కళాసాగరం కర్ణాటకం-2

ఆ హోయసళేశ్వరాలయాన్ని వదలడానికీ బయటకు కదలడానికీ మనస్కరించలేదు. ఆలయానికి ఎదురుగా ఉన్న హోటల్ మయూర శాంతళలోనే బస చేసి ఉంటే, ఒక రోజు రోజంతా ఆ ప్రాంగణంలోనే ఆ శిల్పాల సౌందర్యవర్షంలో తడుస్తూనే గడిపేవాళ్ళమేమో! ఇప్పుడు మాత్రం బేలూరు దారి పట్టక తప్పదు.

హళేబీడునుంచి బేలూరు 17 కిలోమీటర్లు. ఇబ్బంది పెట్టని రోడ్డు. దారిలో అతి తక్కువ ట్రాఫిక్. చేతులు స్టీరింగ్ మీదా దృష్టి రోడ్డు మీదా ఉన్నప్పటికీ, మనసు ఇంకా హళేబీడు శిల్పాలనే తలచుకొంటోంది. బేలూరులో పట్టబోతోన్న అద్భుతదర్శనభాగ్యం గురించిన వూహే లేదు దానికి!


ప్రధాన గోపురం

కొద్దిసేపట్లోనే బేలూరుకు చేరాం. మా దారికి ఎదురుగా అందంగా, చెన్నకేశవాలయపు ప్రధాన గోపురం దర్శనమిచ్చింది. కొద్ది దూరంలో గుడి గోడ పక్కగా సాగిన మార్గంలోకి తిప్పి, కారును పార్క్ చేశాం. ఆలయం దారి పడుతుండగా, ‘రాఘవేంద్రస్వామివారి మఠం దారి ఇదే’ అని ఒక బోర్డ్ చెప్పింది. ముందు ఆయన దర్శనం చేసుకుందాం అని ఆ చిన్న దారిలోకి ప్రవేశించాం.

శుభ్రమైన సందు అది. రెండు వైపులా ముచ్చటగొలుపుతున్న చిన్న చిన్న ఇళ్ళు. పదడుగులు లోపలికి నడిచాక కుడి వైపున మఠం కనపడింది కానీ, అది మూసేసి ఉంది. మఠం ఎదురుగా చిన్న తోట, తోట మధ్యలో ఒక ఇల్లు. బహుశా ఆ ఇంటావిడేనేమో, ఆ తోటలో మొక్కలకు నీళ్ళు పెడుతోంది. వచ్చీ రాని కన్నడంలో ఆవిడను అడిగాం – ‘మఠం ఎప్పుడు తెరుస్తారు’ అని. ఆవిడ ధారాళంగా రెండుమూడు పెద్ద పెద్ద వాక్యాలు మాట్లాడింది. తెలియదని చెప్తోందని మాకు అర్థమయింది. వచ్చిన దారినే వెనక్కు తిరిగాం.

ఈసారి గమనించాం – అన్ని ఇళ్ళ తలుపులూ మూసేసే ఉన్నాయి. వాటిలో టీవీలూ అవీ మోగుతున్న శబ్దాలు లేవు. ప్రతి గుమ్మానికి ముందూ తప్పనిసరి అన్నట్లు ఒక చిన్న తులసికోట. “మధ్వుల ఇళ్ళయితే, ఇలా తులసికోట ఉండి తీరుతుంది,” అని ఒక జ్ఞాన గుళిక విసిరింది శ్రీమతి.

ప్రధాన గోపురద్వారానికి చేరుకుని, పక్కనే ఉన్న స్టాండ్‌లో చెప్పులు పెట్టి, లోపలకు నడిచాం. ఎండలో ఇప్పుడు వెలుగూ వెచ్చదనమూ ఒకింత పెరిగినా, ఇంకా అవి ఇబ్బంది పెట్టే స్థాయికి చేరలేదు. విశాలమైన ప్రాంగణం మధ్యన ఠీవిగా దర్శనమిచ్చింది చెన్నకేశవాలయం. ఎడమవైపున ఉన్నది ‘కప్పె చెన్నిగరాయ’ దేవాలయమని తెలిసింది.


