[భారతీయ పరిచయక్రమం అన్న శీర్షిక కింద సూరపరాజు రాధాకృష్ణమూర్తి కొన్ని పుస్తకాలు ప్రచురించారు. అందులో మొదటిది – అస్తిత్వవాద సాహిత్యం. ఈ పుస్తకంలో కీర్కెగాడ్, దొస్తోయెవ్‌స్కీ, నీచ, పిరాన్దెల్లో, కాఫ్కా, హైడెగర్, సార్త్ర, కామూ పరిచయం చేయబడ్డారు. అదే వరుసలో తిరిగి ఈమాటలో వ్యాసాలుగా పరిష్కరించి ప్రచురించడానికి అనుమతి ఇచ్చిన వారికి కృతజ్ఞతలు. ఈ పుస్తకపు ముందుమాట ఇక్కడ చదవండి.]
నీచ (Friedrich Wilhelm Nietzsche (1844-90) Germany, German)
నీచ (Nietzsche) వచనాలు:
- “వాస్తవంలో నీవేదో అదే అవు” (Ecce Homo)
“తత్వమసి” అన్న ఛాందోగ్య ఉపనిషద్వాక్యంతో పోల్చండి. - “పావురంలా మెత్తని పాదాలతో అవతరిస్తాడు అతిమానవుడు.” (Thus Spake Zarathustra)
హిట్లర్‌లా ముసోలినిలా కాదు. - “దేవుడు మరణించాడు.” (The Gay Science)
నీచ దేవుణ్ణి హత్యచేయలేదు. మరణవార్త చదివాడంతే, అయినా, హత్యానేరంలో నీచను యిరికించారు. దేవుడు లేడనడం కొన్ని మతాలలో దైవద్రోహం. కాని ఛాందసభారతీయధర్మంలో కాదు. ఈ సంస్కృతిలో “దేవుడులేకుండా జ్ఞానోదయం” కొత్తకాదు, వింతకూడా కాదు. ‘God Without Enlightenment’, a commentary on Mandukya Upanishad: by Swami Rama. - “క్రైస్తవమతం, జనాలకొరకు వచ్చిన ప్లేటోవాదం.” (Beyond Good and Evil)
శూన్యవాదం (Nihilism) కూడా నీచ ప్రవచనమే అన్నారు. శూన్యవాదం (nihilism) బ్రహ్మవాదులతో, భావవాదులతో (Idealists) మొదలయింది అంటాడు నీచ. ‘వారికి జగత్తు మిథ్య, అంటే శూన్యం. వాళ్ళు జగత్తుమొత్తాన్ని చీపురుతో చిమ్మి అవతల పడేశారు. కనుక శూన్యం నేను సృష్టించలేదు. అనవసరంగా నన్ను ఆడిపోసుకోకండి’, అంటాడు. - “ఆది అనైతికవాది”
(“first Immoralist” అని నీచ తన గురించి తానే చెప్పుకున్నమాట.)
పుణ్యపాపాల దుర్బలద్వంద్వం నుండి మనిషిని విడిపించడం అతని ఆశయం. - “మనిషి గమ్యం కాదు, వంతెన… మనిషిని అతిశయించడానికి మీరేం చేశారు?” (The Gay Science)
(ఎదగడానికి మానవజన్మ సాధనం. కీటకం బ్రహ్మముగా ఎదగడం చూడగోరేవాడు నీచ.) - “నృత్యం చేయలేని దేవుడిపై నాకు నమ్మకంలేదు.” (The Gay Science)
ఇతడు నాస్తికుడా! పాపం! అపార్థం చేసుకున్నామేమో? పాపము, శోకము తెలిసిన లోకానికి ఆనందనృత్యం నేర్పించాలనుకొన్న “నృత్యానందస్వామి”!
నీచ ప్రధానరచనలు:
– 1874. Untimely Meditations
– 1882 The Gay Science
– 1883 Thus Spake Zarathustra
– 1886 Beyond Good and Evil
– 1888. Anti-Christ
ఈ వ్యాసంలో వాడిన సంకేతాలు:
– GS: The Gay Science: Aphorisms
– GSP:The Gay Science: Preludes
– Z: Thus Spake Zarathustra
– ZP: Thus Spake Zarathustra: Prologue.
– BGE: Beyond Good and Evil
– AC:Anti-Christ
ఫ్రెడరిక్ విలెల్మ్ నీచ జీవితం
1844 అక్టోబరు 15: జననం. ప్రష్యా (ప్రస్తుత జర్మనీ) లోని ఒక కుగ్రామంలో. తండ్రి కార్ల్ లుడ్విగ్, లూథరన్ ప్రచారకుడు. నీచకు నాలుగు సంవత్సరాల వయసప్పుడు తండ్రి చనిపోయాడు. నీచను, అతడి సోదరి ఎలిజబెత్‌ను, వాళ్ళ తల్లి పెంచింది. బోన్ (Bonn University), ఆ తరువాత లైఫ్టిగ్‌లో (Leipzig) ఉన్నతవిద్య పొందాడు. అతడి ప్రధాన అధ్యయనవిషయం భాషాశాస్త్రం. బేసిల్ (Basle, స్విజర్లండ్) విశ్వవిద్యాలయంలో కొంతకాలం భాషాశాస్త్రం బోధించాడు. జీవితం మొదటి దశలో ఇతడిపై షోపెన్ హోవర్ (తాత్వికుడు), వేగ్నర్ (సంగీతకారుడు, రచయిత)ల ప్రభావం ఎక్కువగా ఉండింది. 46 సంవత్సరాల జీవితంలో చాలాకాలం అనారోగ్యం, శారీరకము మానసికము, పీడించింది. కొన్నాళ్ళు మానసికచికిత్స తరువాత 1890లో, 46 సంవత్సరాలవయసప్పుడు, తిరిగి తల్లి యింటికి చేరాడు. 1897లో తల్లి చనిపోయింది. చివరిదశలో సోదరి ఎలిజా అతని అవసరాలు చూచుకొన్నది. ఒక పిచ్చాసుపత్రిలో కొన్ని సంవత్సరాలు గడిపి, చివరకు అక్కడే చనిపోయాడు (1900లో) పెళ్ళి చేసుకోలేదు.
