మనం రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాం
ఎప్పుడో ఒక క్షణంలో మాత్రం చందన పుష్పాల్లా
మాటలు మన మధ్య కొత్తగా గుబాళిస్తాయి.
పరస్పరం పారదర్శకమైన హృదయాల్లోంచి
మెత్తని స్నేహం తేనె చినుకులై చిందుతుంది.
ఆకాశం, నక్షత్రాలు, చెట్లు, కొండలు అన్నీ
ఒక్కసారిగా వెలిగి, మూసిన ఆల్చిప్ప రెప్పల్లాంటి
అందమైన క్షణాల్లోకి నిశ్శబ్దంగా ఒదుగుతాయి.
గారడీ లాంటి క్షణాలన్నీ వెన్నెల బిందువుల్లా జారిపోగానే
గ్రామఫోన్ రికార్డ్ పై సన్నని ముల్లు తిరిగినట్లు
మనం కూడా తిరుగుతూ ఉంటాం
మన మన వలయాల్లో చిక్కుకుని.
మళ్ళీ మంత్రధూళి రాలే వరకూ అంతే.