బేలూరు చెన్నకేశవాలయం

రాణి శాంతళదేవి ఆజ్ఞ మేరకు శిల్పకళాశిరోమణి జక్కన, చెన్నిగరాయ ఆలయాన్ని మలచాడు. అయితే, ఆ ఆలయంలో కొలువయే ప్రధాన దైవం చెన్నకేశవుని శిల్పాన్ని చెక్కడం పూర్తయిన తర్వాత, దాన్ని చూసిన డక్కన అనే యువశిల్పి ఆ రాతిలో దోషముందని ఆరోపించాడట. ఆ ఆరోపణ నిజమని ఋజువైతే చేయి నరుక్కుంటానని ప్రతిజ్ఞ చేశాడట జక్కన. తీరా చూస్తే, ఆ రాతిలోనుంచి ఒక కప్ప బయటపడిందట. మాట తప్పని జక్కన చేయి నరుక్కున్నాడనీ, ఆ తర్వాత జక్కన, డక్కన ఇద్దరూ కలసి ఆలయం కోసం మరో విగ్రహాన్ని చెక్కారనీ ఒక కథ ఉంది. కన్నడంలో మండూకాన్ని ‘కప్పె’ అంటారు. అలా ఆ ఆలయం పేరులో ‘కప్పె’ ఒక భాగమైంది.

12 వ శతాబ్దంలో, హోయసళ రాజు విష్ణువర్ధనుడు చోళుల మీద సాధించిన విజయానికి చిహ్నంగా, యాగాచి నది ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర. దీని నిర్మాణం పూర్తి కావడానికి 103 సంవత్సరాలు పట్టిందట.

హళేబీడు ఆలయంతో పోల్చుకుంటే ఇక్కడ సందర్శకులు, భక్తుల సంఖ్య ఇవాళ ఎక్కువగా ఉంది. కొద్దిసేపట్లోనే, ఈ ఆలయపు శిల్పకళా వైదుష్యం మనసును గాఢంగా ఆకర్షించి, హళేబీడు పేజీని తాత్కాలికంగా వెనక్కు తిప్పింది.

రెండు ఆలయాల నిర్మాణ శైలీ ఒకే విధంగా తోచింది. కానీ, ఈ ఆలయాన్ని 32 కోణాలున్న, అయిదడుగుల ఎత్తైన ‘అరుగు’ మీద నిర్మించగా, హళేబీడులోని హోయసళేశ్వర-శాంతళేశ్వరాలయాలను 64 కోణాలున్న అరుగు మీద నిర్మించారట. ఇక్కడ కూడా అక్కడిలాంటి పరిక్రమ పథం, ఏడెనిమిది వరుసల్లో ఫ్రీజెస్ (Friezes), వాటిమీద అత్యద్భుతమైన, పరమ సున్నితంగా తోచే అతి క్లిష్టమైన శిల్పాలు. వాటి మీద ఆలయపు పై కప్పుకు దన్నుగా నిలుస్తున్న నిర్మాణ విశేషాలు.

హళేబీడులో గూగులమ్మ, యూట్యూబయ్యల సాయంతో అక్కడి శిల్పవిన్యాసాలను అవగాహన చేసుకునే ప్రయత్నం చేశాం కానీ, ఇక్కడ మాత్రం గైడ్‌ను నియమించుకోక తప్పదనిపించింది.

“‘బాగిలొళు కై ముగిదు ఒళగె బా యాత్రికనె, శిలెయల్లవీ గుడియు… కలెయ బలెయు‘ అన్నారు కువెంపు,” కవితాత్మకంగా ఉచ్చరించాడు మా గైడ్ సతీష్, తన వివరణ మొదలుపెడుతూ.. “యూ నో కువెంపు? కుప్పళ్ళి వెంకటప్పగౌడ పుట్టప్ప. హీ ఈజ్ అవర్ గ్రేట్ రైటర్! అంటే – లోపలికి రా యాత్రికుడా, గుడి మూసివుంది. దీన్ని రాయిగా భావించవద్దు, ఇది కళ పన్నిన ఉచ్చు…” ఇంగ్లీష్ లో చెప్పాడు, తను చూపబోతున్న అద్భుతానికి తెర లేపుతున్నట్లు! ఆ ప్రారంభానికి కొంచెం ఉలిక్కిపడినా తమాయించుకున్నాను.

