ప్రేక్షకుడు

కబ్బాడి, కబ్బాడి, కబ్బాడి, కబ్బాడి
సర్రుమని వెళ్ళాడు
వాడు. నన్నైతే పట్టేస్తారేమో!
అమ్మో! పడ్డాడు వాడు. మోకాలంతా రక్తం!
“నెప్పిగా ఉందిరా?” అడిగాను నేను

మూలుగుతూనే, “కొంచెం” అన్నాడు వాడు

“ఇంకా నయం, ఆడాను కాను” అనుకున్నాను నేను

చెడుగుడు చెడుగుడు చెడుగుడు
ఎలా వెళ్ళిన వాణ్ణి అలా పట్టేశారు
గుడుగుడు గుడుగుడు గుడుగుడు
గీత దాటక పోతే సెల్ఫౌట్‌ అయ్యాడు
“నేనే గనక అయితేనా” అనుకున్నాను నేను

గవాస్కర్‌ సెంచెరీ కొట్టేడు
విని రేడియో చుట్టూ కేరింతలు కొట్టాను నేను
హాల్‌ వేసిన ఫాస్ట్‌ బాల్‌ కళ్ళకే కనపడ లేదుట
నారి కాంట్రాక్టర్‌ తల మాత్రం పగిలిందట
“క్రికెట్‌ బాల్‌ దేంజర్‌ సుమా!” అన్నాడు మామయా
“రిస్కీ గేంస్‌ ఎందుకాడతారో” అనుకున్నాను నేను

“కాయ్‌ రాజా కాయ్‌, కాస్తే ఉందీ, చూస్తే లేదు”
అరుస్తున్నాడు రథం బజార్లో గాంబ్లింగ్‌ వాడు
నయాపైసా పెట్టకుండా వినోదం చూశాను నేను
“అది జూదం, దాని జోలికి పోకు” అన్నాడు తాతయ్య
“అసలయినా అందులో డబ్బేం రాదు” తేల్చేశాను నేను