ఉత్తమాయిల్లాలు

భార్య శవం ముందు కూర్చుని, కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు శ్రీరంగశయనంగారు.

ఆయనచుట్టూ అయినవాళ్ళూ, కానివాళ్ళూ, దారిని పోయేవాళ్ళూ చేరి, సర్వవిధాలా అనునయవాక్యాలు చెబుతూ తమవిధిని నిర్వర్తించుకుంటున్నారు.

కొడుకు చక్రధరం వారిని యధావిధి పలకరిస్తూ, వారి ప్రశ్నలకి తోచినట్టు జవాబులిచ్చుకుంటూ, తండ్రినో కంట గమనిస్తూ ఉన్నాడు.

శ్రీరంగశయనం పైపంచెతో కళ్ళొత్తుకుంటూ చెప్తున్నారు. “పదహారేళ్ళు దానికి పెళ్ళినాటికి… నాకు ఇరవైమూడు. ఎంత మర్యాద, ఎంత మప్పితం అంటూ మా అమ్మా, నాన్నా ఎంత మురిసిపోయేరో పిల్లని చూసి! …ముప్ఫైనాలుగేళ్ళ కాపురంలో ఒక్కరోజు నోరు విప్పి తనకిది కావాలని కోరలేదు. …నాకేం కావాలో చూసిందే కానీ తనకేం కావాలో చెప్పలేదు. …అనుక్షణం నేను తిన్నానో, లేదో అంటూ తపనపడిపోయిందే కానీ తను తినాలన్న యావ లేదు …అకస్మాత్తుగా పదిమంది గుమ్మంలోకొస్తే కిక్కురుమనకుండా వండి పెట్టిందే కానీ ఇసుమంతయినా ధుమధుమలాడలేదు. కంచాలముందు కూర్చునే వేళకి మరో నలుగురు వచ్చినా సర్దుకుపోయిందే కానీ చిరాకుపడలేదు. …తను తినేవేళకి గిన్నెలో అన్నం నిండుకుంటే, పోన్లెద్దురూ ఓపూట తినకపోతే ఏం అనే అంది కానీ మరోలా వ్యథ పడలేదు. అంతటి ఉదాత్తురాలు. అటువంటి ఉత్తమురాలు మరి పుట్టబోదు…”

“అవునండీ, ఆమెని తలుచుకుంటే చేయెత్తి దణ్ణం పెట్టాలనిపిస్తుంది” అన్నారు పొరుగింటి సుబ్బారావు ఆయన్ని ఓదారుస్తూ.

నలుగురూ చేరి శ్రీరంగశయనంగారిని రెక్క పుచ్చుకు బలవంతాన లేవదీశారు, మిట్ట మధ్యాన్నానికయినా దహనం అయిందనిపిస్తే, ఆ తరవాత ఇంకా చేయవలసిన విధులు చాలా ఉన్నాయని.

తండ్రీకొడుకులిద్దరూ తలలు బోడి చేయించుకుని, స్నానాలు చేసి పంచెలు కట్టుకుని వచ్చారు.

ముత్తయిదువులు శవానికి స్నానం చేయించి, కొత్తచీరె కట్టి, పసుపూ, కుంకమలతో, పువ్వులతో అలంకరించి పాడెమీద ఉంచేరు. కర్మకాండ పూర్తయేసరికి నాలుగయింది.

అంతసేపూ శ్రీరంగశయనం ఆరారా గుక్క తిప్పుకుని భార్య సుగుణపుంజాన్ని కోమటింట చిట్టా ఆవర్జాల్లా వల్లిస్తూనే ఉన్నాడు.

కాస్త ఎడంగా నిలబడి ఈ తంతు తిలకిస్తున్న ఒకరిద్దరికి ఆయన వరస కాస్త అతిగా కూడా అనిపించింది.

“నేనెంత చెప్తే అంత. ఒఖ్ఖరోజంటే ఒఖ్ఖరోజు నామాటకి ఎదురాడితే ఒట్టు. నాకు నేనై పోనీలే అని ఊరుకోవాలే కానీ తానయి ఒక్కరోజయినా నావల్లకాదండీ అన్లేదు పుణ్యాత్మురాలు… ” అన్నాడాయనే మళ్ళీ అందుకుని.

“అవును మరి. ఉత్తమాయిల్లాలు,” అన్నాడు సుబ్బారావుగారు.

పెళ్ళినాటికి అమ్మాయికి పదహారు. ఆ బ్రహ్మముహూర్తం ఆసన్నమయేవరకూ ఆరేళ్ళ పసిదానిలా నిష్పూచీగా ఆడుతూ పాడుతూ తిరిగింది చిన్నప్పగారి పెదవానిపాలెంలో. సాంప్రదాయకమయిన కుటుంబం. నలుగురు మగపిల్లల తరవాత అపురూపంగా పుట్టిన ఆడపిల్ల. తండ్రి ఎంతో ముద్దుగా చూసుకున్నాడు. మరీ అంత ముద్దేమిటి, పిల్లని పాడు చేస్తున్నారని తల్లి కసిరినా, మురిపెంగానే కానీ ముటముటలాడుతూ కాదు. పదును లేని ఆ విదిలింపులకి, తండ్రి కళ్ళు చికిలిస్తూ, “నీమురిపేనికి మాత్రమేం తక్కువ” అనేవాడు వెక్కిరిస్తూ.

శ్రీరంగశయనం మెరికలాటి కుర్రాడనీ, పట్నంలో లాయరుప్రాక్టీసు పెట్టేడని ఎవరో చెప్తే విని తండ్రి మధ్యవర్తి ద్వారా కబురు పెట్టేరు. అట్టే ఆర్భాటం లేకుండానే వివాహం నిశ్చయమయిపోయింది. అటూ ఇటూ కూడా ఆనందంగానే కార్యం అయిందనిపించేరు. పిల్లని పసుపుకుంకాలతో అంపకాలు పెడుతుంటే తల్లిగుండెలే కాదు తండ్రిగుండెలు కూడా అవిసిపోయేయి. ఎన్నో సుద్దులు చెప్పి అప్పగింతలు పెట్టేరు. ఇది ముప్ఫైనాలుగేళ్ళకి ముందు మాట.

చుట్టూ చేరిన జనం శ్రీరంగశయనంగారి మాటలు నిజం నిజం అంటూ తమ సానుభూతి తెలియజేసి, ఆ మహాఇల్లాలు పట్టెడు పసుపూ, కుంకుమలతో పుణ్యస్త్రీగా తరించినందుకు హర్షం వెలిబుచ్చారు.

ముఫ్ఫైనాలుగేళ్ళపాటు నిసువుని సాకినట్టు కట్టుకున్నవాడి ఆలనాపాలనా చూసుకున్న ఇల్లాలు కన్ను మూసింది. మళ్ళీ అంతటి నియమనిష్ఠతోనూ ఇప్పుడు ఎవరు తనకి చేస్తారనుకుంటూ దుఃఖిస్తున్నారు ఆయన.

పక్కింటి సుబ్బారావుగారు ఆయనవేపు ఓమారు చూసి, “హుం, నిన్నటికీ ఇవాళ్టికీ ఎంత వ్యత్యాసం!” అనుకున్నాడు. నిన్న కొట్టొచ్చినట్టు కనిపించిన ధీమా ఈరోజు మచ్చుకయినా కనిపించడంలేదు ఆయన ముఖంలో. మనిషి సగానికి సగం తగ్గిపోయాడు. దివాలామొహం పడింది. “భార్య ఆసరా అలాటిది”, అని కూడా అనుకోకుండా ఉండలేకపోయేరు.

హాల్లో కూర్చుని, “కాఫీ తే”, “నా చెప్పులేవీ”, “కళ్ళజోడు ఎక్కడ పెట్టేనో చూడు” అంటూ కేకలేస్తే, వినిపించుకోడానికి ఆవిడ లేదింక. ఆయన బాధ అదేనేమో అని కూడా అనిపించింది సుబ్బారావుగారికి.

ఆ వెంటనే, ఛీ, ఛీ, పాడు ఆలోచన అని తనని తనే చీవాట్లు వేసుకున్నాడు.