“దీన్ని విజయనారాయణాలయం అని కూడా అంటారు. దీన్ని బిట్టిదేవ మహారాజు నిర్మించాడు. ఆయనకే విష్ణువర్ధనుడు అన్న పేరు కూడా ఉంది,” అన్నాడు. “విష్ణువర్ధనుడి కొడుకు నరసింహరాజు ఈ ఆలయానికి మెరుగులు దిద్దించాడు”.

“నక్షత్రాకారంలో కట్టిన ఆలయం ఇది. నరసింహరాజు తర్వాత రాజు బళ్ళాల-2 పరిపాలిస్తున్న కాలంలో, కేవలం స్తంభాలు మాత్రమే ఉన్న ఈ ఆలయమండపానికి జాలీలవంటి గోడలను అమర్చాడు,” అన్నాడు. “గుడి లోపలకు తర్వాత వెళదాం. ముందు ఈ శిల్పకళను పరిచయం చేస్తాను రండి,” అంటూ ప్రదక్షిణ చేయిస్తున్నట్లు దారి తీస్తూ, ఒక్కొక్క శిల్పాన్నీ చూపుతూ వివరించడం మొదలుపెట్టాడు.


ఆలయ ముఖద్వారం

“ఈ ముఖద్వారం మీద, గరుడవాహనారూఢుడైన నరసింహస్వామిని చూడండి. నరసింహస్వామి హోయసళ రాజవంశానికి కులదైవం. ఆయనకు రెండువైపులా ఉన్న మకరాలను గమనించండి,” అంటూ చెప్పసాగాడు. “ఇదొక పౌరాణిక ఊహాప్రాణి. దీని ఆకృతి ఏడు జంతువుల కలయిక. అదాటుగా చూస్తే ఏనుగులా తోస్తుంది. కానీ పరిశీలించి చూస్తే శరీరాకారం వరాహంలా, కాళ్ళు సింహంలా, కళ్ళు కోతులవిలా, నోరు మొసలిలా, ఆవు చెవులతో, ఏనుగుకు ఉండేలాంటి తొండంతో, నెమలికి ఉండేలాంటి పింఛంతో కనిపిస్తుంది…”.

అసలు నెమలి అతి సుందరమైన పక్షి. దాని పింఛంలోని ఈకల డిజైన్లూ రంగులూ సమ్మోహనకరమైన లయాత్మక రేఖల్లో కనిపిస్తాయి. ఈ శిల్పపు పింఛం ఉన్నది ఒక్క నలుపు రంగులోనే అయినా, దాని లయవిన్యాసం అసలు నెమళ్ళకన్నా అందంగా మురిపిస్తోంది. మొత్తం శిల్పంలో రెండువైపులా దాదాపు సగభాగాన్ని ఆ పింఛాలే వలయాలుగా ఆక్రమించాయి.

కనీసం ఇరవై అడుగుల పొడవు, మూడు నాలుగు అడుగుల ఎత్తుండి, ముఖద్వారాన్ని అలంకరించిన ఆ శిల్పం – మలిచిన పదార్థం రాయి అని స్ఫురిస్తే చెక్కినట్లుగానూ, చిత్రపటంగా అయితే అద్భుతంగా గీసిన బొమ్మగానూ తోస్తుంది. ఎలా తోచినా, పరమ సజీవంగానూ తలపిస్తుంది.

“ఈ ప్రాణిని ఎవరో వాహనంగా చేసుకున్నట్లుందే?”

“వరుణదేవుడు,” అన్నాడు గైడ్. ముందుకు కదిలాం. ముఖద్వారానికి పక్కనే ఉన్న శిల్పాన్ని చూపాడు.

