“ఫూ …”

తెలుగు డిపార్ట్‌మెంటు ముందున్న వరండా పిట్టగోడపై కూర్చుని ఉండగా మోహన సుందరంతో సహా ప్రత్యక్షమయ్యింది మాలతి. మోహన సుందరం అట్లా నా కళ్ళలోకి సూటిగా చూస్తూంటే గొప్ప భయం, జలదరింత. ముఖ్యంగ అతని గద్దర్‌ ముఖం. ఆ గడ్డం, భుజంపై వేలాడే సంచీ, అతన్ని చూసినపుడల్లా ఏదో తెలియని పశ్చాత్తాపం నన్ను చుట్టుముట్టేది. విశాలమైన చేతులు అట్లా ముందుకూ వెనక్కూ ఊగుతూంటే, నడుస్తున్న శిలువ గుర్తుకొస్తుంది. ఏదో ఒక రోజు శిలువపై వేళ్ళాడుతూ చౌరాస్తాల నడుమ అతని శవం  ఎదురుకావచ్చునేమోనని భయం ఎందుకో నన్ను వెంటాడేది. అతన్ని హఠాత్తుగా నా ముందు ప్రత్యక్షం చేయించి, ఏ వార్నింగ్‌ లేకుండా, నా చేతిని అతని చేతిలో పెడుతూ “మోహనా! ఇతనో గొప్ప రొమాంటిక్‌ పోయెట్‌! తనను తానో గొప్ప  విధ్వంస గీతం అని కూడా అనుకుంటాడు. కవిగా ఇతని భవిష్యత్తు గురించి రెండు ముక్కలు చెప్పు” అంది మాలతి.

నేను వారించే లోపలే అతను సంచి లోంచి ఒక ఊదా రంగు పువ్వు, బెల్స్‌ ఫ్లవర్‌ బయటకు తీసాడు. దాన్ని నా అరచేతిలో పెట్టి, గుప్పిడి బిగించి, “గొప్ప నీలి కవితలు సృస్టిస్తావు!” అంటూ నా వైపు చూసి కన్నుగీటి “అనార్కిస్టు ముఖం తొడుగుకున్న సుఖవాదివి! పద్యాన్ని అట్టుకుని దేశాలన్నీ తిరుగుతావు!” అన్నాడు. ఊదా రంగు పువ్వు అట్లా నా చేతిలో నలిగి పోతూనే ఉంది. మహాభినిష్క్రమణం కోసం వెడుతున్నవాడిలా అతనట్లా చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. మోహన సుందరం కాస్త దూరం వెళ్ళి, ఆగి “స్వప్నలో ఫైర్‌ సినిమా ఆడుతూంది. మీరిద్దరూ కలిసి చూడటం నాకానందం” అంటూ రెండు సినిమా టిక్కట్లు మావైపు విసిరి చకచకా రెక్కలు వచ్చిన సిలువలా వెళ్ళిపోయాడు.

మాలతితో సహా నెంబర్‌ 136 బస్సు ఎక్కి, కోఠీ దగ్గర దిగి, అట్లాగే ఆబిడ్స్‌ వైపు నడుచుకుంటూ వెళ్ళి, మధ్యలో బస్సుల, ఆటోల, స్కూటర్ల వరదల్ని దాటుకుంటూ హుస్సేన్‌ బుక్‌ షాపు దగ్గర ఆగాము. నేను లోపల ఎక్కడో ఉన్న పొయిట్రీ పుస్తకాల్ని బయటకు తీయించా ఈలోగా మాలతి కౌంటర్‌ దగ్గర కూర్చున్న వృద్ధుడి పక్కన కూర్చుని అతనిపాలిపోయిన ముఖాన్నీ, రహస్యమైన తప్పులా అతని చేతిలో మండుతున్న సిగరెట్లనూ విస్మయంగా చూస్తూ హఠాత్తుగా అతనో  గజల్‌ గా ట్రాన్స్‌ ఫారం కావటాన్ని ఆనందిస్తూంది. నది, నావ, మనిషి, చావు అంతా ఒకటే అని అర్ధం వచ్చే  ఉర్దూ పాటను అతను ఆలపిస్తున్నాడు. చార్లెస్‌ బాడేర్‌ కవితల పుస్తకాన్ని తిరగేస్తూ నేనూ గొప్పగా ఎంజాయ్‌ చేస్తున్నానా పాటను.

పాట అయిపోయాక గొప్ప ఆయాసం వచ్చి, భీకరంగా దగ్గి, అతను హడావుడిగా నడుచుకుంటూ వచ్చాడు. పక్కన ఉన్న సింకు దగ్గర బుళుక్కున రక్తాన్ని కక్కి భయంతో బిగుసుకు పోయాను. “బేటా! ఇంకెంత సిర్ఫ్‌ పంద్రహ్‌ దిన్‌ ” అన్నాడు నవ్వుతూ నావైపు చూస్తూ.  “కాన్సర్‌ చివరి దశ” అన్నాడు. “అబ్బా! రెండు లైన్ల పోయిట్రీ ఏదైనా చెప్పు” అన్నాడు నా పక్కనే ఉన్న స్టూల్‌ మీద కూలబడుతూ.

బాద్లేర్‌ పుస్తకాన్ని చటుక్కున తెరిచి ” I cast her to the bottom of a wall; and on top of her I piled; All the stones of the parapet – I will forget her, if I can!” అనే కవిత చదివాను.

“వాహ్వా! వాహ్వా!” అంటూ పరవశంతో పెద్దగా అరిచి, జేబులోంచి బంగారు పూతపూసిన పెన్ను ఒకటి తీసి చేతిలో పెట్టాడు. “గొప్ప అనుభవాల్ని కవితల్నీ విన్నాక మనసు ఊరుకోదు. ఏదైనా నజరానా ఇవ్వాలనిపిస్తుంది” అని సంజాయిషీలా చెప్పాడు.

