సుమారు ఇరవై ఏళ్ళ కిందట మహాభారత కథా వాస్తవాల పట్ల ప్రారంభమైన నా సొంత ఊహలు, ఆలోచనలు 1966లో చిక్కమగళూరు డా. నారాయణప్పతో చర్చిస్తున్నప్పుడు ఒక అర్ధ స్పష్ట రూపంలోకి వచ్చాయి. వాటిని ఒక నవల రూపంలో రాయమని సూచించి ఆయన చాలాసార్లు ఒత్తిడి చేశాడు. తరువాతి సంవత్సరం ఆశ్వయుజ, కార్తీకాలలో హిమాలయాల్లోని గఢవాల్ భాగంలో సంచరిస్తోంటే బహుపతీ పద్దతి ఉన్న ఒక చిన్న పల్లెలో నిద్రించే సందర్భం వచ్చింది. ఈ పద్ధతి ద్రౌపదికాలం నుంచి వస్తోందని చెప్పే ఈ జనం సుమారు రెండు తాలూకాల్లోని పల్లెల నిండుగా ఉండడం చూశాక, బదరి జ్యోతిర్మఠాల మధ్య లోయలో ఉన్న పాండుకేశ్వరానికి వెళ్ళి స్థల చరిత్రను విన్నాక మహాభారతంలోని కొన్ని పాత్రల పట్ల ఊహా రేఖలు చెదిరిపోయాయి. 1971 నుండి ఈ విషయమై తీవ్రంగా పరిశోధించసాగాను. మూలమైన వ్యాస భారతాన్ని ఆమూలాగ్రం చదివిన తరువాత వేద సంస్కృతి చివరి దశలోని ఆర్థిక, రాజకీయ, ధార్మిక, సామాజికాది వివిధ ముఖాలను లోతుగా అధ్యయనం చేయసాగాను. సుమారు ఐదు సంవత్సరాలు ఇలా అధ్యయనం చేస్తూ 1974లో, మహాభారత సంఘటనలు జరిగిన హిమాలయ పర్వతాల్లోని కొన్ని భాగాలలో పర్యటించాను. తరువాత 1975లో ద్వారక, అరావళి పర్వత శ్రేణి, విరాట నగరం, మధుర, ఢిల్లీ, కురుక్షేత్రం, హస్తినాపురం, బర్నాకా, చక్రనగర్, రాజగీర్ మొదలైన స్థలాలకు వెళ్ళి పరిశీలించాను. ఈ పర్యటనకు కావలసిన ముందు సూచనలను మైసూరులోని కేంద్ర శాసన పరిశోధన శాఖకు చెందిన డా. రమేశ్‌గారు ఇచ్చారు. మైసూరు విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో అప్పుడున్న శ్రీమతి లీల (ఎ.ఆర్. కృష్ణ శాస్త్రిగారి మనునురాలు) నా పరిశోధనకు కావలసిన పుస్తకాలను, వ్యాసాలను వెదికి ఇవ్వడంలో చాలా సహాయం చేశారు. నా అధ్యయన కాలమంతా శ్రీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంగారు చర్చలో భాగస్వాములై నా అవగాహన సుస్పష్టం కావడానికి తోడుపడ్డారు. ఒక దశలో ఇలాటి సహాయం శ్రీ పా.వెం. ఆచార్య నుండి కూడా లభించింది. పర్యటనలో స్థల చరిత్రలను, ఐతిహ్యాలను, అధ్యయనం చేసిన ద్వారకలోని డా. జె.జె. థాకర్, విరాట నగరంలోని ఆచార్య దేవేంద్రజీ శర్మ, కురుక్షేత్ర విశ్వ విద్యాలయం చరిత్ర విభాగంలోని డా. ఎచ్.ఎ. ఫడ్కేణా గార్లు నాతోపాటు సంచరించి వివరించారు. ఢిల్లీలో జాతీయ విజ్ఞాన ఇతిహాసిక మండలిలో ప్రధాన సంపాదకులైన డా. బి.వి. సుబ్బరాయప్పగారి నుంచి కూడా కొన్ని ముఖ్యమైన సూచనలు లభించాయి.
2.10.75 నుంచి 17.12.76 వరకు ఒక సంవత్సరం రెండు నెలల కాలంలో ఈ నవలను రాశాను. మొదటి కొన్ని భాగాల రాత నడిచింది మైసూరు రామకృష్ణాశ్రమం వేదాంత కళాశాలలోని ఒక గదిలో. తరువాత ఎం.ఎస్.కె. ప్రభు, ప్రభు శంకర్, ఎన్. బాలసుబ్రహ్మణ్యం వ్రాత ప్రతిని చదివారు. ఈ మిత్రులు చదివి చర్చించడం వల్ల వవలను విమర్శనాత్మకంగా చూడడంలో నాకు సహాయం లభించింది. పేరు నిర్ణయించలేక ఊగిసలాడుతున్నప్పుడు హా. మా నాయకగారు ‘పర్వ’ పేరు నిర్ణయించడమే కాక, ముద్రణ భారాన్నంతా చూసుకొన్నారు. ఈ స్నేహితులందరికీ నేను కృతజ్ఞుణ్ణి.
