“ఏమిటింతలా చిక్కిపోయావ్? నిన్నూ, నన్నూ పక్కపక్కన చూసిన వాళ్ళెవరూ మనం క్లాస్‌మేట్ల మనుకోరు!” అన్నాడు వెంకటరెడ్డి.
“కృష్ణుడి పక్కన కుచేలుణ్ణి చూసినవాళ్ళు కూడా అలాగే అనేవాళ్ళే. నేను ఎంత తలకు రంగేస్తే మాత్రం, మీరు అమెరికా నుంచీ అనీ, నేను ఇండియా సరుకనీ చూసేవాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయమా?” అన్నాను జాగ్రత్తగా. కోట్లకి పడగెత్తిన వాడినీ, రిటైరయిన తరువాత ట్యూషన్ సెంటర్లు రాల్చే పైసలకోసం రానూ, పోనూ రెండు గంటలసేపు బస్సులో నిల్చొని ప్రయాణం చేసే నన్నూ క్లాస్‌మేట్లని ఎవరనుకోగలరు? ఎంత ఎలిమెంటరీ స్కూల్లో మొదలుపెట్టి హైస్కూల్ దాకా ఒకే క్లాసులో కలిసి చదువుకున్నా గానీ, యాభయ్యేళ్ళ తరువాత కలుస్తున్నాం. డబ్బు మా మధ్య నిలిపిన అఖాతం వుండనే వున్నది. “అదేమిటిరా, మీరు అంటావు, నువ్వు అని అనకుండా?” అని వాడు గదిమితే అప్పుడు చూసుకోవచ్చు.
“లింక్డ్ఇన్లో నీ హైస్కూల్నించే నంటూ నిన్నది చూపిన తరువాత నీనుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. నీ ఫోటో చూసి ఆశ్చర్యపోయాను ఇంతలా మారిపోయావేమిటని!” అన్నాడు రెడ్డి. సంబోధనలో నేను జాగ్రత్త పడడం మంచిదే అయింది. “రామరాజుని కలిశాను అని చెప్పకపోతే నన్నిలా కలిసేవాడివా?” మనసులోని ప్రశ్నని బయటకు రానివ్వకుండా అడ్డుకున్నాను.
పైకి మాత్రం, “రిక్వెస్టుని ఆక్సెప్ట్ చేస్తారో లేదోనని అనుమానమే,” అని జవాబిచ్చాను.
“నీ రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేస్తూ, నీకు రామరాజు జాడ తెలుసా అనడిగి మంచిపని చేశాను!”
“రాజుని కలవడం వల్ల మిమ్మల్ని కలిసే అదృష్టం కలిగింది!” అన్నాను, అసలు అందామనుకున్న ‘నిన్ను కలిసినందుకు సంతోషంగా వుంది,’ అన్న వాక్యం గొంతులో ఫిల్టర్ చెయ్యబడ్డంవల్ల. దానికి కారణం, మొదట ‘మిమ్మల్ని’ అన్నప్పుడు వెంకట రెడ్డి అడ్డం చెప్పకపోవడం. పైగా, నా మనవళ్ళ గూర్చో, మనవరాళ్ళ గూర్చో భవిష్యత్తులో వాడిని సహాయం చెయ్యమని అడిగే అవకాశం మిగలాలంటే ఈమాత్రం జాగ్రత్త ఇప్పుడు అవసరం.
“రేపు నాతో కలిపి ఆరుగుర్ని నువ్వు రామరాజుండే చోటుకు తీసుకెళ్ళాలి. కార్ ఏర్పాట్లూ అవీ అయిపోయాయి గానీ, ఆ డ్రైవర్‌కి శ్రీకాకుళం అడవి మార్గాలేవీ తెలియవుట. పైగా, ఒకచోట కార్లు వెళ్ళగలిగే రోడ్ కూడా ఏదీ లేదు, కాలి నడకన వెళ్ళాలన్నావు గూడా. నాతో బాటు వచ్చే యునైటెడ్ నేషన్స్ డెలిగేషన్‌కి నువ్వు తోడు రాకపోతే వాణ్ణి కలిసే అవకాశమే లేదు.”
