మొహం పైకెత్తి ఆకాశంలోకి తేరిపార చూస్తూ వస్తున్న ఆంజనేయులును చూసి “నువ్వెంత పెద్ద ఇల్లు కట్టిస్తున్నా మరీ అలా పైకి చూసి నడవక్కర్లా!” అన్నాడు శివరావు నవ్వుతూ.
పాత రోజుల ఆంజనేయులు అయితే, శివరావు మాటకు మాట అనేవాడేమోగానీ, పెరిగినట్లు కనిపిస్తున్న ఆర్ధిక స్థితి తెచ్చి పెట్టిన గాంభీర్యం వలన, ఆ మధ్య డబ్బు విషయంలో శివరావుకు తనకు జరిగిన గొడవ ఇంకా గుర్తుండడం వల్ల, ఆ మాటలను పట్టించుకోనట్లు ఓ చూపు విసిరి “గోవిందేమన్నా కనిపించాడా? ” అడిగేడు.
సారథిని కలవడానికి వచ్చిన శివరావు తో బాటు, అప్పటికే అరుగుల మీద కూర్చుని మాట్లాడుకుంటున్న శ్రీహరి, చెంగయ్యలు ఆంజనేయులు రాక చూసి మాటలాపేసి, ఒకరి మొహలొకరు చూసుకున్నారు.
“వాడిందాకే, మీ కొత్తింటివైపు వెళ్ళాడు” చెప్పాడు చెంగయ్య.
శ్రీహరి, చెంగయ్య అదే వీధిలో వుంటారు. దాదాపు ప్రతి రోజు అరుగుల దగ్గర కొస్తారు.
అప్పటి దాకా తన గురించే ముగ్గురూ కూర్చుని ఏడ్చుకుంటూ, మాట్లాడుకుని వుంటారనిపించింది ఆంజనేయులుకు.
ఒకప్పుడు ఆంజనేయులు ఆ వూళ్ళో పెద్ద రైతుల జాబితాలోనే వుండే వాడు. వేళకు కురవని వర్షాలు, వేళాపాళా లేకుండా విరుచుకుపడే తుఫానులు కొంత వరకు మనిషిని నిలువరించాయి. ఎదుగుతున్న నలుగురు పిల్లలు, వూళ్ళో వాళ్ళు పిల్లల చదువుకి ఇచ్చే ప్రాధాన్యత, చదువుల కయ్యే పెట్టుబడి … ఆడ పిల్లల పెళ్ళిళ్ళ కు అవబోయే ఖర్చులు అన్నీ తొందర తొందరగా ఎక్కువ ఆస్తులు సంపాదించెయ్యాలనే తొందరను బాగా పెంచాయి. వాటికి తోడు వూరి సెంటరులో తళతళ లాడే బట్టల్లో, బైకులు దిగ కుండా బడ్డీ కొట్టుల్లోంచి సిగరెట్లు రప్పించుకునే ఒకప్పటి చిన్న రైతులు … ఆంజనేయులులో ఒకలాంటి అలజడిని పెంచేరు. దానితో వున్న పన్నెండెకరాల్లో పత్తి వేసాడో ఏడాది. అది తీసిన దెబ్బకు, నాలుగెకరాలు అమ్మాడు. తర్వాతి సంవత్సరం ఇక అటో ఇటో తేల్చుకోవాలని వున్న పొలాల్లో అంతా మిరపే వేసాడు. పంట ఓ మాదిరిగా చేతికొచ్చినా, సరైన టైములో అమ్మకపోయేసరికి ఆట అటే పోయింది.
కాలం కలిసి రావడం లేదనుకున్నాడు. అప్పుడు ఇంకేమి ముట్టుకున్నా మసేననుకున్నాడు. మనిషిలో బాగా నిదానమొచ్చింది. వ్యాపార పంటల జోలికి వెళ్ళకుండా, అప్పులు పోను మిగిలిన పొలాల్లో సంప్రదాయక సేద్యం చేసుకుంటూ… ఎంత ఖర్చైనా పిల్లలకు మంచి చదువులు చెప్పించాలనుకున్నాడు. చదువుల మీద పెట్టుబడి చాలా విధాలుగా లాభదాయకమనిపించింది.
పెద్ద కొడుకు వాసుకు అమెరికాలో వుద్యోగం రావడంతో తన అంచనా కరెక్టేననుకున్నాడు.
ప్రస్తుతం ఆంజనేయులు పరిస్థితి మునుపటికన్నా చాలా బాగానే వుంది. మనిషి ఎప్పటిలానే పల్చగా కనిపించినా,మాటల్లో తేడా వొచ్చింది. చుట్టలు పీకి పీకి లోపలికెళ్ళిన బుగ్గలు… మిగిలిన శరీరంకంటే కొంచెం కండ పట్టాయి. నీడ పట్టునే వుండడంతో మొహంలో కొంచెం తేటొచ్చింది.
“నీ కేమిరా… కొడుకు అమెరికా లో వున్నాడు. ఇంక మిమ్మల్ని పట్టగలమా” అనే చుట్టుపక్కల వాళ్ళ పలకరింపులో, ఇదివరకటి సానుభూతి నటన స్థానే… కాస్తంత అసూయ ధ్వనించేది.
పక్క ఇంటి వాళ్ళ అసూయ చాలా సందర్భాల్లో ఆనందాన్నే ఇస్తుంది.
“మీ అబ్బాయెప్పుడొస్తున్నాడు బాబాయ్ ” అడిగేడు శివరావ్ , ఆంజనేయులును.
అడిగింది తనను కాదన్నట్లు, శ్రీహరి వైపు తిరిగి “సారథి వున్నాడారా లోపల?” అడిగేడు.
