నడిరేయి

సడి చేయదు
చీకటి అలలపై
నిదురపోని ఒంటరి గాలి
కల కదలదు

ఎక్కడివో ఒంటరి వీధిలో
ఆలోచనలు
వెలిగీ వెలగని జ్ఞాపకాల కింద
రొద చేస్తూ
సగం మెలకువ సగం మత్తు
లేచి చెదరగొట్టలేను
భరించనూలేను

చేజారిన ఇసుక రేణువులను వెతికి తీస్తున్న కల
నా నీడనే తవ్వి తీస్తున్నప్పుడు
ఎవరిదో నవ్వు
కల మారదు

చూరునుంచి జారుతూ
మందకొడిగా వాన
కురవదు నిలవదు
నానిన గడ్డి వాసన
ఎవరిదో పిలుపు
పలకలేని మొద్దుతనం

కొబ్బరిచెట్టు మొదలులో చేరిన
నిన్నటి మిడతల కీచురాగం
నిద్ర రాదు
కల సాగదు

కిటికీలోంచి గోడ మీద
వేటకు కాచుకున్న పిల్లి కళ్ళలో మెరుపు
పక్క దారి వెతికే ప్రయత్నంలో మనసు
ఏ నిదుర లేని ప్రపంచంలోకి?

అల కదలదు
పడవ సాగదు
పక్కనే కూచున్న మనిషి ఎవరో
ఉలుకూ పలుకూ లేకుండా
బండల మీద జారుతున్నట్లు భయం

మనసు మత్తు పూత
నిద్ర రాదు
మెలకువ లేదు
నల్లని శూన్యంలో ఓ మెదడు
లోలకమై ఊగుతూ
పరిహసిస్తూ

ఎక్కడో జ్ఞానోదయపు కోడి కూత
ఒక కలవరపు మెలకువ
ఇప్పుడంత దాని అవసరమేముందని?

విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ...