అనువాదంలో అనునాదం

ముఖచిత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వెయ్యకూడదని అంటారు; ఆ మాట నిజం. అయినా మనం చాలాసార్లు ఆ పొరపాటు చేస్తూనే ఉంటాం. రస్కిన్ బాండ్ విషయంలో నిన్న మొన్నటిదాకా నేనూ ఆ పొరపాటు చేసాను.

రస్కిన్ బాండ్ రచనలతో నాకు నలభైయేళ్లుగా పరిచయం. అప్పట్లో బాగా పేరు పొందిన ‘ద రూమ్ ఆన్ ది రూఫ్’ నేను చదివిన మొదటి పుస్తకం. నచ్చింది. అడపాదడపా ఆయన కథలు, వ్యాసాలు, ప్రకృతి రచనలు, జ్ఞాపకాలు చదివాను. జునూన్ లాంటి సినిమాలు చూసాను. జీవితం గురించి రాస్తున్నాడు కానీ తనదంటూ ఒక ఆధారపీఠం లేకుండా, నిర్దుష్ట దృక్కోణం లేకుండా ఎలా చూసిన జీవితాన్ని అలానే రాసేస్తున్నాడే… ఆ జీవితపు మూలాలు – ఆ జీవితాలను నడిపించే సామాజిక చలన శక్తులు – వీటి గురించి అస్సలు పట్టించుకోడేమిటీ అన్న అసంతృప్తి ఉండేది. అంచేత అతనితో నా పరిచయం యథాలాపపు పఠనం దగ్గరే ఆగిపోయింది. పనిగట్టుకుని అతని రచనలన్నీ సేకరించి చదవాలి అన్న కోరిక ఏనాడూ కలగలేదు.


కథా ప్రపంచం కిరణ్‌తో పదేళ్ల పరిచయం. సాహిత్యం మీద నమ్మకంతో తనకున్న పరిమితుల్లో ఆయన చేస్తున్న పనులను గమనిస్తూ వచ్చాను. రెండు మూడేళ్ల క్రితం ఆయన “అనువాదాల ప్రచురణమీద దృష్టి నిలపాలనుకొంటున్నాను” అని ప్రకటించినప్పుడు వెంటనే, “నేను ఒక పుస్తకం చేస్తాను” అన్నాను. అప్పట్నించి ‘ఏ పుస్తకం?’ అన్న విషయంలో మా మధ్య చర్చలు సాగుతూ వచ్చాయి. ఆయన సూచించిన రెండు మూడు పుస్తకాలు నాకు నచ్చలేదు. “పోనీ రస్కిన్ బాండ్ ఆత్మకథ అనువదిస్తారా?” అని అడిగినప్పుడు అన్యమనస్కంగానే “సరే పంపండి, చూద్దాం” అన్నాను. వచ్చింది. చదివాను. మొదటిసారి పెద్దగా ఉత్తేజం కలగలేదు. మరోసారి చదివాను. ‘పర్లేదు, అనువదించవచ్చు’ అనిపించింది. చివరికి అనువదించటం మొదలెట్టాను. మూడు నెలలు ఆ పుస్తకంలో లీనమైపోయి అనువాదపు మొదటి డ్రాఫ్ట్ సాధించాను. ‘ఎంత గొప్ప అవకాశం దొరికిందీ.. ఎంత గొప్ప జీవితం.. ఎంత గొప్ప సహయానం’ అనిపించింది. మొదటి డ్రాఫ్ట్ దశ దాటి మూడు నెలలు గడిచినా ఇంకా అలానే అనిపిస్తోంది.


ఈ ఆత్మకథలో నన్ను బాగా ఆకట్టుకున్న అంశం: నిర్మోహత్వం.