“బాబాయ్.. నేనేదో నిన్నడుగుతూంటే నువ్వేమిటలా వాడి చెవులో గుస గుస లాడతావు?” అడిగేడు శివరావు, తన మాటల్ని, తనని పట్టించుకోని ఆంజనేయులును.
కాస్తో కూస్తో వూళ్ళో జరిగే విషయాలను గమనించే ప్రతి ఒక్కరికి తెలిసిన మొహం శివరావు.
ఆర్ధిక శాస్త్రంలో డిగ్రీ పాసయ్యాక, బియ్యీడి చేసి, టీచర్ వుద్యోగంలో చేరమని ఎందరు చెప్పినా శివరావు వినలేదు. ఎదుగు బొదుగు లేని పంతులు వుద్యోగం కంటే చెయ్యగలిగిన వుద్యోగాలు చాలా వున్నాయని కానీ అసలు వుద్యోగం చెయ్యడం తనకిష్టం లేదనీ ప్రక్క వూళ్ళో, ఓ షేర్ల ఆఫీసు మొదలెట్టాడు మరో ఇద్దరు ఫ్రెండ్సుతో. అది హర్షద్ మెహతా టైము. స్టాకులన్నీ వువ్వెత్తున పైకి లేస్తున్నయి. స్టాకు బ్రోకర్ ఆఫీసులు జనంతో కిట కిట లాడేవి. కమిషన్లు, ఫైనాన్సు మీద వచ్చే వడ్డీలతో వ్యాపారం బాగానే నడిచింది కొన్నాళ్ళు.
కష్టమర్లు… స్టాకులు కొని అమ్మి సంపాదిస్తున్న లాభాలతో పోలిస్తే, వీళ్ళకు వస్తున్నది బాగా తక్కువనిపించింది. అలా అనిపించడమే తడవు, ముగ్గురు భాగస్వాములు కలిసి స్టాకులు కొనడం అమ్మడం, అమ్మాక కొనడం మొదలెట్టారు. సారాయి కొట్టువాడు, అమ్మే సరుకు కంటే… పుచ్చుకునే సరుకు ఎక్కువైతే ఏమౌతుందో… అదే జరిగింది. షేర్ల కుంభకోణం వెలుగు చూసేసరికి, వీళ్ళ దుకాణాన్ని చీకటి మబ్బులు కమ్మేసాయి. పార్న్టర్ల మధ్య విభేదాలు చెరువులో కప్పల్లా బయట పడ్డాయి. పెట్టుబడి మాయమైపోగా … తలా రెండు లక్షలు లాసు తేలింది.
ఆ విధంగా మొదటి వ్యాపారం దెబ్బ తింది. అయితేనేం అనుభవం మిగిలిందనుకున్నాడు శివరావు.
మళ్ళీ ఇంకేదైనా బిజినెస్సు మొదలెట్టాలని ఆలోచిస్తున్న తరుణంలో, శివరావుకు పెళ్ళి చేసాడు వాళ్ళ నాన్న, బాధ్యత తెలిసొస్తుందన్న ఆలోచనతో. అయితే పెళ్ళైన రెండు నెలలకే తండ్రితో దెబ్బలాడి, తెగతెంపులు చేసుకుని కట్నంగా వచ్చిన డబ్బుపుచ్చుకుని , ఈసారి రొయ్యల చెరువులు లీజుకు తీసుకుని మరి కాస్త అనుభవం సంపాదించేడు.
కొన్నాళ్ళు వూళ్ళో గడిపేక, ఎవరో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లకు గిరాకీ బాగుంది, అమెరికాకు వెళ్ళాలనుకునే యువతరానికి ట్రైనింగులు కావాలి కదా అన్నారు.
వారం రోజుల్లో, అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి హైదరాబాదులో ఒక కంప్యూటర్ ట్రైనింగు షాపు మొదలెట్టాడు. అప్పటికే పుట్టగొడుగుల్లా లేచిన కంప్యూటర్ సెంటర్ల వాళ్ళు స్టూడెంట్స్ లేక కంప్యూటర్లను అద్దెలకు తిప్పుతున్నారు. శివరావు అక్కడా దెబ్బ తిన్నాడు. మరో మహత్తరమైన అనుభవం అతని నుదుటి మీద ఓ అడ్డగీతను గీచింది.
దాంతో ఓ ఆరు నెలల బట్టి ఖాళీగానే వున్నాడు శివరావ్ .
ఈ వేళ ఒక ముఖ్య మైన పని మీద సారథిని చూడ్డానికి, సుబ్బరామయ్య గారి అరుగుల దగ్గర కొచ్చాడు శివరావ్.
“ఏదోలేరా… మాలాంటి వాళ్ళం నీలాంటి గొప్పోళ్ళతో ఏం మాట్లాడగలం” నిష్టూరంగా అన్నాడు ఆంజనేయులు. వూళ్ళో వాళ్ళకి, పక్క వూళ్ళో వాళ్ళకూ సందర్భమున్నా లేకున్నా … తన గురించి, అమెరికాలో వున్న తన కొడుకు వాసు గురించి లేనిపోనివి కల్పించి చెడుగా చెబుతున్నాడని తెలిసినప్పటినుంచి శివరావు మీద బాగా గుర్రుగా వుందతనికి.
అప్పుడు వీధి తలుపులు తెరుచుకుని సారథి తండ్రి సుబ్బరామయ్య గారు బయటకు రాక పోతే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యా మాటా మాటా పెరిగేదేమో !
“ఏంట్రా ఆంజనేయులు, ఈ మధ్య అస్సలు అరుగు దగ్గరకు రావడం మానేసావు?” అడిగేరు సుబ్బరామయ్య గారు, అరుగు మీద కూర్చుంటూ. ఆయన ఆంజనేయులు కంటే వయసులోను, మిగిలిన చాలా విషయాల్లోనూ పెద్దే.