“ఈ శిల్పాలని శిలాబాలికలనీ మదనికలనీ పిలుస్తారు. ఇవి మొత్తం 42… ఆలయం బయట 38. లోపల 4. అన్నీ వేర్వేరు భంగిమల్లో ఉంటాయి. ఆలయాన్ని కడుతున్నప్పుడు ఇవేవీ లేవు. నిర్మాణం పూర్తవుతున్న దశలో వీటన్నిటినీ తెచ్చి అమర్చారు. దీన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోగలం?”

తనే సమాధానం చెప్పాడు. “విష్ణువర్ధన మహారాజుకు కళలంటే చాలా ఆసక్తి, ఆపేక్ష. అందుకనే ఇంత విశిష్టమైన కళాసృష్టిని ప్రపంచానికి మిగిల్చి వెళ్ళాడు.”


నిరాశలో సౌందర్యం

“ఇక్కడ చూడండి,” అన్నాడు ఒక విగ్రహాన్ని చూపుతూ. “ఈ శిల్పాన్ని మీరు అనేకచోట్ల చూసే వుంటారు. ముఖ్యంగా ఎడ్వర్టైజ్మెంట్లలో… ఈమె అద్దంలో చూసుకుంటోంది. అలంకరణ పూర్తయింది, ఎడమ చేత్తో అద్దాన్ని సుతారంగా పట్టుకుని తన అందాన్ని పరికించుకుంటోంది. ఆవిడకి సాయం చేసేందుకు రెండు వైపులా ఇద్దరు పరిచారికలున్నారు. ఒకామె కుంకాన్ని అందిస్తోంది. రెండో ఆమె ఒక పిల్లకోతిని పట్టుకుంది. ఆమె ఆ పిల్లకోతికి ద్రాక్షపళ్ళు తినిపిస్తోంది కదూ?”

తలలూపాం.

“కాదు. ద్రాక్షపళ్ళని దూరంనుంచి చూపిస్తోంది కానీ ఇవ్వడంలేదు. గమనించండి.”

అవును కదూ!

“కోతిపిల్ల నోట్లో వేలు వేసుకుంది, నిరాశతో. అద్దంలో చూసుకుంటున్నామె ముఖంలో కూడా నిరాశ కనిపిస్తోంది. ఆమె ప్రియుడు వస్తానన్న సమయానికి రాలేదని…” వివరించాడు.

ఔరా! భంగిమ, ఆభరణాలు, అసిస్టెంట్లు, ఇవన్నీ సరే. ఒక శిల్పం ముఖంలో భావాలు కూడా స్పష్టంగా కనపడేలా ఆవిష్కరించాలనుకోవడం ఎంత సున్నితమైన ఊహ? ఎంత కఠినసాధ్యమైన ప్రక్రియ! హళేబీడులో ముంచెత్తిన సంభ్రమం మరోసారి తెరలా తాకింది.

“అన్నట్లు, హళేబీడులో ఆలయాన్ని ధ్వంసం చేసినంతగా ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు లేదే,” అన్నాను గైడ్‌తో.
“అవును. మొదటి దాడి అక్కడ జరిగింది. ఆ విషయం తెలిసి, ఈ ఆలయాన్ని పూర్తిగా ఇసుకతో కప్పేశారు. అందుకనే ఈ ఆలయానికి పెద్దగా నష్టం జరగలేదు,” స్వయంగా చూసినట్లుగానే చెప్పాడు.

అది పాక్షికసత్యం. నేడు శిథిలాలుగా మిగిలిన హళేబీడు, అలనాడు హోయసళ రాజ్యానికి రాజధాని. అందుకనే ముందుగా దాడికి గురైంది. దాడి చెయ్యడానికి మాలిక్ కాఫర్ సైన్యం ముంచుకొస్తుండగా అంత తక్కువ సమయంలో ఇంత విశాలమైన, ఎత్తైన ఆలయాన్ని కప్పేసేంత ఇసుకను తెచ్చి, ఆలయాన్ని దాచి వేసేంత కుప్పగా పోయడం అసాధ్యం. ఆలయ ద్వారాలను కాల్చి వేశారనీ, గోపురానికి ఉన్న బంగారు తాపడాన్ని పెకలించుకుపోయారనీ చరిత్ర చెప్తోంది. ఇక్కడి శిల్పసంపదను కూడా ధ్వంసం చేయాలని ప్రయత్నించారుగానీ, వాటి దృఢత్వంవల్ల ఆ నష్టం పెద్దగా జరగలేదు. ఇది ఒక కారణం.

