అస్తిత్వవాద సాహిత్యం: 3ఆ. నీచ

[భారతీయ పరిచయక్రమం అన్న శీర్షిక కింద సూరపరాజు రాధాకృష్ణమూర్తి కొన్ని పుస్తకాలు ప్రచురించారు. అందులో మొదటిది – అస్తిత్వవాద సాహిత్యం. ఈ పుస్తకంలో కీర్కెగాడ్, దొస్తోయెవ్‌స్కీ, నీచ, పిరాన్దెల్లో, కాఫ్కా, హైడెగర్, సార్త్ర, కామూ పరిచయం చేయబడ్డారు. అదే వరుసలో తిరిగి ఈమాటలో వ్యాసాలుగా పరిష్కరించి ప్రచురించడానికి అనుమతి ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. ఈ పుస్తకపు ముందుమాట ఇక్కడ చదవండి.]


దేవుడు చచ్చిపోయాడు. చచ్చి పడి ఉన్నాడు.

‘చచ్చిపోయాడు’ అంటే చాలదా? ‘చచ్చి పడి ఉన్నాడు’, అని కూడా అనడమెందుకు? నీచ ఆశయం ఏమిటో చూద్దాం. దేవుడు అంటే ఒక ఆకృతికాదు. సత్యమే దైవం. (“…the old truth is approaching its end.” — Twilight of the Idols, Friedrich Nietzsche); దేవుడు ఎక్కడో బయట లేడు. మనిషిలోపల చైతన్యరూపంలో ఉంటాడు. చైతన్యం సిద్ధవస్తువుకాదు అన్నాడు నీచ. అంటే, ఏమిటి అర్థం? చైతన్యం పెంచుకుంటే పెరుగుతుంది. లేకుంటే జడంగా, అంటే నిర్జీవంగా మృతప్రాయంగా, “పడి” ఉంటుంది. (బాంకులో కోట్లుంటాయి. నీ అకౌంట్‌లో ఉన్నదే నీది). క్రైస్తవశరణాగతిని అద్వైతంలోకి మారుస్తున్నాడు నీచ “ఉద్ధరేదాత్మనాత్మానం” అని. కొత్త “దేవుడు” కలగాలంటే పాత దేవుడు మరణించాలి (the old God is dead’ — The Gay Science: Aphorism 343). పాతది పోవాలంటే ఊరకే పోదు. హింసనణచ ధ్వంసరచన చాలా జరుగుతుంది. అదే “నేతి నేతి” అంటూ, అడ్డమొచ్చిన జడవస్తువులన్నిటినీ నిర్దయగా అడ్డంగా సరుక్కుంటూ ధ్వంసంచేస్తూ దగ్ధంచేస్తూ పోతాడు “పిచ్చివాడు”. బయట అన్నీ తగలేయడం ముగిసినతరువాత, ఆకలిగొన్న మంట ఎదురుగా వచ్చి ఆగుతుంది, యిక యిప్పుడేమి కాల్చాలి అంటూ. తగలేయడానికి తన దేహమే మిగిలిఉంది. అప్పుడు:

“ఆకలిగొన్న మంటలా నన్ను నేను తింటూ వెలుగుతాను.
నేను పట్టుకున్న ప్రతిదీ వెలుగు. నేను వదిలిన ప్రతిదీ బూడిద.
నిశ్చయంగా నేను నిప్పు” (The Gay Science: Preludes: 62)

పాతదేవుడు, ఆ దేవుడిమీద మనం నిలబెట్టిన వ్యవస్థలు విలువలు అవన్నీ శవమయం అయాయి. “దేవుడు మరణించాడు” అన్న మహా వాక్యం. నీచ తన భాషలో చదివిన నమకం. శవాన్ని తిరిగి శివమయం చేయవలె. పురిటినొప్పులు పడకుండా భవ్యభవిష్యత్తు పుట్టదు. (“overflowing energy pregnant with the future”): విధ్వంసం, విప్లవం, విపరిణామం- యివి భవిష్యత్తును గర్భందాల్చిన ఒక మహాశక్తి యొక్క పురిటినొప్పులు, ఆ శక్తి పొంగిపొరలే అభివ్యక్తి.” (Aphorism: 370).

హత్య క్రూరమైన అవసరం “Only as creators can we destroy.” — GS: Aphorism 59.

ఏమిటి దేవుడు చనిపోవడమంటే? దైవమందు మనిషి విశ్వాసం ఆచారం ఆరాధన యాంత్రికం అయిపోతాయి. ఆదివారం ఆలయానికి వెళ్ళడం, సంధ్యావందనం. అభిషేక నిషకం (“exploring hands encounter no defence”: Eliot) — అన్నీ నిర్జీవక్రతువులుగా (“dead habit” — Tagore) మారిపోతాయి. ఏ ప్రవక్త అయినా ముందు యీ దైవగ్లానినే ధ్వంసం చేయటానికి అవతరిస్తాడు.