సుబ్బరామయ్య గారి ఇంటి వీధి గుమ్మానికి రెండు వైపులా రెండు అరుగులు. ఒక్కో అరుగు మీదా పది మంది కూర్చోవచ్చు. కుడి వైపు అరుగుకు రెండడుగుల దూరంలో కరెంటు స్తంభం , దాని మీద వెలిగే ట్యూబు లైటు. ఒకప్పుడు ఆ అరుగులు దిన పత్రికలు. తర్వాత రేడియోలు. మట్టి అరుగులు కాస్తా సిమెంటు అరుగులయ్యేసరికి, రేడియో స్థానాన్ని టీవీలు ఆక్రమించాయి. అరుగుల దగ్గరకొచ్చే వాళ్ళూ తగ్గారు. మాట్లాడుకునే టాపిక్కులూ మారాయి.
“ఎక్కడన్నా… ఇంటి పనుల్లో అస్సలు కుదిరితేగా … సారథిని చూడ్డానికొద్దామని నాలుగు రోజుల్నుంచీ అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది ” చెప్పాడు ఆంజనేయులు.
సుబ్బరామయ్య కొడుకు సారథి. వారం క్రితమే అమెరికా నుంచి హైదరాబాదొచ్చి, నాలుగు రోజుల క్రితమే ఈ వూరొచ్చాడు.
“నాలుగిళ్ళు దాటి రావడానికి నీకు నాలుగు రోజులు పడుతుందిరా. వాడు కూడా నీ గురించి అడిగాడు” చెప్పారు సుబ్బరామయ్య.
“అలాగా. ఎన్నాళ్ళుంటాడట? పనిలో పని మాంఛి సంబంధం చూసి పెళ్ళి చేసి పంపండీసారి” చెప్పేడు ఆంజనేయులు.
గౌరవం వల్లనో భయం వల్లనో ఖచ్చితంగా తెలీదు కానీ, సుబ్బరామయ్య గారి ఎదుట మాత్రం శివరావు చాలా తక్కువ మాట్లాడతాడు.
“ఏమోరా, ఏదో కంపెనీ పని మీద వచ్చాడట. ఇంకా నేనా విషయాలు సరిగ్గా మాట్లాడలేదు ” చెప్పాడు.
“అక్కడ పరిస్థితులంత బాగో లేవటగా?” అన్నాడు శ్రీహరి.
“ఏది వుద్యోగాల సంగతా?” అడిగేడు ఆంజనేయులు.
“అమెరికాలో వుద్యోగాలదేముందిరా. ఇవ్వాల ఒక చోట పోతే రేపు మరో చోట దొరుకుతాయట. ఇక్కడ్లాకాదు” చెంగయ్య అభిప్రాయం.
“ఇప్పుడలా లేదట కదా” అన్నాడు శ్రీహరి .
“అదేలే… అంతకు ముందు ఒక్క రోజులో దొరికేది, ఇప్పుడు నాలుగైదు రోజులు పడుతోందట. దాన్ని మన వాళ్ళిక్కడ కొండంతలు చేసి చూపెడతారు. మావాడు మొన్న ఫోను చేసాడుకదా. కొంచెం వుద్యోగాలు తగ్గిన మాట వాస్తవమేనంట. నాలుగు రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పాడు” అన్నాడు ఆంజనేయులు .
” ఐనా వర్తున్నోళ్ళకంతగా ఇబ్బంది వుండదులేరా. ఏదో వానా కాలం చదువులతో వేలంవెర్రిగా డబ్బులు కట్టి వెళ్ళారు చూడు వాళ్ళకు … వాళ్ళక్కొంచెం ఇబ్బంది ” అన్నారు సుబ్బరామయ్య .
“మరి కంపూటర్ల మీద పనంటే అదీ అమెరికాలో అంటే మాటలా? సరుకు లేక పోతే అంతంత జీతాలిస్తూ వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళూరుకుంటారు? ఇయ్యాళ కాకపోతే రేపైనా తరిమేస్తారు ” అన్నాడు చెంగయ్య.
సరిగ్గా అదే టైముకు ఇంట్లోంచి బయటకొచ్చాడు సారథి. అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఒక్క సారి, తలలు తిప్పి అరుగుల మధ్య గుమ్మం వైపు చూసేరు.
బ్లూ జీన్సు మీద తెల్ల లాల్చీ లో సారథి, పలకరింపుగా చిరునవ్వు నవ్వి “బాగున్నారా?” అడిగేడు, ఆంజనేయులు నుద్దేసించి.
“ఏం బాగోలే సారథి … నువ్వెలా వున్నావు? ” అని, కుశల ప్రశ్నలయ్యేక, “మావాడి నెప్పుడన్నా కలిసావా?” అడిగేడు ఆంజనేయులు.
“కలవలేదు. వచ్చే ముందు ఫోనులో మాట్లాడాను” చెప్పాడు.
“వాడీ మధ్య మళ్ళీ వూరు మారేడటగా. ఖర్చులు బాగా పెరిగాయని చెప్పాడు. పెళ్ళి చేసుకుని వెళ్దువు రారా అంటే శలవు దొరకదంటున్నాడు” అన్నాడు ఆంజనేయులు.
“సారథి, ఇప్పుడక్కడెలా వుంది?” అడిగాడు శ్రీహరి , సారథి సమాధానం చెప్పేలోపునే “అదేనోయ్ … అక్కడ మీ వుద్యోగాల గురించి”.
“పర్లేదు…” అన్నాడు సారథి పొడిగా.
“చాలా మందిని వుద్యోగాల్లోంచి పీకేస్తున్నారని, వీసాలు లాగేసుకుంటుంటున్నారని అంటుంటేను” అన్నాడు శ్రీహరి.