“డాక్టర్‌ బెడ్‌ దిగద్దన్నాడు. హాస్పిటల్‌ లో ఎవరికీ తెలియకుండా ఇట్లా వచ్చాను. ఈ పుస్తకాల్ని చూస్తూ, మీలాంటి పిల్లల్ని చూస్తూ, ఇట్లా నాలుగు మంచి షాయిరీలు వింటూ మంచి గజల్‌ వింటూనో, పాడుతూనో చనిపోవాలని నా కోరిక” జేబులోంచి నలిగిన కాగితాలు తీశాడు. ఆయన రాసిన కవితలు కాబోలు. ఆ కాగితాల మధ్య ఆయన చేతిగుడ్డా, రక్తంతో బాగా స్టైన్‌ అయ్యి మరింక అక్కడ ఉండాలని అనిపించలేదు. మాలతి చేతిని అందుకొని గబగబా పేవ్‌ మేంట్‌ పైకి వచ్చి చాలాదూరం నడిచాక, జేబులోంచి ఊదా రంగు పువ్వును బయటకు తీసి గుప్పిటిలో బిగించి, క్రూరంగా నలిపి “మనం ఇక్కడ విడిపోవాలి! నువ్వు నిజం కాదు! మోహన సుందరం నిజం కాదు! ఆ ముసలి కవి మరణం నిజం కాదు! ఇదిగో ఈ పువ్వు నిజం కాదు! దీని డెడ్‌ బాడీ సాక్షిగా ఇవాళ మనమా కవిని కలవలేదు! ఇవాల్టిని కొట్టేస్తున్నాను! గుడ్‌ బై!” అంటూ చరచరా నడుచుకుంటూ వెళుతూండగా ….. “ఇవాళ గొప్ప చారిత్రాత్మకమైన రోజు! ఈ శతాబ్డానికి ఇది ఆఖరు రోజు. డిసెంబరు ముప్ఫై ఒకటి పందొమ్మిది వందల తొంభైతొమ్మిది!” మాలతి సన్నని నవ్వు నా కాళ్ళకు చుట్టుకుంటూ ఉండగా నేను కోఠీ బస్‌ స్టాప్‌ వైపు నడిచాను.

****                    ****                    ****

అంతా గమ్మత్త్తు, అంతా వెవ్వే అనుకున్న కబుర్లన్నీ పచ్చినిజాలనీ నీలాకాశం, సూర్యుడి దిగులు, కృశించిన ముఖాలు, ఆకలి, శరీరహింసఇవన్నీ ఒక వాతావరణం కోసం మనం సృష్టించుకొన్న నేపథ్యం అనుకున్నానుగానీ అవన్నీ ఒక మిస్టరీలా మనల్ని వెంటాడుతాయని ఎట్లా అనుకోను? ఈ మాలతి మాత్రం “పొంచి ఉన్న దుఃఖం! ఆమె ఒక దుఃఖగాధ!” అంటాడు మోహన సుందరం ఆమెను గురించి. మాలతి మాత్రమేనా? మోహన సుందరంలోనూ, ఆఖరికి నాలోనూ, కెలికి చూస్తే లోపలో దుఃఖం పురాణం ఉంటుంది.

కోఠీ బస్‌ స్టాండ్‌ హడావుడిగా, రద్దీగా ఉంది. రోడ్డుపొడుగునా వందలుగా వాహనాలు ఆగిపోయి ఉన్నాయి. ట్రాఫిక్‌ జాం కాబోలు. ట్రాఫిక్‌ జాంను చీల్చుకుంటూ ఒక ఊరేగింపు. ఎవరినో డౌన్‌ డౌన్‌ అంటూ. ఇంకెవరినో జిందాబాద్‌ అంటూ. ఈ ఊరేగింపులు చూస్తే నాలో ఉలికిపాటు. ఇలాంటి ఊరేగింపుల మధ్యనెక్కడో మాలతి హఠాత్తుగా ప్రత్యక్ష్యం అవుతుంది. ఆసక్తిగా ఊరేగింపు వెనకనే చాలా దూరం వెళ్ళేవాణ్ణి. హఠాత్తుగా ఏ పోలీసు లాఠీ ఛార్జితోనో, అందర్నీ పొలోమంటూ పోలీస్‌ వ్యాన్‌ లో తోయటంతోనో ఆ ఊరేగింపు ముగిసేది. ఒకసారి జైలు గోడల మధ్య మాలతి మోకాలుపై తల ఆంచుకుని, నిస్సహాయపు మౌనంలా ఎదురైన దృశ్యం చాన్నాళ్ళ పాటు నాలోంచి చెరిపి వేసుకోలేకపోయేవాణ్ణి. “ఈ ఉద్యమాలు, ఈ ధర్నాలు, ఎందుకీ కంఠశోష! ఉద్యమాల కాలం వెళ్ళిపోయింది! ఇప్పుదంతా రాజకీయం. పవర్‌ గేం ! కొంచం కులం, మరికాస్త మతం ప్రతి గ్రూపుకీ ఇంతని కోటాలు”.

నా మాటల్ని మధ్యలో ఆపివేసి “నీ ఆలోచన్లు ఎంత మురుగు వాసన వేస్తోందో, నీ మెదడులో శవాలున్నయని నా నమ్మకం!” అనేది మాలతి. నాలో ఒక రోషం. ఒక దుఃఖం. “అవును. నువ్వు పుట్టకముందే ఒకసారి చచ్చిన వాణ్ణి! నేనేమిటి, నా తల్లీ తండ్రీ, నా జాతి మొత్తం, కత్తివేటుకు టప్‌ టప్‌ మంటూ తలలు తెగి … చాన్నాళ్ళుగా శవాలుగా ఉన్నవాళ్ళం! మా పునరుత్థానానికి ఇంకా చాలా కాలం పడుతుంది!” అనేవాణ్ణి ఆక్రోశంగా. “ప్రభో! ఫ్రాయిడ్‌! ఇక ఈ శవాల కధలు ఆపెయ్యి! తట్టుకోలేను!” అంటూ చిన్న  జోకుతో వాతావరణాన్ని తేలిక పరచేది మాలతి.

మళ్ళీ 136 ఎక్కి ఉస్మానియా వైపు ప్రయాణం. నగరమంతా రంగు కాగితాలు. పెద్ద పెద్ద బానర్లు “వెల్‌ కం టు న్యూ మిలినియం!”. మైకులు. హడావుడి. రంగుదీపాల తోరణాలు దండలు దండలుగా రోడ్డు చివరన వేలాడుతున్నాయి. ఈ సంబరాల్ని చూస్తే నాలో వింత ఎలర్జీ. కోపం. ఇంత దుఃఖాన్ని, అశాంతిని మరచి, ఆల్‌ ఈజ్‌ వెల్‌ ! అంతటా గొప్ప ఆనందమే అని మోసపుచ్చే ఉత్సవాలివి.