అసత్యాన్ని అసత్యమని తెలియడం గొప్ప చారిత్రాత్మకఘటన, అప్పుడుగాని ‘అసతో మా సద్గమయ’ అనలేడు. మృత్యువును మృత్యువుగా గుర్తించడం ఆధ్యాత్మికతలో ఒక గొప్ప దశ. (“శవం కుళ్ళినవాసన తెలియడంలేదా? దేవుళ్ళుకూడా కుళ్ళిపోతారు. దేవుడు చచ్చిపోయాడు. చచ్చి పడి ఉన్నాడు.”) ఈ కుళ్ళువాసన తెలిస్తేగాని “మృత్యోర్మామృతం గమయ” అనలేడు. చీకటి కనిపించినపుడుగాని లాంతరు వెలిగించడు. “తమసో మా జ్యోతిర్గమయ”, అంటూ. ఎవడికి అసత్యం అసత్యంగా, తమస్సు తమస్సుగా, మృత్యువు మృత్యువుగా తెలుస్తాయో వాడు ప్రవక్త. వాడు శూన్యవాది.

(“దేవుడు మరణించాడు” అన్న నీచ ప్రసిద్ధవాక్యం, అతని అనేక గ్రంథాలలో కనిపిస్తుంది. The Gay Science: Aphorism 125 లో మాత్రమే కాదు. అందులోను ఒకేచోట కాదు. ఆ వాక్యం మొదట కనిపించేది Aphorism 108 లో. (వీటిని ఏమనాలో తెలియదు. Aphorisms అంటారు. కాని అవి సూత్రాలలాగా లేవు. ఒక వాక్యం నుండి యిరవై ముప్పై వాక్యాల వరకు నిడివి ఉన్నవి. కొన్ని అభిప్రాయాల రూపంలో, కొన్ని వ్యాసాల రూపంలో, కొన్ని నీతికథలలా (parables) వివిధంగా ఉన్నాయి.) 108 నుండి 125 వరకు అన్నీ సూత్రాలు చదివినపుడు మాత్రమే “దేవుడిమరణం”లో నీచ ఆలోచనాధార, అతడు ఏం చెప్పదలచాడో తెలుస్తుంది. (ఈ Aphorismsను వచనాలు అనవచ్చు.)

“కొత్త పోరాటాలు: బుద్దుడు మరణించినతరువాత, కొన్ని శతాబ్దాలవరకు ఆయన నీడను ఒక గుహలో చూపించారు. భీకరమైన పెనునీడ. దేవుడు మరణించాడు. కాని, యీ మనుషుల తత్త్వం ఎటువంటిదంటే, కొన్ని వేలసంవత్సరాల వరకు ఆయన నీడను చూపించే గుహలుంటూనే ఉంటాయి. ఆ నీడను పడగొట్టడానికి మన పోరాటం సాగించవలసే ఉంటుంది” (The Gay Science: Aphorism 108)

ఒకవైపు దేవుని హత్య రాక్షస కృత్యమంటూనే, ఆ ఘనతను మనం దక్కించుకోవద్దా అంటున్నాడంటే అది పిచ్చివాడి విరుద్ధవచనం అనుకోవాలా? కాదు, దేవుని హత్య క్రూరమైన అవసరం అంటున్నాడు. కొత్త విలువలు సృష్టించుకోవాలంటే పాతది పోవాలి. (“… the old truth is approaching its end.”: — Twilight of the Idols). ఆ సృష్టికి జనం సిద్ధంగా ఉన్నారా? దేవుడులేని శూన్యాన్ని ఎలా పూరించాలి? “మనమే దేవతలు కావద్దా?”, అంటాడు పిచ్చివాడు. కాని జనం దేవతలు కావడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకు చీకటి చీకటిగా తోచడంలేదు. పిచ్చివాడు తన లాంతరు నేలకేసి కొట్టాడు. లోకానికి (సంతలో జనాలకు) వెలుగు అక్కర్లేదు. తాను చాలా ముందు వచ్చాడు. ప్రవక్తలు ఎప్పుడూ ముందుగానే దిగి పస్తారు. వారికి ఆహ్వానం పలకడంలో యీలోకం ఎప్పుడూ ఆలస్యమే చేస్తుంది. కొన్ని యుగాల ఆలస్యం.