“సారథి, నాకు తెలీకడుగుతాను… వున్నట్టుండి వుద్యోగాల్లోంచి పీకేస్తే… స్టైకుల్లాంటివి చెయ్యరా. ఇక్కడ మనకు లాగా బస్సుల్ని తగల బెట్టడం, రైళ్ళనాపేయడం లాంటివి చెయ్యరా?” అడిగేడు చెంగయ్య .
“లేదు … అక్కడ ఆఫీసుల్లో వుద్యోగంలోంచి ఎప్పుడైనా తీసేయొచ్చు. చేరే ముందు అలా అగ్రిమెంట్లు రాసుకుంటారు”
“నువ్వెన్నాళ్ళుంటావబ్బాయ్ ? ఈ సారన్నా పెళ్ళి చేసుకొని వెళ్ళు. మీ ఇంట్లో వాళ్ళకూ, నీకు బాగుంటుంది” అన్నాడు ఆంజనేయులు.
“బాగుంటుంది. కానీ మంచి సంబంధం కుదరాలిగా? ” అన్నారు సుబ్బరామయ్య .
” సంబంధాలదేముంది. అమెరికా పిల్లోడంటే గిరాకీ జాస్తి కదా” అన్నాడు శ్రీహరి
“ఇంతకు ముందులా ఇప్పుడంత డిమాండు లేదులేరా” చెప్పాడు ఆంజనేయులు.
తర్వాత చాలా సేపు అమెరికాలో వుద్యోగాలు చేస్తున్న తెలిసిన వాళ్ళ గురించి, ఆ మధ్య జరిగిన పెళ్ళిళ్ళ గురించి, ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్టును బట్టి మారుతున్న కట్నాల రేట్ల గురించి, చుట్టు పక్కల సంబంధాల గురించి మాట్లాడుకున్నారు.
టైము పదిన్నర దాటుతుండగా, ఒక్కరొక్కరే అరుగుల దగ్గర నుంచి వెళ్ళి పోగా చివరకు సారథి, శివరావులు మిగిలేరు.
“అలా సినిమా హాలు సెంటర్ దాకా వెళ్ళొద్దామా” అంటూ లేచేడు శివరావు.
వూళ్ళో వాళ్ళ విషయాల బ్రీఫింగులో శివరావు గురించి అప్పటికే చాలా వరకు తెలుసుకున్న సారథికి చేసిన అన్ని వ్యాపారాల్లో లాసులొచ్చాయి కాబట్టి, కొత్త వ్యాపారానికి అప్పడగడానికే శివరావు వచ్చుంటాడనిపించింది.
అప్పడిగితే, ఏ ఏ లెక్కలు చెప్పి తప్పించుకోవచ్చో ఆలోచిస్తూ, “సరే పద ” అంటూ లేచాడు సారథి.
ఆ వీధిలోంచి, మెయిన్ రోడ్డు మీదకు వచ్చే వరకు ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు.
చల్ల గాలి బాగా వీస్తోంది. వర్షం పడేలా వుంది.
సాయి బాబా గుళ్ళో జరుతూన్న భజన వినిపిస్తోంది మైకులో.
“చలిగా వుందికదూ” అన్నాడు శివరావు.
“నాకు ఈ చలి అలవాటేరా ” చిన్నప్పటినుంచి, ఇద్దరూ ఒరే ఒరే అని పిలుచుకోవడమే అలవాటు.
“నాకూ అలవాటైంది. హైదరాబాదులో ఇంకాస్త ఎక్కువగానే వుంటుంది. మళ్ళీ నువ్వెప్పుడు బయల్దేరుతున్నావు?” అడిగేడు.
“కంపెనీ పని ఎప్పుడైతే అప్పుడు వెళ్ళాలి”
“పెళ్ళి చేసుకొని వెళ్తావా? చెప్పు ఫస్టు క్లాసు సంబంధం చూస్తా”
“చూద్దాం … ఇంకా టైముందిగా”
“అవున్రా, ఆంజనేయులు కొడుకు బెంచి మీదకొచ్చాడటగా… రేపో మాపో వీసా వూడబీక్కుని తరిమేస్తారనుకుంటున్నారంతా ”
“అలాగా … ” ఆశ్చర్యం ధ్వనించింది సారథి మాటలో.
“వాడు నీతో ఏమైనా చెప్పాడా “అని ఆగి, “ఎవడైనా వుద్యోగం వస్తే చెబుతాడు గానీ… పోతే చెబుతాడా? ఇంతకీ ఆంజనేయులును చూసావుగా. మనిషి భూమ్మీద నడవడంలా. వాడికీ మధ్య వొళ్ళు బాగా కొవ్వెక్కింది. కొడుకు మొహం వేళ్ళాడేసుకొస్తే గానీ ఆ కొవ్వు కరగదు” అన్నాడు శివరావ్ .
శివరావును కొత్తగా చూస్తున్నట్లు ఫీలయ్యేడు సారథి.
“మొన్నోసారి, ఓ యాభై వేలు చేబదులు అడిగితే, ఓ గంట సేపు ఏదేదో సోది చెప్పి, పైసా కూడా లేదన్నాడు. అటు చూడు …” అంటూ కుడి వైపున దిష్టి బొమ్మను, దాని వెనుక కొత్తగా కడుతున్న మేడను చూపించి, “అదే వాడు కడుతున్న ఇంద్ర భవనం. ఇప్పుడు కొడుకును, అమెరికా నుంచి తరిమేస్తే… దీన్నేమి పెట్టి కడతాడో చూడాలి. నాలుగు డబ్బులు జేబులో పడగానే కొంత మందికి కళ్ళు నెత్తి కొస్తాయి. ఈ మధ్య కొడుక్కో సంబంధం చూసేడు. పాతిక లక్షలు కేషట. వాసుగాడి గురించి ఎవరు ఏం చెప్పారో ఏమిటో, ఇప్పుడా సంబంధం కాన్సిల్ అంటున్నారట”
ప్రక్కన నడుస్తున్న వాడల్లా వులిక్కిపడి ఓ అడుగు ఎడంగా జరిగేడు.
