వ్యంగ్యం ఆయన కథకు చిరునామా

తెలుగు కథాసాహిత్యానికి డయాస్పోరా కథలు ఒక అదనపు కూర్పు. 60-70 లలో విదేశాలకు వెళ్లిన తెలుగువాళ్లలో కథలు రాసినవారే అరుదు. ఒకవేళ రాసినా, తెలుగు నేలకు సంబంధించిన విషయాలే ప్రధాన వస్తువు.

రానురాను పరిస్థితులు మారాయి. విదేశాలకు వలసలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ప్రపంచం ఓ కుగ్రామమైపోయింది. ఎవరు ఏ దేశం వలస వెళ్లినా, ఆ దేశ సంస్కృతితో ముడిపడి ఉన్న తమ జీవితాల గురించి కొంచెం సీరియస్‌గానే ఆలోచించడం మొదలయింది. అంతేకాదు, సంస్కృతుల మధ్య తేడాలను బేరీజు వేసుకొని, జీవనవిధానంలో మార్పులను స్వీకరించడం అనివార్యమైపోయింది. సంస్కృతులలోని భిన్నత్వాలను అర్థం చేసుకోవడం, సామాజిక జీవనంతో ముడిపడి ఉన్న మానసిక స్థితిగతులను అంచనా వేసుకొని, విశ్లేషించుకోవడం కూడా అనివార్యమయింది. ఈ పరిణామమంతా గత ఇరవై ఏళ్లలో జరిగింది.

తెలుగువారికి, ముఖ్యంగా బుద్ధిజీవులకు, మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వర్గాల వారికి విదేశానికి పర్యాయపదం అమెరికా. వలసలన్నీ అటే. అందుకే, ఇటీవలి కాలంలో రచయితల సంఖ్య కూడా అక్కడ పెరిగింది. అందులో భాగంగానే కథకులూనూ, అలాగే వారు రాస్తున్న కథల్లో వస్తువు విస్తృతి పెరిగింది, శిల్పమూ వైవిధ్యభరితమయింది.



తెలుగు కథకుల్లో అంతకుముందు అంతగా లేని ఈ డయాస్పోరా స్పృహ సెప్టెంబర్ 11 సంఘటన తర్వాత పెరిగింది. తెలుగులో డయాస్పోరా కథలకు ఈ సంఘటన ఒక మైలురాయి వంటిది.

ఎప్పుడో 60ల మలిదినాల్లో అమెరికా వెళ్లిన వేలూరి వేంకటేశ్వరరావుగారు రాసిన ఈ 27 కథల ఆధారంగా కథలకు సంబంధించిన అనేక విషయాలు చర్చించుకోవచ్చు. ముఖ్యంగా డయాస్పోరా గురించి. ఈ సంపుటిలో దాదాపు సగం పైగా అమెరికా జీవనవిధానాన్ని వస్తువుగా తీసుకొని, వివిధ పద్ధతుల్లో రాసిన కథలున్నాయి. మిగిలిన సగం కథలలో తెలుగునేలన నడుస్తున్న రాజకీయాలపై సంధించిన వ్యంగ్యాస్త్రాలు కొన్నైతే, మరికొన్ని పురాణ కథలను వ్యంగ్య ధోరణిలో తిరగరాసినవి. యాది, తరం మారినా… వంటి పురాజ్ఞాపక కథలు మరికొన్ని. ఒకటి, రెండు కథలు మినహా అన్ని కథలూ వేటికవే ప్రత్యేకత సంతరించుకున్నవి.

తెలుగులో హాస్యకథకులున్నారు. ఈమధ్యకాలంలో తగ్గినా, అప్పుడప్పుడయినా హాస్య కథలొస్తున్నాయి. ఎందుకో తెలియదుగానీ, వ్యంగ్య కథలు మాత్రం తక్కువే. హాస్యానికి, వ్యంగ్యానికి ఉన్న సున్నితమయిన తేడాని గమనించిన వారూ తక్కువే. మునిమాణిక్యంతో మొదలై, ముళ్లపూడినుంచి, ఇటీవలి పొత్తూరి విజయలక్ష్మివరకు హాస్యకథలు రాస్తున్నారు కానీ, వ్యంగ్య కథల లోటు మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉంది. తెలుగులో వ్యంగ్యాన్ని పరాకాష్టకు తీసుకెళ్లి, తన రచనల్లో పండించిన రచయిత కె.ఎన్.వై. పతంజలి. ఆ స్థాయిలో అనలేనుగానీ, ఆ దారిలో వ్యంగ్యాన్ని ఆయుధంగా చేసుకొని రచనలు చేస్తున్న ఒకరిద్దరు రచయితల్లో వేలూరి వేంకటేశ్వరరావు ఒకరు.