హోయసళ వంశపతనం తర్వాత, చెన్నకేశవాలయాన్ని విజయనగర సామ్రాజ్యం తమ అధీనంలోకి తీసుకుని సంరక్షించింది. ఆ తర్వాత నిరాఘాటంగా కొన్ని వందల సంవత్సరాలపాటు ఆ ఆలయంలో పూజలు జరుగుతూనే వచ్చాయి. ఈ రెండో కారణంవల్ల కూడా ఈ ఆలయశోభ పదిలంగా నిలిచింది.

“ఇక్కడనుంచి కొన్ని విగ్రహాలను దొంగిలించి తీసుకుపోయారు. ఇప్పుడు వాటిని లండన్లో, విక్టోరియా-ఆల్బర్ట్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు,” చెప్పాడు గైడ్.

మదనిక శిల్పాల గురించి చెప్పడాన్ని కొనసాగించాడు. “మనం బెర్ముడా షార్ట్స్‌ని ఇప్పుడు వేసుకుంటున్నాం. అవి అప్పుడే ఉన్నాయి,” అంటూ ఒక మదనిక శిల్పానికి ఉన్న నిక్కర్‌వంటి వస్త్రధారణను లేజర్ పాయింటర్‌తో చూపాడు.

“ఇది చూడండి, ఈమె వేటాడుతోంది,” అన్నాడు వింటి నారిని చెవి వరకూ లాగి పట్టుకొని, ఎగురుతున్న పక్షికి గురిపెట్టినట్లున్న మదనికను చూపుతూ. “ఈమెకో హెల్పర్ కూడా ఉంది చూడండి,” అంటూ ఆమె ఎడమ పాదం వద్ద కనిపిస్తున్న చిన్న బొమ్మను చూపాడు. వేటాడుతున్న అమ్మగారికి అమ్ములు అందించడానికి సిద్ధంగా పొదిని పట్టుకొన్నట్లు ఉందామె. ప్రాణం ఒక్కటే తక్కువ.

“ఈమెను చూడండి – వీణ వాయిస్తోంది. ఒకప్పుడు ఈ వీణకు రాతి తీగలు కూడా ఉండేవి,” అన్నాడు. మాకు నమ్మబుద్ధి కాలేదు. మరుక్షణమే మనసు హెచ్చరించింది. ‘నమ్మి తీరాల్సిందే,’ అని!

“ఈమె తలస్నానం చేసి వచ్చి, జుట్టు పిండుకుంటోంది. ఒత్తైన జుట్టు చివర నీటి బిందువులు చూడండి…”

ఎంత సౌందర్యం! చూస్తున్న కొద్దీ ఆ అందపు బరువును మోయలేనట్లు మనసు తియ్యగా అలసిపోసాగింది. ఆ శిల్పాల ‘త్రిభంగ’ భంగిమనే చూడాలో, సన్నటి నడుమునే చూడాలో, లోతైన నాభినే గమనించాలో, ఆ విగ్రహాలు ఊపిరి పీల్చుతున్నాయా అని ఆశ్చర్యపోవాలో…! ఎంత గొప్ప మనోనేత్రం ఆ శిల్పులదీ! అక్కడితో ఆగక, ఆ శరీరాల అందాన్ని ద్విగుణీకృతం చేస్తూ ఆభరణాలు… అవి బంగారంతో చేసినవి కాదు అని మనసుకు నచ్చచెప్పుకోవలసి వచ్చింది.