ఒకసారి యూనివర్సిటీ ఆడిటోరియంలో ఇండోజర్మన్‌ మైత్రో వంకాయో సింఫనీ ఏర్పాటు చేసారు. రిథమిక్‌ హాయి, సుఖమతమైన శబ్దం, శరీరంపై సన్నని గగుర్పాటు లోపలి నుండి స్వరాల ఫౌంటెన్‌ ఎగజిమ్ముతున్నత్లుగా ఎంతో హాయిగా ఉంది. అయితే ఆవేళే మాలతి వాళ్ళ నాన్న పెట్టుకున్న అప్పీలును కొట్టేసింది హైకోర్టు. కింద కోర్టు వేసిన యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది.  తీర్పు వెలువడి 4, 5 గంటలైనా కాలేదు. ఏమీకానట్లు గంభీరంగా నాప్రక్కన కూర్చుంది మాలతి. నాలో వింత కసి! అప్పుడు హఠాత్తుగా లేచి టాయిలెట్స్‌ వైపు వెళ్ళి “ది ప్రాసెస్‌ ఆఫ్‌ యూరినేషన్‌ అండ్‌ ది రిథమిక్‌ బ్లిస్‌ ఆఫ్‌ సింఫనీ ఎ కంపారిజన్‌” అంటూ రెండు పేరాల సిద్ధాంతచర్చని రాసి వచ్చాను. ఆ తరువాత వారం రోజులపాటు యూనివర్సిటీ అంతా “ది సిమ్ఫోనిక్‌ యూరినేషన్‌ ” అంటూ ఒకటే  చర్చ. “బాస్తర్డ్‌! బ్లడీ అనార్కిక్‌ ఫిగ్‌!” అంటూ మాలతి ఆవారమంతా నన్ను తిడుతూనే ఉంది. ఆ తరువాత  చాలా రోజుల పాటు టాయిలెట్‌ గోడలు గొప్ప పోయిట్రీ టాబ్లాయిడ్స్‌ అయ్యాయి! నిప్పుకోడి రెక్కలు, చెల్లని నాణాలు, మంత్రశిలాజాలు, ఎండుచేపలు, ఫైవ్‌ స్టార్‌ ఫింప్‌ , లోర్కా, గిన్స్‌ బర్గ్‌ నెలల తరబడి ఉస్మానీయులకు డిలైట్‌ నిచ్చాయి ఈ పోర్నో కవితలు.

నిజానికి ఇవాళ మాలతితో కలిసి అడ్వకేటు దగ్గరకి వెళ్ళాల్సింది! కొత్త మిలెనియం సంబరాలకోసం కోర్టుకూడ ముస్తాబవుతుందిట! “రెండు వారాలు ఆగి రాకూడదూ!” అన్నాడాయన. మాలతి ముఖంలో నిరాశ. అట్లా నిరాశతోనూ, దిగులుతోనూ ఉన్న మాలతిని చూస్తే, చర్మం వలుస్తున్నట్టుగా, కడుపులో చేతులు పెట్టి కెలుకుతున్న అనుభూతి కలుగుతాయి.

****                    ****            ****            ****

డిసెంబరు ముప్పయి ఒకటి రాత్రి. ఒక అసాధారణమైన అనుభవాన్ని రెండు వందలు తగలేసి రహస్యమైన అనుభవం ఒక సినిమా. సినిమా కూడా కాదు. పదిహేను నిముషాల డాక్యుమెంటరీ. ఒక బాంబ్‌ పేలుడు సంఘటన. బ్లాస్ట్‌ అవటం దగ్గర మొదలు పెట్టి దృశ్యం ఒకటి ఎర్రటి ధూళి లాంటి భయం  గొలిపే విస్ఫోటనము. శరీరంలోంచి ఒక కాలు తెగి, లేచి అట్లా ఎగిరి, వందమీటర్ల దూరంలో  పడటం. దృశ్యం రెండు ఎర్రగా, వెచ్చగా రక్తం బుసబుస మంటూ తెగిపడిన కాల్లో ఒక  కదలిక. దృశ్యం మూడు ప్రాణం పోయే ముందర విలవిల. నిస్సహాయమైన,  భయకంపితమైన మరణపు కేక. సిటీలోనే ఒక నెల క్రితం జరిగిన బ్లాస్టింగ్‌. ఇంకో కార్యక్రమాన్ని  షూట్‌ చేస్తున్న విడియో కెమేరా వాడి టేపులోకి ఈ పావుగంట విధ్వంసం రికార్డు అయ్యింది.  హాస్టల్స్‌లో బాగా పాపులర్‌ అయ్యిందీ కాసెట్‌!

“ఎందుకోసం ఈ అనుభవాన్ని చూస్తున్నట్లు?” అని నాకు నేనే ప్రశ్న  వేసుకున్నాను. “విద్వంసం, మరణం నాకు ప్రియమవుతున్నాయా?” అని కూడా  ప్రశ్నించుకున్నాను. ఈ భీభత్సంలోంచి ఏమి వెతుకుతున్నాను. మరణమా? దానితో కలిగే  భయమా? లేక ఒక పోరాటానికి సిద్ధం అవటమా? విడియో కాసెట్‌ చూస్తుండగా, మధ్యలో తలుపు చప్పుడు. కంగారుగా తలుపు  తీస్తే మాలతి, మోహనసుందరం. ఇంకా నాలుగైదు నిముషాలుందంటున్నా బయటకు లాక్కు  వచ్చింది మాలతి.

“ఏవైంది నీకు? మరణాన్ని ఎంజాయ్‌ చేసే స్థితికి వచ్చావా?” మాలతి  కోపంగా ఉంది. మోహనసుందరం కల్పించుకొని “రాబోయే శతాబ్దాన్ని ముందుగానే విడియోలో చూస్తున్నాడు!”  అన్నాడు సరదాగా. “ఇవాళనుంచి నీపేరు నిరంజన కాదు! డెత్‌!” అంది మాలతి, తగ్గని  కోపంతో. “రేపు కొత్త మిలెనియం సందర్భంగా ఆడిటోరియమ్‌లో ఒక ప్రోగ్రాం  జరుగుతుంది. మోహనసుందరం ఒక నాటకాన్ని రాశాడు, ఆ ప్రోగ్రాంలో ప్లే చెయ్యటానికి. నాటకంలో  డెత్‌ అనే కేరెక్టరు ఉంది. దానికి ఎవరినన్నా సజెస్టు చేస్తావని నీ దగ్గరకు వచ్చాము.  ఆరూమ్‌లో నిన్ను చూశాక డెత్‌ పాత్రకు నువ్వే కరెక్టుగా సరిపోతావు అనిపిస్తుంది. రేపుదయం  ఏడింటికి మోహనసుందరం ఇల్లు పొయిట్రీ కేఫ్‌కి రా! అక్కడో రిహార్సల్‌ వేసుకొని, సరాసరి  ఆడిటోరియంకు వెళదాం!” మాలతికి ఇంకా కోపం తగ్గినట్లు లేదు. మాలతి, మోహనసుందరం వెళ్ళిపోయారు. చీకటి. నిశ్శబ్దం. ఎక్కడో క్వేక్‌,  క్వేక్‌ అంటూ విశృంఖలంగా అరుస్తున్న పక్షి. ఆ అరుపు భయం గొలిపేదిలా ఉంది. అద్భుతమైన  రంగులు, మత్తయిన సౌగంధాలు, రాత్రిపాటలు, లలితలలితంగా, భగవంతుని వాగ్ధానంలా ఉండే  రాత్రులు కావివి.