ఇతడు చనిపోయిన తరువాత యితడి సోదరి, మరి కొందరు, యితడి రచనలకు అపార్థాలు చెప్పి నీచకు నాజీభావాలు ఆపాదించారు. నీచ ఆలోచనలు తరువాతి కాలాలలో, తత్త్వము, సాహిత్యము, మానసిక వైద్యశాస్త్రము (!) కాక మరికొన్ని రంగాలను ప్రభావితం చేశాయి.
నీచ కావ్యశైలి
కీర్కెగార్డ్ తనది వ్యంగ్యశైలి అని చెప్పుకున్నాడు. “వ్యంగ్యం నాలో గుచ్చుకున్న బాణం, దానిని తొలగిస్తే పోతుంది నా ప్రాణం.” కీర్కెగార్డ్ వ్యంగ్యం అతి గూఢం. నీచ వ్యంగ్యం సూటిగా ఘాటుగా ఉరుములా మెరుపులా ఉంటుంది. “నా మేఘంలో భరించలేనంత ఉద్వేగం. మెరుపుల నవ్వుల మధ్య అగాధాలలోకి వడగళ్ళు విసురుతాను. నా హృదయం పర్వతాలపైకి ప్రభంజనం ఊదుతుంది. అప్పుడుకాని అది శాంతించదు. (Z. 2వ భాగం)”. నీచ కవి. అతనిది కావ్యశైలి. తన The Gay Scienceకు ముందుమాట (Preludes) పద్యాలరూపంలో రాశాడు. అతని పద్యాలలో కంటే అతని వచనంలోనే (ముఖ్యంగా ‘జరతూస్ట్ర’లో) కవితాగుణం ఎక్కువ అంటారు కొందరు. కాని, అది ఎక్కువతక్కువల విషయంకాదు. వచనంలో కవిత ప్రవాహం. పర్వతశిఖరం పైనుండి పది దిక్కులకు పరవళ్ళుగా పారే ప్రవాహం. కాని అతని పద్యాలలో కవిత, అది పిడికిట పిడుగు. అతని రచనలు కావ్యాలు. వాటిని కావ్యాలుగానే చదవాలి. తత్త్వశాస్త్ర గ్రంథాలుగా చదవడంవల్ల అపార్థం కలుగుతుంది. కలిగింది కూడా.
శారీరకమీమాంస
నీ పక్కనే గడ్డి మేస్తున్న పశువులమందను గమనించు. పశువుకు నిన్న ఏదో యీవేళ ఏదో తెలియదు. అంతటా గెంతుతుంది, తింటుంది, పడుకుంటుంది. నెమరేస్తుంది, చివ్వున లేస్తుంది. పొద్దస్తమానము అదే. దాని యిష్టాయిష్టాలు ఏ క్షణానికి ఆ క్షణం. దుఃఖంలేదు విసుగు లేదు. ఇది చూసినపుడు మనిషికి కష్టంగా ఉంటుంది. ఎందుకు? పశువుకన్నా మనిషి మేలు అని గొప్ప చెప్పుకుంటాడు కదా? కాని ఆ పశువు సంతోషం చూసి అసూయపడతాడు. మనిషికి పశువులా బతకాలని ఉంటుంది. విసుగేమిటో బాధేమిటో తెలియకుండా. కాని అతని కోరిక చెల్లదు. పశువులా అతడు సంకల్పించడు కనుక. ఒక రోజు మనిషి పశువును అడుగుతాడు: ‘నా వైపు చూస్తావు. కాని నాతో ఎందుకు మాట్లాడవు?’ పశువు జవాబు చెబుదామని అనుకుంటుంది: ‘అదీ, అదీ, అదేమౌతుందంటే, నేను చెబుదామనుకున్నది వెంటనే మర్చిపోతాను.’ కాని అప్పటికే అది ఆ మాటకూడా మరచిపోయింది. మౌనంగా ఉండిపోయింది. మనిషికి మళ్ళీ ఆశ్చర్యం.
కాని మనిషి తన గురించి ఆశ్చర్యపోతాడు. తాను మరచిపోలేడు, ఎప్పుడూ గతాన్ని నెమరేసుకుంటాడు. అతడు ఎంతదూరం ఎంత వేగంగా పరుగెత్తినా, యీ తాడు తనతో వస్తూనే ఉంటుంది. ఆశ్చర్యం! ఒక్కొక క్షణం, ఒక కదలిక, యింతలో మాయం. ఆ క్షణానికి ముందు ఏమీ లేదు, తర్వాత ఏమీ లేదు. కాని దయ్యంలా వెనక్కు వస్తుంది, తరువాతి ప్రతిక్షణపు ప్రశాంతిని భగ్నంచేస్తుంది.
కాలమనే పుస్తకంలో నుండి ఒక పుట ఊడి, గాలిలో ఆడి, ఉన్నట్టుండి మనిషి ఒడిలో వచ్చి పడుతుంది. మనిషిని వెదుక్కుంటూ ఎందుకొస్తుంది? ‘నాకు గుర్తొచ్చింది’ అంటాడు కనుక, పశువును చూసి అసూయపడతాడు కనుక. పశువు వెంటనే మరచిపోతుంది, ప్రతిక్షణము నశించి నింగిలో నిశిలో శాశ్వతంగా కలిసిపోవడం చూస్తుంది. అలా, పశువు ‘అచారిత్రకంగా’ (unhistorically) బతుకుతుంది… కనుక పశువుది ఋజువర్తనం, అది మరోలా ప్రవర్తించలేదు. దానితో పోల్చినపుడు, మనిషి అంతకంతకూ పెరిగిపోయే గతభారాన్ని మోస్తూ వంగిపోతాడు, లేక కుంగిపోతాడు. అతడి దారి దుర్గమం అవుతుంది. బయటపడకుండా ఉండడానికి అతడు, ‘అబ్బే! నేనెప్పటిదప్పుడు మర్చిపోతాను’, అంటాడు. విన్నవాళ్ళు నిజమే అనుకొని అసూయపడతారు. లేదని, కాదని అనడానికి ఏ గతమూ లేని పశువునో శిశువునో చూచినప్పుడు, తాను పోగొట్టుకున్న స్వర్గం స్మరణకొస్తుంది మనిషికి. సంతోషానికి నిర్వచనం ‘అచారిత్రకంగా’ బతకగలగడం.
