కానుక

(డ్రాయింగు రూములో లక్ష్మి అటూ ఇటూ తిరుగుతూ పేపర్లూ అవీ సర్దుతూ ఉంటుంది. మధ్యలో ఒకసారి ఆగి, టేబుల్‌ మీద ఉన్న పెళ్ళి ఫొటో ని చేతుల్లోకి తీసుకుంటుంది. దానితో స్టేజి మీద ముందుకు వచ్చి, తదేకంగా ఒక క్షణం దానివేపు చూస్తుంది. స్వగతంగా)

లక్ష్మి .. ఇవాళ పెళ్ళిరోజని ఈయనకి గుర్తున్నట్టు కనిపించటం లేదు. ఆఫీసుకి వెళుతున్నప్పుడు దాని ఊసే ఎత్తలేదు. వెళ్ళాక ఒకసారి  ఫోను చేసారుగానీ, అప్పుడుకూడా “పాలున్నాయా, కూరలైపోయాయా” అంటూ పరమ లౌకిక వ్యవహారాలు మాట్లాడారు. మొదట్లో ఈ రోజు మర్చిపోలేననేవారు, ఈమధ్య గుర్తుంచుకోలేనంటున్నారు… సరే, ఎలాగో వేళయింది గదా, రాగానే ఒకసారి కదిపి చూడాలి.

(తలుపు చప్పుడౌతుంది. గబ గబ వెళ్ళి తలుపు తీస్తుంది. వాసు లోపలికి వస్తాడు.చేతిలో ఒక బొకే, ఒక గిఫ్ట్‌ లాంటిది ఉంటాయి. బొకే ఆమె కిస్తూ)

వాసు .. Wish you many happy returns of the day, my dear!

లక్ష్మి .. (చాలా సంతోషంగా మొహంపెడుతుంది .) చాలా thanks !(మళ్ళీ ఒకసారి దాన్ని పరిశీలనగా చూసి) దీన్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందండీ.  ఇదసలు బతికున్నవాళ్ళకిచ్చేదేనా అని.

వాసు .. అబ్బా, నీకు చాదస్తం మరీ ఎక్కువ డియర్‌, ఏదో వస్తూ హడావుడిలో తెచ్చాను కాస్త అడ్జస్టయిపో. చావైనా పెళ్ళైనా పువ్వులు పువ్వులే గదా.

లక్ష్మి .. బాగుంది, ఏదైనా చప్పుడేగదా అని, పెళ్ళికి డప్పులు, చావుకి సన్నాయి పెట్టుకుంటారా ? ఇదీ అలాగే.

వాసు .. సరేలే, ఎనాలజీలెందుకులేగానీ, ఏదో ఒకటి తెచ్చినందుకు సంతోషిస్తే చాలు.

లక్ష్మి .. సంతోషించాంలెండి. మీరెళ్ళి రిఫ్రెష్‌ అయిరండి. కాఫీ ఇస్తాను.

వాసు .. అలాగే గానీ, గిఫ్ట్‌ మాత్రం నేను వచ్చేదాకా open చెయ్యకు.

(వాసు లోపలికి వెళతాడు. )

లక్ష్మి .. అసలు గుర్తేలేదేమోనని దిగులు పడ్డాను. పాపం మరచిపోలేదన్నమాట. పొద్దున ఏదో   పరధ్యానంలో ఉండిఉంటారు.

( మెల్లగా మళ్ళీ అక్కడక్కడా సర్దుతూ ఉంటుంది. సర్దే పనిలో భాగంగా వాసు తెచ్చిన గిఫ్ట్‌ దగ్గరకి వస్తుంది. ఒకసారి దాన్ని చేతిలోకి తీసుకుని, పరిశీలనగా చూస్తుంది. )

లక్ష్మి .. గిఫ్ట్‌ కూడా తెచ్చారు పాపం. surprise చేద్దామనుకున్నట్టున్నారు. ముందుగా అసలేముందో చూస్తే సరి. ఆతరవాత తెలీనట్టు నటించవచ్చు.

( నెమ్మదిగా రేపర్‌ అటుపక్క ఇటుపక్క విప్పుతుంది. చాలా జాగ్రత్తగా లోపలివస్తువు బయటకు తీస్తుంది. అది తుపాకీ.)

లక్ష్మి ..  (గట్టిగా) అయ్య బాబోయ్‌ , తుపాకీ !

(లక్ష్మి తుపాకీని కింద పడేస్తుంది.)

(లక్ష్మి కేకవిని వాసు లోపల్నించి గబగబ బయటకు వస్తాడు. కిందపడిన తుపాకీని చూసి)

వాసు .. నిన్ను open చెయ్యద్దంటే ఎందుకు చేసావు? అయ్యో కింద పడేసావేమిటి తీసి కళ్ళకద్దుకో.

లక్ష్మి .. కళ్ళకద్దుకోవటానికదేమన్నా పుస్తెల తాడా? తుపాకీ అండీ. అదెందుకు తెచ్చారసలు?

వాసు .. నీకు ప్రెజంట్‌ చేద్దామని తెచ్చాను. తప్పేముంది.

(తుపాకీని తీసి, ఒకసారి చేత్తో తుడిచి, బల్లమీద పెడతాడు.)

