పూర్ణకవి బైరాగి

“కవనార్థముదయించితిన్” అని అతిశయోక్తిరహితంగా చెప్పగలిగారు చెళ్ళపిళ్ళ. కవితలల్లేవాళ్ళు ఎందరెందరో. తెలుగు గడ్డమీద కవుల పంట ఎల్లవేళలా పుష్కలం. కవనార్థముదయించేవాళ్ళు ఎందరుంటారు?

కవి ద్రష్ట, దార్శనికుడు. మానవాళి వేదన నివృత్తికి అన్వేషించే అంతర్ముఖుడు కవి. శోకమే శ్లోకమైనదట అలనాడు. దుఃఖం ఒక విధంగా ఆవిర్భవించినది పదవిన్యాసం కానీ, లోకద్రష్ట హృదయం నుండి వెలువడే విశ్వజనీన వేదన కాదు. కవనార్థముదయించిన కవి బైరాగి. అతడు కవితలల్లలేదు. లోకం తీరు చూసి తల్లడిల్లాడు. విశ్వవేదన అవగాహనకు రూపమిచ్చాడు.

“స్వీయబాధ వెలువరించడం కవి పరమావధి కాదు. ప్రపంచంతో ఏకమైన నాడే కవి కంఠం సరిగా పలకగలుగుతుందని నా నమ్మకం. ప్రపంచానుభూతితో స్వీయానుభూతి లయమైనపుడే ఉత్తమ కవిత ఉద్భవిస్తుందని నా విశ్వాసం.”

అతడి కవితా ఖండాలలోని ప్రతి అక్షరంలోనూ అతడి విశ్వాసం తొణికిసలాడుతుంది. తెలుగుజాతి గర్వించదగిన పూర్ణకవి బైరాగి. 14 సంవత్సరాల చిన్న వయస్సులోనే బిహార్ రాష్ట్ర హిందీ సాహిత్య సమ్మేళనంలో హిందీ కవిత్వానికి బహుమతి పొందిన బైరాగి, హిందీ ప్రాంతంలోనే స్థిరనివాసమేర్పరచుకొని తన కవనధార హిందీ క్షేత్రానికే అర్పించివుంటే అత్యగ్రశ్రేణి భారతీయ కవిగా నివాళులందుకొనేవాడు. నేటికీ హిందీ సాహితీ క్షేత్రంలో అతడికి గణనీయమైన పీఠం ఉంది. ఆ సంగతి హిందీవారికి తెలిసినంతగా ఆంధ్రులకు తెలియకపోవడం తెలుగుజాతి తెలియమికి మరొక్క తార్కాణం.

బైరాగి మూడు భాషలలో దిట్ట మాత్రమే కాదు, ఆ మూడు భాషల సాహిత్యాలను ఔపోసన పట్టిన అగస్త్యుడు. అతడి ఏకైక దౌర్బల్యం మాతృభాషాభిమానం. తెలుగు సీమకు తెలుగు మాటల్లో విశ్వమానవ వేదన వెల్లడించాడు. ఎవరి కంఠాన్నీ అనుకరించలేదు. ఎవరి బాటనూ అనుసరించలేదు. బైరాగికి అలాంటి అవసరమెక్కడిది? అతడి ప్రతిభ స్వయంవ్యక్తం.

బైరాగి ప్రజాకవి కాదు. ప్రచార కవి అంతకంటే కాదు. అలాంటి స్థాయికి దిగజారడం, కరతాళధ్వనుల కోసం కవితలల్లడం అతడి మూలతత్వానికే విరుద్ధం. అతడు మూకల్ని ఎన్నడూ సంబోధించలేదు, మానవుడిని సంబోధించాడు. మానవకోటి భవితవ్యాన్ని సంస్పర్శించాడు. ఒక ‘సమష్టి ప్రార్థన’ అనే కవితా ఖండంలో దైవాన్ని ఇలా ప్రశ్నిస్తాడు:

“మేము వ్రేలు చీకటంలో సెక్స్ ఉందంటాడు ఫ్రాయిడ్.
మేము కాలు చాపటమే ఆర్థిక విపర్యయాసమంటాడు మార్క్స్.
గంట కొట్టగానే చొంగ కారుస్తూ
పరుగెత్తే కుక్కలమంటాడు పావ్‌లావ్.
ఎలుకల మీద ప్రయోగాలు చేసి చేసి
మీరే ఎలుకలన్నాడొక శాస్త్రవేత్త.
అనుమానం వేస్తున్నది, మేమెవరం ఓ దేవా?
సింహాలకు జూలు అమర్చి, ఏనుగుకు
తొండమిడిన మహానుభావా!”