“నువ్వేమిట్రా అంత డల్ గా వున్నావ్ ? నేనిన్ని మాట్లాడుతున్నా కామ్ గా వున్నావ్ ”
“డల్ లేదు పాడూ లేదు. నువ్వేదో మాట్లాడాలన్నావు”
“నువ్వేమీ అనుకోకుండా నాకో చిన్న హెల్పు చెయ్యలిరా. అయినా నేన్నీకు పరాయి వాడినా. నీకు తెలుసుగా… నేనేమి చేద్దామనుకున్నా టైము కలిసి రాలేదు. ఒకటా రెండా… చేతనైన బిజినెస్ లన్నీ చేసాను. అన్నిట్లోనూ లాసులే. అప్పుల వాళ్ళు బాగా వత్తిడి చేస్తున్నారు ”
మాట్లాడలేదు సారథి.
“నువ్వేమైనా సాయమో సలహానో ఇస్తావని…సిగరెట్లు తీసుకోవాలి. నువ్వూ కాలుస్తావా” ఆగేడు.
“లేదు. నేను మానేసాను” సమాధానమిచ్చేడు సారథి.
“ఒక్క నిమిషం…” అంటూ , రోడ్డు ప్రక్కని బడ్డీ కొట్టు దగ్గరకు వెళ్ళి,”… నా ఖాతాలో రాసుకో…” అని షాపు వాడికి చెప్పి, “చూడరా ఇక్కడ రేట్లెలా పెరుగుతున్నాయో. నేను డిగ్రీ చదివే రోజుల్లో, ఇదే పెద్ద గోల్డ్ ఫ్లాకు అరవై పైసలు. ఇప్పుడో పెట్టె తర్టీ రూపీస్ . అంటే సిగరెట్టు మూడు రూపాయలు ” అన్నాడు.
“వొరే … అక్కడ ఎంతుంటాయిరా సిగరెట్ల రేట్లు… బాగా చీపంటగా?” అని సమాధానం కోసం ఆగకుండా, “ఇంతకీ అక్కడ మన వాళ్ళ వుద్యోగాలెందుకు పోతున్నాయి?”
“మన వాళ్ళవనే ఏముంది? చాలా మందివి పోతున్నాయి. అక్కడ ఎకానమీ అంత బాగో లేదుగా ”
ఇద్దరూ సినిమా హాలు సెంటరు కొచ్చేరు.
ఇంటర్వెల్లు బేరం అయిపోయినట్లుంది. కొట్లను మూసే హడావిడి కనిపిస్తోంది. పునుగులమ్మే యలమంద, గిన్నెల్ని కడిగి నీటిని రోడ్డు మీద చల్లుతున్నాడు. మిఠాయిలమ్మే సేటు, టేప్ రికార్డర్ సౌండు పెంచి, అద్దాల బండికి కట్టిన లైటుల్ని తీస్తున్నాడు. సోడా బండి వాడు పల్లీల బండి వాడితో రహస్యాలు చెబుతున్నాడు. హాలు ఎదురుగా వున్న పాన్ షాపతను, అమ్ముడు పోక వ్రేళ్ళాడుతున్న పేపర్లనీ, పత్రికలని తీసి సర్దుతున్నాడు. ఆ ప్రక్కనే వున్న చిన్న పాక హోటల్లో అయిదారుగు పెద్ద వాళ్ళు పోట్లాటగా మాట్లాడుకుంటున్నారు. కొంచెం ఎడంగా వున్న వైను షాపు షట్టరు సగం వరకు మూసి వుంది.
“అయితే ఇప్పుడు దేనికి బాగా డిమాండు వుంది? జావా బాగా లేదంటున్నారు… ఒరాకిల్కి బాగుందా? ” అడిగేడు.
శివరావు నోట ” జావా, ఒరాకిల్ ” పదాలు విని ఆశ్చర్యపోతున్న సారథి భుజం మీద చరిసి, పెద్ద పెట్టున నవ్వుతూ, “ఏదో కంప్యూటర్ ట్రైనింగు వ్యాపారం నడిపించానుగా. దాని ఎఫెక్టు. మొన్న సోషల్ మాష్టారు గారబ్బాయి సాపు నేర్చుకుని ఫ్లైటెక్కాడు… ఇప్పుడింతకీ దేనికుందిరా డిమాండు” అడిగేడు.
“ఇన్ని తెలిసిన వాడికి నీకే తెలియాలి” అని ఓ క్షణమాగి “దేనికి బాగా డిమాండు వుందో నాకైతే పెద్దగా అయిడియా లేదు. లక్కుంటే ఏమీ తెలియక పోయినా వుద్యోగాలు దొరుకుతాయి. ” అన్నాడు.
“అవును అదీ నిజమే . కాకపోతే బాగా డిమాండు వున్న ఏరియాల్లో పన్చేసేవాళ్ళకు పెద్దగా ఇబ్బంది లేదంటుంటే … అయినా పొలముండాలే గానీ ఏ పంటకు గిరాకీ వుంటే ఆ పంటే వెయ్యొచ్చు. పొగాకు కాక పోతే పత్తి, పత్తి కాక పోతే మిరప … ఏమంటావ్ ” అన్నాడు శివరావు.
“అవును అదీ ఇదీ కాకపోతే పొలాలను కౌలు కిచ్చేయడమే ” అని నవ్వి, “అక్కడ వాళ్ళంతా చేసేదదేరా శివ! ఇంతకీ నువ్వు కంప్యూటర్ బిజినెస్ ఎందుకు ఆపేసావు?” అడిగేడు.
ఏమిటీ చచ్చు ప్రశ్న అన్నట్టు చూసి, “వ్యాపారమెందుకు ఆపేస్తాం … లాసులొచ్చి” అన్నాడు.
