నిరంతర స్వేచ్ఛాజీవి బైరాగి

బైరాగి అనే పేరులోనే ఒక ప్రత్యేకత వుంది. చాలామంది అది ఆయన పెట్టుకున్న కలం పేరు అనుకునే వారు. కాని వాస్తవంలో తల్లిదండ్రులు ఆ కవికి స్వయంగా పెట్టిన పేరే బైరాగి.

ఆ తర్వాత హేతువాదిగా ఎదిగిన ఆ కవికి మరెవరో ఆయన కులం పేరు చౌదరిని తగిలించి సంతోషపడ్డారు. కాని వాస్తవంలో సంఘంలో వున్న వర్గాల తేడాలను ఛీత్కరించిన సంస్కారి ఆలూరి బైరాగి.

పుట్టిన పిల్లలు బతకక పోతే ఏదో ఒక తమాషా పేరు పెట్టటం అలవాటుగా వున్న 1920ల కాలంలో ఆయనకు బైరాగి అని పేరు పెట్టారు తల్లిదండ్రులు.

1925లో సెప్టెంబర్ 5న తెనాలి లోని అయితానగరంలో పుట్టాడు బైరాగి. ఆయన పినతండ్రి తెలుగు సినీరంగ ప్రముఖుడు చక్రపాణి అని పిలువబడిన ఆలూరి సుబ్బారావు.

బైరాగి స్కూలు విద్యకూడా సరిగా పూర్తిచేయలేదు. స్వాతంత్య్ర పోరాట సమయంలో హిందీ వ్యాప్తికి జరిగిన ఉద్యమాన్ని స్వాగతించినవారు ఆంధ్రులు.

అటువంటి ఆంధ్రా ప్యారిస్ తెనాలినుండి హిందీ నేర్చుకునేందుకు 13వ ఏట ఉత్తర భారతం వెళ్ళి 15వ ఏటనే హిందీలో కవిత్వం చెప్పి హిందీ మాతృ భాషగా గలవారిని మెప్పించటం బైరాగికే చెల్లింది.

17 ఏళ్ళ వయస్సులో తల్లిని కోల్పోయిన బైరాగి మనసు విచలితమయింది. బాగా కుంగిపోయాడు. ఆ వెలితినుండి బయటపడేందుకు నాలుగేళ్ళపాటు జాతీయోద్యమంవైపు మళ్ళాడు. రాడికల్ హ్యూమనిస్టు ఎమ్.ఎన్.రాయ్ సిద్దాంతాలవైపు ఆకర్షితుడయ్యాడు. అయితే ఎవరో ఏదో చెపితే దానిని గుడ్డిగా అనుసరించే వ్యక్తిత్వం కాదు బైరాగిది.

గుంటూరు జిల్లాలోని గ్రామంలో బైరాగి హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆ తరువాత తన బాబాయి చక్రపాణి కోరికమీద చందమామ హిందీ భాష పత్రికకు సంపాదకుడయ్యాడు. హిందీ కవితల సంకలనం విడుదల చేశాడు.
ప్రముఖ తెలుగు కవుల కవిత్వాన్ని హిందీలోకి అనువదించి అందించాడు. ఏమి చేస్తున్నా తన స్వేచ్ఛా జీవనాన్ని మాత్రం వదులుకోలేదు.

ఎంత ఆత్మీయుడైనా తేడా వస్తే తెగతెంపులేనన్న ట్టుగా వుండేది బైరాగి వ్యవహారం. అందరూ స్థిర జీతంతో, చక్కని నగరంలో మంచి ఉద్యోగం వస్తే చాలనుకునే కాలంలో మూడువందల రూపాయల జీతం వచ్చే సంపాదకుడి ఉద్యోగాన్ని సొంత బాబాయితో వచ్చిన విభేదాలతో వదులుకున్నాడు.

తన జీవితం గురించి, తన భవిష్యత్తు గురించి బైరాగికి ఎటువంటి బెంగాలేదు. తనకుతానుగా ఎటువంటి గుర్తింపు కోరుకోలేదు. సన్మానాలు, సత్కారాలకు పూర్తిగా దూరం. చదువుకోవటం, మనసుకు తోచినది రాయటం, రాసింది కూడా వేగంగా అందరికీ చేరాలన్న కోరిక తక్కువే.

ఎవరికీ తన గురించి తెలియకుండా వుంటేనే మంచిదన్న ఆలోచనలో బైరాగి దాదాపు రెండు దశాబ్దాలపాటు హైదరాబాద్ నగరంలో తమ్ముడింట వుండిపోయాడు. చందమామ ఉద్యోగం వదిలే నాటికి బైరాగి వయసు 30 ఏళ్ళే. అయినా ఆయనకు వివాహం చేసుకోవాలన్న ఆలోచన లేదు.

తన స్వేచ్ఛకు వివాహ బంధం ఒక ఆటంకం అనే చివరిరోజువరకు భావించాడు. పైగా వివాహం చేసుకున్న వారెవరైనా సుఖంగా ఉన్నారా! అంటూ ఎదురుప్రశ్నలు వేసేవాడు.

బైరాగి కోరికలు పరిమితం, నిరాడంబరంగా జీవితం గడిపేవాడు. ఆయనకున్న ఆదాయం పరిమితం. తనకంటూ సొంత ఇల్లు లేదు. తమ్ముడి ఇంట్లో తలదాచుకోవటంవంటి జీవితం.

ఇతరులను, అది తన సొంత సోదరులనైనా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా జీవితం గడిపేవాడు. తన అవసరాలను తగ్గించుకున్నాడు.

ఎవరినీ చేయి చాచి అడగటం అనే అలవాటు చివరిరోజువరకు బైరాగికి లేదు. ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరిగి వెళ్ళిపోక తప్పదన్న ఫిలాసఫీ బాగా వంటపట్టించుకున్నవాడు బైరాగి, దేనికీ భయపడవలసింది లేదు. చేతిలో లేని వాటిగురించిన ఆలోచన లేదు. ఏదో కావాలన్న కోరిక లేదు.

అనారోగ్యం వచ్చినప్పుడు చికిత్స చేయించుకుంటూ జీవితకాలాన్ని పొడిగించుకోవటం అసలే ఇష్టంలేదు. తాను రాసిన కవితలు దాదాపుగా ఐదారు వందల పేజీలవి, హిందీ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అలా ఒక పెట్టెలో ఉంచేశాడు.

‘మృత్యువు వచ్చినప్పుడు కౌగిలించుకునేందుకు సిద్ధం నేనెప్పుడూ’ అంటూ బైరాగి వైద్యం చేయించుకోలేదు. ఎంతమంది ఆత్మీయులు చికిత్స చేయిస్తామన్నా వద్దని సుతిమెత్తగా తిరస్కరించాడు.

తన నిరాసక్తత, తన వైరాగ్యం తనలోనే ఇముడ్చుకుంటూ తన 53వ ఏటనే ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు బైరాగి. తన పేరును సార్థకం చేసుకుంటూ బైరాగిలాగానే బతికి, మరణం తర్వాత కవిగా మరింత గొప్పగా బతికినవాడు ఆలూరి బైరాగి.