రస్కిన్ బాండ్ జీవితం వడ్డించిన విస్తరి కాదు. అతడో భగ్న కుటుంబపు పిల్లాడు. పుట్టింది ఆంగ్ల పుట్టుకే అయినా అతనిలోని అసలు మనిషి సిసలైన భారతీయుడు. తనకున్న శక్తి సామర్థ్యాలతో బ్రతుకు బండిని నల్లేటి బాటలో సాగించగలిగే అవకాశం ఉన్నా – రచయితగానే జీవించాలి అన్న ముళ్లబాటను ఎంచుకున్న మనిషి. తాను కోరుకున్న వ్యక్తులు అందని చందమామలని తెలిసినా వారికోసం తపన పడ్డ మనిషి. ఇలాంటి అనేకానేక పోరాటాలు, ఘర్షణలు మనిషిలోని మృదుత్వాన్ని హరించి కటుత్వాన్ని నింపే అవకాశం ఎంతైనా ఉంది. ఆ మనిషి అందరూ అభిమానించే రచయిత అయినప్పుడు, ఆ రచయిత తన ఆత్మకథను రాసుకున్నపుడు తన పోరాటాలు, ఘర్షణలు, వైఫల్యాలు, నిరాశలు పదిమంది ముందూ పరిచే అవకాశముంది. రస్కిన్ బాండ్ ఆ పని చేయలేదు. అన్ని విషయాలనూ నిర్మోహంగా విశ్లేషించి ఎంతో ఆబ్జెక్టివ్‌గా వాటి గురించి చెప్పుకుపోవడం ఈ ఆత్మకథలో కనిపిస్తుంది. తల్లి గురించి రాసినా, తండ్రి గురించి రాసినా, ‘కఠినం’గా ఉండే అమ్మమ్మ గురించి రాసినా, సరదా పురుషడనిపించే సవతి తండ్రి గురించి రాసినా వారిని, వారి గుణదోషాలను అతి సున్నితంగా తూచి మన ముందు ఉంచుతాడు. ఉదాహరణకు సరదా పురుషుడనిపించే సవతి తండ్రి దేశ విభజన సమయంలో ప్రాణాలకు తెగించి పరమత స్నేహితులను క్షేమంగా సరిహద్దులు దాటించడాన్ని రస్కిన్ బాండ్ ఎంతో అలవోకగా, అదే సమయంలో హృద్యంగా చెప్పుకొస్తాడు.

‘కఠినంగా’ ఉండే అమ్మమ్మ అంటున్నాం కదా – ఆమె కాఠిన్యం, అందుకు తాను గురి అవడం గురించి రస్కిన్ బాండ్ పేజీలకు పేజీలు చెప్పాడు. కానీ అదే అమ్మమ్మ తన ఇంట్లో అంగవైకల్యం ఉన్న, వయసు మళ్ళిన ఒక ఒంటరి మహిళను శాశ్వతంగా అద్దెకి ఉండనివ్వడం, తాను పోయాక కూడా ఆమెను అలాగే కొనసాగనివ్వాలని వీలునామాలో రాయడం – ఈ వివరాలు రస్కిన్ బాండ్ చెప్పినప్పుడు అమ్మమ్మ కాఠిన్యం సంగతి ఎలా ఉన్నా చదువరుల మనసులు ఆర్ద్రమవుతాయి.


pictureleftరస్కిన్ బాండ్‌లో హాస్యస్ఫూర్తికి కొదవలేదు. అలాగే సరళ వ్యంగ్యమూ తక్కువేం కాదు. వీటికి సరిగ్గా విరుద్ధమైన అండర్‌టోన్ నెరేటివ్ ఆయనకే సాధ్యమైన, ఆయనకే స్వంతమైన కథన విశేషం. ఆ కథన విశేషం ఈ పుస్తకం నిండా విస్తరించి కనిపిస్తుంది. ‘ఈ మూడు అంశాలనూ ఎంత అవలీలగా సమ్మిళితం చేశాడు!’, అన్న విస్మయం మనకు కలుగుతుంది.