ఆధునిక భాషలో అనాది సదసత్సంశయమిది. క స్త్వమ్? కోహమ్? కుత ఆయాతా విసృష్టిః? ఇదే కదా యుగేయుగే సంశయం? సమాధానం దొరకనంత కాలం మనవన్నీ ‘నూతిలో గొంతుకలు’ అంటాడు బైరాగి. గర్వాంధత వల్ల అభిశప్తులైన నహుషుల గురించి పాతిక సంవత్సరాల క్రితమే హెచ్చరించిన బైరాగిని ఆనాడు నిరాశావాది అన్నారు నీరస మేధావులు, నిజాన్ని తేరి చూడలేని భీరువులు. మరి ఇవాళ ఏమంటారు? అందుకే బైరాగి ద్రష్ట.

“శ్రీనివాసరావు రాస్తున్నది
మానిషాద కావ్యంలో ఉన్నది”

… అని తనకు తానే కితాబు ఇచ్చుకున్నాడు శ్రీశ్రీ. అలాగే బైరాగి వ్రాసినది భారతంలో ఉన్నది. సదసత్సంశయం తీరలేదు. తీరిపోదన్న పూర్ణకవి బైరాగిని నిరాశావాదిగా చిత్రించడం ఆశావాదం కానేరదు. బైరాగి కవితా తత్వంలో సమ్యక్ దృష్టి గోచరిస్తుంది. అతడి తాత్విక దృష్టి ప్రగాఢమైనదే కాక ప్రఫుల్లమైనది కూడా. బహుశా ప్రాచుర్యం పొందిన అతడి కావ్యం ‘నూతిలో గొంతుకలు’. అందులో అతడు ఆదిమ మానవుడి నుండి అత్యాధునిక మనీషి పర్యంతం మధ్య కాలంలో మానవాళిని వెంట తరుముతున్న నిరవధిక భ్రంశాన్ని సమగ్రంగా చిత్రీకరించాడు. అందులో నాయకులు హామ్లెట్, అర్జునుడు, రాస్కల్నికోవ్. వాళ్ళు ముగ్గురూ సందిగ్ధావస్థలో క్రమబద్ధమైన పతన క్రమాన్ని సూచిస్తారు. బైరాగి కవిత్వ సమస్తానికీ అదే ప్రాతిపదిక. అందువల్లనే అతడు కవులకు కవి.

కురుక్షేత్ర మహాసంగ్రామంలో సూక్ష్మదృష్టితో తిలకించిన దాన్నంతటినీ ఉన్నదున్నట్లుగా కవితా రూపంలో వెలువరించాడు బైరాగి. మానవ మహాసంగ్రామంలో అతడు విదురుడు కాదు, సంజయుడు. అంతకంటే కాడు. అలాంటి భూమికలు “ప్రజాకవులు” నిర్వహిస్తారు. తద్వారా కరతాళధ్వనులు అందుకుంటారు. బైరాగి సంస్కారం అంతకంటే ఉన్నతమైనది. కాబట్టి అతడు టాల్‌స్టాయ్ నవల ‘వార్ అండ్ పీస్’ (War and Peace)లో ఉత్తర భాగంలో పియర్ పాత్ర వలె వ్యవహరించి, ఉత్తమ దార్శనికుడైనాడు. అందుకే ఆధునికాంధ్ర కవులెవరూ చెప్పనిదీ, చెప్పలేనిదీ చెప్పగలిగాడు. కాలం గడిచిన కొద్దీ అతడి కవిత్వ తత్వపు విలువ ఇనుమడిస్తుంది. కాలపరీక్షకు నిలుస్తుంది. భావితరాల వారికి స్ఫూర్తినిస్తుంది.

బైరాగిది విలక్షణమైన కంఠం. తెలుగు భాషపై అతడి అధికారం పరిపూర్ణం, ఆశ్చర్యకరం. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కవితా ప్రౌఢిమకు దీటు కాగలిగిన సంక్లిష్ట యతిప్రాసల వృత్తాలు అవలీలగా, అవసరమైన పట్టుల్లో రచించారు. ఒక ఉదాహరణ:

మృత్యు ప్రేక్షణ నిష్ఠురాంధ భయముల్ మృత్పాత్రవద్గాత్ర సం
భృత్యైషావశ బుద్ధి కల్పితములే; భృంగమ్ము రక్త ప్రసూ
న త్యాగమ్మున కోడి కుందునటు లీ నష్టా సమాధ్వికమున్
సత్యమ్మంచు హృదగ్ర పీఠమున సంస్థాపింతు రంధాత్మకుల్.