“యునైటెడ్ నేషన్స్ డెలిగేషనొస్తోందా వాణ్ణి చూడ్డానికి? పైగా, సెక్యూరిటీ ఏర్పాట్లేవీ లేకుండా!” ఆశ్చర్యపోయాను.
“ఏదో చిన్నతనపు చనువుతో జోక్ చేశాను. అంతే! నేనిట్లా అన్నానని నువ్వెక్కడా అనవనుకో. వచ్చేవాళ్ళల్లో నాతో బాటు ఇంకొక ఇండియన్, అంతే. అంటే, అదే – నాలాగే ఇండియా ఆరిజిన్ వాడు. మిగిలిన వాళ్ళల్లో ఒకడు నల్లవాడు. ఒకామె కొరియన్. ఇంకొకతను అర్జెంటీనా నుంచి. మరొకతను తెల్లవాడు. ఇది నానాజాతి సమితి గాక మరేమిటి?”
“వీళ్ళందరూ మీ కంపెనీలో పనిచేస్తారా?”
“ఒక్క లిండా, హోర్హే మాత్రమే. రవి యూనివర్సిటీలో ప్రొఫెసర్. డేవిడ్ వాడి దగ్గర పిహెచ్.డి పూర్తి చేస్తున్నాడు. జేమ్స్ ఇంకా హైస్కూల్ పూర్తి చెయ్యకుండానే ఒక ఐఫోన్ యాప్ తయారు చేస్తే మా కంపెనీ మిలియన్ డాలర్లిచ్చి కొనుక్కుంది. రవి వుండే యూనివర్సిటీలో, కాకపోతే స్టాన్‌ఫర్డ్‌లో జేరతాడు బాచిలర్స్ చెయ్యడానికి.”
“వీళ్ళంతా రాజుని కలవడానికి ఇండియా వచ్చారా!”
“అంత లేదులే. ఒక్క జేమ్స్ తప్ప అందరం హైదరాబాద్లో కాన్ఫరెన్స్‌కి వచ్చాం. మొదటి రోజున అక్కడ కీనోట్ స్పీచ్ ఇచ్చాను. అదవగానే వైజాగ్ వద్దామని ముందునించీ అనుకున్నదే. ఇక్కడ మా బ్రాంచ్ ఒకటి ఓపెన్ చెయ్యడానికి ఏర్పాట్లకోసం కొందరిని కలవాలి. మూడురోజుల క్రితం నీతో మాట్లాడాను కదా. అప్పుడే రాజు ఎక్కడున్నాడో నీకు తెలుసని, నువ్వు అక్కడికి తీసుకెళ్ళగలవని చెప్పగానే ఆ రోజు వాళ్ళకి చెబితే ఎగిరి గంతేసి ఇంత దూరమొచ్చి వాణ్ణి కలవకపోతే ఎలాగన్నారు. ఈ సంగతి తెలిసి జేమ్స్ కూడా ఫ్లయిటెక్కాడు. పొద్దున్న దిగి వుంటాడు హైదరాబాద్‌లో. ఈ రాత్రికి అందరూ ఇక్కడకి చేరతారు. అవునూ, ఇంత హడావుడి పడి మేమెడితే వాడు అక్కడ దొరుకుతాడా లేక ఎక్కడి కయినా వెళ్ళాడంటారా? అలా జరిగితే ఇంత ట్రిప్పూ వేస్ట్ అయిపోతుంది.”
“వాడికి అక్కణ్ణించి బయటపడి జనారణ్యంలోకి అడుగు పెట్టడం ఇష్టంలేదు. ఇంతమంది వాణ్ణి కలవడానికి వస్తున్నారంటే ఆశ్చర్యంగా వున్నది.”
“ఎవరి పిచ్చి వాళ్ళ కానందం అన్న సామెత వీళ్ళకోసమే పుట్టించి వుంటారు. అందరికన్నా అతి పిచ్చివాడు రాజు. కాదు కాదు. చిన్నప్పుడేదో ఒక శ్లోకం చెప్పేవాడు మన తెలుగు మాష్టారు – ఆకాశంలోంచి ఊడి పడ్డ గంగాదేవి అంటూ తెలివి లేనివాళ్ళకి ఉదాహరణగా చూపిస్తూ. నువ్వు తెలుగు పంతులుగా చేసే రిటైరయ్యా నన్నావు గదా, నువ్వూ చెప్పేవుంటావ్. గుర్తుందా?”
“ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి శీతాద్రి సు
శ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబు నందుండి య
స్తోకాంబోధి బయోధి నుండి పవనాంధోలోకముం జేరె గం
గా కూలంకష పెక్కు భంగులు వివేకభ్రష్ట సంపాతముల్”
“కరక్ట్. అదే పద్యం. సంపాతముల్ అంటే ఏమిటి? మర్చిపోయాను.”
“ఇక్కట్లండీ. వివేకం భ్రష్టుపట్టిపోతే వచ్చే ఇక్కట్లని ఉదాహరణగా చూపిన ఏనుగు లక్ష్మణ కవిగారి పద్యం, భర్తృహరి భావమూ నండీ అది.”
“ఆకాశంలో వుండే గంగాదేవి శివుడి శిరస్సు మీదికి దూకింది. అక్కణ్ణుంచీ హిమాలయం మీదికీ… తరువాత ఏమిటీ? ఆ పదాలేవీ నాకు నోరు తిరిగే అవకాశమే లేదు.” పెద్దగా నవ్వాడు వెంకటరెడ్డి.
“గంగమ్మ తల్లి నదిగా ప్రవహించి సముద్రంలో కలిసి, అక్కణ్ణించీ పాతాళానికి జేరినట్లు…”
“అద్గదీ. ఈ పోలిక సరిగ్గా సరిపోతుందయ్యా రాజుకి. మా కంపెనీకి బిలియన్ డాలర్ బ్లాక్‌బస్టర్ డ్రగ్ ఇంచుమించుగా అందించినవాడు శ్రీకాకుళం అడవుల్లో పడి తిరుగుతున్నాడంటే వినడానికే కష్టంగా వుంది. వాడికిష్టమైన టాపిక్స్ మీద రిసర్చ్ వద్దన్నానని కోపం వచ్చింది. వాడు చేరిన దాదాపు పదేళ్ళ తరువాత అనుకుంటా, లిండా పిహెచ్.డి. అవగానే మా కంపెనీలో చేరింది. కలిసే పనిచేసేవాళ్ళెప్పుడూ. ఏవో రూమర్లు పుట్టాయి. లాబ్‌లో కలిసి డిస్కషన్లు చేస్తూ, కాన్ఫరెన్సులకి కలిసి వెడుతూ – ఎవరికయినా అనుమానమొస్తుంది. వాడి భార్యకీ వచ్చింది. డైవోర్స్ తీసుకుని పిల్లలతో వెళ్ళిపోయింది. రాజు మా కంపెనీని విడిచి వెడుతున్నప్పుడు ముందు బాధేసినా, పోన్లే, యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరుతున్నాడు గనుక అక్కడ రీసర్చ్ చేస్తాళ్ళే అనుకున్నా.”
“ఆకాశంబున నుండి – అంటారు మీరు!”
“కాదూ మరి? వాడు లేకపోతే ఏమిటిట? తరువాత లిండా ఒక్కతే ఆ బిలియన్ డాలర్ల డ్రగ్ పరిశోధన పూర్తిచేసింది. దానికి పేటెంట్స్ అప్లయ్ చేస్తున్నప్పుడు ఇది రాజు చేసిన రీసెర్చ్ ఎక్స్‌టెన్షనే కదా వాడి పేరుని కూడా జతచేస్తానన్నది అప్లికేషన్‌లో! ఐ పుట్ మై ఫుట్ డౌన్. నో అన్నాను. ఇప్పుడామె మా కంపెనీ సీఈఓ. కాకపోతే హోర్హేని తయారు జేసినందుకు మాత్రం వాడికి థాంక్స్ చెప్పుకోవాలి. చాకులాంటి బుర్ర. రాజు దగ్గర పిహెచ్.డి. అవగానే లాగేశాం. వాడిప్పుడు మా రీసెర్చ్ హెడ్. అలా ఇంకొందరిని తయారు చేస్తాడని ఆశ పడ్డాను. రెండేళ్ళు కాగానే అది వదిలేసి, అక్కణ్ణుంచి ఏదో కమ్యూనిటీ కాలేజ్‌లో చేరాట్ట.”