ఇలాంటి అండర్‌టోన్ పరచుకుని ఉండే రచనల్లో పాత్రలకు ప్రాణం పొయ్యటం చాలా కష్టం. అలాగే ఆయా పాత్రల ఔన్నత్యాలను పాఠకులు గ్రహించేలా చెయ్యటం అంత సులభం కాదు. ఈ ఆత్మకథలో మనకు స్పష్టంగా కనిపించే పాత్రలు – రస్కిన్ బాండ్ తల్లి, తండ్రి, స్నేహితులు, సంపాదకులు, కుటుంబ సభ్యులు.. వీళ్ళంతా సజీవంగా నిలచి మన దృష్టిని ఆకర్షించి మన మనసులో చిన్నపాటి స్థానం ఏర్పరుచుకుంటారు. అలాగే ఈ రచనలో రస్కిన్ బాండ్ వాళ్ళ నాయనమ్మ, సవతి చెల్లి ప్రమీల లాంటి పాత్రలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడా తెర మీద మనకు కనిపించరు. అసలు రస్కిన్ బాండ్ వాళ్ళను కలుసుకున్న దాఖలాలు కూడా మనకు కనిపించవు. కానీ వాళ్ళ మానవీయ ప్రవర్తన, దాని గురించి రస్కిన్ బాండ్ అడపాదడపా యథాలాపంగా చేసే ప్రస్తావన – మన మనసుకు చేరిపోతాయి. ఆ కనిపించీ కనిపించని మనుషులు కూడా మనకు దగ్గరి వాళ్ళయిపోతారు.


ఈ కథలో మనల్ని అబ్బురపరచి, క్షణకాలం నిలబెట్టి, ఆలోచనలో పడవేసి, ఆయా రాగ-అనురాగాలలో మనల్ని కూడా భాగస్వాములను చేసే అంశాలు పదే పదే కనిపిస్తాయి. అలా అని అవి ఒక ప్రయోజనం సిద్ధించడం కోసం కావాలని చొప్పించిన అంశాలు కావు. రస్కిన్ బాండ్ సహజ కథన రీతిలో ఎంతో చులాగ్గా అమరిపోయిన అంశాలవి. అలాంటి మూడు అంశాల గురించి ఇక్కడ చెప్తాను: రెండు ఉత్తరాలు, ఒక డైరీ ఎంట్రీ.

కుటుంబం భగ్నమయ్యాక రస్కిన్ బాండ్ మూడు నాలుగేళ్ళు తండ్రి చాటున గడిపాడు. గాఢానుబంధం ఏర్పరుచుకున్నాడు. అయినా ఆ అనుబంధం తండ్రి అకాల మరణం వల్ల రస్కిన్ బాండ్ పదో ఏటే బీటవారింది. ఈ నేపథ్యంలో, మరణానికి కొద్ది రోజుల ముందు రస్కిన్‍కు వాళ్ళ నాన్న రాసిన అనురాగపూరితమైన లేఖ యథాతథంగా ఈ పుస్తకంలో కనిపిస్తుంది. తండ్రీ కొడుకుల అనురాగ బంధంలో మనకూ కాస్తంత చోటు దొరికిన భావన కలుగుతుంది.

అలాగే రస్కిన్ బాండ్ తన పదిహేడవ ఏట రాసిన ‘ద రూమ్ ఆన్ ది రూఫ్’ నవలను ఎడిట్ చేసిన బ్రిటిష్ వనిత డయానా రాసిన ఉత్తరం కూడా మనకు ఈ పుస్తకంలో కనిపిస్తుంది. సమర్థులైన సంపాదకులు ఒక కొత్త రచయితకు ఎంత గొప్పగా దిశానిర్దేశం చేయగలరో చెప్పడానికి మచ్చుతునక ఆ డయానా ఉత్తరం.

సరే, ఆ నవల లండన్‌లో ప్రచురణకు నోచుకుంది. అక్కడితో ఆగకుండా, ‘ద ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’లో ధారావాహికంగా ప్రచురణకూ ఎంపికయింది. ఆ విషయం తెలిసినప్పుడు ఒక యువ రచయిత గొప్పగా ఉబ్బితబ్బిబ్బవడూ! అదిగో ఆ ఉబ్బితబ్బిబ్బుల డైరీ ఎంట్రీ యథాతథంగా మనం ఈ పుస్తకంలో చదవవచ్చు.


