హిందుత్వతో సనాతన ధర్మ ఘర్షణ

సనాతన ధర్మం – హిందుత్వ ఒకటేనా? సనాతన ధర్మం యొక్క కొనసాగింపు హిందుత్వ అనవచ్చా? లేక రెండూ పర్యాయపదాలా?

నిజానికి హిందుత్వ, సనాతన ధర్మం ఒకటి కావు. సనాతన ధర్మంతో పూర్తి ఘర్షణలో హిందుత్వ పుట్టింది. సనాతన ధర్మం స్థానికం. హిందుత్వ వలసవాద ప్రతిధ్వని. విదేశీ మూలాలు కలది. కాలం అనంతం అని సనాతన ధర్మం చాటుతుంది. హిందుత్వ స్థలకాలాలను కుదిస్తుంది. చరిత్ర అనే పాశ్చాత్య భావనను నెత్తికి ఎత్తుకొని జాతీయ అస్తిత్వాన్ని నిర్మిస్తుంది. సనాతన ధర్మం ప్రకారం కాలం అనాది. దానిలో చక్రాకృతిలో భ్రమించే సంవత్సరాలు తిథులు ఉంటాయి కాని, కాలానికి సంబంధించిన స్పష్టమైన ఆది అంతాలు గుర్తులు ఉండవు. అందుకే భిన్న కాలాల తాత్వికులు, కవులు ఒకే చోట నిలబడి సంభాషిస్తారు. వారికి కాలం అవరోధం కాదు. మీమాంసాశాస్త్ర కారుడు కుమారిల భట్టు, శంకరాచార్యులు కలిసి వాదించినట్లు కథ ఉంది. కానీ వారు ఇద్దరూ భిన్న శతాబ్దాలకు చెందిన వారు అని చరిత్రకారులు చెప్తారు. అయినా శంకరాచార్యులు కర్మ మీమాంసను పూర్వపక్షం చేయడం నిజం. అంటే శంకరుడు ఒక కాలాతీత స్థితిలో కుమారిల భట్టుతో సంభాషించాడు. అలాగే రాజాశ్రయాన్ని ఇష్టపడ్డ శ్రీనాథుడు రాజాశ్రయాన్ని నిరాకరించిన పోతనల మధ్య సంభాషణ సాధ్యమే, కాలాలు వేరైనప్పటికీ. నామరూపాలు స్థలకాలాలు సనాతనంలో అప్రధానం. సనాతనమంటే స్థలకాలబద్ధం కానిది అని అర్థం. అందుకే, భారత ఖండంలో చారిత్రక పురుషులు ఉండరు. పురాణ పురుషులు మాత్రమే ఉంటారు. చారిత్రక పురుషులకన్నా పురాణ పురుషులు ప్రభావశీలులు అని సోషలిస్టు రామ్మోహన్ లోహియా అంటారు. అశోకుడు, శ్రీకృష్ణదేవరాయలు వంటి చారిత్రక పురుషుల గురించి కన్నా రాముడు, రావణుడు, అర్జునుడు, కర్ణుడు, ఏకలవ్యుడు లాంటి పురాణ పాత్రలనే అందరూ ఆదర్శంగా స్మరిస్తూ ఉంటారు. చారిత్రక ఆధారాలు ఆసక్తిని కలిగించకపోవడమే కాదు అవరోధాలుగా కూడా భావించబడతాయి. అవి మన ఊహాశక్తిని స్థలకాలబద్ధం చేస్తాయి. అందుకే ఇతిహాసాలు కావ్యాలు పురాణాలు రాసిన కవులు కూడా పురాణపాత్రులుగానే భాసిస్తారు, వారి పేర్లు కూడా సింబాలిక్ గానే ఉంటాయి. వేదములను విభజించిన వాడు వేదవ్యాసుడు, కాళికా భక్తుడు కాళిదాసు ఇలా… అరిస్టాటిల్, ప్లేటోలవలె చారిత్రక నామధేయాలు స్థలకాలాలు ఉండవు. ఒకవేళ ఆధునిక చరిత్రకారులు స్థలకాలాలను స్థిరీకరించినా సాధించినా మనం వాటిని పట్టించుకోము. లేఖనం, గ్రంథస్తీకరణ, డాక్యుమెంటేషన్ ఇక్కడ ద్వితీయ స్థాయికి చెందినవి.

శ్రుతి స్మృతులు మనకి ప్రమాణాలు. శ్రుతి అంటే వినబడేది. స్మృతి అంటే జ్ఞాపకం పెట్టుకునేది. అంటే జ్ఞానం పరంపరాగతం, కర్తృత్వం అప్రధానం. అందుకే వాల్మీకి రామకథని తనకు బ్రహ్మ చెప్పాడు అంటాడు. ఇలా ప్రతీకవి తనకు పూర్వీకుల నుంచి కథలు, జ్ఞానము ఒకరినుంచి మరొకరికి పరంపరగా వచ్చాయని చెబుతారు. అన్నింటికీ మూలంగా భావించే వేదం కేవలం వల్లె వేయడం ద్వారా మౌఖికంగా కాపాడబడింది. లేఖనం మహాపాపంగా భావించబడింది. నిఘంటువులు, తత్వ ఖగోళ గణిత శాస్త్ర గ్రంథాలు కూడా వల్లె వేయడానికి, గుర్తుంచుకోవడానికి వీలుగా సూత్ర శ్లోక రూపాలలో పొందుపరచబడ్డాయి. మౌఖికత ప్రాధాన్యం, మౌఖికతకు ఉపాంగంగా లేఖనం కొనసాగడం అనేది జయధీర్ తిరుమల రావు బయటపెట్టిన జానపద కృతులు, కుల పురాణాలలో కూడా కనపడే వాస్తవం. ఇలా స్థలకాలాల పట్ల ఖాతరు లేకపోవడం, కాలం చక్రాకృతిలో పరిభ్రమించడం అచారిత్రికతగా, వెనుకబాటుగా పాశ్చాత్య భావజాలం వల్ల ప్రేరేపితులైన మేధావులు భావించారు.

హిందూ సనాతన ధర్మం ప్రకారం విశ్వానికి, కాలానికి ఆది అంతం లేవు. ఇలా ఆద్యంతాలు లేని విశ్వం, యుగ పరంపర సృష్టి ప్రలయాలతో చక్రాకృతిలో అనంతంగా కొనసాగుతుంది. బీజ-అంకుర న్యాయంతో కొనసాగుతుంది. ఇది అనంత క్రమం. సాంఖ్య ప్రకారం బీజoలోనే వృక్షం, అంటే కారణంలోనే కార్యం ఉంది. మనుషులు పుట్టి పెరిగి వృద్ధాప్యo పొంది మరణించినట్లే, జగత్తులో కాలం కూడా ఉత్తమ కృతయుగంగా ప్రారంభమై, క్షీణ కలియుగంగా అంతరిస్తుంది. ఇది పురోగతి, దేవుడు రెండవ రాకడ అన్న భావనకు విరుద్ధమైనది. హరప్పా మొహంజదారో లాంటి నాగరికతల పతనం కూడా ఈ భావనకు మూలం కావచ్చు. కాలాన్ని దేవుడు సృష్టించడం కాదు కాలమే భూమి ఆకాశాలను సృష్టిస్తుంది. కాలమే అన్నిటికీ అధిపతి. చివరికి విశ్వాన్ని శాసించే ప్రజాపతికి కూడా అధిపతి. అందుకే సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా సుదీర్ఘకాలంలో అంతరిస్తాడు. సూర్యునితో కాలం మొదలైంది, అంతకుముందు కాలమే లేదు. సూర్యునితో కాల విభజన మొదలైంది. రాత్రీపగలు, సంవత్సరాలు… కలయతి — జలచక్రంలా జీవులని ముందుకు నెడుతూ నడిపిస్తూ కలచివేసేదే కాలం. కాలం ఉన్న వాటిని కనపడకుండా చేస్తుంది — ఆవరణ. ఇంతవరకు లేని కొత్త వాటిని భాసించేలా చేస్తుంది – విక్షేప. భర్తృహరి సిద్ధాంతం ప్రకారం కాలం కదిలించే శక్తి, పరబ్రహ్మయొక్క స్వతంత్ర శక్తి. నిజానికి కాలానికి అనంత నిత్య వర్తమానంలో విభజన లేదు. భూత భవిష్యత్తులు కూడా ఉండవు. అది పరబ్రహ్మస్థితి. కాలం ఒక బంధనం, బంధిఖానా. దాని నుంచి విముక్తి ఆత్మజ్ఞానం ద్వారా సాధ్యం. అంటే తన ఉనికి కాలాతీత స్థితిలో ఉంది అనేది జ్ఞానం. కాలాన్ని గురించి ఉపనిషత్తులు, అధర్వ వేదం, వ్యాకరణ శాస్త్రం చెప్పిన అభిప్రాయాలు వివరంగా చెప్పడానికి కారణం, భారతీయ దృక్పథం తెలియనిదే భారత చరిత్ర గురించి సమాజం గురించి పాశ్చాత్య దృక్పథాలు తీసుకువచ్చిన మార్పు అర్థం కాదు.