ఆవిడ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరరు. అదే కాలేజీలో గౌతమి ఇంటరులో చేరింది. వాళ్ళున్న వీధిలోనే ఆ చివరింట్లో ఉండేవారు. గౌతమి కాలేజీకి బయల్దేరేవేళకే ఆవిడా బయల్దేరేది. ఒకటిరెండు సార్లు రోడ్డుమీద కనిపిస్తే, రా అంటూ రిక్షాలో ఎక్కించుకుంది. రిక్షావాడు మొదటిరోజు ఏం అనలేదు కానీ రెండోరోజు, “కాలేజీ అప్పులో ఉద్దర్ని నాగాల. కస్టం సూడండమ్మగోరూ“ అంటూ నసిగేడు.

“ఆవిడ అలాగేలే, పద” అని, రిక్షా దిగింతరవాత, వాడిచేతిలో మరో రూపాయి ఎక్కువ పెట్టింది. ఆసంగతి గౌతమి వాళ్ళమ్మతో చెప్తే, ఆవిడ రిక్షావాడితో మాటాడి, గౌతమిని కూడా ఆ రిక్షాలోనే రోజూ తీసుకెళ్ళే ఏర్పాటు చేసింది.

ఆవిడ గౌతమికంటే సుమారు పదిహేనేళ్ళు పెద్ద. మొదట్లో గౌతమికి మొహమాటంగా ఉండేది కానీ నాలుగురోజులయేక, అలవాటయిపోయింది. పత్రికలలో వస్తున్న సీరియల్స్ గురించి మాటాడుకునేవాళ్ళు ఇద్దరూ. తనకి చాలారోజుల వరకూ తెలీలేదు. ఆవిడ కూడా కవితలూ, కథలూ రాస్తోందని. శ్రీరంగవల్లి అన్న పేరుతో కవితలూ, కథలూ రాస్తున్నారుట. ఆవిడపేరు వేదవల్లి!

“మరి మీరు రాస్తున్నారా? లాయరుగారు రాస్తున్నారా నిజంగా?” అడిగింది గౌతమి ఓరోజు.

ఆవిడ చిన్నగా నవ్వి, “నువ్వేం అనుకుంటున్నావు?” అన్నారు, కొనకళ్ళ కొంటెతనం మెరిపిస్తూ.

గౌతమి ఆలోచించి, “మా స్నేహితులు చాలామంది ఆయనే రాసి మీపేరు పెట్టేరంటున్నారు. నేను అనుకోడం మీరే రాస్తున్నారు అని,” అంది సీరియస్‌గా.

ఆవిడ నవ్వేసి, మాట మార్చేశారు.

శ్రీరంగశయనం కొడుకుతో మళ్ళీ తనకథ కొనసాగించేడు, “నేను కంచంముందు కూర్చుని ఆ కబురూ ఈ కబురూ, జరిగినవీ విన్నవీ చెప్తే, తను కథలు కథలుగా రాస్తూండేది. నేనే చెప్పేను పత్రికకి పంపమని. నా ప్రోత్సాహమే లేకపోతే, మీఅమ్మ పేరు ఎవరికీ తెలిసేదే కాదు. మీరే కదా చెప్పేరు కథ, మీ పేరు మీదే పంపండి, అంది మొదట్లో. అంతటి వినయం మీ అమ్మది. సరే ఇద్దరి పేరు మీదా పంపించు అన్నాను నేను. అసలు శ్రీరంగశయనం అనే పెట్టాలిసింది. శ్రీ అంటే సిరి, ఆవిడే కదా నా సిరి. మళ్ళీ నాకే తోచింది శ్రీరంగవల్లి అని. ఒరిజినల్‌గా ఉంది కదూ. పత్రికలవాళ్ళు ఆడపేరు చూస్తే, తిరుగు లేకుండా వేసేసుకునే రోజులవీ”, అన్నారాయన నిట్టూర్చి. పత్రికలవాళ్ళు అలా ఆడపేరు కోసం ఆరాటపడకపోతే, రచయితపేరు శ్రీరంగవల్లి కాకపోను అన్నట్టుందామాట చక్రధరానికి.