ఏదైనా రచన మనకు నచ్చడానికి రెండు కారణాలు ఉంటాయి. ఆ రచనలలోని సార్వజనీనత, ఆ రచన అందించే ఆలోచన, విజ్ఞానం, సంస్కారం – ఇది మొదటి కారణం. ఆ రచనలో మన ప్రతిబింబం కనిపించడం, అందులోని అనుభవాలూ అనుభూతులూ మనవి కూడా అవడం రెండో కారణం. ఈ ‘బ్రతుకాట’ను నేను అనువదించినవుడు ఈ రెండో తరహా అంశాలు ఎంతో తరచుగా తటస్థపడ్డాయి. నాలో అనునాదం కలిగించాయి.

రస్కిన్ లానే నాదీ భగ్న కుటుంబ నేవథ్యం. ప్రకృతికీ, స్నేహాలకు, యాత్రలకు ప్రాణం పెట్టే మనస్తత్వం. ప్రదేశాలనూ మనుషుల్నీ ప్రపంచాన్నీ ప్రేమించే తత్వం. కష్టాలను కూడా ఆశాభావంతో అంగీకరించే గుణం. అక్షరాలనూ, సాహిత్యాన్ని, రచనా ప్రక్రియనూ మార్కెట్ విలువల తక్కెడలకు దూరంగా ఉంచే స్వభావం. భౌగోళిక విశేషాలనూ చరిత్రనూ ఇష్టపడే లక్షణం – ఇదిగో ఈ సారూప్యాలన్నీ నన్ను రస్కిన్ ఆత్మకథకు దగ్గర చేసాయి. అనునాద లహరిలో ముంచెత్తాయి. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి – రస్కిన్ అక్షరాలను నమ్ముకున్నాడేగానీ ఏనాడూ అమ్ముకోలేదు.. ఇవి చాలు కదా – ఒక రచనతో, ఆ రచయితతో ప్రేమలో పడడానికీ!!


అసలు మనిషి జీవితం అంటేనే విచిత్రాల పుట్ట. ఆ మనిషి రస్కిన్ బాండ్ అయితే మరి చెప్పేదేముందీ?!
అతని అమ్మానాన్నా ఇష్టపడి దగ్గరయ్యారు. కొన్నేళ్ళు అన్యోన్యంగా గడిపారు. ఇద్దరు పిల్లలు పుట్టారు. క్రమక్రమంగా అభిరుచులు కలవక విడిపోయారు. అమ్మ మరో పెళ్ళి చేసుకుంది. రస్కిన్, స్వల్పంగా మతిమాంద్యం ఉన్న అతని చెల్లి ఎల్లెన్, తండ్రి పంచన చేరారు. రస్కిన్ బాండ్ తండ్రి దగ్గరే ఉండిపోయాడు. చెల్లి సంరక్షణ నాయనమ్మ చూసుకుంది.
రస్కిన్ బాండ్ తండ్రి దగ్గరకు చేరాడే కానీ పదేళ్ళ వయసప్పుడే తండ్రి మరణించాక తిరిగి అమ్మా సవతి తండ్రుల సంరక్షణలోకి వచ్చాడు. అలా కొన్నేళ్ళు గడిచాక వాళ్ళిద్దరూ తమ నివాసాన్ని ఢిల్లీకి మార్చినప్పుడు రస్కిన్ బాండ్ తాను పుట్టిపెరిగిన డెహ్రాడూన్ లోనే ఉండిపోయాడు. ఆ ఉండటం ఉండటం తన సవతి తండ్రి మొదటి భార్య బీబీజీ ఇంట్లో అద్దెకు దిగాడు! దిగి ఊరుకోకుండా ఆమెతో స్నేహం, అభిమానం, పరస్పర అనురాగం.. ఆమె రస్కిన్‌ బాండ్‌కు గాడ్ మదర్‌గా అవతరించడo!!

నాయనమ్మ సంరక్షణలోకి వెళ్లిన రస్కిన్ చెల్లెలు ఎల్లెన్ ఆ నాయనమ్మ పోయాక అమ్మ పంచన చేరింది. అమ్మ నడివయసులో కాన్సర్‌తో పోయాక ఎల్లెన్ సంరక్షణ – దశాబ్దాల తరబడి చూసుకున్న వ్యక్తి ప్రమీల. ఈ ప్రమీల మళ్ళీ రస్కిన్ వాళ్ల సవతి తండ్రికీ, మొదటి భార్య బీబీజీకి పుట్టిన బిడ్డ!!