స్వయంభూ, స్వతస్సిద్ధం అనే భావాలు సనాతన ధర్మంలో ప్రధానమైనవిగా నిలిచాయి. కర్తృత్వానికి ప్రముఖత లేదు. ఇది మానవకేంద్రక వాదాన్ని బలపడకుండా చేసింది. సిద్ధాంత శిరోమణిలో భాస్కరాచార్యులు అంటాడు: ‘భూమికి ఆది శేషువు కానీ మరొకరు కానీ ఆధారంగా ఉన్నారు అని అంటే, ఆ ఆధారానికి మరొక ఆధారం చెప్పాలి. ఇది అంతులేని అవ్యవస్థకు దారి తీస్తుంది.’ సృష్టికర్త ఉన్నాడు అంటే ఆ సృష్టికర్తకు మరొక సృష్టికర్త ఉండాలి. ఇదే ఆధారంతో దేవుడిని తిరస్కరించారు సాంఖ్య సిద్ధాంతులు. పౌరాణికులు అద్వైత వేదాంతులు సాపేక్షసత్యంగా (రెలేటివ్ ట్రూత్) సృష్టికర్తను చూపారు. అయినా సృష్టికి ఆది లేదు కనుక సెమిటిక్ మతాలలో ఉండే దేవుడు లాంటి దేవుడు లేనేలేడు. క్రియేషన్ వంటిది హిందూ సనాతన ధర్మంలో లేదు. క్రైస్తవులు యూదులు ముస్లింల ప్రకారం సృష్టి అనేది ఒక ప్రత్యేక నిర్దిష్ట సమయంలో ఒకేసారి జరుగుతుంది. హిందూ ధర్మంలో బ్రహ్మ నుంచి అనేకసార్లు అనేక జగత్తులు ఉద్భవిస్తాయి, లయమవుతాయి. అనంతమైన పునరావృత్తి. దీనివల్ల కాలం కూడా అనంతం కావడం వల్ల భూత భవిష్యత్తు వర్తమాన విభజన కల్పితం. బ్రూనో లాంటి అనేకమంది ఆధునిక సైంటిస్టులు ఊహించినట్లే అనంతప్రపంచాలు అనంతజీవులు అనంతకాలాలు అనే భావం హిందూ బౌద్ధ జైన కాస్మాలజీలో సాధారణంగా కనబడతుంది అంటారు ప్రముఖ రచయిత ఒక్తేవియో పాజ్. అయితే అనంతమైన విశ్వ ఆవిర్భావాల చక్రగమనం నేటివ్ అమెరికన్లలో కూడా కనపడుతుంది అంటారు ఆయన.

క్రైస్తవుల దృష్టిలో కాలం క్రమబద్ధమైనది. క్రైస్తవ కాలం అనేది పేగనిజం బోధించిన చక్ర భ్రమణాన్ని పోలిన కాలదృష్టిని ఛేదించింది. దానితో చరిత్ర అనే భావన పుట్టింది. స్థల కాలాలని క్రమబద్ధమైనవిగా స్పష్టంగా వర్గీకరించదగినవిగా చూసే చారిత్రక దృష్టిని కొందరు చరిత్రకారులు బలంగా విమర్శిస్తున్నారు. ఆస్ట్రేలియా మూలవాసుల కథనాల ఆధారంగా ఆస్ట్రేలియా చరిత్రను పునర్నిర్మిస్తున్నారు కొందరు. డాక్యుమెంట్స్, లిఖిత ఆధారాలే చరిత్ర రచనకు ఆధారం అనే భావనని తిరస్కరిస్తున్నారు. వలసవాదుల రాకకు ముందు చరిత్ర అనేది లేదు అని యూరోప్ వలసవాదులు వాదించారు. భారత ఖండాన్ని కూడా పాత నిబంధన కాలంనాటి ప్రీహిస్టారిక్ టైమ్‍లో నిలిచిపోయిన దేశంగా వర్ణించారు. మానవకేంద్రక వాదం అనేది వలసవాద దృష్టి వల్ల బలపడింది. యూరోపియన్లు ఆధునిక చరిత్ర నిర్మాతలు. మిగిలిన జాతుల గతం అంతా ప్రీహిస్టరీ అనే భావన రాజ్యం చేసింది. ఈ భావన ఆధునిక చరిత్రకారులను, వారి స్థలకాల దృష్టిని బలంగా ప్రభావితం చేసింది. స్థలకాలాలు, చరిత్ర స్థిరీకరించబడ్డాయి, ఘనీభవించబడ్డాయి. దానివల్ల మిశ్రమ కాలం, మిశ్రమ సంస్కృతి నుంచి బయటపడి స్వచ్ఛమైన అస్తిత్వాన్ని సొంతం చేసుకోవాలనే స్వచ్ఛ దృక్పథం బలపడింది. దానివల్లనే భగవంతుడిని సర్వవ్యాపిగా చూసే దృష్టి నశించి మసీదు శిథిలాలలో చారిత్రక డాక్యుమెంట్లలో దైవాన్ని వెతికే హిందుత్వ పుట్టింది. వామ దక్షిణపక్షాలు, ఆధునిక సంస్కర్తలు, ఆధునిక విద్యావంతులు స్పష్టమైన ఐడెంటిటీ కోసం వెతికారు. భారతదేశంలో గ్రీకు పాశ్చాత్య పద్ధతులలో స్థలకాలాలు స్పష్టంగా నిర్ధారించలేకపోవడానికి కారణం భారతదేశంలో చలనం, పురోగమనం క్షీణించడంగా చరిత్రకారులు భావించారు. ఇలాంటి వాదాలకి విరుగుడుగా హిందుత్వవాదులు హిందూ విజేతల చరిత్రను నిర్మించారు. అటువంటి వారిలో సావర్కర్ ముఖ్యుడు.

సావర్కర్ హిందుత్వ

సావర్కర్ బాలగంగాధర తిలక్ లాగే ఆర్య వలస సిద్ధాంతాన్ని ఆశ్రయించాడు. స్థలకాలాలలో గమనం, వివిధ జాతుల్ని జయించి కలుపుకొని రాజ్యస్థాపన చేయడం వంటి కథనాల ద్వారా హిందూ చరిత్రను నిర్మించాలని చూశాడు. అంటే ఇంగ్లీషు వలసవాదులకి ఉండే విజేతల చరిత్ర వంటిదే హిందూ అస్తిత్వాన్ని కూడా రూపొందించింది అని సావర్కర్ వాదన. భారతీయులకు చరిత్ర లేదు అనే వలసవాద ధోరణికి ఇది ప్రతిస్పందన. ఆర్యుల వలస గురించి మాట్లాడుతూ సావర్కర్ ఇలా అంటాడు: ‘ఆర్యులకి విద్యాధరులు, అప్సరసలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, కిన్నరులు అందరూ శత్రుత్వాన్ని ప్రకటించిన వాళ్ళేం కాదు సరి కదా అప్పుడప్పుడు వాళ్ళు స్నేహితులుగా ఉదారంగా ప్రవర్తించినట్లు కూడా ప్రమాణాలు ఉన్నాయి. విజేతలైన ఆర్యులు వివిధ జాతులను కలుపుకుంటూ పోవడం వల్లనే హిందువులనే జాతి ఏర్పడింది.’

సావర్కర్ ఈ వాదాన్ని కొనసాగిస్తూ హిందూ అనే పదాన్ని ఆర్యులు సింధువుగా సంస్కృతీకరించి ఉంటారని అంటాడు. ఆర్య అనార్య, దక్షిణాది ఉత్తరాది అనే పదాలను కూడా ఉపయోగిస్తాడు. అయితే ఈ మొత్తంలో వలస వచ్చిన ఆర్యులే మార్గదర్శకులు, విజేతలే చరిత్ర నిర్మాతలు. అయితే ఆర్య అనార్య సాంకర్యాన్ని అంగీకరించడం విశేషం. అయోధ్య రాజకుమారుడు రాముడు లంకలో విజయపతాకని ఎగరవేయడంతో, ఆసేతుశీతాచలాన్ని ఏకసార్వభౌమత్వం లోకి తీసుకురావడంతో ఒక పరాకాష్టకు చేరి హిందువుల ఏక సామ్రాజ్య స్థాపన చేయాలన్న తపన ఫలోన్ముఖం అయింది. ఏ రోజున ఆర్య రాజకుమారులే కాక దాక్షిణాదివారు సుగ్రీవ విభీషణులు కూడా ప్రణయపూర్వకంగా దాసోహం అన్నారో, ఆ రోజు హిందువులకు నిజమైన పుట్టినరోజు. ఎందుకంటే ఆర్యులు అనార్యులు ఒకే తాటి మీద, ఒకే నేత కింద బంటులై ఒకే రాష్ట్ర ప్రజలుగా భావించుకున్నారు. కనుక ఈ సంఘటిత ప్రజానీకం ఒక కొత్త ఉద్దేశాన్ని, ఒకే రాష్ట్ర జాతీయ సంజ్ఞను, ఒకే ధ్యేయాన్ని తర్వాత తరాల ముందు ఉంచారు. కులవ్యవస్థ ఈ హిందూ ఏకీకరణ లక్ష్యానికి అడ్డంగా నిలిస్తే దానిని నిర్మూలించక తప్పదని స్పష్టం చేస్తాడు సావర్కర్.

హిందూత్వం వేరు హిందూ మతం వేరు అని సావర్కర్ స్వయంగా చెప్తాడు. హిందుత్వ నిజానికి ఒక సంపూర్ణ ఇతిహాసం, చరిత్ర. హిందూమతం దానిలో భాగం. మతం అనగానే ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ ఆలంబనగా ఏర్పడిన ఒక సిద్ధాంతం, ఒక స్మృతి అని తడుతుంది. కానీ హిందుత్వ మతవిశ్వాసం కాదు. హిందువుల మూలం ఆర్యుల వీరత్వంలో ఉంది. వారి విజయ చరిత్రలో ఉంది అని సావర్కర్ నమ్మాడు. అందుకే తన జీవితంలో కూడా హిందూ, బ్రాహ్మణ ఆచారాలు పూర్తిగా పక్కన పెట్టాడు సావర్కర్.