లక్ష్మి.. తప్పేముందా? పెళ్ళిరోజుకి కానుకగా ఎవరైనా నగో నట్రో, బ్యాగో వాచీనో లేకపోతే ఏదైనా పట్టుచీరో తెస్తారుగానీ, పిట్టల్ని కాల్చే ఈ తుపాకీ ఏమిటండీ ?

వాసు ..  అమ్మమ్మా, అలా అనకు. దేని ఉపయోగం దానిది.

లక్ష్మి .. ఏమిటండీ ఉపయోగం? అయినా ఇవాళేమయింది మీకు? అంతగా ఇష్టంలేకపోతే లేనట్టుండాలిగానీ, ఆ చావుబొకే ఒకవైపు, ఈ మారణాయుధం ఒకవైపు తీసుకొచ్చారు. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు?

(కళ్ళల్లో నీళ్ళు తిరిగినట్టుగా, చున్నీతో కళ్ళు ఒత్తుకుంటుంది.వాసు ఆమె దగ్గరిగా వెళ్ళి అనునయించి కూర్చో బెడతాడు.)

వాసు .. నువ్వు పొరబడుతున్నావు లక్ష్మీ ! నేను బాగా ఆలోచించే ఇది తెచ్చాను.

లక్ష్మి .. (నిర్లిప్తంగా ) ఏమిటండీ, ఏమిటి మీరు చేసిన ఆలోచన?

వాసు .. చూడు లక్ష్మీ ! కొత్తగా ఇల్లుకొనుక్కుని ఇక్కడకు వచ్చాం. మనదసలే కన్ను గుర్తు వేసి ఉన్న కమ్యూనిటీ.

లక్ష్మి .. అవును. ఈ దిక్కుమాలినచోట వద్దండీ అని నేనుచెప్తున్నా వినిపించుకోలేదు.

వాసు .. ఏం చేస్తాం చెప్పు ? మనం వచ్చేదాకా వాచ్‌ జోన్‌ గా ఉండేది, మననం రాగానే క్రైం  వాచ్‌ జోన్‌ గా మారిపోయింది.

లక్ష్మి .. నాకూ కొన్ని సార్లు భయం అనిపిస్తూ ఉంటుంది.

వాసు .. అవునామరి. ఇంకా నేనేమో అప్పుడప్పుడూ టూర్లమీదకూడా వెళుతూ ఉంటాను. అందుకని ఆయుధం  దగ్గరుంటే, నేను ఊళ్ళోలేనపుడు నీకు తోడుగాఉంటుంది.

లక్ష్మి .. మీకూ ఈ పాపిష్ఠి తుపాకీకి పోలికేమిటండీ?

వాసు .. తప్పు లక్ష్మీ. ఆయుధాన్నెప్పుడూ దూషించకు. నీకుతెలీదా వాహనంలేని దేవుడుంటాడేమోగానీ, ఆయుధంలేని దేవుణ్ణి ఎక్కడన్నా చూసావా? కొందరు దేవుళ్ళైతే వాళ్ళపేర్లు కూడా  ఆయుధాలపేర్లమీదే వస్తాయి చక్రధారి, గదాధరుడూ అంటూ. అందుకని ఆయుధాన్ని తిడితే దేవుణ్ణి  తిట్టినట్టే.

లక్ష్మి .. బాగానేఉంది మీ వితండవాదం. సరే. మనదగ్గరుండటం మంచిదే అనుకున్నా, మనమెవరిమీదైనా  దాన్ని ఉపయోగించగలమా, పాడా?

వాసు .. ఎవరిమీదా ఉపయోగించనక్కర్లేదు.

లక్ష్మి .. ఉపయోగించనికాటికెందుకది?

వాసు .. ఇది మరీ బాగుంది లక్ష్మీ ! ప్రపంచంలో ఆయుధంఉన్న ప్రతివాడూ దాన్ని ఇంకోడిమీద ఉపయోగించేస్తే, ఈ ప్రపంచం ఇంతవరకు నిలబడేదేనా? ఇంకొకడు మన్ని ముట్టుకోకుండా ఉండటానికే ఆయుధం. దాన్నే ఇంగ్లీషులో  డిటరెంట్‌ అంటారు. ఈ టెక్నిక్కు ఎప్పట్నించో ఉన్నదే. నీకు తెలుసో తెలీదో పరమశివుడు అర్జునిడికి పాశుపతాస్త్రం ప్రసాదించినప్పుడు కూడా దాన్ని డిటరెంట్‌ గానే వాడుకోమన్నాట్టగానీ, ఎవరిమీదా ప్రయోగించవద్దని చెప్పాడట.

లక్ష్మి .. థీరీలకేం బాగానే చెప్తారు. ఈ ఆయుధాల పిచ్చెలా వచ్చిందండీ మీకు? చదివిన కాలేజీ మహత్యమా? అయినా, ఆర్యీసీ వరంగల్‌ లో చదివినవాడి సంబంధం నాకొద్దుమొర్రో అంటే మావాళ్ళు వినకండా చేసారు.

(ఇద్దరూ నవ్వుకుంటారు.)

లక్ష్మి .. అయితే తప్పదంటారు.