“అంటే, శంభుని శిరంబందుండి శీతాద్రి!”
“ఆ పోలికని మాత్రం నే నొప్పుకోను. గొప్పగా వుండేవాటికి హిమాలయాలతో పోలిక పెట్టాలి గానీ కమ్యూనిటీ కాలేజీని దానితో ఎలా పోలుస్తాం?”
“కమ్యూనిటీ కాలేజీ అంటే – వొకేషనల్ స్కూల్స్ అంటాం, అలాంటివా?”
“కొంచెం అలాంటివే. చిన్నసైజు కాలేజీలనుకో. యూనివర్సిటీల్లో అడ్మిషన్ రానివాళ్ళూ, అక్కడి ట్యూషన్ ఫీజులు కట్టలేని వాళ్ళూ జేరతారందులో. మొదటి రెండేళ్ళు అక్కడ చదువుకుని ఆ క్రెడిట్లు తీసుకుని యూనివర్సిటీకొస్తారు డిగ్రీ పట్టా కోసం. పెద్ద యూనివర్సిటీ ఒదిలేసి లోకల్ కాలేజీలో అలాంటి కుర్రాళ్ళకి పాఠాలు చెప్పుకోడం అదేం పిచ్చి? వాడి గూర్చి ఇంక పట్టించుకోకూడదనే అనుకున్నా.
ఒక రోజున నేను, లిండా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు హోర్హే తను ఇంటర్‌వ్యూ చేస్తున్న కేండిడేట్‌ని తీసుకుని వచ్చాడు – గెస్ హూ హాజ్ ది మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆన్ దిస్ జెంటిల్మన్ హియర్! అంటూ. రాజు! అన్నాడు తనే మళ్ళీ. వెన్ విల్యూ స్టార్ట్? వుయ్ విల్ బీట్ ఆల్ ది అదర్ ఆఫర్స్! అన్నాన్నేను. రవి – అది ఆ కాండిడేట్ పేరులే – మా ఆఫర్ వారం తరువాత రిజెక్ట్ చేశాడు, యూనివర్సిటీలో టీచ్ చెయ్యడం తన ధ్యేయమంటూ. రవి ఈజ్ స్మార్ట్. సో, వుయ్ ఆఫర్‌డ్ టు ఫండ్ హిస్ రిసర్చ్.”
“రాజుని రవి ఎలా కలిశాట్ట?” అడిగాను.
“రాజు కమ్యూనిటీ కాలేజీలో టీచ్ చేసేవాడని చెప్పాగా! రవి అక్కడ చదివింది రెండేళ్ళు. మిగతా రెండేళ్ళూ యూనివర్సిటీలో పూర్తిచేశాడు. ఆ తరువాత ఎంత లేదన్నా పి.హెచ్.డి. పూర్తి చెయ్యడానికి అయిదేళ్ళు పడుతుంది. అంటే మొత్తం తొమ్మిదేళ్ళు. రాజు అన్నేళ్ళనుంచీ అక్కడే ఉన్నాడా అని ఆ కాలేజీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాడు అక్కడ పనిచేసింది రెండేళ్ళే నన్నారు. అక్కణ్ణించి హైస్కూల్లో టీచర్‌గా చెయ్యడానికి వెళ్ళాట్ట! తల తిరిగిపోయిందనుకో!”
‘ఆకాశంబున నుండి-‘ అన్న పద్యాన్ని వెంకటరెడ్డి ఎందుకు అడిగాడో అప్పటికి చాలా వరకూ అర్థమై, “సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి -” అన్నాను.
