అంతర్మథనం

కొత్తపాళీ బ్లాగులో ఇచ్చిన ఇతివృత్తానికి కథ రాయండి అనే సవాలుకి జావాబుగా వచ్చిన కథ ఇది. ఇదే ఇతివృత్తంపై ఇంకో కథ ఇదే సంచికలో.


మిట్ట మధ్యాహ్నం ఎండ చిర్రెత్తిస్తోంది. చెమటలు ధారాళంగా కారుతున్నాయి.

“పేరుకే బస్టాండు కానీ పశువుల పాక కన్నా హీనం.. ప్రయాణీకులు నుంచోడానికి ఒక షెల్టరూ లేదూ పాడూ లేదు.. ఎప్పటికి ఈ ఊరు బాగుపడుతుందో..? అయినా ఈ రాజకీయ నాయకులందరూ ఓట్లు అడుక్కోడానికి వస్తారు తప్ప ఎప్పుడైనా జనాల ఇబ్బందులని పట్టించుకొని ఏడ్చారా..?” నా ఊరి జనాల అమాయకత్వం మీద జాలేసింది.

“ఈ బస్సు ఎప్పుడొస్తుందో..? ఈ లోపల చెమటతో తడిసి ఇంతా కష్టపడి కొనుక్కొన్న టీషర్టూ, జీన్సు పేంటూ నలిగి నాశనమవుతాయో ఏంటో…? అయినా MCA తణుకులో చదువుతుంటే ఆ మాత్రం బిల్డప్పు లేకుంటే ఏంబావుంటుంది…?” అంత అసహనంలోనూ నన్ను నేనే సమాధానపరచుకొన్నాను.

చుట్టూ చూసాను. ఎండ బాధ తాళలేక కొంతమంది దగ్గిర్లో ఉన్న కిళ్ళీకొట్టు కిందకి చేరి సేద తీర్చుకొంటున్నారు. “మనమూ కాసేపు అక్కడ కూర్చొని ఓ నిమ్మసోడా తాగితే పోలా..?” అనిపించింది. “అయినా కాలేజీ స్టూడెంటు అయ్యుండీ చీపుగా నిమ్మసోడా తాగితే ఏంబావుంటుంది..? కనీసం ఏ పెప్సీయో, కోకో అన్నా తాగాలి” అనుకొంటూ జేబు తడుముకొన్నాను. పది రూపాయల కాగితం నన్ను వెక్కిరించింది. రానూ పోనూ బస్సు చార్జీలకి అదే గతి. ఒక్కసారిగా నీరసం ఆవహించింది. “ఈ టెంపరరీ లేబ్ అసిస్టెంటు ఉద్యోగంతో, ఎదుగూ బొదుగూ లేని జీతంతో, కూల్‌డ్రింకు తాగడానికి కూడా వెనుకాడే జీవితం ఇంకెన్నాళ్ళో..?” అంత వేడిలోనూ నా నిట్టూర్పు నాకే వెచ్చగా తగిలింది.

“అయినా ఇంకెన్నాళ్ళులే..? ఈ MCA ఏదోవిధంగా లాగించేస్తే ఆ ప్రకాష్ గాడికి వచ్చినట్టు నాకూ ఏ హైదరాబాదులోనో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం రాకపోదా..? అయినా వాడికన్నా నేనేమి తక్కువ..?” నన్ను నేనే సమాధానపరచుకొన్నాను.

