కిష్మిష్

[కాథొలిక్ చర్చి సంప్రదాయం ప్రకారం, ఈస్టర్ పండుగ వచ్చే ముందు నలభై రోజుల్ని ‘లెంటు మాసం’ పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా చర్చిలో ఉత్సవాలు జరుగుతాయి. వ్రతం పాటించాలనుకునేవాళ్ళు ఉపవాసం చేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇళ్ళల్లో ప్రత్యేకమైన వంటలు చేస్తారు. ఈ కథ రష్యన్ రచయిత్రి టెఫీ, తాను ఎనిమిదేళ్ళ పాపగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన గురించి రాసింది.]


అస్పష్టంగా దూరాన్నించి, ఠంగుమనే శబ్దానికీ బాకా ఊదిన శబ్దానికీ మధ్యస్థంగా వినిపిస్తోన్న చర్చి గంట. గంట కొట్టే మనిషి ప్రత్యేకమైన లయలో మోగించడం వల్ల గంటల శబ్దం కలగలసి మూలుగులా ధ్వనిస్తోంది.

మంచం మీంచి చూస్తున్న పాపకు తెరిచివున్న తలుపు లోనుంచి, మసక చీకట్లో ఏదో రాచుకుంటున్న శబ్దంతో గుట్టుగా ఒక ఆకారం అటూ ఇటూ నెమ్మదిగా తిరగడం కనపడుతోంది. ఇప్పుడు సరిగా కనపడిందది; క్రమేపీ బూడిదరంగు మచ్చలా మారి చుట్టూ వున్న చీకట్లో కలిసిపోయింది. రాచుకుంటున్న శబ్దం ఆగిపోయింది. దగ్గర్లో చెక్క నేల కిర్రుమన్న శబ్దం. దూరాన మళ్ళీ అదే శబ్దం… అంతా నిశ్శబ్దం. ఆ ఆకారం న్యాన్యా అని అర్థమైంది. న్యాన్యా వ్రతంలో ఉంది. చర్చిలో వేకువ ఝాము ప్రార్థన చెయ్యడానికి బయలుదేరింది.

ఇప్పుడిక పాపను భయం చుట్టుముట్టేసింది. మంచం మీద పడుకుని వినపడీ వినపడనట్టు ఊపిరి తీసుకుంటూ ఉన్న పాప, చిన్న బంతిలా తనలోకి తాను ముడుచుకుపోయింది. ఆమె వింటోంది, గమనిస్తోంది. వింటోంది, గమనిస్తోంది. దూరాన్నించి వస్తోన్న గంటల శబ్దం ఏదో రానున్న ఉత్పాతాన్ని సూచిస్తోంది. ఆ చిన్న పాప ఒంటరిదైపోయింది. కాపాడేవాళ్ళెవ్వరూ లేరు. పిలిస్తే పలికేవాడే లేడు. ఇప్పుడెలా?

ఈ పాటికి రాత్రి ముగిసిపోయి ఉంటుంది. కోళ్ళు తమ కూతలతో సంజెకు స్వాగతం పలికి ఉంటాయి. దయ్యాలు వాటి స్వస్థలాలకు తిరిగెళ్ళిపోయుంటాయి. అసలవి స్మశానాల్లో, బురదగుంటల్లో, ఒంటరి సమాధుల మీదుంచిన కర్ర సిలువలకింద, అడవుల చివరుండే నిర్మానుష్యమైన రోడ్ల కూడళ్ళల్లో కదా ఉంటాయి? వాటిల్లో ఒక్కటి కూడా ఈ సమయంలో మనుషుల జోలికి రావు. ప్రస్తుతం దేవుడి ఉత్సవాలు జరుగుతున్నాయి. క్రైస్తవులందరి కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఇంకెందుకు భయం?

