకిని. భూపుత్రిని’ అంటుంది అభిమానంతో.” ఇక్కడా తండ్రి కూతురే! తల్లి విషయమే లేదు. “భూపుత్రిని” అంటూ “దేవత”కి కూతురుగా చెప్పుకోవడమే గానీ, జనకుడి భార్యగా వుంటూ, తనని నిజంగా పెంచి, పోషించిన తల్లి విషయం మాత్రం లేదు. పోనీలెండి, సీతను శూర్పణఖలా ఫెమినిస్టుగా చిత్రీకరించలేదు. మన ఫెమినిస్టు శూర్పణఖ కూడా, “మీ అమ్మ పేరు చెప్పవేం?” అని అడగదు. ఎందుకో, తర్వాత “ఫెమినిజం”లో చూద్దాం.

మొత్తానికి, భర్త “పరిత్యజించాడ”నే అవమానంతో, ఆ మనిషి భార్యగా చెప్పుకోలేదు “అభిమానం”తో. అదే సీత కాస్సేపు పోయాక, “ఔను. నేను రాముని పత్నిని. పట్టమహిషిగా నా బాధ్యతలు నెరవేర్చలేకపోయాను. రామరాజ్యానికి వారసులనైనా అందించాలిగా.” అని ఆత్మాభిమానంలేని మాటలంటుంది.

ఇంతకు ముందేగా శ్రీరామచంద్రుని మనిషిగా చెప్పుకుంటే, “అభిమానం” లేని పని అయ్యిందీ! ఇప్పుడు సీత, “కుమారుల పెంపకంలో నా జీవితం సార్థకమవుతోంది” అన్నప్పుడు, శూర్పణఖ, “అదే నీ జీవితాదర్శమా?” అని అడగ్గానే, రాముడూ, రాణీగారి పదవీ ఎగురుకుంటూ వచ్చేశాయి సీతకి. రాజ్యాల గురించి మాట్టాడుతున్నపుడు, సీత, “నాకు అరణ్యవాసమే ప్రియం. రాముడు పరిత్యజించినా ఈ వనవాసం నా క్లేశాన్ని తగ్గించింది.” అని అంటుంది.

ఈ సీతే, పిల్లలు అరణ్యంలో మత్తగజాన్ని చూపించినపుడు, “పట్టపుటేనుగుపై ఊరేగిన రోజులను తలుచుకుంటుంది.” ఈ తలుచుకోవటం కూడా ఆ పట్టపుటేనుగుపై ఊరేగడం మీద అయిష్టంతో కాదు. అదే సీత అంతకు ముందర రాముడితో కలిసి అరణ్యావాసం చేసినపుడు బోలెడన్ని నగలు వేసుకుని, ఇంటిపనులు చేసుకున్నప్పుడు, తనని చూసి శూర్పణఖ, “తన ఆభరణాల వంక విచిత్రంగా చూసింది. పరిమళం లేని, సౌకుమార్యం లేని ఆ బరువులెందుకు మోస్తున్నావన్నట్టే చూసింది.” అని అనుకుంటుంది. శూర్పణఖ, “ఎన్నడూ రాజ్యంలో వుండక పోయినా నీ జీవితం రాజ్యంతో ఎలా ముడిపడి పోయిందో కదా సీతా” అనంటే, సీత “రాజపత్నినయ్యాక తప్పదు కదా” అని “నవ్వుతుంది.” పట్టపుటేనుగులను తలుచుకుంటూ, అరణ్యవాసంలో కూడా నగలు దిగేసుకుని ఇంటిపనులు చేసుకుంటూ, “రాజపత్ని” అని “నవ్వుతూ” చెప్పుకునే సీత, “నాకు అరణ్యవాసమే ప్రియం” అని అంటే నమ్మేదెలాగా?

ఈ కథలో సీతకువున్న అరణ్యవాస ప్రియత్వం అంతా, ఎప్పుడైనా అరణ్యంలో, నగలేసుకుని ఒకటీ, రెండు రోజులుండటానికే గానీ, కలకాలం రాజ్యాలు వదిలేసి వుండాలని కాదు.”అందని ద్రాక్ష పళ్ళు పుల్లన” అన్న సామెత లాగా, సీత తన్ను తాను మోసగించుకుంటూ, శూర్పణఖని కూడా మోసగించడానికి ప్రయత్నిస్తుంది.