………………………………………

నిద్ర లేచాను. చల్లనిగాలి ఒంటినిగిల్లి నిద్రలేపింది. కళ్ళు మూసుకొనే  ఉన్నాను. ఎదురుగా గోడనిండా బొమ్మలు. అతికించినవి. బొమ్మలే కాని అవి అనుభవానికి  సింబల్స్‌. మంచుకొండలు, నీలాకాశం, ఎగిరేపక్షి, ఆకుపచ్చనిలోయ, ఫాక్టరీ పొగగొట్టం,  హోచిమిన్‌, చెగువేరా, యుద్ధనౌక, లామినేట్‌ చేయించిన నాన్న ఫోటో, గౌతమ బుద్ధుడూ,  అంబేద్కరూ, థాయ్‌లాండ్‌ ఫుడ్‌ఐటెంస్‌, సుమో మల్లయోధుడు, జాకీచాన్‌, షారుక్‌ ఖాన్‌, కాజోల్‌ …  ఇవాళ ఎవరు? ఏ అనుభూతి నారోజును నింపబోతుంది. ఎ టెస్ట్‌? కుడికన్ను తెరిచాను. డెమీమూరు  నగ్నవక్షం. కంటినిండా కోర్కె, కామం, ఎరోటిక్‌ ఫాంటసీలు నిండి, కుడిరెప్ప మూసి, ఎడమ కన్ను  తెరిచాను. రిజర్వు బాంక్‌ ఎంబ్లమ్‌. దానిపై ఎగురుతున్న మనీబర్స్డ్‌ గొప్ప కాంబినేషన్‌. ఈ రోజు  పేరు శృంగారగీతం. అందులో కాస్త ధనయోగం కూడా.

లేచి, చకచకా తయారై, రోడ్డు  పైకెక్కి ఎకనామిక్‌ టైంస్‌ పేపరు చదువుకొని, షేర్సు కాలం పేజీని చించుకొని,  జేబులో కుక్కుకొని మిగతా పేపరును నలిపి రోడ్డు చివర విసిరి టీ స్టాల్‌కు వెళ్ళి వెచ్చని  ఇరానీ ఛాయ్‌ నాలుకపై పడి మెల్లగా గొంతులోకి దిగుతుంటే హుషారుకు బదులు ఒక దుఃఖం,  ఒక క్రోధం ఐ వజ్‌ హర్ట్‌ గాయం గాయం ఎంత మాటంది మాలతి మరణానికి ప్రవక్తనని   షి యీజ్‌ క్రేజీ! ఈ మోహనసుందరం మాత్రం నిన్న నిన్న నిన్నలోకి ప్రపంచాన్ని  నెడతానంటాడే గోడమీద ఎప్పటిదో ఒక చిరిగిపోయిన బొమ్మను పెట్టుకొని అట్లాగే జీవించాలంటాడే  నిన్నకు జబ్బు చేసిందంటే వినడేం? కుళ్ళుతున్న వాసన తెలియటం లేదూ! జరగాల్సిన  విధ్వంసం జరిగే పోయింది! ఎవడో మనల్ని ముందుకో, వెనక్కో వాడిష్టం వచ్చిన దిశలొ  నడిపే రోజులొచ్చాయి. దేన్ని అపుతాడీ మోహనసుందరం? సెల్‌ ఫోను, యూరోడాలర్‌, బులియన్‌ మార్కెట్టు,  టెర్మినేటర్‌ విత్తనము, పోర్నో వెబ్‌సైటు, పతనమవుతున్న రూపాయి, మల్టీ నేషనల్స్‌, అమెరికన్‌  ఈగిల్‌ కింద వున్న మన దేహాలు దేన్ని ఆపుతాడు? ఎదురుగా ఐదో నంబరు బస్సు. మెహిదీపట్నం. పొయిట్రీ కేఫ్‌,  మోహనసుందరం ఇంటికి. బస్సులోకి అడుగుపెడుతున్నానా? ఏదో గొప్ప వాయేజ్‌లోకి వెళుతున్నట్లుగా కిటకిట  క్రిక్కిరిసి వున్న మానవసమూహం లోకి, బలవంతంగా లాగబడుతున్నట్లుగా “కొత్తదనం,  కొత్తదనం కావాలి!” “అన్నా! నువ్‌ సంజాయించరాదూ?” “ఇండికా, ది డ్రీం కార్‌ ” “ఎలియనేషన్‌  ఎక్కడ లేదు! ఊపిరిలో, ఇట్లా చూడు నా కంటి పాపలో!” “డోంట్‌ బి ఎగ్జైటెడ్‌!” “దె కిల్డ్‌ యూనిట్‌  ట్రస్ట్‌!” “పిల్లగాని సంజాయించరాదూ!” “కిర్ర్ర్ర్ర్‌..” “అబ్బా షడన్‌ బ్రేకు వేసినాడు!” “గుండె  జల్లుమన్న దనుకో!” “ఎర్ర జెండా గుంపు” “డ్రైవర్‌! ఎంత సేపు ఆగాలి!”

చప్పుళ్ళు చంపివేసి, నిశ్శబ్దాన్ని మాత్రమే, రోజులో ఒక్క క్షణమైనా   మొత్తం ప్రపంచంలో శబ్దాలు ఆగిపోయి ఎంతగొప్పగా ఉంటుందో? అంతటా నిశ్శబ్దం! ఒక్క  సన్నటిగొంతు, ఎదో ఒక ఆలాపన చల్లగా మృదువుగా గొప్ప బాల్యపు స్వప్నంలా మధురంగా  వినిపిస్తుంటే ఎప్పుడైనా తటస్థపడుతుందా? జనం ఒక్కొక్కళ్ళే దిగుతున్నారు. ఇద్దరో ముగ్గురో ఉన్నారు. బయట ఒక పెద్ద  ఊరేగింపు. స్త్రీలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా. అన్ని ప్రజాసంస్థల ఊరేగింపు.  ఊరేగింపు సుదీర్ఘంగా సాగిపోతుంది. ఊరేగింపులోంచి జారి ఓ ముగ్గురు బస్సులోకి ఎక్కారు. డప్పు,  కంజర, పొడవాటి ఫ్లూట్‌. అలసటగా, నిశ్శబ్దంగా ఉన్నారు వాళ్ళు. ఊరేగింపు వెళ్ళిపోయి,  బస్సు కదిలింది. బొయ్‌ మంటూ సన్నగా ఫ్లూట్‌ మోగింది. పక్కనున్న డప్పు, కంజెర కుర్రవాళ్ళలోనూ  ఉత్సాహం రగిలింది. గొప్పలయ. మత్తుగా మోగుతున్న ఫ్లూటు, గొప్ప దృశ్యం. దిగంతాల వైపుకు ప్రయాణిస్తూ  వెనుక నేపథ్యంగా వేణువు పాట. చిన్న జెర్క్‌తో బస్సు ఆగింది. కలలాగా హఠాత్తుగా వాళ్ళు ముగ్గురూ  అదృశ్యం అయ్యారు.