కానీ ఎనిమిదేళ్ళ పసిహృదయం ఈ తర్కాన్ని ఎలా నమ్ముతుంది? నిశ్శబ్దంగా ఏడుస్తూ, వణుకుతూ తనలో తాను ముడుచుకుపోతుంది. ఎనిమిదేళ్ళ పసిహృదయం ఇది గంట చప్పుడని నమ్మదు. పొద్దున పూటైతే సరే… నమ్ముతుంది. కానీ ఇప్పుడు ఒంటరిగా ఉండి, కాపాడేవారే లేక, తీవ్రమైన బాధలో వున్న ఆమెకి, ఆ గంట మోగించేది అందరినీ చర్చికి పిలవడానికని తెలియదు. ఈ శబ్దం దేన్ని సూచించడం లేదో, ఎవరికి తెలుసు? వినడానికే వణుకు పుట్టిస్తోంది. ఏడుపు భయం కలగలిపి శబ్దంలోకి అనువదిస్తే ఇలాగే వినపడుతుంది. ఏడుపు భయం కలిపేసి రంగులోకి అనువదిస్తే ఈ రకమైన అస్పష్టమైన మసక బూడిద రంగు తయారవుతుంది.

ఈ నడిరాత్రి చేదు అనుభవం ఈ చిన్ని జీవితో ఎన్నో ఏళ్ళు జీవితమంతా ప్రయాణిస్తుంది. ఈ జీవి చెప్పలేని భయాందోళనలతో ప్రతి అర్ధరాత్రి లేచి కూర్చుంటూనే ఉంటుంది. డాక్టర్లు నిద్రమాత్రలిస్తారు. సాయంకాలపు నడక అలవాటు చేసుకోమంటారు, లేదంటే పొగ తాగడం మానెయ్యమంటారు. వేడిగా లేని గదిలో పడుకోమనో, కిటికీలు తెరిచి ఉండాలనో, పొట్టమీద వేణ్ణీళ్ళ కాపడం పెట్టుకోమనో… ఎన్నో రకాలుగా చెప్పి చూస్తారు. కాని ఏది కూడా ఆమె హృదయాన ముద్రించుకున్న ఆ నడిరాత్రి నైరాశ్యపు గురుతును చెరిపి వేయలేదు.


ఈ పాప ముద్దు పేరు ‘కిష్మిష్’ – కాకాసస్ ప్రాంతంలో పండే చిన్న సైజు ద్రాక్ష పేరది. ఈ పేరే ఎందుకు అంటే, ఆమె చిన్ని ముక్కు, చిట్టి చేతులు వుండే బుజ్జి పాప కాబట్టి! అసలెవరూ పట్టించుకోని అల్పజీవి. పదమూడేళ్ళ వయసులో అకస్మాత్తుగా బారుగా పెరిగిపోయింది. కాళ్ళు పొడవుగా సాగిపోయి, అందరూ ఆమెకసలు కిష్మిష్ అనే పేరు ఉన్న విషయమే మరిచిపోయారు.

కానీ చిన్నప్పుడు ఈ దిక్కుమాలిన పేరు ఆమెను చాలా ఇబ్బంది పెట్టేది. ఎనిమిదేళ్ళ కిష్మిష్‌కు స్వాభిమానం ఎక్కువ, ఏదో ఒక రకంగా తాను ప్రత్యేకం అని నిరూపించుకోవాలనే తపన; అన్నిటికంటే మించి ఏదైనా భారీగా అసాధారణంగా సాధించెయ్యాలనే కోరిక. మంచి వస్తాదని పేరు తెచ్చుకోవాలనుకోండి! గుర్రపు డెక్కను ఒట్టి చేతులతో వంచేయడమో లేదంటే పరుగులు తీస్తున్న జట్కాను ఎదురెళ్ళి నిలువరించడమో చెయ్యాలి.

ఆమెకు బందిపోటు అయిపోవడం అన్న ఆలోచన బాగా నచ్చింది, లేకపోతే దీనికన్నా మంచిపని ఒక జడ్జిగా మారిపోవడం. జడ్జి బందిపోటుకంటే బలవంతుడు, ఎందుకంటే ఎప్పుడూ ఆయనదే చివరి మాట. కత్తిరించిన పీచు జుట్టు కొసలను నెమ్మదిగా వేళ్ళతో రింగులు రింగులుగా చుడుతున్న ఈ బక్కపిల్ల వైపు చూస్తూ అసలీ పెద్దవాళ్ళెవరైనా ఊహించగలరా – వాళ్ళల్లో ఎవరైనా సరే ఊహించగలరా! బలం పెంచేసుకోడానికి ఆమె మెదడు ఎలాంటి ఎలాంటి బీభత్సమైన కలలు దాచుకుని ఉడికిపోతోందో? మరో విషయం – ఇంకో కల కూడా వచ్చింది, భయానకమైన పిశాచిలా మారినట్టు. ఏదో మూలకూర్చునే ముసలి పిశాచం కాదు, నిజంగా మనుషుల్ని వణికించే తరహా. కిష్మిష్ వెళ్ళి అద్దం ముందు నిల్చుని మెల్లకన్ను పెట్టి, అటో వేలు ఇటో వేలుతో బుగ్గల్ని సాగదీసి నాలికను ఒకపక్కకి తోస్తుంది. కానీ ముందుగా తన మొహం చూడ్డానికి భయపడుతూ, వెనక నిలబడున్న అనామక పెద్దమనిషి పాత్ర ధరించి, గంభీరమైన గొంతుతో ‘నాతో కలిసి నృత్యం చెయ్యండి మేడమ్! జన్మ ధన్యం అవుతుంది’ అంటూ తల వంచి మాట్లాడుతున్నట్టు నటిస్తుంది.