గుర్రాలు-గుగ్గిళ్లు ట్రయాలజీ కథల్లో నేటి జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా అగ్రరాజ్యం మీద. ‘ఏడు గోరీలు, పన్నెండు పంపులు’వంటి కథలు గ్రామ రాజకీయాలను నేపథ్యంగా చేసుకుని రాసినవి.

తీన్ కన్యా, మెటమార్ఫసిస్, అంటు అత్తగారు, రీసైకిల్, భేతాళయ్య- బంగార్రాజువంటి కథలు అమెరికా తెలుగువాళ్ల కథలు. ఈ కథల్లో వ్యంగ్యం సునిశితంగా ఉంటుంది. హాస్యధోరణితో కథ సాగుతూ, చివరికొచ్చేసరికి ఫెడీల్మని చెంపదెబ్బ తగులుతుంది. ఇటువంటి కథలు రాయడంలో వేలూరి గారి ప్రతిభ గొప్పది. ఎందుకంటే, తను ఆ దేశంలో ఉంటూ, ఎవ్వరినీ నొప్పించకుండా, వారి వారి తత్వాలను ఎత్తిచూపుతూ విసుర్లు వేయడం అసిధారావ్రతమే. మెటామార్ఫాసిస్ కథలో ఆఖరి పేరా అటువంటిదే.

ఆ నేల, ఆ నీరు, ఆ గాలి… న్యాయమందిరం, స్వర్గంలో స్ట్రిప్‌టీజ్, బ్రహ్మసృష్టి వంటివి పురాణ, చారిత్రక పాత్రలతో నడిచిన కథలు. ముగ్గురు తెలుగువాళ్లు ఒకచోట ఉంటే, నాలుగు పార్టీలు ఉంటాయనేది ఓ నానుడి. ఆ నేల… కథ ఇదే. న్యాయమందిరం కథ చదవగానే నాకెందుకో, 1947లో శారద (నటరాజన్ – తమిళుడయిన తెలుగు రచయిత) రాసిన ‘స్వాతంత్య్ర స్వరూపం’ కథ గుర్తుకొచ్చింది. సామాన్యుడికి న్యాయం అందకపోవడానికి (న్యాయ మందిరం), రాజుగారు చెక్కించిన శిల్పం ప్రజలను పీడించుకు తినే భయంకరాకార రూపంలో తయారవడానికి (స్వాతంత్య్ర స్వరూపం) ఉన్న సామాజిక నేపథ్యాన్ని వివరించటం, రాజకీయ స్థితిగతుల విశ్లేషించటం కేవలం రెండు, మూడు పేజీల్లోనే సాధ్యమయింది. ఈ రెండు కథల్లోని ప్రత్యేకత ఇదే.

ఈ సంపుటిలో నాకు నచ్చిన మంచి కథల్లో ఒకటి ‘స్వర్గంలో స్ట్రిప్‌టీజ్’. వ్యంగ్యధోరణిలో సాగినా, తాత్త్విక ధోరణితో ముగిసిన కథ. ‘అంత అందగత్తె రంభలోనూ ఉండేది ఈ రక్తమాంసాలేనా,’ అంటూ గాంధీగారు స్వర్గంలో అమాయకంగా అడిగిన తీరు గాంధీతత్వాన్ని ఉన్నతీకరిస్తూనే, అందం శాశ్వతం కాదనే జీవనసత్యాన్ని వ్యంగ్యధోరణిలో బలంగా చెప్పడం వేలూరిగారికే సాధ్యమైంది. ఎందుకో, ఈ కథ చదువుతుంటే చిన్నప్పుడు మాకు పాఠ్యాంశంగా ఉండి, నా మనసులో బలంగా నాటుకుపోయిన ఇ.ఎమ్. ఫార్‌స్టర్ కథ ‘మిస్టర్ ఆండ్రూస్’ గుర్తుకొచ్చింది. స్వర్గమైనా, నరకమైనా మనం సంచరించే నేలను అనుసరించి, మన ఊహల్లో రూపొందినవేనని తేల్చి చెప్పిన కథలు ఇవి. బ్రహ్మసృష్టి కథలోనూ అంతే. పురాణకథల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యంగా ప్రశ్నించారు.