బరువుగా ఊపిరి తీస్తూ యాభై యేళ్ళ మనిషి. ఆస్మ్తా పేషెంట్‌ కాబోలు.  తలచుట్టూ మఫ్లర్‌ చుట్టుకొని, ఒంటినిండా బూడిదరంగు శాలువా కప్పుకొని మాంసం ముద్ద లాగా సీట్లో  ముడుక్కొని కూర్చున్నాడు. జేబులోంచి నెబ్యులైజర్‌ తీసుకొని ఉఫ్‌… ఉఫ్‌… మంటూ ముక్కులోపలికి స్ప్రే  చేసుకున్నాడు. కొంచెం రిలీఫ్‌ వచ్చినట్లుంది. ఊపిరి కాస్త తేలికయి అతని ముఖంలో ఉత్సాహం  రాజుకోవటం మొదలుపెట్టింది. నావైపు చూసి సన్నగా నవ్వి, “ఈ నెబ్యులైజరు నాకు గొప్ప  వేదాంతాన్ని నేర్పుతుంది! ఎప్పటికప్పుడు ప్రాణం దుర్భరంగా అనిపించి ఇంక చాలు ఈ జీవితం అనిపిస్తుంది.  యుథనేషియా గురించి సీరియస్‌గా ఆలోచించటము మొదలు పెడతాను! ఇది స్ప్రే చేసినాక మళ్ళీ  రెండు గంటల ఆయువు వస్తుంది. మళ్ళీ ఉత్సాహం! చాలా మైళ్ళు ప్రయాణించాలని కోరిక!”  నెబ్యులైజరే కాదు అతనే గొప్ప ఫిలాసఫర్‌లా కనిపిస్తున్నాడు. బోలెడంత సఫరింగ్‌, కొంచెం  రిలీఫ్‌ ఇందాకటి మధురమైన సంగీతమూ నిజమే, ఈ సఫరింగ్‌ నిజమే! ఈ బస్సు నా వేదాంత  పాఠశాల. బస్సు దిగి, మసాబ్‌ టాంక్‌ పైన. ఇంకా పర్లాంగు దూరం నడవాలి  మోహనసుందరం పొయిట్రీ కేఫ్‌కి. కలలు, కోర్కెలు, చెమట, చిత్తడి, నవ్వులు, కేరింతలు  అనంతమైన శబ్దాలుగా ఉంది చౌరస్తా. తోసుకుంటూ, త్రొక్కుకుంటూ, ఎడాపెడా ఉర్దూ పదాల సెంటు  పూసుకున్న తెలుగు మాటల్ని వెదజల్లుతూ, హడావుడిగా ఉంది.

మాసాబ్‌టాంక్‌, బ్రిడ్జి మధ్యన, మెట్ల పక్కన వాటే సీన్‌? చిలుక  పస్తీ చెప్పేవాడు. పంచె, తలకట్టు, ఊహు! వీడు ఆధునికుడు ఫాంటు, షర్టు, కళ్ళజోడు.  కళ్ళజోడు వెనుక లోతుగా బురదగుంటల్లా ఉన్న కళ్ళు. అటువైపు నడిచాను. నన్ను ట్రాప్‌ చేశానని  సంబరపడుతున్నాడు వాడు. “కూర్చోండి సార్‌! గొప్ప భవిష్యత్తు ఉన్నవాళ్ళు! మహానుభావుల  జాతకం మీది!” మైగాడ్‌ వీడు బలమైన గాలమే వేశాడు. టప్‌ మంటూ తగులుకుంది గుండెకు.  కూర్చుని, “కొత్త శతాబ్దం వచ్చింది. ఈ శతాబ్దంలో నా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో  చెప్పగలవా?” అన్నాను ఆసక్తిగా. వాడు సీరియస్‌గా ముఖం పెట్టి, నిజంగానే గొప్ప సూత్‌సేయర్‌లా  ఫీలయి, ఇష్టమైన రంగు, పూవు ఏవేవో అడిగి, చివరగా “తరచూ వస్తుండే కల ఏమిటో చెప్పండి!”  అన్నాడు. ఇదో హిప్నోసిస్‌. వెనక్కు వెళ్ళే మార్గమే లేదు. అసంకల్పితంగానే నోరు తెరిచాను. “గొప్ప  సముద్రం. ఒడ్డున స్నేహితులం అందరం. మాలతి పాట పాడుతుంది. అనంతమైన దుఃఖం.  మాలతి చరిత్ర గురించి పాడుతుంది. ఇవాల్టిని ఇక్కడే ఆపేద్దామా? అని పాడుతుంది. సర్వశక్తుల్ని  ఉపయోగించి కాలాన్ని ఆపివేద్దామా అని పాడుతుంది. నేను ఒడ్డు పైనే కూలబడి ఇసుకను  తవ్వుతున్నాను. ఎప్పుడు చిన్నతనంలో పాతిపెట్టిన నా కలల కోసం, తవ్వుతూనే ఉన్నాను.  లోతుగా, లోతుగా ఊహు! ఏమీ కనబడటం లేదు. దుఃఖం వస్తుంది.

సముద్రపు హోరు, మాలతి  పాట, నా దుఃఖం హఠాత్తుగా మోహనసుందరం వచ్చాడు. సింఫొనీ కండక్టర్‌లా “ఇక చాలు ఆపండి!  ఇళ్ళకు పోదాం!” అంటున్నాడు. అనటం కాదు అదో కమాండ్‌! షాట్‌ చిత్రించిన తర్వాత పేకప్‌ చెప్పే దర్శకుడిలా.  “వద్దు ఈ రోజు వెళ్ళిపోతుంది” అంటూ మాలతి పాడుతూనే ఉంది. “డోంట్‌ వర్రీ! రేపుంది  కదా! రేపటికోసం జీవిద్దాం!” అంటున్నాడు మోహనసుందరం. ఊడివచ్చిన పెయింటింగ్‌లా సముద్రాన్ని,  గుప్పిటి మధ్య యిమిడ్చిన పిట్టలా పాటను, చిన్న పాపాయిలాగా భుజంపై చేయి వేసి మాలతినీ అందర్నీ  వెంట తీసుకెళుతున్నాడు మోహనసుందరం. నేను అరుస్తూనే ఉన్నాను “రేపటిలో ఏముంది?” అంటూ.