“చెప్పాగా, కమ్యూనిటీ కాలేజీకీ, హిమాలయాలకీ పోలిక లేదని! కానీ, నా కంపెనీలో రిసర్చ్ హెడ్ నుంచి బడిపంతులు ఉద్యోగానికి…”
ఫోన్ మోగింది. “హలో! ఇప్పుడా?” అని వాచీ వైపూ, నా వైపూ చూసి, “సరే,” అని ఫోన్ పెట్టేశాడు. “మినిస్టర్ నించి కలవడానికి రమ్మనమని ఫోన్. నీ అడ్రసూ ఫోన్ నంబరూ రాసివ్వు. రేప్పొద్దున్నే కారు పంపిస్తాను,” అని డ్రస్ చేసుకోవడానికి తయారవుతుంటే లేచి బయలుదేరబోయాను.
“ఇంతకీ, నువ్వు ఆ అడవుల్లో దారి తప్పి మమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టవు గదా?” అపనమ్మకాన్ని నిద్రపుచ్చేటందుకు అడిగాడు.
“మీకా భయం అక్కర్లేదు. గత అయిదారేళ్ళల్లో చాలాసార్లు వెళ్ళొచ్చాను,” అని బయటపడ్డాను.
మరునాడు పొద్దున్న బయలుదేరడం ఆలస్యమైంది. దానికి కారణం వెంకట రెడ్డి చేసిన బందోబస్తుని వదిలించుకోవడం. నేను వెళ్ళేటప్పటికి సెక్యూరిటీ కోసం ముందొక జీపూ, వెనకొక జీపూ బయలుదేరదీసి అరడజను మందిని ఆయుధాలతో సహా వాటిల్లో ఎక్కించాడు. సాయుధ నక్సలైట్లు తిరిగే చోటికి అలా వెడితే మనం ప్రాణాలతో వెనక్కు రావడం అసాధ్యమని అనేటప్పటికి వెంకటరెడ్డికి వాళ్ళని వద్దని పంపడం తప్పలేదు.
అందరిలో చిన్నవాడు జేమ్స్. డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. లిండా, వెంకట్ మధ్య వరుసలో కూర్చున్నారు. వాళ్ళ వెనుక వరుసలో నేనూ, రవి. మా వెనగ్గా చివరి వరుసలో కూర్చున్నారు హోర్హే, డేవిడ్. నేను వీళ్ళ వయసుల గూర్చి వేసిన అంచనాలు దాదాపు సరిపోయాయి. జేమ్స్‌కి పధ్ధెనిమిదేళ్ళుంటాయి మహా అయితే. కొరియన్లు ఎలా వుంటారో, వాళ్ళ వయసులని అంచనా వెయ్యడమెలాగో నాకు తెలియకపోయినా, ‘లిండా రాజుకంటే దాదాపు పదేళ్ళు చిన్న’ అని వెంకటరెడ్డి అనడం గుర్తుంది. హోర్హేకి వయసు యాభై చేరుతూ వుండాలి. రవి వయసు ఇంకా నలభై చేరలేదని అతణ్ణి చూడగానే అనిపించింది. పిహెచ్.డి. చేస్తున్న డేవిడ్ వయసు 26-28 మధ్యలో వుండొచ్చు. వాన్ ఎక్కే ముందరే అందరినీ వెంకటరెడ్డి నాకు పరిచయం చేశాడు.
“నిన్న రాత్రి మేమందరం ఎవరి కెంత కాలం రాజుతో ఇంటరాక్షన్ వున్నదో లెక్కేశాం. యూ హావ్ ది లాంగెస్ట్ టైమ్ విత్ హిమ్!” లిండా వెనక్కు తిరిగి నాతో అన్నది వాన్ బయలు దేరిన తరువాత. ఆవిడ ఇంగ్లీషు యాక్సెంట్ అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైంది.
“నో. ఐ టోల్డ్ యు! అయామ్ ది లక్కియెస్ట్ వన్. రిమెంబర్! నేను వాడితో హైస్కూల్లో ఒక ఏడాది ఈ చలపతి కంటే తక్కువ వుంటేనేం, తరువాత రాజు నా కంపెనీలో దాదాపు పదేళ్ళు పనిచేశాడు! దెన్, దేరీజ్ ది బిలియన్ డాలర్స్ డ్రగ్!” గర్వంగా అన్నాడు వెంకటరెడ్డి.