స్మృతి అనే పదం సాధారణంగా పూర్వీకులతో అనుబంధం సూచిస్తుంది. గిరిజనులే కాదు హిందువులలోనూ పితృదేవతలకి ప్రాధాన్యం ఉంది. కానీ సావర్కర్ తన జీవితంలో భార్య చనిపోయినప్పుడు కర్మకాండ జరపలేదు. అంతేకాదు తాను చనిపోయాక కూడా కర్మకాండ జరపవద్దని ఆదేశించాడు. సావర్కర్ స్మృతి నుంచి చరిత్ర భావన లోకి ప్రయాణించాడు. స్మృతి అనేది కాల విభజనకు లొంగనిది, చరిత్రలో ఇమడనిది. గిరిజనులకి అయినా హిందువులకి అయినా తండ్రులు తాతలు పితృదేవతలు గత కాలానికి సంబంధించిన చరిత్ర కాదు. వర్తమానంలోకి నిరంతరం చొచ్చుకు వచ్చే స్ఫూర్తి. కానీ సావర్కర్‌కి స్మృతి కాదు, చరిత్ర ముఖ్యం. ఆర్యుల గతం, ఆర్యుల స్మృతి భారత ఖండానికి ఆవల ఉన్నది అనే చరిత్ర భావనని సావర్కర్ బలపరుస్తాడు. అందువల్ల ఆర్యులు భారత ఖండానికి వచ్చాక తమ గత స్మృతిని, ఇతర భూభాగంతో తమకు గల ఆధ్యాత్మిక, మానసిక, సాంస్కృతిక అనుబంధాన్ని పూర్తిగా తెంచుకొన్నారు అంటాడు. అందువల్ల వారికి స్మృతి కాదు, విజయ చరిత్ర ముఖ్యమైనది.

సావర్కర్ హిట్లర్ యొక్క ఆర్యజాతి సిద్ధాంతంతో ప్రభావితుడయ్యాడు. హిందువులు ఆర్యులు. ఆర్యులు బౌద్ధంలాంటి క్షీణ సిద్ధాంతాల ప్రభావం వల్ల అనాగరిక బర్బరీకుల చేతుల్లో పరాజితులయ్యారు. బౌద్ధమతం నైతికంగా గొప్పదే, శాంతియుతమైన మతమే కానీ శాంతి, అహింసలే దాని బలహీనతలు. అందువల్ల అశోకుడు కాదు విక్రమాదిత్యుడులా శత్రువులని హింసాత్మకంగా తిప్పి కొట్టే హిందూ రాజులే అనుసరణీయులు. అట్టివారు మాత్రమే ఆర్య హిందూ సంస్కృతిని నిలబెడతారు. అహింస, సర్వజన సమానత్వం అనేవి నల్లమందు లాంటివి. బౌద్ధం చైనా లాంటి దేశాలలో రాజ్యమతంగా మారి హిందూదేశంపై దాడి చేసింది. దానినీ హిందువులు తిప్పికొట్టారు అంటాడు సావర్కర్. ఆశ్చర్యం ఏమిటంటే ఈ హిందువులు కూడా విదేశీయులే అన్న సత్యాన్ని కప్పిపుచ్చడు: ‘సింధునదిని దాటి మన జాతీయ పెద్దలు తమ పూర్వ సంబంధీకుల్ని వదిలి ఈ వేపుకు వచ్చారో ఆ రోజే వాళ్ళతో సంబంధాన్ని పూర్తిగా తెంచుకున్నారు. ఒక నవ్యాశని ఒక నూతనమైన అధ్యాయాన్ని ముందు పెట్టుకుని సమ్మేళనంతో వ్యాపనoతో ఒక మహాజాతిగా వర్ధిల్లి, ఒక మహారాజ్యంగా ఏర్పడిన ఆనాటి ప్రజకి సింధువులు హిందువులు అన్న పేరు సార్థకము, భావనోద్దీపకము అయ్యింది.’ సావర్కర్ ఇటువంటి చరిత్ర కల్పన ద్వారా ఆశిస్తున్నది ఏమిటి? ఒకే జాతి హిందూజాతిగా అందరూ పరివర్తనం చెందడం.

సాంకర్యం లేని జాతి ఉండదు. హిందువులు సంకర జాతియే కానీ వారిని నడిపేది ఆర్య సంస్కృతి. ఒకే ఒక ఆర్యసింధు సంస్కృతి నిర్మాణం సావర్కర్ లక్ష్యం. మీరు నిజంగా ఒక జాతేనా? మీ అందరిలో నిజంగా ఒకే రక్తం ప్రవహిస్తోందా అని ప్రశ్నించేవాళ్ళు ఉన్నారని తెలుసు. దానికి బదులుగా ఎదురు ప్రశ్న, ఇంగ్లీషువాళ్ళు అందరూ ఒక జాతేనా అని ప్రశ్నిస్తాడు. నాగవంశం ఒక ద్రావిడ వంశమా? అలా అయితే నాగ కన్యలకి అగ్నివంశ యువకులతో, ఈ రెండు వoశాల యువకులకు చంద్రవంశ సూర్యవంశాల కన్యలతోనూ వివాహాలు జరగడం వలన పుట్టినవాళ్ళు ఏమవుతారు? ఇలా వర్ణ, జాతి సాంకర్యాన్ని తీవ్రంగా బయట పెడుతూ కులాలు జాతులకు అతీతంగా ఒకే ఒక హిందూజాతి అనే భావనను ప్రవేశపెడతాడు సావర్కర్. మనిషికి సంబంధించినoతవరకు ప్రపంచంలో ఒకే జాతి ఉంది అంటూ జాతి భావన సాపేక్షం అంటాడు. కులాంతర వివాహాల వల్ల హిందుత్వ దెబ్బ తినదు అన్ని కులాలు హిందువులే అంటాడు సావర్కర్.

ఆర్య అనార్య జాతుల సాంకర్యం గురించి స్పష్టం చేసిన సావర్కర్‌కి కులం పట్ల పట్టుదల లేదు, కుల నిర్మూలన జరగాలని కూడా అన్నాడు. కుల నిర్మూలన అనే పదాన్ని గాంధీ కూడా ఎప్పుడు ఉచ్చరించలేదు. ఆర్య అనార్య సాంకర్యాన్ని హిందువుల పురోగతికి మూలంగా చూసిన సావర్కర్ హిందూ ముస్లింలను మాత్రం శాశ్వత శత్రువులుగా చూశాడు. ఇక్కడే హిందుత్వ సిద్ధాంతానికి మూలాలు ఉన్నాయి. బౌద్ధులు జైనులు సిక్కులు కూడా హిందువులే. భారత ఖండాన్ని తమ పుణ్యభూమిగా భావించడమే దానికి ప్రమాణం. కానీ ముస్లిం క్రైస్తవ విశ్వాసాలలో ఈ నేలకు స్థానం లేదు అంటాడు. ఆర్యుల ఆక్రమణని ఇతర జాతులలో వారి విస్తరణని సాంస్కృతీకరణను సమర్థించిన సావర్కర్ ముస్లింల ఆక్రమణని ఎందుకు తెగనాడాడు? ఎందుకంటే ముస్లింలు తమ మాతృభూభాగానికి చెందిన స్మృతిని విడువలేదు. పైగా, ముస్లింలు వారి సంస్కృతినీ మతాన్నీ భారత్‌లో వ్యాపింపచేశారు. ఆర్య జాతి, ఆర్య రక్తం, ఆర్య సంస్కృతీ ప్రపంచంలోనే ఉత్తమమైనవి అనే నాజీల భావజాలంతో ప్రభావితుడైన సావర్కర్, అవి మాత్రమే ప్రపంచమంతా విజయం చెందాలనీ వ్యాపించాలనీ భావించాడు. అందువల్ల ముస్లిం సంస్కృతిని ఆర్యహిందూ సంస్కృతిని ధ్వంసం చేసేదిగా భావించాడు.

హిట్లర్ భారతీయులందరినీ అనార్యులు అన్నాడు. బ్రిటీషు వలసవాదులు మాత్రమే ఆర్యులు అని, వారు ఎప్పటికీ భారతీయులపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలనీ కోరుకున్నాడు. మొదట్లో, తాను సాయుధపోరాటం చేసిన సమయంలో, హిందూ ముస్లిం ఐక్యతతో జరిగిన సిపాయిల తిరుగుబాటుని మొదటి స్వతంత్ర సంగ్రామంగా కీర్తిస్తూ పుస్తకం రాసిన సావర్కర్ తరువాత బ్రిటీషువారికి లొంగిపోయాక ఈ హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రవచించాడు. ఈయన రాసిన హిందుత్వం పుస్తకంలో బ్రిటీషు వలసవాదం పట్ల వ్యతిరేకత కనపడదు. హిట్లర్ చెప్పినట్లు బ్రిటీషువారిని కూడా ఆర్యులుగా భావించడమే కారణం కావచ్చు. అందుకే బ్రిటీషు పాలన నుండి విముక్తిని కాక ఆర్య సంస్కృతి విస్తరణనే ముఖ్యంగా భావించాడు.