ఇంకో పెద్ద బాధ వుంది ఈ సీతకి. పిల్లలు తనపై ప్రేమ చూపిస్తున్నా, నగర భ్రాంతులకి లొంగి, తనని వదిలేసి వెళ్ళిపోతారని వాళ్ళ మీద అపనమ్మకం. “లవకుశులు అయోధ్య వెళ్ళి వచ్చిన నాటి నించీ సీత మనసులో పిల్లల గురించి అంతకు ముందులేని ఆందోళన చోటు చేసుకుంది. ఏదో తెలియని అలజడి మనసులో. ఇప్పుడూ అదే అలజడి. అరణ్యం గురించి కాదు నగరం గురించే – ….” అని ఈ కథే చెబుతుంది.

అంటే పిల్లలు పట్టణవాసపు మోజులకు లొంగి తనను వదిలి వెళ్ళిపోతారేమోనని, పిల్లలు ఆశ్రమానికి ఆలస్యంగా వచ్చినప్పుడల్లా “అలజడి”గా అనుకుంటుందని ఈ కథ వర్ణన. శూర్పణఖ, “తెలిశాక (శ్రీరాముని తనయులమని) వారిక అరణ్యమ్లో క్షణమైనా ఉంటారా”? అని అడుగుతుంది. “ఎందుకు వుండరూ, నా పిల్లలు నన్నొదిలి వెళ్ళరు” అని నమ్మకంగా అనదు సీత. పైపెచ్చు, “వారికి అరణ్యవాసం ఇష్టమే” అని “బలహీనంగా” అంటుంది. ఇదే సీత, ఇంతకు ముందే, “…రామరాజ్యానికి వారసులనైనా అందించాలిగా” అంటుంది. రెండూ పరస్పర వ్యతిరేక భావాలు. ఈ సీతని శూర్పణఖపై జాలి వున్న మనిషిలా చూపించాలని ఈ కథ తాపత్రయం.

శూర్పణఖ గురించి ఈ సీత, “తనను చూడటమే గాని మాటలు లేవు. సరాసరి రాముడి దగ్గరకి వెళ్ళింది. తను వీళ్ళ మాటల మీద ధ్యాస ఉంచే ఏవో పనులుచేసుకుంటోంది. కొద్దిసేపు గడిచేసరికి ఆశ్రమంలో రక్తపాతం. ఒక స్త్రీ హృదయ విదారక రోదన.” అని అనుకుంటుంది. “వీళ్ళ మాటల మీద ధ్యాస ఉంచి”న సీతకి, రాముడు లక్ష్మణుడిని శూర్పణఖ ముక్కూ,చెవులూ కోసెయ్యమని అనడం వినబడలేదంటే నమ్మాలా? ఆ మాటలు విని భర్తనీ, మరిదినీ కనీసం వారించే ప్రయత్నం కూడా చెయ్యలేదని మాటొస్తుంది కదా! అందుకని, “ఏవో పనులు చేసుకుంటూ” వుంటుంది “వీళ్ళ మాటల మీద ధ్యాస ఉంచిన” సీత. “కొద్దిసేపు గడిచేసరికి” అంతా నిశ్శబ్దంగా జరిగిపోయి, “రక్తపాతం” అయిపోయిందిట. ఇదీ ఈ కథ సీతని చిత్రించిన తీరు!

ఈ కథ ఈ సీతని “రాజకీయ విజ్ఞురాలి”గా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. సీత, “రావణుడి చెల్లెలని తెలియకపోతే రామలక్ష్మణులు శూర్పణఖనట్టా చేసేవారు కాదు. రావణుని రెచ్చగొట్టాలనే రాముడి అభిమతం, అతనితో కయ్యానికి కారణం కోసం వెతుకుతున్న రాముడి అన్వేషణ శూర్పణఖ వల్ల నెరవేరాయి. అదంతా రాజకీయం” అని అనుకుంటుంది.ఈ సీత, ఆ క్రూరత్వాన్ని ‘రాజకీయం’గా చూస్తుందే గానీ, భర్త చేసిన క్రూరత్వంగా చూడదు. ఈ కథలో సీత ఇంత విజ్ఞురాలిగా వుంటుంది.

సీత పిల్లలతో, “తప్పు నాయనా, మనుషుల ఆకారాలను చూసి వారిని అసహ్యించుకోరాదు. ఆమె కురూపి అయినా ఎంతో మంచి పూలతోట పెంచింది కదా” అంటుంది. కురూపిగా వుండి అందమైన పూలతోట పెంచకపోతే కష్టమే మరి!!

ఆ తర్వాత, “ముక్కూ,చెవులూ లేని ఆ కురూపిని ఇంకెవరు ప్రేమిస్తారు?” అని అనుకుంటుంది. “ఇంకెవరు” అనే పదప్రయోగంలో సీత కపటత్వం అర్థం అవుతోంది. “ఇంకెవరు” అనే పదం “బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చూసి ప్రేమించే పురుషులు” అనే అర్థాన్ని ఎంత మాత్రమూ ఇవ్వదు.

