నా మాట: చాటువు – పేరడీ

చాటు పద్యాలు తెలుగు సాహిత్యంలో ముఖ్యమైన భాగం అని అనడం చర్విత చర్వణం. నారాయణ రావు, షూల్మన్ గార్లు ప్రచురించిన సంకలనం A Poem At The Right Moment (University of California Press,1998) లో చాటువుల ప్రాముఖ్యత గురించి, కూలంకషంగా చర్చించారు. చాటు పద్యం పుస్తకం లో బ్రతికి ఉండదు. ప్రజల నోటిలో, బ్రతికి ఉంటుంది.

అలా గుర్తుండిపోవడం, గొప్ప పద్యానికి ముఖ్య లక్షణం. హాస్య ధోరణిలో, ఒక గంభీరార్థం ఉన్న పద్యానికి అనుకరణ, పేరడీ అని చెప్పవచ్చు. ఒక పాతకాలపు చాటుపద్యం, దానికి పేరడి ముచ్చటిస్తాను.

సీ: రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజుల సాటి
తలప నల్లయ వేమ ధరణి పతికి

గీ: భావభవ భోగ సత్కళా భావములను
భావభవ భోగ సత్కళా భావములను
భావభవ భోగ సత్కళా భావములను
భావభవ భోగ సత్కళా భావములను.

ఈ పద్యం శ్రీనాథుడు అల్లయ వేమారెడ్డి గురించి రాశాడని అంటారు. నిజం ఏ నాథుడికీ తెలియదు. లేదా శ్రీనాథుడే, తనదైన శైలిలో చాటువు రాసిఉండచ్చు కూడాను.(ఒక సారి మయకోవిస్కీ, తన కొత్త పద్యాలని, యాకబ్సన్ కి చదవమని ఇచ్చాడట. కొన్నాళ్ళ తరవాత, యాకబ్సన్ దగ్గిరకెళ్ళి, “పద్యాలు ఎల్లాఉన్నాయి?” అని అడిగాడట. “బాగానే ఉన్నాయి, కానీ, మయకోవిస్కీ రాసిన పద్యాలంత బాగా లేవు అన్నాట్ట. The Poem At The Right Moment నుంచి)

ఈ పై పద్యాన్ని, ఒక కవి –పండితుడు, శ్రీ కృష్ణదేవరాయలు వారి ఆస్థానంలో చదివి, దీనికి మీ అష్టదిగ్గజాల్లో ఎవరైనా సరే, అర్థం చెప్పండని సవాల్ చేశాడట. వెంటనే తెనాలి రామలింగకవి లేచి, “నీ పద్యానికి నేను అర్థం చెప్పుతా. కానీ, ముందుగా, నువ్వు నే చెప్పబోయే పద్యానికి అర్థం చెప్పు,” అని తిరిగి సవాల్ చేసి, ఈ కింది పద్యం ఆశువుగా చదివాడట.

సీ: మేకతోకకు మేక తోక మేకకు మేక
మేక తోకకు తోక తోక మేక (నాలుగు సార్లు ఇదే పాదం)
గీ: మేక తొకతోక తొకతోక తోకమేక
మేక తొకతోక తొకతోక తోకమేక
మేక తొకతోక తొకతోక తోకమేక
మేక తొకతోక తొకతోక తోకమేక.

ఈ పద్యానికి అర్థం లేదు అని అంటే, రామలింగడు ఏదో ఒక అర్థం కల్పించి చెప్పుతాడని భయపడి, ఆ కవి-పండితుడు, “సాయంత్రం వచ్చి అర్థం చెపుతా,” అని తోక ముడిచాడని చాటు కథ ( “రాజ నందన రాజ” పద్యానికి అర్థం ఇక్కడ చూడండి)