ఎండకి చెప్పులు ఉన్నా కాళ్ళు కాలుతున్నాయి. నెత్తి వేడెక్కుతోంది. “ఇంకొన్ని రోజుల్లోనన్నా వీలు చూసుకొని షూసూ, కూలింగు గ్లాసెసూ కొనుక్కొంటే బాగుంటుంది. ఈ ఎండలో కూడా చల్లగా పడి తిరగొచ్చు..” ఆలోచిస్తున్నాను నేను.. “అయినా, ఈ ఊళ్ళో పదోక్లాసు పాస్ కాని వాడు కూడా వాడి అబ్బ సొమ్ముతో బైక్ కొని తిరిగేస్తున్నాడు. మా నాన్న మాత్రం.. ఏదో కష్టపడి నన్ను డిగ్రీ చదివించినట్టూ, దానికే తన ఆస్తి ఊడ్చుకుపోయినట్టూ ముఖం పెట్టి ఇంక చదివించలేనంటూ ఈ డొక్కు ఉద్యోగంలో పడేసాడు. దానికి కూడా ఎవరి కాళ్ళో పట్టుకొన్నానని కబుర్లొకటి. ఎంతసేపూ అన్న పెట్టిన కిరాణాషాపు మీదే ధ్యాస తప్ప.. చిన్న కొడుకు కష్టపడి ఉద్యోగం చేస్తున్నాడు, ఆ డబ్బుతోనే పైచదువులు కూడా చదువుకొంటున్నాడు అన్న జాలి ఏమాత్రం ఉన్నా ఈ పాటికి ఒక బైకు కొనిచ్చేవాడు కాదా.? నాకు బస్సుకై వెయిట్ చేయాల్సిన దౌర్భాగ్యం తప్పేది కాదా..?” మా నాన్న మీద నాకున్న కసి ఎండతో పాటే పెరిగిపోతోంది.

పైగా, “చిన్నా..!! నువ్వు ఉద్యోగం చేస్తే, నేను ఇన్నాళ్ళూ పడ్డ శ్రమకి ఫలితం దక్కుతుందిరా..!! ఆ తరువాత నేను సుఖంగా కాలు మీద కాలు వేసుకొని విశ్రాంతి తీసుకొంటాను” అంటూ ఉంటాడు. “అసలుకు తగ్గ వడ్డీ రాబట్టుకోవాలనే స్వార్థం కాక మరేమిటి..? అయినా ఇంటి బాధ్యత అంతా పెద్దవాడైన అన్నది కానీ, నా మీద పెడితే నేనెలా వేగేది..? ఈ పార్ట్‌టైం MCA ఏదో పూర్తి చేసుకొని ఆ హైదరాబాదులో ఉద్యోగం సంపాదించగలిగితే.. ఈ ఊరూ, ఈ స్వార్థపరులైన మనుషులనీ వదిలి హాయిగా.. నా బతుకేదో నేను బతకొచ్చు..”

అంతకంతకీ నాలో అసహనం పెరిగిపోతోంది. “ఈ బస్సు ఎప్పటికొస్తుందో.? బస్టాండులో జనాలు చూస్తే పెరిగిపోతున్నారు. ఈ చెమటలో.. ఉక్కలో.. ఇంతమందితో బస్సు ప్రయాణం అంటేనే కంపరం పుడుతోంది. ఏం చేస్తాం..?” మరోసారి నిట్టూర్చాను. ఇంతలో ఎప్పటిలానే, బస్సు కంటే ముందుగా వచ్చి జనాలను ఊడ్చుకుపోయే ఆటో వచ్చి వాడబ్బా సొమ్మన్నట్లు గవర్న్‌మెంటు బస్టాండులో ఆగింది. “ఇక బస్సు ఇప్పట్లో వచ్చేలా లేదు. ఈ ఆటో ఎక్కితే ఒక అర్థో, రూపాయో ఎక్కువైనా సుఖంగా పోవచ్చు. పైగా ఈ డబ్బుకి కక్కుర్తిపడి చచ్చేవాళ్ళు ఎంతమందో..? ఎవడు పడితే వాడు ఎక్కడు కనుక ప్రయాణం హాయిగా ఉంటుంది.” అని ఆలోచిస్తున్నాను. “తణుకు.. తణుకు..” అంటూ ఆటోవాడు గొంతు చించుకొంటున్నాడు.