వాసు .. ఫరవాలేదులే లక్ష్మీ! మన జాగ్రత్తలో మనం ఉండటంలో తప్పులేదు. దగ్గరున్నంత మాత్రాన, ఏమీ కాదు గానీ, తీసుకో.

(బల్లమీంచి తుపాకీ తీసి, చేతికిస్తాడు. లక్ష్మి దానిని తీసుకుని పరిశీలనగా చూస్తుంది. ఒకసారి గురి చూసినట్టు నటిస్తుంది. వాసుకూడా భయపడినట్టు నటించి, గురి మార్చమన్నట్టుగా సైగ చేస్తాడు.)

లక్ష్మి .. మీరునేర్పుతారా నాకు దీనిని గురిపెట్టటం.

అవాసు .. ముందు కుదురుగా పట్టుకోవటం వస్తే, ఆతరవాత గురి అదీని. అన్నిటికన్నా సేఫ్టీ ముఖ్యం.ఎవరిచేతిలోనూ పడకండా చూసుకోవటం ఒకటి. మనకింకా పిల్లలు లేరుకాబట్టి, స్కూలికీ అదీ  తీసుకుపోతారేమోనన్న భయం లేదనుకో.

(లక్ష్మి మరికొంత ప్రాక్టీస్‌ చేసినట్టు నటిస్తుంటుంది. ఇంతలో తలుపు చప్పుడవుతుంది. అలా చేతిలో తుపాకీతోనే తలుపుతియ్యడానికి వెళ్ళబోతుంది. వాసు గబగబా అడ్డంవచ్చి, అది తీసుకుంటాడు.)

వాసు .. ఏదో మన జాగ్రత్తలో మనం ఉండాలన్నానని, మరీ తలుపుతీసినప్పుడల్లా తుపాకీ దగ్గర పెట్టుకోనక్కర్లేదు.

(తుపాకీ తీసుకుని కనబడకుండా ఒకచోట పెడతాడు. లక్ష్మి వెళ్ళి తలుపు తీస్తుంది. నాగేంద్ర నీరసంగా ప్రవేశిస్తాడు.)

నాగ .. ఏమండీ బాగున్నారా ! ఏరా వాసూ, ఎలా ఉన్నావ్‌ ?

వాసు .. ఏమోయ్‌ అలా మొహం వేలాడేశావ్‌ , డబ్బా రాలేదా ఏమిటీ ?

నాగ .. అబ్బా, అంత కరెక్టుగా ఎలా గెస్‌ చేశావ్‌ ?

వాసు .. ఏముందీ శుక్రవారం సాయంకాలం నువ్వు నీరసంగా మాయింటికొచ్చావంటే, శనివారం సినిమాకి  డబ్బా రాలేదనేగా అర్థం !

నాగ .. ఏమిచెయ్యాలో తోచటం లేదు. ఇప్పటికే ఇది రెండో సారి ఇలా జరగటం. జనం ఏమంటారో ఏమిటో!

వాసు .. అసలు తెచ్చేదే డబ్బా సినిమా. దానిక్కూడా డబ్బా రాలేదంటే మండిపడరూ ?

నాగ .. డబ్బు రాకపోయినా ఫరవాలేదు ఇంతే అనుకుంటాం; మరోసారి కవరవుతుందిలే అని సరిపెట్టుకుంటాం. కానీ, డబ్బా రాకపోతే మాత్రం పరువుపోతుంది. ఇన్నాళ్ళబట్టీ కష్టపడి పట్టుకున్న ప్రేక్షకమహాశయులందరూ రెక్కలొచ్చిన చేపల్లా ఎగిరిపోతారని భయంగావుంది.

వాసు .. రెక్కలొచ్చిన చేపలేమిట్రోయ్‌ సినిమా కవిత్వమా ?

నాగ .. ఏదో ఒకటి. అన్నానుగదా, సరిపెట్టేసుకో.మామూలుగా వచ్చేవాళ్ళతో పెద్ద ఇబ్బంది లేదు; సినిమా  లేదంటే తిట్టుకొంటూ వెళ్ళిపోతారు. ఎటొచ్చీ సినిమా క్లబ్బంటూ సంవత్సరం membership అంటగట్టామే, వాళ్ళతోనే చిక్కంతా. వాళ్ళెలా రెయాక్టవుతారో తెలీదు.

వాసు .. ఈ వానాకాలం వ్యాపారానికి membershipఎందుకు పెట్టావురా?

నాగ .. ఈ డబ్బా ఇబ్బందులేవీ మొదట్లో లేవు. అప్పుడు మొదలుపెట్టిందది. ఈ మధ్య సినిమాలు చూసే వాళ్ళేకాకుండా వేసే వాళ్ళు కూడా ఎక్కువైపోవటంతో ఈ చిక్కులన్నీ వస్తున్నాయి. ఎలాగోలా ఈ  term చివరిదాకానెట్టి ఈ స్కీము క్లోజుచేసెయ్యటం మంచిది.

లక్ష్మి .. పోనీ membersకి సినిమా బదులు ఇంకేదైనా entertainment పెట్టించండి.

నాగ .. ఇప్పటికిప్పుడు ఏం ఏర్పాటు చేస్తాం? ఇక మనమంతా కలిసి డాన్సులు చెయ్యాలి. డబ్బిచ్చి మన డాన్సులు  చూసేవాళ్ళెవరు? సరే ఏదో నా తంటాలు నేను పడతాను గానీ, మీరేం చేస్తున్నారు?