సనాతన ధర్మం, హిందుత్వ వేరు అని సావర్కర్ స్పష్టంగా గుర్తించాడు. లోకమాన్య తిలక్ సనాతన ధర్మాన్ని ‘వేదాలను ప్రమాణంగా భావించటం, సాధనాలు, మార్గాలు అనేకంగా ఉండటం, ఉపాసించవలసిన వస్తువులలో ఏ నిర్బంధం లేకపోవడం’ సనాతన ధర్మ లక్షణాలుగా నిర్వచించాడు. తిలక్ చెప్పిన ఈ నిర్వచనం ముమ్మాటికి హిందుత్వ నిర్వచనం కానే కాదు. అది సనాతన ధర్మం, లేక శ్రుతి స్మృతి పురాణాత్మక ధర్మం తాలూకు నిర్వచనం అని సావర్కర్ అంటాడు. ఈ సింధూనదీ సాగరవ్యాప్త భూఖండాన్ని తన పితృభూమిగా మాతృభూమిగా తన తాత ముత్తాతల భూమిగా భావించడమే హిందుత్వ లక్ష్యం అంటాడు సావర్కర్. హిందువులకి ఉండే సౌకర్యం ఏమిటంటే వాళ్ళ పవిత్ర స్థలాలు ఈ నేల మీదే ఉండడం. క్రైస్తవులకి ముస్లింలకి ఆ అవకాశo లేదు. భిన్నత్వం కాక అందరు హిందువులలో ఆచార వ్యవహార ధర్మాలలో ఏకత్వం ఉందని, జాతి సాంకర్యం వలసలు విభిన్న కులమతాలు వీటన్నిటినీ అంగీకరిస్తూనే అన్నిటికీ అతీతంగా హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు సావర్కర్. అదే సమయంలో ముస్లిం క్రైస్తవులను మినహాయించాడు. జాతి భావన సాపేక్షం అనే సత్యాన్ని అంగీకరిస్తూనే జాతివాదాన్ని బలపరిచాడు సావర్కర్. హిందుత్వ సిద్ధాంతాన్ని తన బంచ్ ఆఫ్ థాట్స్ పుస్తకం ద్వారా మరింత పరిపుష్టం చేసిన వ్యక్తి గురూజీ అనే పిలవబడే గోల్వాల్కర్.

గోల్వాల్కర్ హిందుత్వ

ఏకాత్మత అనే పదం గోల్వాల్కర్‌కి ఇష్టమైన పదం. ఒకే బలమైన అజేయమైన జాతి అనే భావన హిందుత్వకు మూలం. అదే జాతి భావనతో సావర్కర్ హిందుత్వని వివరిస్తే, ఒకే ఆత్మ అందరిలో ఉంది అనే ఆలోచనతో ప్రారంభిస్తాడు గోల్వాల్కర్. ఈ ఏకాత్మత హిందూ సమాజాన్ని ఒక విశిష్ట జాతీయ స్వభావంతో ఏకం చేస్తుంది. ప్రపంచ శాంతికి కూడా ఆ హిందూ సమైక్యత అవసరం. పాశ్చాత్య ఇండాలజిస్టులు హిందువులు ఆధ్యాత్మిక ఆధిక్యత కలిగినవారని అన్నారు. ఇలా చెప్పడం ద్వారా, హిందువులు ఒక పారలౌకిక ధోరణిలో పడి తమని తాము పరిపాలించుకునే భౌతిక సామర్థ్యాన్ని కోల్పోయారు అనే భావనని వారు ముందుకు తెచ్చారు. కానీ గోల్వాల్కర్ హిందువుల ఆధ్యాత్మిక ఆధిక్యత అనే భావనని హిందూ జాతి ఆధిపత్య సిద్ధాంతంగా మలిచాడు. సామ్యవాదం, ప్రజాస్వామ్యం (పెట్టుబడిదారీ వ్యవస్థ) రెండు విఫలమయ్యాయి. హిందుత్వ సరైన పరిష్కారం.

పరమాత్మ స్థాయిలోనే సమానత్వం కుదురుతుంది కానీ భౌతిక స్థాయిలో అదే పరమాత్మ ఆశ్చర్యకరమైన వైవిధ్యంతోనూ అసమానతలతోనూ లోకంలో వ్యక్తం అవుతాడు. సాంఖ్య సృష్టి సిద్ధాంతాన్ని బట్టి చూసినా అసమానతలు ప్రకృతిలో విడదీయరానివి. అసమానతలను హద్దులలో ఉంచడం వరకే చేయగలం. సమానత్వం కాదు, సమన్వయం కావాలి. నరాజ్యం న చ రాజాసీత్… రాజ్యం లేదు, రాజు లేడు, దండన లేదు, దండించేవాడు లేడు. ప్రజలంతా ధర్మాన్ని అనుసరించి పరస్పర రక్షణ చేసుకునేవారు అనే మహాభారత కృతయుగ వర్ణన ఆధారంగా హిందూ సమష్టి జీవనమే అన్ని సమస్యలకి పరిష్కారం అంటాడు గోల్వాల్కర్. నిర్వచనాలకి అందని హిందూ సంస్కృతి గొప్పతనాన్ని చాటుతాడు. నెహ్రూ కూడా తన భార్య చితాభస్మాన్ని గంగలోనే కలపడంలో నెహ్రూలోని ఆధునిక విద్యాసంస్కారంపై హిందూ సంస్కృతి ఆధిక్యత స్పష్టమైంది అంటాడు.

పురుష సూక్తంలో హిందూ సమాజమే భగవంతుని స్వరూపంగా వర్ణించబడింది. ఈశావాస్య మిదం సర్వం – ఈ సృష్టి అంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అతడు నీకై వదిలిన దానిని అతనికి నైవేద్యం చేసిన అనంతరం అనుభవించు. ఇతరుల సంపదను దోచుకోవద్దు. ఈ ఉపనిషత్ వాక్యాన్ని స్వీకరించి అధికారికంగా భౌతిక సంపాదన సంపదను సాధించాలి. సేవాభావం పెంపొందించుకోవాలి. మన సంస్కృతి ఇంద్రధనస్సు లాంటిది. సత్యం ఒక్కటే, పండితులు అనేక విధాలుగా చెబుతారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించ గలిగి, స్పర్ధకు బదులు సమరసతను చూడగలిగి, స్వార్థానికి బదులు సమాజాన్ని సేవించాలి. సనాతన ధర్మంలోని అనేక వాక్యాలకి ఇలా హిందుత్వ పరమైన అర్థాలు ఇస్తాడు గోల్వాల్కర్. ధారణాత్ ధర్మమిత్యాహుః — వ్యక్తులను ఒక చోట చేర్చి వారిని ఒక సమాజంగా నిలబెట్టగలిగిన శక్తి ధర్మం. బలమే జీవనం బలహీనతయే మరణం. నాయమాత్మా బలహీనే న లభ్యః — దేవుడు బలహీనులకి లభ్యం కాడు. హిందువు నిర్వచనానికి అందడు. అదే అతని గొప్పతనం. సనాతనులు విశ్వం, వేదం అనాది అని చెప్తారు. హిందూ జాతి అనాది అంటాడు గోల్వాల్కర్. పరమ సత్యాన్ని నిర్వచించలేనట్లుగానే హిందూజాతిని నిర్వచించడం సాధ్యం కాదు.

భగవంతునిపై విశ్వాసమే పాశ్చాత్య దేశాలకు ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన శక్తిని చాలా వరకు సమకూర్చింది. త్యాగం కాదు విజయం సాధించడమే అసలైన విషయం. విజయవంతం కాని వ్యర్థత్యాగం పట్ల గోల్వాల్కర్ వ్యతిరేకత చూపుతాడు. అయితే దైవాన్ని దర్శించిన దేశం భారతదేశం మాత్రమే కనుక విజయం చెందే లక్షణం కలిగి ఉంది. సావర్కర్ జాతివాదం ఆధారంగా హిందూ శక్తిని స్థాపిస్తే, తనదైన పద్ధతిలో హిందూ సంస్కృతి నిర్వచించడం ద్వారా హిందూజాతి శక్తిని స్థాపిస్తాడు గోల్వాల్కర్. స్వధర్మే నిధనం శ్రేయః — ఆత్మవిస్మృతి పరానుకరణం అనే నివురును ఊదివేసి స్వచ్ఛమైన జాతీయాత్మ జ్వాలలను సంపూర్ణoగా తేజరిల్లచేయాలి అని అంటాడు గోల్వాల్కర్. మన హిందూ జాతీయ సంస్కృతి వల్లనే మనం పరాయి పరిపాలనను ఎదిరించి నిలిచాము అని చెప్తాడు. అయితే ముస్లిం పరిపాలనను ఎదిరించడం గురించి చెప్పేటప్పుడు ఆధ్యాత్మిక వాదుల గురించి మాత్రమే కాదు హిందూ యోధులు, వీరుల గురించి ప్రస్తావిస్తాడు. రామానుజ మధ్వాచార్యులు మాత్రమే కాదు, విజయనగర సామ్రాజ్య రాజులు, గురు గోవిందు, సిక్కుయోధులు మొదలైన వారి వీరత్వo వల్లనే దుష్టమైన దేశ విద్రోహ శక్తులు, ముస్లిం ఆక్రమణదారులు నిర్మూలించబడ్డారు అంటాడు.

