పంచర్

“సాహబ్, దునియా బహుత్ బెహె… కా …డా! కెహ్‌తా హై ఘోడీ*, లాతా హై ఘోడా…” నవ్వుతూ చెప్పాడు మెకానిక్, కొద్దిగా వంచి నిలబెట్టిన నా స్కూటర్ వైపు అడుగేస్తూ. ఆ ప్రాసా, అతని బిహారీ యాసా ఆ మాటల వెనుకనున్న వాస్తవాన్ని కొంచెమైనా మరుగుపరచలేదు.

దాదాపు నెలరోజులనించీ, ప్రతి రెండు మూడు రోజులకోసారి స్కూటర్ వెనక టైర్లో గాలి తగ్గిపోతోంది. అదీ ఉన్నట్టుండి తగ్గిపోవడం కాదు. సాయంత్రం గాలి కొట్టించి ఇంటికి తీసుకొస్తే, పొద్దున్నే పాపని స్కూల్లో దింపుదామని బయల్దేరిన కాసేపటికి, నాలుగైదు గుంటల్లో పడి లేస్తున్న తర్వాత ఆ విషయం తెలుస్తుంది. ట్యూబ్‌లెస్ టైర్లే కాబట్టి, మైలున్నర దూరంలోని పెట్రోల్ బంకువరకూ మర్యాదగానే చేరుతుంది స్కూటర్. కుర్రాడు చెక్ చేస్తాడు. ‘పంచర్ హై,” అంటాడు. అయిదే నిముషాల్లో ‘పంచర్’ వేస్తాడు. యాభై పుచ్చుకుంటాడు. రెండ్రోజుల తర్వాత మళ్ళీ మొదటికొస్తుంది కథ. మళ్ళీ అదే కుర్రాడు. ఈసారి కొత్త పంచర్. ‘పాత పంచర్ (వేరే షాపులో వాళ్ళు వేసింది) లీకైందీ’ అంటాడు. మొత్తం నూట యాభై పుచ్చుకుంటాడు.

“ఒక పంచర్ వేసిన బె…ద్‌కి ఇక్కడున్న ఇంకో పంచర్ లీకౌతోందని తెలీలేదూ…” టైర్ మీద సబ్బునీళ్లు పోసేక, బుస్సున వస్తున్న బుడగలని చూపిస్తూ అన్నాడు మెకానిక్, ఇందాకటి సామెతకి పొడిగింపులా. టైర్ ని వదిలి లేచి, వెళ్ళి వరండాలో వేలాడుతూ భోజ్ పురి పాటలని బిగ్గరగా పాడుతున్న ఎఫ్ఫెమ్ రేడియో వాల్యూమ్ తగ్గించాడు.

“సాబ్, మేరీ మానో, ఇందులో టూప్ (ట్యూబ్) వేయించుకోండి. అప్పుడుగానీ మీ సమస్య తీరదు.”

“దానికెంతవుతుందీ?”

చెప్పాడు. ఈ తలనొప్పి రోజూ భరించేకంటే అదే నయమనిపించింది. వేసెయ్యమన్నాను.

చకచకా పనిలోకి దిగిపోయాడతను. నన్ను బ్రేకులు బిగించి పట్టుకోమని, వెనక చక్రాన్ని బయటికి తీశాడు. తీసిన చక్రాన్ని షాపు వరండాలోకి తీసుకెళ్ళి, రిమ్‌నుంచి టైర్‌ని వేరుచేయడం మొదలెట్టాడు. తనే మాటలు కొనసాగించాడు.
“2009 నుంచీ ఈ పనిలో ఉన్నాను సాబ్. అప్పట్నించే నాకీ షాపుంది. మొదట్లో అయితే చిన్న చిన్న బళ్ళిని ముట్టుకునేవాణ్ణే కాదు. టరక్ల (ట్రక్కుల) పనే చేసేవాణ్ణి. గ్రీన్ పార్క్‌లో పెద్ద గురుద్వారా ఉంది తెలుసుగా? దాని పక్కనే రాయల్ టైర్ కంపెనీ అని ఉంది. అందులో పనిచేసేవాణ్ణి.” రిమ్ము నుంచి టైర్‌ని విడగొడుతున్నాడు.