గతాన్ని పూర్తిగా మరచిపోయి, క్షణమనే శిఖరంపై, విజయదేవతలాగా భయభ్రాంతుడు కాకుండా నిలబడలేనివాడు సంతోషమంటే ఏమిటో తెలుసుకోలేడు. అంతకంటే హేయం. అతడు యితరులను సంతోషపెట్టలేడు.
– From “On the Uses and Disadvantages of History for Life”: By Friedrich Wilhelm Nietzsche (From Untimely Meditations) : 1874
వ్యాఖ్య
“పశువాంఛలో వసించు ఋషిని నేను.”
(“నైనం దహతి”: నా “అగ్నిమీళే” కవితాసంపుటినుండి.)
“చరిత్ర: ప్రయోజనాలు, ప్రమాదాలు” నుండి యీ భాగం చదువుతూనే యిది కేవలం చరిత్ర గురించి కాదని తెలుస్తోంది.
“పశువునో శిశువునో చూచినప్పుడు, తాను పోగొట్టుకున్న స్వర్గం స్మరణకొస్తుంది మనిషికి”, అంటున్న నీచ చెబుతున్న స్వర్గం, పశుకామము కామసుఖము కాదు. అతడు చెబుతున్న స్వర్గం పుణ్యపాపచింత లేని (BGE) పశుస్థితి. ఒకవిధంగా నీచ పశువులో చూచింది పశుప్రవృత్తి కాదు, పశునివృత్తి. ఆ నివృత్తి కొరకే, ఆ పశుస్థితి కొరకే కిందముడు అనే ముని అతడి భార్య, కామోపభోగం కొరకు మృగరూపం పొందారు. (పాండురాజు వేట, కిందముని శాపము- మహాభారతంలో వీరి కథ ప్రసిద్ధమే.) మనం పశువుల్లా బతికేయాలి అంటాడా నీచ? అనడు. మనమూ అనం. (కిందముడి గతి చూశాం కదా?) కాని పైకి అనక పోయినా, మనిషికి పశుప్రవృత్తిపట్ల అసూయ లేదనగలమా? స్వర్గం అంటే పుణ్యపాపచింత లేక స్వేచ్ఛగా ప్రవర్తించడమే కదా? నీచ మనిషిని పశువుగా దిగజారమనడం లేదు, స్వర్గంలోకి ఎదగమంటున్నాడు. తన మలమూత్రాలలో కేరింతలు కొట్టే శిశువుగా మారమనడంలేదు. శౌచాశౌచద్వంద్వాన్ని దాటమంటున్నాడు. పశువు, శిశువు అచారిత్రకంగా (unhistorically) ప్రవర్తిస్తారు, అంటే వారికి కాలజ్ఞానం ఉండదు. కనుక పుణ్యపాప చింత కూడా ఉండదు. కాలమే కదా పుణ్యపాపాలు. ఆ సుఖం, “శిశుర్వేత్తి పశుర్వేత్తి”.
నీచ రచనలలో పశువులు ఆర్తికి (passion) ప్రతీకలు. “జరతూస్ట్ర” ముందుమాటలో (Prologue) జరతూస్ట్రకు తన గుహలో తోడు ఒక డేగ, ఒక పాము. పశుపక్ష్యాదులకు యింద్రియసుఖాలే కాని, ఆలోచన ఉండదు. ఇంద్రియ ప్రచోదనాన్ని వెంటనే అనుసరిస్తాయి. దీనినే కీర్కెగార్డ్ తాత్కాలికత (immediacy) అంటాడు. మనిషికి ఆలోచన ఎక్కువ, ఆర్తి తక్కువ. కీర్కెగార్డ్ అంటాడు: “కాలం దుర్మార్గం అయింది అంటారు అందరూ. నా కొరవ అది కాదు, యీ యుగలక్షణం అల్పత్వం. ఆర్తి (passion) లేదు.”… “ఒక చింతనాయుగంలో (age of reflection) మనం జీవిస్తున్నాం.” ఆర్తి ప్రాణిలక్షణం. పశువులో అది అత్యంత సహజం.
పుణ్యపాపచింత లేకపోవడమే స్వర్గం. స్వర్గం వెళ్ళిన అర్జునుడితో ఊర్వశి ఏమన్నది? “నీకు నేనాటి తల్లిని… యిట్టి తగవులు నడవవు… నీవును త్రిదివంబునకు వచ్చినపుడు దివ్యపురుషుండవు…” (మహాభారతం. ఆరణ్యపర్వం). కాశికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్ళినట్టు, సశరీరంగా స్వర్గం వెళ్ళిన అర్జునుడు తన మనిషి బుద్ధిని తీసుకెళ్ళాడు.
స్వర్గారోహణంలో కుక్కను వదలనక్కరలేదు. సశరీరంగా స్వర్గాధిపత్యం సంపాదించడమే ఐంద్రం. ఆ ఆధిపత్యం సాధించడమే ఇంద్రపదవి. శరీరం వదిలేసి స్వర్గానికి వెళ్ళడంలో అర్థంలేదు, అంటాడు నీచ. ఏం చేయటానికి వెళతావు అక్కడికి?
