బహు సుందరుడు సుందరకాండ చందురుడు

వాల్మీకి రామాయణం-విశ్వనాథ కల్పవృక్షంలో చంద్ర వర్ణనల తులనాత్మక పరిశీలన

వాల్మీకి మహర్షి రచించిన ఆదికావ్యం శ్రీమద్రామాయణం ఒక మహావృక్షమైతే, దాని స్ఫూర్తితో తెలుగు నేలపై మొలకెత్తిన అద్భుత వృక్షం కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్రామాయణ కల్పవృక్షం. ఆదికావ్యంలోని ఎన్నో ఘట్టాలను విశ్వనాథ వారు తమదైన ప్రతిభతో, తెలుగు నుడికారంతో, ఉదాత్త కల్పనలతో పునస్సృష్టించారు. అటువంటి ఒక రమణీయమైన ఘట్టం సుందరకాండలో హనుమంతుడు లంకలో అడుగుపెట్టే సమయంలోని చంద్రోదయ వర్ణన. వాల్మీకి తన మహత్తరమైన శైలిలో కొద్ది శ్లోకాలలో వర్ణిస్తే, విశ్వనాథ ఆ భావనను స్వీకరించి, తనదైన ఆధ్యాత్మిక చింతనను, లోకజ్ఞతను జోడించి ఇరవై పద్యాల గీతమాలికగా అల్లారు. ఈ రెండు కావ్యాలలో చంద్రుని వర్ణించిన తీరును తులనాత్మకంగా పరిశీలించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం.


వాల్మీకి రామాయణంలో హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకలో అడుగుపెట్టేసరికి సూర్యుడు అస్తమించి ప్రదోషకాలం ఆసన్నమవుతుంది. ఆ సందర్భంలో రెండు శ్లోకాలతో చంద్రోదయాన్ని వర్ణిస్తాడు వాల్మీకి. అలాగే శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో కూడా సముద్రాన్ని దాటేటప్పుడు ఆటంకం కలిగించిన సింహికను వధించి లంకానగరం చేరే సమయానికి సంధ్యాసమయం అయినట్టుగా సూచిస్తూ విశ్వనాథ వారు సూర్యాస్తమయాన్ని, సంధ్యా సమయాన్ని, చంద్రోదయాన్ని కలిపి, ఒక అద్భుతమైన ఊహతో సముద్రాన్ని లంఘించిన ఆంజనేయస్వామి సింహికను తన పిడికిలి గుద్దుతో మట్టుకొలిపిన తన ఉగ్ర స్వరూపాన్ని మార్చుకున్న వైనంతో సమన్వయిస్తూ సుందరకాండలో పూర్వరాత్ర ఖండంలో 125వ పద్యంలో ఇలా వర్ణిస్తున్నారు:

చ.
రాతిరి సూర్య దేవుడు కరప్రకటోగ్ర సహస్ర మండలం
బాతత శౌర్యవంతుడునునై యుపసంహృతి చేసి చంద్రమ-
స్స్ఫీత మనోజ్ఞ బింబమున జేర్చెడునట్టుల రాయబారి తే-
జోతివిలీనుడై చనుట యందు బ్రసన్నత సంగ్రహించెడున్

రాత్రి అయ్యే సరికి సూర్యదేవుడు పగలంతా సహస్ర మండలాలన్ని ప్రకాశింపజేసిన తన ప్రచండ కిరణాలను ఉపసంహరించుకుని చల్లదనంతో నిండిన మనోహరమైన చంద్రబింబంలో చేరినట్టుగా, రాయబారిగా వచ్చిన హనుమంతుడు సింహికను వధించిన తన ప్రచండ ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకుని ప్రసన్నత చెందాడు.

ఇదే సందర్భంలో పైన చెప్పినట్టు వాల్మీకి రామాయణంలో రెండవ సర్గ చివర్లో రెండు శ్లోకాలు (57 & 58) ఉంటాయి. అందులో ఇది మొదటి శ్లోకం:

చన్ద్రోపి సాచివ్యమివాస్య కుర్వం
స్తారాగణైర్మధ్యగతో విరాజన్ ।
జ్యోత్స్నావితానేన వితత్య లోకమ్
ఉత్తిష్ఠతే నైకసహస్రరశ్మిః ॥

ఆ సమయంలో అనేక సహస్రముల కిరణాలతో చంద్రుడు కూడా, అసంఖ్యాకమైన నక్షత్రాల సమూహం మధ్య ప్రకాశించుచూ, వెన్నెల అనే ప్రకాశవంతమైన ఛత్రంతో ప్రపంచాన్ని కప్పి వేస్తూ, హనుమంతుడికి సచివుడు అంటే ఒక మంత్రిలా తన సహాయ సహకారాలు అందించడానికి వచ్చాడా అన్నట్టు పైకి లేచాడు. ఇదీ ఆ శ్లోకార్థం.

ఇంక ఇదే సందర్భంలోని రెండవ శ్లోకం విషయానికొస్తే ఆ శ్లోకంలోని భావాన్ని యథాతథంగా అదే అర్థంతో విశ్వనాథ కల్పవృక్షంలో చంద్రవర్ణనలకు శ్రీకారం చుడుతూ మరో చోట ఉపయోగించారు. ప్రస్తుతానికి ఆ విషయం పక్కన పెట్టి కథలోకి వస్తే, నెమ్మదిగా ప్రధాన ప్రాకారాన్ని దాటిన హనుమంతుడు లంకానగర ప్రవేశం చేయడానికి కృతకృత్యుడవుతుండగా అడ్డగించిన లంకిణిని ముష్టిఘాతాలతో నేలకూల్చి, తన వానర స్వరూపాన్ని చూస్తే శత్రు గూఢచారులు గుర్తిస్తారనే అనుమానంతో పరిమాణంలో తగ్గిపోయి మహా ప్రాకారం దాటి లంకా పట్టణంలో అడుగు పెట్టబోయేసరికి చంద్రుడు ఆకాశంలో మరికొంత పైకి చేరుకుంటాడు. ఈ సందర్భంలో వచ్చే పద్యంలో, పండు వెన్నెల్లో లంకాపట్టణ శోభ మరిన్ని వన్నెలు ఎలా సంతరించుకుందో కవిసమ్రాట్ తన ఊహాపటిమకి పదును పెడుతూ పూర్వరాత్ర ఖండంలోని 161వ పద్యంతో ఇలా వర్ణిస్తున్నారు:

సాగెన్ మిన్ను నయందు గొంత పయికిన్ జాబిల్లి హల్లీసక
శ్రీగంధంబగు జ్యోత్స్న కృత్స్న పలలాశి ప్రౌఢరత్నాంశు ధా
రాగేహంబులకాంతి లోపలి మహాప్రాకారపున్ లోపలన్
సాగెన్ దివ్వియ పైని గుగ్గిల మొగిన్ జల్లంగ నైనట్టులై.

ఆకాశంలో మరికొంత పైకి సాగిపోతున్న చంద్రబింబం చుట్టూ వెలిగిపోతున్న కిరణాల జ్యోత్స్న, ఒక హల్లీసకం (జానపదులు ఆడే మండల నృత్యం, అరకు ఆడపడుచులు చేసే ధింసా/గోండు డాన్స్ లాంటిది) మాదిరిగా గుండ్రంగా తిరుగుతూ జాబిల్లి నుంచి వెదజిమ్ముతున్న కాంతులు లంకానగర మహాప్రాకారం లోపల దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న కట్టడాలనుంచి, రాక్షసులు ధరించిన రత్నాల దుస్తులు, ఆభరణాలనుంచి వ్యాపించిన వెలుగుపైన పడిన తీరు అగ్గి మీద గుగ్గిలంలా అనిపిస్తోందట.

కేవలం కవిసమ్రాట్ మాత్రమే ఇటువంటి ఊహ చెయ్యగలరేమో. “మదికి నుదాత్త కల్పనల మక్కువ కలిగిన కల్పవృక్షం చదవమని…” అని మరి ఊరికే అన్నారా? నిజంగానే ఉజ్వలంగా మండుతున్న బొగ్గుల మీద గుగ్గిలం చల్లితే వచ్చే వెలుగును ఒకసారి ఊహించుకుని పై పద్యం మరోసారి చదవండి. విశ్వనాథ వారి కల్పనకి మనసు పులకించిపోతుంది.