అయితే విదేశీ ఆంగ్ల పాలన గురించి ఇటువంటి ఆగ్రహం కనపడదు. ఆంగ్ల పాలనపై నిరసన గురించి తెలుపుతూ రామకృష్ణ పరమహంస, వివేకానంద, దయానంద, రమణ మహర్షి లాంటి ఆధ్యాత్మికవేత్తల పేర్లు మాత్రమే ప్రస్తావిస్తాడు. బ్రిటిష్ వారిపై సాయుధ పోరాటం చేసిన వారి గురించి ఎక్కడా ప్రస్తావించడు. కనీసం శాంతియుతంగా రాజకీయ పోరాటం చేసిన వారి గురించి కూడా పూర్తి మెప్పుకోలుగా మాట్లాడడు. మొత్తంగా చూసినప్పుడు ఆంగ్లేయులు దైవభక్తి నాగరికత కలిగినవారు అనే ప్రశంస కనపడుతుంది. ముస్లింలు దుష్టశక్తులు మాత్రమే. అయితే ఇంగ్లీషువాళ్ళు చేసిన నేరం ఒకటే, అది మనం ఒక జాతి కాదని చెప్పడం. కానీ ఆంగ్లేయులు పచ్చి మాంసం తినే అనాగరికులుగా జీవించే కాలంలోనే, మనం ఒకే జాతిగా నిలిచామంటూ కొన్ని సంస్కృత శ్లోకాలను ప్రమాణంగా చూపుతాడు. కానీ ఇంగ్లీష్ వలసవాదంపై పోరాటం గురించి ప్రసక్తి చాలా తక్కువ. ఇంగ్లీషు వలస విస్తరణని దైవభక్తి పర్యవసానంగా చెప్పాడు గోల్వాల్కర్. వైట్ మెన్స్ బర్డెన్ అనే సిద్ధాంతం అటువంటిదే. అనాగరికులైన దేశాల వారిని ఉద్ధరించడానికి బ్రిటిష్ పాలక వర్గాన్ని దేవుడే నియమించాడు అనే వాదనకి గోల్వాల్కర్ అభిప్రాయం ఒక ప్రతిధ్వని.

‘ముస్లింలు క్రైస్తవులు ఇక్కడి వారే కదా, వారిని మీలో ఒకరిగా ఎందుకు భావించరు’ అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘హిందువులకు చేవలేదు. తానొక్కడే అయితే స్వతంత్రం కోసం పోరాడే శక్తి చాలదు. ముస్లిం రక్తం ఎక్కిస్తేనే ఇవన్నీ కలుగుతాయి అని నమ్మించారు. హిందూ ముస్లిం సమైక్యత లేనిదే స్వరాజ్యం లేదు అని చెప్పి మన నాయకులు సమాజానికి ద్రోహం చేశారు’ అంటాడు. సాయుధంగా కానీ శాంతియుతంగా కానీ జరిగిన స్వతంత్ర పోరాటంలో హిందూ ముస్లిం ఐక్యత ప్రధానం. మొదటి స్వతంత్ర పోరాటం గురించి సావర్కర్ రాసిన గ్రంథంలో కూడా ఈ వాస్తవాన్ని ప్రస్తావించక తప్పలేదు. అందుకే మొత్తంగా స్వతంత్ర పోరాటకారుల గురించి ప్రస్తావించడు గోల్వాల్కర్. సావర్కర్ కూడా అంతే. ఇది భయంకరమైన ఆత్మవిస్మృతి. హిందువుల ఆత్మవిస్మృతి గురించి గోల్వాల్కర్ పదేపదే ప్రస్తావిస్తాడు. ఇదే సందర్భంలో ఛత్రపతి శివాజీ గురించి ప్రస్తావించిన గోల్వాల్కర్, భగత్ సింగ్ గురించి కానీ మరే స్వతంత్ర పోరాటవీరుని గురించి కానీ ప్రస్తావించడు. ప్రీ బ్రిటిష్ ముస్లిం వ్యతిరేక యుద్ధవీరులలో హిందూ జాతీయతాస్ఫూర్తి ఉంది కానీ ఆంగ్లేయ వ్యతిరేక స్వతంత్ర పోరాటంలో అది లేదు అంటాడు గోల్వాల్కర్. అందువల్ల అది జాతీయ స్వతంత్ర పోరాటం కాదు.

ఆర్యజాతి వాదం ద్వారా హిందుత్వం నిర్వచించాడు సావర్కర్. హిందూ ధార్మిక గ్రంథాలు ఇతిహాస పురాణాలకు హిందూ జాతీయవాద వ్యాఖ్యలు కూర్చాడు గోల్వాల్కర్. అయితే అందరు హిందూ జాతీయవాదులలోని సామ్యం ముస్లింలను పరాయివారుగా నిర్ధారిస్తూ ఒకే ఒక పూర్తి యూనిఫార్మిటీ గల హిందూజాతి భావనని వ్యాపింప చేయడం.

హిందుత్వపై సనాతన ప్రతిస్పందన

హిందూమతం హిందూ సంస్కృతులను కేవలం కులవివక్షగా చూపుతూ చేసే విమర్శ హిందుత్వ విమర్శ కాదు. అది హిందూ జాతీయ వాదంపై విమర్శ అని అనలేం. అది హిందూ మతం హిందూ సంస్కృతులపై వలస క్రైస్తవ విమర్శకు కొనసాగింపు మాత్రమే. హిందుత్వ అనే హిందూ జాతీయ వాదం పూర్తిగా ఆధునికం, భారతీయ బహుళ సంస్కృతితో సంబంధం లేనిది. సావర్కర్, గోల్వాల్కర్ లాంటి హిందుత్వ వాదులకు వ్యతిరేకంగా గట్టి ప్రతిస్పందన మొదట్లో కుల నిర్మూలనవాదులు, ఆంటీ బ్రాహ్మన్ మూమెంట్ నుంచి రాలేదు. గోల్వాల్కర్ రచన బంచ్ ఆఫ్ థాట్స్‌కి వ్యతిరేకంగా గట్టి ప్రతిస్పందన సనాతనవాది, వర్ణవ్యవస్థను పూర్తిగా సమర్థించిన కరపాత్ర స్వామి నుంచి వచ్చింది. ఆయన గోల్వాల్కర్ హిందుత్వ భావాలను పూర్తిగా ఖండిస్తూ ఆర్ఎస్ఎస్ ఔర్ హిందూ ధర్మ్ అనే పుస్తకం రాశాడు. కరపాత్ర స్వామి (1907-1980) ధర్మాచార్యులు మాత్రమే కాక అఖిల భారతీయ రామరాజ్య పరిషత్ అనే రాజకీయ సంస్థను కూడా స్థాపించాడు. లోక్ సభలో కొన్ని స్థానాలు గెలిచారు కూడా. బహు గ్రంథకర్త.

హిందూ జాతీయవాద రాజకీయ సంస్థ జనసంఘ, మరియు ఆర్ఎస్ఎస్ సంస్థల భావజాలాలని ఇలా తూర్పారపడతాడు కరపాత్ర స్వామి: ‘ఉగ్రజాతి రక్త స్వచ్ఛత గురించి హిట్లర్ అభిప్రాయాన్ని జనసంఘీలు అనుకరిస్తారు. హిట్లర్ యూదు ద్వేషం లాగే సంఘీలకు ముస్లిం ద్వేషం ఎక్కువ. హిట్లర్ సైనిక కవాతు ద్వారా, బల ప్రదర్శన ద్వారా ప్రజలపై ప్రభావం వేశాడు. స్వయంసేవకులు కూడా అదే చేస్తారు. హిట్లర్ దృష్టిలో జర్మనీ జాతీయులు మాత్రమే పౌరులు. అలాగే సంఘీయుల దృష్టిలో ముస్లింలు క్రైస్తవులు హిందూ వేషభాషలను స్వీకరిస్తేనే హిందూ దేశ పౌరులు అవుతారు.’ ఇలా అనేకసార్లు హిట్లర్ తరహా జాతీయవాదాన్ని భారతీయ ప్రజల నెత్తిపై రుద్దడానికి వ్యతిరేకిస్తారు కరపాత్ర స్వామి.

గోల్వాల్కర్ ఏకాత్మతావాదం పేరుతో ప్రతిపాదించిన హిందూ జాతీయవాదాన్ని హిట్లర్ ఫాసిజంగా తిరస్కరించాడు కరపాత్ర స్వామి. నిజానికి మూస ఐక్యతని కాదు, భేదాన్ని విశేషాలని వైవిధ్యతనీ భారతీయ ధర్మశాస్త్రాలు ఇతిహాసాలు దర్శనాలు ప్రతిపాదించాయి. వైశేషిక దర్శనం విశేషాలకు ప్రాధాన్యాన్ని ఇచ్చింది. అసలు ఆస్తిక దర్శనాలు అన్నీ ఏకత్వాన్ని ప్రతిపాదించవు. సాంఖ్యయోగ విశిష్టాద్వైత ద్వైత సిద్ధాంతాలు అన్నీ ఆత్మను ఈశ్వరుని కంటే పూర్తి వేరు అని చెప్పాయి. ఏకాత్మతా వాదంతో హిందువులను అందరినీ నిర్వచించడం కుదరదు అంటారు కరపాత్ర స్వామి. కనుక ఐక్యత, యూనిఫార్మిటీ హిందూ ధర్మ విరుద్ధం అంటారు కరపాత్ర స్వామి. అయితే ఆయన హిందూ జాతివాదానికి విరుద్ధంగా బహుళత్వంతో కూడిన కులవ్యవస్థని సమర్థిస్తారు.