నిజానికి నీచ పరిచయం యిక్కడే ఆపేయవచ్చు మనం. ఎందుకంటే, కేవలం తత్త్వం కొరకు ఎవరినీ చదవవలసిన అవసరం లేదు. ఏ తాత్త్వికుడైనా వేదాంతి అయినా కొత్తగా చెప్పేదేమీ ఉండదు. ఎవరో ఒకరు ఏదో పేరుతో వెనుక చెప్పిందే. తెలిసి వాటిని ఎందుకు చదువుతామంటే, పోల్చడంలో ఉన్న కుతూహలంతో. రూమీని, బషోని, కబీర్‌ని, రవీంద్రుణ్ణి, జిబ్రాన్‌ని తత్త్వంకోసం చదవం. వారి కవిత చదివిస్తుంది. కీర్కెగాడ్, నీచ వంటివారు కేవలం తాత్త్వికులు కారు. వారు కవులు. అందుకోసం వారిని చదువుతాం.

దేవుడు మరణించాడు అన్న ప్రవచనంలోని పరమార్థం ఏమిటి? అది ఒక్క వాక్యంలో తెలిసేది కాదు. దేవుడు లేనపుడు, పరమార్థము, దానిని సాధించడమనే పురుషార్థము (జీవితలక్ష్యసాధన) సృష్టినంతా కలిపే ఏకతత్త్వము — యివేవీ ఉండవు. విలువలు ఏమైనా ఉంటే, అవి మనిషి నిర్మించుకోవలసినవి. పైనుంచి దించుకునేవి ఏవీ లేవు. మనిషి పుట్టుకకు తాను బాధ్యుడు కాడు. అది తానేమీ చేయలేని వాస్తవం (facticity అంటాడు సార్త్ర్) కాని పుట్టిన తరువాత, తనను తాను తాను కోరినట్టు నిర్మించుకునే స్వేచ్ఛ మనిషికి ఉంది. ఆ స్వేచ్చే శిక్ష అంటాడు సార్త్ర్. కాదు, ఆనందతాండవం అంటాడు నీచ. (ఇద్దరు యోగులు దర్శించేది ఒకే సత్యం. ఒక యోగి గుహ వెలుపలికి రాడు. మరొక యోగి, జీన్స్ వేసుకొని స్పోర్ట్స్ బైక్ మీద కొండలకోనలమీద విహరిస్తాడు.) “ఏకం సత్ విప్రా బహుధా చరంతి.”

అస్తిత్వవాదులూ అంతే. అందరూ మనిషిని ప్రతిష్ఠిస్తారు. అతడు ముక్తుడని ప్రకటిస్తారు. కాని మనిషి ఆ స్వేచ్ఛను ఎలా భావిస్తాడు, దానిని ఎలా వాడుకుంటాడు అనేది అనేకంగా ఉంటుంది. స్వేచ్ఛను మనిషి ఎలా పోగొట్టుకుంటాడు? దోస్తోయెవ్‌స్కీ రచనల్లో చూశాం. భద్రతకోసం మనిషి స్వేచ్ఛను అమ్ముకొంటాడు. అభద్రతతో జారుడుమంచుపై కొండకొనన ఆనందతాండవం చేయమంటాడు, నీచ!

“జారుడు మంచు:
స్వర్గం,
నేర్చిన నర్తకులకు.” (GS. Preludes: 13)

నృత్యం ఒక రోజులో నేర్చుకునేది కాదు. ఒకానొక కాలంలో శ్రద్ధ ఒక జీవితకాల సాధనాఫలితం, రోజులలో వారాలలో నేర్చుకునే పని కాదు.” (Introduction: Fear and Trembling: Kierkegaard).
దేవుడున్నా లేకపోయినా మనిషి బతుకులో తేడా లేదు. అదే సాధన. అదే శోధన.
మరో వచనం (GS. Aphorism 343) లో నీచ యీ విషయమై భావించిన తీరు చూద్దాం:

“మా అభయానికి అర్థం”:
“(భయంతో వణుకుతున్న తన దేహంతో అంటున్నాడు):
“కార్కైస్, వణుకుతున్నావా? ఇప్పుడు నిన్ను ఎక్కడికి తీసుకుపోతున్నానో తెలిస్తే యింకా ఎక్కువ వణుకుతావు.” (తూరెన్.1873)