లక్ష్మి .. ఏమీ లేదండీ . ఇప్పుడే ఆయన వచ్చారు. ఏదో మాట్లాడుకుంటున్నాం. మీకు కూడా కాస్త కాఫీ తెస్తానుండండి.

(లోపలికి వెళుతుంది.)

నాగ .. ఏమిటోనోయ్‌ లైఫు చాలా అన్‌ సర్టెనయిపోయింది. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు.

వాసు .. ఇంతమాత్రానికే వేదాంతంలో పడిపోవాలా ?

నాగ ..దీనిగురించి కాదులే, ఏదో అనిపించింది. (లేచి ఒకసారి తిరుగుతాడు. కిందపడున్న gift wraper చూస్తాడు. వెంటనే ఏదో గుర్తువచ్చినవాడిలా.)

నాగ .. అవునూ, ఇవ్వాళ మీ anniversary కదూ ?

వాసు .. అవున్రా, దాన్ని గురించే నువ్వొచ్చేసరికి మాట్లాడుకుంటూ ఉంట.

నాగ .. అవునా. సారీ, మిమ్మల్ని disturb చేసానేమో.

(ఇంతలో లక్ష్మి  కాఫీ కప్పులు తీసుకుని లోపల్నించి వస్తుంది. ఇద్దరికీ చెరో కప్పూ ఇచ్చి, తను ఒకటి  తీసుకుని కూర్చుంటుంది.)

నాగ .. Happy Anniversary అండీ.

లక్ష్మి .. Thanks అండీ.

నాగ .. ఆ, ఏమిటీ, ఏమిచ్చాడు మనవాడు పెళ్ళిరోజుకి గోల్డా, డైమండా ?

లక్ష్మి .. ఆ ఏదో ఇచ్చారులెండి ఏ మెటలూ కానిది.

నాగ .. చెప్పకూడదంటే ఫరవాలేదులే.

వాసు .. అదికాదులేరా, మంచి గిఫ్టే …

( మాట పూర్తికాకుండా అడ్డుపడుతుంది.)

లక్ష్మి .. ఏదో లెండి అంత ఇంపార్టెంటేమీ కాదు గానీ ఇంకేమిటీ. పద్మగారెలా ఉన్నారు ? ఆవిణ్ణి కూడా  తీసుకురావలసింది.

వాసు .. ఏంటి లక్ష్మీ ! వాడేదో  weapons inspector ఐనట్టు అలా భయపడిపోతావేమిటి? ఫరవాలేదులే, తీసి చూపిద్దాం.

(లేచి పక్కన కనబడకుండా దాచిన తుపాకీ తీసుకు వస్తాడు. దానిని చూస్తూనే నాగేంద్ర చేతులు పైకెత్తేస్తాడు.)

నాగ .. బాబోయ్‌ ఇదేమిటీ ! గిఫ్ట్‌ చూపించటం ఇష్టం లేకపోతే మానెయ్యండి. దానికింతలా బెదిరించవలసిన అవసరమేముంది ?

వాసు .. (నవ్వుతూ) నిన్ను బెదిరించటం కాదు నాయనా, ఇదే గిఫ్టు .

నాగ .. ఇదా ! నీకేమన్నా మతిపోయిందా ?

వాసు .. మతిపోవటానికేముందోయ్‌ , ెself defence !

నాగ .. డిఫెన్సో, అఫెన్సో ముందది తీసి పక్కనపెట్టు. అయినా ఇదేం గిఫ్టు రా ! పెళ్ళిరోజంటే నగో నట్రో పట్టుకురావాలి, లేదంటే  ఏ రెస్టారెంటుకో పట్టుకుపోవాలి. అంతే గానీ తుపాకులూ అవీ తెస్తారా ఎవరైనా.

వాసు .. చపాతీలు కాదు తుపాకీలు కావాలి అన్నాడొక కవిగారు.

నాగ ; అణ్వస్త్రాలు కాదు అన్నవస్త్రాలు కావాలి అన్నాడింకొక మహాకవి గారు. కొటెషన్లకేముంది, ఎటు కావాలంటే అటే దొరుకుతాయి.

వాసు .. అందుకే, తిండికీ దీనికీ ముడిపెట్టద్దు. దేని అవసరం దానిదే.

నాగ .. పోనీలేగానీ, ఇప్పుడంత ెself defence అవసరమేమొచ్చిందిరా? security levels, color codes ఇలాంటివన్నీ  తలకెక్కాయా ఏమిటీ ?

లక్ష్మి .. ఏమిటో, ఇది కన్ను గుర్తున్న కమ్యూనిటీ అని, మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదని వాదిస్తాడు.

నాగ .. అంత భయంగా ఉంటే, ఏ కుక్కనో తెచ్చి పెంచుకోవచ్చుగదా. దర్జాగా కూడా ఉంటుంది.

లక్ష్మి .. అమ్మో, ఇన్ని కబుర్లు చెప్తారు, మళ్ళీ కుక్కంటే చచ్చేంత భయం.

వాసు .. అవున్రా, కుక్క మరీ డేంజరస్‌ . అసలు మనిషి కనుక్కున్న మొదటి జీవాయుధం కుక్కేనని నా నమ్మకం.