భావనాబలం, సంకల్పం ఉంటే హిందూజాతి గొప్పదిగా అవతరిస్తుoది అని గోల్వాల్కర్ అంటాడు. అదే భావనాబలంతో క్రైస్తవులు ముస్లింలు తమ జాతి గొప్పదని చాటుకోవచ్చు కదా అని నిలదీస్తాడు కరపాత్ర స్వామి. హిందుత్వకి అనుగుణంగా భారతీయ తత్వాన్ని ఆలోచనలని వక్రీకరించడాన్నీ తీవ్రంగా ఖండిస్తాడు. నిత్య అనిత్య వస్తు వివేకం అనే శంకర అద్వైత భావనని హిందూ సమాజ పరంగా అన్వయిస్తాడు గోల్వాల్కర్. హిందూజాతి నిత్యం, వ్యక్తి అనిత్యం అని హిందూ జాతికి శాశ్వతత్వాన్ని ఆపాదిస్తాడు. అలాగే హిందూజాతి అనాది అంటారు. వేదాలు జగత్తు అనాది అని వైదికభావన. ఇలా వైదిక దార్శనిక భావాలను అర్థం మార్చి చెప్పడం తగదు అంటాడు కరపాత్ర స్వామి. పరమాత్మ నిత్యం, సంసారం జగత్తు అనిత్యం ఈ సత్యాన్ని తెలుసుకుంటే మోక్షం సిద్ధిస్తుంది అనేది మాత్రమే తత్వం. హిందూ వ్యక్తి అనిత్యమైనప్పుడు హిందూ సమాజం కూడా అనిత్యమే అవుతుంది అంటాడు కరపాత్ర స్వామి. వేదాలు ఉపనిషత్తుల విస్తృతమైన విశాలమైన అర్థాన్ని సంకుచిత పరిధిలోకి లాక్కురావడాన్ని విమర్శిస్తాడు.

అలాగే కాషాయ జండా నివృత్తి మార్గానికి చెందినది. సన్యాసులకు చెందినది. ప్రవృత్తి మార్గానికి చెందిన సంసార గృహస్తులకు చెందినది కాదు. అది అందరు హిందువుల జెండా అనడం కుదరదు. ఇలా కాషాయ జెండాని సొంతం చేసుకున్న హిందుత్వవాది గోల్వాల్కర్‍కు సన్యాసులు, స్వాములు, నివృత్తి మార్గపరులు, సాత్వికుల పట్ల గౌరవం లేదు. ఆధ్యాత్మిక రామాయణాన్ని పారాయణ చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవ్యక్తిని పురుషకారానికి దూరమైన వానిగా విమర్శిస్తాడు గోల్వాల్కర్‌. కానీ ‘హిందూజాతి భావనకు ఆధారంగా మాత్రమే భారతీయ ఆధ్యాత్మికతను చూస్తూ జన్మ విముక్తిపై ఆధారపడ్డ మోక్షభావనని పక్కన పెట్టారు’ అని గోల్వాల్కర్‌ను విమర్శించాడు కరపాత్ర స్వామి. దేశం పట్ల ప్రేమతో నెహ్రూ భార్య భస్మాన్ని గంగానదిలో కలపడంలో హిందూమత విశ్వాసం ఉండక్కర్లేదు అని సమాధానం చెబుతాడు.

హిందుత్వ వాదులు భారత రామాయణాల్ని సంఘటనలుగా చూస్తున్నారు. ఆధునిక చరిత్రగా చూస్తున్నారు, ఇతిహాసాలుగా కాదు. అందువల్లనే వాటిలో బోధించబడిన ధర్మం పట్ల హిందూవాదులకు విశ్వాసం లేదు. వీరి కన్నా క్రైస్తవ ముస్లింలలో వారి మతగ్రంథాల పట్ల ప్రమాణ బుద్ధి ఉంది అంటాడు స్వామి. హిందూ జాతీయవాదం హిందూ ఆధ్యాత్మికతకి విశ్వాసాలకు గొడ్డలి పెట్టు అని నిరూపిస్తాడు. ఆత్మ-పరమాత్మ పరమైన ఉపనిషత్ శ్లోకాలను హిందూ జాతివాదానికి కుదించడాన్ని విమర్శిస్తాడు. ఆత్మజ్ఞానం విశ్వాన్ని సర్వమానవుల్ని సర్వజీవుల్ని సమదృష్టితో చూస్తుంది. సూఫీయిజంలో కూడా ఇటువంటి ఏకాత్మవాదం ఉందని గుర్తు చేస్తాడు. కానీ ఆ వాదాన్ని అనంత బ్రహ్మాండ లోకాలు, అందులోనూ ఒక బ్రహ్మాండం, ఒక గ్రహం, మానవులు, అందులోని హిందువులకు సంకుచితం చేయడం హిందూ ఆధ్యాత్మికతకు తప్పుడు అర్థం చెప్పడమే అని వాదిస్తాడు కరపత్ర స్వామి.

ఏకాత్మవాదం పేరుతో ముస్లింలని క్రైస్తవులని హిందువులుగా మార్చే శుద్ధి కార్యక్రమాన్నీ కరపాత్ర స్వామి పూర్తిగా తిరస్కరిస్తాడు. ఆర్య సమాజ్ మరియూ హిందుత్వవాదుల శుద్ధి కార్యక్రమం ఘర్‌వాపసీని హిందూ ధర్మ విరుద్ధం అని కరపాత్ర స్వామి పూర్తిగా వ్యతిరేకించాడు. ఒకే సూత్రంలో కూర్చబడిన వివిధ రంగుల మణిమాలతో భారతదేశాన్ని పోలుస్తాడు. జాతీయత అంటే ఏకజాతీయత కాదు. అటువంటి జాతీయత హిందువులకు వినాశకరం. ఈ మూస పద్ధతిని వ్యతిరేకిస్తూ సంస్కృతo అందరి భాష కాదు ద్విజాతి భాష అంటాడు. ముస్లిములతో ఇతర జాతులతో ఆదాన ప్రదానాలు ఎప్పటి నుంచో స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరి ధర్మం వారిది అయినా ఇటువంటి స్నేహభావం సాధ్యమే దానికి ఏకాత్మత వాదం, ఒకే జాతి అనే వాదం అవసరం లేదు. దేశం ఆధారంగా హిందూ ముస్లిం హిందూ క్రైస్తవులు అని పిలవవచ్చు. ఊరి మీదకి ఎవరైనా దాడికి వస్తే కులమతాలకు అతీతంగా అందరూ ఏకమవుతారు. ఆ విధంగా సంస్కృతులు మతాలు ధర్మాలు వేరైనా దేశంగా ఐక్యత సాధ్యమే. సరిహద్దులపై భూభాగంపై ఆధారపడి జాతిని నిర్వచించడం కుదరదు. పితృభూమి పుణ్యభూమి అనే భావాలు పూర్తిగా తప్పు. ముస్లిముల పవిత్ర స్థలాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాశీ మొదలైన వాటిని పుణ్యస్థలంగా భావించని జైనులు హిందువులయితే హిందూ ముస్లింలు (భారత్‌లో నివసించే ముస్లింలు) కూడా హిందువులే. పురాణాల ప్రకారం మొత్తం భూమి అంతా భారతమే. ఇరాన్ కాందహారులు కూడా భారత్‍లో భాగంగానే వ్యవహరించబడ్డాయి. గోల్వాల్కర్ సావర్కర్ హిందుత్వం ప్రకారం అన్య దేశాల్లోని హిందువులు హిందువులు కాకుండా పోయే ప్రమాదం ఉంది. సంఖ్య పెంచుకోవడం కోసం హిందూ ధర్మాన్ని పాటించని జైన బౌద్ధ సిక్కులను కూడా హిందువులని అనడం అసంగతం.

పరిణామవాదం ఉపయోగతావాదం ఆధారంగా గోల్వాల్కర్ హిందూ గ్రంధాలలోని సిధ్దాంతాలని వక్రీకరించాడు. త్యాగం కన్నా విజయమే గొప్పది అన్నాడు. హిట్లర్ రాసిన మై స్ట్రగుల్ పుస్తకం ప్రభావం గోల్వాల్కర్‍పై ఉందని కరపాత్ర స్వామి విమర్శ. ఈనాడు ఉదారవాదులు కమ్యూనిస్టులు దళిత బహుజనవాదులు, హిందుత్వవాదులను హిట్లర్ అనుయాయులు అని నిందించడం చూస్తాం. అయితే ఒక సంప్రదాయవాది అయిన స్వామి సుమారు అర్థశతాబ్దం క్రితమే అటువంటి ఆరోపణ ఎలా చేశాడు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం గతంలోకి తొంగి చూడాలి.

ప్రగతిశీలులలో హిందుత్వ

అప్పట్లో భారతీయులు, ముఖ్యంగా బెంగాలీ శిష్టవర్గాలు హిట్లర్‍ను విష్ణుమూర్తి అవతారంగా పూజామందిరాలలో పెట్టి పూజించారు.