“ఇటీవలి కాలంలో జరిగిన గొప్ప సంఘటన, “దేవుడు చనిపోయాడు”. క్రైస్తవులు యింతకాలము విశ్వసించిన దేవునియందు విశ్వాసం యిక ఏమాత్రము సాధ్యంకాదన్న విషయం యూరపును నీడలా ఆవరించడం మొదలయింది. చూపులో సందేహబలం ఉన్న కొందరైనా సూక్ష్మదర్శులు సూర్యుడు అస్తమించాడని చూడగలిగారు. పురాతనము గంభీరము అయిన ఒక విశ్వాసం సంశయంగా మారిందని తెలుసుకున్నారు… అది సామాన్యజనాలు వెంటనే గ్రహించలేనంత గొప్ప ఘటన. దాని ప్రాధాన్యాన్ని గ్రహించడం మాట అటుంచి, ఆ వార్తకూడా వారికి చేరలేనంత దూరంలో ఉంది… ఆ విశ్వాసం యింతకాలం తన బలంతో నిలిపి ఉంచిన సమస్త యూరపీయ నైతిక వ్యవస్థ భగ్నమయింది. కలగబోయే విధ్వంసము వినాశము ప్రకంపనము శైథిల్యము ఊహించగలిగిన వాడొకడు ఆచార్య బాధ్యతను, నైరాశ్యప్రవక్త పాత్రను వహించి, యింతవరకు కనీవినీ ఎరుగని ఒక సూర్యగ్రహణం రాబోతోందని ప్రకటించవలె.

నిజానికి, మా వేదాంతులకు, స్వేచ్ఛాబుద్ధులకు, ఏమనిపిస్తుందంటే, “పాత దేవుడు” చనిపోయాడు అన్న వార్త విన్నపుడు ఒక కొత్త ఉషోదయం అయినట్టు అనిపిస్తుంది.

సమస్యలను ఊహించగలిగిన మావంటివారు, కొండకొనలమీద కాపలా కాచేవాళ్ళు. పుట్టవలసినదానికంటే ముందే పుట్టినవాళ్ళు… వారెందుకు తమకేమీ పట్టనట్లు, ఏ భయము లేకుండా ఎందుకున్నారు? ఎందుకంటే వారిమీద ఆ మహద్ఘటన పరిణామాలు, జనసామాన్యం ఊహించినవాటికి విరుద్ధంగా ఉంటాయి కనుక. వాళ్ళలో ఎటువంటి విషాదము లేదు. వాళ్ళలో ఒక కొత్త వెలుగు, సంతోషము, ఉపశమనము, ఉల్లాసము, ఉత్సాహము… వారి మనసులు కృతజ్ఞతతో పొంగిపొర్లుతున్నాయి. జ్ఞానాన్ని ప్రేమించేవాడికి ఎంతటి సాహసానికైనా అనుమతి దొరుకుతుంది. దిగంతాలు ఉజ్జ్వలంగా లేవు, కాని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలానికి, మా నావలు బయలుదేరగలుగుతున్నాయి, ఏ ప్రమాదాన్ని ఎదిరించడానికైనా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు జ్ఞానాన్వేషణాప్రియులు చేయరాని సాహసం లేదు. సముద్రం, మన సముద్రం, మళ్ళీ పిలుస్తోంది. ఏదీ దాచుకోకుండా. ఇంత స్వచ్ఛస్వేచ్ఛాసముద్రం బహుశా మునుపెన్నడూ ఉండి ఉండదు.” (GS.5.343)

వ్యాఖ్య:
వచనం 125 లోని “దేవుడు మరణించాడు” చూచాం. ఇక్కడా అదే విషయం.” కొందరైనా సూక్ష్మదర్శులు సూర్యుడు అస్తమించాడని చూడగలిగారు”, అంటున్నాడు. సూర్యుడుండగా వెలుగు చూడలేని సాధారణ గుడ్డితనం కాదిది. సూర్యుడు అస్తమించిన తరువాత యింకా వెలుగు ఉన్నదని నమ్ముతున్న గుడ్డితనం. అది చెప్పడానికే వెనుకటి వచనం 125 లో, పిచ్చివాడు తెల్లవారగానే లాంతరు వెలిగించుకొని సంతలోకి వెళతాడు. (“యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ/ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః”. గీత.2.69) చనిపోయింది దేవుడు కాదని, దేవునియందు మనిషి శ్రద్ధ అని తెలుస్తోంది. కాని దేవునిమరణం వలన ఏర్పడిన శూన్యం సాధారణజనాలకు యింకా అనుభవంలోకి రావడం లేదు. కొందరు సూక్ష్మదర్శులైన మహాత్ములకు మాత్రం తెలుస్తోంది. దేవుని యందు నమ్మకం సాధ్యం కానపుడు, మనిషి బరువు బాధ్యతలు పెరుగుతాయి. “సమస్త యూరపీయ నైతికవ్యవస్థ భగ్నమయింది.” ఈ మహత్ శూన్యాన్ని ప్రకటించి ప్రవచించగల ఒక కొత్త ప్రవక్త అవతరించవలసిన అవసరం ఉంది.