మనసులో పుట్టిన ఒక కలకు రూపాన్నివ్వడమేగా కళ అంటే! ఎంత బలంగా మనసులో రూపుదిద్దుకుని ఉంటే ఆ కల కళగా స్థిరత్వాన్ని ఆపాదించుకుంటుంది? ఆ స్థిరత్వం ఇంకెన్ని ఆటంకాలను ఎదుర్కొని చేతుల ద్వారా, పరికరాల ద్వారా ప్రవహించి శిలలకు ప్రాణం పోస్తుంది! ఆ శిల్పాల్లోని ఒక్కొక్క వంపూ, ఒక్కొక్క లోతూ అంతంత సొంపును ఇముడ్చుకోవాలంటే ఎన్నెన్ని సంవత్సరాలు సౌందర్యసాధనలో జ్వలించి ఉండాలా శిల్పాచార్యుల జీవితాలు!?

సాధన అంటే? సౌందర్యదృష్టి. సౌందర్యాన్ని గుర్తించగలగడం. క్షణికమైన భావప్రాప్తి జ్ఞాపకాల ముద్రలను తృణీకరించి, అంతకు ఎన్నో రెట్లు మించిన రసప్రాప్తి కోసం స్వప్నలోకంలోకి అధిరోహించడం. ఉలి తాకిడికి ఎగసిన దుమ్ముతెరల్లోంచే రాతిలో లోతునూ ఉబ్బెత్తునూ సృష్టించడం!


నరసింహ స్తంభం

ఆ శిల్పాలు – కాదు కాదు… మూర్తులు మనసును ఎక్కడికో విసిరేసేయి. ఒక్క క్షణం నేనే ఆ రాతినీ, మరుక్షణం నేనే ఆ శిల్పినీ కాలేకపోయినందుకు దుఃఖంగానూ అనిపించింది.

“ఇది నార్త్ ఇండియాలో ఉత్సాహంగా జరుపుకునే హోలీ పండుగ దృశ్యం. పక్కనుంచి ఒక సేవకురాలు రంగులున్న కుండను అందిస్తోంది. ఈ వైపున ఉన్నామె నీళ్ళు నింపుతోంది. పిచికారీ ఇప్పుడు లేదు. కానీ తొమ్మిది వందల యేళ్ళ క్రితం పిచికారీలు వాడకంలో ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు,” గైడ్ స్వరం మళ్ళీ ఆ ప్రాంగణంలోకి లాక్కొచ్చి పడేసింది.

ఆలయం లోపలికి దారి తీశాడు గైడ్.

ఆ అంతర్భాగమంతా నల్లని కాంతితో మెరుస్తోంది. గర్భగుడి ద్వారాన్ని అలంకరిస్తూ ద్వారపాలకులు, పైన శిల్పమాలిక మళ్ళీ ప్రత్యక్షమయాయి. ఇందులో కూడా హళేబీడును మరపించగల స్తంభాలు… ఏ రెండు స్తంభాలూ ఒకలా ఉండరాదన్న ఆచారం ఇక్కడా ఉంది! ప్రత్యేకించి ఒక స్తంభం – నరసింహ స్తంభం. వర్ణనాతీతమైన అందం ఆ స్తంభానిది. విశేషమేమంటే, ఆ స్తంభం ఒకప్పుడు తిప్పితే తిరిగేదట! అలా తిరగడానికి ఉపకరించే ‘బేరింగులు’ కాలక్రమేణా పనిచేయకుండా గట్టిపడడంవల్ల, ఇప్పుడా స్తంభం తిరగడం లేదట.

ఆ విస్మయాన్నుంచి తేరుకోక ముందే ‘మోహిని’ రూపం చెక్కిన స్తంభం ముందు మమ్మల్ని నిలబెట్టాడు గైడ్.