లక్ష్మి .. మరే. కుక్క జీవాయుధం, కారం రసాయనిక ఆయుధం ! ఎందుకండీ మీ భయాలకికూడా ఏవో గొప్ప థీరీలు చెప్తారు?

నాగ .. సరేరా తెచ్చుకున్నావు బాగానే ఉంది. కానీ దానినుపయోగించగలవా అని.

లక్ష్మి .. ఉపయోగించక్కర్లేదట. దగ్గరుంటేచాలు, డిటరెంట్‌ గా పనిచేస్తుందంటాడు.

నాగ .. కానీ, ఉన్నందుకు కాల్చాలనిపిస్తే ?

వాసు .. ఉంది కదా అని కాల్చుకోవటానికి ఇదేమన్నా బాణసంచానా ? నీకా సందేహమక్కర్లేదు. ప్రపంచ  ఆయుధ చరిత్రలో ఇప్పటిదాకా అలా జరగలేదు.

నాగ .. మన ఇంట్లో భాగోతానికి ప్రపంచ చరిత్రదాకా ఎందుకులే. సరే, ఇంతకీ నువ్వుచేసినపని మంచిదేనంటావు ?

వాసు .. ముమ్మాటికీ. నీ neighbourhood కూడా అంతంతమాత్రమేకాబట్టి, నువ్వుకూడా ఒకటి తీసుకో.

లక్ష్మి .. మీరు చెడిందిగాక, ఆయన్నికూడా ఎందుకు చెడగొడతారు.

నాగ .. తీసుకున్నా, మాయింట్లో ఒక డిటరెంటు చాలదు. రెండు కావాలి.

లక్ష్మి .. అదేమిటి ? రెండేం చేసుకుంటారు ?

నాగ .. పరస్పరం కాల్చుకోకుండా రక్షణ. పైగా ఇది ఇరవైనాలుగ్గంటలూ ఉండే threat!

లక్ష్మి .. భలేవారే !

నాగ .. నిజంగానే. ఏరా, ఇదెక్కడ తీసుకున్నావేమిటీ? వాళ్ళ దగ్గర ఇలాంటి family plans ఏమన్నా ఉంటాయా ?

వాసు .. ఇంటిల్లిపాదికీ ఒకే plan కింద ఇవ్వటానికివేమన్నా సెల్‌ ఫోన్లనుకున్నావా ? నాకుతెలిసి అటువంటివేమీ ఉండవు.

(నాగేంద్ర ఏదో చెప్పబోతాడు. ఇంతలో తలుపు గట్టిగా చప్పుడవుతుంది. అందరూ ఆశ్చర్యంగా అటువైపు చూస్తారు. లక్ష్మి అటు వెళ్ళబోయి, మళ్ళీ అడుగు వెనక్కువేసి , వాసుని వెళ్ళమన్నట్టుగా సైగ చేస్తుంది. వాసు కదిలేలోపుగా, మళ్ళీ గట్టిగా చప్పుడౌతుంది. ఈసారి అందరూ భయంగా చూస్తారు. వాసు చేతిలో  ఉన్న తుపాకీ బల్లమీదపెట్టి రెండడుగులు తలుపువైపుకు నడుస్తాడు. అక్కడ ఒక్క క్షణం ఆగి, మళ్ళీ  వెనక్కువచ్చి, తుపాకీ చేతిలోకి తీసుకుంటాడు. రెండడుగులు ముందుకు వేస్తాడు. అంతలో లక్ష్మి అతనికి అడ్డంగా వెళుతుంది.)

లక్ష్మి .. నాకు చెప్పిందేమిటి, మీరు చేస్తున్నదేమిటి? తలుపు గట్టిగా చప్పుడైనంతమాత్రాన, తుపాకీ తీసుకుని బయల్దేరటమేనా ?

వాసు .. అదికాదు లక్ష్మీ, నాకేదో అనుమానంగా ఉంది మనం అనుకున్న అవసరం మరీ వెంటనే వచ్చిందేమోనని. అయినా చెప్పాను గదా. ఉపయోగించవలసిన పనుండదు. ఊరికే బెదిరించడానికే.

(ముందుకు కదలబోతాడు)

నాగ .. బెదిరించడానిక్కూడా ఒక పొజిషనుండాలి. అసలది లోడై ఉందా ? ఎందుకంటే, గుళ్ళులేని పిస్తోలు డిటరెంట్‌ గా కూడా పనికిరాదు.

లక్ష్మి .. అబ్బ మీరిద్దరూ ఉండండి. ఏవండీ, అది తీసుకుని గుమ్మం దగ్గరికి మిమ్మల్ని వెళ్ళనివ్వను. నా మాట విని దాన్ని బెడ్‌ రూంలో కనబడకుండా దాచి రండి. కావాలంటే నేను వెళ్ళి తలుపు తీస్తాను.

(వాసు లక్ష్మి వంక ఒక సారి చూసి, గబగబ లోపలికి వెళతాడు. తలుపు మళ్ళీ గట్టిగా చప్పుడౌతుంది.)

నాగ .. లక్ష్మి గారూ, మీరిక్కడే ఉండండి. నేను వెళ్ళి తలుపు తీస్తాను.