“సరి అయిన సర్సి (Circe): పశువు మనిషిగా మారడం సరికాదు. మనిషి పశువుగా మారడం సరి.” (Nietzsche: Human all too Human). సర్సి (Circe) గ్రీకు గాథలలో మనుషులను పశువులుగా మారుస్తుంది. అది సరి అయిన పని, అంటాడు నీచ “మనిషి ఎదగడం ఆగిపోయాడు. అతని కంటే కోతి మేలు, బొద్దింక మేలు”, అనే నీచ, మనిషి పశువుగా మారడమే సరి అయిన ఉత్క్రమణం అనికూడా అంటున్నాడు. “నేను మీకు పురుషోత్తముణ్ణి (Ubermensch, overman, Superman) ఉపదేశిస్తాను”, అనే నీచ యిలాకూడా అనడం అర్థమేమిటి? “మనిషి ఎంతైనా ఎదగవచ్చు, తన రతిని దాని నిరతిని వెంట ఉంచుకొని.” (The degree and nature of a man’s sensuality extends to the highest altitudes of his spirit.”4.75. BGE). ఎంత ఎత్తుకు ఎదిగినా, ఇంద్రియసుఖాన్ని, సుఖతీవ్రతను, ఆర్తిని వదలనవసరం లేదు. వాటిని త్యజించకుండానే మానవుడు దివ్యుడు కావచ్చు. వాటిని వెంటతీసుకొని ఎదిగినదే నిజమైన ఎత్తు. పశుత్వం పశుపతిత్వంలో అంశమే. అమలిన శృంగారం అర్థంలేనిమాట. మాలిన్యం మనసును అంటుతుంది, శరీరాన్ని కాదు. ఆ రెంటినీ విడిగా చూడగలగడమే ఆధ్యాత్మిక రహస్యం. శరీరస్పర్శలేని అతీంద్రియానందాన్ని చెప్పే వేదాంతులను ఎద్దేవా చేస్తాడు నీచ. “కన్యాత్వం దూషితం కాని గర్భధారణ కథలు” విన్నాం. మేరిమాత కథ (Immaculate conception) ప్రసిద్ధమే. ఇటువంటి భావాన్ని (Immaculate Perception) నీచ తన ఒక వచనఖండికలో ఖండిస్తాడు. రతిరహితగర్భధారణను (conception) సర్వవిషయగ్రహణానికి (perception) ఉపలక్షకంగా తీసుకొన్నాడు. ఏ పాపము అంటకుండా, స్త్రీ గర్భం ధరించగలిగినట్టు, ఏ పాపము అంటకుండా యీ సమస్తసృష్టినీ దృష్టితోనే అనుభవించవచ్చు, అనే వేదాంతులమాటను నీచ తన మాటలలో యిలా చెబుతున్నాడు:
“నాకు అది అత్యున్నతమైనది” – అంటుంది నీ అబద్ధాల ఆత్మ. “ఏదీ కోరకుండా జీవితాన్ని అలా చూస్తూ ఉండిపోవడం. కుక్కలా నాలుక వేలాడేసి జొల్లు కార్చుకుంటూకాదు. సంతుష్టితో ఊరక చూస్తూ ఉండిపోవడమే, చనిపోయిన యిచ్ఛతో, స్వార్థపుపట్టునుండి విడివడి, దురాశకు దూరమై నిర్వికారంగా ఒళ్ళంతా భస్మంతో, కాని కళ్ళలో కైపుతో. అది నాకు అత్యంతము ప్రియమైనది”. యిలా అంటాడు తనను తాను వంచన చేసుకునే మూఢుడు – “పున్నమి వెన్నెల నేలను ప్రేమించినట్టు ప్రేమించాలి, చూపులతో మాత్రమే తాకుతూ… నేను దేనినుండీ ఏదీ కోరను. కేవలం వాటిముందు ఉండిపోతాను, వంద కన్నులున్న అద్దంలా”.
దీనినే నేను రతిరహితవిషయగ్రహణం (Immaculate Perception) అంటాను, వంద కన్నుల అద్దంలా వాటిముందు ఉండిపోనిస్తే చాలు, మరేదీ కోరను…”ఓహ్, ఆశచావని ముసుగులో మూర్ఖులారా, మీ వాంఛలో అకళంకత లేదు.” – (Zara: 37. Immaculate Perception.)
ఇది అతీంద్రియానందవాదాన్ని ఖండించే సందర్భం.
“పున్నమి వెన్నెలలా నేలను ప్రేమించాలి, చూపులతో మాత్రమే తాకుతూ… నేను దేనినుండీ ఏదీ కోరను. కేవలం వాటిముందు ఉండిపోతాను, వంద కన్నులున్న అద్దంలా.” లోకం తనను తాను అద్దంలో చూచుకోడం విన్నాం, (“విశ్వం దర్పణదృశ్యమాన…”). కాని, లోకం అద్దం చూచుకోడం కాదు, అద్దం లోకాన్ని చూచుకోడం చెబుతున్నాడు యీ వేదాంతి! అద్దం లోకాన్ని చూచినట్టు చూడాలట! అద్దం వంద కళ్ళతో లోకాన్ని చూడడమంటే? సర్వేంద్రియాలను నిదురపుచ్చి, కన్నొకటిమాత్రం మేలుకొని లోకాన్ని చూడడం. “నేను దేనినుండీ ఏదీ కోరను. కేవలం వాటిముందు ఉండిపోతాను, వంద కన్నులున్న అద్దంలా”, అన్న వేదాంతి వాక్యానికి అర్థమేమిటి? అద్దంలా లోకాన్ని చూడడమంటే? అందమైన అమ్మాయి అద్దంలోకి చూచుకుంటే, కామవికారం అమ్మాయికి కలుగుతుంది, అద్దానికి కలగదు. అలా కామవికారం కలగకుండా లోకాన్ని చూడడం, అద్దంలా చూడడం. అద్దంలా చూడడానికి, అద్దంలో చూడడానికి యింత తేడా ఉంది. తాను ఖండిస్తున్న వాదాన్ని యింత ప్రభావవంతంగా, అందమైన కావ్యంగా చెప్పగలిగిన నీచ, వేదాంతవాదాన్ని నిజంగానే ఖండిస్తున్నాడా? నీచ దర్శనంలో ప్రధానాంశం వైరుధ్యాలను ద్వంద్వాతీతస్థితికి చేర్చి చూడడం. కనుక, యీ కామవిషయంలోనూ నీచ ఖండనమండనాలను ఒకదానిలో ఒకటి చేర్చి చూస్తున్నాడు అనవచ్చు.
కామాన్ని రెండు స్థాయిలలో చూడవలె, ధర్మము, మోక్షము. పుణ్యాపుణ్యచింత ధార్మికం. ఈ ద్వంద్వాన్ని దాటిన స్థితిలో, (BGE) అంటే ముక్తస్థితిలో, కామం ఉంటుంది. కాని దాని అనుభవం వేరు. ఆ స్థితిని దాని అందాన్ని ఆనందాన్ని ఊహించగలడు. కాని ఆమోదించడంలో బుద్ధి అడొస్తోంది. రెండూ ఒకటే అన్న అద్వయభావం అందుకోలేక రెంటికీ మధ్య దోబూచులాడుతున్నాడు నీచ.