మహారాష్ట్ర కవి బాలసీతారామ్ మర్డేకర్ వ్రాసిన “శబరి” అనే ఖండకావ్యాన్ని సుతిమెత్తని తెలుగుపదాల్లో ఇలా అనువదించాడు:

“నెత్తిని నెలగల శబరి విరూపిణి
నిముసపు రేగులు ప్రోవులు పోయును.
ఆట బాటలో ఘంటిని గెలుచును
నిముసాల్లోంచి తెవులు వెలిబరచును
కమ్మని, మెత్తని, మాగిన, ఎర్రని-
పచ్చని పండొక్కటి కని, దానిని
కమ్మని నిముసమ్మును, లాలించును
వ్రేళుల, శబరి కమ్మగా నవ్వును
మానవశాస్త్రమ్ములపై పిడకలు
కొడుతూ రేతిరి మెల్లగ పలుకును
‘సీతాపతి పొరబాటున నైన ఈ
బాట నెన్నడైన వస్తారా?
ఈ రేగుల దారిద్ర్య నైవేద్యం
దయతో వారు స్వీకరిస్తారా?’

‘కార్టూన్ కవిత’లో కూడా సిద్ధహస్తుడనని తెలుసుకోవడానికి కాబోలు, కార్టూన్ కవితా రూపంలో ఇలా వ్రాశాడు:

ఎస్. వాసన్ ఫిల్ము చూచి
ఎస్. రాధాకృష్ణన్-
“తీరే నేడు ఫిలాసఫీ
తీర్చలేని తృష్ణ”
ఉండవులే తలాతోక
ఫిల్ము వింత జంతువు
తాడూ బొంగరముండదు–
తంతున్న వితంతువు

“మనిషి కూడా ఒక మెషీను”
-శ్రీ నెహ్రూగారు.
“మెషీను కూడా మనిషే”
-మెషీన్లకు హుషారు

తిరుమల తిరుపతి కళాశాల
నరుల ప్రసంగాలు
వానరులేమనుకొన్నది
వినకుంటే మేలు

జుత్తుల పరిశోధనకై
ప్రత్యేక విభాగం-
అత్యవసర నిత్యక్రతువు
కేశమేధ యాగం

ఉదాహరణలెన్నయినా చూడవచ్చును. భాషార్ణవంలో, భావజలధిలో గజఈతగాడు బైరాగి.


పాతిక సంవత్సరాలకు కొంచెం ముందు రోజుల మాట. మద్రాసులో ‘తెలుగు స్వతంత్ర’ సంపాదకుడిగా నేను పనిచేస్తున్న రోజులవి. ఒక సెలవురోజు మధ్యాహ్నం, మేడ మీద మారుమూల గదిలో పుస్తకం చదువుతూ కూర్చున్నాను. సరాసరి గదిలోకి వచ్చి “నా పేరు బైరాగి” అని పరిచయం చేసుకున్నాడు. అప్పటికి ఒకటో రెండో అతని కవితలు ‘తెలుగు స్వతంత్ర’లో ప్రచురించాను. ఆ నిమిషం వరకూ అతడిని చూడలేదు. అతడి గురించి ఏమీ తెలియదు కూడా. మామూలు అతిథి సత్కారాలు పూర్తయ్యాక, సిగరెట్టు మీద సిగరెట్టు వెలిగిస్తూ కూర్చున్నాడు. కొంతసేపు ఇద్దరం మౌనంగా గడిపాము. హఠాత్తుగా “‘Crime And Punishment’లో రాస్కల్నికోవ్ పాత్ర ఎంతవరకూ అర్థమైంది?” అని అడిగాడు. ఏం జవాబు చెప్పాలో నాకు తోచలేదు. ఆ పాత్ర నాకు పూర్తిగా అర్థం కాలేదని చెప్పాను. అతడితో దాని మీద చర్చ ప్రారంభమైంది. మధ్యే మధ్యే కాఫీలు, సిగరెట్లు. చర్చ మాత్రం ముగియలేదు. రాత్రి తొమ్మిది గంటలు దాటాక ఇద్దరం కలిసి భోజనం చేశాక కూడా చర్చించవలసింది ఇంకా మిగిలింది.