(నాగేంద్ర నెమ్మదిగా గుమ్మంవైపు అడుగులు వేస్తాడు. లక్ష్మి నిలబడి చూస్తూ ఉంటుంది. అతను తలుపు దగ్గరకి  చేరేలోపుగా వాసు కూడా వచ్చి, లక్ష్మి పక్కన నిలబడతాడు. నాగేంద్ర మెల్లగా తలుపు తీస్తాడు. వెంటనే  ఒక వ్యక్తి విసురుగా లోపలికి ప్రవేశిస్తాడు. ఒక మాదిరి పొడుగు గెడ్డం ఉంటుంది. హిందువులాగానే కనిపిస్తాడు.  నుదుట నిలువుబొట్టు కూడా ఉంటుంది. చేతిలో రివాల్వరుంటుంది.)

ఆగం .. Hands up !

(ముగ్గురూ నిర్ఘాంతపోయి చేతులెత్తుతారు. అతను తలుపు మూసి, రివాల్వరు చూపిస్తూ లోపలికి అడుగులు వేస్తాడు.)

ఆగం .. మీ దగ్గర ఏమీ లేదు గదా ?

ముగ్గురూ .. మా దగ్గర ఏమీ లేదు సార్‌ !

ఆగం .. ముందుగా మీ ఇల్లు సోదా చెయ్యాలి. మీరు కదలకుండా అలాగే నిలబడి ఉండండి. నేను లోపలికి వెళ్ళి  చూసి వస్తాను. ఈ లోపుగా 911 అంటూ హడావిడి చేసారో, ప్రాణాలు దక్కవు, జాగ్రత్త  !

(ఆగంతకుడు రివాల్వరుతో లోపలికి వెళతాడు. అతనలా వెళ్ళగానే ,ముగ్గురూ చేతులు కిందకు దించుతారు.)

నాగ .. చూస్తే తెలుగువాడిలాగా ఉన్నాడు. ఇక్కడ మనవాడొకణ్ణి ఇటువంటి రోల్లో చూడటం కొత్తగా ఉంది.

లక్ష్మి .. ఈమధ్య H1 మీద ఇటువంటివాళ్ళని కూడా తీసుకొస్తున్నారా ఏమిటి?

వాసు .. స్వామీజీ వేషం కూడానూ. దొంగో, స్వామో, దొంగస్వామో అర్థం కావట్లేదు.

లక్ష్మి ..(వాసుతో) దొంగ అలా లోపలికి చొరబడిపోతే చూస్తూ ఊరుకుంటారేమిటండీ ! వెళ్ళి ఆ తుపాకీ తీసుకురండి.

వాసు .. (నోటిమీద చేతులు పెట్టుకుంటూ) గట్టిగా అరవకు, వినబడుతుంది. ఇందాకే దగ్గరుంచుకుంటానంటే వద్దన్నావు.  ఇప్పుడెలా వెళ్ళి తేవటం ? చూస్తాడేమో !

లక్ష్మి .. గదిలోకి వెళ్ళాడుగదా. పోనీ బయట్నించి గొళ్ళెం పెడితే ?

వాసు .. బయట్నించి గొళ్ళెం పెట్టడానికిదేమన్నా ఇండియానా ? ఆమాత్రం తెలీదూ అమెరికాలో తలుపులు బయటివాళ్ళు లోపలికిరాకుండా ఆపగలవేగానీ, లోపలివాళ్ళు బయటకిపోకుండా ఆపలేవు.

నాగ .. మనం గొళ్ళెం పెట్టినా, వాడిచేతిలో రివాల్వరుందాయె. విడిపించుకోవటం ఎంతలో పని !

వాసు .. ఏం చెయ్యాలో తోచటంలేదు.

(అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు.)

లక్ష్మి .. వాడు మెట్లెక్కుతున్నట్టున్నాడు. ఇదే అదను. గబుక్కున ఇవతలి గదిలోకివెళ్ళి  ఆ తుపాకీ తీసుకొచ్చెయ్యండి.

నాగ .. అవును, అదే మంచిది. త్వరగా వెళ్ళరా వాసూ !

వాసు .. మీరిద్దరూ కొంచెం ఉండండి. ఏదో పడుంటుందని తెచ్చాను గాని, నిజంగా కాల్చాల్సి వస్తుందంటే బాబోయ్‌ నాకు కాళ్ళు వణుకుతున్నాయి.

నాగ .. కాల్చక్కర్లేదులే. దగ్గరుంచుకుంటే చాలు.

వాసు .. అప్పుడైనా చేతులు వణుకుతాయి. అయినా, కాల్చని కాటికి దగ్గరుంటే ఎంత, లేకపోతే ఎంత !

లక్ష్మి .. మీరేగా ఇందాకట్నించి డిటరెంట్‌ ,డిటరెంట్‌ అంటూ లెక్చర్లిచ్చారు.

(వాసు ఒకడుగు ముందరకు వేసి, మళ్ళీ వెనక్కి తిరుగుతాడు.)

వాసు .. అమ్మో, నా వల్ల కాదు. కావాలంటే మీ ఇద్దర్లో ఎవరైనా వెళ్ళి తీసుకురండి.