అయితే “మరణించిన దేవుడు” (125) యీ వచనంలో (343) “పాతదేవుడు” ‘అయినాడు. ‘పాత’ అనడం ఎందుకు? పాతదేవుడు అనగానే, ఒక కొత్తదేవుడు అన్న భావం కలగాలి కదా? దేవుణ్ణి ఎన్నిసార్లు హత్యచేసినా మరో దేవుడు ఆవిర్భవించవలసిందే. దేవుడి హత్య చాలా సార్లు జరిగింది. ఇకముందు జరగబోతుందికూడా. ఒక బుద్దుడు మొత్తం ఒంపుతాడు. ఒక శంకరుడు తిరిగి నింపుతాడు. “ఒక కొత్త ఉషోదయం.” దేవుడు మరణించాడని “ఎటువంటి విషాదము లేదు. వాళ్ళలో ఒక కొత్త వెలుగు, సంతోషము, ఉపశమనము, ఉల్లాసము, ఉత్సాహము…” ఒక కొత్త అన్వేషణాస్వేచ్ఛ.

“జ్ఞానాన్ని ప్రేమించేవాడికి ఎంతటి సాహసానికైనా అనుమతి దొరుకుతుంది”. దేవుడిమరణానికి ముందు, అన్వేషణ లేదు, అన్వేషణాస్వేచ్ఛ లేదు. మతాధికారి ఏది చెబితే అది సత్యం. ఇప్పుడు సముద్రం మళ్ళీ పిలుస్తోంది. ఎంతటి సాహసానికైనా స్వేచ్ఛ ఉంది. ఎవడో యిచ్చిన సత్యం ప్రసాదంగా స్వీకరించవలసిన పనిలేదు. ఎవడి సత్యం వాడు వెతుక్కోవచ్చు. (“I want to find out the truth that is true only for me.” Kierkegaard)

స్వేచ్ఛ ఉంది. నావలు సిద్ధంగా ఉన్నాయి. కాని, సమయం అనుకూలమా? “దిగంతాలు ఉజ్జ్వలంగా లేవు. కాని స్పష్టంగా కనిపిస్తున్నాయి.” సముద్రం భద్రమేనా? లేదు. పూర్వంకంటే యిప్పుడు సముద్రం ఏమాత్రము ప్రమాదరహితం కాదు. ఇప్పుడూ అది మృత్యుసంసారసాగరమే. అంతే కాదు. నేనున్నాననే ఆశ్వాసమిచ్చే దైవంకూడా లేడు. (తేషామహం సముద్దర్తా మృత్యుసంసారసాగరాత్” — గీత) మునుగుతున్న నిన్ను ఉద్దరించేవాడు లేడు. “ఉద్ధరేదాత్మనాత్మానమ్”. ఇపుడు నీ ముందుంది “స్వచ్ఛస్వేచ్ఛాసముద్రం”.

మునిగినా తేలినా నీ బాధ్యత, నీ సాహసం, నీ స్వేచ్ఛ, నీ స్వచ్ఛత.

ఏమిటి అభయం? (“మా అభయానికి అర్థం”) జ్ఞానాన్వేషణకు బంధం తొలగింది. ఇపుడు నిర్భయంగా జ్ఞానాన్వేషణాయానం చేయవచ్చు. స్వేచ్ఛ వలన కలిగిన అభయం ఉంది. అభద్రమే. కాని బంధభయంలేదు.

ఇది నీచ దేవుడి మరణవార్త మర్మం. ఇప్పుడు మనిషి ముక్తుడు. మనిషిని ముక్తుణ్ణి చేసిన నీచపై హత్యానేరం మోపవచ్చా? బహుశా దేవుడే దీనంగా అడిగి ఉంటాడు నీచను, ఆక్సిజన్ ‘ముసుగు’ లాగేయమని! జనాలు తనతో ఆడుతున్న నాటకం అంతం చేయడానికి.