గొప్ప పద్యానికి పేరడి రాస్తే, ఆ పేరడి కూడా శాశ్వతంగా పడి ఉంటుంది. ఆథునిక కాలంలో, చెప్పుకోదగ్గ పేరడిలు రాసినవాళ్ళు, జలసూత్రం రుక్మిణినాథ శాస్త్రి, మాచిరాజు దేవీప్రసాద్, గార్లు. శ్రీశ్రీ కూడా చక్కని పేరడీలు రాశారు. మాచిరాజు దేవీప్రసాద్ గారు రాసిన,

“ఏ రోడ్డు చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణం?
రహదారి చరిత్ర సమస్తం ధూళి దూసర పరిన్యస్తం,
రహదారీ చరిత్ర సమస్తం యాతా యాత జన సంయుక్తం
రహదారి చరిత్ర సమస్తం పథిక వాహన ప్రయాణ సిక్తం,”

శ్రీశ్రీ రాసిన దేశచరిత్రలు జనం చదివినంతకాలం మరుగున పడదు.

అల్లాగే, శ్రీశ్రీ రాసిన, “సిందూరం, రక్త చందనం, బంధూకం, సంధ్యా రాగం, పులిచంపిన లేడి నెత్తురూ, ఎగరేసిన ఎర్రని జెండా … కావాలోయ్ నవకవనానికి,” అన్న కవితకి, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారి పేరడీ చూడండి.

“మాగాయీ కందిపచ్చడీ, ఆవకాయీ పెసరప్పడమూ,
తెగిపోయిన పాత చెప్పులూ, పిచ్చాడి ప్రలాపం, కోపం,
వైజాగ్లో కారా కిళ్ళీ, సామానోయ్ సరదా పాటకు.”

భావకవిత్వానికి పరమ వ్యతిరేకి అనంతపంతుల రామస్వామి. ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షాని కి ప్రతిగా, శుక్లపక్షం రాసారు. భావకవిత్వాన్ని వేళాకోళం చేస్తూ, ఆ భావకవితను అనుకరిస్తూ చెప్పిన పేరడీ, ఇది.

“రెండు కాకులు కూర్చుండె బండమీద;
ఒండెగిరిపోయె; అంత అందొండు మిగిలె
రెండవదిపోయె; పిదప అందొండు లేదు,
బండ మాత్రము పాపమందుండిపోయె.”

భావ కవిత్వం లో అర్థం పెద్ద గుండుసున్నా అని ఎగతాళి చెయ్యడం ఈ పై పేరడీ ముఖ్యోద్దేశం. శ్రీశ్రీ ‘అప్పిచ్చువాడు వైద్యుడు,’ అన్న సుమతీ శతకం పద్యానికి రాసిన పేరడీ.

ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూరకుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ.

అల్లాగే, ‘రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!’ మనందరికీ తెలిసిన పోతన గారి పద్యం లో ఆఖరి పాదం. ఆ పద్యానికి పేరడీ లో ఆఖరి పాదం మాత్రమే చెపుతాను. ‘ రావే మానిని! కావవే తరుణి! సంరక్షించు చంద్రాననా!’

పాత కాలంలో తెలుగులో వచ్చినన్ని పేరడీలు ఈ మధ్య కాలంలో రాలేదు. కారణం అనూహ్యం. నాకు తెలిసినంతలో, జాషువా గారి కొన్ని పద్యాలకి, కె.వి.యస్. రామారావు గారు పేరడీలు రాశారు. పేరడీ అద్భుతమైన ప్రక్రియ. జనానికి, ఆనందం కలిగించే ప్రక్రియ. ఇంగ్లీషు సాహిత్యంలో పేరడీకి మంచి స్థానమే ఉన్నది. షేక్‌స్పియర్ నుంచి మార్క్ స్ట్రాండ్ వరకూ వచ్చిన కవితలపై, పేరడీలు William Zaranka పొందుపరిచి, The Brand-X Anthology of Poetry సుమారు పాతికేళ్ళ క్రితం ప్రచురించాడు. మనం కూడా, ఒక చక్కని పేరడి సంకలనం ప్రచురించవచ్చేమో!