అలాగే రస్కిన్ బాండ్ ముస్సోరిలో తాను కోరుకున్న ప్రకృతి నడుమ స్థిరనివాసం ఏర్పర్చుకున్నప్పుడు స్థానిక గ్రామాలకు చెందిన ఒక కుర్రాడు ఉద్యోగసహాయం కోసం రస్కిన్ బాండ్ దగ్గరకు వస్తాడు. క్రమక్రమంగా పెంపుడు కొడుకు అవుతాడు. అతని భార్య, పిల్లలు, మనుమలు, మనవరాళ్ళు – వీళ్ళంతా ఇప్పుడు, పెళ్ళే లేని రస్కిన్ బాండ్ ప్రియకుటుంబ సభ్యులు.

అవును. రస్కిన్ బాండ్ ఉన్న చోట జీవితం ఇంత విచిత్రంగా, ఇంత ఫలవంతంగా ఉంటుంది!


నేను దాదాపు ముఫ్పైయేళ్ళుగా అనువాదాలు చేస్తున్నాను.

నేను అనువదించే రచనలు నా మూల రచనల కన్నా మెరుగైనవి అన్న స్పృహతోనే ఆ అనువాదాలు చేస్తున్నాను. ఇప్పటిదాకా ఆరు పుస్తకాలు అనువదించాను. మరో వందా నూట పాతికవరకూ కథలూ, వ్యాసాలూ అనువదించాను. అనువాదం నాకు ఇష్టమైన ప్రక్రియ. కనీస సామర్థ్యంతో నేను నెరపే సాహితీ ప్రక్రియ.

మూలానికి అమిత విధేయంగా ఉంటూ అనువదించడం నాకు మొదటినుంచీ అలవాటు. ఒక్క పదం, ఒక్క వాక్యం, ఒక్క వివరం, ఒక్క అనుభవం – దేన్నీ వదలకుండా అనువదించాలన్నది నా నియమం. మూలంలోని భాష, శైలి, భౌగోళిక, సాంస్కృతిక ఛాయలు అనువాదంలో కనిపించి తీరాలన్నది నా పట్టుదల. అలా చేసినపుడు ఆ అనువాదం సార్ధకమవుతుందని నా నమ్మకం.

ఈమధ్య కాలంలో అనువాదాల విషయంలో నా అవగాహన, ధోరణి మరో అడుగు ముందుకు వేసాయి. పైన చెప్పిన వాటితో పాటు మూలరచనలోని అనుభూతిని కూడా గ్రహించి, ఒడిసిపట్టి, దానిని అనువాదంలోకి ప్రవేశపెట్టగలిగినపుడే ఆ అనువాదం పరిపూర్ణమవుతుంది అన్న ఎరుక కలిగింది.

అనుభూతిని అనువదించడం సాధ్యమా అన్న ప్రశ్న నాకు ఎదురైనా, సమీప గతంలో మొరాకో, లాటిన్ అమెరికాలకు చెందిన యాత్రా కథనాలను అనువదించినప్పుడు, వాటి మూలరచయితతో సహయానం చేసినప్పుడు, అతని మనసులోకి తొంగి చూసి, అతని అనుభూతుల సీమలోకి ప్రవేశించి వాటిని తెలుగులోకి తీసుకురాగలిగాను. నేనూ ఒక యాత్రికుడిని అవడం, తన అనుభూతి సీమలోకి నా చొరబాటును మూలరచయిత నిమ్మగడ్డ శేషగిరిరావు హృదయపూర్వకంగా ఆహ్వానించి, ఆమోదించడం నాకు బాగా అనుకూలించాయి.

అనుకోకుండా అదే అనుకూలత నాకు రస్కిన్ బాండ్ జీవితాన్ని అనువదించినప్పుడు కూడా కలిగింది. మా జీవితాల్లోని అనేకానేక జీవన సారూప్యాలు ఆయన అనుభూతి ప్రపంచంలో నేను అడుగుపెట్టడానికి సహకరించాయి. అంచేత అనేక చోట్ల అనుకంప, అనునాదం, సమానుభూతి నాకు కలిగాయి. సహజంగానే ఆ తలానికి చేరుకుని చేసిన ఈ అనువాద ప్రయత్నం అపూర్వమైన సంతోషానికీ, సంతృప్తికీ హేతువయింది.


