జులై 2017

చెవుల్ని చితకకొట్టే సినీ సంగీతం ఓ పక్కన హోరెత్తుతున్నా ఎందరో చిన్నారులు అపురూపంగా సంప్రదాయ సంగీతం మనం చెవులు అప్పగించి వినేలా పాడటం ఎలా జరుగుతోందీ? నాటకమైనా, నాట్యమైనా, చిత్రకళయినా అన్నిటికీ ఎంతో కొంత ముచ్చట తీర్చే మార్గాలున్నాయి. ఇదే స్థితి మన ప్రాంతీయ, ప్రాచీన చిత్ర శిల్ప కళల దగ్గరికొచ్చేసరికి కథ మారింది. సంగీతం, నాట్యం, కొద్దో గొప్పో నాటకం ప్రజలకు పరిచయం అయినంతగా చిత్ర శిల్పకళలు పరిచయం అయినట్టు లేదు. అందుకని, చిన్న పిల్లలకు కళాదృష్టి ముందునుంచే సంగీత సాహిత్యాలవలే అలవాటు చేయటం మన బాధ్యత అని, చిత్ర శిల్ప కళల పరిచయం పెంచడం, పెంచుకోడం వాడుక భాషాఉద్యమం, గ్రంథాలయ ఉద్యమం, ప్రాంతీయ, విప్లవ ఉద్యమాలవంటిదే కాబట్టి మనం ఉద్యమించక తప్పదని శివాజీ తమ కళకాలమ్ శీర్షిక రెండోభాగంలో నొక్కిపలుకుతున్నారు; యాత్రలకు ధనమూ సమయమూ అవరోధాలు కావు. భాష, భద్రత, రక్షణ అధిగమించలేని సమస్యలు కానే కావు. ఎక్కడి మనుషుల్లో అయినా కనిపించేది మన ప్రతిబింబమే! అని తమ ట్రావెలాగ్ ద్వారా వివరిస్తున్నారు దాసరి అమరేంద్ర; ఇటీవలే మరణించిన సినారెకు నివాళి; ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మిపై వచ్చిన పుస్తకపరిచయం; మరొక అద్భుతమైన పద్యపరిచయం… ఈ సంచికలో.


ఈ సంచికలో:

  • కథలు: గెలుపు – అవినేని భాస్కర్ (బి. జయమోహన్); శవం – చంద్ర కన్నెగంటి; పిచ్చి వెంకట్రావు – మధురాంతకం రాజారామ్.
  • కవితలు: వూళ్ళో ఇల్లు – హెచ్చార్కె; నా- తః తః; మాటలు – పూడూరి రాజిరెడ్డి; అబద్ధం – మానస చామర్తి.
  • వ్యాసాలు: సినారె: ఒక స్మరణ – పాపినేని శివశంకర్; రెండు ప్రయాణాలు-ఒక ప్రయోగం – దాసరి అమరేంద్ర; సార్థకనామ వృత్తములు – జెజ్జాల కృష్ణమోహన రావు; మధురగాయని బతుకు పాట: పుస్తక పరిచయం – వేణు; నాకు నచ్చిన పద్యం: కైలాసాన్నే కాదన్న వీరవనిత – భైరవభట్ల కామేశ్వరరావు; తెరచాటువులు: 6. ఆస్సెం – కంచిభొట్ల శ్రీనివాస్; కళకాలమ్: 2. ఉద్యమిద్దామా? నిద్రపోదామా? – తల్లావజ్ఝుల శివాజీ; గడి నుడి-9 – కొల్లూరు కోటేశ్వరరావు.