సొంత షాపు వుండగా ఎవరి దగ్గరో పనిచెయ్యడమెందుకూ?

“పని నేర్చుకోవడానికి సాబ్. అక్కడే ఓసారి, పుల్లీ మీదికెక్కించిన బండి పొరపాటున కింద పడేశాను. ఓనర్ నోరు విప్పేముందే, తప్పు నాదే అని చెప్పి నేనే బయటికొచ్చేశాను.”

రిమ్‌ నుంచి టైర్ వేరైంది. మాటలకి చిన్న బ్రేక్ తర్వాత, మళ్ళీ మొదలుపెట్టాడు.

“అదివరకు కొన్నాళ్ళు ఫరీదాబాద్‌ సెక్టర్ 62లో పెద్ద పెట్రోల్ పంపులో పనిచేశాను. పక్కనున్న టైర్ల షాపూ వాళ్ళదేలే. ఇదే, పంచర్లేసే పనే అక్కడ కూడా. ఆ వోనరైతే, ‘జాకీర్, రోజుకి ఇరవై టూప్‌లు అమ్మించాల్సిందే’నన్నాడు. సరే అన్నాను. అమ్మించాను. ఈ చేతులతోనే,” మట్టిగొట్టుకున్న చేతులు చూపించాడు.

“ఎలా?” కొద్దిగా ఆశ్చర్యపడి అడిగాను.

“చూడండి సాబ్, మీరు షరీఫ్* కాబట్టి, మీకు అసలు విషయం చెప్తాను,” అంటూ టూల్ కిట్ లోంచి సెంటీమీటర్ పొడవున్న చిన్న ఇత్తడి ముక్కలాంటిదాన్ని చేతిలోకి తీసుకుని చూపాడు. “ఇది వాల్వ్. దీన్ని ఈ వైపున ఇలా కట్ చేసి (కటింగ్ ప్లేయర్‌తో ఒక వైపు కత్తిరించి) ఈ రెండో వైపున్నదాన్ని ఇలా అరగదీస్తాం.” అర్థమయ్యేలా ప్రదర్శించాడు. ఇప్పుడా వాల్వ్ సైజు అర సెంటీమీటర్ కన్నా తక్కువ మిగిలింది. అరగదీసిన వైపు సూదిమొనలా పదును తేలింది.
తర్వాత? అన్నట్టు చూశాను.

“దీన్ని నోట్లో పెట్టుకుని చింగమ్ (చూయింగ్ గమ్) లా నముల్తున్నట్టు నటిస్తాం. టైర్‌ని విప్పేది ఈ మూల. పంచర్‌కోసం నీళ్ళలో వెతికేది ఆ పక్కన. గాలి కొట్టేది ఈ పక్కన. సాయంత్రమైతే మరీ తేలిక. పట్టపగలైనా పర్వాలేదనుకో. ఇంతసేపట్లో దీంతో ఏ టూపుకైనా రెండు బెజ్జాలు పొడవడం ఎంతసేపు?! కొత్త టూపు వేయించుకోమని కస్టమర్ని ఒప్పించడం ఎంతసేపు?”

గొప్ప జీవితసత్యం తెలుసుకున్నట్టు కాకున్నా ఆశ్చర్యమూ, చిరాకుల చిన్నపాటి అలలు రేగాయి మనసులో.

“సాబ్, చేతులు ఇవే.. నువ్వు ఎంత గుచ్చి గుచ్చి గమనించినా, మేం చేసే పని చేసేదే. కనిపెట్టడం నీ తరం కాదు…” అన్నాడు నా మొహంలో చిరు ఆశ్చర్యం చూసి.

‘ఔరా..’ అనుకున్నాను. అప్పుడు గుర్తొచ్చింది – నిన్న న్యూస్‌లో చదివిన విషయం. కారు టైర్లో గాలి తగ్గిందన్న అనుమానంతో చూపిస్తే, పంక్చర్లు వేసే షాపుల కుర్రాళ్ళు, పడింది ఒకటైతే మరో రెండు మూడు చిల్లులు పొడిచి, మూడొందలు వసూలు చేశారట. అయినా మరో రెండ్రోజులకి మళ్ళీ అదే అవస్థ ఎదురయ్యేసరికి, ఎనిమిదివేలు ఖర్చుపెట్టి ఆ కారు టైర్‌ని మార్చడం తప్ప మరో దారి లేకపోయిందట ఆ కారు యజమానికి. ‘టైర్లకి పంక్చర్లు వేయడం సంగతెలా ఉన్నా జేబులకి మాత్రం చక్కగా చిల్లులు పొడుస్తున్నారు, ఇది ఈమధ్య మొదలైన కొత్త స్కామ్’ అంటూ సాగిందా కథనం.