పున్నమి వెన్నెల నేలను ప్రేమగా తాకినట్టు, కోర్కెలు డుల్లి ప్రేమమాత్రదృష్టితో సృష్టిని చూస్తూ ఉండిపోవడం అనే స్థితిని ఊహించగలిగిన నీచ, ఆ స్థితిలో యింద్రియవ్యాపారం ఉంటుందా ఉండదా అన్న దగ్గర ఆగిపోయాడు. సముద్రంలో కలిసిపోయిన గంగాయమునాకావేరీలు సముద్రంలో ఉన్నాయా, లేవా? రెండూ నిజమే. ఉన్నవి లేవు. నీచ సముద్రం ఒడ్డువరకు వచ్చాడు. “ఆపూర్యమాణమచలప్రతిష్ఠం” కాని సముద్రంలో అతనికి నదులు కనిపించడం లేదు. కనిపించవు. “ఆపూర్యమాణమచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్, తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ.” (గీత.2.70) “దేనినుండీ ఏదీ కోరక”, “న కామకామీ”- ఆ స్థితిలో వాడి కామం పున్నమి వెన్నెలలా ప్రేమతో నేలను నిమురుతుంది.
నీచ ప్రధానంగా కవి అని చెప్పుకున్నాం. ఋషికానివాడు కవికాలేడని అన్నారు. (నానృషిః కురుతే కావ్యమ్) కవికానివాడు ఋషికాలేడు కూడా. నీచ కవి, ఋషి, the philosopher artist.
అస్తిత్వవాదము: ధర్మకామము
కామవిషయంలో సాధారణంగా వినిపించే మరో ప్రశ్న: పరాశరవ్యాసులు యింకా యితరులనేకులు చేస్తే తప్పు కానిది, (శ్రీకృష్ణలీలలు, సడలని శివశక్తుల సంగము ప్రస్తుతానికి వదిలేద్దాం) మరొకరు చేస్తే తప్పు ఎలా అవుతుంది? దీనికి అస్తిత్వవాదం యిచ్చే సమాధానం చాలా అర్థవంతం. తప్పో ఒప్పో తేల్చుకోవలసింది నీవు. మరొకడి ధార్మికకొలతలు నీకు ఉపయోగించవు. నీకు ఏది ధర్మమని తోస్తే అది చేసెయ్. కాని, నీవు చేసినపనిని మరొకడి పేరు, అతడు ఎంతటి మహాత్ముడైనా, వాడుకొని సమర్థించుకోవద్దు. అతడి నుండి మద్దతు దొరకదు. అలాగే, నీ ధర్మాధర్మనిర్ణయం మరొకడికి పనికిరాదు. ఎవడి ధర్మం వాడు తెలుసుకోవలె. వాడు తెలుసుకున్న ధర్మం వాడికి మాత్రమే ధర్మం. ఎవడి సత్యం వాడు సాక్షాత్కరించుకోవలె. వెనక వేల సంవత్సరాలు తపించేవారు. ఆ సత్యసాక్షాత్కారంకోసం. ఎవడి తపన తపస్సు వాడిదే. ఇద్దరికీ సాక్షాత్కరించిన సత్యం ఒకటే (‘ఏకం సత్’). కాని ఎవడి సత్యం వాడికి మాత్రమే సత్యం. (“I want to find out the truth which is true only for me.” Kierkegaard). కనుక నీకేది ధర్మమో నిర్ణయించుకునే స్వేచ్ఛ నీకుంది. ఆ స్వేచ్ఛ ఉన్నది కనుకనే, “వాడు చేశాడు కనుక నేనూ చేశాను”, అనడానికి అవకాశం లేదు. ఈ స్వేచ్ఛనే శిక్ష అన్నాడు సార్త్ర్. (“Man is condemned to be free.”: Sartre)
“అచారిత్రకంగా బతకడం” అంటే? కాలమంటే, భూతభవిష్యత్తులే. వర్తమానం కాలం కాదు. భూతభవిష్యత్తులు లయమయే క్షణం కాలం కాదు. అది కాలాతీతస్థితి. చిత్తమంటే కాలమే. గడచిన ప్రతిక్షణం (చరిత్ర) వెనక్కు వచ్చి వేధిస్తుంది.ముందుకు పరుగులుతీస్తుంది. అలా పరుగులు తీయడమే చిత్తవృత్తి (Memory and desire). భూతభవిష్యత్తులను వర్తమానక్షణంలో లయం చేయడమే యోగసమాధి. అదే చెబుతున్నాడు నీచ, “క్షణమనే శిఖరంపై, విజయదేవతలాగా, భయభ్రాంతుడు కాకుండా నిలబడడం” అంటే అదే. గతము, అనాగతము (memory and desire) రెండే భయహేతువులు. ఆ రెండూ పుణ్యపాపాలచింతకు ఆశ్రయం. ఈ భూతభవిష్యత్తుల మధ్య ఉన్నది ఒకే క్షణం. ఆ క్షణమే నీచ చెబుతున్న “శిఖరం”. ఆ శిఖరంపై నిలవడమే “విజయం”. కాలాన్ని, అంటే పుణ్యపాపచింతను జయించడం.
దేవుడు మరణించాడు
“నా మేఘ ఉద్వేగం సామాన్యమయింది కాదు: మెరుపుల అట్టహాసాల మధ్య అగాధాలలోకి వడగండ్లు విసిరేస్తాను. నా రొమ్ము భయంకరంగా ఉబ్బుతుంది; పర్వతాలపై భీషణమైన తుఫానులు విసురుతుంది; అప్పుడు శాంతమవుతుంది.