నాగ .. నా మీదకి నెట్టకండి. ఈ ఇల్లు నాది కాదు, తుపాకీ నాది కాదు. నేను తేవటం అస్సలు బాగుండదు.

లక్ష్మి .. నన్నడక్కండి. నాకు దాని తలా తోకా తెలీదు. ఏ చిన్న పొరపాటు జరిగినా గందరగోళమైపోతుంది.

నాగ .. తప్పదురా, నువ్వే వెళ్ళాలి. అలా వెళ్ళి , ఇలా వచ్చెయ్‌ .

లక్ష్మి .. మళ్ళీ ఒక్క క్షణం లేటు చేస్తే వాడు వచ్చేస్తాడు. మీరు వెంటనే కదలండీ !

(లక్ష్మి వాసుని రెండు చేతుల్తోనూ ముందుకి తోస్తుంది. వాసు పక్క గదిలోకి పరుగెత్తివెళ్ళి, తుపాకీ తీసుకుని  వస్తాడు. సరిగ్గా అతను వచ్చే సమయానికే, రెండో వైపు అడుగుల చప్పుడు వినిపిస్తుంది. వెంటనే దాన్ని కనపకుండా  చొక్కాలో దాచి పెట్టి, చేతులు కట్టుకుంటాడు.)

ఆగం .. తియ్యండి.

(ముగ్గురూ మొహాలు చూసుకుంటారు.నాగేంద్ర జేబులోనుంచి చేతులు బయటకు తీసి చూపిస్తాడు. వాసు, లక్ష్మి కట్టుకున్న చేతులు విడిపించి చూపిస్తారు.)

ఆగం .. తియ్యండి.

( వాసు, నాగేంద్ర జేబులోఉన్న తాళాలు, సెల్‌ ఫోనుల్లాంటివి తీసి టేబుల్‌ మీద పెడతారు.)

ఆగం .. ఊ, తియ్యండి.

నాగ .. ఏంటి సార్‌ అరిగిపోయిన రికార్డులాగా అదేమాట. ఏం తియ్యమంటారు డబ్బులా, క్రెడిట్‌ కార్డులా, నగలా,  బట్టలా మీరు రెండో మాట చెప్పందే మాకెలా తెలుస్తుంది ?

ఆగం .. ఊ, నాతో తమాషా చెయ్యకండి. దాచిపెట్టినదేదో తియ్యండి బయటకి.

(రివాల్వరు నాగేంద్ర వైపుకు చూపిస్తాడు.)

నాగ .. బాబోయ్‌ నా దగ్గర దాచిపెట్టిందేదీ లేదు.

( ఆగంతకుడు వాసు, లక్ష్మి వైపుకు తిరుగుతాడు.)

ఆగం .. మీ దగ్గర.

(వాసు ఒక్కసారి చొక్కా తడుముకుంటాడు. వెంటనే.)

వాసు .. మీకు కనిపించేవితప్ప మాదగ్గరింకేమీ లేవు సార్‌ !

లక్ష్మి .. నిజం స్వామీ, మేమేమీ దాచిపెట్టలేదు.

ఆగం .. (మళ్ళీ వాళ్ళిద్దర్నే చూస్తూ ) అబద్ధం చెప్పకండి. రివాల్వరు లేదూ మీదగ్గర ?

(వాసు ఒక్కసారి ఇబ్బందిగా కదుల్తాడు.)

వాసు .. రివాల్వరా ! ఏం రివాల్వరూ ?

లక్ష్మి .. ఒక్క కంప్యూటర్‌ చైరు తప్పించి రివాల్వయేదేదీ మా ఇంట్లో లేదు.

ఆగం .. కాదు. మీరీమధ్యనే ఒక రివాల్వరు కొన్నారు. మర్యాదగా మీరు దాచిన ఆయుధాన్ని నాకిచ్చెయ్యండి.   నాకు మిగతావాటికన్నా మీ ఆయుధం ముఖ్యం.

వాసు .. (కొంచెం ధైర్యం తెచ్చుకుని) మాటవరసకి మాదగ్గర ఆయుధం ఉందే అనుకుందాం. మరి మీ దగ్గర కూడా అది ఉంది గదా. ఇంక, మా ఆయుధంతో మీకేం పని ?

ఆగం .. మాదగ్గర ఆయుధం ఉందా లేదా అన్నది కాదు ప్రశ్న, మీ దగ్గర అది లేకుండా చెయ్యటమే మా mission .

నాగ .. మరీ ఇంత అన్యాయమైన mission తీసుకోవాలని మీకెందుకనిపించింది సార్‌ ?

లక్ష్మి .. అల్లూరి సీతారామరాజు ఆయుధాలకోసం పోలీస్టేషన్లు కొల్లగొట్టాడని పుస్తకాల్లో చదువుకున్నాం.  అంతేగానీ, వాటికోసం ఎవరూ ఇలా ఇళ్ళమీద పడటం ఇంతవరకు విన్లేదు.

ఆగం .. ఏయ్‌ ,అసందర్భమైన మాటలు మాట్లాడకండి. మీకు సరిగ్గా రెండు నిముషాలు టైమిస్తున్నాను. మర్యాదగా ఆయుధాన్ని నా కప్పగించండి.  లేదా మీ ప్రాణాల మీద ఆశ వదులుకోండి.