ఆ తరువాత ఆంజనేయుడు లంకానగరపు విశేషాలు, రాక్షస వికృత చేష్టలు చూస్తూ ఒక తోటలోకి అడుగుపెడతాడు. అక్కడ వెన్నెల పరచిన తిన్నెలు చూసి పరవశించి పోతూ చంద్రుణ్ణి చూస్తాడు. అప్పుడు వచ్చే చంద్ర వర్ణన పద్యాలు కేవలం కల్పవృక్షం, సుందరకాండలోనే కాదు తెలుగు సాహిత్యంలోనే అత్యంత రమణీయమైనవిగా సాహిత్య విశ్లేషకులు పరిగణిస్తారు.

ఇవన్నీ ఒక ఇరవై పద్యాల్లో (పది తేటగీతి, పది ఆటవెలది) ఒకే మకుటంతో ఉంటాయి. ఈ పద్యాలన్నీ, విశ్వనాథ సత్యనారాయణగారు శ్రీమద్రామాయణ కల్పవృక్షం అవతారికలో ప్రకటించినట్టు, “కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశములయందు తొంబదియైనపాళ్ళు, రసము వేయి రెట్లు గొప్పది నవకథా దృతిని మించి” అన్నట్టు రసభూయిష్టంగా, వాల్మీకి ఎనిమిది శ్లోకాలలో వర్ణించిన చంద్రుణ్ణి తన ప్రతిభతో అత్యంత రసవత్తరంగా, “నా భక్తి రచనలు నావి” అన్నట్లు తన కోణంలో ఆధ్యాత్మికంగా, “నాది వ్యవహారభాష మంథరము శైలి; తత్త్వము రసధ్వనులకుఁ బ్రాధాన్యమిత్తు రసము పుట్టింపంగ వ్యవహారము నెఱుంగ జనును; లోకమ్ము వీడి రసమ్ములేదు” అన్నట్లు తెలుగింటి వ్యవహారాలను మంథరమైన శైలితో రసధ్వనికి ప్రాధాన్యమిస్తూ లోకాన్ని మించిన రసాస్వాదన లేనే లేదంటూ చంద్రుణ్ణి వివిధ కోణాల్లో అద్వితీయంగా ఆవిష్కరించారనడం అతిశయోక్తి కానే కాదు.

“ఒక్క వాల్మీకి కాక వేరొక్కడెవడు సుకవిశబ్ద వాచ్యుండు? ఈ సంసార మిదెన్ని జన్మముల కేనీ మౌని వాల్మీకి భాషా సంక్రాంత ఋణంబు తీర్చగలదా? తత్కావ్య నిర్మాణరేఖా సామగ్రి ఋణంబు తీర్చగలదా?” అంటూ తనని తానే ప్రశ్నించుకుని, దానికి తన వంతు కృషిగా ఆ “ముని ఋణంబు దీర్ప నీ కావ్యమును రచింతు” నన్న కవిసమ్రాట్, కల్పవృక్షంలో ఈ సుందర పద్య కుసుమాలన్నిటితో చంద్రునికో చంపకమాల వేస్తున్నట్టుగా ఈ చంద్రవర్ణనలని చంపకమాల వృత్తం తోనే ప్రారంభించారు. ఆ పద్యానికి మాతృక వాల్మీకి రామాయణంలో ఇంతకు మునుపు ప్రస్తావించిన రెండవ సర్గలో చివరి శ్లోకం:

శఙ్ఖప్రభం క్షీరమృణాలవర్ణ
ముద్గచ్ఛమానం వ్యవభాసమానమ్.
దదర్శ చన్ద్రం స హరిప్రవీరః
పోప్లూయమానం సరసీవ హంసమ్

పై శ్లోకానికి భావం ఏమిటంటే: అప్పుడు ఆ వానర వీరుడు ఆంజనేయుడు తెల్లని శంఖం లాగ ప్రకాశవంతంగా, పాలు మరియు తామర తూళ్ళ రంగులో మెరుస్తూ, ఆకాశమనే సరస్సులో ఈదుతూ ఎంతో మనోహరంగా అటూ ఇటూ తేలియాడే హంస లాగ ప్రయాణిస్తున్న చంద్రుణ్ణి గమనించాడు.

ఇక ఈ వాల్మీకి శ్లోకానికి వానర శ్రేష్టుని పరవశాన్ని కూడా జతచేసి అల్లిన పూర్వరాత్ర ఖండంలో 177వ పద్యంలో విశ్వనాథ అనుసరణ, అనుసృజన చూడండి.

తళ తళలాడె వెన్నెలలు తత్కపి ధూర్జటి నేత్ర వారిజం
బుల బులకాంకురంబులుగ బొందె బురానను భూత సౌఖ్యమం
జులతను వానరేశ్వరుడు చూచె మొగంబు మలంచి వెండి చా
యల తళుకారు నీళ్లుల వియత్కమలాకర రాజహంసమున్

అప్పుడు లంకాపురి తోటలోకి ప్రవేశించిన ఆ కపి ధూర్జటి అంటే ఆంజనేయుడి కమలాల వంటి కళ్ళల్లో తళ తళలాడుతున్న వెన్నెలలు ప్రతిఫలిస్తుంటే అప్పుడు స్వామి అంతకుమునుపు ఎన్నడూ అనుభవించని ఒక అందమైన సౌఖ్యాన్ని పొంది పులకరించిపోతూ తల పైకెత్తి చూస్తే అప్పటికి అక్కడ ఆకాశం మధ్యలోకి వచ్చేసిన చంద్రుడు, ఆకాశగంగలో తళ తళలాడుతున్న వెండి రంగు నీళ్లలో తెల్లగా మిలమిల్లాడుతూ ఆకాశమనే సరస్సులో రాజహంసలా కనబడ్డాడట.

ఇక్కడి నుంచి ఆ గగన మధ్యస్థుడైన చంద్రుణ్ణి వర్ణిస్తూ వాల్మీకి రామాయణంలో ఎనిమిది శ్లోకాలలో ఒక ఋషిగా మారిన బోయవాని ప్రపంచంలో కనబడే వస్తు వైవిధ్యాలతో ముగ్ధ మనోహరంగా వర్ణించబడ్డ భావాలని కేవలం అక్కడక్కడ కొద్దిగా స్పృశిస్తూ తనదైన ఒక ప్రౌఢ శైలిలో స్వకపోల ఊహలతో ఎంతో భిన్నంగా చంద్రుణ్ణి ఆవిష్కరిస్తారు విశ్వనాథ.

వాల్మీకం లోని పంచమ సర్గలో మొదటి శ్లోకం:

తతః స మధ్యంగతమంశుమన్తం
జ్యోత్స్నావితానం మహదుద్వమన్తమ్
దదర్శ ధీమాన్ దివి భానుమన్తం
గోష్ఠే వృషం మత్తమివ భ్రమన్తమ్

మొదటి రెండు పాదాలలో ఉన్న, చంద్రుడు ఆకాశం మధ్య భాగంలో తెల్లని కిరణాలతో గొప్పగా ప్రకాశిస్తూ తన దట్టమైన వెన్నెలను అన్ని వైపులా వ్యాపింపజేస్తున్నాడు, అనే భావాన్ని తీసుకుని కల్పవృక్షం సుందరకాండ పూర్వరాత్ర ఖండంలో 178 నుంచి 197 వరకు వచ్చే ఇరవై పద్యాలకి తేటగీతి పద్యాలయితే “చెలగె నడిమింట గలువపూ చెలిమికాడు” అనే మకుటం తోను, ఇంచుమించు అదే అర్థంతో” ఆటవెలది పద్యాలయితే “చెలగె మింట గలువ చెలిమికాడు” అనే మకుటంతోను చివరిపాదాన్ని రచించారు విశ్వనాథ. వాల్మీకి రామాయణంలోని పంచమ సర్గలో అన్ని శ్లోకాలు అంత్య ప్రాసతో ఉండడం ఈ చంద్ర వర్ణన పద్యాలకు ఒకే మకుటం ఇవ్వడానికి ప్రేరణ అయ్యుండచ్చు. ఇంక పద్యాల విషయానికొస్తే, ఒకొక్క పద్యం మనసుని ఆహ్లాద పరిచే చంద్రుని అమృత కిరణమే. కవితామాధుర్యాన్ని జుర్రుకున్న వాళ్ళకి జుర్రుకున్నంత. పదండి ఆస్వాదిద్దాం.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 178వ పద్యం:

అప్సరోరత్నమును రావణాపనీత
రంభ వెదకంగ నలకూబర ప్రణిధియు
దెగువయై స్పష్టమూర్తి యేతెంచె ననగ
జెలగె నడిమింట గలువపూ చెలిమికాడు

ఎదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వరభారతి దీప్తి కల్గిన నా కల్పవృక్షం చదవమని ఎందుకన్నారో అన్న విషయాన్ని సమర్థించుకోడానికి కాబోలు చంద్రుని వర్ణనలో విశ్వనాథ రంభను రావణుడు అపహరించిన పురాణ కథను ప్రస్తావిస్తూ ఆ అపహరించబడిన అప్సరసలలో ప్రథమురాలైన రత్నం లాంటి రంభను వెతకడానికి రంభ ప్రియుడైన నల కూబరుడు నియమించగా బయటపడినా పర్వాలేదని తెగించి మరీ లంకను గాలించడానికి వచ్చిన గూఢచారి (ప్రణిధి) లాగ ఉన్నాడట చంద్రుడు.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 179వ పద్యం:

దైత్యుడాశ్రిత పారిజాతంబు నిలుప
గగన శరవణ మధ్య లక్ష్యంబు చూచి
పోవ వచ్చిన నందిమూపురమనంగ
జెలగె నడిమింట గలువపూ చెలిమికాడు

దైత్యేశ్వరుడయిన రావణాసురుడు, ఆశ్రిత పారిజాతంబు — అంటే శివుడి ఆత్మలింగాన్ని తనతో తీసుకు వస్తూ వినాయకుని బాల్య చేష్టలతో సముద్రపు ఒడ్డున ప్రతిష్టించిన కథని గుర్తు చేస్తూ విశ్వనాథ వారు ఈ పద్యాన్ని రచించారనుకోవచ్చు. లంకాపురాన్నంతా ఆవరించివున్న ఉన్న సముద్రపు ఒడ్డున ప్రతిష్టించిన శివలింగాన్ని దర్శించడానికి వెన్నెల అనే రెల్లు దుబ్బలతో నిండిపోయి ఉన్న ఆకాశవీధుల్లో సంచరిస్తూ వస్తున్న నందీశ్వరుడు ఆ రెల్లు దుబ్బల చాటున ఉన్న తన శరీరం కనబడకుండా కేవలం మూపురం మాత్రమే కనపడితే ఎలా ఉంటుందో చంద్రుడు అలా ఉన్నాడట. నిజమే మీరెప్పుడైనా వెన్నెల్లో సముద్ర తీరంలో గాని, మరెక్కడైనా గాని గాలికి ఎగరుతున్న రెల్లు గడ్డి పొదలను చూడండి ఎంత మనోహరంగా ఉంటుందో, వాటి వెనకాతల నడిచి వెళుతున్న తెల్లని మూపురమున్న ఏ జంతువునైనా ఊహించుకోండి. కవి సమ్రాట్ ఉదాత్త కల్పన అవగతమవుతుంది. సుందరకాండ పంచమ సర్గ లోని మొదటి శ్లోకంలో చివరి రెండు పాదాల్లోని “దట్టమైన వెన్నెలను అన్ని వైపులా వ్యాపింపజేస్తూ, గోశాలలో మదించి తిరుగుతున్న ఆంబోతులాగ తెల్లని వెలుగులు చిమ్ముతున్న చంద్రుణ్ణి దర్శించాడు” అనే భావాన్ని గ్రహించి ఆ వృషభానికి నందీశ్వరుడి హోదా ఇచ్చి రచించిన మరో ఆణిముత్యం ఈ విశ్వనాథ పద్యం.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 180వ పద్యం:

ఆ యెచటొ యున్న యైరమ్మదీయ సరసి
లోని వెన్నెల జలములీ లోకమందు
బాఱుదల కేర్పరచు వెలిపైడి తూము
చెలగె నడిమింట గలువపూ చెలిమికాడు

అక్కడెక్కడో ఆకాశంలో మనెవ్వరికీ కనిపించకుండా మెఱుపుతీగల కాంతులతో ప్రకాశించే ఐరమ్మదీయ సరస్సు ఒకటుందట. ఆ సరసంతా వెన్నెలనీరు నిండి ఉంటుందట. ఆ వెండి నీటిని భూమ్మీదకి పంపించాలనే ఆలోచనతో పాఱుదల కోసం ఎవరో ఒక వెలిపైడి అంటే తెల్లని బంగారపు లేదా వెండి తూముని ఏర్పాటు చేసారట. అదిగో వెన్నెల నీరు ప్రవహిస్తున్న ఆ నీటి గొట్టపు గుండ్రని తూములా కనబడుతున్నాడట చంద్రుడు.

విశ్వనాథ వారు అవతారికలో ప్రకటించిన “సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్రరహస్య వివేకమబ్బినన్” అనే వాక్యానికి ఉదాహరణ ఈ గొప్ప పద్యం. ఈ పద్యం గురించి భైరవభట్ల గారి బ్లాగులో గతంలో ఒక దీర్ఘ చర్చ జరిగినప్పుడు విశ్వనాథ వారి ఒక కల్పవృక్ష రహస్యం నా మట్టి బుర్రకి, పామర బుద్ధికి కూడా బాగా అర్థమయ్యింది. ముఖ్యంగా యైరమ్మదీయ సరసి గురించి.

ఛాందోగ్యోపనిషత్తులో యీ “ఐరమ్మదీయ” సరస్సు గురించిన ప్రస్తావన ఉంది. దాని ప్రకారం బ్రహ్మలోకంలో అర, ణ్య అనే పేరుగల సముద్రాలు, వాటి మధ్య ఐరమ్మదీయ అనే సరసు ఉందట. దాని పక్కగా, నిరంతరం సోమరసం వర్షించే రావిచెట్టు ఒకటుంటుందట. సోమరసం అంటే చంద్రుని రసం అంటే వెన్నెల అనే అర్థం వస్తుంది కదా.

అంతే కాదు పురాంధ్ర ప్రబంధ యుగ కవీశ్వరుడు, కృష్ణదేవరాయల భువనవిజయపు అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన తన కళాపూర్ణోదయము కావ్యం లోని ఒక పద్యంలో ఈ ఐరమ్మదీయ సరస్సును “ఆ సింధూత్తము చేరువన్‌, సరసియొం డైరమ్మదీయంబు నా భాసిల్లున్‌” అంటూ ప్రస్తావించాడు. ఈ “ఐరమ్మదీయసరసి” గురించి వ్యాఖ్యానిస్తూ “మేఘజ్యోతులఁ గ్రుమ్మరించు వెలుంగుల సరస్సు” అన్నారు చదలువాడ జయరామశాస్త్రిగారు.