సారథి ఏమీ మాట్లాడకపోయేసరికి
“సాయిబు సంపాదన బూబు కుట్టు కూలికి చాలదంటారు చూడు. అట్లా అయింది మా పరిస్థితి. హైదరాబాదులో మంచి ఏరియాలో షాపు కావాలంటే, తెలుసుగా అద్దెలెలా మండుతాయో. పైగా కంప్యూటరనగానే ఎన్ని హంగులుండాలి. ఏసీలు, కార్పెట్టులు… నాజూగ్గా “ఇష్.. ఇష్ ” అని ఇంగ్లీషులో పలకరించే అమ్మాయిలు… అన్నీ ఒక్కటొక్కటే సమకూర్చుకుని అడ్వర్టైజ్మెంట్లు స్టార్ట్ చేసేసరికి… ఇన్స్ర్టక్టర్లు మాయం. వాళ్ళను వెదుక్కొచ్చేసరికి … కొందరు స్టూడెంట్లు జంపు కొట్టారు … నాలుగు నెలలు నడిపేక ఇక బండిని లాగలేక చేతులెత్తేశాం. మొదట్లో మొదలెట్టిన ఒకళ్ళిద్దరు పర్లేదు కానీ, క్లైమాక్సులో ఎంటరైన మాలాంటి వాళ్ళకు మాత్రం స్టంటు సీనులో గుద్దులే మిగిలాయి” అంటూ, సిగరెట్టు వెలిగించాడు.
గాలికి దుమ్ము బాగా లేస్తోంది.
“టీ తాగుదామా… ఒరేయ్ రెండు స్పెషల్ టీలు తేరా” ఆర్డరిచ్చాడు, సినిమా హాలు ప్రక్కన చిన్న కాంటీను లోపల బల్ల మీద కూర్చుంటూ.
“నాకొద్దు. ఒకటి తెమ్మను”
“వద్దా.. వీడు బ్రమ్మాండంగా చేస్తాడ్రా… సర్లే ఒక్కటి తేరా చాలు” మళ్ళీ కేకేసి చెప్పి “అరే ఇంతకీ అమెరికాలో పరిస్థితి ఎప్పుడు బాగు పడిద్దంటావు?”
“అది తెలిస్తే నేనీ పాక హోటల్లో నీ ముందిలా ఎందుక్కూర్చుంటాను ” అని నవ్వేడు సారథి.
“అది కాదురా? నీకెలా అనిపిస్తుందోనని”
“నాకనిపించేదేముంది? అంతా ఇక్కడ మీకు తెలిసిందే. అమెరికా పరిస్థితి ఏమోగానీ ఈ మధ్య అక్కడకు వెళ్ళిన మన వాళ్ళ స్థితే ఘోరంగా వుంది. ఇక్కడ ఓ ఆరునెలలు వుద్యోగం లేకపోయినా అంత కష్టంగా వుండదు. అక్కడైతే ఇంటి అద్దెలు, కారు పేమెంటులు, ఇన్సూరెన్సులూ, ఫోను బిల్లులూ! ఇక్కడినుంచి వుద్యోగమిస్తామని తీసుకెళ్ళిన వాళ్ళు, అక్కడ కనిపించి వుద్యోగంలో చేర్చుకున్న వాళ్ళు మనం ప్రోజెక్ట్ లో వున్నంత వరకే మనుషుల్లా చూస్తారు. వీళ్ళెక్కడ నట్టేట్లో ముంచుతారో ననే భయంకొద్దీ, ఏదో దీపముండగానే డబ్బు చేసుకోవాలనే తాపత్రయం కొద్దీ కొంత మంది కన్సల్టెన్టు కంపెనీలనొదిలి చిన్నా పెద్ద కంపెనీల్లో పర్మెనెంటనుకుని చేరితే… వాటిల్లో చాలా వరకూ చిన్న కంపెనీలు గాలిలో కొట్టుకు పొయ్యాయి. పెద్దవేమో, మేమెంత పెద్ద వాళ్ళమైనా మా భుజాలు మాత్రం నొప్పెట్టవా అంటూ… ఒక్కసారి ఒళ్ళు విరుచుకున్నాయి. నీకు తెలుసా ఇప్పుడక్కడ ఒక్కో ఒన్ బెడ్రూం అపార్మ్టెంటులో అయిదారుగురు వుంటున్నారు. ఇక్కడ పెద్ద వుద్యోగాలనొదిలేసి, పిల్ల పాపలతో వచ్చిన వాళ్ళ కష్టాలు మరీ దారుణం. ఎప్పుడు దొరుకుతుందో, అసలు దొరుకుతుందో లేదో తెలీకుండా… ఇంటర్వ్యూల కోసం ఫోనుల దగ్గర పడిగాపులు పడే వాళ్ళు నాకు తెలుసు. వెనక్కి రావాలంటే ఓటమిని ఒప్పుకోవడమను కునేవాళ్ళు కొందరు. ఇక్కడ కొచ్చాక చుట్టు పక్కల వాళ్ళు, చుట్టాలు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, ఏమంటారో నన్న ఆందోళనతో కొందరు, దాచుకున్న డబ్బు అయిపోతున్నా రేపేమైనా దొరుకుతుందేమోనన్న ఆశతో కొందరు. బయటకు రాలేక … అక్కడే వుండలేక ”
“మన వాళ్ళందరి పరిస్థితి అలాగే వుందా …” అంటూ సారథి మాటల్ని మధ్యలోనే ఆపి “వాసు గాడి వుద్యోగం పోయిందంటే అర్ధం చేసుకోవచ్చు. వాడెంత కట్టి వచ్చాడో నీకూ తెలుసుగా. అలాగని డబ్బులు కట్టొచ్చినోళ్ళంతా దద్దమ్మలని కాదనుకో. వాసు లాంటోళ్ళనొదిలేస్తే… మిగిలిన వాళ్ళకైనా వుద్యోగాలు దొరుకుతున్నాయా?” అడిగేడు.