అనువాదం ఒక్కరివల్లే అయ్యేది కాదు. నా వరకూ నాకు కనీసం ఇద్దరు రిఫరీలు అవసరం, వాళ్లతో సంప్రదింపులు, చర్చలు, అభిప్రాయాలు, సవరణలు – ఇదంతా జరిగాకే నేను చేసిన అనువాదాలను ప్రచురించడం నాకు అలవాటు. ‘బ్రతుకాట’ అనువాదంలో మొదటి దశనుంచీ మిత్రులు జె. ఎల్. రెడ్డి అందించిన సహాయసహకారాలు వెలగట్టలేనివి. నాతోపాటు మూలరచనను మొదట్లోనే చదవడం, అనువాద ప్రయాణంలో మజీలీలు మజిలీలుగా తటస్థపడి సలహాలు ప్రోత్సాహాలు అందించడం, చిత్తుప్రతిని ఒక్క పదమైనా వదలకుండా చదివి, అవసరమయినప్పుడల్లా మూలరచనతో సరిచూచి అనేకానేక సవరణలు సూచించడం – మెనీ థాంక్స్ రెడ్డిగారూ!

మరో మిత్రుడు కొల్లూరి సోమశంకర్‌ను నా రాతప్రతులను కంప్యూటరైజ్ చేసిపెట్టమని అడిగాను. తానూ అనువాదాల్లో నిష్ణాతుడు కాబట్టి నేను చేసిన అనువాదాన్ని సరిచూస్తూ ఆ పని చెయ్యమన్నాను. ఆయన ఏకంగా ఆంగ్లమూలాన్ని సంపాదించి, మూలాన్నీ, అనువాదాన్నీ శ్రద్ధతో, బాధ్యతతో పోల్చి చూసి, నాతో ఎన్నెన్నో మార్పులు చేర్పులు చేయించారు. ఆయనకు ఊరికే థాంక్స్ చెప్పి వదిలేయలేను.


ప్రతి మనిషీ ఒక నడిచే పుస్తకం అన్నది నా నమ్మకం. చూసే దృష్టీ, చదివే శక్తీ మనకుంటే ప్రతి మనిషి జీవితమూ ఒక అపురూప గ్రంథమే. ఆ మనిషి రచయిత కూడా అయితే ఇహ చెప్పేదేముందీ – తెరిచిన పుస్తకం అవుతాడు. ఆ రచయిత ఆత్మకథ రాస్తే ఏమవుతుందీ – అతని హృదయ స్పందన మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ ‘బ్రతుకాట’లో అదే జరిగింది.

ఇంతకీ ఈ ‘ఓ ఏకాంత జీవి బ్రతుకాట’లో ఏముందీ?!

స్నేహాలున్నాయి. అనురాగాలున్నాయి. ఊర్లూ ప్రదేశాలూ దేశాలూ ఉన్నాయి. మతకలహాలూ ప్రపంచయుద్ధాలూ ఉన్నాయి. మనుషులూ మనస్తత్త్వాలూ స్వార్థాలూ త్యాగాలూ ఉన్నాయి. సంస్కృతుల ఘర్షణ ఉంది. చరిత్ర ఉంది. జీవితముంది. జీవన పోరాటముంది.

ఈ ‘బ్రతుకాట’ను చూసినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడు రస్కిన్ బాండ్ మన మనిషి అవుతాడు. మనమే అవుతాడు…

(25 ఫిబ్రవరి 2026 న హైదరాబాద్ లో రస్కిన్ బాండ్ ఆత్మకథ Lone Fox Dancing తెలుగు అనువాదం ‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’ ఆవిష్కరించబడిన సందర్భంగా ఈ అనువాదకుని ముందుమాట…)

*ప్రతులకు : కథాప్రపంచం ప్రచురణలు, తిరుపతి (ఫోన్:99082 84105)