ఆటో దగ్గిరకి వెళ్ళి, జేబులోంచి దువ్వెన తీసి, రియర్ వ్యూ మిర్రర్‌లో చెరిగిపోయిన జుట్టును సరిగా దువ్వుకొని ఆటో ఎక్కి కూర్చున్నాను. ఇంతలో ఏదో పెద్ద వస్తువు పడ్డ శబ్దం వినిపిస్తే తిరిగి చూసాను. ఆటో పక్కగా కొబ్బరిబోండాలతో నిండుగా ఉన్న ఒక పెద్ద గోనెసంచీ కనిపించింది. దానితో పాటే బోండాలని చెక్కడానికి ఉపయోగించే కొడవలి పిడి కూడా ఆ సంచీలో నుంచీ కనిపిస్తోంది. విషయం ఏమిటని ఆటోలోంచి తల బయటకు పెట్టిచూస్తే, మోకాళ్ళు దాటని ఒక మాసిపోయి వదులుగా ఉన్న ఖాకీరంగు నిక్కరూ, చిరుగులతో ఉన్న చేతుల బనీనూ, నెత్తిన ఆకుపచ్చని తువ్వాలుతో చుట్టిన తలపాగా, మాసిన గెడ్డంతో ఉన్న ఒక వ్యక్తి ఆటోవాడిని బతిమాలుకొంటున్నాడు. “బాబ్బాబూ.. పొద్దుటినుంచీ బస్సు కోసం చూస్తన్నాను. ఇప్పటిదాకా రాలేదు.. ఈ బోండాలు అమ్ముకోకపోతే పూట గడవదు. లగేజీకి మాత్రం డబ్బులిచ్చుకోలేను.. కొంచం దయచూడు బాబు..!!” అతనిని చూస్తే అసహ్యం వేసింది. “ఇంత దేబిరించుకొని పట్నం పోయి అమ్ముకోకపోతే, అదేదో ఇక్కడే అమ్ముకు చావచ్చుగా..? అబ్బే.. ఇక్కడ బోండానికి మూడు రూపాయలు కూడా రావు. అదే పట్నంలో అయితే పది పన్నెండుకు తక్కువ కాకుండా అమ్ముకోవచ్చు.. ప్రతీ వాడికీ ఆశ..!!” ఒక బాధతో కూడిన చిన్న నవ్వు గొంతునుండీ బయటకు వచ్చింది.

అతను మొత్తానికి ఆటోవాడిని ఒప్పించినట్టున్నాడు. నా పక్కనే ఆటోలో ఓ మూలగా కూర్చొన్నాడు. తలపాగా తీసి, ఆ తువ్వాలుతో గాలి విసురుకొంటూ నావైపు చూసి నవ్వబోయాడు. నేను తల తిప్పుకొన్నాను. “ఈ ఆటోవాడికి కూడా ఇంతే.. ఎంతమందిని ఎక్కించుకొని ఎంత సంపాదించాలా అనే..!!”, విసుగూ, వ్యంగ్యం మేళవించిన గొంతుతో ఆటోవాడితో అన్నాను.. “బాబూ.. ఆటో ఈ రోజుకు బయలుదేరుతుందా..?” వాడు నా వైపు అదోలా చూసి ఇక ఈ వూర్లో ఎక్కేవారెవరూ లేరని నిర్ణయించుకొని ఆటో స్టార్ట్ చేసాడు.