“చెప్పానుకదరా అంతా లక్కని. ఇంతకీ ఇక్కడ పరిస్థితి ఎలావుంది” అడిగేడు సారథి.
“ఒక భారీ బడ్జట్టు సినిమా ఫ్లాపైతే … ఎంతమంది ఎన్ని విధాలుగా నష్ట పోతారో తెలుసుగా?” అడిగేడు శివరావ్ .
తన ప్రశ్నకు సినిమాకు గల సంబంధం గురించి ఆలోచిస్తున్న సారథి తో
“అదేరా… సినిమా ఫ్లాపైతే అది డిస్ట్రిబ్యూటర్ల మీద నిర్మాతల మీద ఎల్లాంటి ప్రభావం చూపిస్తుందో… అదిగో ఆ ఎల్లమంద కొట్టు మీద, ఇక్కడ టీ సప్లై చేసే వాడి మీద కూడా దాని ఎఫ్ఫెక్ట్ వుంటుంది. అది వెళ్ళి కిరాణా కొట్టు మీద, రేపు పండగ బట్టలు అమ్మే బట్టల షాపు మీద పడుతుంది … అక్కణ్ణుంచి… అర్ధమైందిగా. అదీ సంగతి. నీకు తెలుసో తెలియదో … అమెరికా నుంచి డాలర్లు రావడం తగ్గేసరికి, ఇక్కడ రియలెస్టేటు బిజినెస్సులు లాసుల్లోకెలుతున్నాయ్. ఇప్పుడు మద్రాసు దగ్గరున్న వాయుగుండం మన వూల్లో చెట్లను వూపినట్టు … అక్కడ అమెరికాలో పడ్డ బ్రేకులు ఇక్కడ బళ్ళను ఆపుతున్నాయి . ఒప్పుకుంటావా?”
శివరావ్ నేర్చుకున్న పాఠాల మీద సారథికి కొంచెం నమ్మకం కలిగింది.
“అది సరే గానీ, ఏదో మాట్లాడాలన్నావు?” అడిగేడు.
“అదా… చెబుతాను కాని… నీకే మాత్రం జీతం వస్తుందేమిటి?” అడిగేడు మళ్ళీ, “అందరూ అరవై కేలూ, డెబ్బై కేలూ అంటుంటారుగా”.
“ఏదో వస్తుంది లెద్దూ” అన్నాడు, అప్పడగ బోయే ముందు అవతలి వాళ్ళు ఎంతకు తూగగలరో పరిశీలిస్తున్న శివరావును తదేకంగా చూస్తూ.
“నాకో లక్ష రూపాయలు అప్పుగా కావాలి. లక్షంటే నీకెంత… రెండున్నర వేలే కదా. వడ్డీ ఇవ్వకుండా తీసుకుంటున్నాననుకోకు. బయట వాళ్ళకు ఇచ్చినంత వడ్డీ నీకూ ఇస్తాను… ఎంత ఓ మూడు నాలుగు నెలల్లో … అంతా ఇచ్చేస్తాను.” సూటిగా సారథి కళ్ళలోకి చూస్తూ.
ఎదురు చూసిన సన్నివేశానికి తెరలేచినట్లు ఫీలయ్యేడు సారథి. లక్ష రూపాయలంటే అమెరికాలో రెండు వేల డాలర్లు. రెండు వేలంటే మూడు నాలుగు నెలలు. అవే వుంటే … ఏమో ఆలోచనలో పడ్డాడు సారథి.
“ఇప్పుడే అంత తొందర లేదులే. ఓ నాలుగు రోజులాగి ఇచ్చినా పర్లేదు… ఈసారితో ఏదో ఒకటి తేలిపోవాలి” అన్నాడు.
ఇప్పుడు గానీ, అంత డబ్బు లేదని మొహమ్మీదే చెబితే వీడి నోరసలే మంచిదికాదు. రేప్రొద్దుటికి వూరు వూరంతా నోటికొచ్చినట్లు వున్నవీ లేనివీ కల్పించి టముకేస్తాడు, తననో చవట కింద జమేసి… ఆలోచిస్తూ “రేసుల కెడదామనుకుంటున్నావా?” అడిగేడు సారథి.
“కాదులేరా. చెబుతానుగా… ప్లానంతా పూర్తయ్యాక నీకు కాకపోతే మరెవరికి చెబుతాను. అన్నట్టు నిన్నిలా డబ్బడిగినట్లు ఇంకెవరికీ చెప్పకు” తలూపేడు సారథి .
టీ కొట్టు లోంచి బయటకొచ్చి ఇంటి దారి పట్టారిద్దరూ. సన్నగా తుప్పర పడుతోంది.
రేపు ప్రదర్శించబోయే సినిమాకు సంబంధించిన పోస్టరును గోడ మీద తిరగేసి, మైదా పూస్తున్నాడో కుర్రాడు.
వానొచ్చి పోస్టరు తడిచి, చిరిగిపోయి గాలికి కొట్టుకు పోవచ్చని తెలిసినా … వాడలా అంటిస్తాడు. లేకపోతే ధియేటర్ యజమాని వూరుకోడు. లక్కు బాగుండి పోస్టరు అలాగే వుంటే దాని వల్ల నాలుగు టికెట్లన్నా అమ్ముడు పోవా అన్నట్లు ఆలోచిస్తాడు.
సాయి బాబా గుళ్ళో పూజ అయిపోయినట్టుంది. మైకులో పాటలు రావడం లేదు.