చిలకపస్తీ వాడు కంగారు పడ్డాడు. ముఖం తెల్లబోయింది. వాడికేమీ  అర్థం అయినట్లు లేదు. బుర్ర గోక్కుంటూ పంజరంలోంచి చిలుకను బయటకు తీశాడు. కుర్ర్‌ కుర్ర్‌ అంటూ  శబ్దం చేస్తూ, చిలుక బయటకు వచ్చింది. వందకు పైగా ఉన్న కవర్లపై అటూ ఇటూ తిరిగింది.  చిలుకపస్తీ వాడు నాపేరు చెప్పి “సార్‌ కోసం ఒక కార్డు తియ్యి!” అన్నాడు. “సార్‌ కోసం ఒక  భవిష్యత్తును, ఒక సత్యాన్ని బయటికి తియ్యి!” అంటూ దాన్ని ఉత్సాహ పరుస్తున్నాడు. చిలుక అటూ ఇటూ  తిరిగి ఒక కార్డు బయటకు తీసింది. వాడు కార్డు తీశాడు. బాలకృష్ణుడు, నోట్లో సకల భువనాల్ని  చూపిస్తున్నాడు వాళ్ళ అమ్మకు. “శుభం! గొప్ప అద్భుతం జరగబోతుంది మీ జీవితంలో  …”  అన్నాడు వాడు. కార్డు లోపల రాసి ఉన్న వాక్యాల్ని చదివాడు. “అద్భుతాలు చేసే మనిషి మీకు  ఎదురౌతాడు. అతని ద్వారా మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. డబ్బు, సుఖాలు అన్నీ. అయితే ఒక  ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్త!” అని ఉంది. లేచి, వాడి చేతిలో వందరూపాయల నోటు పెట్టి, వాడి పైపు కన్నుగీటి  “ఆ అద్భుతాలు చేసే మనిషి నేనే! ఆ సుఖం నేనే! ఆ ప్రమాదం నేనే! నన్ను బాగా స్టడీ  చేసినందుకు ఈ వందా బహుమానం! చిన్న సలహా! కార్డు లోపల వాక్యాన్ని మార్చు! అద్భుతాలు  జరిగే కాలం వెళ్ళిపోయింది. కొత్త శతాబ్దం వచ్చింది. రాబోయేదంతా దుఃఖమే!  మరణమే! రేపటిలో ఏమున్నదనే ప్రశ్న మానవుడికి మిగిలింది! అన్ని కార్డుల్లోనూ ఈ ప్రశ్నే రాయి! గుర్తుంచుకో!  బై! బై!” అంటూ చకచకా రోడ్డు దిగి, మోహనసుందరం ఇంటి వైపుకు నడిచాను.

……………………………………………

“నాటకానికి రెండు చావులూ, మూడు పుట్టుకలూ అవును ముందు రచయిత  దుఃఖంలోంచి పుడుతుంది. పేపరుపైన చచ్చిపోతుంది. నటుల భావోద్వేగంతో మళ్ళీ పుడుతుంది.  స్టేజీపై మరోసారి చస్తుంది. చివరిగా ఆడియన్స్‌ రెస్పాన్స్‌లో పునరుద్ధాన్ని పొందుతుంది.” మోహనసుందరం నాటకం గురించి లెక్చెరిస్తున్నాడు. మాలతి ఇంకా  రాలేదు. పొయిట్రీ కేఫ్‌ ముందున్న అరుగులాంటి ప్రదేశంలో కూర్చుని, నేను, మరో ఇద్దరు కుర్రాళ్ళు. అతన్ని  దీక్షగా వింటున్నాము. హఠాత్తుగా మోహనసుందరం గొంతెత్తి పాట అందుకున్నాడు. డైలాగులు  ప్రాక్టీసు చేస్తున్న ఒక కుర్రవాడు అట్టతీసుకొని లయాత్మకంగా దరువు వేస్తున్నాడు.  జానపదగీతం. బొంగురుగా వెదురుచెట్లన్నీ పెళపెళమంటూ విరుగుతున్న చప్పుడు. అతని స్వరం  క్రమక్రమంగా పెద్దదవుతూ భూమికి ఆవైపు వరకూ వినబడేంతగా గొప్పగా ఊగిపోతున్నాడు.  అంతకంతకూ స్వరాన్ని పెంచి, పక్కనే ఉన్న టేప్‌ రికార్డర్‌ టప్‌ మంటూ ఆన్‌ చేశాడు. పోలీసు  ట్రక్కులు ప్రయాణిస్తున్న చప్పుడు. విసురుగా, వేగంగా. టేప్‌ రికార్డర్‌ లోని శబ్దాలకు  పారలల్‌గా మోహనసుందరం కూడా పాడుతున్నాడు. టేప్‌ రికార్డర్‌ లోంచి ట్రక్కుల ప్రయాణం ఆగిపోయి,  టకటక మంటూ పోలీసులు మార్చ్‌ చేస్తున్న చప్పుడు. తలుపులపై బాయ్‌నెట్లతో ధన్‌ ధన్‌మని  పొడుస్తున్న చప్పుడు. లోపల గదిలో సన్నని నవ్వు, కేరింత, ఇరవై మంది పిల్లల అల్లరి, తలుపు  పెళ్ళుమని విరిగిన చప్పుడు. మోహనసుందరం పాడుతూనే ఉన్నాడు, ప్రపంచానికంతా వినబడే  మహాస్వరంలా. పొట్టలో కుమ్మిన శబ్దం. సార్‌ సార్‌ అంటూ పిల్లలు గొల్లుమన్న శబ్దం. అమ్మా అన్న  ఆర్తనాదం. నేలపై పొర్లించి మనిషిని లాక్కు వెళుతున్న చప్పుడు. భయవిహ్వలతతో,  దుఃఖంతో కూడిన ఒక స్వరం “ఆయన్నేమీ చెయ్యకండి! ఆయన్నేమీ చెయ్యకండి!” అంటూ పెద్దగా అరుస్తున్న  గొంతు. ఆ గొంతును గుర్తు పట్టాను. అది మాలతిది. టేప్‌ రికార్డర్‌ లోంచి, అన్ని చప్పుళ్ళు  ఆగిపోయి మాలతి ఏడుపు మాత్రమే వినిపిస్తుంది. మోహనసుందరం పాట క్రమంగా ఫేడౌట్‌  అయినట్లుగా ఆగిపోయింది. “ఇవాళ మన నాటకంలో మొదటిరంగం ఇదే. మాలతి తండ్రిని పోలీసులు  అరస్ట్‌ చెయ్యటం. అతని కోసం మాలతి చేసిన ప్రయత్నాలు, పోరాటం ఇదే నాటకానికి  కథావస్తువు.”

“ఇందులో డెత్‌ అనే కారెక్టరు, దాదాపు అన్ని రంగాల్లోనూ కనిపిస్తుంది. ఈ  పాత్ర ఒక మొటాఫర్‌. ఒక అణిచివేతకు, హింసకు, విధ్వంసానికి. మొదటి రంగంలో   జానపదగీతం పాడే గాయకుడిలా డెత్‌ ప్రత్యక్షమవుతుంది. రెండో రంగంలో పొలిటీషిన్‌లా. మూడోరంగంలో  …” మోహనసుందరం మాటలు పూర్తి కాకుండానే, ఒక యూనివర్సిటీ కుర్రాడు వగర్చుకుంటూ   “అన్నా అర్జెంటుగా గాంధీ హాస్పటల్‌కి పోవాల! లే!” అంటూ కంగారు పెట్టేడు. “ఏవైంది?”  అన్నాడు తాపీగా మోహనసుందరం. “మాలతి వాళ్ళ నాన్న రాజయ్య సార్‌ను జైల్లో  చంపేసినారు. కడుపునొప్పితో చచ్చిపొయ్యాడని సర్టిఫై చేసి మార్చురీకి పంపారు. మాలతక్క అక్కడే  ఉంది. బాడీని కూడా యియ్యరట!” మోహనసుందరం ముఖంలో క్షణం పాటు కంగారు. కోపం.  వెంటనే తమాయించుకొని, లేచి “పద వెళ్దాం!” అంటూ అందర్నీ బయలుదేర దీశాడు. వేగంగా నడుస్తున్నాడు మోహనసుందరం. ఎటు చూసినా వ్యాధులే.  నాగుపాములు కాళ్ళకు చుట్టుకున్నట్లుగా. వార్డుల పొడవునా వంగిపోయి, నలిగిపోయి, శుష్కించి,  దుఃఖించి, మరణం వద్దు వద్దని విలపిస్తూ ప్రాణం పొయ్యండని ప్రార్థిస్తూ …  వార్డులన్నీ దాటుకొని చివరన ఉన్న విశాలమైన గది దగ్గర ఆగాడు. మార్చురీ గది. గది ముందు  పిట్టగోడ నానుకొని మాలతి.