మోహిని

సముద్రమథనం జరుగుతున్నప్పుడు, అమృతాన్ని పంచే విషయంలో దేవతలకు సాయం చెయ్యడానికి విష్ణుమూర్తి మోహినిరూపంలో ఆవిర్భవించాడని పురాణగాథ. శాస్త్రాలు సూచించినట్లు, పద్మినీ జాతి స్త్రీకి ఉండవలసిన శారీరక లక్షణాలతో పరిపూర్ణంగా విలసిల్లుతోందా మోహినీశిల్పం. త్రిభంగ భంగిమ. చంద్రుడిలాంటి ముఖం – అంటే చంద్రముఖి; చేపల్లాంటి కళ్ళు – అంటే మీనాక్షి. ముఖం పొడవు ముక్కు పొడవుకు మూడు రెట్లు ఉండేలానూ, ముఖం వెడల్పుకు సమానంగా నడుము సన్నదనం ఉండేలానూ శ్రద్ధ వహించారట. రూపానికి స్త్రీ అయినా అసలుకు పురుషుడు (విష్ణుమూర్తి) కాబట్టి, ఉపనయనం జరిగిన చిహ్నంగా యజ్ఞోపవీతం కనిపిస్తుంది. కాలి బొటనవేలుకన్నా మధ్యవేలు కొద్దిగా పొడవు ఎక్కువ. అలా ఉన్న యువతికి నాయకత్వ లక్షణాలుంటాయని నమ్మేవారట. అటువంటి యువతిని పరిణయమాడాలని యువకులు ఉవ్విళ్ళూరేవారట! అరికాలు పూర్తిగా నేలపై ఆనకుండా కాలి మడమకూ ముంగాలికీ మధ్యలో చిన్న ‘గ్యాప్’. బయటివైపునుంచి లేజర్ లైట్ వేస్తే, దాని కాంతిపుంజం లోపలివైపుకు సాగడం తెలుస్తోంది. అలానే కిరీటంలో కూడా. సన్నటి క్లిష్టమైన నగిషీలు చెక్కిన ఆ పొడవాటి కిరీటం లోపలి బోలుదనం, కాంతిరేఖను నిరాటంకంగా ప్రయాణించనిస్తోంది.

“సర్, పైకి చూడండి,” అంటూ ఆలయపు పై కప్పును సూచించాడు గైడ్. అక్కడ మరొక అద్భుతం. పౌరాణిక గాథలను ప్రదర్శిస్తున్న చిన్న చిన్న శిల్పాలతో నిండిపోయిందా కప్పు లోపలి భాగం. మధ్యలో అడుగు పొడవున, భూమి వైపుకు పొడిగించిన నడిమిరాయి – కీస్టోన్. ఆ రాతిలో, ఆ రాజవంశపు కులదైవం నరసింహస్వామి. ఆలయం బయటి గోడల మీద అనేకసార్లు దర్శనమిచ్చే విగ్రహమే ఇక్కడ చిన్న సైజులో, అంతే వివరంగా ఆశీర్వదిస్తోంది.

సిస్టైన్ చాపెల్ కప్పు లోపల, మైకేల్ ఏంజిలోతో సహా మరికొందరు చిత్రకారులు దాదాపు ఆరు వందల ఏళ్ళ క్రితం రంగులతో గీసిన ఫ్రెస్కోల ఫోటోలు చూసి, అవే ప్రపంచంలో అత్యద్భుతాలని అప్పుడు అభిప్రాయపడ్డాను. కానీ అంతకు మూడు వందల ఏళ్ళ క్రితమే ఈ ఆలయాలను రాళ్ళతో మలిచారని అర్థమయాక ఇప్పుడు విస్తుపోయాను. మనసులోనే ఆ స్రష్టలందరికీ వినమ్రంగా నమస్కరించాను.


నడిమిరాయి

గైడ్ వెనుక, మితిమీరిన సంభ్రమంతో, ఏదో మత్తులో ఉన్నట్లు అడుగులు బయటకు వేశాం.

ఆవరణలోని ఒక నాలుగు పలకల పొడవాటి స్తంభాన్ని చూపాడు గైడ్. పేరు దీపస్తంభం అట. ఒకప్పుడు, సంవత్సరానికి ఒకసారి జరిగే కార్తీకోత్సవంనాడు దాని మీద దీపాలు వెలిగించే ఆచారం ఉండేదట. ఆ స్తంభం చుట్టూ అరుగు. స్తంభం విశేషమేమిటో కొద్దిగా వంగి చూస్తే తెలుస్తుంది – అది ‘భూమిలో పాతి’ నిలబెట్టింది కాదనీ, అరుగు మీదకు ‘చేర్చి’ నిలబెట్టిన స్తంభమనీ! అది భూమి మీద ఆనుతున్న చోట – ‘బేస్’లో, ఒక పక్కనుంచి చూస్తే మరో వైపు కనిపించేలా సన్నని ఖాళీలు. ఆధారం నలుచదరంగా ఉన్నా, ఆ అరుగుమీద పాక్షికంగా మాత్రమే ఆనిన ఆశ్చర్యం ఆ స్తంభం. గాలి ఎంత వేగంగా వీచినా ఎన్ని భూకంపాలొచ్చినా ఇసుమంతైనా కదలని స్థిరరూపం ఆ అద్భుతం!