నిజంగా, తుఫానులా వస్తుంది నా ఆనందం, నా స్వేచ్ఛ! కాని నా శత్రువులు అనుకుంటారు, సైతాను మన తలలపై గర్జిస్తున్నాడని.” (నీచ:జరతూస్ట్ర రెండవభాగం)
“నా తర్వాత మాత్రమే తిరిగి ఆశ సాధ్యం.” (నీచ: Ecce Homo: “Why I am a Destiny”)
పిచ్చివాడు
మీరు ఆ పిచ్చివాణ్ణి గురించి వినలేదా? వాడే, భళ్ళున తెల్లవారగానే లాంతరు వెలిగించుకొని, సంతకు పరుగెత్తి, ఆపకుండా అరిచాడు – ఎక్కడ దేవుడు? దేవుడెక్కడ? అని”. వాడు. అక్కడ ఉన్నవాళ్ళలో ఎక్కువమంది దేవుడిమీద నమ్మకం లేనివాళ్ళు. ఇతణ్ణి చూచి వారు నవ్వుకున్నారు. ఒకడన్నాడు, తప్పిపోయాడా? పసిపిల్లాడేమో, దారి తెలియలేదు, అన్నాడు. మరొకడు ఎక్కడైనా దాక్కున్నాడేమో, మనకు భయపడి? యాత్రవెళ్ళుంటాడు. వలస వెళ్ళాడా?” – ఇలా పెద్దగా అరుస్తూ అపహాస్యం చేశారు.
పిచ్చివాడు వాళ్ళమధ్యకు దూకి, వాళ్ళను తీక్షణంగా చూశాడు. “ఎక్కడికెళ్ళాడు దేవుడు?” అని అరిచాడు; “నే చెబుతా. మనం చంపేశాం, నీవూ, నేనూ. మనమంతా ఆయన హంతకులం. కాని, ఎలా చంపాం? సముద్రాన్ని ఎలా తాగగలిగాం? ఆయన ఆనవాళ్ళు లేకుండా దిగంతాలను ఏ తడిగుడ్డతో తుడిచేశాం? సంకెళ్ళు తెగగొట్టి యీ భూగోళాన్ని సూర్యుడి నుండి విడిపించినపుడు, మనం ఏం చేస్తున్నామో తెలిసే చేశామా? తెగిన భూగోళం ఎటు వెళుతున్నది? మనం ఎటువైపు వెళుతున్నాం? ఆదిత్యులనుండి దూరదూరంగా? పడిపోవడంలే మనం, పక్కకు వెనక్కు ముందుకు, ఎటుపడిపోతున్నామో తెలియకుండా? ఇంకా పైకి కిందికి అంటూ ఏమైనా ఉందా? అనంతశూన్యంలో అగమ్యంగా వెళ్ళడంలేదా మనం? శూన్యాకాశపు వాసన రావడంలేదా? చలి కమ్ముకురావడంలేదా? చీకటిరాత్రి కమ్మేయడంలేదా? ఉదయాన్నే లాంతర్లు వెలిగించుకోవలసి రావడంలేదా? వినబడడం లేదా. దేవుణ్ణి ఖననంచేయడానికి తవ్వుతున్నారు. శవం కుళ్ళినవాసన తెలియడంలేదా? దేవుళ్ళు కూడా కుళ్ళిపోతారు. దేవుడు చచ్చిపోయాడు. చచ్చి పడి ఉన్నాడు. మనం చంపేశాం.
ఏమని మనల్ని మనం ఓదార్చుకొందాం, హంతకులకులలోకెల్లా హంతకులం? మన సంపదలలోకెల్లా అతిపవిత్రము, అతిశక్తిమంతము అయినది ఆ దైవం. ఆ దైవాన్ని కత్తులతో పొడిచి పొడిచి చంపేశాం. మన చేతులనెత్తురు ఎవరు కడిగేస్తారు? ఎన్ని నీళ్ళు సరిపోతాయి? ఏ పశ్చాత్తాపపర్వాలు, ఏ పవిత్రక్రీడలు కనిపెట్టాలి? ఇంతటి ఘనకార్యం మనకు మించిన ఘనత యివ్వడంలేదా? ఈ ఘనత దక్కించుకోవలెనంటే మనమే దేవతలు కావద్దా? ఇంతవరకు ఎన్నడూ జరగని ఘనకార్యం యిది. రాబోయే తరాలది చరిత్రలో అపూర్వమైన ఒక గొప్ప శకం.”
ఇక్కడ ఆ పిచ్చివాడు మాట్లాడడం ఆపి, జనంవైపు చూశాడు. వాళ్ళకూ మాటలాగిపోయాయి. విభ్రాంతులై అతణ్ణిచూస్తూ ఉండిపోయారు. చివరకు అతడు తన లాంతరును నేలకు కొట్టాడు. అది ముక్కలై, దీపం ఆరిపోయింది. నేను రావలసిన సమయంకంటే చాలా ముందు వచ్చాను. ఈ మహాఘటన యింకా దారిలోనే ఉంది, అటూయిటూ తిరుగుతూ. వార్త యింకా వీరిని చేరలేదు. ఉరుముకు మెరుపుకు సమయం పడుతుంది. నక్షత్రాలకాంతి నేలను తాకడానికి సమయం పడుతుంది. సంఘటనలు, జరిగిపోయినా, లోకానికి తెలియడానికి సమయం పడుతుంది. ఈ సంఘటన వీరికి దూరపు నక్షత్రాలకంటే దూరంలో ఉంది. కాని, (హత్య) చేసింది వీరే.
ఆ తర్వాత ఆ పిచ్చివాడు చర్చిలలోకి తోసుకొని వెళ్ళి, అక్కడ దేవుని ఆత్మకు శాంతి కలుగుగాక అని ప్రార్ధనలు చదివాడని జనం చెప్పుకున్నారు. అక్కడివాళ్ళు అతన్ని బయటకు లాగి, ‘ఏం చేస్తున్నావ్?’0, అని అడిగితే, అతడు ఒకటే జవాబు యిచ్చాడట. “ఇక యిప్పుడు యీ చర్చిలన్నీ ఏమిటి, దేవుడిని పూడ్చిన గుంతలు సమాధులు కావా?”, అని.