విషయ సమీకరణ, రచనలకు సంబంధించిన ఈ సుదీర్ఘ కాలపరిమితిలో నాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం చేసివ హితైషులు అనేకులున్నారు. ఈ నవలను మొదలుపెట్టి, రాసి, దిద్దుతున్న కొన్ని సందర్భాలలో నా మనస్సు నాక్రమించి వడిపించిన ఆలోచనలు, విషయ సేకరణ, ప్రయాణ, రచనా వివరాలతో ఒక సుదీర్ఘ వ్యాసం రాశాను. నవలా పాఠకుల మీద ఈ ఏభై, అరవై పుటల వ్యాసాన్ని రుద్దడం న్యాయం కాదు కాబట్టి, దాన్ని త్వరలోనే వెలువరిస్తున్న ‘నేనెందుకు రాస్తాను?’ అనే నా వ్యాస సంకలనంలో ప్రచురిస్తున్నాను. అందులో నుంచి ఎంపిక చేసిన కొన్ని అంశాలను ఇక్కడ పొందుపరచడం సముచితంగా భావిస్తున్నాను.
“డా॥ థాకర్ పేర్కొనే కృష్ణుని ద్వారక నిజమనడానికి గాని, కాదనడానికి గాని, తగినన్ని చారిత్రక ఆధారాలను నేను చర్చించి వ్యక్తీకరించలేదు. అది నా ఉద్దేశమూ కాదు. లోథల్, హరప్పా, మొహంజదారో మొదలైన నాగరకతల త్రవ్వకాల గురించి నేను చదివిన వివరాలను నేపథ్యంగా తీసుకొంటే కృష్ణుని ద్వారక అసంభవమేమీ కాదు. అంతకంటే మించి, ఈ ప్రదేశంలో తిరుగుతోంటే, ఈ సముద్ర తీరంలోని లైట్స్ మీద ఎత్తులో నిల్చొని చూస్తోంటే నా మనస్సు పందొమ్మిదివందల డెబ్బై అయిదు నుండి సంపూర్తిగా విముక్తమై యాదవుల కాలంలోకి వెళ్ళిపోయింది. అప్పటి ఊరు, సముద్రం, ప్రజాజీవితం, చుట్టుపట్ల భౌగోళిక వివరాలన్నీ నా అనుభవంలో ముడిపడిపోయాయి. సమకాలీన వస్తువును గూర్చి రాసేటప్పుడు వివరాల కోసం రచయిత తడుముకోనవసరం లేదు. అతనికి తెలియకుండానే అతని అనుభవం పేర్చుకొన్న వివరాలు రచన అవసరానికి తగిన రూపంలో దూసుకొని వస్తాయి. చారిత్రక వివరాలు అతనికి అనుభవంలో లభించక, కేవలం పరిశోధకబుద్ధికి మాత్రం గోచరించడం వల్ల రచనా సమయంలో ద్రవరూపంగా సాక్షాత్కరించవు. అయితే ఇప్పుడు ద్వారక నా అనుభవంలోదేనన్న భావం కలిగింది. యాదవుల ద్వారకలోకి నేను ప్రవేశించాను. అవసరమైనప్పుడు ప్రవేశించడానికి కావలసిన శక్తి, దారుల అవగాహన లభించాయి.
“జయపూర్ జిల్లాలోని విరాటనగరం పక్కలోని ఛోటా కురుక్షేత్ర, లేదా, గోగ్రహణ యుద్ధం జరిగిన చోటుకు దగ్గరే భీముని పేరిట పిలువబడే ఒక గుహ ఉంది. కొత్త దంపతులు ఇప్పటికీ భీముని గుహకు వెళ్ళి పూజ చేస్తారు. నేను వెళ్ళినప్పుడు ఒక జంట వచ్చింది. నేను వరుణ్ణి మాట్లాడించి ‘ఎందుకు పూజ చేస్తున్నావ’ని అడిగాను. ‘నాభార్య మీద ఎవరైనా కన్నువేస్తే వాణ్ణి చంపి పాతెయ్యడానికి భీమదేవుడు శక్తినిస్తాడు’ అని అతడు బదులిచ్చాడు. ఇక్కడైతే భారత లిఖిత కథలోని ప్రజల నమ్మకాలు కూడా కలిసి నిల్చున్నాయి. కీచకుని చంపిన సంఘటన నిజం కాకపోయినప్పటికీ ప్రజల మనస్సులో అది రేకెత్తించే భావం అసత్యం కాదు. ఇక్కడ రచయితకు కావలసిన సత్యం ఏది? ఎలాటిది? భార్యను చెరచడానికి వచ్చినవాణ్ణి చంపిపారేయడమనే ప్రాథమిక ప్రవృత్తి మనందరికీ లేదా? పాశ్చాత్య పురుషులకూ లేదా? ఈ సార్వకాలికమైన, సార్వత్రికమైన పురుషభావం, లేదా, పురుష అహంకారం, పురుష యాజమాన్యం సాహిత్యానికి చెందిన సత్య వస్తువు కాదా?!”