ఈ కథలో సీతకి అందచందాల తోటే ప్రేమలుండాలని నమ్మకం! శూర్పణఖని కురూపి చెయ్యడం గురించి, ఈ సీత, ఒకసారి, “రామ లక్ష్మణుల క్రూరమైన పరిహాసానికి పాపం కురూపియైపోయింది” అంటుంది. ఇంకోసారి “రాజకీయం” అంటుంది. “పరిహాసమో”, “రాజకీయమో”, “రాజకీయ పరిహాసమో”, లేక “పరిహాస రాజకీయమో” సీతన్నా తేల్చుకోవాలి, లేదా రచయిత్రన్నా చెప్పాలి పాఠకులకి!

సాటి స్త్రీని కురూపిని చేస్తుంటే, తను వారించే ప్రయత్నం కూడా చెయ్యనందుకు సీతకి ఎక్కడో గిల్టీ ఫీలింగు వుంది. అందుకే, “ఎంత శపించిందో ఆ చర్యకు. ఆ శాపం ఇంకా తనను వీడినట్లు లేదు” అని అనుకుంటూ, “తనను చూసి శూర్పణఖ ఏమంటుంది? తన మీద కోపంతో మాట్లాడదేమో!” అని అనుకుంటుంది. శూర్పణఖకి సీతపై కోపం వుండటం సహజమే కదా! ఈ విధంగా ఈ సీత రచయిత్రి చేతిలో పడి కపటత్వం గల మనిషిగా అయిపోయింది.

 

ఫెమినిజం

 

ఈ కథలో శూర్పణఖను చూడండి. “గొంతెత్తి “సుధీరా!” అని పిల్చింది. సార్థకనామధేయుడైన ఒక దృఢకాయుడు అక్కడకి వచ్చాడు. “ఈమె సీత” సుధీరుడు గౌరవంగా నమస్కరించాడు. “సీతకు నిన్ను చూపాలనే పిల్చాను.” ఆ మాటతో సుధీరుడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు.”

పురుష సహచర్యం లేకుండా స్త్రీలని వుంచడం ఈ కథకి ఇష్టం లేకపోయింది. అందువల్ల దృఢకాయుడైన పురుషుణ్ణి శూర్పణఖకి ఏర్పరచింది. ఈ రోజు పురుషుడు చేస్తున్న చెత్త పని, రేపు స్త్రీ చేస్తే అది సమానత్వం అయిపోయిందా? అదేదో, “ఇంతవరకూ ఏ స్త్రీ పురుషుల మధ్యా తను చూడని బంధమేదో వీరి మధ్య ఉన్నట్లనిపిస్తుందా” ఎవరికైనా, ఈ సీతకి తప్ప? స్త్రీ, పురుషులు తమ స్థానాలను తమ సంబంధంలో తారుమారు చేసుకుంటే, అదేదో “జంబలకిడి పంబ” సినిమాలా తయారవుతుంది తప్ప, సమస్యకి పరిష్కారం వస్తుందా? ఈ దరిద్ర సినిమాలో, ఏదో జరిగి, ఆడవాళ్ళందరూ ఛాతీలూ విరగబెట్టి నడుస్తూ, మొగుళ్ళని కొడుతూ వుంటారు; మొగవాళ్ళు తువ్వాలు పమిటలా వేసుకుని తిప్పుకుంటూ ముగ్గులు వేస్తూ వుంటారు.

ఒక సమస్యని పరిష్కరించాలంటే, ఇంకో సమస్యని సృష్టించాలా? స్త్రీలని పైకి తీసుకురావడం అంటే పురుషులని నొక్కి పెట్టడమనా? అప్పుడు పురుషోద్ధరణ వుద్యమం మొదలవదూ?

సుధీర్ని పిలిచి పరిచయం చేశాక, ఆ సుధీర్, “మీరు మాట్టాడుకుంటూ వుండండి. మజ్జిగో, మంచి నీళ్ళో తెచ్చిస్తాను” అని లోపలకి పోతే, ఎంత అర్థవంతంగా, గౌరవంగా వుంటుంది? ఈ “సమాగమం” శూర్పణఖకి సుధీర్ ఒక అలంకారం మాత్రమేనన్న మాట! ఈ శూర్పణఖ “సుధీర్” అని పిలిస్తే ఎవరొచ్చారో చూడండి!