(ఇలా చెప్పి అతను రెండడుగులు లోపలికి వేసి, అటువైపు తిరిగి సిగరెట్‌ ముట్టిస్తాడు. లక్ష్మి, నాగేంద్ర వాసుతో తుపాకీ తీసి అతనికి గురిపెట్టమన్నట్టుగా సైగ చేస్తూ ఉంటారు. కాని, వాసు తనవల్ల కాదని మొత్తుకుంటూ ఉంటాడు. లక్ష్మి వాసుకి దగ్గరగా వెళ్ళి, తుపాకీ బలవంతాన అతని చేతుల్లోపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ; అతను resist చేస్తాడు. ఈ గందరగోళంలో తుపాకీ కింద పడుతుంది. వెంటనే, ఆగంతకుడు ఇటువైపు తిరుగుతాడు.)

ఆగం .. ఒక్క అడుగు ముందుకేసారో కాల్చేస్తాను. అమ్మా, మీ దగ్గర తుపాకీ ఉంచుకునే, ఇందాకట్నించీ నాటకం  ఆడుతున్నారా ?

వాసు .. తప్పై పోయింది సార్‌ క్షమించండి.

ఆగం .. ఆ తుపాకీ నా కాళ్ళదగ్గర పడెయ్‌ !

(వాసు కాలితో తుపాకీ అతనివైపుకు తోస్తాడు.)

ఆగం .. (వాసుతో) నువ్విలా దగ్గరగా రా !

(వాసు దగ్గరగా వెళతాడు. లక్ష్మి కూడా వెనకే వెళ్ళబోతుందిగానీ, ఆగంతకుడు వద్దని వారిస్తాడు.)

ఆగం .. (వాసుతో) ఇలా పక్కకితిరిగి, చేతులెత్తి నిలబడు.

(వాసు అతను చెప్పినట్టే చేస్తాడు. లక్ష్మి, నాగేంద్ర ఆందోళనగా చూస్తుంటారు)

ఆగం .. కళ్ళు మూసుకో.

లక్ష్మి .. స్వామీ. తప్పైపోయింది. మీకేం కావాలన్నా తీసుకోండి.ఆయన్ని మాత్రం ఏమీ చెయ్యకండి.

ఆగం .. (ఆమె మాటలు పట్టించుకోడు. మళ్ళీ వాసుతో) ఇప్పుడు నేను చెప్పమన్నట్టుగా చెప్పు.

(వాసు సరేనన్నట్టుగా తల ఊపుతాడు.)

ఆగం .. ఇంక జీవితంలో ఎప్పుడూ ఆయుధాల జోలికి పోను. తుపాకీలు కొనను. కొనటం మంచిదని వాదించను. నాకు   బాగా తెలిసి వచ్చింది.

(ఒకొక్క వాక్యం పూర్తికాగానే అతను ఆగుతాడు. వాసు ఆ మాటల్ని రిపీట్‌ చేస్తాడు. అంతా  పూర్తికాగానే, ఆగంతకుడు  పెద్దగా నవ్వుతాడు. ముగ్గురూ అతనివైపు ఆశ్చర్యంగా చూస్తారు. వెంటనే, అతను, గెడ్డం తీసేసి, మళ్ళీ నవ్వుతాడు.)

వాసు .. అరె !రవీ నువ్వా ?

లక్ష్మి .. మీరా, ఎంత బెదరగొట్టేసారు !

నాగ .. ఏంట్రా రవీ ఇదీ, బుద్ధి లేదూ ?

రవి .. లేకేం , బాగానే ఉంది. కొన్నాళ్ళబట్టి మనవాడికి ఆయుధాలమీద ఉన్న పిచ్చిని గమనిస్తున్నాను. ఇవాళ తుపాకీ కూడా కొన్నాడని తెలిసి, ఒక ప్రాక్టికల్‌ జోకు ప్లే చేద్దామనిపించి ఇలా చేసాను. చూడు వాసూ, మనలాంటి  వాళ్ళకి ఆయుధాలుండటంవలన tension, insecurity వంటివి పెరుగుతాయేతప్ప, తగ్గవు. ఏమంటావు ?

వాసు .. నువ్వు చెప్పింది నిజమేరా.

రవి .. అందువల్ల ఆ మోజుని మొదట్లోనే తుంచెయ్యటం మంచిది. ఈ విషయం నీకు అనుభవమయ్యేట్టు చెయ్యాలనే ఈ  నాటకం ఆడాను.  మిమ్మల్నందర్నీ భయపెట్టినందుకు సారీ.

వాసు .. నాకిప్పుడు తెలిసి వచ్చింది. ఇంకెప్పుడూ తుపాకీ మాట తలపెట్టను.

రవి .. ఇంక అయింది చాలు గానీ, హాయిగా ఏ రెస్టారెంటుకోవెళ్ళి, మీ anniversaryని  బాగా ఎంజాయ్‌ చెయ్యండి. మేం పోతాం. ( నాగేంద్రతో ) రా రా నాగేంద్రా !

(వాళ్ళిద్దరూ కదుల్తారు.)

వాసు .. లక్ష్మీ, మనకి తుపాకీలకంటే చపాతీలే బెటరు. పద వెళ్ళి తిని వద్దాం.

(వాళ్ళు కదులుతుండగా తెర పడుతుంది.)