ఇంత వ్యంగ్యాన్ని, హాస్యాన్ని అలవోకగా పలికించిన వేలూరి ‘గోమేజ్ ఎప్పుడొస్తాడో’లాంటి కళ్లు చెమర్చే కథను, ‘తరం మారినా’లాంటి పురాజ్ఞాపక కథను, చెట్టును ఆత్మీయంగా స్పర్శించి, పలకరించే ‘క్లబ్బులో చెట్టు’ కథను, ‘పడమటి సంధ్యారాగం’లాంటి ప్రయోగాత్మక కథను రాయటం ఆశ్చర్యం కలిగించే విషయం. ‘గోమేజ్ ఎప్పుడొస్తాడో’ కథ అమెరికాలో ఉన్నవారు మాత్రమే రాయగలిగిన స్పానిష్ పనివాడి వ్యధాభరిత జీవనదృశ్యం, ఆత్మలోక సందర్శనం. ఆ కథ చదివాక, పాఠకులు తమకు ఏమాత్రం పరిచయం లేని గోమేజ్‌ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటారు. పాత్రని తీర్చిదిద్దటంలోనూ, కథని నడిపించటంలోనూ వేలూరి తీసుకున్న శ్రద్ధవల్ల ఈ కథ, నేరుగా పాఠకుల హృదయాలను తాకుతుంది.

గోమేజ్ అమెరికన్ పాత్ర అయితే, రచయిత జీవితంనిండా పరుచుకున్న జ్ఞాపకాల్లోని పాత్ర పార్వతమ్మ. తనకు ఆ పాత్రతో ఉన్న అనుబంధాన్ని, ఆత్మీయతను యథాతథంగా పాఠకుల ఆలోచనల్లోకి తర్జుమా చేయటంలో వేలూరి ఒక రచయిత మాత్రమే కాదు, ప్రవక్తగా కూడా పాఠకులకు అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ‘క్లబ్బులో చెట్టు’ కథలో కూడా అంత ఆర్తీ కనబడుతుంది. ఈ కథ రాసేటప్పుడు రచయితను, చెట్టుకవి ఇస్మాయిల్ పూని ఉంటాడు. అందుకే ఆ తాదాత్మ్యత. కథ కాదుగాని, తన తెలుగు మాస్టార్ని తలుచుకుంటూ పాఠకులకు ఆయన్ని పరిచయం చేసిన తీరు వినూత్నమైంది. ఆ తెలుగు మాస్టారు ఒక తరం ఉపాధ్యాయులకు ప్రతీక. అటువంటి ఒక గొప్ప ఉపాధ్యాయుడు ప్రతి వారి జ్ఞాపకాల్లోనూ తప్పకుండా ఉంటారు.

ఇంత వైవిధ్యభరితమైన కథావస్తువుతో అంతే వైవిధ్యంగా కథలు రాయగలగటం అరుదే. అయితే ఒక్క మాట చెప్పాలి. వ్యంగ్యంలో కరుకుదనం చూపాల్సిన సందర్భాల్లో సైతం సుతిమెత్తగా వ్యవహరించటంవల్ల కొన్ని కథలు తేలిపోయినట్లు అనిపిస్తాయి. ‘గుర్రాలు-గుగ్గిళ్లు’ ట్రయాలజీ కథలు, ‘ఏడు గోరీల కథ’ అలా తేలిపోయినవే.

డెబ్బై ఏళ్లు పైబడిన వేలూరి వేంకటేశ్వరరావుగారు నిత్యనూతనంగా కథలు రాయడమే ఆశ్చర్యం. ఆయనలో ఇంకా వాడి, వేడి తగ్గకపోవడమూ ఆశ్చర్యమే. ఆయనతో పరిచయమున్న వాళ్లకి, ‘ఈయన ఇంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతాడు,’ అనేది నిరంతరాశ్చర్యమే. బహుశ ఈ కారణంవల్లే కావచ్చు, రచయితగా, కథకుడిగా ఆయన ప్రయాణం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.

ఒక్కమాటలో చెప్పాలంటే, వేలూరి కథలు అమెరికా తెలుగువాళ్ల వ్యవహారశైలిపై సుతిమెత్తగా చురకలంటించిన వ్యంగ్య కథలు. కథని, పాత్రలను నిర్మించటంలో, నడిపించటంలో ఆయనకొక ప్రత్యేక పద్ధతి ఉంది. అది అమెరికాలోని ఇతర తెలుగు రచయితల శైలికి భిన్నమైంది. హాస్య, వ్యంగ్య ధోరణిలో కథలు నడిపినా, వాటిల్లో ఆవేదన, ఆవేశం ఉన్నాయి. అవి పాఠకులను అలరిస్తూనే ఆలోచింపజేస్తాయి.