కిష్మిష్ సమాధానంగా ఆ వింత మొహం పెట్టుకుని, కాలి మడిమలమీద గిర్రున వెనక్కి అతని వైపు తిరిగి ‘అలాగే, కానీ నా బుగ్గ మీద ముందు నువ్వు ముద్దు పెట్టాలి’ అంటుంది.

ఆ పెద్ద మనిషి ఒక్కసారిగా భయంతో వణుకుతూ పారిపోతాడు. ‘హా!’ అని అట్టహాసం చేసి “భయపడిపోయావు కదా?” అంటూ వెనకపడి కేకలు పెడుతుంది.


కిష్మిష్ పుస్తకాలు ముందేసుకు కూర్చుంది. ముందుగా బైబిలు, తర్వాత కాపీ రైటింగు.

ఏ పని చేసినా దైవప్రార్థనతోనే మొదలుపెట్టాలని నేర్చుకుంది. ఈ పద్ధతి ఆమెకి బాగా నచ్చింది. కానీ మిగతా వాటితో పాటూ ఇంకా బందిపోటుగా మారాలా లేదా అని ఆలోచిస్తూనేవుంది కదా! ఆ విషయం గుర్తుకొచ్చి ఒక ప్రమాద ఘంటిక మోగింది.

“బందిపోట్ల సంగతి ఏవిటి” అడిగింది అందరినీ. “బందిపోటుతనానికి బయలుదేరేటప్పుడు కూడా తప్పనిసరిగా ప్రార్థన చెయ్యాలా?”

ఎవ్వరూ దానికి సరైన సమాధానం ఇవ్వలేదు. అందరూ ఒకటే మాట అన్నారు, ‘వెర్రిదానిలా మాట్లాడకు!’ కిష్మిష్‌కు అర్థం కాలేదు. దీనర్థం బందిపోట్లకు ప్రార్థన చేసే అవసరం లేదనా? కచ్చితంగా చెయ్యాలనా? లేకపోతే అంత స్పష్టంగా తెల్సిన విషయం కాబట్టి అడగడమే మూర్ఖత్వం అనా?


కిష్మిష్ ఇంకొంచెం పెద్దయి మొదటిసారిగా చర్చిలో కన్ఫెషన్‌కు సిద్ధం అవుతున్నప్పుడు ఆమె ఒక ఆధ్యాత్మిక సంఘర్షణకు గురైంది. ఇప్పుడు ఆ పాతరోజుల్లో బలం పెంచుకోడానికి కనే కలలన్నీ ఎటో పోయాయి.

ఆ ఏడు ఎంపిక కాబడ్డ పాట ‘ప్రభూ! ప్రార్థన గైకొనుమా.’ ముగ్గురు కుర్రాళ్ళు పూజాపీఠం పక్కన నిలబడి, దివ్యమైన కంఠాలతో ఆలపిస్తూ చాలా శ్రావ్యంగా పాడుతున్నారు. వింటూంటే హృదయం మరింత వినమ్రంగా, మృదువుగా మారిపోతోంది. ఆ దివ్యగానం హృదయాన్ని తేలిక చేసి స్వచ్ఛమైన శోధనతో నింపిన పవిత్రాత్మగా మార్చి, శబ్దాల్లో, సాంబ్రాణీ పొగల్లోనుంచి పైనున్న గుమ్మటం దాకా తీసుకెడుతూ, పరిశుద్ధాత్మ యొక్క శ్వేతకపోతం రెక్కలు విప్పుకుని పయనించే ఆ పరలోకపుటంచు వద్దకు ఎగసివెళ్ళాలనే కోరిక పుట్టిస్తున్నది.