అందుకే ఈ పద్యంలో విశ్వనాథవారు బ్రహ్మలోకంలోని ఆ “ఐరమ్మదీయ” సరసునే ప్రస్తావించారన్నది స్పష్టమవుతుంది. బహుశా పక్కనుండే రావిచెట్టు వర్షించే సోమరసంతో ఈ ఐరమ్మదీయ సరసు నిండి ఉంటుందనే మరో ఉదాత్త కల్పనను ఈ పద్యంలో పొందుపరిచారనుకోవచ్చు. సాహో విశ్వనాథ.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 181వ పద్యం:

సర్వలోకామయ హరంబు జారలోక
కలుషితాసు ప్రఘాణ జాగ్రద్భుజంగ
ఫణము సందీప్త మౌషధీవల్లి పూవు
చెలగె నడిమింట గలువపూ చెలిమికాడు

వాల్మీకి రామాయణంలోని సుందరకాండ ఐదవ సర్గలో రెండవ శ్లోకం:

లోకస్య పాపాని వినాశయన్తం
మహోదధిం చాపి సమేధయన్తమ్.
భూతాని సర్వాణి విరాజయన్తం
దదర్శ శీతాంశుమథాభియాన్తమ్

అప్పుడు తన కాంతితో లోకంలోని పాపాలను, బాధలను తొలగిస్తూ, మహా సముద్రాన్ని ఉప్పొంగిస్తూ, భూమ్యాకాశాలలో సర్వ ప్రాణులను ప్రకాశవంతం చేస్తూ పైపైకి వస్తున్న చంద్రుణ్ణి హనుమంతుడు దర్శించాడనే అర్థంతో రచింపబడితే, ఈ శ్లోకం మొదటి పాదం “లోకస్య పాపాని వినాశయన్తం” ఆధారంగా చేసుకుని అల్లిన విశ్వనాథ పద్యంలో సర్వలోకాలలో ఆమయాలు (పాపాలు, వ్యాధులు, తెగుళ్లు) హరించడానికి; జారుల కలుషితమైన ప్రాణాలను (కలుషిత+అసు) “ప్రఘాణజాగ్రద్భుజంగ ఫణము సందీప్త మౌషధీవల్లి పూవు” అంటే కాటు వేయడానికి ముందు (ప్ర+ఘన్ > ప్రఘణ = దెబ్బకు ముందు) జాగ్రత్తగా పొంచి ఉన్న పాము పడగ లాగ (ఆ పడగమీద మణి ఉంటుందిగా అది కాంతులు విరజిమ్ముతుంది); ఔషధీ లతకు పూచిన దివ్యకాంతులు వెదజల్లే పువ్వులాగ వెలిగి పోతున్నాడట — ఆకాశం మధ్యలో చంద్రుడు. అలాగే చంద్రుణ్ణి అమృతకిరణుడు అంటారు, ఆ కిరణాలతో సర్వలోకంలోని పాపాలను శుద్ధి చేస్తున్నాడని, వ్యాధులను ఉపశమింప చేసి తెగుళ్లను నివారిస్తున్నాడని అర్థం చెప్పుకోవచ్చు.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 182వ పద్యం

శ్రీ వివస్వత్ప్రభా సమాశ్లిష్టమూర్తి
పార్వతీ ప్రాణనాథు శోభాశరీర
మమృతకళకును సముపోఢమైన వెలుగు
చెలగె నడిమింట గలువపూ చెలిమికాడు

వివస్వత్ అంటే సూర్యుడు, సమాశ్లిష్ట అంటే కౌగిలించుకుని లేదా బంధించుకుని అర్థం. శ్రీ వివస్వత్ప్రభా సమాశ్లిష్టమూర్తి అంటే ఐశ్వర్యవంతమైన సూర్యకిరణాల ప్రభను తనలో బంధించుకుని వెలుగుతున్న చంద్రుడు అని అర్థం. ఆ వెలుగు, నిత్యం తన ఒంటికి అంటుకుని ఉన్న విభూతి శోభతో ప్రకాశిస్తూ ఉండే పార్వతీప్రాణనాథుడయిన శివుడి శరీరానికి అతి సమీపంగా (సముపోఢమైన) ఉన్నందువలన తనకి కూడా ఆ ఐశ్వర్యప్రదమైన అమృత కళ అబ్బడంతో, ఆ కళతో ఆకాశం మధ్యలో వెలిగి పోతున్నాడట కలువపూల స్నేహితుడైన చంద్రుడు.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 183వ పద్యం:

బహుళ రాజనీతిపరముండు రాముండు
తాను హనుమబంపి వాని చర్య
యెట్టులెట్టులుండు నీక్షించు నన్నట్లు
చెలగె మింట గలువచెలిమికాడు.

పాషాణ పాక ప్రభువనే అపఖ్యాతి మూటకట్టుకున్న విశ్వనాథ వారి ఈ పద్యం తెలుగు సరిగా రానివారికి కూడా అతి సులభంగా అర్థమవుతుందని అనడంలో అస్సలు సందేహించనక్కర్లేదు. శ్రీరాముడు గొప్ప రాజనీతి దురంధరుడట. ఎందుకంటే హనుమంతుడిని సీతాన్వేషణకి పంపి ఊరుకోకుండా, ఆ కార్యాన్ని అతడు సరిగా నిర్వహిస్తున్నాడో లేదో స్వయంగా చూద్దామని మారువేషంలో వచ్చాడా అన్నట్టుగా ఉన్నాడట ఆకాశంలో కలువపూల చెలిమికాడైన చంద్రుడు! అసలే శ్రీరాముడిని రామచంద్రుడంటారాయె. అలాగే సీతమ్మవారిలా రాముడి ముఖాన్ని కూడా చంద్రునితో పోలుస్తారు. కాబట్టి ఆయన ఈ మారువేషం వేయడం కోసం పెద్దగా కష్టపడి ఉండడేమో. ఈ పద్యంలో మరో విశేషం. మన తెలుగు వారు తమ దైనందిన జీవితంలో ఏమేం చేస్తున్నారు. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఎలా ఎలా ఉంది? ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నాం? అంటూ ఒకే పదాన్ని పునరుక్తి చేస్తూ మాట్లాడతారు కదా. విశ్వనాథ వారు అవతారికలో నాది వ్యవహార భాష అని చాటి చెప్పినట్టు సరిగ్గా ఆ వ్యవహార శైలిలోనే ఈ పద్యంలో రామచంద్ర మూర్తి రాజనీతి విశిష్టతని సూచిస్తూ తను పంపిన ఆంజనేయుడి చర్యలు “యెట్టులెట్టులుండు” అని చూడడానికి వచ్చినట్టుగా చంద్రుడు కనిపిస్తున్నాడని అంటారు.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 184వ పద్యం:

మున్ను జూడనట్టి భూజాత గుర్తింప
బోవడేమొ కపివిభుండటంచు
దల్లిమోముపోల్కి దా జూపుచున్నట్లు
చెలగె మింట గలువచెలిమికాడు.

సరే, రాములవారు తన బంటు కార్య నిర్వహణ సరిగా నిర్వర్తిస్తున్నాడో లేదో తెలుసుకోవడం కోసం చంద్రుని అవతారం ఎత్తిన విషయాన్ని పక్కన పెడితే. అసలు తాను సీతమ్మవారిని మునుపెన్నడూ చూడనే లేదు, మరి ఆమెని ఎలా గుర్తించాలో ఏమో అని హనుమంతుడు సతమతమవుతుంటే, క్షీరసాగర మథనంలో ఆ భూజాత (సీతమ్మ) తో పాటు పుట్టిన ఆమె తోబుట్టువు కాబట్టి ఆమె ముఖం తన పోలికలతో ఉంటుంది నన్ను చూసుకోమని చెబుతున్నట్టుగా ఆకాశం మధ్యలో వెలుగుతున్నాడట చంద్రుడు. ఎంత మధురమైన ఊహ.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 185వ పద్యం:

ఆంజనేయుడు మందరమై వియన్మ
హాంబునిధి వేఱ త్రచ్చిన నమృతకుంభ
మిదియు నూతన ముదయించెనేమొ యనగ
జెలగె నడిమింట గలువపూ చెలిమికాడు

ఇది మరొక అద్భుతమైన ఊహ. సులభ గ్రాహ్యం కూడా. ఆకాశమనే పాలసముద్రాన్ని ఆంజనేయుడే మందరపర్వతమై మరోసారి (వేఱ) చిలకగా (త్రచ్చిన), అందులోనుండి మళ్ళీ కొత్తగా ఉద్భవించిన అమృతకుంభమా అన్నట్టుగా ఆకాశం మధ్యలో కనిపిస్తున్నాడట చంద్రుడు! అష్టసిద్ధులు అవపోసన పట్టిన ఆంజనేయుడు మందర పర్వతంలా శరీరాన్ని పెంచగల సమర్థుడే. సముద్రాన్ని లంఘించి ఆకాశంలో ఎగురుతూ వస్తున్నప్పుడు తన కాళ్ళు, చేతులు కదిపిన దృశ్యాన్ని తలచుకున్నప్పుడు విశ్వనాథకి హనుమంతుడు ఆకాశాన్ని మదిస్తున్న మందర పర్వతం లాగే గోచరించి వుంటారు. అందుకే ఈ అద్భుతమైన ఊహ వచ్చి ఉంటుంది.