సావిత్రీ దేవి (Maximiani Julia Portas) అనే గ్రీకు మహిళ అసిత్ కృష్ణ ముఖర్జీ అనే బ్రాహ్మణుడైన నాజీ పత్రిక అధిపతిని పెళ్ళి చేసుకుంది. హిట్లర్‌ను విష్ణు అవతారంగా చాటింది. నాజీల గూఢచారిగా పనిచేసింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక జర్మనీ వెళ్ళి నాజీ భావాలను ప్రచారం చేస్తున్నందుకు అరెస్టు అయింది. సావిత్రీ దేవి 1939లో రాసిన ఎ వార్నింగ్ టు ద హిందూ పుస్తకానికి హిందూ ప్రవక్త సావర్కర్ ముందుమాట రాశాడు. ఇటీవల సావిత్రీ దేవి మేనల్లుడు పాత్రికేయుడు సుమంతా బెనర్జీ, 1939 లోనే ‘హిందువులకి ముస్లింల వల్ల ప్రమాదం ఉంది, వారిని సంఘటితంగా ప్రతిఘటించాలి’ అని సావిత్రీ దేవి పిలుపు ఇచ్చినట్లు గుర్తు చేశాడు. ఇటువంటి హిట్లర్ ఆరాధనని కరపాత్ర స్వామి అప్పట్లోనే ప్రతిఘటించాడు. హిట్లర్ జాతీయవాదాన్ని పరమ దుర్మార్గమైనదిగా ప్రమాదకరమైనదిగా కరపాత్ర స్వామి స్పష్టం చేశాడు. హిందూవాదులు హిట్లర్ అనుయాయులు అని పదేపదే చెప్పాడు. ఈ సందర్భంలో కమ్యూనిస్టు సామాజికవేత్త ప్రొఫెసర్ ప్రభాత పట్నాయక్ భారతీయ జాతీయ వాదం ప్రత్యేకత గురించి చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి: ‘యూరోపియన్ జాతీయవాదం ఆ దేశంలో ఒక అంతర్గత శత్రువు మీద ఎక్కుపెడుతుంది. ఉత్తర యూరప్‍లో కేథలిక్‌లను దక్షిణ యూరప్‍లో ప్రొటెస్టెంట్‍లను, అన్ని దేశాలలో యూదులను శత్రువులుగా పరిగణించారు. దానికి పూర్తి భిన్నంగా మూడవ ప్రపంచంలోని జాతీయవాదం తమ దేశ ప్రజలందరినీ ఐక్యపరిచే వైఖరితో ఉంది.’

యూరోపియన్ జాతీయ వాదానికి, అందులోను నాజీయిజానికి అనుకరణ హిందుత్వ. జర్మనీలో ప్రొటెస్టెంట్‍లు, మార్టిన్ లూథర్ వంటివారు కూడా ఆంటీ సెమిటిజం భావాలను వ్యాప్తి చేశారు. అంటే ఆధునిక సంస్కరణ భావాలలోనూ జాతీయవాద సంకుచితత్వం ఉంది. 1857 సిపాయిల తిరుగుబాటు ఆధునిక విద్యావంతుల వల్ల సంభవించలేదు. రైతులు సంప్రదాయవాదుల వల్ల సంభవించింది. హిందూ ముస్లిం ఐక్యత ఈ తిరుగుబాటులో ప్రధానం. ఈ తిరుగుబాటు యొక్క వైఫల్యానికి కారణం ముస్లింలతో స్నేహాన్ని హిందువులు వ్యతిరేకించడమే అంటాడు హిందూవాది గోల్వాల్కర్. ముస్లిం పాలన కన్నా బ్రిటిష్ పాలన మేలు అని హిందువులు భావించారంటాడు. కుల నిర్మూలన వాది జ్యోతిబా ఫూలే శూద్ర అతిశూద్రుల సంక్షేమం దృష్ట్యా తిరుగుబాటు వైఫల్యం మంచికే జరిగింది అన్నాడు. పీష్వాల పాలన కన్నా బ్రిటిష్ పాలన మేలు అన్నాడు. బంకిం చంద్ర చటర్జీ ఆనందమఠం నవలలో ముస్లిం క్రూరత్వం నుంచి రక్షణ కోసం దైవం ఏర్పరిచిన పాలనగా బ్రిటిష్ పాలనని భావించాడు. అంటే ఆధునిక విద్యావంతులైన బ్రాహ్మణులు, శూద్రులు, అతిశూద్రులు అందరూ బ్రిటిష్ వలస పాలనని పురోగమనంగా భావించారు. వీళ్ళందరూ మోనోపలీని సమర్ధించే యూరోపియన్ జాతీయ వాదానికి వారసులు. ‘సంస్కర్తలు అందరూ మధ్యయుగాల భారత చరిత్రను క్షీణయుగంగా పరిగణించారు. ఇది రాజకీయంగా సామాజికంగా రెండు జాతుల సిద్ధాంతాన్ని సృష్టించింది’ అంటాడు చరిత్రకారుడు బిపిన్ చంద్ర. సావర్కర్ గోల్వాల్కర్ లాంటి హిందూ జాతీయవాదులు హిందూ ముస్లిం అనే బైనరీ ఆపోజిట్‍ల ఆధారంగా తమ సిద్ధాంతాన్ని నిర్మించారు. కుల నిర్మూలనవాదులు, సంస్కర్తలు ముస్లిం వ్యతిరేకతను బలపరచడంలో ముందున్నారు.

సతీసహగమనం బాల్యవివాహాలు లాంటి మూఢనమ్మకాలు, ముస్లింల దురాగతాల నుంచి హిందువులను రక్షించడానికి వచ్చిన అప్పటి సంస్కరణలుగానే ఆధునిక సంస్కర్తలు చూశారంటారు సామాజిక వేత్త షేక్ మహబూబ్ బాషా. బంగారు కాలమని బ్రిటిష్ పరిపాలనా కాలాన్ని ఆధునిక విద్యావంతులు కీర్తించారు. బ్రిటిష్ కాలపు శృంగేరి శంకరాచార్య, చంద్రశేఖర భారతీయ స్వామి కూడా బ్రిటిష్‍వాళ్ళు రాసిన చరిత్ర ముస్లిం వ్యతిరేకతను పెంచి పోషించింది అన్నారు. జేమ్స్ మిల్ అనే చరిత్రకారుడు భారత చరిత్రకాలాన్ని హిందూ ముస్లిం బ్రిటిష్ యుగాలుగా విభజించారు. పౌరాణికకాలం యుగవిభజన స్థానంలో చారిత్రకకాలం వచ్చి చేరింది. పౌరాణిక సనాతన స్మృతిలో మానవ ప్రమేయం తక్కువ. కాలం అనంతం, చక్ర భ్రమణం వలే పునరావృతం. జాతి విభజనకు ఆ కాలంలో స్థానం లేదు. అలాగే సనాతన స్మృతి బహుళం, అనేక కథనాలకు ఆస్కారం ఉంది. ఆధునిక పాశ్చాత్య చరిత్రకారులు స్థలకాలాలను స్థిరీకరించాక కాలభావన ప్రతీకారానికి బీజంగా మారింది. కాలానికి జాతీయతా ముద్ర వేయబడింది. కాలం సంకుచితంగా మారింది.

ఏకకాలంలో అనేక కాలాలు ఉంటాయి. వర్తమానంలోనే భూత భవిష్యత్తులు ఉంటాయి. అలాగే ఒకే స్థలంలో భిన్న సంస్కృతులు సహజీవనం చేస్తాయి. ఉమ్మడి సంస్కృతి అనేది ఆధునిక ఉదారవాదులు తెచ్చిన భావజాలం కాదు. దర్గా సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. వాటిలో ఇరుమతాలవారు మొక్కుకుంటారు. విదేశీ స్మృతులు స్వదేశీ స్మృతులుగా మారతాయి. ముస్లిం దేశాలలోని కర్బలా యుద్ధం భిన్న కథనాలతో భారతదేశంలో అనుకరించబడుతుంది. అయితే అసలైన స్వచ్ఛమైన ఇస్లాం మతం కోసం తపన ఆధునిక జాతీయ వాదంతో మొదలైంది. పాకిస్తాన్‍లో కూడా లింగపూజ, శివ భక్తి, గో సేవ లాంటి సంప్రదాయాలు ముస్లిం సమాజంలో కూడా కొనసాగుతూ వచ్చాయి కానీ ఆధునిక ఇస్లామీయ జాతీయవాదం దీన్ని నేరంగా భావిస్తుంది. ఈ విషయాలని భారతీయ రచయిత అఫ్సర్ మహమ్మద్, పాకిస్తాన్ మేధావి హరూన్ ఖలీద్ వివరంగా రాశారు. హిందువులలో ఆర్య సమాజ శుద్ధి ఉద్యమంలో లాగే ముస్లింలలో మొదలైన అస్లీ ఇస్లాం, స్వచ్ఛమైన ఇస్లాం జాతీయ అస్తిత్వం కోసం తపనలు అస్తిత్వాలను ఘనవింపజేశాయి. స్థలకాలాలను స్పష్టంగా వేరుపరిచాయి.

షిరిడి సాయిబాబాకి వ్యతిరేకంగా జరుగుతున్న గోల దీనినే ప్రతిబింబిస్తుంది. హిందుత్వవాదులు దర్గా సంస్కృతిని కూడా వ్యతిరేకిస్తున్నారు. భాషాపరంగా కూడా మోనోపలీ మొదలైంది. బ్రాహ్మణేతర హిందూ సంస్కృతి పట్ల చిన్నచూపు మొదలైంది. సంస్కృత భాషలోని గ్రంథాలకు అనుకరణగా మాత్రమే స్థానిక ప్రజాభాషల గ్రంథాలు పరిగణించబడతాయి. అంబేద్కర్ లాంటి కుల నిర్మూలన వాదులు సంస్కృత గ్రంథాల ఆధారంగానే హిందూ మతాన్ని నిర్వచించారు. బ్రాహ్మణేతర హిందూ సంస్కృతిని పరిశీలించలేదు. కరపాత్ర స్వామి వంటి వారిలో కూడా ఇదే లోపం కనబడుతుంది. వేద ప్రమాణం పేరుతో సంస్కృత ప్రామాణ్యాన్ని స్థాపించారు ఆయన. అందుకే కరపాత్ర స్వామి, విశ్వనాథ వంటి వారిని ఆధునిక సనాతనులు అని పిలవచ్చు అంటారు సామాజికవేత్త హారతి వాగీశన్. అంటే ఆధునికులలోని చరిత్ర, లేఖన, ముద్రణపై ఆధారపడ్డ పరిమితులు వారిలోనూ ప్రవేశించాయి.