గైడ్ సెలవు తీసుకున్నాడు. మాతో కలసి ఒక ఫోటో దిగి…

అప్పుడు…

ఎందుకో తెలియని ఒక వింత బాధ మమ్మల్ని ఆవరించింది…

బేలూరులోని ఈ చెన్నకేశవాలయం మానవకళాచాతుర్యానికి పరాకాష్టగా, అవధి లేని అందాన్ని ప్రదర్శించింది. ఆ ప్రదర్శన, సముద్రపు నీరు ఉత్తుంగ తరంగాలుగా ఎగసి తిరిగి తనలో తాను విలీనమయ్యే చందాన, మహోన్నతంగా వెల్లివిరిసిన నాగరికతలైనా కాలగర్భంలో లుప్తమైపోగలవన్న యదార్థాన్ని కూడా గుర్తుచేసింది. అదొక అత్యద్భుతపు, అశాశ్వతత్వపు విరోధాభాస. కళారూపావిష్కరణ కాలాతీతమే అయినా, కాలం కొట్టే కరుకు దెబ్బలను భరించక తప్పదులెమ్మని చరిత్ర చెప్పడమే ఆ విరోధాభాస. ఒకే సమయంలో వాటి మహానీయతా అశాశ్వతత్వమూ జమిలిగా మస్తిష్కంలో వెల్లువెత్తి, దిగులుగా పరిణమిస్తాయట!

ఆ దిగులును స్టెండాల్ సిండ్రోమ్ అంటారట!

మనసును సమాధానపరచుకుని చెన్నకేశవాలయంలోనుంచి బయటకు చేరుకున్నాం. అప్పుడు గుర్తొచ్చింది పొద్దుటినుంచీ ఏమీ తినలేదనీ, శిల్పసౌందర్యమే కడుపు నింపేసిందనీ! ఎదురుగా కనపడిన హోటల్లో అల్పాహారం ముగించాం. ఈ విషయంలో మేముండే ఢిల్లీకీ ఈ కర్ణాటకకూ ఉన్న ఒక తేడా మరోసారి స్ఫురించింది. అక్కడ సంచీడు చెల్లిస్తే ఉగ్గు గిన్నెడు పెడతారు. ఇక్కడ ఉగ్గు గిన్నెడు చెల్లిస్తే సంచీడు పెడతారు!

కారు కదిలింది. మా తర్వాతి మజిలీ ధర్మస్థళ.

(సశేషం)


శ్రీనివాస్ బందా

రచయిత శ్రీనివాస్ బందా గురించి:

దిల్లీలో స్థిరపడిన విజయవాడ వాసి శ్రీనివాస్ బందా మాజీ సైనికుడు, కార్పొరేట్ ఉద్యోగి. సంగీత సాహిత్యాలంటే చిన్నప్పటినుంచీ మక్కువ ఎక్కువ. ఆ మక్కువే ఒకప్పుడు ఆకాశవాణికీ, దిల్లీ చేరేక నేపథ్య గాత్రధారణకూ పునాది అయింది. తన ఆర్మీ అనుభవాలను కథలుగా మలిస్తే, అవి ‘సోల్జర్ చెప్పిన కథలు’గా ‘ఈమాట’లో ధారావాహికంగా వెలువడ్డాయి. కాగితం మీదికి దిగే ప్రతి అక్షరానికీ ఒక సామాజిక బాధ్యత ఉంటుందని నమ్మే శ్రీనివాస్‌కు, ఆలోచింపజేసే ఏ రచన అన్నా ఇష్టమే.

 ...