ఈ పద్యం తరువాత మూడు పద్యాల్లో కూడా ఆంజనేయుడు ఏదో ఒక రూపంగా మారి చంద్రుడిని సృష్టించినట్టుగా చిత్రమైన ఊహలు చేశారు విశ్వనాథ. అంతే కాదు ఆ మూడు పద్యాలు కూడా ఆంజనేయుడు పదం తోనే మొదలవుతాయి.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 186వ పద్యం:

ఆంజనేయుడు తా బ్రహ్మయై స్వవీర్య
భరితము నిరంతరాకాశభవము జల వి
శేషమున గోళమొకడు సృష్టించెననగ
జెలగె నడిమింట గలువపూ చెలిమికాడు

ఇంతకు ముందు పద్యంలో మందర పర్వతంగా మారి మరో క్షీరసాగర మథనం చేసినట్టుగా ఈ పద్యంలో ఆంజనేయుడు తాను బ్రహ్మగా మారి మరో సృష్టి చేశాడనే కల్పన చేశారు విశ్వనాథ. వీర్యము అంటే శక్తి. తన శక్తితో ఒక గోళాన్ని సృష్టించాడు. ఎక్కడంటే, ఆకాశంనుండి పుట్టిన (ఆకాశ-భవ) చిక్కని (నిరంతర) జలవిశేషంలో. అంటే బ్రహ్మ తన శక్తితో ఎలా ఆకాశమనే ప్రపంచంలో గోళాన్ని సృష్టించాడో, అలా నిండిన చిక్కని వెన్నెల అనే జలవిశేషంలో హనుమంతుడు తానే గోళమై చెలంగినాడు అని చెప్పడం ఇక్కడ విశేషం అని నా ఊహ. విశ్వనాథ సాహిత్యాన్ని కాచి వడబోసిన పెద్దలు గాని లేదా అవతారిక పద్యంలో చెప్పినట్టు బహుళ శాస్త్ర వివేకమబ్బిన వారు గాని ఇంకా లోతుగా విశ్లేషించి వ్యాఖ్యానించగలరు.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 187వ పద్యం:

ఆంజనేయుడు తా బ్రళయాంబుధియయి
ఈ మహాకాశమెల్ల ముంచెత్తి తొలగ
మరల బొడసూపు ధారుణీ మండలమన
జెలగె నడిమింట గలువపూ చెలిమికాడు

ఈ పద్యంలో ఆంజనేయుడు ప్రళయ కాలపు మహా సాగరంగా మారి సర్వ లోకాలతో సహా మహాకాశాన్నంత ముంచెత్తి తొలగించిన పిదప ఆ సముద్రపు నీరు నెమ్మదిగా వెనక్కి వెళుతున్నప్పుడు కొద్ది కొద్దిగా పొడ చూపుతున్న ధారుణీ మండలంలా ఆకాశం మధ్యలో కనబడుతున్నాడట చంద్రుడు. ఇంతకు ముందు పద్యంలో లాగానే ఈ పద్యం ద్వారా కూడా విశ్వనాథ ఆంజనేయుని బ్రహ్మత్వం, పరబ్రహ్మత్వం గురించి ఏదో రహస్యాన్ని చెబుతున్నారనిపిస్తుంది.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 188వ పద్యం:

ఆంజనేయుడు తా రుద్రుడయిన తాండ
వార భటికాల లోకాభయ ప్రదాతృ
హరిణ లాంఛన శిశిర హస్తాబ్జమనగ
జెలగె నడిమింట గలువపూ చెలిమికాడు

ఈ పద్యంలో ఆంజనేయుడు రుద్రుడుగా మారి సాయం సంధ్యా సమయంలో తాండవం చేస్తున్నప్పుడు లోకానికి అభయమొసగే జింక చిహ్నమున్న తన చల్లని పద్మాల్లాంటి సున్నితమైన హస్తంలా కనబడుతున్నాడట ఆకాశం మధ్యలో చంద్రుడు.

వాల్మీకి చంద్ర వర్ణనలలో చంద్రబింబం ఉదయించి క్రమముగా మీది మీదికి రాగా అంతవరకు ఆ చంద్రబింబమును ఆవరించి ఉన్న మంచు తుంపర్లనబడే పంకము మెల్లమెల్లగా తొలగిపోయి, సూర్యకిరణములు ప్రతిబింబించుట చేత తన మాలిన్యమంతా పోయి, ఆ చంద్రబింబంలో ఉన్న అంకము కూడా నిర్మలమై ప్రకాశ లక్ష్మికి ఆశ్రమయ్యి, కుందేలు చిహ్నంతో అలంకరించబడి పూజ్యుడైన చంద్రుడు ఆకాశములో ప్రకాశిస్తున్నాడనే అర్థంతో ఒక శ్లోకం ఉంటుంది.

వినష్టశీతామ్బుతుషారపఙ్కో
మహాగ్రహగ్రాహవినష్టపఙ్కః.
ప్రకాశలక్ష్మ్యాశ్రయనిర్మలాఙ్కో
రరాజ చన్ద్రో భగవాన్ శశాఙ్కః

పై శ్లోకంలో చంద్రునిలో కుందేలు చిహ్నం అన్నట్టుగా విశ్వనాథ చంద్రునిలో లేడి చిహ్నాన్ని తన పద్యంలో చొప్పించినట్టున్నారు. ఆ విధంగా ఈ ఆంజనేయుడు అనే పదంతో మొదలుపెట్టిన నాలుగుపద్యాల్లో హనుమంతునికి బ్రహ్మ, మహేశ్వరుల రూపాలను ఆపాదించడమే కాకుండా క్షీరసాగర మథనం, మహా ప్రళయం ఘట్టాల ద్వారా శ్రీ మహా విష్ణువుని జ్ఞప్తికి తెస్తూ చంద్రుణ్ణి వర్ణించారు విశ్వనాథ. ఎందుకంటే తన భక్తిరచనలు తనవి కాబట్టి.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 189వ పద్యం:

రామమేఘాభిమాని నర్తన కళా ప్ర
కామమతి యాంజనేయ శిఖావళంబు
చంక్రమణ చంద్రకిత మాకసంబునాగ
జెలగె మింట గలువ చెలిమికాడు

ఈ పద్యంలో ఆంజనేయ స్వామిని నెమలిగా మలచి మరో అద్భుతమైన కల్పన చేశారు కవిసమ్రాట్. నీలమేఘశ్యాముడు శ్రీ రాముడు. రామమేఘాభిమాని అంటే వర్షం కురిపించే మేఘాలను ఇష్ట పడేది, నర్తన కళా ప్రకామమతి అంటే నాట్య కళ అంటే ఎంతో ఇష్టమున్నది. ఎవరది? ఆంజనేయ శిఖావళం (నెమలి) అంటే ఆంజనేయుడనే నెమలి. తను పురివిప్పి నాట్యం చేస్తోంది. ఆ విప్పారిన పింఛమే ఆకాశము. చంద్రకితమంటే నెమలి కన్నువలె చేయబడిందని అర్థం. అదిగో ఆ కన్నులాగా అనిపిస్తున్నాడట చంద్రుడు. అంతే కాదు. ఆంజనేయుడిని కొన్ని పురాణాల్లో రుద్రుడి అవతారంగా వర్ణించారు. అందుకని ఈ చంద్ర వర్ణన పద్యాల్లో కైలాసవాసులను, వారి వాహనాలను వర్ణనా వస్తువులుగా తీసుకోవడం చాలా ఔచిత్యంగా అనిపిస్తుంది.

వాల్మీకి చంద్రుణ్ణి ఒక శ్లోకంలో హంసతో పోలుస్తూ వెండి పంజరంలో ఉన్న హంస ఎలా ప్రకాశిస్తుందో, మందర పర్వత గుహలో ఉన్న సింహం ఎలా ప్రకాశిస్తుందో, గర్వించిన ఏనుగు పైన కూర్చున్న వీరుడు ఎలా ప్రకాశిస్తాడో ఆకాశం మధ్యలో చంద్రుడు అదే విధంగా ప్రకాశిస్తున్నాడంటారు.