ఆర్య సమాజ్ దయానంద సరస్వతి వేదాన్ని ఒకే ఒక మత గ్రంథంగా స్థిరీకరించడానికి ప్రయత్నించారు. వేద పురాణ ఇతిహాసాలు అన్నీ ప్రమాణమే అన్న కరపాత్ర స్వామి శూద్ర అతిశూద్ర దళిత కులపురాణాలను పరిగణనలోకి తీసుకోలేదు. సంస్కృత పురాణ ఇతిహాసాలనే ప్రమాణంగా తీసుకోవాలన్నాడు. ఇది భాష అధిపత్యానికి మోనోపలీకి దారి తీస్తుంది. అంతిమంగా ఇది ఆధునిక హిందూ జాతీయ వాదానికే ఉపకరిస్తుంది. కుల సంస్కృతులని కూడా బలహీన పరుస్తుంది. కుల నిర్మూలన వాదులు సంస్కర్తలు కుల వ్యవస్థపై మాత్రమే విరుచుకుపడుతూ జాతీయ వాదం తెచ్చే ముప్పు పసిగట్టలేకపోయారు. హిందూ జాతీయవాద విస్తరణకి ఉపకరించారు. స్థలకాలాల స్థిరీకరణ అనేది కథనాలకు ప్రాధాన్యం తగ్గించి, నిర్మాణాలకి ప్రాముఖ్యత ఇచ్చింది. రామదాసు కీర్తనల ద్వారా తులసీదాసు పద్యాల ద్వారా కబీర్ దోహాల ద్వారా ప్రసిద్ధికెక్కిన రాముడికి ఒక స్థిరీకరించబడిన స్థలకాలాలు లేవు. కానీ అయోధ్య రాముడు ఆధునిక చరిత్ర భావం తెచ్చిన నిర్మాణం. అందుకే సాహిత్యం సంగీతం సంస్కృతి కన్నా ఖరీదైన నిర్మాణం ప్రధానంగా మారింది. ఇటువంటి జాతీయవాదంతో కూడిన చారిత్రక దృష్టినే అందరూ అనుకరిస్తున్నారు. హిందూ దేవాలయాలు అన్ని బౌద్ధ ఆలయాలే అని వాదిస్తున్నారు నవబౌద్ధులు. వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారి వివాహం లాంటి కథనానికి ఈ నవబౌద్ధం గొడ్డలి పెట్టు.

పురాణకథనాలు స్థలకాలాలను అధిగమిస్తాయి. ఒక కాలాతీత సమైక్యతను సాధ్యం చేస్తాయి. ఆధునిక చరిత్ర భావన కథనాలని కాలపరిమితుల్లోకి కుప్పకూలుస్తుంది. వినాయకుడికి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఏనుగు ముఖం అతికించారనే హిందూ వాదుల కథనం పురాణ కథల ప్రాశస్త్యాన్నీ తగ్గించి వేసింది. ఆధునిక టెక్నాలజీ ముందు మహిమనీ ఊహాశక్తినీ కించపరిచింది. ఈ పరిస్థితికి మూలం ఆర్య సమాజ దయానంద సరస్వతి. ఆయనే ఆర్యుల భూమి, ఒకే ఆర్య జాతి, ఒకే గ్రంధం, వేదాలు లాంటి భావాలను వ్యాప్తి చేశాడు. పురాణ కథనాలని ఊహలని తీవ్రంగా నిరసించాడు. ఒక క్రమబద్ధమైన ఆధునిక హేతుబద్ధమైన మతాన్ని ప్రవచించాడు.

చరిత్ర భావనలో ఘర్షణ, యుద్ధం, విజయం చెందడం ప్రధానం. గతంపై వర్తమానం, ప్రకృతిపై మనిషి, ఆదిమ జాతులపై నాగరికుల విజయం. అలాగే, యూరోపియన్లు తృతీయ ప్రపంచదేశాలపై విజయం చెందడం. గ్రామంపై నగరం, అందరు భారతీయులపై హిందూ జాతీయుల విజయం… ఇలా ఒకరిపై మరొకరి ఘర్షణనీ విజయాన్నీ ప్రధానం చేస్తుంది చరిత్ర. దానికి భిన్నంగా స్మృతి రూపంలోని పురాణ కథనాలలో వివిధ స్థలకాలాల, ప్రకృతి మానవుల మధ్య సామరస్యం సాధ్యం అవుతుంది. స్మృతి సామరస్యాన్ని సూచిస్తే చరిత్ర నిరంతర ఘర్షణని సూచిస్తుంది. అందుకే స్మృతి బహుళంగా బహుళ కథనాలతో ఉంటుంది. చరిత్ర ఏకీకృతంగా ఘనీభవిస్తుంది. స్మృతి బహుళ అస్తిత్వాలనీ అస్తిత్వాల సంగమాన్నీ సుగమం చేస్తుంది. చరిత్ర ఐడెంటిటీల్ని స్పష్టమైన స్థలకాలాలలో ఘనీభవింపజేస్తుంది. స్మృతి (పురాణం) స్థానాన్ని చరిత్ర దృష్టి ఆక్రమించింది. స్థలకాలాతీతమైన పురాణ పాత్రలు చారిత్రకతగా దిగజార్చబడ్డాయి. దాని ఫలితమే హిందుత్వం.


  1. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఔర్ హిందూ ధర్మ – కర పాత్ర స్వామి. వేదశాస్త్రాను సంధాన కేంద్ర, వారణాశి, 2013.
  2. పాంచజన్యం (బంచ్ ఆఫ్ థాట్స్ కు అనువాదం) – గురూజీ గోల్వాల్కర్. జాగృతి ప్రచురణ, విజయవాడ, 1974.
  3. హిందుత్వం – సావర్కర్. స్వాతంత్ర్య వీర సావర్కర్ సాహిత్య సమితి, హైదరాబాద్, 1983.
  4. Search of Shiva: a study of folk religious practices in Pakistan – Khalid, Haroon. Rupa publications. New Delhi, 2015.
  5. The Festival of Pirs: Popular Islam and Shared Devotion in South India Book – Afsar Mohammad. Oxford University Press, 2013.
  6. What China and India Once Were: The Pasts That May Shape the Global Future – Benjamin A. Elman and Sheldon Pollock. New York: Columbia University Press, 2018.
  7. Long History, Deep Time Deepening Histories of Place – Ed: Ann McGrath, Mary Anne Jebb. ANU press, 2015
  8. IN LIGHT OF INDIA – Octavio Paz. Translated from the Spanish by Eliot Weinberger New York: A Harvest Book, Harcourt Brace & Company, 1995.
  9. Women Intellectuals and Communal Consciousness in Colonial Andhra – Shaik Mahaboob Basha. Social Scientist (Volume 52), Numbers 01-02 (Jan-Feb) 2024.
  10. Hitler once worshiped as Vishnu in elite Kolkata homes: Historian IANS.
  11. Hitler’s Priestess: Savitri Devi, the Hindu-Aryan Myth, and Neo-Nazism – NICHOLAS GOODRICK-CLARKE. NYU Press, 1998.
  12. ఆధునిక భారత చరిత్ర – బిపిన్ చంద్ర. హెచ్.బి.టి., 1983.
  13. భారతీయులకు హెచ్చరిక – సావిత్రీదేవి (అనువాదం పాణ్యం దత్త శర్మ). సంచిక వెబ్ పత్రిక 14-8-2022.
  14. Living Mantra: Mantra, Deity, and Visionary Experience Today -Mani Rao. Palgrave Macmillan, 2018.

రాణి శివశంకర శర్మ

రచయిత రాణి శివశంకర శర్మ గురించి: రాణి శివశంకరశర్మ 'ది లాస్ట్ బ్రాహ్మిణ్' ద్వారా తెలుగు సాహిత్య రంగంలో సంచలనం సృష్టించిన రచయిత. ఆధునిక నాగరికత, సమాజం, రాజకీయాలను భారతీయ తాత్విక దృక్కోణంతో సునిశితంగా విశ్లేషించిన ‘ది లాస్ట్ బ్రాహ్మిణ్' ఇంగ్లీషు, కన్నడ, సంస్కృతాది పలు భాషల్లోకి అనువాదమై దేశవిదేశాల్లో ఆదరణకు నోచుకుంది. 'ది లాస్ట్ బ్రాహ్మిణ్' వెలువడ్డ ఆరేళ్ల అనంతరం దానికి కొనసాగింపుగా వచ్చిన 'గ్రహాంతరవాసి' నవల ప్రచురితమైంది. రాజకీయాలు, మతం, తత్వశాస్త్రం, సాహిత్యాల గురించి మౌలికప్రశ్నలను రేకెత్తించిన 'గ్రహాంతరవాసి' కూడా ఇప్పటికే ఇంగ్లీషులోకి అనువాదమైంది. వారి మరో రచన 'అమెరికనిజం' ఆ మధ్య కన్నడంలో విడుదలై ప్రశంసలు అందుకుంది. ఆయన కథల తొలిసంపుటి ‘రోబోబుద్ధ'గా, మలిసంపుటి 'పూజారి 2040'గా ప్రచురితమయ్యాయి. ఈయన రచించిన నృత్యరూపకాలు 'హిందుత్వ', 'ధర్మోరక్షతి రక్షితః'ను కూచిపూడి కళాకారిణి స్వాతి సోమనాథ్ ప్రదర్శించడమే కాక సీడీలుగా తీసుకొచ్చారు. కాళిదాసు నాటకాన్ని నవలగా మలచిన రచన 'శకుంతల' అందరి మన్ననలు పొందింది. ...