ఇక్కడ బందిపోటుకు తావు లేదు. జడ్జికి కూడా సరైన స్థలం కాదు, వస్తాదుకు కూడా. పిశాచం విషయానికొస్తే, ద్వారం బయట తన భీకరమైన మొహాన్ని చేతుల్తో కప్పుకుని నిలబడి ఉంటుంది. అసలు చర్చి అంటేనే భయపడే వాళ్ళుండే స్థలం కాదు. ఓహ్! ఆమె దైవదూతగా మారగలిగితే, ఎంత గొప్పగా ఉంటుందది! ఎంతో దివ్యం, మధురం, సుందరం. దైవదూతది అందరికంటే అన్నిటికంటే పైస్థాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే, టీచరు కంటే, హెడ్‌మిస్ట్రెస్ కంటే ఇంకా గవర్నరు కంటే కూడా.

అయితే దైవదూతగా మారేదెలా? దానికి ఆమె అద్భుతాలు సృష్టించాలి. కానీ కిష్మిష్‌కు ‘ఎలా సృష్టించాలి’ అన్న అవగాహన అస్సలు లేదు. అసలు అద్భుతాలతో కాదు కదా మొదలుపెట్టాల్సింది! ముందుగా దైవదూత లాంటి జీవితం గడపాలి. శాంతం, దయ, చేతికి దొరికిందల్లా పేదవాళ్ళకు దానాలు చేసెయ్యడం, ఉపవాసం, నిష్ఠ ఇవన్నీ అలవాటు చేసుకోవాలి.

అసలు పేదవాళ్ళకన్నీ ఇచ్చెయ్యడం ఎలా? ఆమెకు తేలికపాటి కోటు ఒకటుంది. ముందర అది ఇచ్చెయ్యాలి.

అమ్మో! అమ్మకెంత కోపం వస్తుంది. నానా యాగీ చేస్తుంది, ఆలోచించడానికే భయమేసేంత. మరి అమ్మకు కోపం తెప్పించడం మటుకు! ఎప్పుడూ ఎవ్వర్నీ దైవదూతలు ఏమాత్రం ఇబ్బంది పెట్టడం, కోపం తెప్పించడం చెయ్యకూడదు. కోటు ఎవరికైనా పేదవాళ్ళకు ఇచ్చేసి, పోయిందని అమ్మకు చెప్పేస్తే? మరి దైవదూతలు అబద్ధాలు చెప్పకూడదు కదా! బందిపోటు జీవితమే తేలిక. ఒక బందిపోటు కావల్సినన్ని అబద్ధాలు చెప్పొచ్చు – కాపోతే నవ్వడం మటుకు ఓ వంకర నవ్వు ఒకటి నవ్వాలి.

మరెలా ఈ దైవదూతలంతా దైవదూతలుగా ఎలా తయారయ్యారు? మామూలుగానే మారుంటారు అనిపిస్తోంది. పెద్దవాళ్ళు కాబట్టి – వాళ్ళెవ్వరి వయస్సు పదహారు కంటే తక్కువ ఉండివుండదు. అసలు చాలామందయితే మరీ పెద్దవాళ్ళు. వాళ్ళెవ్వరికీ అమ్మ మాట వినాల్సిన అవసరమే లేదు. దగ్గరున్నవన్నీ వాళ్ళు చులాగ్గా ఎవరికయినా ఇచ్చెయ్యొచ్చు. ఊహూ! అసలు దీంతోకాదు మొదలు పెట్టాల్సింది, ఇవన్నీ ఆఖరి నిమిషం దాకా ఉంచుకోవాల్సినవి. మొదట ఆమె ప్రశాంతంగా ఉండడం వినమ్రంగా ఉండడం – ఇవి చెయ్యాలి. ఇంకా నియంత్రణతో ఉండడం కూడా. కేవలం నల్లరొట్టె, అది కూడా ఉప్పుతో మాత్రమే తినాలి. నీళ్ళు నేరుగా కొళాయిలోంచి తాగాలి. కానీ ఇక్కడే వుంది సమస్యంతా. వంటమనిషి ఆమె మీద చాడీలు చెప్పొచ్చు. ఆవిడ వెళ్ళి అమ్మకు, కిష్మిష్ అలాంటి నీళ్ళు తాగుతోందని చెప్పేస్తుంది. నగరమంతా విషజ్వరాలున్నాయి, అసలు అమ్మ కొళాయి నీళ్ళు తాగడానికి ఒప్పుకోదు. కానీ అమ్మకు కిష్మిష్ దైవదూత అయిపోయింది అని తెలిస్తే మటుకు దార్లో అడ్డాలు పెట్టడం మానేస్తుంది.