“పద్దెనిమిది అక్షౌహిణులంటే ఎంత? ఎక్కడా కచ్చితమైన సంఖ్య దొరకడం లేదు. మొత్తం మీద ఈ సంఖ్యల గందరగోళంలో పడకుండా, మహాభారత యుద్ధంలో భాగం వహించిన సేనల సంఖ్యను, యుద్ధ క్షేత్ర వైశాల్యాన్ని నేను ఊహించాను. ఆర్యుల అనుభవంలో అంతవరకూ ఎదురుపడని విస్తార స్వరూపమది. ఆర్యావర్తంలోని సమస్త రాజులు భాగం వహించడానికి కారణమేమిటి? సాంప్రదాయిక మహాభారతమేమో ఈ యుద్ధాన్ని ధర్మ యుద్ధమంటుంది. అయితే ధర్మ (= పాండవుల) వ్యతిరేకంగానే అధిక సంఖ్యాకులున్నారు కదా! తీటపట్టినవాళ్ళు యుద్ధం చేసుకోనీ, మనకెందుకు దాని ‘ఊసు’ అంటూ అనేకులు ఊరికే ఉండవచ్చు కదా! ఆర్యుల వ్యవహారం అలాటిది కాదు. జూదం, యుద్ధం, పిల్ల దొరికే స్వయంవరమంటే పరుగెత్తుకొని వచ్చే జాతి అది! డా. ఫడ్కేగారితో పాటు రిక్షాలో కూర్చొని కురుక్షేత్ర ప్రదేశంలో దారి ఉన్న చోటల్లా తిరుగుతోంటే ఈ ఆలోచనలు వచ్చాయి. అంటే ఇది మొత్తం ఆర్య ప్రజల, అలాగే వాళ్ళ సంపర్కంలోకి వచ్చిన ఆర్యేతర ప్రజల జీవితమూ, స్వభావాలను సూచించే యుద్ధం కావాలి నా రచనలోననే భావం మనస్సులో అంకురించింది”
“12-10-75 నుంచి రచన నారంభించిన మొదటి దినం ఒకపుట రాసేపాటికి చాలనిపించింది. రెండోదినం మూడు పుటలు. మొత్తానికి ఎనిమిది పది పుటలు రాసేపాటికి పట్టుదల వచ్చింది. సాహిత్య సృష్టిలో ప్రత్యక్ష, పరోక్షాలంటూ అనుభవాన్ని వింగడించడమే తప్పు. నేను రాసే విషయం అంతా ప్రత్యక్షమే. ఒకటి రెండు వివరాలలోనో, శబ్దాలలోనో ప్రయత్న స్పృహ ఉండవచ్చు. అయితే మూలద్రవ్యం నా అనుభవం నుండి తోసుకువస్తుంది. దానికి ఆ కాలం, ఈ కాలం అనే భేదం లేదనే భావన బలపడ్డది.”
“నేను రాస్తున్నది భారత పాత్రల కథను కాదు. మానవ అనుభవానికి చెందిన వివిధ ఆముఖాలు, రూపాలు, మానవ సంబంధ స్వరూప, వివేచనలనే స్పృహ నాకు చివరిదాకా ఉంది. ఒక్కో కొత్త పాత్రనో, సన్నివేశాన్నో రాస్తున్నప్పుడు వాటి కొత్త కొత్త వివరాలు, రూపురేఖలు దృగ్గోచరమవుతుండేవి.”
“విషయ సమీకరణ, సంసిద్ధతలప్పుడు కొన్ని మజిలీలలో నా ఊహకు సాక్షాత్కరించిన దానికంటే, అభివ్యక్త నవలగా ఇది పొందిన స్వరూపం, అంతర్లీనమైన అర్థాలు పూర్తి భిన్నంగా వచ్చాయి.”
“పర్వ రాసిన అనుభవం నాలో ఒక కొత్తభావాన్ని కలిగించింది. నాకొక కొత్త జన్మనిచ్చింది. మన అనేక విశ్వాసాలకు మూలం రూఢే, పరంపరే, సంప్రదాయమే. వీటన్నిటిని వదిలి జీవితం చివరిలోని చావు దృష్టితో జీవితాన్ని చూస్తే కొత్త అవగాహన, జ్ఞానం పుట్టవచ్చు అనే భావం పెరిగింది. నాకింత వరకు గడచి పోయిన వయస్సెంత? మిగిలిన ఆయుఃప్రమాణం సుమారుగా ఎంత? అంతలోగా చూడగలిగే అర్థం ఏదయినా ఉందా? అనే మూడు మీటల శ్రుతి మనస్సు లోతుల్లో సదా మోగుతున్నట్లుగా చేసింది”
ప్రాదేశిక విద్యా కళాశాల
మైసూరు: 570 006
ఎస్.ఎల్. భైరప్ప