ఆటో వేగంగా ముందుకు పోతుంటే, కాలువ పక్కగా వెనక్కి పరిగెడుతున్న చెట్లను చూస్తూ కూర్చొన్నాను. విసురుగా ముఖానికి తగులుతున్న గాలికి జుట్టు రేగిపోతుంటే ఎంతో చిరాకుగా అనిపిస్తోంది. మరో అయిదు నిమిషాల్లోనే ఆటో ఆగింది. తరువాత ఊరు వచ్చినట్టుంది. “ఇక్కడ ఎంతమందిని ఎక్కిస్తాడో వీడు..” అనుకొంటూనే బయటకు తొంగి చూసాను. మా ఊరి నాయుడుగారు ఆటో వైపుగానే వస్తున్నారు. “ఇదేంట్రా బాబు.. ఈయన తగులుకొన్నాడు.. అసలే కోతల రాయుడు.. డప్పాలతో పక్కవాళ్ళ ప్రాణాలు తోడేస్తూంటాడు. చచ్చాన్రా బాబూ..” అనుకొంటూ ఉండగానే.. నన్ను గుర్తుపట్టేసినట్లున్నాడు.. “ఏమోయ్.. ఎందాకా..?” అని పలకరించేసాడు. ఒకసారి ఆయన్ని తేరిపార చూసాను. కూలింగ్ కళ్ళజోడూ, చేతి వేళ్ళకి నలుగైదు ఉంగరాలూ, మణికట్టుకి బ్రాస్‌లెట్టూ, మెళ్ళోంచి బైటకు వేళ్ళాడుతున్న గొలుసూ, అంత ఉక్కలోనూ ఊదారంగు సఫారీ సూటూ.. తనదగ్గిరే సెల్లు ఉందనీ, అది అందరూ గ్రహించాలన్నట్టు చేతిలో సెల్‌ఫోనూ.. “ఏమోయ్.. పలకరిస్తే మాట్లాడవేమిటయ్యా..?” ఆటోలో నా పక్కన కూర్చొంటూ అడిగాడాయన. ఇక తప్పనిసరి అయినట్టు మొహాన నవ్వు పులుముకొని “తణుకు వరకండీ.. తమరు.. ఇలా..?” అని నసిగాను. “ఏం చెప్పమంటావోయ్..!! ఇవాళ నా కర్మ ఇలా తగలడింది. అర్జంటు పనిమీద తణుకు బయలుదేరానా..? కారు ట్రబులిచ్చింది. ఏదో ఏసీ కారులో సుఖంగా వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నానోయ్.. కానీ ఇలా..” చెప్పుకుపోతున్నాడాయన. “మొదలయ్యాయిరా బాబూ ఈయన కోతలు.. ఇక ప్రయాణం అంతా వేగాలి కాబోలు..” అనుకొంటూ ఉండగానే ఇద్దరు తల్లీకూతుళ్ళు అనుకొంటా ఆటో ఎక్కారు.

ఆటో బయలుదేరింది. తల్లీకూతుళ్ళిద్దరూ బాగానే ముస్తాబయ్యారు. చూడగానే వారు బీదవారనీ, ఏదో పనిమీద పట్నానికి బయలుదేరారనీ ఇట్టే తెలిసిపోతోంది. తల్లి బాగా గాడీగా కొట్టొచ్చినట్టుండే ఎరుపు రంగు చీర కట్టింది. హడావిడిలో కట్టడం వల్ల కామోసు కొంచం కాళ్ళపైకి కట్టింది. మొహాన కంగారుగా అద్దిన పౌడరు చెమటతో తడిసి తెల్లగా కనిపిస్తోంది. పెద్ద బొట్టు, ముక్కున లావు ముక్కుపుడక, మెడలో రోల్డుగోల్డు కామోసు.. ఒక మోటు నగ.. ఇక కూతురికి 13-15 సంవత్సరాల వయసు ఉండవచ్చు. ముదురాకుపచ్చ లంగా మీద లేతాకుపచ్చ ఓణీ కట్టింది. ఆరోజే తలంటినట్టున్న జుట్టును వదులుగా వదిలి ఒక రబ్బరుబాండు పెట్టింది. చిన్న బొట్టు.. మెడలో సన్నని గొలుసు.. ఎందుకో తనలో తానే నవ్వుకొంటూ మురిసిపోతోంది. ఇంతలోనే నాయుడుగారు రంగంలోకి దిగిపోయారు.