(Friedrich Nietzsche, The Gay Science: Aphorism: వచనం: 125)
వ్యాఖ్య:
దేవుడి మీద తిరుగుబాటు దేవుడంత సనాతనమైనది. అస్తిత్వవాద ఆవిర్భావకాలంలో, దేవుడులేని సృష్టిని ఊహ చేయడం ప్రధానంగా దోస్తొయెవ్‌స్కీతో మొదలయిందని చెప్పవచ్చు. అతడి నవల “కరమజోవ్ సోదరులు”లో ఇవాస్ అంటాడు: “అద్భుతం దేవుడుండడం కాదు, దుర్మార్గుడు రాక్షసుడు అయిన మనిషి తలలోకి దేవుడున్నాడన్న ఆలోచన రావడం మహాద్భుతం.” “కనుక దేవుణ్ణి నేను ఒప్పుకోనని కాదు… అతడి యీ సృష్టిని నేను ఒప్పుకోను ఒప్పుకోలేను.” (Brothers Karamazov: ch.3)
ఇవాన్ మాటలలో రెండు అంశాలున్నాయి: ఒకటి, మనిషి సృష్టించిన అద్భుతాలలో మహాద్భుతం దేవుడు. అతని మరణం సంతోషకారణం కాలేదు. రెండు, తగాదా దేవుడితో కాదు, ఆయన సృష్టితో. ఆయన సృష్టి ఒక అన్యాయం, ఒక అరాచకం, ఒక అసంబద్ధం. అదే పాత్ర ఇవాన్ అన్న మరో మాట కూడా అస్తిత్వవాదులకు పరమ ఆదరణీయం: “దేవుడు లేకుంటే, ఏ పనికీ అభ్యంతరం ఉండదు.” (“All things are permitted, if there is no God.”) స్వేచ్ఛ అస్తిత్వవాదుల ఊపిరి.
ఇక నీచ వచనం (Aphorism 125) చూద్దాం.
“తెల్లవారిన తరువాత లాంతరు వెలిగించుకొని …”
ఇందులోని పిచ్చివాడు దేవుడికోసం వెదుకుతున్నాడు. కనుక అతడు నాస్తికుడు కాడు. కాని, ఎక్కడ వెదుకుతున్నాడు? దేవుణ్ణి నమ్మనివాళ్ళ మధ్య, సంతలో. ఇదొక పిచ్చిపని. దేవుడు చచ్చిపోయాడు, అని తెలుసు. మరి “ఎక్కడ ఎక్కడ దేవుడు?” అని జనాలను అడగడమేమిటి? ఇది మరో పిచ్చిపని. ఈ నీతికథలో పిచ్చివాడి పిచ్చి మొదటే తెలిసిపోతుంది. భళ్ళున తెల్లవారిన తరువాత లాంతరు వెలిగించుకొని సంతకు బయలుదేరాడు. ఇంతకంటే రోగనిదానం ఏముంటుంది! ప్రవక్తలందరూ పిచ్చివాళ్ళేనేమో!
(ఆ లాంతరు వెలుగు తన కోసం కాదు, దేవుణ్ణి వెదకడానికి కాదు. అది “సంత”లోని జనం కొరకు. కాని వాళ్ళకు చీకటి చీకటి అని తెలియడం లేదు. లాంతరు అవసరమూ తెలియడం లేదు. అందుకే అనవసరంగా ముందే దీపం తెచ్చానని, దాన్ని పగలగొట్టి వెళ్ళిపోయాడు.)
ఖలీల్ జిబ్రాస్ కూడా ఒక కవిత రాశాడు పిచ్చివాడి మీద, “నేను పిచ్చివాణ్ణిలా అయ్యాను”: “ఒక రోజు నేను నిద్రలేచేటప్పటికి, నా ముసుగులన్నీ ఎవరో దొంగిలించారు. నేను ఏడు జన్మలలో సంపాదించుకొన్న ముసుగులు… ముసుగులు లేని నేను, ‘దొంగలు! దొంగలు!’ అని అరుస్తూ వీధుల్లో పరుగెత్తాను. జనాలు నన్ను చూసి నవ్వారు. కొందరు భయపడి యిళ్ళలోకి వెళ్ళిపోయారు. నేను సంతలోకి వెళ్ళగానే, అక్కడ యింటి మీద నిలబడినవాడొకడు నన్ను చూచి, ‘వాడు పిచ్చోడు’, అని అరిచాడు. అతన్ని చూడడానికి తలెత్తాను. ముసుగులేని నా ముఖాన్ని సూర్యుడు మొదటిసారి ముద్దుపెట్టుకున్నాడు. నా ముసుగులు దొంగిలించినవారెవరో కాని, వారు పుణ్యాత్ములు. అదుగో, అలా అయ్యాను పిచ్చివాణ్ణి.”
ఈ జిబ్రాన్ కథలో ముసుగులను వేదాంతులు కోశాలు అనవచ్చు. కాకపోతే వేదాంతులు ఏడుజన్మలకు పరిమితం చేయరు ముసుగులను. కొన్ని కోట్ల జన్మలలో ఏర్పడిన ముసుగులు. ఆ ముసుగులు దొంగిలించగలిగిన పుణ్యాత్ముడు కొన్ని కోట్ల జన్మలకుగాని దొరకడు. “ఆచార్యవాన్ పురుషో వేదః”. (ఛాందోగ్య ఉపనిషత్తు 6.14.2).
“తెల్లవారిన తరువాత లాంతరు వెలిగించుకోడం” అంటే దేవుడు చనిపోయిన తరువాత సమస్తజగత్తు చీకటి కమ్మి ఉంది. అప్పుడు లాంతరు వెలిగించుకోడం అవసరం. లోకానికి చీకటి తెలియడంలేదు. జగద్వ్యాపారమంతా (సంత) చీకటిలో జరిగిపోతోంది. కొత్తవెలుగు (లాంతరు) తెచ్చినవాడు పిచ్చివాడు, అంటే ప్రవక్త. ఈ చీకటి వెలుగులనే భగవద్గీత “యా నిశా సర్వభూతానాం” అని చెప్పింది.