హంసో యథా రాజతపఞ్జరస్థః
సింహో యథా మన్దరకన్దరస్థః.
వీరో యథా గర్వితకుఞ్జరస్థ
చన్ద్రో విబభ్రాజ తథామ్బరస్థః

విశ్వనాథ హంస బదులుగా రాముని శరీరవర్ణమైన నీలమేఘాల్ని తీసుకొచ్చి వాటిని చూసి నాట్యమాడే రామమేఘాభిమాని నెమలిగా రామాభిమాని ఆంజనేయుడిని పోల్చి వాళ్ళా ఆనందాన్ని చంద్రునికి ఆపాదించడం భలే హృదయోల్లాసంగా ఉంది కదా. అంతే కాదు వాల్మీకి తన శ్లోకంలో అమ్మవారి వాహనాన్ని, పెద్ద కుమారుడి మొహాన్ని స్ఫురణకు తెస్తే విశ్వనాథ తన పద్యంలో అయ్యవారి చిన్న కుమారుడి వాహనాన్ని స్ఫురింప చేసారు.

ఈ సందర్భంగా వాల్మీకి రామాయణంలో ఈ చంద్ర వర్ణనలకు సంబంధించిన మరో రెండు శ్లోకాలను గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వాటిలో కూడా ఆదికవి కైలాసవాసులనో, వారి వాహనాలనో ఉపమానాలుగా తీసుకుని చంద్రుణ్ణి వర్ణిస్తారు. ఇవిగో ఆ శ్లోకాలు, వాటి భావాలు:

స్థితః కకుద్మానివ తీక్ష్ణశృఙ్గో
మహాచలః శ్వేత ఇవోచ్చశృఙ్గః.
హస్తీవ జామ్బూనదబద్ధశృఙ్గో
రరాజ చన్ద్రః పరిపూర్ణశృఙ్గః

పరిపూర్ణమైన కళలతో కూడిన ఆ చంద్రుడు, బాగా పదునైన కొమ్ములు కలిగిన వృషభం లాగ, ఉన్నత శిఖరాలతో కూడిన తెల్లని హిమాలయ పర్వతం లాగ, బంగారు తొడుగులతో చుట్టబడిన దంతాలు కలిగిన ఏనుగు లాగ ఆకాశములో ప్రకాశిస్తున్నాడు.

శిలాతలం ప్రాప్య యథా మృగేన్ద్రో
మహారణం ప్రాప్య యథా గజేన్ద్రః.
రాజ్యం సమాసాద్య యథా నరేన్ద్ర
స్తథాప్రకాశో విరరాజ చన్ద్రః

అడవి గుహ బయట పర్వతంపై ఉండే చదునైన రాతి పైకి ఎక్కిన సింహం లాగ, గొప్ప యుద్ధంలో వీరులకి సైదోడుగా నిలచిన ఏనుగు లాగాl, రాజ్యం గెలుపొంది రాజ్యం సాధించిన రాజు లాగ ఎంతో ఠీవీగా ఆకాశంలో వెలిగిపోతున్నాడు చంద్రుడు.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 190వ పద్యం:

హనుమ సీతవెదుక నసురేశునింటిలో
వచ్చి యెవరో దివ్వె తెచ్చిరనగ
సర్వవస్తు దీప్తిసంధాయకంబుగా
చెలగె మింట గలువ చెలిమికాడు

అత్యంత సులభ గ్రాహ్యం ఈ పద్య భావం. సీతాన్వేషణ కోసం రావణాసురుని లంకలో రాత్రి వేళ వెదుకులాడుతున్న హనుమంతునికి చీకట్లో ఏవీ సరిగ్గా కనబడవేమో అని పరోపకారి ఎవరో దారి చూపించి అన్ని వస్తువులు స్పష్టంగా కనబడడానికన్నట్టుగా ఒక పెద్ద దివ్వె తెచ్చి పెడితే ఆ వెలుగు ఎలా ఉంటుందో అలా వెలుగులు చిందిస్తున్నాడట ఆకాశం మధ్యలో వున్న చంద్రుడు.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 191వ పద్యం:

అచ్చమైన తెలివి యాడదు కదలిక
యూహ మొదల నిలిచియున్న హనుమ
యుల్లమందు నుబుకు నుత్సాహ గుళిక యై
చెలగె మింట గలువ చెలిమికాడు

ఈ పద్యంలో కూడా ఈ చంద్ర వర్ణనల చాలా పద్యాల్లో లాగ వాల్మీకి రామాయణంలో లేని మరో అందమైన ఊహ చేసారు విశ్వనాథ. అచ్చమైన తెలివి అంటే నిర్గుణ తత్వం. సత్వ రజ తమో గుణాలకతీతం. ఆ స్థితిలో మనిషి యోగ మార్గంలోకి చేరి ఏమీ చెయ్యడానికి ఉత్సాహం చూపడు. అందుకే అప్పుడు ఆ ధ్యానంలో ఏ కదలిక ఉండదు. ఏ ఆలోచన ఉండదు. అదిగో అలా ఏమీ ఆలోచించలేకపోతున్న ఊహ మొదటి స్థితిలో ఆగిపోయి అంటే ఏం చెయ్యాలో ఏమీ తోచని స్థితిలో ఉన్న హనుమంతుని ఉల్లమునందు అంటే మనసులో ఉత్సాహం వెల్లుబుకించే ఒక గుళిక అంటే మందు బిళ్ళలా ఉన్నాడట చంద్రుడు.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 192వ పద్యం:

చల్ల చేసి రాత్రి చల్లపై జేసిన
వెన్నముద్దగాగ విడిచె ననగ
చిన్ని వెన్న నల్ల చిద్రుపలు చుక్కలై
చెలగె మింట గలువచెలిమికాడు

ఈ పద్యానికి ఊహా కచ్చితంగా తను నివసించిన పల్లెల్లో ఆడవాళ్లు మజ్జిగ చిలుకుతున్నప్పుడు విశ్వనాథ వారు గమనించిన దృశ్యం అయ్యుండాలి. అసలే లోకమ్ము వీడి రసమ్ములేదు అన్న కవి.

మజ్జిగని చిలికి వెన్న చేస్తున్నప్పుడు పైన తేలుతున్న వెన్నను ఒక ముద్దలు చేస్తారు. అయినా కానీ తేలిన వెన్న మొత్తం ఆ ముద్దలో చేర్చలేము. కొన్ని చిన్న చిన్న తుంపర్లు మజ్జిగలో చుట్టుపక్కల తేలుతూ ఉంటాయి. ఈ వైనానికి తన ఊహాపటిమని జోడించి ఇలా వర్ణిస్తున్నారు. రాత్రి అనే పల్లె పడుచు వెన్నెలనే మజ్జిగని చిలికి నప్పుడు చల్ల పైన తేలిన తునకలతో చేసిన వెన్నముద్దే ఆకాశం మధ్యలో వెలిగి పోతున్న చంద్రుడట. వెన్నముద్ద కాకుండా చుట్టుపక్కల చెల్లాచెదరై మిగిలిపోయిన తుంపరలే నక్షత్రాలట. ఆద్యంతం పల్లెతనం ఉట్టిపడే ఎంత మనోహరమైన కల్పనో కదా.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 193వ పద్యం:

లంకలోన గలదు లావణ్యనిధి సీత
ప్రతిఫలించె నామె వదనసీమ
యాకసంపు సరసియం దన్నయట్లుగా
జెలగె మింట గలువచెలిమికాడు.

విశ్వనాథ వారి మరో ద్రాక్షాపాకం లాంటి పద్యం ఇది. లంకలోని అశోకవనంలో నున్న సౌందర్యనిధి సీత, ఆమె అందమైన మోము పైన ఆకాశమనే సరస్సులో ప్రతిఫలిస్తోందా అన్నట్టుగా వెలిగిపోతోందట ఆ జాబిల్లి మోము. 184వ పద్యంలో లాగానే పాలసముద్రంలో జన్మించిన లక్ష్మీదేవి అవతారమైన సీతమ్మ వారికీ, చందమామకీ తోబుట్టువులవడం వల్ల సహజంగా పోలికలు ఉంటాయనే ఔచిత్యానికి జోడించిన గొప్ప ఊహ యిది.