దేవుడికి చచ్చిపోవడం కొత్తేమీ కాదు. పుట్టడమూ కొత్తకాదు. ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పడప్పుడు, ఎలా భావిస్తే అలా పుడుతుంటాడు. (“సృజామ్యహం”.గీత.) కనుక దేవుడిమరణం ఒక సంచలనాత్మక ప్రకటన మాత్రమే. ఆ ప్రకటన ప్రయోజనం మనం అర్థం చేసుకోవాలి. శ్రద్ధలో సంశయం అంతర్భవించి ఉంటుంది. “సంశయాత్మా వినశ్యతి”, అంటుంది గీత. కాని “కలడో లేడో” అన్న గజేంద్రుడు నశించలేదు. సంశయంలో శ్రద్ధ పొదగబడి ఉంటుంది. ఎక్కడో వైకుంఠంలో, ఉన్నాడో లేడో తెలియని పరమాత్మ పరమేశ్వరితో ఆడుతున్న పాచికల ఆట ఆపి, తనకోసం ఆదరాబాదరా పరుగెత్తుకు వస్తాడని విశ్వసించడం ఎంత అబ్సర్డ్! (“One must make movements toward faith, but the movement of faith itself must be made continually on the strength of the absurd.”: Kierkegaard). నీచ కూడా పాత దేవునికి ఉద్వాసన చెప్పి (“The old God is dead”) సంశయంలో నుంచి, శూన్యంలోనుంచి ఒక కొత్త దేవుణ్ణి ఆవాహన చేస్తాడు. పాత దేవుడు చనిపోవడం అంటే, దేవుడంటే మనిషికున్న పాత అవగాహన తొలగి, కొత్త అవగాహన కలగడం. అంటే చచ్చిపుట్టడమంత కష్టం. అలా పుట్టినవాడు ద్విజుడు.

అస్తిత్వవాదనాస్తికవిభాగానికి ఆద్యుడని చెప్పబడుతున్న హైడెగర్, “భగవంతుడే మనలను రక్షించగలడు,” అన్నాడు ఒక యింటర్వ్యూలో:

“Only a god can save us. The only possibility available to us is that by thinking and poetizing we prepare a readiness for the appearance of a god, or for the absence of a god in [our] decline. insofar as in view of the absent god we are in a state of decline.” In an interview given by Martin Heidegger to Rudolf Augstein and Georg Wolff for Der Spiegel magazine on September 23. 1966

“[…] the absence of a god in [our] decline” అంటే దేవుడు క్షయమనేది మనలో. అది మన క్షయం. అది దైవగ్లాని. ఒక కొత్త దేవుడి ఆవిర్భావానికి మనిషి సన్నద్ధం కావలె అంటున్నాడు హైడెగర్.


Zarathustra: Prologue: 2 లో కూడా దేవుడిమరణవార్తావిషయం ఉంది.

ఆశ్రమవాసి, “నేను దేవుణ్ణి యింతగా భజనచేస్తున్నాను. నాకేమీ కానుకలివ్వవా”, అంటాడు. అంటే ఆశ్రమవాసి ఆశించేది కూలి. జారతూస్త్ర తెచ్చిన కానుక రొట్టెముక్క కాదు. మనిషిని బిచ్చగాడి స్థితినుండి ఉద్ధరించే ఆత్మవిద్య. ఆశ్రమవాసి వెటకారంగా అంటాడు: “సరే, చూడు నీ సంపద వాళ్ళు స్వీకరిస్తారేమో!” వాళ్ళకు ఆత్మవిద్య ఎందుకు? వాళ్ళడిగేది రొట్టెముక్క, అని అతని భావం. డోస్టోవ్‌స్కీ నవల “కరమజోవ్ సోదరులు” లో The Grand Inquisitor ఘట్టంలో క్రీస్తుతో న్యాయాధీశుడు (The Grand Inquisitor) యిదే అంటాడు: మనిషిని ప్రేమించేవాడు రొట్టెముక్కతో రాడు. ఆత్మవిద్యతో వస్తాడు. కాలగమనంలో వాడివాడి భాష వాడి తగ్గుతుంది. భాషకు పదును పెట్టుకోవాలి. తాత్త్వికులు కూడా వారి పదాలు తోమి పాతపదాలకు కొత్త అర్థాలు కల్పించవలసి ఉంటుంది.

అతిమానవుడు (Superman. Ubermensch)