నీచ కథలో దేవుడిది చావుకాదు, హత్య అంటాడు పిచ్చివాడు. హత్య చేసిందెవరు? “నీవూ, నేనూ”, అంటాడు. అంటే, మనమందరమూ, ఆస్తికులు నాస్తికులు తాత్వికులు కూడా. నాస్తికులెలా హత్య చేస్తారు? వాళ్ళు దేవుడే లేడంటారు కదా? లేని దేవుణ్ణి హత్యచేయడమేమిటి? నాస్తికులు కాదనేది దేవుణ్ణి మాత్రమే. ఆ దేవుడిపై నమ్మకం ఆధారంగా నిలిచిన తక్కిన వ్యవస్థలు విలువలు, వీటికి వివిధమైన పేర్లు – సామ్యవాదం ఉదారవాదం సంక్షేమవాదం. యివి వారు వద్దనడం లేదు. కనుక వీరందరూ ఆస్తికులే. ఏదో ఒక విశ్వాసం లేనిదే వీరికి శ్వాసలేదు. భద్రత లేనిదే బతకలేడు మనిషి. కనుక దేవుడి మరణం కేవలం మతసంబంధం కాదు. దేవుడు కేవలం ఆదివారం ఆలయాలలో లేడు, సోమవారం సంతలో కూడా దేవుడే. సమస్త సామాజికవ్యవస్థలు విలువలు దేవుడితో సంబంధించినవే, ఆయన పేరు మాత్రం పనికిరాదు. కనుక దేవుడి మరణంతో పాటు యివన్నీకూడా పోతాయి, పోవాలి.
కాని, ఏమైనా పోయిందా? ఏదీ పోలేదు. ఒక్క దేవుడి పేరు మాత్రం పోయింది. దేవుడు చనిపోయినా, అతని నీడను చూపించి యింకా కొన్ని వేలసంవత్సరాలు జనాలను నమ్మిస్తారు, దేవుడు బతికే ఉన్నాడని. ఇలా ఎంతకాలం జనం తమ్ము తాము మోసం చేసుకుంటారు, శవాన్ని అలంకరించి సింహాసనంపై కూర్చోపెట్టి రాజ్యం నడిపిస్తారు?
హంతకులకు హంతకులం.
మరి దేవుణ్ణి చంపింది ఎవరు? దేవుడిది మరణం కాదు. అది హత్య, మనం, మన చేతులతో ఆయన్ను దారుణంగా చంపుకున్నాం. (“And we have killed him. How shall we comfort ourselves, the murderers of all murderers?”)
మనం మామూలు హంతకులమా? హంతకులకు హంతకులం, “the murderers of all murderers”. ఎందుకు? ఎలాంటి వాడిని చంపాం? ఎలా చంపాం? పరమపవిత్రమైన (“holiest”) దైవాన్ని చంపుకున్నాం. ఆయన సర్వశక్తిమంతుడు, “mightiest of all”. అంత శక్తిమంతుణ్ణి కూడా చంపగలిగాము అంటే, మన ఆసురశక్తి అంచనా వేయగలమా? ఎలా చంపాం? నెత్తురు కారేదాకా కత్తులతో పొడిచి పొడిచి చంపాం, (“bled to death under our knives”) ఈ చేతులనెత్తురు కడగడానికి ఎన్ని సముద్రాల జలం సరిపోతుంది? (What water is there for us to clean ourselves?”) ఈ నెత్తుటి వాసన పోవడానికి ఎంత అరేబియా సుగంధం సరిపోతుంది? ఈ పాపానికి ఏ కొత్త ప్రాయశ్చిత్తం కల్పించాలి? (“What festivals of atonement, what sacred games”) మానవజాతిని మొత్తం మేక్బెత్ స్థాయికి ఎత్తేశాడు (లేక, దించేశాడా?) నీచ, పేరు చెప్పకుండా.
ఈ మాటలు నాస్తికుడు, లేక దైవవిద్వేషి పలికినవి అని ఎవరనగలరు? ఎంత ప్రేమలో ఎంత పశ్చాత్తప్తహృదయంలో నుండి వచ్చిన మాటలివి? ఈ పాపానికి ఒకటే ప్రాయశ్చిత్తం. “ప్రభువు చనిపోయాడు. ప్రభువు చిరకాలం జీవించుగాక!” (“The king is dead. Long live the king) దేవుడు చనిపోయాడు. దేవుడు చిరకాలం జీవించుగాక. “పాత దేవుడు మరణించాడు” (old God is dead”), కొత్త దేవుడు ప్రతిష్ఠింపబడుగాక.”
ఈ కొత్త దేవుడు ఎక్కడనుండి వస్తాడు? తిరిగి ప్రతిష్ఠించడం హత్య చేసినవాడి బాధ్యత. హత్య చేసినవాడే ప్రాణం పోయవలె. (“Only as creators can we destroy.” GS.586) అతడే దేవుడు కావలె. (“Must we ourselves not become gods simply to appear worthy of it?”) అదే అతని పాపానికి నిజమైన ప్రాయశ్చిత్తం. “తత్వమసి” నుండి “అహం బ్రహ్మాస్మి”.
ఇంతకూ యితడు హత్యను, హంతకులను నిందిస్తున్నాడా? లేక హత్య మంచిదే అంటున్నాడా? రెండూ అంటున్నాడు, పిచ్చివాడు కదా! ఒకవైపు, మనిషికి ఉండిన సంపదలలోకెల్ల దేవుడు గొప్పసంపద, అతన్ని చంపుకున్నాము, హంతకులలోకెల్ల హంతకులం మనం అంటాడు. అంతేకాదు, దేవుడు అతిశక్తిమంతుడు, అంతటి శక్తిమంతునికూడా చంపగలిగామంటే మనది ఎంతటి రాక్షసబలం? అంటూ హత్యను నిందిస్తాడు. మరొకవైపు, “దేవుని హత్య యీ సృష్టిలో జరిగిన ఘనకార్యం, దానితో పోల్చదగినది లేదు. దాని ఘనతను మనం నిలుపుకోవద్దా”, అంటాడు. ఇంతకంటే విరుద్ధమైన పిచ్చవాగుడు ఏముంటుంది! ఇతనిది పిచ్చివాగుడా! నీచకు పరలోకమందు తండ్రి కాదు (My father in Heaven), నేలమీద నడిచే దేవుడు కావాలి. కనుక పైలోకాన్ని శూన్యం (Nihilism) చేసి, అక్కడి దైవాన్ని దివినుండి భువికి దించాడు. బుద్ధుడిలా శూన్యంతో సంతృప్తి చెందలేదు నీచ. అతనికి మనిషి కావాలి.
(Overman, Superman, Beyond-man. ఈ అతిమానవుడిగురించి తరువాత)
(సశేషం)