“ఏమ్మా.. ఎక్కడిదాకా..?” మాటలు కలిపారు నాయుడుగారు. “ఎక్కడికైతే ఈయనికి ఎందుకో..? ప్రతీవారి విషయం ఈయనకే కావాలి..” నేను మనసులో విసుక్కుంటూండగా.. “మా అమ్మాయికి మహేస్ బాబు బొమ్మంటే సానా పిచ్చి బాబూ.. ఆ బొమ్మ విడుదలైన కాడ్నించీ ఒకటే గొడవ.. పట్నం తీసికెళ్ళమని.. దాని పోరు పడలేక..” అందావిడ. ఎందుకో చూస్తుంటే ఆ తల్లీకూతుళ్ళిద్దరూ అంత హుందాగా అనిపించలేదు. దానికి తోడు నాయుడుగారు నన్ను కూడా కబుర్లలోకి లాగుతున్నాడు. “ఏమోయ్.. నువ్వు మీ అమ్మా నాన్నలను సుఖపెట్టాలోయ్..” అంటూ.. “ఈయనకేం.. ఉచిత సలహాలు ఎన్నైనా చెప్తాడు..” అని తిట్టుకొంటూ పైకి మాత్రం “అలాగేనండీ..” అంటూ ఊకొడుతున్నాను.

“మా అబ్బాయిని ఫారెన్ పంపిద్దామనుకొంటున్నానోయ్.. వాడు అమెరికా అంటున్నాడు గానీ.. నాకు యూరోప్ పంపించాలనుంది. అమెరికా పరిస్థితి అంత బాగాలేదంట కదా..? పైగా యూరో, డాలర్ కంటా ఎక్కువ విలువంట కదా..?” అడుగుతున్నాడాయన. నాలో కసి పెరిగిపోతోంది. “బాగానే పరిశోధించాడు. ఈయనకేం.. డబ్బుంది.. ఎంతైనా ఖర్చు పెట్టగలడు. ఏదైనా చేయగలడు..” రగిలిపోతున్నాను నేను.

“ఏమోయ్..నీకు రోజుకు ఎంత మిగులుతుంది..” రైతును కదిలించాడు. “ఏదో బొటాబొటిగా మిగులుద్దండీ..” అణకువగా సమాధానమిస్తున్నాడు వాడు. అందరినీ చూస్తుంటే నాకెందుకో అసహనం, కసి, కోపం పెరిగిపోతున్నాయి.

“నిజంగా ఈయన వీళ్ళపై ఆప్యాయతతోనే పలకరిస్తున్నాడా..? ఆటో దిగితే ఈయనెవరో, వాళ్ళెవరో.. అయినా ఈయన డాంబికాలకు వీళ్ళే దొరికారా..?” నా ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి.. “అలా అని వీళ్ళేమన్నా తక్కువ తిన్నారా..? ఆ రైతు, డబ్బును చూసి నాయుడుగారికి విలువ ఇస్తున్నాడు గానీ, లేకుంటే ఇంత నక్క వినయం చూపిస్తాడా..? ఆ రైతుకు మాత్రం లోలోపల ఈ డబ్బున్నవారిపై కసి పేరుకుపోయి ఉండదూ..? చాన్సొస్తే ఈ డబ్బున్నవాళ్ళందరి తలల్ని కొబ్బరిబొండాలు చెక్కినట్టు చెక్కేయాలని అనిపించదూ..? ఎందుకు ఈ లోకంలో అందరూ లోపల ఒకటుంచుకొని బయట మరొకటి మాట్లాడుతూంటారో అర్థం కాదు..”.