అసలు దైవదూత అయిపోవడం అనేది ఎంత అద్భుతమైన విషయం. ఈ రోజుల్లో అలాంటివాళ్ళు, చాలా తక్కువమంది వున్నారు. ఆమెకు తెలిసినవాళ్ళందరూ ఆశ్చర్యపోతారు.

“కిష్మిష్ తల వెనకాల కాంతి పుంజం ఎలా వచ్చింది?“

“అదేంటి, నీకు తెలీదా? ఆమె దైవదూతగా మారి చాలా కాలం అయ్యింది.”

“ఏసయ్యా! ఏవిటిది? నేను నమ్మను!”

“అదుగో కిష్మిష్ ఇటొస్తోంది. నువ్వే చూస్కో!”

మరి తనేమో నల్లరొట్టెతో ఉప్పు నంజుకుని తింటూ, ప్రశాంతంగా నవ్వుతుంది.

వాళ్ళమ్మను కలవడానికి ఇంటికి వచ్చిన అతిథులందరూ అసూయ పడతారు. వాళ్ళల్లో ఒక్కరికీ దైవదూతలైన పిల్లలు లేరు.

“నీకు నిజంగా తెలుసా! ఆ అమ్మాయి నటించడం లేదని…”

“మూర్ఖుల్లారా! ఆ కాంతిపుంజం కనపడ్డం లేదూ?”

కాంతిపుంజం ఎంత తొందరగా కనపడ్డం మొదలౌతుందోనని ఆలోచించింది. బహుశా కొన్ని నెలలు. ఆకులు రాలే కాలానికల్లా పూర్తిగా ప్రత్యక్షమౌతుంది. ప్రభూ! ఎంత అద్భుతంగా వుంది ఇదంతా. మరుసటి సంవత్సరం ఆమె కన్ఫెషన్‌కు వెళ్ళినప్పుడు, ఫాదర్ తీవ్రమైన స్వరంతో అడుగుతాడు, “నువ్వేం పాపాలు చేశావు? నువ్వు తప్పనిసరిగా పశ్చాత్తాపం చెందాలి.”

అప్పుడామె సమాధానం ఇస్తుంది, “అసలే పాపాలూ చెయ్యలేదు. నేను దైవదూతని!”

“కాదు కాదు” అంటూ ఆయన ఆశ్చర్యం ప్రకటిస్తాడు.

“కానే కాదు. అమ్మనడగండి. ఆమె స్నేహితులనడగండి. అందరికీ ఈ విషయం తెలుసు.”

ఫాదర్ ఆమెను మళ్ళీ ప్రశ్నిస్తాడు, ఎక్కడైనా ఏవన్నా చిన్న బుజ్జి పాపం జరిగిందేమోనని. ఆమె మళ్ళీ అదే సమాధానం ఇస్తుంది, “లేదు. ఒక్కటంటే ఒక్క పాపమూ చెయ్యలేదు. కావాల్సినంతసేపు వెతుక్కోండి.”

ఆమెకు ఇంకో అనుమానం కూడా వచ్చింది, దైవదూతగా మారిన తర్వాత కూడా హోమ్‌వర్క్ చెయ్యాల్సి ఉంటుందా అని. అదే చెయ్యాల్సొస్తే కొంచెం ఇబ్బందే! ఎందుకంటే దైవదూతలు బద్ధకంగా ఉండడానికి లేదు. అలానే అవిధేయత ఉండకూడదు. ఆమెకు చదువుకోమని చెప్తే, వాళ్ళు చెప్పినట్టే చెయ్యాలి. అసలు ఆమె వెంటనే అద్భుతాలు సృష్టించడం నేర్చుకునేస్తే! ఒక్క అద్భుతం – దెబ్బతో టీచరు భయపడిపోతుంది, మోకాళ్ళ మీద నిల్చుని బతిమలాడుతుంది. మళ్ళీ హోమ్‌వర్క్ ఊసే ఎత్తదు.