మొన్న వేరేచోట పంక్చర్ వేయిస్తున్నపుడు, అక్కడి కుర్రాళ్ళు కూడా ఏదో నములుతుండటం గుర్తొచ్చింది.

ఇంతలో ఓ ఇన్నోవా వచ్చి ఆగింది షాపు ముందు. “భయ్యా, జరా హవా భర్వానా హై,” అంది దాన్ని డ్రైవ్ చేస్తున్న ప్రౌఢ, మెడ సాచి విండోలోంచి తల బయటికి పెట్టి. ‘దానికి చాలా టైమ్ పడుతుంది మేడమ్’ అన్నాడు. ఆమె ప్రాధేయపడింది. అతను మరో రెండు వాక్యాలతో ఆవిణ్ణి సాగనంపాడు.

“ఈ అమ్మాయి,” అన్నాడు మళ్లీ నా టైర్ సంగతి చూస్తూ. “నాలుగైదు నెలల క్రితం వచ్చింది. పని చేస్తున్నంతసేపూ ఒకటే సణుగుడు. ‘భయ్యా నీకు పని సరిగ్గా రాదూ, అదేంటి అలా చేస్తున్నావ్ ఇదేంటి ఇలా కాదే’ అంటూ తెగ విసిగించింది. అప్పుడే కసమ్ (వొట్టు) పెట్టుకున్నా.. ఇంకెప్పుడూ నీ పని మాత్రం చెయ్యనూ అని. అప్పణ్ణించీ రెండుమూడుసార్లు వచ్చింది… ఇది నాలుగోసారి.. ప్రతిసారీ ఇలాగే చెప్తున్నా. అయినా ఆ బుర్రలో లైటు వెలగలా…”
కొత్త ట్యూబ్‌ని టైర్‌లో అమర్చి, బిగిస్తున్నాడు మెకానిక్. ఆగిన మాటలు మళ్ళీ మొదలయ్యాయి.

“ఇంతకీ, రోజుకి ఇరవై ట్యూబులు అమ్మించానన్నావే, ఓనర్ నీకేమైనా…”

“వాడా, వాడి..(బూతు). రెండునెలల్లో యాభై రెండువేల రూపాయల బిజ్‌నెస్ చేయించాను. నయాపైసా ఇవ్వలేదు. గొడవపెట్టుకుని మరీ అక్కడ మానేశాను. అప్పట్నించీ సొంత షాపునే చూసుకుంటున్నాను…”

“ఎంతైనా అలా చెయ్యడం మోసం కదూ?

తలెత్తి చూశాడు. ‘ఎలా?’ అన్నట్టు.

“భాయ్, మిలటరీలో పనిచేశాను. ఆ రోజుల్లో అయితే, అసలు ఇలా కూడా మోసం చేస్తారన్న వూహే ఉండేది కాదు. బయటికొచ్చిన ఈ ఇరవయ్యేళ్లలో ఇలాంటివెన్నో చూస్తున్నాను…”