తల్లి కూతురి చెవిలో ఏదో చెప్తోంది. కూతురు ముసిముసి నవ్వులు నవ్వుతూ నాయుడుగారి వంకే చూస్తోంది. నాకు గుండె మండిపోతోంది. “ఈ ఆడవాళ్ళు మాత్రం దేనిలో తీసిపోయారు..? కూతురి సాయంతో ఈయన్ని బుట్టలో దింపి ఏ పదో పరకో సంపాదించాలనుకొంటున్నట్టుంది. డబ్బున్న వాళ్ళని చూస్తే అందరికీ దోచుకొని తినాలనే అనిపిస్తుంది. నేను మాత్రం ఇలాంటి వారికి లొంగకూడదు” నాకు నేనే జాగ్రత్త చెప్పుకొంటున్నాను. “అయినా ఈ నాయుడేమీ వెర్రివెంగళప్ప కాదుగా..? ఆయనికి మాత్రం తెలియదా ఎవర్ని ఎక్కడ ఉంచాలో..? ఎంతమంది ఇలాంటి అమాయకుల కడుపులు కొట్టి సంపాదించాడో ఈ డబ్బుని..” నాకు తెలియకుండానే రరకాల ఆలోచనలు నా మెదడును తొలిచేస్తున్నాయి. ఆ క్షణం అక్కడున్న వారందరూ నాకు శత్రువులుగానే కనిపిస్తున్నారు. ఎర్రగా మండుతున్న ఎండలో వారందరి ముఖాలలోనూ పైశాచికత్వం, క్రూరత్వం తాళవిస్తున్నాయి. వారందరి మాటలూ, నవ్వులూ కర్ణభేరిని బద్దలు చేస్తున్నాయి. తల గిర్రున తిరుగుతుండగా ఒక్కసారి కళ్ళు మూసాను. నాకు తెలియకుండానే నిస్త్రాణతో ఒరిగిపోతున్నాను. “ఆటోలో చివరగా కూర్చొన్నానేమో, అంత వేగంగా వెళుతున్న ఆటోలోంచి పడితే బతుకుతానా..?” నా సందేహానికి సమాధానం దొరికేలోగానే నాకు స్పృహ తప్పింది.

చల్లని నీళ్ళు ముఖం మీద పడగా నెమ్మదిగా కళ్ళు తెరిచాను. కళ్ళముందు అంతా మసక మసకగా ఉంది. ముఖానికి దగ్గిరగా మినరల్ వాటర్ బాటిల్, దానిని పట్టుకొన్న వ్యక్తి ముఖం, ఆయన వెనుకగా మండుతున్న సూర్యుడు ఒకదాని వెంట మరొకటిగా కనిపించాయి. అంత వెలుగును తాళలేక మరోసారి కళ్ళు మూసి మెల్లగా తెరిచాను. ఇప్పుడు అంతా స్పష్టంగా కనిపిస్తోంది. చుట్టూ లీలగా మాటలు వినిపిస్తున్నాయి. నేను మెల్లగా ఈ లోకంలోకి వస్తున్నాను. “ఏమోయ్.. ఇంటి దగ్గిర ఏం తినకుండా బయలుదేరావా ఏమిటి..? వడదెబ్బ తగిలి శొష వచ్చి పడిపోయావ్..? అలా ఎండలో బస్సుకోసం వెయిట్ చేసే బదులు ఏ కిళ్ళీకొట్లోనో నీడపట్టున వెయిట్ చేయలేక పోయావా..? ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు తేరుకొంటావ్..” అంటూ నాయుడుగారు ఆప్యాయంగా మినరల్ వాటర్ బాటిల్‌ను చేతికందిస్తున్నారు. నెమ్మదిగా అయోమయాన్ని అదుపుచేసుకొంటూ చుట్టూ చూసాను. మా ఊరి బస్టాండులోని జనం అంతా చుట్టూ మూగి ఉన్నారు. ఒకావిడ నా తలను ఒళ్ళో ఫెట్టుకొని తన ఎర్రటి చీరచెంగుతో నా నుదిటిపైన పట్టిన చెమటను తుడుస్తోంది. ఆమె కూతురు అనుకొంటా ఆమె పక్కనే కూర్చొని ఆందోళనగా నావైపే చూస్తోంది. ఇంతలో పక్కనుంచీ “ఈ కొబ్బరిబోండాం తాగు బాబూ.. చల్లగా ఉంటుంది” అని ఖాకీ రంగు నిక్కరు వేసుకొన్న ఒకతను ఒక చేత్తో కొడవలి పట్టుకొని, అప్పుడే చెక్కిన కొబ్బరి బోండాన్ని నా చేతికి అందిస్తున్నాడు. దూరంగా ఆటోవాడు “తణుకు.. తణుకు..” అని అరుస్తున్నాడు..!!