అది మొదలు వారానికి కనీసం నాలుగైదు రోజులు ఇంటికి వస్తూ ఉండేవాడు బైరాగి. అనుకోకుండానే ఇద్దరం ఆత్మీయులమైనాము. రాస్కల్నికోవ్ పాత్ర చర్చతోనే ‘నూతిలో గొంతుకలు’ కావ్యం ఆవిర్భవించింది. ‘తెలుగు స్వతంత్ర’లో వెలువడింది. ఆ రోజులలో ఇంచుమించు అతని రచనలన్నీ ‘తెలుగు స్వతంత్ర’లోనే ప్రచురితమైనాయి. ఆగంతకంగా ఆనాటి మధ్యాహ్నం నా గదిలోకి వచ్చిన బైరాగి కొద్ది రోజుల్లోనే నా గుండెల్లో చోటు చేసుకున్నాడు. కుటుంబంలో ఒక సభ్యుడిగా స్థిరపడ్డాడు. అప్పట్లో స్నేహితులూ, పరిచితులూ అందరూ ఆశ్చర్యపోయేవారు. మనుషులకు దూరంగా ఉండే బైరాగి, లోకాన్ని మాత్రం నిశితంగా పరిశీలించేవాడు. అందరితోనూ ముభావంగా ఉండి, ఎవర్నీ దరికి చేరనివ్వని బైరాగి, నా ఇంట్లో అహర్నిశలు గడపడం నలుగురికీ వింతగా ఉండేది.

బైరాగి చాలా విలక్షణ వ్యక్తి. నా సొంత విషయాలు ఎన్నడూ అడగలేదు. తన సొంత విషయాలు ఒక్కసారైనా ప్రస్తావించలేదు. కవిత్వం గురించీ, పుస్తకాల గురించీ, దర్శనాల గురించీ, తత్వశాస్త్రం గురించీ తప్ప వ్యక్తుల గురించి బైరాగి పొరపాటునైనా ఎన్నడూ మాట్లాడలేదు. అలా నాలుగు సంవత్సరాలపాటు చాలా సన్నిహితంగా గడిపాం. అంతే, ఆ తరువాత మరి కనపడలేదు. ఆగంతకంగా ఎలా వచ్చాడో అలాగే నిష్క్రమించాడు.

నాలుగు సంవత్సరాల ప్రగాఢ అనుబంధం పిమ్మట అతడి జాడ కూడా తెలియలేదు. అంతేకాక, నా కుటుంబ సభ్యులందరి హృదయాలలోనూ శాశ్వతమైన ముద్రలు వేశాడు. ఆ విధంగా నాకు అనిర్వచనీయమైన ఒక సంపదనందించాడు. దశాబ్దాల అనంతరం హైదరాబాద్‌లో అతని సోదరుడు శ్రీ సత్యం ఇంట్లో చూశాను. అప్పటికే బైరాగి అస్తమిస్తున్నాడు. నన్ను చూసి పోల్చుకోలేదు. వారం రోజులు తిరగకుండానే శాశ్వతంగా కన్నుమూశాడు. అతడిని తలచుకున్నప్పుడల్లా గుండెల్లో ఏదో నొప్పి. బైరాగి మరణించాడనే కబురు అందగానే నాకు అతడి గేయమే జ్ఞాపకం వచ్చింది.

“ఇది ముందే ఎందుకు చెప్పావు కావు?
ఇది మొదటే ఎందుకు చెప్పావు కావు?
తూరుపు కొంజిగురు కెంపు మాయక ముందు
పగటి హంగుల అంగడులు తీయక ముందు
వివిక్త వాంఛా వీథుల యుద్ధ విరమణ వేళయందు
దూరపు తీరపు పిలుపు వినిపించే వీలున్నప్పుడు
మొదటే నీవు ఎందుకు చెప్పావు కావు?”

బైరాగి చెప్పలేదు. అదే నా బాధ. అతడి కవితా ఖండాలన్నీ పుస్తకాల రూపంలో వెలువడితే ఆ బాధ కొంచెం ఉపశమిస్తుంది. ఆంధ్ర సాహితీ జగత్తుకు కొండంత సంపద చేకూరుతుంది.

(ఆలూరి బైరాగి సంస్మరణ సంచిక-1979)