గింగిర్లు తిరుగుతున్న పాటలు

(ఇండియాలో కవిగా లబ్ధప్రతిష్టుడైన నందివాడ ఉదయ్‌ భాస్కర్‌ సునిశిత పరిశీలన, సునాయాసమైన కవితాభావన ఉన్న కవి. ఇక్కడికి వచ్చాక రాసి తగ్గినా వాసి తగ్గలేదు.వీరు ఇంకొంచెం విస్తృతంగా రాసే అలవాటులోకి వస్తే బాగుంటుంది.)

సరిగ్గా ఈ మలుపు దగ్గరే నన్ను పలకరిస్తూంటాయి ప్రతి సారీ
రోడ్డు కిరువైపులా ఆకుపచ్చని పిట్ట గోడలు
బెంచి మీది జడ్జీల్లా గంభీరంగా తలలూపుతూ
ఎవరెక్కడ ఏ తప్పు చేస్తారో అని గుడ్లురిమి చూస్తూ

మరి ఇవాళ కోర్టుకి శలవనో, ఎవరింట్లోనో పెళ్ళనో పేరంటమనో గానీ
ఆ చెట్లు రంగు రంగుల కోకలు ధరించి నాకేసి చూసి కిల కిలా
నవ్వుతున్నాయి
చాలా కాలం తరవాత ఆత్మీయులని కలుసుకున్న కళ
కనిపిస్తోంది వాటి ముఖంలో
ప్రియుడితో తిరనాలకొచ్చిన పల్లె పడుచు
సంబరం కాబోలు వాటి గుండెల్లో

వెన్నెల్లోనూ వన్నెల్లోనూ అందాన్ని వెతికే కవులని ఆక్షేపించే వాడిని
ఇవాళ వాళ్ళ ముందు గర్వంగా ఓడిపోతున్నాను
నాకూ ఆకాశానికీ మధ్య పరుచుకున్న ఈ రంగుల తివాచీలో
కొన్ని వందల ప్రశ్నలకి జవాబులు వెతుకుతున్నాను
ప్రకృతి నాకోసం రచించిన ఈ అద్భుత కావ్యంలో
జీవిత అంతస్సూత్రాన్ని పోల్చుకుంటున్నాను

కుంకబోయే పొద్దుదీ, రాలబోయే ఆకుదీ ఒకటే నైజం
పతనాన్నీ మరణాన్నీ లెక్కచెయ్యని ధిక్కారం
అంతదాకా మర్యాదగా, అణకువగా, హుందాగా
నేపధ్యంలో కలిసిపోతూ ఉండిన
నీలాకాశమూ, పత్రహరితమూ
యవ్వనాంతంలో ఒక్కసారిగా
ఉగ్గబట్టుకుని ఉన్న జీవనాకాంక్షని
టెక్నికలర్లో ఆవిష్కరిస్తాయి
తిమిరాన్నీ శిశిరాన్నీ వెక్కిరిస్తాయి

మృత్యుముఖంలో ఈ ఆశావాదం గుండెల్లో కలిగించిన ఉద్వేగం
మాటల్లో పెట్టడం కష్టం
నాకు మాత్రం ఈ న్యూ యార్కు రోడ్ల మీద ప్రయాణం
మా వరంగల్లుని గుర్తుకు తెస్తోంది
ఈ ఆకుల్లాగే కళకళలాడి రాలిపోయిన చుక్కల్లాంటి చుక్కలెందరో
నా చెవులో గద్దర్‌ పాటలై గింగిర్లు తిరుగుతున్నారు


రచయిత నందివాడ ఉదయ భాస్కర్ గురించి: నివాసం ప్లేనో, టెక్సస్‌లో. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. "అక్షరం సార్థకమవుతుంది" అనే కవితాసంకలనాన్ని ప్రచురించారు. చాలా కవితలు వివిధ పత్రికల్లో వచ్చాయి. ...