ఇంచుమించు ఇదే ఊహతో విశ్వనాథ వారిని అమితంగా అభిమానించి ఆయన సాహిత్యాన్ని మధించి తరించిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 1994 సమయంలో సిసింద్రీ సినిమా కోసం ఒక తల్లి తన బిడ్డని చూసి మురిసిపోతూ ఇలా అనుకున్నట్టుగా ఒక పాటలో ఇలా రాశారు. “చందమామ చూశావటోయ్. అచ్చు నీలాంటి మా బాబుని. నేల అద్దాన నీ బింబమై పారాడుతుంటే…” ఈ పద్యం చదివినప్పుడు నాకు ఆ పాటే గుర్తొచ్చింది.

వాల్మీకి రామాయణంలో ఏ లక్ష్మీదేవి భూమిపైనున్న మందర పర్వతంపై ప్రకాశిస్తుందో, యే లక్ష్మీ సాయంసంధ్యా సమయంలో సముద్రంపై ప్రకాశిస్తుందో, యే లక్ష్మీవైభవం సముద్రంపై, సరస్సులలోని తామరపువ్వులపై వెల్లి విరుస్తుందో ఆ లక్ష్మీదేవియే అపుడు అందమైన చంద్రుణ్ణి కూడా ఆశ్రయించి ప్రకాశిస్తోందనే అర్థంతో ఉన్న ఈ క్రింది శ్లోకం నుంచి కూడా కవి స్ఫూర్తి పొంది ఉంటాడు.

యా భాతి లక్ష్మీర్భువి మన్దరస్థా
తథా ప్రదోషేషు చ సాగరస్థా.
తథైవ తోయేషు చ పుష్కరస్థా
రరాజ సా చారునిశాకరస్థా

ఆంజనేయుడు మందర పర్వతంగా మారడం, ప్రళయ సముద్రంగా మారడం లాంటి విశ్వనాథ కల్పనలకు పై శ్లోకంలో మన్దరస్థా, సాగరస్థా లాంటి పదాలు దోహదపడ్డాయేమో.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 194వ పద్యం:

ఎవ్వడో మహాత్ముడీ రోదసీ సర
స్సున యశోజలంబు నినిచి తానె
చెరువుమీద దెల్ల విరివోలె బొడిచెనా
జెలగె మింట గలువ చెలిమికాడు

మనం ఎవరైనా గొప్పవాళ్ళ గురించి పొగిడేటప్పుడు వారి కీర్తి దశ దిశాంతాలు వ్యాపించింది అంటూ ఉంటాం. అదిగో ఆ పలుకుబడికి తన ఊహ జోడించి చంద్రుణ్ణి వర్ణిస్తున్నారు ఈ పద్యంలో విశ్వనాథ. ఎవరో మహాత్ముడు అన్ని దిశలలో వ్యాపించి ఉన్న ఆకాశం (రోదసీ) అనే సరస్సుని తన కీర్తి జలాలతో నింపి ఆ చెరువు మధ్యలో విరిసిన ఒక తెల్ల కలువ లాగ తేలుతున్నాడన్నట్టుగా ఆకాశం మధ్యలో కనబడుతున్నాడట ఆ కలువల చెలికాడు చంద్రుడు.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 195వ పద్యం:

మచ్చమొగము మీది మహనీయుడెవ్వడో
యాకసంబునందు దూకుచుండె
స్వేదబిందుసమితి శిశిరుడై యున్నట్లు
చెలగె మింట గలువచెలిమికాడు

చంద్రుడికి మచ్చ ఉండటం, చల్లని వెన్నెల కురిపించడం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ భావాలనే చాలా సులభంగా అర్థమయ్యే పద్యంలో పెట్టారు విశ్వనాథ. మొహం మీద మచ్చ వున్న ఎవరో ఒక మహనీయుడు ఆకాశంలో దూకుతూ పరుగెడుతున్నాడట. అందువల్ల ఆయనకి బాగా చెమట పట్టి ఒళ్ళంతా చల్లబడ్డ వాడిలా ఉన్నాడట ఆకాశం మధ్యలో చంద్రుడు.

వాల్మీకంలో ఈ చంద్రవర్ణనలకి ముగింపుగా నడినెత్తికి చేరిన చంద్రుడి వెలుగులో లంకాపురి వాస్తవ్యులైన రాక్షసులు సుష్టుగా భోజనం చెయ్యడానికి ఉద్యమించి మనస్పర్థలు విడచి తమతమ ప్రియమైన వాళ్ళతో కలసిపోవడానికి ఉపక్రమించారని ఈ శ్లోకం ఉంటుంది.

ప్రకాశచన్ద్రోదయనష్టదోషః
ప్రవృత్తరక్షః పిశితాశదోషః.
రామాభిరామేరితచిత్తదోషః
స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషః

స్వర్గములా ప్రకాశించుచున్న పవిత్రమైన ఆ సాయంకాల సంధ్యా సమయములో చంద్రోదయమవ్వడం వల్ల ఆకాశంలో దివ్వెలాగా వెలుగుగుతున్న చంద్రుడి వల్ల చీకటి పూర్తిగా నశించింది. రాక్షస గణంలో కొంతమంది మాంసభక్షణ కార్యక్రమం ప్రారంభిస్తే. కొంతమంది వారి మనసులలోని కోపాల్ని విడిచి పెట్టి తమతమ ప్రియమైన వాళ్ళతో కలిసిపోయారు

అయితే విశ్వనాథ ఈ భావానికి పూర్తి భిన్నంగా, పరమేశ్వర స్వరూపమైన రుద్రుడి అష్టరూపాలను, ఆత్మాన్వేషణ తత్వాన్ని ఆవిష్కరిస్తూ రెండు పద్యాలతో ఈ చంద్రవర్ణన ముగించారు.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 196వ పద్యం:

ఇదియు రుద్రమ్మూర్తి యెనిమిది తనువులై
నట్టి యగ్నులందు నష్టమాగ్ని
చల్లదనముపైని సంధాన పరచెనా
జెలగె మింట గలువ చెలిమికాడు

ఈ పద్యానికి పైపైన భావం చెప్పుకుంటే అష్టరూపాల రుద్రాగ్నులలో అష్టమాగ్నికి ఎనిమిదవ మూర్తిగా తన చల్లదనాన్ని కలిపి వెన్నెల వెలుగు పరచినట్టుగా ఆకాశం మధ్యలో ఉన్నాడట కలువ పూల చెలిమి కాడు. ఇంక ఈ పద్యంలో విశ్వనాథ నిక్షేపించిన గూఢార్థం, లోతైన రహస్యాల విషయానికొస్తే, మన పురాణాల ప్రకారం, బ్రహ్మదేవుడు పరమేశ్వరుడనే సర్వ భూత స్వరూపాన్ని రుద్రుడు, భవుడు, శివుడు, పశుపతి, ఈశ్వరుడు, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు అనే ఎనిమిది పేర్లతో అష్టమూర్తులుగా సృష్టి చేశాడంటారు. ప్రతి మూర్తికి నామం, రూపం, భార్య, పుత్రుడు కూడా వుంటారు. ఈ అష్టమూర్తులలో ఎనిమిదవ మూర్తి నామం మహా దేవుడు. ఈ రూపానికి “సోమ ఓషధీనా మధిపతిః” అని శ్రుతి వాక్యముతో పాటు స్వరూపం చంద్రుడుగా చెబుతారు. ఆ మూర్తిలో ఓషధులన్నిటికీ అధిపతివై, వాటిని వృద్ధి చేసి ప్రాణులకు జీవ ప్రమాణ వృద్ధికి దాతగా పరిగణిస్తారు. మొదటి మూర్తి రుద్రుని రూపం రౌద్రం. భార్య సువర్చల, కొడుకు శని అయితే ఎనిమిదవ మూర్తి చంద్రుని శరీరం చాంద్రమసం, భార్య రోహిణి. కొడుకు బుధుడుగా చెబుతారు. అంతే కాదు కాళిదాస మహాకవి కూడా తన ‘అభిజ్ఞాన శాకుంతలమ్’ నాటకం నాంది శ్లోకంలో ఈశ్వరుడు, మనిషికి ఎనిమిది ప్రత్యక్ష రూపాలలో నిత్యమూ దర్శనమిస్తూనే ఉన్నాడంటాడు.