“జారతూస్త్ర ఆ జనాలతో అన్నాడు: “నేను మీకు అతిమానవుణ్ణి ఉపదేశిస్తాను.” మనిషి మనిషిని దాటిపోవలసినవాడు. మనిషిని అతిశయించడానికి మీరేం చేశారు? ఇంతవరకు అన్ని ప్రాణులు వాటి దశను దాటి వెళ్ళాయి. మీరేం చేశారు. మనిషిని దాటి వెళ్ళడానికి? ఆ గొప్పప్రవాహంలో మీరు పొంగులో కలుస్తారా, కుంగులోనా? వెనక్కు వెళ్ళి పశువవుతారా, మనిషిని దాటి వెళ్తారా? మనిషికి కోతి ఏమవుతుంది? అపహాస్యవస్తువు, అవమానకారణం. అతిమానవుడికి మనిషి అట్లే, అపహాస్యవస్తువు. అవమానకారణం. కీటం నుండి మనిషివరకు సాగావు. కాని మీలో ఎక్కువభాగం యింకా కీటదశలోనే ఉండిపోయింది. మీరు ఒకనాడు కోతులు, కాని మీలో చాలాభాగం యింకా కోతిని మించిన కోతిగానే ఉండిపోయింది. మీలో జ్ఞానులనబడేవారుకూడా, మొక్కకు పిశాచానికి మధ్యలో ఉన్నారు. కాని నేను మిమ్మల్ని మొక్కలవమంటున్నానా, పిశాచాలవమంటున్నానా? చూడండి! నేను మీకు అతిమానవుణ్ణి ఉపదేశిస్తున్నాను! అతిమానవుడు యీ నేలకు సారం.” (Zara. Pro.1, 3.)

మనిషి అతిమానవుడుగా ఎదగడం మరొక చోట (Z.1.1) ఆత్మ “మూడు మార్పులు” (The Three Metamorphoses: Z.1.1.) చెందుతుందని చెప్పాడు నీచ.

ఆత్మ ఒంటెనుండి సింహంగా, సింహంనుండి శిశువుగా పరిణామం చెందుతుంది అంటాడు నీచ. ఒంటె దశలో మనిషి ఏం చేస్తాడు? బరువులు మోస్తాడు. “మీ భారములన్నియు నా పై వేయుడు. నేను మోసెదను”, అని మోకాళ్ళపై వంగి నిలబడతాడు. లోకం కోసం కష్టపడడం, వారి భారాన్ని వినమ్రతతో వహించడం ఒక ఆధ్యాత్మిక సుగుణంగా, దాస్యం ఒక ఆధ్యాత్మిక ఆదర్శంగా బతుకుతాడు బోధిస్తాడు ఒంటెమనిషి.

నిర్జనారణ్యాలలో భారంతో ఒంటరిగా నడుస్తూ నడుస్తూ ఒంటెకు హఠాత్తుగ సింహమై పోవాలనిపిస్తుంది. సింహస్వభావం ఏమిటి? అడవికి రాజు కావాలంటుంది. అప్పటి ప్రభువును యుద్ధంలో జయించి కదా తాను రాజు కాగలుగుతుంది? అప్పుడు రాజ్యం చేస్తున్నది ఎవరు? విధినిషేధాలతో శాసించే ప్రభువు (“Thou shalt”, “Thou shalt not”). ఆ విధినిషేధాలను ధిక్కరించి అతిక్రమించినవాడే ప్రభువు కాగలడు. పాతవిలువలను రద్దుచేసి కొత్త విలువలను ‘సృష్టించుకోగలిగినవాడే’ నరసింహుడు. సృష్టించుకోగలిగినవాడు, సృష్టించేవాడు కాదు. అంటే తన విలువలు తనకోసం మాత్రమే సృష్టించుకుంటాడు. “ఈ విలువలు అందరికీ విలువైనవి. అందరూ పాటించవలసినవి”. అని, వెనుకటి రాజులా యితరులను శాసించడు. అస్తిత్వవాదంలో మూలసిద్ధాంతం, సార్వత్రికము సార్వకాలికము సార్వజనీనము అయిన విలువలు లేవు. ఎవరి విలువలు వాడు సృష్టించుకోవలసిందే. (ఎవరి కళ్ళద్దాలు వారికే పనికొస్తాయి. పక్కవాడికి పనిచేయవు. అద్దాలైనా విలువలైనా, ఎంత విలువైనవైనా.) ఈ కొత్త విలువల స్వరూపం ఏమిటి? మంచి చెడు, పుణ్యము పాపము అనే ద్వంద్వాలకు అతీతమైన (BGE) విలువలు.