గంభీరంగా “నేను శవాన్ని చూడాలి!” ఒక్క సారిగా పెద్దగా అరిచింది  మాలతి. “సూపరెండెంటు నడిగితే పోలీసుల పర్మిషన్‌ కావాలంటూ మొండికేస్తున్నాడు!” గది  వెనుక ఒక అద్దాల కిటికీ ఉంది. మోహనసుందరం, లేచి, ఒక లావాటి రాయిని తీసుకొని పెళ్ళుమని ఆ  కిటికీని పగలగొట్టాడు. మనిషి పట్టే ఖాళీ వచ్చింది. “పద! శవాన్ని చూద్దాం!” అంటూ  లోపలికి నడిచాడు. వెంట మాలతీ నేనూ. బయట వార్డ్‌ బోయ్‌ల సెంట్రీల కేకలు పట్టించుకోకుండా  లోపలికి నడిచాము. శవం ముఖం నిండా తెల్లటి సైను గుడ్డ కప్పి ఉంది. గుడ్డ పైకి తీశాడు  మోహనసుందరం. తల పగిలి ఉంది. రక్తం నల్లగా గడ్డ కట్టి మాలతికి భయం సరే,  దుఃఖమయినా రాదే! స్ట్రెచర్‌ పక్కనే ఉన్న లుంగీని, చొక్కాని మడత పెట్టుకొని బయటకు  వచ్చింది మాలతి. నలుగురు పోలీసులు హడావుడిగా వస్తున్నారు. వాళ్ళను లెక్క చెయ్యనట్లుగా “పద  ప్రెస్‌ మీట్‌ ఒకటి పెడదాం! ముందు!” అంటూ ముందుకు నడిచాడు. హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చిన దానిలా మార్చురీలోంచి తెచ్చిన బట్టల్ని  నేలపై పెట్టి, ఎవరో కుర్రాడి స్కూటర్‌లోంచి పెట్రోలు తీసి, దానిపై పోసి, టఫ్‌ మని అగ్గిపుల్ల  గీసి వేసింది. భగ్గు మంటా. ఆ మంట పక్కనే కూలబడి పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది.  చాలాసేపు ఏడ్చి, లేచి కళ్ళు తుడుచుకొని, ఒక యుద్ధానికి సిద్ధమైన దానిలా తయారైంది  మాలతి. “నిరంజనా! నువ్వు యూనివర్సిటీ వైపుకు వెళ్ళి మన కుర్రవాళ్ళని మొబలైజ్‌ చెయ్యి! నేనూ,  మోహనా, చిన్న ప్రెస్‌ మీట్‌ పెట్టి అటువైపే వస్తాము” అంటూ ముందుకు కదిలింది.

………………………………………….

యూనివర్సిటీ అంతా కళకళలాడుతుంది. కొత్తగా రంగులు పులుముకొని,  రంగు కాగితాలు. వాద్య సంగీతాలు గొప్ప పండగ వాతావరణం వచ్చేసింది. “వెల్‌కం 2000  యియర్‌” పెద్ద బెలూన్‌ ఆకాశంలో వేలాడుతుంది. ఒక మహాద్భుతం ఏదో జరిగినట్లుగా ఉందా  ఉత్సవ వాతావరణం. ఆడిటోరియంలో పెద్ద ఫంక్షన్‌. ఈ శతాబ్దపు మేధావులందర్నీ  గుర్తుచేసుకుంటూ, వాళ్ళ కోసం గొప్పసభ. శతాబ్దాన్ని దాటి మిలెనియమ్‌లోని కొంతమంది గొప్పవాళ్ళని  నన్నయ, కృష్ణదేవరాయలు ఇంకా ఎవరెవరో జనం పోల్చుకోలేని వాళ్ళను కూడా స్మరించుకోవటం అట. గవర్నరు, పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు చాలా మంది వచ్చారు.  పదిగంటలకు ఆడిటోరియమంతా కిటకిటలాడుతుంది. ఎవరికైనా మాలతి దుఃఖగాధ చెప్పాలని, చిన్న  ప్రొటెస్టు, పోనీ ఒక ఊరేగింపు ఊహు వినే మూడు లేదు. రంగుల బాడ్జీలు తగిలించుకొని,  సుదీర్ఘమైన ఉపన్యాసాలు రాసుకొని విద్యార్థి నాయకులంతా హడావుడిగా ఉన్నారు.