సగం పూర్తయిన ఆంజనేయులుగారి ఇల్లును చూడగానే సారథి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ఇంత దాకా పూర్తయ్యాక హఠాత్తుగా కన్స్ర్టక్షన్ ఆపేయాలన్నా, ముందు తయారు చేసుకున్న ప్లానులు మార్చు కోవాలన్నా కష్టమే. వీటికి తోడు నిజంగానే ఆ ఇల్లు కట్టడం ఆగిపోతే, నిన్నటి దాకా “ఆహా…ఓహో ఆంజనేయులు” అన్న వాళ్ళంతా ఏమనుకుంటారో?! అమెరికా పెళ్ళి కొడుకులకు తగ్గుతున్న గిరాకీ గురించి, పడి పోతున్న కట్నం రేట్ల గురించి నాలుగు రోజుల క్రితం పెళ్ళి సంబంధాలు చూసే “షాపు” వాళ్ళు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అమెరికాలో తను ఇండియా ప్రయాణమవుతున్నానని తెలియగానే, మీ అపార్మ్టెంటులో మాక్కొంచెం చోటుంటుందా అని అడిగిన తోటి వాళ్ళు గుర్తొచ్చారు. ఇండియా బైట వుద్యోగాల కోసం ఖండాలను వదిలి వలసపోయే సంచార జీవితాలు గుర్తొచ్చాయి. పూర్వం ఒక ప్రాంతంలో భూమి సారం తగ్గేక మరో ప్రాంతానికి తరలిపోయిన వాళ్ళ చరిత్ర గుర్తొచ్చింది. ఇప్పటికీ ఒక వూళ్ళో కూలి పనులు అయిపోగానే మరో వూరుకు తట్టా బుట్టా సర్దుకుని పరుగులెత్తే వాళ్ళు గుర్తొచ్చారు. అమెరికా నుంచి వచ్చేస్తూ ఎయిర్ పోర్టులో గుడ్‌బై చెప్పేసి వదిలేసిన తన కారు గుర్తొచ్చింది.
“ఏమిట్రా… డబ్బెందుకడిగానో చెప్పలేదని కోపమొచ్చిందా?” అడిగాడు శివ, సారథి మౌనాన్ని చూసి.
కాదని చెప్పబోయి ఆగిపోయేడు ఏదో అనుమానమొచ్చి.
“తెలిసినతను…వీసా పేపర్లు తెప్పించాడు. మొదట్లో కొంత కట్టాను. ఇంకో యాభై వేలిస్తే పేపర్లు మనచేతికొస్తాయి. ఆంజనేయులును దాని కోసమే అప్పడిగింది. వాడో కుల్లుమోతు. నేనెక్కడ బాగుపడి, వాడింటి కంటే పెద్ద ఇల్లు కడతానోనని వాడి ఏడుపు. వాడి బతుకు రోడ్డు మీద కొచ్చినప్పుడు, మా నాన్నే కదరా హెల్పు చేసింది. ఆ విశ్వాసం కూడా లేకుండా… ఏవేవో నీతి కధలు చెప్ప బోయాడు. ఏం నాకున్న బుర్రతో నేనక్కడ నెగ్గుకురాలేనా? ఇప్పుడక్కడ వున్నోళ్ళలో అన్నీ తెలిసిన నీలాంటి వాళ్ళతో బాటు ఏమీ తెలీని దద్దమ్మలు కూడావున్నారు కదా? నేను నీ అంత కాకపోయినా అక్కడ వున్న చాల మంది కంటే బెటరేగా. చూస్తా … నా బ్రైను ఇక్కడైతే వుపయోగపట్టంలేదుగానీ ఒక్క సారి అమెరికాలో కాలెడితే … ఇక చూస్కో ఏడాదిలో కోటి రూపాయలు సంపాదిస్తా నువ్వు గానీ ఈ సాయం చేసావంటే…ఏమంటావ్ ”
సారథికి ఏమనాలో తోచినా, ఏమీ అనలేదు.
తుఫానుల్ని ఆపలేము. వాటి వల్ల జరిగే నష్టాలనూ పూర్తిగా నివారించలేము. కానీ తుఫాను వస్తుందని తెలిసాక, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటే నష్టాలను, కష్టాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇది తెలిసి కూడా …
మెయిన్ రోడ్డు నుంచి, ఇంటి వైపు వెళ్ళే సందులోకి రాగానే అరుగుల దగ్గర హడావిడి కనిపించింది. పదిమంది దాకా గుమికూడి వున్నారు. మాటలు పెద్దగా వినిపిస్తున్నాయి .
ఎదురుగా పరుగెత్తు కొస్తున్న గోవిందు ఆగి “మరి … మన ఆంజనేయులు గారబ్బాయి అమెరికాలో … ఆత్మహత్య చేసుకోబోయాట్ట… ఇందాక…” చెబుతున్నాడు రొప్పుతూ.
వాడి మాటలు పూర్తి కాకముందే, సారథి, శివరావు అరుగుల దగ్గరకు పరుగెత్తేరు.
“వాసు సూయిసైడు చేసుకోబొయ్యాడట… అయినా చచ్చిపోవాలన్నంత కష్టం వాడికేమొచ్చిందిరా? ” అడిగేరు సుబ్బరామయ్య గారు.
పదిమందీ రక రకాల కారణాలు వెదుకుతున్నారు.
“ఇప్పుడు… ఇప్పుడు వాడెలా వున్నాడట…” అంటూ, షాకులోనే వాళ్ళ వైపు చూస్తూ, అరుగు మీద కూలబడ్డాడు సారథి.
“ఏమోరా వివరాలు పూర్తిగా తెలియదు. నీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే ఫోను చేసి కనుక్కోరాదూ ” అన్నారు సుబ్బరామయ్య .
రెండు చేతులతో తలపట్టుకుని, కళ్ళు మూసుకున్నాడు సారథి. తలలో హోరు.
తుప్పర్లు కాస్తా జల్లులుగా మారేయి.