ఒంటె తన స్వభావం వదిలేసి సింహస్వభావం పొందడం మనిషి అతిమానవుడుగా ఎదగడంలో ఒక మహత్పరిణామం. (Zara. ప్రారంభంలో యింత ప్రముఖంగా ప్రతిపాదించిన అతిమానవవిషయం తరువాతి గ్రంథభాగంలో అంత ప్రాధాన్యం పొందలేదు అని నీచ పండితుల సాధారణ అభిప్రాయం. కాని గ్రంథమంతా అతిమానవవిషయమే. కనుక ఏదో కొన్ని ప్రత్యేక భాగాలలో దానిని వెదకవలసిన అవసరం లేదు. జారతూస్త్ర అతిమానవుడే.) వేలసంవత్సరాలనుండి పాటింపబడుతున్న విలువలను శాసనాలను విధ్వంసంచేసిన వాడే మృగరాజు. మానవపరిణామక్రమంలో యీ సింహదశ ఒక ముఖ్య దశ. కాని యిది అతిమానవదశకాదు. నీచ ఉపదేశించిన అతిమానవుడు, మనిషికి ఆత్మబలాన్ని ఉపదేశించేవాడు. బొద్దింకలలాగా, సందులలో పందులలాగా బతకవద్దని. స్వేచ్ఛగా సంతోషంగా బతకమని చెప్పేవాడు. అంతే కాని, తన బలంతో పరులను హింసించేవాడు కాదు. తన విలువలను యితరులపై బలవంతంగా రుద్దేవాడు కాదు. జనాన్ని తనబలంతో బానిసలుగ చేసుకునేవాడు కాదు. ఎలా కాదు? సింహదశ అవసరమే కాని, అదే పరమదశ అనడంలేదు నీచ. పశువుగా ఆగిపొమ్మనడంలేదు. శిశువుగా ఎదగమంటున్నాడు. సింహంచేయలేనిది శిశువు ఏంచేస్తుంది? సింహం విధినిషేధాలను పాతవిలువలను విధ్వంసంచేయగలదు. కొత్తవిలువలు సృష్టించడానికి కావలసిన స్వేచ్ఛను సంపాదిస్తుంది కాని, కొత్తవిలువలు సృష్టించలేదు. కనుక సింహదశకూడా దాటిపోవలసినదే. శిశుదశ ఎటువంటిది? శిశువైన అతిమానవుణ్ణి ఎలా తెలియాలి?

“అమాయకత్వము, విస్మృతి, ఒక ఆట, స్వయంగా తిరిగే చక్రము. మొదటి కదలిక. ఇవి శిశువంటే.” (Innocence is the child, and forgetfulness, a new beginning, a game, a self-rolling wheel, a first movement. a holy Yea.)

అవి ఒక్కొక్కటి పరిశీలించి చూస్తే:

  • అమాయకత్వము: పుణ్యపాపచింతలేనివాడు శిశువు.
  • విస్కృతి:అచారిత్రకత (living unhistorically) కిందటి క్షణం తాను ఏంచేశాడో జ్ఞాపకంలేకపోవడం.
  • ఒక కొత్త ప్రారంభము: కిందటి క్షణం తాను ఏంచేశాడో జ్ఞాపకంలేనపుడు. ప్రతి క్షణము కొత్త క్షణం. ప్రతి పని ఒక కొత్త ప్రారంభం. అచారిత్రకంగా బతకడం.
  • ఒక ఆట: పసివాడికి ప్రతిపనీ ఆటే. పుణ్యపాపచింతగాని, ప్రమాదభయంకాని, శిక్ష విధిస్తారేమో అన్న భయంకాని ఉండక చేసేస్తాడు.
  • స్వయంగా తిరిగే చక్రము: పసివాడు ఎవడి ఆనందంకోసం వాడు ఆడుతాడు. మరొకరి ఆనందం కోసం ఆడడు. తాను తిప్పితే తిరిగే చక్రం కాదు పసివాడు. చక్రం తిప్పేవాడి సంతోషం కొరకు తిరిగే చక్రం కాదు మనిషి. దానంతట అది తిరగవలె, తిరగడం తన ఆటగా తిరిగే చక్రం లాంటివాడు మనిషి.
  • మొదటి కదలిక: ప్రతి పని, యిది సృష్టి ప్రారంభమన్నంత నూతనం.
  • పవిత్రమైన ఆమోదము: విధిని పాటించి ఆచరించిన కర్మ అపవిత్రకర్మ. అలా కాక, స్వేచ్ఛగా చేసే కర్మ పవిత్రం. మోదంలోనుండి కలిగే ఆమోదం పవిత్ర ఆమోదం.

ఈ లక్షణాలన్నీ వెనుకటి శిశుపశువిషయమైనశారీరకమీమాంసావ్యాసంలో (నీచ-1/7) చూశాం. విధినిషేధాల స్థానంలో యిపుడు స్వేచ్ఛావర్తనం. ఇష్టంగా సంతోషంగా పనులు చేసుకోడం. కర్మనుండి ముక్తి కాదు, కర్మలో ముక్తి. క్రూరమృగంలానో, హీనమైన బొద్దింకలానో కాక, మనిషిగా బతకమని చెప్పడం నీచ అతిమానవతత్త్వోపదేశసారం. దీనిని రాజకీయప్రయోజనాలకు వాడుకుంటే అది అతని దోషంకాదు.


(సశేషం)