ముందువరసలో పదిమంది కవులు. ఐదుగురు ఆధునికులు, మరో ఐదుగురు ప్రాచీనులు. బహుశా పద్యాలు  చదువుతారు కాబోలు. కొత్త మిలెనియం పై కవిసమ్మేళనమట. ఆడిటోరియంలో ప్రతి ఒకడూ గొప్ప జ్ఞాని, బాగా చదువుకొని ఉంటాడు, అనే  ముఖాలు పెట్టుకొని, ఇంటలెక్చ్యువల్‌ క్రీచర్స్‌ అనిపించుకోవాలని తపన. ఆ ముఖాలపైని  ముసుగు లాగేస్తే లోపలో తోడేలో, చిరుతో, జంతువో ఉండితీరుతుంది. సక్కర్స్‌! బ్లడీసక్కర్స్‌!  విసుగ్గా బయటకు వెళుతుంటే, “నిరంజనా! నీ కోసమే చూస్తున్నాను. మోహనసుందరం నాటకాన్ని  కాన్సిల్‌ చేశాము. ఆ టైమ్‌లో నీదో స్పీచ్‌ అరేంజ్‌ చేశాము! “ది న్యూ మిలెనియం అండ్‌ ఎ హోప్‌” గురించి  మాట్లాడు!” అంటూ స్టూడెంట్స్‌ యూనియన్‌ సెక్రెటరీ రామకృష్ణ పని పురమాయించాడు. “మర్చిపోవద్దు!  ప్రొఫెసర్‌ కూడా మరీమరీ చెప్పాడు. లాస్టియర్‌ నువ్విచ్చిన ఉపన్యాసాలు మొత్తం యూనివర్సిటీనే ఒక  ఊపు ఊపాయి!” మరోసారి హెచ్చరించాడు. జేబులోంచి వెయ్యి రూపాయలు తీసి, ప్రీవియస్‌ కుర్రాణ్ణి పిలిచి,  తార్‌నాకా దాకా వెళ్ళి నాలుగు రమ్ము సీసాలు పాక్‌ చేయించు రమ్మని పంపాను. వాడు  “ఎందుకన్నా?” అంటూ ఆశ్చర్యంగా చూశాడు. “ఉపన్యాస మివ్వాలట! అందుకు! మూడ్‌ రావద్దూ!” అన్నాను. మీటింగ్‌ మొదలైంది. పండితులు మంత్రోచ్చారణ చేశారు. గొప్పమనిషి ఒకాయన జ్యోతిని  వెలిగించాడు. అమ్మాయిలు నలుగురు కలిసి సరస్వతీ వందనాన్ని ఆలాపించారు. వేదిక పైకి ఒక్కొక్కళ్ళనే ముఖ్య అతిథుల్ని పిలుస్తున్నారు. ముందుగా  గతశతాబ్దం మొదట్లో పుట్టి, ఇంకా బ్రతికున్న మేధావులు. కవులు, శాస్త్రవేత్తలు, గాయకులు  వచ్చారు. వేదికపై పెద్ద సంతర్పణలా ఉంది. దాదాపు యాభై మంది. ముందువరసగా పదిమంది కవులు, కవిసమ్మేళనం చివరి అంశం కాబోలు. స్టూడెంట్‌ లీడర్‌ రామకృష్ణ స్టేజీ ఎక్కాడు. అందరికీ ఆహ్వానమన్నాడు.  ఆ తరువాత కొత్త మిలెనియం సంవత్సరానికి స్వాగతమన్నాడు. అంతలోనే వాడొక కవిత  చదవటం మొదలుపెట్టాడు.

గతం వద్దు! చంపేద్దాం! కొత్తది ఏదైనా సరే! క్లోనింగ్‌ గురించో, కొరియన్‌ ఎకానమీ గురించో ఆస్ట్రోఫిజిక్సో, అమరావతి తవ్వకాలో, ఏదో ఒకటి కొత్తగా మాట్లాడుదాం! పాత భావాల్ని తగల వేసి, కొత్తభావాల కచేరీని మొదలుపెడదాం!

వాడి కవితకు జనంలో గగ్గోలు. “ఇంక చాలు! ఇంక చాలు నీపైత్యం”  అంటూ గొడవ. ఉపన్యాసాలు మొదలైనాయి. మేలుకొన్న ఆర్థిక వ్యవస్థ గురించి,  చదువుల్లో సంస్కరణల గురించీ, కమ్యూనికేషన్ల గురించి ఒకటే వరసగా మొదలైనాయి  ఉపన్యాసాలు. కుర్రవాడు, ప్లాస్టిక్‌ సంచిలో ప్యాక్‌ చేసుకొచ్చిన రమ్ము బాటిల్సు తెచ్చి  ఇచ్చాడు. కొంచెం గోడ వారగా వెళ్ళి ఒక రమ్ము బాటిల్‌ మొత్తం గటగటా తాగేశాను. గొప్ప  దుఃఖంలో నడుస్తున్న బాతువులా తూలుతూ ముందు వరుసలో కూర్చున్నాను. మిలెనియం మహానుభావుల గురించి  ఉపన్యాసాలు మొదలైనాయి. ఆంధ్రా యూనివర్సిటీ నుంచో ప్రొఫెసరు. ముందు నన్నయ కావ్యం లోని  పద్యాల్ని శ్రావ్యంగా చదవటం మొదలుపెట్టాడు. “వద్దురా బాబూ! కనీసం శ్రీశ్రీ అయినా  బెటరు!” అంటూ వెనక నుంచి అరుపులు.

మరొక శతావధాని పెద్దన గురించి, శ్రీకృష్ణదేవరాయల  గురించి మొదలుపెట్టాడు. వరూధిని రొమ్ముల్ని, చంకల్ని పెద్దన వర్ణించిన తీరును అమోఘంగా  చెప్పేడు. అప్పుడు తీశాను రెండో బాటిల్‌. తల పక్కకు వంచి మొత్తం సీసా గటగటా తాగివేశాను.  రాజ్యాంగాన్ని గురించి ప్రజల హక్కుల గురించి స్వాతంత్ర పోరాట యోధుల గురించి మరో వక్త  మాటలాడటం మొదలు పెట్టాడు. ప్రజల హక్కులు అనేమాట వినబడి, నాలోపల ఒక వింత మృగం  ఉలిక్కిపడింది. మూడో సీసా అప్పుడు తీశాను. “ఇప్పుడు నిరంజన, రీడర్‌, పొలిటికల్‌ సైన్సెస్‌ ‘కొత్త మిలెనియం ఒక  ఆశాగీతం’ అనే విషయం గురించి మాట్లాడతాడు అన్న అనౌన్స్‌మెంటు వింటూనే నాల్గోసీసా  బయటకు తీసి గుటగుటమంటూ మొత్తం ఖాళీ చేశాను.

గునగునమంటూ నడుస్తూ,  పొట్టలోపల రమ్ము అటూ ఇటూ కదుల్తూ, సరస్సులను లోపల మోసుకెళ్తున్న మానవుడిలా ఉన్నాను. మైకు ముందకు వెళ్ళి, గొంతు సవరించుకొని, వేదికపై నున్న మాన్యశ్రీ,  ఫలానా, ఫలానా అని అందర్నీ పేరుపేరునా పలకరించి, “గత మిలెనియమ్‌, శతాబ్ది గురించి  నేనెక్కువ చెప్పను. అది మరణించింది. శవాల గురించి ఎందుకు మాట్లాడుకోవటం!” అని ఆగి,  “నేనేదైనా మాట్లాడితే అది కొత్త మిలెనియం గురించే ..” అంటూ ఒక్క సారిగా కళ్ళు తిరిగి, భూమి  అదిరి, లోపలినుంచి, ఒక పెను దుఃఖమో, మహాక్రోధమో బయటకు వస్తున్నట్లు ఉండగా   భళ్ళుమని వాంతి అయి లోపలనున్న పులిసిన సరస్సు బయటకు వస్తున్నట్లుగా పులిసిన,  జిగటగా వాసన వేస్తున్న రమ్ము “ఫూ…..” అంటూ ఆడిటోరియం వైపు ఊసి, ఆవాంతి అట్లా అలలు  అలలుగా వస్తూనే ఉంది. నా నోట్లోంచి సముద్రం బయటకు వస్తున్నట్లుగా “కొత్త శతాబ్దం   కొత్త మిలెనియం గురించి నాకున్న అభిప్రాయం ఇదే!” అంటూ వేదిక పైన, ఆడిటోరియం లోనూ  మడుగులా ప్రవహించే రమ్మును తొక్కుకుంటూ గునగునా క్రిందకు దిగాను.