యా సృష్టిః స్రష్టురాద్యా వహతి విధిహుతం యా హవిర్యా చ హోత్రీ
యే ద్వే కాలం విధత్తః శ్రుతివిషయగుణా యా స్థితా వ్యాప్య విశ్వమ్।
యామాహుః సర్వబీజప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవన్తః
ప్రత్యక్షాభిః ప్రపన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః ॥ 1.1॥

ఈ కాళిదాసు నాటకానికి విశ్వనాథ “శాకుంతలం యొక్క అభిజ్ఞానత” అనే పేరుతో 150 పేజీల విశ్లేషణాత్మక వ్యాఖ్యానం చేసారెమో ఆ ఎనిమిదో మూర్తిని తీసుకుని వచ్చి ఈ చంద్రవర్ణనల పద్యాల్లో రుద్రుని అవతారంగా చెప్పబడే ఆంజనేయునికి కనబడే చంద్రునిగా ఆకాశం మధ్యలో నిలబెట్టేశారు.

సుందరకాండ, పూర్వరాత్ర ఖండం, 197వ పద్యం:

ఆత్మగోపనమ్ము నన్వేషణమ్మును
రెండు కలుగ సంచరించుటకును
సంతరింపు వెలుగు సమపాళమైనట్లు
చెలగె మింట గలువచెలిమికాడు

ఈ పద్యంలో నిగూఢ రహస్యాలను స్పృశించ కుండా భావం చెప్పుకుంటే ఆత్మగోపనమ్ము అంటే తను ఎవరికీ కనబడకుండా లంకానగరంలో తిరగాలి, కానీ సీతాన్వేషణ కొనసాగించాలి. ఆంజనేయుని ఈ రెండు సంకల్పాలు నెరవేర్చడానికన్నటుగా తన వెన్నెల వెలుగు సమపాళ్ళలో ప్రసరిస్తూ ఆకాశం మధ్యలో ఉన్నాడట చంద్రుడు. వెన్నెలలో వస్తువులు స్పష్టం గానే కనబడతాయి కానీ ఈ చెట్టు చాటునో గోడల చాటునో నక్కి ఉంటే ఇతరులకి కనబడకుండా ఉండచ్చు. ఈ చంద్రవర్ణనల చివరి పద్యంలో ఆ ఔచిత్యానికి రూపమిచ్చారు విశ్వనాథ. ఈ వర్ణనల తరువాత అంతవరకూ సీత కనబడలేదన్న నిరుత్సాహంతో ఉన్న హనుమంతుడు చంద్రుని ఉత్సాహ గుళిక పుణ్యమా అని లంకా పట్టణ సౌధాలలో సీతాన్వేషణ కొనసాగించడానికి బయలుదేరతాడు.

ఉపసంహారం

ఇంతవరకూ విశ్లేషించుకున్న ఈ చంద్రవర్ణనల వాల్మీకి శ్లోకాలు, విశ్వనాథ పద్యాలు గమనిస్తే మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. విశ్వనాథ పద్యాల్లో తెలుగు పల్లెల వాతావరణం, కథతో సంబంధం విడిచిపెట్టకుండా చేసే వర్ణనలు, వేద పురాణ, సంబంధిత గాథల సూచనలు, తన పూర్వ కవుల కావ్యాల నుంచి భావాల స్పూర్తి మొదలయిన విషయాలు ఒక ఆధునిక కవి చేసిన ఊహలుగా కనిపిస్తాయి. వాల్మీకి చంద్ర వర్ణనలు ఏవీ కథకి సంబంధం లేకుండా ఉంటాయి. అయినా అతి మనోహరంగా అనిపిస్తాయి. విశ్వనాథ పద్యాలు ఔచితీశోభితంగా, గూడార్థభరితంగా ఉండి రసజ్ఞత ఉన్న పాఠకులను ఒక మత్తులో పడేస్తాయి. విశ్వనాథ శతజయంతి సందర్భంగా 1995 సంవత్సరంలో జరిగిన రామాయణ కల్పవృక్ష సప్తాహంలో విశ్వనాథ ప్రియ శిష్యుడు మల్లంపల్లి శరభయ్యగారు తన ప్రసంగంలో సుందరకాండలోదే ఒక వాల్మీకి శ్లోకం ఒకటి ఉదహరించి ఆ శ్లోకం రామాయణ కల్పవృక్ష సౌందర్యానికి చక్కగా సమన్వయమవుతుందన్నారు. అసలు వాల్మీకి అందుకోసమే రాశాడా అన్నట్టు వుంటుందన్నారు. ఆ శ్లోకం:

మహీకృతా పర్వతరాజి పూర్ణా
శైలాః కృతా వృక్షవితానపూర్ణాః
వృక్షాః కృతాః పుష్పవితానపూర్ణాః
పుష్పం కృతం కేసరపత్రపూర్ణమ్

ఒక తివాచీ మీద ఉండే చిత్రాన్ని తెలిపే ఈ శ్లోకం భావం ఏమిటంటే భూమి అంతా పర్వతాల మయం. ఒకొక్క పర్వతం వృక్షాల మయం, ప్రతీ వృక్షం పుష్పాల మయం. ప్రతీ పుష్పం కేసరాలు అంటే పూల రేకుల మయం. శరభయ్య గారు ఆ భావాన్ని కల్పవృక్ష కావ్యానికి ఇలా అన్వయించారు: కావ్యం భూమి అయితే ఆరు కాండలలో ఒకో కాండ ఒక వృక్షమని, ఒకొక్క కాండలో ఉన్న అయిదు ఖండాలలో ప్రతి ఖండం ఒక పువ్వు అని, ఆ ఖండంలో ఉన్న ప్రతి పద్యం ఒక పూరేకు అని కాబట్టి ఏ ఒక్క పద్యాన్ని తీసి పారేయలేమని.

నిజమే, ఈ చంద్రవర్ణనల పద్యాలు విశ్లేషిస్తున్నప్పుడు నాకు ఏ ఒక్క పద్యాన్ని కూడా పక్కన పెట్ట బుద్ధి కాలేదు.


విజయసారథి జీడిగుంట

రచయిత విజయసారథి జీడిగుంట గురించి:

విజయ సారధి జీడిగుంట , కంప్యూటర్ సాఫ్ట్ వేర్ రంగం లో గత 31 సంవత్సరాలు గా అమెరికా లో ఉంటూ ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలకు తన సేవలందించి ప్రస్తుతం ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్నారు. విశ్వనాథ సాహిత్యం, ఆయన రామాయణ కల్పవృక్ష పద్యాల మీద ఎన్నో ప్రసంగాలు, వ్యాసాలు రచించిన వీరు గతంలో తన యూట్యూబ్ ఛానల్లో రోజుకో తెలుగు పద్యం అనే శీర్షికతో తెలుగు సాహిత్య చరిత్ర పై 75 పైగా వీడియోలు చేయడమే కాకుండా.. బీ+ యూట్యూబ్ ఛానల్ లో ప్రతి శుక్రవారం రాత్రి పద్యలహరి అనే కార్యక్రమం, టోరి లైవ్ లో ప్రతి ఆదివారం సిరివెన్నెల గీతా భాష్యం అనే శీర్షిక తో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి పాటల పై రేడియో టాక్ షో నిర్వహించారు. అమెరికా లో జరిగే వివిధ సాహిత్య సదస్సులలో ప్రత్యక్షం గాను, అంతర్జాలం లో జరుగుతున్న వివిధ జూమ్ సాహిత్య సంబరాల్లోను వీలు దొరికినప్పుడల్లా పాల్గొంటున్న వీరు ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఆంధ్రా ప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ నుంచి కంప్యూటర్ సైన్సెస్ లో పీజీ డిప్లోమా చేసారు. ఎప్పటికైనా సిరివెన్నెల సమగ్ర సాహిత్యం పై డాక్టరేట్ చెయ్యాలనే సంకల్పం తో ఈ మధ్యనే ఎమ్మే తెలుగు పట్టా పుచ్చుకున్నారు. \’ప్రాచీనాంధ్ర సాహిత్యం లో శ్రీ విఘ్నేశ్వర స్తుతి పద్యాలు\’ అనే శీర్షిక తో ఒక పుస్తకం రచించారు.

 ...