పడమట వాలుతోంది రవిబింబం,
వాడి మాడి వీడినది పోడుములు కలుషాలిప్తం కిరణకదంబం
వికల విహగ కలకంఠ నినాదం
చిలుకుతోంది ఇలపై అవసాదం.
శ్లోకానికి స్వాగతశ్లోకంలా, ఘూక రవానికి లేదు విలంబం.
శిథిలహృదయ మందిరద్వారం కడ
నిరాలోక వేదికకు చేరబడి
రేయి గడప జూచె ఒంటరినిక నంటదు ప్రత్యాగమ సంరంభం.
పశ్చిమ గగన చితానల రేఖలు
రచించాయి నైశాగమ లేఖలు
సంధ్యా చరమఘోషలో రజనీ ప్రథమాంకానికలస విష్కంభం.
కీచుకీచుమని కీచురాళ్ళ రొద
చెబుతున్నది పుంతల వింతల సౌద
ఊరిచివర నొక పూరిగుడిసెలో రగిలిన దివ్వె రేయి కవలంబం.