తర్వాత ఆమె తన మొహాన్ని గుర్తుకు తెచ్చుకుంది. అద్దం ముందుకెళ్ళి, బుగ్గలు లోపలికి గుంజి ముక్కు పుటాలు పెద్దవి చేసి, కళ్ళు గిర్రున ఆకాశం వైపు తిప్పింది. కిష్మిష్‌కు తన మొహం తీరు నచ్చింది. నిజంగా దైవదూత మొహం. కొంచెం కక్కొచ్చేట్టుంది కానీ పూర్తిగా దైవస్వరూపమే. ఇంకెవ్వరికీ అలాంటి మొహం లాటిది లేనే లేదు. ఇప్పుడు వంటిట్లోకి పోయి… ఓ ముక్క నల్లరొట్టె!

రోజూ అల్పాహారం తయారుచేసేటప్పుడు కనపడేట్టే, వంటావిడ చిరాగ్గా పరాగ్గా వుంది. కిష్మిష్ రాక కోరుకోగూడని ఆశ్చర్యకర పరిణామం. “చిన్నరాణీవారు వంటగదికెందుకొచ్చారు? అమ్మ చూసిందంటే, వాతలు పెడుతుంది.”

లెంటు మాసపు ప్రత్యేక వంటకాలు, మంచి నోరూరించే వాసనలు, చేపలు, ఎర్రగడ్డలు, కుక్కగొడుగులు, కిష్మిష్ ముక్కుపుటాలు తెలీకుండానే పెద్దవైనాయి. తిరుగుసమాధానం ఇద్దామనుకుంది. “ఆ విషయం నీకనవసరం.”

వెంటనే గుర్తుకొచ్చింది తాను దైవదూతనని. నెమ్మదిగా సమాధానం ఇచ్చింది, “వర్వరా! కొంచెం నల్లరొట్టె ముక్క ఒకటివ్వవా?” కొంచెసేపాలోచించి, “బాగా పెద్ద ముక్క” అని జత చేసింది. వర్వరా రొట్టె తుంచిచ్చింది.

“కొంచెం దాని మీద ఉప్పు చల్లి ఇస్తావా?” అని పొడిగించింది, స్వర్గం వైపు చూస్తున్నట్టుగా, మొహం పైకెత్తి చూస్తూ.

ఆమె రొట్టెను మటుకు అక్కడిక్కడే తినాలి. తీసుకుని ఇంకెక్కడికెళ్ళినా అపార్థాలెదురౌతాయి. ఇబ్బందికర పరిణామాలు కూడా. రొట్టె నిజంగా బావుంది. కిష్మిష్ ఒక ముక్కే అడిగినందుకు నొచ్చుకుంది. కొళాయి దగ్గరకి జగ్గు తీసుకెళ్ళి కొంచెం నీళ్ళు తాగింది. అప్పుడే పనిమనిషి లోపలికొచ్చింది.

“అమ్మకు చెప్పేస్తాను” అందామె ఏదో చూడకూడని దారుణం చూసినట్టుగా మొహం పెట్టి, “నువ్వు కొళాయి నీళ్ళు తాగుతున్నావని.”

“ఇప్పుడే ఒక పెద్ద రొట్టె ముక్క తినింది, ఉప్పుతో నంజుకుని!” అంది వంటావిడ, “ఏమయిందనిప్పుడు, ఎదిగే పిల్ల కదా!”

ఇంటిల్లిపాదికీ అల్పాహారం కోసం పిలుపులు వెళ్ళాయి. కిష్మిష్‌కు వెళ్ళడం ఇష్టంలేదు. వెళ్ళినా ఏవీ తినకూడదని నిశ్చయించుకుంది. తనక్కడ ప్రశాంతంగా కూర్చుంటుంది!

చేపల పులుసు, మిగతా వంటలు గిన్నెల్లో పెట్టి వున్నాయి. తన పళ్ళెంలో ఉన్న పదార్థాల వైపు చూస్తూ అక్కడే కూచుంది.

“నువ్వెందుకు తినడం లేదు?”

ఏ రూపు కోసం తాను అద్దం ముందు నుంచుని రోజూ సాధన చేస్తోందో అదే దైవదూత రూపు దాలుస్తూ, ప్రశాంతమైన చిరునవ్వు సమాధానంగా ఇచ్చింది.

