ఆంధ్రా నుండి అమెరికాలో రెండు మూడు నెలలు పర్యటించి తిరిగి ఆంధ్రాకు వెళ్ళటానికి ఇష్టపడే కళాకారుల దగ్గర్నుంచి (రాజకీయ కళలో ఉద్దండులు మాత్రం వద్దు; మరే కళైనా ఫరవాలేదు) దరఖాస్తులు కావలెను. క్రింద విధింపబడిన షరతులకు పూర్తిగా అంగీకరించిన కొందరు వ్యక్తులను మేము ఎంచుకున్న తర్వాత వారికి మా ఖర్చులపై వీసా, ఎయిర్ టికెట్స్ ఇప్పించటమే కాకుండా కొంత ధనరూపంలో ముట్టచెప్పటానికి వీలు కావచ్చునని చెప్పటానికి చాలా సంతోషిస్తున్నాము. ఐతే ఎంత ఇవ్వగలం అనేది ముందుగా చెప్పలేము. అది ఎంపిక కాబడ్డ వ్యక్తుల సామర్య్థం మీద చాలా వరకు ఆధారపడుతుంది.
నిబంధనలు.
1. దరఖాస్తుదారుడు ఏ కళ లోనూ నిష్ణాతుడు కాకూడదు. కాని ధనాకర్షణ, సమయానుకూల కులతత్వ ప్రదర్శనల్లో మాత్రం నిష్ణాతుడు కావాలి.
2. ఏ విషయం మీదనైనా అనర్గళంగా, అమితమైన ఆత్మవిశ్వాసంతో, జనాన్ని (తాత్కాలికంగా నైనా) నమ్మించ గలిగేట్లుగా మాట్లాడ గలగాలి.
3. ఎంపిక చేయబడ్డ వ్యక్తి అమెరికాలో మేము నిర్ణయించే ప్రదేశాలలో మాత్రమే ప్రదర్శనలు ఇవ్వాలి.
4. ఈ ప్రదర్శనలకు వచ్చే రాబడి మొత్తం నిర్వహకులదే (అంటే, మాదే)!
5. ప్రతి ప్రదర్శనలోను ఇద్దరు ముగ్గురు నిర్వాహకులు (మా వాళ్ళు) తప్పకుండా వేదికమీద ఉన్నతాసనాలు ఎక్కి కూర్చుంటారు. వారి పని కేవలం అప్పుడప్పుడు చిరునవ్వులు నవ్వుతూ ఉండటమే అయినా ప్రదర్శకుడు ఏ మాత్రం అభ్యంతర పెట్ట కూడదు.
6. అవసరం ఉన్నా లేకపోయినా సదరు ప్రదర్శకుడు వీలైనన్ని సార్లు మమ్మల్ని పొగడాలి. ఒక్కో సభకు కనీస సంఖ్య పది సార్లు.
7. ప్రదర్శకుడు ప్రేక్షకులు తనకు పాదాభివందనాలు చేసేటట్లు తన వాచా, కర్మణా సర్వ ప్రయత్నాలు చెయ్యాలి. (డబ్బు ఎక్కువ పోగుచేయటానికి ఇది ఉండితీరవలసిన సన్నివేశం.)
8. ఏ సందర్భంలో నైనా ఎవరైనా దుండగులు నిర్వాహకులని గాని, ప్రదర్శకుడిని గాని తిట్టినట్లైతే, దానికి ప్రదర్శకుడు ఏ మాత్రం బాధ పడక పోవటమే కాకుండా నిర్వాహకులను తన శక్తి మేర సమర్థించాలి.
9. ఈ పర్యటనలో ప్రదర్శకుడిని మా వ్యతిరేక వర్గం వాళ్ళు ఎవరైనా తమ వైపుకు లాగాలని ప్రయత్నించినా తను లొంగకూడదు. ఒకవేళ ప్రదర్శకుడు ఇంకెవరితోనైనా చేతులు కలిపితే మాకు 10,000 డాలర్లు నష్టపరిహారం చెల్లించాలి. తన తిరుగు ప్రయాణం బాధ్యత మేము ఆపై ఏమాత్రం భరించము.
10. అమెరికాలో ఉన్నన్ని నాళ్ళు, ఎవరెవరి ఇళ్ళలో ఉంటాడో వాళ్ళకు రెండు వందల డాలర్ల వరకు మాత్రమే ఫోన్ బిల్లులు వచ్చేట్లు చూడాలి (అంతకన్న ఎక్కువైతే అనవసరపు దుష్ప్రచారం జరగొచ్చు). వారిచ్చే ఎలాటి ఘన, ద్రవ పదార్థాలు పుచ్చుకున్నా మాకు అభ్యంతరం ఉండదు వాళ్ళ బాత్ రూమ్‌లు గలీజు చెయ్యనంత వరకు.
11. ప్రదర్శకుడు తనంత తానుగా ఎటువంటి ధనార్జనకు పూనుకోకూడదు. అయితే కొన్ని అసాధారణ పరిస్థితుల్లో నిర్వాహకుల అనుమతితో వారికి కొంత డిపాజిట్ ముందుగా చెల్లించి ఇటువంటి పనులు చెయ్యవచ్చును. కాని అలా వచ్చిన దానిలో నిర్వాహకుల వాటా కనీసం 50 శాతం ఉంటుంది.
12. ప్రదర్శకుడు తప్పనిసరిగా తిరిగి ఇండియాకు వెళ్ళి తీరవలెను. (ఇక్కడే ఉండి మా పరువు తియ్యటానికి మేము ఒప్పుకోము)
13. పర్యటన పూర్తి అయి తిరిగి వెళ్ళిన తరువాత మా గురించి, మేము చేస్తున్న కళాసేవ గురించి విరివిగా వ్యాసాలు రాయాలి, ఉపన్యాసాలు ఇవ్వాలి. వ్యాసాలు స్థానిక పత్రికల్లో ప్రచురించే బాధ్యత కూడ మీదే!
14. ఒక్కసారి అమెరికా వచ్చిన వ్యక్తికి సాధారణంగా మరో సారి వచ్చే అవకాశం ఇవ్వము. కాని కొన్ని సందర్భాలలో హెచ్చు రుసుము వసూలు చేసిన మీదట తిరిగి తీసుకువచ్చే అవకాశం ఉంది. కనుక తిరిగివెళ్ళాక మా మీద నిందలు వేసే ప్రయత్నాలు చెయ్యకూడదు.
ఈ నిబంధనలకు అంగీకరిస్తున్నట్లు స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి 25,000 రూపాయల డిపాజిట్‌తో ఈ క్రింది చిరునామాకు మీ దరఖాస్తులు పంపవచ్చును. మామూలుగానే, ఇంకా ఎక్కువ పంపిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
భవదీయుడు
సన్మాన చక్రవర్తి