నవ్వుకున్నాడు. “అందరి దగ్గరా చెయ్యను సాబ్,” చెదరకుండా చూస్తూ దృఢంగా చెప్పాడు. “మొన్న నాలుగుసార్లు, ఓ పోలీసాయన చక్కర్లు కొట్టాడు. వాగనార్ టైర్లు రెండు బాగు చెయ్యమని. ఇదే, ఈ రోడ్డు చివర పోలీస్ చౌకీ లేదూ, అందులోనే ఆయన డూటీ… సరే ఒకరోజు నేనే వెళ్ళా, కుదిరించుకుని. కష్టపడి టైర్లు రెండూ బాగు చేశాను. ఎంతయిందన్నాడు. అయిదొందలన్నా. ‘ఎల్లుండి ఇస్తాను, వచ్చి తీసుకెళ్ళు’ అన్నాడు. కుదరదన్నాను. నేను షాపు వదిలిపెట్టి నీ దగ్గరకొచ్చి నీ పని చేశాను. నా దేహాడీ (కూలి) నాకు ఇప్పుడే కావాలన్నాను. ‘పోలీసుని, ఆ మాత్రం నమ్మకం లేదా’ అన్నాడు. ‘పోలీసైనా మరోడైనా నా కూలి నాకు కావాలి. అదీ ఇప్పుడే. నువ్వు రోజంతా ఎండలో ఇక్కడ డూటీ చేసేందుకు నీకు సర్కార్ డబ్బులిస్తున్నా, ఎవణ్ణి బడితే వాణ్ణి ఆపి ఆ కాగజ్ లేదూ ఈ బొంగులేదూ అని బెదిరించి డబ్బు దొబ్బుతావు. నేను కష్టపడి పనిచేస్తే నాకు డబ్బులు ఎప్పుడో ఇస్తానంటావా? ఇవ్వాలని లేకపోతే ఇవ్వనూ అని చెప్పు. ఒప్పుకుంటా. అంతేగానీ దాటేస్తున్నావంటే నీకు ఇవ్వాలని లేదన్నమాట…’ అంటూ ఝాడించాను. మిగిలిన పోలీసులు వింటూ కూర్చున్నారు. ఒక్కడూ నోరెత్తలేదు.”

కించిత్ ఆశ్చర్యంతో విన్నాను. చూశాను కూడా. పోలీసులంతా అలా ఉండరేమోలే అని ఎప్పటికప్పుడు సర్దిచెప్పుకున్నాను.

“మోసం కదా అంటున్నావు.. సాబ్. బుజుర్గ్‌వి. నీకు నేను చెప్పాలా?” ఏదో గుర్తు చేసుకుంటున్నట్టు క్షణం ఆగాడు. “దునియాలో మోసం చెయ్యందెవరు? తోబుట్టువులైనా మొగుడూ పెళ్ళాలైనా, కిళ్ళీకొట్టోడైనా మందుల షాపోడైనా, బడే బడే నేతాలోగ్ అయినా… నేతా అంటే గుర్తొచ్చింది. నిన్ననే రేడియోలో విన్నాను సాబ్, ఎవరో బడా నేతాకి ఇచ్చిన పెద్ద అప్పుని మాఫీ చేసేశారని… అయినా, అదుగో, చివరికి ఆ అడుక్కునే కొజ్జావోడైనా – మోసం చెయ్యనోడు లేనేలేడంటా!” ఒక రకమైన కసి నవ్వుమొహంతో ప్రకటించాడు.

“అందుకే అన్నాను సాబ్… దునియా బడా…!”

సామెత వెంటనే గుర్తొచ్చింది!

*ఘోడీ – ఉత్తరభారతంలో, పెళ్ళికొడుకు బారాత్‌లో ఆచారంగా ఎక్కవలసిన ఆడగుర్రం.
షరీఫ్ – అమాయకుడు
బుజుర్గ్ – వయసులో పెద్దవాడు


శ్రీనివాస్ బందా

రచయిత శ్రీనివాస్ బందా గురించి:

దిల్లీలో స్థిరపడిన విజయవాడ వాసి శ్రీనివాస్ బందా మాజీ సైనికుడు, కార్పొరేట్ ఉద్యోగి. సంగీత సాహిత్యాలంటే చిన్నప్పటినుంచీ మక్కువ ఎక్కువ. ఆ మక్కువే ఒకప్పుడు ఆకాశవాణికీ, దిల్లీ చేరేక నేపథ్య గాత్రధారణకూ పునాది అయింది. తన ఆర్మీ అనుభవాలను కథలుగా మలిస్తే, అవి ‘సోల్జర్ చెప్పిన కథలు’గా ‘ఈమాట’లో ధారావాహికంగా వెలువడ్డాయి. కాగితం మీదికి దిగే ప్రతి అక్షరానికీ ఒక సామాజిక బాధ్యత ఉంటుందని నమ్మే శ్రీనివాస్‌కు, ఆలోచింపజేసే ఏ రచన అన్నా ఇష్టమే.

 ...