“భగవంతుడా, దీనికేం పట్టింది?” ఆశ్చర్యం ప్రకటించింది దిగ్భ్రాంతి చెందిన అత్త. “ఎందుకు ఇదలా మొహం భయంకరంగా పెడుతోంది?”

“అదే కాదు. ఇప్పుడే నల్లరొట్టెలోంచి పెద్ద ముక్క తుంచుకుని తినేసింది” అనింది ఆరిందా వంటమనిషి. “ఇక్కడికొచ్చే ముందరే, గుక్కెడు కుళాయి నీళ్ళతో పాటూ.”

“అసలు నీకు వంటింట్లోకి వెళ్ళి తినమని ఎవరు చెప్పారు?” అమ్మ అరిచేసింది. “కొళాయి నీళ్ళు ఎందుకు తాగావు?”

తన దైవదూత మొహం ఇంకా స్పష్టంగా కనిపించాలని, కిష్మిష్ ఒక్కసారిగా కళ్ళు వంకరగా తిప్పి మెల్లకన్ను పెట్టి ముక్కుపుటాలు పెద్దవి చేసింది.

“దీనికేదో పట్టింది?”

“కిష్మిష్ నన్ను వెక్కిరిస్తోంది!” కీచు గొంతుతో ఒక ఏడుపు ఏడ్చింది అత్త.

“రాక్షసీ, ముందిక్కణ్ణించి పోవే!” అమ్మ ఉద్రేకంతో కేకేసింది. “మూల గదిలోకెళ్ళి అక్కడే వుండు ఈరోజంతా!”

“ఎంత తొందరగా దాన్ని బోర్డింగ్ స్కూల్లో వేస్తే, అంత మంచిది” అంది అత్త ఇంకా బెక్కుతూ. “ఓహ్ నా నరాలు! నరాలు సడిలిపోతున్నాయి, నా నరాలు!”

పాపం కిష్మిష్ అలా పాపిగానే మిగిలిపోయింది.

(ఆంగ్లానువాదం: రాబర్ట్ చాండ్లర్.)


నాదెజ్దా తెఫీ (అసలు పేరు నాదెజ్దా లోక్వితస్కయా) సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 1872లో జన్మించారు. ఆమె రాసిన కథలు, 1919 వేసవిలో యుక్రెయిన్ నించి ఇస్తాన్‌బుల్‌కు ఆమె బోటులో చేసిన తన చివరి విషాదకరమైన ప్రయాణం గురించి హాస్యస్ఫోరకంగా రాసిన ‘ఫ్రమ్ మాస్కో టు ది బ్లాక్ సీ’ సుప్రసిద్ధమైనవి. రష్యాలో విప్లవం ముందు రోజుల్లో తెఫీ అత్యంత ప్రాచుర్యం పొందిన రచయిత్రి. ఆమెను ప్రసిద్ధ రచయిత చెఖోవ్‌తో పోలుస్తారు. ఆమె పేరు మీద రష్యాలో సెంట్లూ, కాండిళ్ళు అమ్మేవాళ్ళట. ఆమె చనిపోయిన ఒక ఆరు దశాబ్దాలు ఆమెను దాదాపుగా అందరూ మర్చిపోయారు. దీనికి రచయిత్రుల పట్ల వుండే వివక్ష కొంత కారణం అయితే, కొంత కారణం ఆమె రచనల్లోని హాస్యం మీద మాత్రమే విమర్శకులు దృష్టి సారించి, వాటిలో వుండే భావోద్వేగపు లోతుల్నీ, అవగాహననూ పట్టించుకోకపోవటం. ఇంకొంత – పాశ్చాత్య విమర్శకులు, సోవియెట్ విమర్శకులు కూడా ప్రవాస రష్యన్ సాహిత్యాన్ని చిన్నచూపు చూడటం. ఆమె గొప్పతనాన్ని గుర్తించి, రచనలన్నింటినీ గత కొన్ని దశాబ్దాలుగా ఆంగ్లంలోకి అనువదిస్తూ వస్తున్నవారు సుప్రసిద్ధ రష్యన్ అనువాదకుల జంట రాబర్ట్ చాండ్లర్, ఎలిజబెత్ చాండ్లర్.