“సార్థకనామధేయుడైన ఒక దృఢకాయుడు అక్కడకి వచ్చాడు.”

“సార్థకనామధేయుడు” అని ఎలా తెలిసిందో! వంటిట్లో పని చేసుకుంటూ, తలుపు వెనక నించీ, “పిలిచారా? ఏం కావాలండీ?” అని శూర్పణఖని అడగకుండా బయటకి వచ్చినందుకు, “సుధీర్” మంచి ధైర్యం గలవాడు అయిపోయాడా? లేక రచయిత్రి పొరపాటున “సుధీర్” అంటే “మంచి బలం గలవాడు” అని అనుకుని, “దృఢకాయుడు” అని రాశారో!

సరేలెండి! ఇంతకీ వచ్చింది ఎవరూ? “దృఢకాయుడు”! స్త్రీలు సోయగాలతో అందంగా వుండాలీ, పురుషులు దృఢంగా మగతనంతో వుండాలీ అనేది ఫ్యూడల్ సాహిత్య దృష్టి. ఈ రచయిత్రికీ ఇదే దృష్టి. ఈ కథలోని శూర్పణఖకీ ఇదే దృష్టి.

ఇంతకీ ఈ దృఢకాయుడు ఎటువంటి వాడుట? “నా చేతుల్లోంచి ప్రకృతిలోకి ప్రవహించే సౌందర్యాన్ని కొద్దిసేపు తనది చేసుకుని, తనను నాకర్పించుకునే అదృష్టవంతుడు” అంటుంది శూర్పణఖ. ఇది అహంభావమా, ఆత్మవిశ్వాసమా అన్నది పాఠకులు తమ తమ చైతన్యాలతో ఎవరికి వారు అర్థం చేసుకోవాలి. స్త్రీకి అర్పించుకునే పురుషుడూ! పురుషుడికి అర్పించుకునే స్త్రీ! రెండూ గాడిదలే! ఒకరికొకరు అర్పించుకోవడమన్నదే సరైన విషయం!

“రామరాజ్యానికి వారసులనైనా అందివ్వాలిగా” అని సీత అంటే,శూర్పణఖ, “నువ్వేమన్నా వారసులనందించే యంత్రానివా” అని మాట వరసకన్నా అనదు. ఇదీ ఈవిడ నేర్చుకున్నా సమానత్వ సిద్ధాంతం!

ఈ కథలో సీత, “నేను సీతను. జనకుని కుమార్తెను. ….” అని అన్నప్పుడు, మన ఫెమినిస్టు శూర్పణఖ, “నిన్ను పెంచిన మీ అమ్మ సంగతేమిటీ?” అని అడగదు. వీళ్ళందరూ స్త్రీలను తండ్రి పరంగానో, భర్త పరంగానో గుర్తించడం అంటే ఎటువంటి అభ్యంతరమూ లేనివాళ్ళే!

అమాయకులైన కుశలవులూ, కపటత్వంగల సీతా, ఫెమినిస్టు శూర్పణఖా, వెరసి “సమాగమం” కథ!

ఒక మత గ్రంధంలోవున్న మూల కథనీ, పాత్రల్నీ మార్చకుండా, అందులోవున్న వైరుధ్యాల్ని వెలికితీయడం సరి అయిన పద్ధతి అవుతుంది. అలా గాకుండా, అందులో వున్న పాత్రల పేర్లూ, వాటి కొన్ని గత అనుభవాలూ మాత్రమే తీసుకుని, మన కిష్టమొచ్చిన చైతన్యాన్ని ఆ పాత్రలకాపాదిస్తూ కథ రాస్తే, అది రామాయణానికి చెందినదిగా అవదు, ఇంకేదో అవుతుంది.

రామాయణ మూలకథలో సీతా, శూర్పణఖలు కలిసే అవకాశమే లేదు. వేరు, వేరు శత్రు జాతులకు చెందిన ఈ స్త్రీలను, స్త్రీ జనోద్ధారణ పేరుతో కలపడం యేమిటీ? పాత్రల స్వభావాన్ని ఇష్టం వొచ్చినట్టు మార్చేసేటట్టయితే, దానికి రామాయణ పాత్రలెందుకూ? రామాయణంలో పాత్రలు, రామాయణకాలం పాత్రలుగా వుండాలా, వేరే కాలం పాత్రలుగా వుండొచ్చా?

ఇలాంటి అయోమయ కథలు ఇంకా వస్తుండబట్టే, చాలామందికి స్త్రీ,పురుష సమానత్వం గురించి ఇంకా సరిగా అర్థం కాకుండా పోతోంది.

(అయిపోయింది)