ఒక్కొక్కప్పుడు ఆలోచనలన్నీ
తామరాకుపై నీటిబొట్లై
అస్థిరంగా జారిపోతాయి.
ఉద్వేగాలు,ఉత్సాహాలు,
వేదనల తాకిడికి
కొంచమైనా కదలకుండా
సుప్తమై మిగిలిపోతుంది చైతన్యం,
నిద్రిస్తున్న నాగినిలా.
అరంగేట్రానికి ముందు
గురువాజ్ఞకై కైమోడ్చి
కదలని భంగిమై నిలచిన నాట్యకత్తెలా
నా కవిత్వం సహనంతో వేచివుంటుంది,
తనను తాను ఆవిష్కరించుకునే
ఓ అద్భుతమైన క్షణం కోసం.
ఆల్చిప్పలో ముకుళించిన ముత్యమై,
పూమొగ్గలో దాగిన పరాగమై,
తొలిపొద్దు స్పర్శకు ఎదురు చూసే ఆకాశమై .